Saturday, December 6, 2025

యోజనానాం సహస్రే ... నుండి ... స్వభావో నోపదేశేవా - వరకు. మేలిమిబంగారం మన సంస్కృతి.(552 - 724వ శ్లోకము)

 

552. శ్లో. యోజనానాం సహస్రే ద్వై ద్వైశతే ద్వై యోజనే
ఏకేన నిమిషార్థేన క్రమమాణ నమోస్తుతే. (సాయణా చార్యులు)
.వె. అర్థ నిమిషమందు నల రెండు వేలును
రెండు వందలు మరి రెండు యోజ
నములు గమన వేగ మమరిన రవి తేజ!
భవ్య వేగ! నీకు వందనములు. 
భావము.  అర్థ నిమేషమునందు 2202 యోజనముల మార్గమును ప్రయాణించు ప్రకాశమా నీకు నమస్కారము.
1 యోజన – 9 మైళ్ళ 160 గజాలు అనగా 9.11 మైళ్ళు
1 పగలు రాత్రి – 8,20,000 అర్థనిమిషములు 
 అనగా ఒక సెకనుకు – 9.41 అర్థనిమిషములు
  విధముగా మనము లెక్ఖించినచో ప్రతి అర్థనిముషానికి 2202 x 9.11 = 20,060.22 మైళ్ళు 
 అటులనే ప్రతి సెకనుకు 20,060 x 9.41 = 1,88,766.67 మైళ్ళు .
 1889 లో కాంతివేగాన్ని ప్రతి సెకనుకు1,87,327.5 మైళ్ళుగా మైకెన్సన్ ప్రకటించాడు. 
 సాయనాచార్యుల గణనకు   ఇది సుమారుగా సరిపోతుంది.

శ్లోయో ధర్మశీలోజితమాన రోషో  -  విద్యావినీతో  పరోపతాపీ                                               

స్వదార తుష్టఃపరదార వర్జీ   -  తస్య లోకే భయమస్తి కించన.  

తే.గీ.  ధర్మశీలుడు దుర్మానధన విహీన

రోష దూరుడువినయ విద్యా సరసుఁడు,

పరుల చెరుపకతన సతిన్ వలచిపరుల

కాంతలను కోరని ఘనుడు కాంచు సుఖము.                                  

భావముఎవడు ధర్మశీలుడోఎవడు దురభిమానాన్నీరోషాన్నీ జయిస్తాడోఎవడు విద్యా వినయాలు కలిగి ఉంటాడోఎవడు పరులకు బాధ కలిగించడోఎవడు తన భార్యయందు సంతుష్టుడై పరభార్యా కాంక్ష వదలివేస్తాడో వానికి లోకంలో ఏమాత్రమూ భయం ఉండదు.

శ్లో. యో உ ధికాద్యోజన శతాత్పశ్యతీ హామిషం ఖగః
ఏవ ప్రాప్తకాలస్తు పాశబంధం నపశ్యతి. 
తే.గీ.  ఎంత దవ్వునుండైనను సాంతముఁ గను 
మాంస ఖండంబులను పక్షి మహితముగను. 
అట్టి పక్షియే తన్ బట్ట పెట్టినట్టి 
వలను కానగ లేదు! తా  తొలగ లేదు.
భావము. పక్షి నూరు యోజనముల దూరమునుంచి యైనను మాంస ఖండమును చూడగలదో , పక్షియే కాలం మూడినపుడు తనను పట్టటానికి పన్నిన వలను చూడజాలదు. 

శ్లో. యోஉన్య ముఖే పరివాదః , ప్రియ ముఖే పరిహాసః
ఇతరేంధనజో ధూమః , సోஉగరు జాతో భవేద్దూపః.
. ఇతరులు పల్కిన దూషణ,
యతులితమగు హాస్య మదియె ఆప్తులు పలుకన్. 
క్షితి పొగయగు కట్టెల పొగ
యతులిత ధూపమగు చందనాదుల పొలియన్.
భావము. ఇతరుల నోటినుంచి వస్తే దూషణం అనిపిస్తుంది. అదే మాట తనకు ఇష్టమైన వాని నోటినుంచి వస్తే , హాస్యం అనిపిస్తుంది. ఇతరములైన కట్టెల నుండి వచ్చినది ధూమమౌతుంది. చందనపు చెక్కనుంచి వస్తే ధూపమౌతుంది! 

శ్లో.  యో యమర్థం ప్రార్థయతే  -  తదర్థం చేహతే క్రమాత్ |

అవశ్యం తమాప్పోతి  -  చేదర్ధాన్నివర్తతే ||  (యోగవాసిష్ఠం  2 - 4 - 12)

తే.గీ. కోరునది పొంద కృషీచేసుకొను నెవండు

వాఁడు మధ్యలో తన కృషి వదలకున్న

పొందు నద్దానిఁ దప్పక, బిధవరేణ్య!

మంచి పొందఁగ కృషి చేయు మాన్యులెపుడు.       

భావము.  ఎవడు ప్రయోజనాన్ని కోరుతున్నాడో, దాని కోసం అతడు అర్ధాంతరంగా వదిలిపెట్టకుండా నిరంతరం కృషి చేస్తే, చివరికి దానిని తప్పకుండా సాధిస్తాడు.

శ్లో. యౌవనం జీవనం చిత్తం ఛాయా లక్ష్మీశ్చ స్వామితా
చంచలాని షడేతాని జ్ఞాత్వా ధర్మరతో భవేత్. 

తే.గీ.  యౌవనము, నీడ, మనసును, జీవితమును,

సంపద, ప్రభుత యనునారు చంచలమను

నిజము నెఱుగుచు సద్వర్తి నియతినెపుడు

ధర్మ మార్గము విడఁ బోడు, ధన్యుఁడతఁడు.

భావము. యౌవనము, జీవితము, మనస్సు, నీడ, సంపదలు, ప్రభుత్వము అను ఆరును చంచలమైనవని గ్రహించి మానవుడు ధర్మమునందు ఆసక్తుడు కావాలి. 

శ్లో.  యౌవనం, ధన సంపత్తిః  -  ప్రభుత్వ మవివేకితా,
ఏకైకమప్యనర్థాయ  -  కిము యత్ర చతుష్టయం.
.వె.  యౌవనంబు, ధనము, నద్భుత ప్రభుతయు,
దురవివేకితయును, దురిత గతిని
దేనికదియె గొలుపు. తీరుగా నాల్గునూ
కలిగి యుంటి మేని తెలుప తరమె?
భావము.  యౌవన ప్రాయము, ధన సంపత్తి, అధికార ప్రాప్తి, వివేక శూన్యత, వీటిలో ఒక్కొక్కటుంటేనే ఎన్నో అనార్థాలు కలుగుతాయి. మరి నాలుగూ ఒకే చోట వున్నచో యిక యేమి జరుగునో వేరే చెప్ప వలసినదేముంది?

శ్లో. రజనికరః ఖలు శీతో  -  రజనికరాచ్ఛన్దనో మహాశీతః
రజనికరచ్చన్దనాభ్యాం  -  సజ్జనవచనాని శీతాని.
కం.  వెన్నెల చల్లగ నుండును.
వెన్నెలకన్నమలయజము విన చల్లనిదౌన్.
మన్నిక గలిగిన సుజనుల
మిన్నగు వాగ్ఝరి చలువయె మిన్న కనంగన్.
భావము. వెన్నెల చల్లగా నుఇండును, మంచిగంధము వెన్నెలకన్నను చల్లగ నుండును. మహనీయుల మాటలు వెన్నెలకన్నను, మంచిగంధము కన్నను కూడా చల్లగా ఉందును కదా! 

శ్లో.   రథస్యైకం చక్రం భుజగయమితాః సప్తతురగాః
నిరాలంబో మార్గశ్చరణవికలో సారథిరపి 
రవిర్యాత్యంతం ప్రతిదినమపారస్య నభసః
క్రియాసిద్ధిః సత్త్వే భవతి మహతాం నోపకరణే. 
తే.గీ.  చక్ర మొక్కటే. పూన్చును సర్పమునను.
తురగసప్తకంబాధారమరయ లేదు. 
సారధియనూరుఁ డా కర్మసాక్షికైన 
లోకహితుడయ్యె. పనిముట్లు లేకయ్తున్న.
భావము. రథానికి ఉన్నది ఒకే చక్రం, పాములతో పూన్చబడిన ఏడు గుఱ్ఱాలు, మార్గమాఆధారం లేనిది, సారథియాపాదములు లేనివాడు ,అయినప్పటికీ సూర్యుడు ప్రతిదినమూ అనంతమైన ఆకాశంలో ప్రయాణం చేస్తున్నాడు. మహాత్ములకు కార్యసిద్ధి వారి బలము వల్లనే చేకూరుతుందిగానీ ఉపకరణముల (పనిముట్ల) వల్ల కాదు. 

శ్లో. రాజ దేశ కుల జ్ఞాతి   -  స్వధర్మాన్ నైవ దూషయేత్।

శక్తోఽపి లౌకికాచారం   -  మనసాపి లఙ్ఘయేత్॥

తే.గీ.  తనదు రాజును, దేశమున్, తన కులమును,

తనదు జ్ఞాతులన్, ధర్మమున్, తానె చేయఁ

దగదు దూషణమెప్పుడున్, తగియు తాను

లౌకికాచార వర్జనమసలు తగదు.

భావము.   తన రాజును, దేశమును, కులమును, బంధువులను, ధర్మమును ఎన్నడూ దూషించకూడదు. నీకు శక్తి ఉన్నప్పటికీ నీ సంఘముయొక్క ఆచారవ్యవహారాది మర్యాదలను మనసా అయిననూ ఉల్లంఘించవద్దు.

శ్లో.  రాజా రాక్షసశ్చైవ శార్దూలాః తత్ర మంత్రిణః.

గృద్రాశ్చ సేవకాః సర్వే యథా రాజా తథా ప్రజా.

తే.గీ.  రాజు రాక్షసుండైనచో రాజ్యమందు

మంత్రులందరు పులులట్లు మసలు నిజము.

సేవకులు గ్రద్దలటులుండు. చిత్రమదియె.

రాజ్యమందలి ప్రజలుండు రాజులటులె.

భావము.  ప్రజా రంజకముగా పరిపాలన చేయ వలసిన రాజే రాక్షసుడిలా ప్రవర్తిస్తే అతని వద్ద నున్న మంత్రులు ప్రజల పాలిట పెద్ద పులులగుదురు. సేవకులు గ్రద్దలై ప్రజలను పీకుకు తిందురు. రాజ్యమునేలే రాజు ఎలా ఉంటే రాజ్యమునందలి ప్రజలు కూడా అదే విధంగా ఉంటారు సుమా!

శ్లో. రాజా రాష్ట్ర కృతం పాపం!  -  రాజపాపం పురోహితః!
భర్తా స్త్రీకృతం పాపం!   -  శిష్యపాపం గురుర్వ్రజేత్!! (భోజచరితమ్)
తే.గీ. ప్రజల పాపంబులవియెల్ల ప్రభువుఁ జేరు.
నృపుని పాపమరయ పురోహితుని జేరు
భార్య చేసిన పాపముల్ భర్తఁ జేరు.
శిష్యపాపంబు గురువునే చేరునయ్య.

తే.గీ.  ప్రజల పాపంబు రాజుకు ప్రాప్తమగును.
రాజు పాపంబు గురువుకు ప్రాప్తమగును.
స్త్రీల పాపంబు భర్తలఁ జేరుచుండు
శిష్య పాపంబు గురువులఁ జేరు నిజము.
భావము.  రాష్ట్రములోని ప్రజలు చేయు పాపములు రాజును పొందును; రాజు గావించు పాపములు పురోహితుడును, స్త్రీలు చేయు పాపములను భర్తలును పొందుదురు,శిష్యుల పాపములు గురువునకు సంక్రమించును. అనగా రాజు,పురోహితుడు,భర్త,గురువు,-వీరు ప్రజలు,రాజు,భార్య,శిష్యులు మంచిమార్గమున నడచుకొనునట్లు చూడవలసిన బాధ్యత గలవారని భావము.

శ్లో.  రాజా వేశ్యా యమశ్చాగ్నిః - చోరాః బాలక యాచకః 

పరదుఃఖం సజానంతి - అష్టమో గ్రామ కంటకాః!  (చాణక్య నీతి)  

తే.గీ.  రాజు, వేశ్య, యముండగ్ని, గ్రామకరణ,

ము కన, పిల్లలున్, యాచకుల్, పురిని చోరు

లునెడి యెనిమిదిమందియు కనరు పరుల

బాధలను, దైవ ప్రార్థనన్ బాధలుడుగు

భావము.

"రాజు, వేశ్య, యముడు, అగ్ని, దొంగ, బాలకులు, యాచకులు, గ్రామకరణము, 

ఎనిమిది మందికి ఇతరులు పరిస్థితులలో ఉన్నారనే ఆలోచన ఉండదు.. 

ఎదుటివారి బాధ అర్థము చేసుకో లేరు.

శ్లో. రాజ్ఞి ధర్మిణి ధర్మిష్టా పాపే పాప నరాః సదా
రాజానమనువర్తన్తే యధారాజా తధా ప్రజాః
తే.గీ.  ప్రభువు మంచిగ నొప్పిన ప్రజలునటులె,

ప్రభువు చెడ్డవాఁడైనచో ప్రజలునటులె.

ప్రభువు యెటులుండు నటులనే ప్రజలునుంద్రు.

ప్రభువు మంచిగ వర్తించి వరల వలయు.                                                   

భావము. ప్రజలు ఎల్లప్పుడూపాలకుని మనస్సునే అనుసరింతురు.  రాజు ధర్మవంతుడైనచో ప్రజలు ధర్మ ప్రవర్తకులై యుందురు. రాజు పాప ప్రవర్తకుఁడైనచో ప్రజలు కూడా పాప ప్రవర్తకులుగనే యుందురు రాజెటు లుండునో ప్రజలూ అటులనే యుందురు

శ్లో.  రామం విశ్వమయం వందే -  బ్రహ్మ విష్ణు శివాత్మకమ్

శాంతం సనాతనం సత్యం -  చిదానంద పరాత్పరమ్.

.వె.  శాంత సత్య సనాతన సచ్చిదాత్మ;

సంతతానందమయుఁడును; సకల మగు

రాత్పరుఁడు జగన్మయుఁడును; బ్రహ్మ విష్ణు

శంకరుండగు శ్రీరాము సన్నుతింతు.

భావము.  శాంత స్వరూపునికి; సనాతనునికి; సత్యమైనవానికి; చిదానంద మూర్తియైన పరాత్పరునకు; బ్రహ్మ-విష్ణు మహేశ్వరులను త్రిమూర్తి స్వరూపునికి; విశ్వమంతటా వ్యాపించిన వానికి; రామునకు-నమస్కరింతును.

శ్లో. రామ స్కంధం, హనూమంతం,   -  వైనతేయం, వృకోదరం, 

శయనేతు స్త్మృతే నిత్యం   -  దుస్వప్నం తస్య నశ్యతి.
.   రాముని, స్కంధుని, హనుమను,
శ్రీమద్ఘన వైనతేయ శ్రేయస్కరునిన్,
ప్రేమను భీముని తలచిన
క్షేమము దుస్స్వప్నబాధ చేరదు నిద్రన్.

భావము. రాముని, స్కంధుని, హనుమంతుని, గరుడుని, భీముని, నిద్రించే వేళ తలుచుకొంటే దుస్వప్నాలు కలుగవు 

శ్లో. రాశబ్దోచ్చారణే జాతే వక్ర్తాత్పాపం విగచ్ఛతి / 

మకార శ్రవణే జాతే భస్మీభావం గమిష్యతి // (ఉమాసంహిత)

కం.  రాయని పలికిన పాపము 

మాయంబగు పుణ్యమబ్బు, మహిమాన్వితమౌ

మాయని పలికిన యంతనె

ఖాయంబుగ మరలి రావు కలుషములు సుధీ!

తే.గీ.  *రా* యనినయంతఁ బాపముల్ వ్రయ్యలగును,

** యని పలికిన భస్మమై మరలి రావు,

రామ రామా యనుచుపల్కు రమ్యముగను,

రామ నామమె ధీశక్తి ప్రబలఁ గొలుపు.

భావము.  *రా* అను శబ్దం ఉచ్చరించగానే పాపం వదనమునుండి బయటపడును. పిదప ** కారము వినుటతోడనే భస్మమైపోవును.

శ్లో.  రూప యౌవన సంపన్నాఃవిశుద్ధ కుల సంభవాః

విద్యా హీనా శోభంతే నిర్గంధా ఇవ కిమ్శుకాః.

తే.గీ. రూప యౌవన సంపదల్ రూఢిఁ గలిగి,

శుద్ధ కులజులైయుండియు శోభిలరుగ 

విద్యలేనట్టి వారలు విశ్వమందు

పరిమళము లేని కింశుక వరల నట్లు!

తే.గీ.   రూప యౌవన సంపదల్ ప్రబలియుండి
ఉత్తమోత్తమ జన్ముడై  యుండ వచ్చు
చదువు లేకున్న వెలుగడు సభలలోన
వాసన విహీన కింశుక వరలనట్లు.

భావము.  రూప యౌవన సంపన్నులైనవారైనను, ఉత్తమ కులములో పుట్టినవారైనను విద్యావిహీనులైనట్లైతే సువాసన లేని మోదుగు పువ్వువలె శొభించరు

శ్లో. రేఖాః ప్రాగాయతాః  పంచ రేఖాః  పంచోదగాయ తాః 

రేఖే ద్వే కోణతాః కోణే  తిర్యగ్రేఖా చతుష్టయమ్

పశ్చిమే కలశాకారం పురతో గజ కుంభవత్ 

పదాత్ పార్శ్వ గతో యేన  యిదం స్వస్తిక లక్షణమ్ II

శ్లోకము పూజా సమయంలో స్వస్తిక్ గుర్తు, దానికి తూర్పున ఏనుగు కుంభస్థలాకారము, పశ్చిమమున కలశాకారము వచ్చునట్లు రేఖలు వేయుటను గూర్చి వ్చివరించునది. 

ప్రతిపదార్థము.

ఆయతాః = పెద్దవైన, పంచ రేఖాః = ఐదు గీతాలు, ప్రాక్ = తూర్పునకు;ఆయతాః = పెద్దవైన, పంచ రేఖాః = ఐదు గీతాలు, ఉదక్ = ఉత్తరమునకు (మధ్యలో కలియునట్లు వేయవలెను).

రేఖే = గీతలలో, ద్వే కోణే = రెండు మూలలయందు ( తూర్పు రెండు మూలలు, ఉత్తరము రెండు మూలలు ప్రత్యేకముగా రేఖలు అని అర్థము స్వీకరించవలెను), చతుష్టయం = నాలుగు దిక్కులు కలియునట్లు రెండు గీతలు (కలియునట్లు వేయవలెను).  పదాత్  = మార్గముల నుండి, పార్శ్వగతః = ప్రక్కలకు వెళ్ళునట్లుగా, తిర్యక్ = అడ్డముగా, రేఖాః = గీతలు ( వేయవలెను). యేన = ప్రకారముగా గీయటచే, ( ఏర్పడు ఆకారము), స్వస్తిక లక్షణమ్ = స్వస్తిక అను (గుర్తు) బంధము ఏర్పడుటకు లక్షణము. ( స్వస్తిక గుర్తునకు) పురతః = ముందు భాగములో ఏనుగు కుంభస్థలము వలె, పశ్చిమే = పడమర వైపునకు, కలశాకారం = కలశము ఆకారములో, రేఖాః = గీతలు, ( వేయవలెను). 

శ్లోకానికి చక్కని వివరణను అవధానిశేఖరులు డా.మాడుగుల అనిల్కుమార్ అందఁజేశారు.

వారికి

చం.  అగణితమైన స్వస్తికకు నార్యులు చెప్పిన శ్లోక భావమున్

జగమున కెల్ల తెల్లమగు చక్కని రీతిని తెల్పినారలో

సుగుణ వరేణ్య! సంస్కృత సుశోభిత మాడ్గుల వంశ చంద్రమా!

నిగమసువేద్యుఁడెల్లెడల నిత్యము మిమ్ములఁ గాచుఁగావుతన్.

అని నా ధన్యవాదాలు తెలియఁజేయుచున్నాను.

శ్లో.  రోగ, శోక, పరీతాప,   -  బంధన, వ్యసనానిచ,

ఆత్మాపరధ వృక్షాణాం   -  ఫలాన్యేతాని దేహినాం.

కం.  మనిషికి రోగము, శోకము,

ఘన బంధన, వ్యసనము లివి కలుగుట, తన చే

సిన కర్మ విష ఫలంబులు.

మనమునఁ గని చేయకుంట మంచిది మనకున్.

భావము.  మనుజులకు రోగము, దుఃఖము, పరితాపము, బంధనము, వ్యసనము మొదలైనవి తాము గావించు తప్పు పను లనెడి విష వృక్షము యొక్క ఫలములే సుమా.

శ్లో.  లాలనాత్ బహవో దోషాః  -  తాడనాత్ బహవో గుణాః.
తస్మాత్ పుత్రంచ శిష్యంచ  -  తాడయేత్ నతు లాలయేత్.
తే.గీ.  గారమును చేయ పెరుగును నేర వృత్తి.
తాడనముచేత పెరుగును ధర్మ వృత్తి.
కాన పుత్రుల, శిష్యులఁ ఘనులఁ జేయ
తాడనము చేత మలచుడు.ధన్యులగుడు.
భావము.   పిల్లలను లాలించుట వలన అనేక దోషములు కలుగును. దండించుట వలన అనేక గుణములు కలుగును. కావున పిల్లలను శిక్షించ వలెనే కాని లాలించరాదు.

శ్లో.  లభ్యతే ఖలు పాపీయాన్ నరో సుప్రియ వాగిహ
అప్రియస్య పథ్యస్య వక్తా శ్రోతాచ దుర్లభఃll
తే.గీ.   తీపి మాటలు చెప్పుచు పాపులిలను
మోసగింతురు. కనుఁ డది మోస మనుచు.
కఠిన సత్యము పలుకఁగ, కరుణ వినగ;
కలుగు వారలు తక్కువ కలరు భువిని. 
భావము.   తీయని మాటలచే మోసపుచ్చు పాపులు లోకంలో సర్వత్రా ఉన్నారు. కాని కటువైనను పథ్యముగా ఉండే మాటలు చెప్పు వారు, విను వారు  కూడా లోకంలో అరుదుగానే ఉంటారు కదా!

 శ్లో. లుబ్ధమర్థేన గృహ్ణీయాత్ - స్తబ్ధమంజలి కర్మణా

మూర్ఖం ఛన్దోఽను వృత్తేన - యథార్థత్వేన పండితమ్ 11

తే.గీ.  లోభియగువాఁడు ధనముచే లొంగు మనకు,

ఘన నతులు నహంకారియున్ గరిగి లొంగు,

మూర్ఖుఁడడిగిన పని చేయ పొంగి లొంగు,

సత్యవాక్కులంలొంగును సద్గుణుండు.

భావము. ధనమునందాసక్తిగల లోభిని ధనముద్వారా, అహంకారిని నమస్కారము ద్వారా, మూర్ఖుని ఆతని కోరిక ననుసరించి పనిచేసియు, బుద్ధిమంతుడైన వానిని సత్యవచనముల ద్వారా వశపఱచుకొనవలెను.

శ్లో. లోభమూలాని పాపాని , రసమూలాశ్చ వ్యాధయః

ఇష్టమూలాని శోకాని , త్రీణి త్యక్త్వా సుఖీభవ 

తే.గీ. పాప మూలంబు లోభంబు, వలదు, విడుము.

రసన వాంఛనె వ్యాధులరయగ విడువు

మిష్ట మూలంబు శోకం బదేల? విడుము.

మూడిటిని వీడి సుఖములు పొందుమయ్య.

భావము. పాపాలకు లోభము, వ్యాధులకు రసప్రీతి (జిహ్వా చాపల్యం),శోకాలకు ఇష్టవస్తువులు మూలాలు. మూడింటిని వదలిపెట్టి సుఖివై జీవించు.

శ్లో. లోభాత్క్రోధః ప్రభవతి క్రోధాద్ద్రోహః ప్రవర్తతే
ద్రోహేణ నరకం యాతి శాస్త్రజ్ఞోஉపి విచక్షణః. 
కం. కోపముఁ గొలుపును లోభము. 
కోపంబది ద్రోహ చింతఁ గొలుపును తలపన్.
ప్రాపించునరక యాతన 
దీపించెడి ద్రోహమునను తెలియగ మనకున్.
భావము.  ఎంతటి శాస్త్రజ్ఞునకైనా, నేర్పరికైనా లోభం వలన కోపం పుడుతుంది. కోపం వలన ద్రోహచింతన కలుగుతుంది. ద్రోహం చేస్తే నరకలోకం ప్రాప్తిస్తుంది. 

శ్లో.  వజ్రాదపి కఠోరాణి  -  మృదూని కుసుమాదపి౹

లోకోత్తరాణాం చేతాంసి  -  కోహి విజ్ఞాతు మర్హతి౹౹

తే.గీ.  కఠిన మైనది వజ్రము కన్నఁ జూడ,

మృదులమైనది విరికన్న పృథివిఁ ఘనుల

చిత్త, మరయఁగా లేరెవ్వ రెత్తరియును,

గౌరవాత్ములనెన్నుచు గౌరవించు.

భావము.  వజ్రముల కంటెను కఠినమైనవి ,పుష్పముల కంటెను కోమలమైనవి లోకోత్తరులైన మహనీయుల హృదయాలను ఎవరు తెలుసుకోగలరు అనగా తెలుసుకోలేరని భావము.

శ్లో.  వనేఽపి దోషాః ప్రభవన్తి రాగిణాం  -  గృహేఽపి పఞ్చేన్ద్రియనిగ్రహస్తపః।

అకుత్సితే కర్మణి యః ప్రవర్తతే  -  నివృత్తరాగస్య గృహం తపోవనమ్॥ (హితోపదేశః)

తే.గీ.  రాగునకు వనమందునన్ గ్రాలు నవియె,

యింద్రియ జితుడింటఁ దపసియె గణియింప,

కుత్సితపుకర్మదూరునకును విరాగు

నకుఁ దపోవనమిల్లెయౌ, సకలవేద్య!

భావము. విషయవాసనలు కలవారికి అడవికి వెళ్లినా కామక్రోధాదిదోషాలు సంభవిస్తాయి. పంచేంద్రియాలను నిగ్రహించినవారు ఇంటిలో ఉన్నా తపస్సు చేయగలరు. అనగా వారు తాపసులే. శాస్త్రముచే నిందింపబడని (శాస్త్రసమ్మతములైన) కర్మలు ఆచరిస్తూ విషయవాంఛలు వదిలి చరించేవారికి ఇల్లే తపోవనము.

శ్లో. వరమసిధారా, తరుతల వాసో,   -  వరమిహ భిక్షా, వరముపవాసః,
వరమపి ఘోరే నరకే పతనం,   -  ధన గర్విత బాంధవ శరణమ్.
తే.గీ.  కత్తి యంచున నడచుట, కడగి చెట్ల 
నీడఁ బ్రతుకుట, భైక్ష్యంబుతోడ నుంట,
నిరశనంబున నుండుట, నరకముంట
మేలు ధన గర్వ బంధువు మ్రోల కన్న.
భావము.   ధనగర్వంతో మిడిసిపడే బంధువులను ఆశ్రయించటం కంటె, కత్తి అంచు మీద నడవటం, చెట్టు నీడలో నివసించటం, బిచ్చమెత్తుకోవటం, నిరాహారియై ఉండటం , చివరకు నరకంలో పడటమైనా శ్రేష్ఠం.

శ్లో.  వరుణశ్చైవ గోమూత్రే,  -  గోమయే హవ్య వాహన:,

దధే వాయు:సముద్దిష్ట:,  -  సోమ:క్షీరే,ఘృతే రవి:.

తే.గీ.  గోవు మూత్రాన వరుణుఁడు, గోమయమున

నగ్ని దేవుఁడు,  గోధధి నలరుననిలుఁ

డావు పాలలోచందురుఁడావు నేతి

లోన సూర్యుఁడుండును గన లోకమందు. 

భావము.  గోమూత్రంలో వరుణుఁడున్నాఁడు. గోమయంలో అగ్ని దేముఁడున్నాఁడు.ఆవు పెరుగులో వాయువుఁడు న్నాఁడు. ఆవు పాలలో చంద్రుఁడున్నాఁడు.ఆవు నేతిలో సూర్యుఁడున్నాఁడు.

శ్లో.  వలీభిర్ముఖమాక్రాంతం  -  పలితేనాంకితం శిరః

గాత్రాణి శిథిలాయంతే  -  తృష్ణైకా తరుణాయతే ॥ 

కం.  కలుగును ముఖమున ముడతలు

తెలతెల్లని జుత్తు శిరము తేజము బాపున్,

కల దేహము శిధిలమగును,

కలిగెడి కోర్కెలు తరుణముగా నుండునహో.

తే.గీ.  ముఖము పై చూడ ముడుతలు పొడముచుండె,

శిరముపై తెల్ల వెంట్రుకల్ వరలుచుండె,

దేహమది ఛిద్రమగుచుండె, దినదినమున

కోర్కె లవి యౌవనమునొప్పు గొప్పగాను.

భావము. ముఖమున ముడుతలు వచ్చును.  జుత్తు నెరిసిపోవును. శరీరము శిధిలావస్థకు చేరును. ఐనప్పటికీ కోరికలు మాత్రము 

నిత్య నూతనముగా కలుగుచునే యుండును.

శ్లో.   వసంత యౌవనా వృక్షాః  -  పురుషా ధన యౌవనాః.
సౌభాగ్య యౌవనా నార్యాః  -  యౌవనా విద్యయా బుధాః.
.  వాసంతియె వృక్షములను,
భాసిలు ధన వితతి పురుష వరులను, ఘన సద్
భాసిత సౌభాగ్యమ్ము సు
వాసినులను, విద్య బుధుల వర్ధిలఁ జేయున్.
భావము.   వసంత ఋతువే వృక్షములకు యౌవనము నిచ్చున్. పురుషులకు ధనమే యౌవనము కూర్చును. స్రీలకు సౌభాగ్యమే యౌవనదాయకము. పండితులకు విద్యయే యౌవన శోభ కూర్చును.

శ్లో.   వస్త్రేన వపుషా, వాచా, విద్యయా, వినయెనచ

వకారైః పంచభిర్యుక్తః నరో భవతి పూజితః.

తే.గీ. వస్త్రము, వపువు, వినయము వాక్సుధయును,

విద్య యను వకారములైదు హృద్యముగను

కలిగి యుండిన మనుజుఁడు గౌరవింపఁ 

బడును జగతిని. తెలియుఁడీ! ప్రాజ్ఞులార!

తే.గీ.  ప్రథిత వస్త్రము, దేహము, వచనములును,

విద్య, వినయము లవి లేని వేల్పునైన

గౌరవింపదు లోకము. కాన వాని

నరసి వర్ధిల్లఁ గలిగిన సురుచిరమగు.

 తే.గీ.  వస్త్రము, వపువు, విద్యయు వాక్కు, వినయ

ములనియెడి యైదగు వకారములను కలుగు

నరుఁడు పూజింపఁ బడు ధర నిరుపమముగ,

రామకృష్ణుని మాటలు రసగుళికలు.

భావము. వస్త్రము, వపువు, వాక్చాతుర్యము,విద్య, వినయము అను పంచ వకార యుక్తుఁడైన మానవుఁడు పూజింపఁబడును. 

శ్లో. "వాగ్దండో೭థ మనోదండ కాయదండ స్తథైవచ, 
యస్యైతే నిహతా బుద్ధౌ త్రిదండీతి ఉచ్యతే" [మనుస్మృతి 12-10]
తే.గీ.  మౌన వర్తియె వాగ్దండి,మహినిఁ గనఁగ,
మనసులో కోర్కె లేకున్న మనసు దండి.
కాయకర్మస్వధర్ముఁడే కాయ దండి,
దండములు మూడు కల్గి, త్రి దండియగును.
భావము. 1. వాగ్దండము (మౌనము), 2. మనోదండము (ఆశ లేకుండుట), 3. కాయదండము (స్వధర్మాచరణము). మూడింటియందును ఎవరు బుద్ధి నిలుపుదురో వారు త్రిదండి యనఁబడుదురు.

శ్లో. వాగ్వాదమ్,  అర్థసంబంధమ్,  పరోక్షే దారభాషణమ్, 
యత్ర మిత్రత్వమిచ్ఛంతి తత్ర త్రీణి కారయేత్.
తే.గీ.  వాదనము చేయ తగదు సంభాషణముల,
అర్థ సంబంధ మును వీడి, అతని పత్ని
తోడ చాటుగా భాషణల్ వీడవలయు
మైత్రి కోరెడి వారితో ధాత్రిఁ జనులు.
భావము.  ఎక్కడ స్నేహమును కోరుకొందుమో అక్కడ వాగ్వాదము, ఆర్థిక సంబంధ్ము, మిత్రుని పరోక్షములో అతని భార్యతో మాటలాడుట అనే మూడూ చేయరాదు.

శ్లో. వాగ్వైఖరీ శబ్దఝరీ శాస్త్రవ్యాఖ్యానకౌశలమ్

వైదుష్యం విదుషాం తద్వద్భుక్తయే తు ముక్తయే  వివేక చూడామణి ౫౮॥

తే.గీ.  పలుకు చతురత, పదముల పరుగు తెఱఁగు,

విషయ వివరణ నిపుణత విదుషులకిల

తినఁగ నమరుచు నభవముఁ గొనగ నిడవు.

పరమ పథమును గొన గురు పదమె శరణు.

భావము. పండితుల వాక్చాతుర్యము, అనర్గల పదప్రయోగ కౌశలము, శాస్త్రవ్యాఖ్యాననైపుణ్యము మున్నగునవి భుక్తినిచ్చునే కాని ముక్తినివ్వజాలవు. ముక్తిని కేవలము సద్గురు పదములే ప్రసాదించఁ గలవు.

శ్లో. వాపీ కూప తటాకాద్యైర్వాజపేయశతైర్మఖైః
గవాం కోటి ప్రదానేన భూమిహర్తా శుద్ధ్యతి. (పారాశర స్మృతి 12-49)
తే.గీ.  కూప, వాపీతటాకముల్ కొలిప మరియు
వాజపేయాది క్రతువులు వంద చేయ
గోవులను కోటి దానంబు కోరి చేయ,
పరుల కేదారహరు దోష హరణమగునె?
భావము. మడుగు బావి, నూయి, చెరువు మున్నగునవి నిర్మించినను, వాజపేయాది వంద యజ్ఞములు చేసినను,కోటి గంగి గోవులను దానము చేసినను, పరుల భూమిని అపహరించుట వలన వచ్చెడి పాపమును పోకొట్టుట సాధ్యము కాదు.

శ్లో.   వార్ధకం వయసానాస్తి  -  మనసానైవతద్భవేత్

సన్తతోద్యమశీలస్య  -  నాస్తివార్ధక్యపీడనమ్.

తే.గీ.  మసలిననుభావమునవచ్చు ముసలితనము,

అట్టి భావంబు లేనిచో నదియు రాదు.

సంతతోద్యమశీలురకింతయైన

ముసలితనమన్నదే రాదు, పూజ్యులార!

తే.గీ.  వయసుతో రాదు వృద్ధాప్య బాధ, కనఁగ,

మనసుతోడను రాదది, మనము సతము

నిరుపమోద్యమ మార్గాన నెగడుచున్న,

నిత్యసంతోషి యువకుఁడే నిత్యమిలను.

తే.గీ.  జయుఁడ! వార్ధక్యమది రాదు వయసుతోడ,

మనసుతోకూడ రారాదు మనుజునకును,

సంతతోద్యమశీలసత్సంగులకును

వార్ధకంబది చేరదు, భాగ్యమదియె.

భావము.  వృద్ధాప్యమనేది వయసులోనూ లేదు. మనసులోనూ ఉండకూడదు. ఎల్లపుడూ ఉత్సాహం, క్రియాశీలత, కలమానవుడికి, వృద్ధాప్యపీడ ఉండదు.

శ్లో. విదేశేషు ధనం విద్యా , వ్యసనేషు ధనం మతి: 
పరలోకే ధనం ధర్మ: , శీలం సర్వత్ర వై ధనమ్.
.  పరదేశంబున విద్యయు, 
నిరుపమ వ్యసనమున బుద్ధి, నిత్యంబగునా
పర లోకమందు ధర్మము, 
వర శీలం బెల్ల యెడల వర ధనములగున్.
భావము. విదేశములో ఉన్నప్పుడు విద్యయే ధనము. కష్టకాలములో బుద్ధియే ధనము. పరలోకములో  ధర్మమే ధనము. అన్ని ప్రదేశములందును అన్ని సమయములందును శీలమే గొప్ప ధనము.

శ్లో.  విద్యా ధన మదోన్మత్తః  -  యః కుర్యాత్ పితృ హేళనమ్

యాతి నరకం ఘోరమ్  -  సర్వ ధర్మ బహిష్కృతః.

తే.గీ. ధన విద్యల మద గర్వము

కనులకు పొర గొలిపి నిజము కానంబడమిన్

వినయము విడి తలిదండ్రుల

కినుకను గను పుత్రుఁడొందు కిల్భష జగతిన్..

భావము.  విద్యా ధన మదములతో కళ్ళు గానక పొగరుబోతుదనంతో తల్లిదండ్రులనెవ్వఁడు చులకన చేయునో వాఁడు ధర్మ చ్యుతుడై నరకమున బడును.

శ్లో.   విద్యా మిత్రం ప్రవాసేషు, భార్యా మిత్రం గృహేషుచ ,

వ్యాధితస్యౌషధం మిత్రం , ధర్మో మిత్రం మృతస్యచ.

తే.గీ.  దూర దేశమందున మన తోడు విద్య.
గృహమునందున్న మనతోడు గృహిణి యౌను.
వ్యాధి తోనున్న తోడగు నౌషధంబు. 
మృత్యువేళను మనతోడు సత్య చరిత.

భావము.  దూరప్రాంతములందు ఉన్నప్పుడు విద్య, ఇంటిలో ఉన్నప్పుడు భార్య , వ్యాధితో పీడింపబడుచున్నప్పు ఔషధం, మరణించినప్పుడు ధర్మము మనకు తోడుగానుండు స్నేహితులు. 

శ్లో. విద్యా వివాదాయ ధనం మదాయ  -  శక్తిః పరేషాం ఖలు పీడనాయ.
ఖలస్య సాధోః విపరీతమేతత్  -  జ్ఞానాయ దానాయచ రక్షణాయ.
. వరలెడి విద్య మూర్ఖపు వివాదపు ప్రౌఢిమ, విత్తమున్ మదం
బరయగ శక్తి నన్యులను బాధలు పెట్టుగ మూర్ఖు లందునన్,
పరులకు జ్ఞానమున్ గొలుప, భక్తిని పంచగ పేదవారికిన్
సరగున రక్ష సేయగను సజ్జనులందున నొప్పు నెల్లెడన్.

భావము.   విద్య, ధనము, బలము అను యీ మూడూ మూర్ఖులందు వివాదము కొరకును, గర్వ పడుటకును, పరులను హింసించుటకునూ ఉపయోగ పడుచుండగా, సజ్జనులయందు ఇతరులకు జ్ఞాన బోధ కలిగించుటకు, పేదలకు కష్టములలో సహాయము చేయుట కొరకూ, బాధలలో నున్న వారిని రక్షించుట కొరకునూఉపయోగ పడుచున్నది కదా!

శ్లో.  విద్యాసు శ్రుతిరుత్కృష్టా - రుద్రైకాదశనీ శ్రుతౌ 
తత్ర పఞ్చాక్షరీ తస్యాం - శివ ఇత్యక్షర ద్వయమ్. 
తే.గీ.  విద్యలందున వేదంబు, వేదమునను
రుద్రయేకాదశకమును, రుద్రమందు
ప్రముద పంచాక్షరియు, కన వానియందు
శివయనెడి రెండు వర్ణముల్,శ్రేష్టమెన్న.
తే.గీ.  విద్యలందున మేలౌను వేద విద్య.
వేదముల రుద్రములు మేలు విశ్వమునను.
భద్ర పంచాక్షరియె మేలురుద్రములను.
"శివ"  యె పంచాక్షరిని మేలు శ్రియముఁ గొలుపు.

భావము. విద్యలలో వేద విద్య ఉత్కృష్టమైనది. వేద విద్యలో ఏకాదశరుద్రములు శ్రేష్టమైనవి. వాటిలో శివ పంచాక్షరి, అందునా శివ అను రెండక్షరములు శ్రేష్టమైనవి.

శ్లో.  విద్వత్వంచ నృపత్వంచ నైవ తుల్యం కదాచన

స్వదేశే పూజ్యతే రాజా, విద్వాన్ సర్వత్ర పూజ్యతే.

తే.గీ.  పాండితికి సరికాదిల ప్రభుత చూడ

రాజు పూజింపఁబడు తన రాజ్యముననె,

పండితీయుతులెటనైన ప్రతిభ చేత

పూజలందుట నిక్కము భూమిపైన.

భావము.  పాండిత్యము, రాచరికము ఒకదానితో మరొకటి పోల్చుటకు వీలు లేదు. రాజు స్వదేశమునందు మాత్రమే పూజింపఁబడును. పండితుఁడు మాత్రము లోకములో ఎక్కడికి వెళ్ళినా పూజింపఁ బడును.

శ్లో.  విద్వత్సు విమలజ్ఞానా  -  విరక్తా యతిషు స్థితాః |

స్వీయేషు గరోద్గారా  -  నానాకారాః క్షితౌ ఖలాః ||

(రసగంగాధరః)

తేగీ. పండితుల వద్ద నొప్పు తా పండితునటు,

యతులవద్దను నొప్పుతా యతియనంగ

ధూర్తుఁ డిల చిందు విషమును తోటి తనదు

జనులపై నైజమును చూపు,  సన్నుతాత్మ!

భావము.  దుర్జనులు భూమిపై అనేక ఆకారములను కనబరచుక్రొందురు. విద్వాంసుల ఎదుట శుద్ధమైన జ్ఞానం కలవారిలాగా, యతుల ఎదురు విరక్తులలాగా కనబడుదురు. తనవారి (దాయాదుల) విషయంలో విషాన్నే క్రక్కుదురు.

శ్లో.   విపత్తిష్వవ్యథో దక్షో - నిత్యముత్థానవాన్నరః|

అప్రమత్తో వినీతాత్మా - నిత్యం భద్రాణి పశ్యతి||

తే.గీ.  క్రుంగకాపదలందున క్షోణినిలిచి, 

కార్యదక్షుఁడై, స్పృహఁ గల్గి క్రాలువాఁడు,

వినయముననొప్పువాఁడు వివేకశాలి,

శుభములాతనిన్ జేరుచు శోభఁ గొలుపు.

భావము.  ఆపత్కాలంలో క్రుంగిపోనివాడికి, కార్యనిర్వహణలో నేర్పు కలవాడికి, అప్రమత్తంగా మెలిగేవాడికి, వినయవిధేయతలు కలవాడికి ఎల్లప్పుడు శుభాలే చేకూరతాయి.

శ్లో.  విపదో నైవ విపదః  -  సంపదో నైవ సంపదః |

విపద్ విస్మరణం విష్ణోః  -  సంపన్నారాయణస్మృతిః ||

తే.గీ.  ఘనవిపత్తుల్ విపత్తులు కావు కావు,

కనగ సంపదల్ సంపదల్ కావు కావు,

భవ్యవిష్ణు సంస్మరణ సంపత్తియగును,

పద్మనాభుని మరువ విపత్తియదియె.

భావము.  విపత్తులు విపత్తులు కావు. ఐశ్వర్యాలు ఐశ్వర్యాలు కావు. విష్ణువును మరచిపోవడమే నిజమైన విపత్తు. ఆయనను స్మరించుకోవడమే నిజమైన సంపద.

శ్లో.  విశ్వామిత్రాహి పశుషు - కర్దమేషు జలేషుచ

అంధే తమసి వార్థక్యే - దండం దశగుణం భవేత్.

.వె.  పక్షి, కుక్క, శత్రు, పాము, పశులఁ ద్రోల,

చేతి కర్ర మిగుల చేవఁ జూపు.

బురద, నీరు, రేయి, ముసలి, గ్రుడ్డియుఁ గల్గ

చేతికర్ర దాటఁ జేయు మనల?

భావము.  పక్షులు, కుక్కలు, అమిత్రులు, పాములు, పశువులు, వీటిని పారద్రోలుటకున్ను, బురదలో, నీళ్ళలో, చీకటిలో, గ్రుడ్డితనంలో, ముసలితనంలో అవలంబనంగానున్ను, చేతి కర్ర పనికివస్తుంది. అందుచేతనే దండం దశ గుణం భవేత్ అంటారు.

600. శ్లో. విషం రుధిర మాసాద్య, ప్రసర్పతి యథా తనౌ
తథైవ ఛిద్ర మాసాద్య, దోషశ్చిత్తే ప్రసర్పతి.   

. నెత్తురు వెంబడి విషమటు

లెత్తరి బలహీనతఁ గొని జ్యేష్ఠోద్భవముల్

మత్తును గొలుపుచు మది నిలు.

మత్తగు బలహీనత విడి మసలుఁడు మహితుల్.        
భావము. రక్తాన్ని ఆధారంగా చేసికొని విషం ఏరీతిగా శరీరమంతటాప్రసరిస్తుందో , అలాగే ఒక్క బలహీనతను సాధనంగా చేసికొనిదుష్టసంస్కారం మనస్సులో వ్యాపిస్తుంది.


601. శ్లో.  విషాద ప్యమృతం గ్రాహ్యం, బాలాదపి సుభాషితం.

అమిత్రాదపి సద్ వృత్తం, అమేధ్యాదపి కాంచనం.

తే.గీ.  సుధను విషము నందున్నను వెదకి, గొనుత.

బాలునుండైన గొనుత సద్ భాషణంబు.

శత్రునుండైన సద్వృత్తి చక్కఁ గొనుత.

స్వర్ణము నమేధ్యమున నున్నఁ జక్కఁ గొనుత.

భావము.  అమృతమును విషమునందున్నట్టిదానినైనను గ్రహింప వచ్చును. మంచి మాటలను చిన్న పిల్లవాడు చెప్పుచున్నవైనను గ్రహింప వచ్చును. మంచి నడవడికను శత్రువు నుండియు గ్రహింప వచ్చును. బంగారమును అపవిత్ర స్థలమునందున్నదియైనను గ్రహింప వచ్చును.

శ్లో. వృద్ధకాలే మృతా భార్యా బంధుహస్తే గతం ధనం
భోజనం పరాధీనం తిస్రః పుంసాం విడంబనాః. 
తే.గీ.  వృద్ధ వయసున నర్థాంగి విడిచి చనుట, 
ధనము బంధుల పాలయి తల్లడిలుట, 
భోజనార్థమన్యులపంచ ముదిమి నుంట, 
మనుజునకు దుఃఖ హేతువుల్ మాన్యులార!
భావము. ముసలితనములో భార్య మరణించుట , ధనమంతయు బంధువుల వశమగుట, భోజనమునకై ఇతరులపై ఆధారపడుట అనే మూడూ మానవులకు దుఃఖహేతువులు. 

శ్లో. వృత్తం యత్నేన సంరక్ష్యం విత్తమేతి యాతి
అక్షీణో విత్తతః క్షీణో వృత్తతస్తు హతో హతః.

. ధనమును బ్రోచుట కంటెను 

గుణమును బ్రోచుటయె మిన్న, గుణ ధనములలో 

ధన హీనమే ప్రశస్తము

గుణ హీనముకన్న తెలియగానగు మనకున్.

భావము.  ధనాన్ని కంటే ఎక్కువగా సత్ప్రవర్తనను ప్రయత్న పూర్వకంగా సంరక్షించుకోవాలి. ధనం వస్తూ, పోతూఉంటుంది. ధనం క్షీణించినవానికంటే మంచి నడవడికను కోల్పోయినవాడే చెడిన వాడనిపించుకుంటాడు. 

శ్లో. వృద్ధత్వానలదగ్ధస్య సారయౌవనవస్తునః
దృశ్యతే దేహగేహేషు భస్మైవ పలితచ్ఛలాత్. 

.  వృద్ధాగ్ని దగ్ధ యౌవన 

సిద్ధ మహావస్తు చయము చెడి బూడిదయై 

యుద్ధతి నెరసిన జుత్తుగ 

నిద్దేహ గృహంబునమరె నిది కన వలదా!

భావము.  ముసలితనము అనే అగ్నితో దహింపబడిన సారవంతమైన యౌవన సామగ్రి అంతా - దేహమనే లోగిళ్ళలో నెరసిన వెంట్రుకలనే నెపంతో బూడిదలా రాలుతోంది.

శ్లో.  వృద్ధార్కో హోమ ధూమశ్చ, బాలా స్త్రీ నిర్మలోదకమ్
రాత్రౌ క్షీరాన్న భుక్తిశ్చ ఆయుర్వృద్ధిర్దినే దినే.
తే.గీ.  అస్తమించెడి రవి కాంతి, హవన ధూమ
మమరు చినదాని కలయిక, యమల జలము,
నిశను క్షీరన్న భుక్తియు వసుధ జనుల
కాయువును వృద్ధి చేయును, శ్రేయమొసగు.
భావము. సాయంకాల సూర్య రశ్మి,  హోమ ధూమము, తనకంటే చిన్నదైన స్త్రీ సంగమము, నిర్మలమైన నీరు,రాత్రివేళలో క్షీరాన్నము భుజించుట, అనునవి క్రమముగా ఆయుర్వృద్ధి కలిగించును.

శ్లో.  వృషస్య వృషణం స్పృష్ట్వా శృంగమధ్యే శివాలయమ్ |

దృష్ట్వా క్షణం నరో యాతి కైలాసే శివ సన్నిధమ్ ||

తే.గీ.  వృషభ వృషణమంటి, శృంగమధ్యమునుండి

భక్తితోడమనము పరవశమున

శివునియాలయమున శివదర్శనంబును

క్షణము చేయ ముక్తి కలుగు నిజము.

భావము.  శివాలయమునకు వెళ్ళిన భక్తులు  శివుని వాహనమయిన 

వృషభము యొక్క వృషణము చేతితో తాకి, వృషభము 

కొమ్ముల మధ్యనుండి శివలింగ దర్శనము భక్తితో చేసినచో 

ముక్తి తప్పక లభించును.

శ్లో. వేదమూల మిదంజ్ఞానం ,భార్యామూల మిదం గృహం

కృషిమూల మిదం ధాన్యం , ధనమూల మిదం జగత్.
తే.గీ.  వేదమూలమ్ము జ్ఞానమ్ము విజ్ఞులార.

గృహిణి మూలమ్ము గృహమౌను మహితులార!

కృషియె మూల మీదినుసుకుగణ్యులార!

ధనమె మూల మీజగతికి మనుజులార!

తే.గీ.  వేద మూలము జ్ఞానము విజ్ఞు లరయ.

భార్య మూలము గృహమిల ప్రస్పుటముగ.

కృషియె ధాన్యము మూలము, కీలు చీల.

ధనమె మూలము జగతిని, మనుజులకును.

భావము. జ్ఞానానికి వేదమే మూలం.ఇంటికి ఇల్లాలే మూలం.ధాన్యానికి వ్యవసాయమే మూలం. జగత్తుకు ధనమే మూలము.

శ్లో.  వేద శాస్త్ర పురాణేన కాలో గచ్ఛతి ధీమతాం.
వ్యసనేనచ మూర్ఖాణాం నిద్రయా కలహేనచ.
తే.గీ.  వేద శాస్త్ర పురాణముల్ బోధ చేత
గడపు ధీమతులు తమదు కాల మెపుడు.
వ్యసన, నిద్ర , కలహముల భ్రష్టు లగుచు
కాలము గడుపు మూర్ఖులు, కాన లేక.
భావము.  బుద్ధిమంతులకు కావ్య శాస్త్ర పురాణాదులతో తమ కాలమును గడుపుదురు. మూర్ఖులు వ్యసనములతోను, నిద్ర తోను, యితరులతో నిత్యమూ కలహించుటతోను తమ కాలమును గడుపుచుందురు.

శ్లో.  వేదాః త్యాగశ్చ యజ్ఞాశ్చ - నియమాశ్చ తపాంసి |

విప్రదుష్టభావస్య - సిద్ధిం గచ్ఛంతి కర్హిచిత్ ||

(మనుస్మృతి)

తే.గీ.  వేదములు, త్యాగ యజ్ఞముల్,వినుత నియమ

ములను చేసెడి వ్రత తపములును మనకు

నింద్రియేచ్ఛలన్, చెడు కోర్కెలిలను తీర్చ

జాల వాత్మసుజ్ఞానంబు వరలనిచ్చు.

భావము.  వేదాధ్యయనము, దానము, యజ్ఞములు, నియమాలతో కూడిన వ్రతాలూ-పూజలు, తపస్సు - ఇవి  ఇంద్రియసుఖాలలో ఆసక్తిగలవారికి అలాగే చెడు భావనలున్నవారికి ఎట్టి సంసిద్ధిని ఎచ్చటనూ కలిగింపజాలవు.

శ్లో. వేపథుర్మలినం వక్త్రం , దీనా వాగ్గద్గః స్వరః
మరణే యాని చిహ్నాని , తాని చిహ్నాని యాచకే.

. యాచన మృత్యు సమానము. 

యాచించెడు వాని మలినమావనంబౌన్

యాచకు పలుకులు వణకును.

యాచకుఁడును మృతుని పోలు యాచన వేళన్.!

భావము. వణకుతో ముఖం మలినమైపోతుంది , దీన భావంతో వాక్కు గద్గదమౌతుంది. మరణసమయంలో చిహ్నాలు వస్తాయో అవన్నీ యాచకునిలో కనిపిస్తాయి. (యాచన - మరణంతో సమానం)

శ్లో వ్యసనాన్యత్ర బహూని వ్యసనద్వయమేవ కేవలం వ్యసనం
విద్యాభ్యాసనం వ్యసనం అథవా హరిపాదసేవనం వ్యసనం.
. వ్యసనములందున విద్యా
వ్యసనము, హరి పాద సేవ యను రెండింటిన్
వసుధనలవరచుకొనవలె
నసమానముగా నరుండు హాయిని పొందన్.
భావము. వ్యసనాలు చాలా రకాలున్నాయి. అందులో రెండు రకాల వ్యసనాలను ప్రయత్నపూర్వకంగా అలవరచుకోవాలట. మొదటిది విద్యాభ్యాసనం అనే వ్యసనం రెండు హరిపాదసేవనము. 

శ్లో. వ్యాఘ్రీవ తిష్ఠతి జరా పరితర్జయంతి రోగాశ్చ శత్రవ ఇవ ప్రహరంతి దేహం
ఆయుః పరిస్రవతి భిన్నఘటాదివాంభో లోకస్తథాప్యహితమాచరతీతి చిత్రమ్
!

.  పులి వలె వృద్ధత పయిఁబడు

పలు రోగములావహించు. పగిలిన కుండన్

నిలువని నీరటులాయువు

తొలగును. మరి దుష్ట బుద్ధి తొలగదదేలో?

.  పులివలె పయిఁబడు వృద్ధత,

పలు రోగములావహించు, పగిలిన కుండన్

నిలువని నీరటులాయువు

తొలగును. మరి దుష్ట బుద్ధి తొలగదదేలో? 

భావము.ముసలితనం ఆడపులిలా చూపుడు వ్రేలితో బెదిరిస్తోంది. శత్రువుల్లా రోగాలు దేహాన్ని  దెబ్బ తీస్తున్నాయి.  పగిలినకుండలోని నీళ్ళలా ఆయుర్దాయం తరిగిపోతోంది.ఐనప్పటికీ లోకం అహితకార్యాలు చేస్తూ ఉండటమే ఆశ్చర్యం!

శ్లో.   వ్యాసమ్ ; వశిష్ఠ నప్తారమ్; శక్తేః పౌత్రమకల్మషమ్;

పరాశరాత్మజమ్ వందే శుకతాతమ్  తపోనిధిమ్.

తే.గీ.  మునివరేణ్య వశిష్ఠుని మునిమనుఁడును.

శక్తి పౌత్రుండు నకళంక భక్తి యుతుఁడు;

వర పరాశరాత్మజుఁడును; ధర శుకునకు

తండ్రి; యగువ్యాస గురువును తలతు భక్తి.

తే.గీ.  మునిమనుమఁడు వశిష్ఠుఁడన్ మునికి యతఁడు,

శక్తికిన్ మనుమఁడు, పరాశరుని సుతుఁడు,

శుకమహర్షికి తండ్రి వ్యాసుం డకల్మ

షుఁడు తపోనిధి, యతనికి నిడుదు నతులు.

భావము.   వశిష్ఠుని ముని మనుమఁడును; శక్తి మహర్షి  యొక్క పౌత్రుఁడును; నిష్కల్మషుఁడును;  పరాశర ముని కుమారుఁడును; శుక మహర్షికి తండ్రియును; తపోనిధియును;  అగు ఆది గురువయిన వ్యాస భగవానులవారికి నమస్కరింతును

శ్లో. శతం విహాయ భోక్తవ్యం సహస్రం స్నానమేవచ 
లక్షం విహాయ దాతవ్యం కోటిం త్యక్త్వా హరిం భజేత్.
. పనులైన విడిచి తినవలె,
పనులను విడి స్నానమెలమి వలయును చేయన్.
పని వీడి దాన మొసగుట,
పనివిడిచియు హరికి సేవ వలయును చేయన్.
భావము.  వందపనులున్నా భొజనం ముందు చేయవలెను. వేయి పనులున్నా స్నానము చేయవలెను.  లక్ష పనులున్నా దానము చేయ వలెను. కోటి పనులున్నా హరిస్మరణము చేయవలెను. 

శ్లో. శతేషు జాయతే శూర: , సహస్త్రేషు పండిత: 
వక్తా దశసహస్త్రేషు , దాతా భవతి వా వా .

తే.గీ.  నూటి కొకడైన శూరుండు మేటి యుండు. 

వేయికొకడైన పండిన్ వెలయ వచ్చు. 

వక్త పదివేల కొక్కడు ప్రబల వచ్చు.

కోటి కొకడైన దాతగా పాటిఁ గలడె?

భావము. వందలమందిలో ఒక శూరుడుంటాడు. వేలమందిలో ఒక పండితుడు ఉంటాడు.పదివేలమందిలో ఒక వక్త (విశేషంగా మాట్లాడేవాడు)ఉంటాడు. కానీ, నిజమైన దాత ఉంటాడో ఉండడో !

శ్లో. శరీరస్య గుణానాం , దూర మత్యంత మంతరం,
శరీరం క్షణవిధ్వంసి, కల్పాంత స్థాయినో గుణాః . 
.  గుణ దేహములకు దూరము 
కనగా యధికంబు నిజము. ఘనతర గుణముల్ 
మను శాశ్వితముగ, దేహము 
క్షణ భంగురమరసి చూడ. కానగ వలదా?

. దేహము క్షణ భంగురమే.
దేహస్థిత గుణము స్థిరము.దేహస్థులు వ్యా 
మోహము విడనాడుచు తమ 
దేహముతో శుభముఁ గూర్చి దీపించ తగున్.

తే.గీ.  దేహమునకు గుణములకు దీపితమగు
దూరమెక్కుడు తెలియగ. ధీరులార!
క్షణములో పోవు దేహము. గుణము లెల్ల
నిలుచు శాశ్వితముగ యని తెలియఁ దగును.

భావము. శరీరానికీ గుణాలకి మధ్య ఎంతో అంతరం(దూరం) వుంది. ఇప్పుడు పుట్టి మరుక్షణంలో నశించి పోయేది శరీరం. మరి గుణములో కల్పాంతము ఉండునవి. 

శ్లో.   శిశుథ్వం స్రైణం వాభవతు నను వంద్యాసి జగతిం!

గుణాః పూజాస్థానం గుణుషు లిజ్ఞం వయః!!

. గుణములు పూజ్యములిలలో

గుణములకున్ వయసు లేదు. కుల లింగాదుల్

గుణములకుండవు కావున

గుణవంతుల గౌరవించుకొనవలె కూర్మిన్.

భావము. గుణవంతులు శిశువులు కావచ్చును, స్త్రీలు కావచ్చును. వారు లోకమున గౌరవార్హులు. గుణములు పూజాస్థానములు. గుణములయందు లింగము వయసు అనునవి ఉండవు. అందుకే గుణములు పూజనీయములు. అటువంటి గుణములు చూద్దామంటే పూజ్యమే (శూన్యమే) అని తోచుతుంది లోకంలో.

శ్లో.  శీలం శౌర్యమనాలస్యం  -  పాండిత్యం మిత్ర సంగ్రహః ,

అచోర హరణీయాని  -  పంచైతాన్య క్షయో నిధి: .

తే.గీ.  స్థవసుశీలమనెడి నిధి, సౌర్య నిధియు,

మహితపాండిత్యమను నిధి, మాన్యజనుల

మైత్రినిధియు, ననాలస్య మహిత నిధియు,

చౌర్యమవని యక్షయనిధుల్, సుగుణ గణ్య!

భావము.  సత్కీలము,సౌర్యము,కార్య దీక్షత,పాండిత్యం మంచి స్నేహితులను 

చేసుకొనేది,మొదలైన గుణాలు ఎవరూ దొంగతనం చేయడానికి అవ్వదు.

ఐదు నిధిలాంటివి.అందుకే అవి ఏవిధంగా ఎప్పటికీ పోవు.

శ్లో. శుకవత్ భాషణం కుర్యాత్,బకవత్ ధ్యాన మాచరేత్
అజవత్ భోజనం కుర్యాత్, గజవత్ స్నాన మాచరేత్.

. చిలుక వలె పలుకు ముద్దుగ. 

నిలకడగా కొంగవోలె నిలుపుము ధ్యానం

బల మేక వలె భుజింపుము.

సలుపుము గజమట్లు నీట స్నానము హితమౌన్.

భావము. చిలుకలా మధురంగా మాట్లాడాలి. కొంగలా నిశ్చలంగా ధ్యానం చేయాలి,ఇష్టాయిష్టాలతో సంబంధం లేకుండా మనకు లభించిన సాత్విక ఆహారాన్ని మేకలా భోజనం చేయాలి. ఏనుగులా ఆనందంగా , ఎక్కువసేపు స్నానం చేయాలి.

శ్లో. శోకారాతి భయ త్రాణం ప్రీతివస్రంభభాజనం
కేన రత్నమిదం సృష్టం మిత్రమిత్యక్షర ద్వయం.
.వె.   దుఃఖ భయములున్న దూరము చేయును
శత్రు భయము బాపు నాత్రముగను.
మిత్రుడన్న వాడు మేలునే కోరును.
ఇట్టిమిత్ర రత్న మెవరి సృష్టి?

భావము.  మిత్రుడనే వాడు దుఃఖాన్ని, భయాన్ని, శతృ భయాన్ని, పారద్రోలి రక్షిస్తూ వుంటాడు. అతడు నిజంగా రత్నమే. అట్టి రత్నాన్ని ఎవడు సృష్టించాడో కదా!

శ్లో. శోకేన వర్ధతే రోగాః పయసా తను వర్ధతే.
ఘృతేన వర్ధతే బుద్ధిః, మాంసం మాంసేన వర్ధతే.
తే.గీ. దుఃఖమున రోగ వృద్ధియౌన్. దుష్టమదియు.
పాలు దేహమ్ముఁ బెంచును, భవ్యమదియె.
నేయి బుద్ధిని పెంచును. నేర్పు కలుగు.
మాంసమున మాంస వృద్ధియౌన్ మహితులార!
భావము. దుఃఖము వలన రోగములు, పాల వలన శరీరము, నేయి వలన బుద్ధి, మాంసము వలన మాంసము వృద్ధియగును.

శ్లో.  శ్రవణం కీర్తనం విష్ణోః స్మరణం, పాద సేవనం,
అర్చనం వందనం ధ్యానం, సఖ్య మాత్మ నివేదనం.
.వె. విష్ణు కథలు వినుట, విష్ణుఁ గీర్తించుట,
స్మరణ, సేవ, యర్చన, రహిఁ గొల్పు
వందనంబు, ధ్యాన, సుందర స్నేహంబు
నాత్మనొసగుట, హరి నరయు గతులు.
భావము.  విష్ణు కథా శ్రవణము,  విష్ణు కీర్తనము,  విష్ణు స్మరణము, విష్ణు పాద సేవనము, విష్ణు అర్చనము, విష్ణువుకు వందనము, విష్ణు ధ్యానము, విష్ణ్వుతో స్నేహము, విష్ణువుకు ఆత్మ నివేదనము అను తొమ్మిదిన్నీ నవ విధ భక్తులనబడును. ఇందేది అనుసరించియైనను విష్ణు సాన్నిధ్యము పొంద సాధ్యము.

శ్లో.  శ్రావయేత్ మృదులాం వాణీమ్  -  సర్వదా ప్రియమాచరేత్.
పిత్రో రాజ్ఞానుసారీ స్యాత్  -  సత్ పుత్రః కుల పావనః.
తే.గీ.  పుత్రకుని చేత కులము పవిత్రమగును.
తల్లి దండ్రులు తృప్తులై తనియఁ జేయ
తీయనగు మంచి మాటలు తృప్తిఁ బలికి
వారి మాటలు పాలించి వరలవలెను. 
తే.గీ.   కులదీపము సత్ పుత్రుఁడు .
తలిదండ్రుల మాట వినును. తనిపెడి మాటల్
పలుకుచు నా తలిదండ్రుల
తలచును దైవముగ నెపుడు ధన్యాత్ముఁడగున్. 

భావము.  సత్ పుత్రుఁడే కులమును పవిత్రమొనరించు వాఁడు. పుత్రుఁడెప్పుడూ తల్లి దండ్రులతో తియ్యని చల్లని మాటలే ఆడ వలెను. వారికి ప్రియమునే చేస్తూ, వారి ఆజ్ఞను పాలించ వలెను.

శ్లో. శ్రీకరంచ పవిత్రంచ మహత్ శోక నివారణమ్.
లోకే వశీకరం పుంసాం, భస్మం త్రైలోక్య పావనమ్. 
తే.గీ.   శ్రీకరంబు, పవిత్రము, శోక హారి,
లోకమును పుంస జాతికి లొంగఁ జేయు,
మహిత త్రైలోక్య పావన మహిని భూతి.
భస్మధారణ పురుషుల వరలఁ జేయు.
భావము. లోకమున మంగళప్రదమైనదియు, పవిత్రమైనదియు, మిక్కుటమైన శోకములనైనను నివారించునట్టిదియు, పురుషులకు వశీకరణ శక్తిప్రదమైనదియునైన విభూతి ముల్లోకములందును పావనమైనది.

శ్లో.   శ్రుతివిప్రతిపన్నా తే - యదా స్థాస్యతి నిశ్చలా
సమాధా వచలా బుద్ధి  -  స్తదా యోగ మవాప్స్యసి.
కం.  శ్రవణాదుల కలత పడని
యెవని మదిని దైవ భక్తి, ఎఱుకయు యుండున్
భవ బంధ దూరుడాతడు.
సవిధంబుగ గాంచు నాత్మ శక్తిని, దీప్తిన్.
కం.  నానావిధ శ్రవణాదుల
మానని కలతను వహించు మతి కలగక తా
ధ్యానము తిరముగ నిలిపిన
కానంబడు దైవమపుడు కరుణను మనకున్.

భావము.  నానావిధములగు శ్రవణాదులచే కలత జెందియున్న నీ బుద్ధి యెపుడు చలింపనిదై పరమాత్మ ధ్యానమందు స్థిరముగ నిలిచియుండునో, అపుడు నీవాత్మసాక్షాత్కారమును బొందగలవు.

శ్లో.  శ్రోత్రం శ్రుతేనైవ న కుండలేన , దానేన పాణిర్నతు కంకణేన
విభాతి కాయః కరుణాపరాణాం , పరోపకారై ర్నతు చందనేన.

తే.గీ.  మంచివినుటను,చేయంగ మంచిదాన

మెంచి పరమోపకారమునెపుడు వెలయు

నెందు కుండల,కంకణ, చందనములఁ

గాదు కర్ణకరవపువుల్ ఘనులకిలను.

భావము. దయాస్వభావం కలవారి చెవులు జ్ఞానవిషయాలు వినటం వల్ల రాణిస్తాయి గానీ , కుండలాలతో కాదు! చేతులు దానంతో ప్రకాశిస్తాయేగానీ , కంకణాలతో కాదు! శరీరం పరోపకారంతోనే ప్రకాశిస్తుందిగానీ , గంధపు పూతతో కాదు!

శ్లో. శ్లోకార్ధేన ప్రవక్ష్యామి యదుక్తం గ్రంథ కోటిభిః,
పరోపకారః పుణ్యాయ పాపాయ పరపీడనం.
తే.గీ.  కోటి గ్రంథంబులు వచించు గొప్ప గుణము
అర్థ పద్యంబునందుండె నరయుడయ్య.
పరులకుపకృతి పుణ్యంబు, వరలఁ జేయు
పరుల కపకారమును జేయ పాపమగును.
భావము. కోటి గ్రంధాలలో చెప్పబడిన దానిని అర్థ శ్లోకంలో (అర్థ పద్యములో) చెపుతాను : "పరోప కారమే పుణ్యం ; ఇతరులను బాధపెట్టడమే పాపం.

శ్లో. షడ్దోషాః పురుషేణేహ హాతవ్యా భూతిమిచ్ఛతా 
నిద్రా తంద్రీ భయం క్రోధమాలస్యం దీర్ఘసూత్రతా.

.  అతి నిద్రయు, నలసతయును,

చ్యుతి గొలిపెడి కోపము, భయ సోమరితనముల్,

క్షితి నాన్పుడు వీడగవలె

మతిమంతులు భూతిని గొను మతి గల్గినచో.

భావము. ఐశ్వర్యం కోరే వ్యక్తిఅతినిద్ర , అలసత, భయం, కోపం, సోమరితనం, సాగతీత ధోరణి అనే ఆరు దోషాలను వదలుకోవాలి.

శ్లో.  షడ్భిరూర్మిభిరయోగి యోగిహృద్

భావితం న కరణైర్విభావితమ్ |

బుద్ధ్యవేద్యమనవద్యమస్తి యద్

బ్రహ్మ తత్త్వమసి భావయాత్మని ॥(వివేకచూడామణి 256వ శ్లోకము)

తే.గీ.  ఘనషడంగములంటని, యనవరతము

యోగిధ్యానించునట్టిది,నింద్రియమ్ము

లెఱుఁగఁ జాలని,బుద్ధియునెఱుఁగలేని,

బ్రహ్మమీవేను, ధ్యానించు బ్రహ్మనరసి.

భావము.  క్షుద, తృష్ణ, శోకము, మోహము, జననము, మరణము యీ 6న్ను షడూర్ము లనంబడును. ఈ తరంగములచే తాకబడనిది; యోగి హృదయం ద్వారా ధ్యానించబడినది, కానీ ఇంద్రియ అవయవాలచే గ్రహించబడలేదు; బుద్ధి తెలుసుకోలేనిది; మరియు అపరిష్కృతమైనది అయిన ఆ బ్రాహ్మవు నీవు, నీ మనస్సులో దీనిని ధ్యానించు.

శ్లో. షోడశాబ్దాత్పరం పుత్రం,ద్వాదశాబ్దాత్పరం స్త్రియం
తాడయే దుష్టవాక్యైః, పీడయే న్న స్నుషాదికమ్. 
తే.గీ. పదియునారేండ్లు పైపడ్డ మృదుల సుతుని, 
పదియు రెండేండ్లు పైబడ్డ మధుర సుతను 
గౌరవంబుగ చూచుచు ఘనతఁ గనుఁడు. 
కోడలిని గను సుత వోలె. కులము మెచ్చ.
తే.గీ.  మిత్ర సముడు పదారేండ్ల పుత్రుడగును.
మాతృసమ పది రెండేండ్ల పుత్రికయును.
కొట్ట రాదిక వారిని తిట్ట రాదు.
కోడలిని,పర స్త్రీలనూ కొట్ట రాదు.

భావము. పదహారు సంవత్సరాల వయసున్న కుమారుని, పన్నెండు సంవత్సరాల కుమార్తెను దుష్టభాషణలతో దండింపకూడదు. కోడళ్ళు మొదలైనవారిని పీడింపరాదు. 

శ్లో. సంత ఏవ సతాం నిత్యం ఆపదుద్ధరణక్షమాః

గజానా పంకమగ్నానాం గజా ఏవ ధురంధరాః. 

తే.గీ.  మంచివారిని కాపాడ మంచివారె                                                                      

తగుదురిలలోన తెలియుడీ! ధరణి పైన 

బురదఁ జిక్కిన నేనుగున్ బురద నుండి 

కావ గలిగిదేనుగే ఘన తరముగ.

భావము. ఎల్లప్పుడూ సజ్జనుల ఆపదలను తొలగించటానికి సజ్జనులే సమర్థులు. బురదలో దిగబడిన ఏనుగునుఏనుగులే బయటకు లాగగలుగుతాయికదా. 

శ్లో. సంతస్తృణోత్సారణ ముత్తమాంగాత్ 
సువర్ణ కోట్యర్పణ మామనంతి
ప్రాణ వ్యయేనా உపి కృతోపకారాః
ఖలాః పరే వైర మివోద్వహంతి. 
. తలనున్న గడ్డి తీసిన 
తలతురు మేల్ చేసెనట్లు ధర్మాత్ములిలన్. 
వెలలేని మేలు పొందొయు 
తలపక, యపకృతిని చేయు దౌర్భాగ్యుడిలన్.
భావము. తమ తలపై నున్న గడ్డి పరకను ఎవరైనా తొలగించినంత మాత్రాన సత్పురుషులు దానిని గొప్ప సువర్ణ రాశి ఇచ్చినట్టుగా భావిస్తారు. ప్రాణాలకు తెగించి దుర్జనులకు ఉపకారం చేస్తే, వారు ఉపకారం చేసినవారి పట్ల విరోధభావం పెంచుకుంటారు. 

శ్లో:- సంతుష్టో భార్యయాభర్తా, భర్తా భార్యా తధైవచ,
యస్మిన్నేవ కులేనిత్యం కళ్యాణం తత్రవై ధృవం 
తే.గీ. భార్య భర్తను, భర్తయు భార్యనెపుడు
గౌరవంబుగ నేయింట గాంతు రట్టి
గృహము స్వర్గంబు భువిపైన, కేళిసల్పు
నట్టి గృహమున శుభలక్ష్మి పట్టుపట్టి. 
భావము.  యింటిలో భార్యా భర్తలు పరస్పరం ఒకరినొకరు గౌరవించుకొంటూ, ప్రేమానురాగాలతో సంతుష్టులుగా ఉంటారో యిల్లు నిత్య కల్యాణం, పచ్చ తోరణంగా విలసిల్లును.

శ్లో. సంతోషస్త్రిషు కర్తవ్యః స్వదారే భోజనే ధనే 
త్రిషుచైవ కర్తవ్యోధ్యయనే జపదానయోః
.వె.  భార్య విషయమందు, వంటకంబులయందు, 
ధనమునందు తృప్తి మనకు తగును.
చదువు, దాన, జపములఁ దనియ కుండుట
మేలు కూర్చు మనకు శ్రీలు కూర్చు.
ఆ.వె.  భార్య - భుక్తి - ధనము ప్రాప్తించునవి గాంచి

సంతసింప వలయు సమ్మతించి.

తపము - దాన - పఠన తాదాత్మ్యు లయ్యును

సంతసింప రాదు సరస మతులు.

.వె.  తనివి నొంద వలయు ధరపైన తనదగు
భార్య, భుక్తి, ధనము, భవ్యమనుచు.
తనివినొంద తగదు తానుగా చేసెడి
భవ్య దాన, తపము, పాఠనముల.

భావము.తనభార్య,భోజనము,ధనము అనే మూడిటియందు సంతుష్టి ఉండాలి. అధ్యయనం, జపం, దానం అనే 
మూడిటియందు మాత్రం ఉండకూడదు!

శ్లో. సంరోహత్యగ్నినా దగ్ధం వనం పరశునా హతం 
వాచా దురుక్తం బీభత్సం సంరోహతి వాక్ క్షతం.

తే.గీ.  పరశు ఛేదితమయ్యును వనము పెరుగు.

అగ్ని దగ్ధపుటడవులునమరు మరల

దుష్టవాక్కులు కలిగించు కష్టమునకు

మనసు విరుగును హతమౌనుమనుజులకును.

భావము. అగ్నిచే దహింపబడిన , లేదా గొడ్డలిచే నరకబడిన అడవి కొంతకాలానికి క్రమంగా మళ్ళీ చిగురిస్తుందికానీ కఠినమైన,అనుచితమైన మాటలచే దెబ్బతిన్న మనస్సు కుదుటపడదు.

శ్లో.  సంసార విష వృక్షస్య ద్వే ఫలే అమృతోపమా.

కావ్యామృత రసాస్వాదః, సంగమ స్సజ్జనై స్సహ.

తే.గీ. అరయ సంసార విష వృక్షమందు రెండు

ఫలము లమృ తోపమము లుండె, భవ్యమైన

కావ్య సుధఁ గ్రోలు టొక్కటి, ఘనతఁ గన్న

సజ్జనులతోడి సన్మైత్రి సలుపు టొకటి.

భావము. సంసారమనే యీ విష వృక్షమునకు అమృతోపమైన ఫలములు రెండే రెండు కలవు. ఒకటి కావ్యామృత రసాస్వాదనము, రెండు సజ్జన సాంగత్యము.

శ్లో.  సంహతిః శ్రేయసీ పుంసాం స్వకులైరల్పకైరపి 
తుషేణాపి పరిత్యక్తః తండులో ప్రరోహతి . 
తే.గీ. అల్పులైనను తనవారి అండ నుండి 
వృద్ధి చెందును సుజ్ఞాని పృథివి పైన. 
అల్ప,మైనట్టి ఊకయందమరకుండ 
తండులంబెటు మొల్చును? ధర్మ మిదియె.
భావము. తనవారు అల్పులైనా సరే , వారితో కలిసి ఉన్నవాడే శ్రేయస్సును పొందగల్గుతాడు. పొట్టు (ఊక) అల్పమైనదే.కానీ అది లేకుండా వడ్లగింజ మొలకెత్తదు కదా !

శ్లో. సతాం ధనం సాధుభి రేవ భుజ్యతే
దురాత్మభి ర్దుశ్చరితాత్మనాం ధనం
శుకాదయ శ్చూతఫలాని భుంజతే 
భవంతి నింబాః ఖలు కాక భోజనాః. 
.వె.  మంచి వారి ధనము మంచి వారికి చెందు, 
చెడ్డ వారి ధనము చెడుగుఁ జెందు. 
ఆమ్రఫలము చిలుక లారగించుచునుండు. 
కాకి వేప పండ్లె గతుకుచుండు.
తే.గీ.  మంచిగలవారి సంపద మంచి వారి;
చెడ్డ గలవారి సంపద చెడ్డ వారి;
యనుభవంబగు. చిలుకకు నమర ఫలము
కాకికిని నింబ ఫలమును; గలుగు తినగ.

భావము. సజ్జనుల సంపద సజ్జనులకే భుక్తమౌతుంది. దుర్జనుల సంపద దుర్జనులకే లభిస్తుంది. మామిడి పండ్లను చిలుకలు, వేప పండ్లను కాకులు భుజిస్తాయికదా! 

శ్లో. సత్యం తపో జ్ఞానమహింసతా ,-  విద్వత్ప్రణామం సుశీలతా చ 

ఏతాని యో ధారయతి విద్వాన్ , కేవలం యః పఠతే విద్వాన్ .
తే.గీ. సత్య తపములు, జ్ఞానమ్ము, సత్ప్రశంస, 
వినయ విద్వాంసమన్నన విజ్ఞతయును, 
శీల సంపత్తి, గల యట్టి మేలి మగడె 
విబుధుఁడనఁ జెల్లు. నితరులు విబుధ భృవులె.
భావము. సత్యము, తపస్సు, జ్ఞానము, అహింస, విద్వాంసులకు వినయంతో నమస్కరించటం, స్వచ్ఛమైన శీలము ఎవనికి ఉంటాయో అతడే విద్వాంసుడు. కేవలం చదువుకున్నవాడు విద్వాంసుడు కాడు. 

శ్లో.  సత్యపిచ సుకృత కర్మణి
దుర్నీతిశ్చే చ్ఛ్రియం హరత్యేవ
తైలైః సదోపయుక్తానాం
దీప శిఖాం విదళయతి హి వాతాళిః .
తే.గీ.  పుణ్య కర్మలు చేసెడి పురుషునకును
దుష్టుడగునేని శ్రీలెల్ల నష్ట మగును.
తైల మెంతగా నున్నను దీప కళిక
నార్పి వేయును సుడిగాలి యరసి చూడ.

భావము.   ఎంత తైలము వున్నప్పటికీ దీపమును సుడిగాలి ఆర్పివేయు విధముగా మనుజునిలో దుస్స్వభావములు, దుశ్చేష్టలు ఉన్నచో అట్టి వాడు ఎన్ని పుణ్య కార్యములు చేయుచుండువాడైననూ వాని శ్రీలెల్ల హరించుకుపోవుట తథ్యము .

01.  సత్యం వద.  -   ధర్మం చర.  -  స్వాధ్యాయాన్మా ప్రమదః

.  సత్యము పలుకుత. ధర్మము

నిత్యము పచరించుగాత. నిర్మల మతితో

స్థుత్యపు స్వాధ్యాయమునౌ

న్నత్యముతో గనుత విడక. నరులున్నతికై

భావము.   నరులు సత్యమును పలుకుదురు గాక.  ధర్మమును అనుష్టింతురు గాక.  స్వాధ్యాయము నేమఱకుందురు గాక.  ఔన్నత్యమును పొందుదురు గాక.
02. 
ఆచార్యాయ ప్రియం ధనం ఆహృత్య ప్రజా తంతుం మా వ్యవచ్ఛేత్సీః .

సత్యాన్న ప్రమదితవ్యం.  -  ధర్మాన్నప్ర,మదితవ్యం.

.  గురునకు ప్రియ ధన మొసగిన

తరువాతనె వంశవర్ధ తనయుల గనుతన్.

సు రుచిర సత్యము మఱువక

స్థిరమగు ధర్మంబువిడక తేజము గనుతన్.

భావము.   గురువునకు ప్రియమగు ధన మార్జించి యిచ్చిన పిమ్మట వంశము నిలుపుటకై సత్ సంతానమును బడయ నగును.
సత్యమార్గము నేమఱకూడదు. ధర్మ మార్గమును వీడ రాదు.

03.  కుశలాన్నప్రమదితవ్యం.  -  భూత్యైనప్రమదితవ్యం.

స్వాధ్యాయ ప్రవచనాభ్యాం నప్రమదితవ్యం.

తే.గీ.  కుశల, కల్యాణ కర్మల, కోరుకొను స

మృద్ధి, స్వాధ్యాయ ప్రవచన వృద్ధి యెడ ప్ర

మాద మనునది నొందక మసలు గాత.

మానవులు భువిపైన తా మనుత సతము.

భావము.   కుశలము నుండి, కల్యాణ కర్మల నుండి, సమృద్ధి నుండి, స్వాధ్యాయ ప్రవచనముల నుండి, ప్రమాదమునొంద కుందురు గాక.

04.   దేవ పితృ కార్యాభ్యాం నప్రమదితవ్యం. 

మాతృ దేవో భవ.  -  పితృదేవో భవ.
ఆచార్య దేవో భవ.  -  అతిథి దేవో భవ.
తే.గీ.   దేవ పితరుల కార్యముల్ దీక్ష జేసి,
తల్లి దండ్రియు, గురువును దైవమనగ
అరసి, యతిథి దైవము గాంచి యాదరించి,
జ్ఞాన మొప్పగ నడచుత! మానవుండు.
భావము.  దేవ పితృ కార్యములను విడువ కుందురు గాక.
తల్లిని, తండ్రిని, గురువును, దైవముగా భావింతురు గాక.
అతిథిని దైవముగా భావించి గౌరవింతురు గాక.
05.  యాన్యనవద్యాని కర్మాణి తాని సేవితవ్యాని, నో ఇతరాణి.
యాన్యస్మాకగ్ సుచరితాని తాని త్వయోపాస్యాని, నో ఇతరాణి.
తే.గీ.   నింద్య కర్మలు విడిచి, యనింద్యములను
చేయు గావుత! మాయందు చేయ దగిన
వేవి సత్కర్మలుండెనో నీవు కూడ
చేయ దగినవి. తప్పులు చేయ రాదు.
భావము.   అనింద్య కర్మ లేవి కలవో వాటినే అచరింతురు గాక. నింద్య కర్మలు ఆచరింప కుందురు గాక. ఆర్యులు ఆచరించిన సత్ కర్మ లేవి యుండునో వాటినే ఆచరింతురు గాక. ఇతరములగు నింద్య కర్మలు విడిచి పెట్టుదురు గాక.
06.  ఏకేచాస్మ చ్ఛ్రేయాగ్ సో బ్రాహ్మణాః తేషాం త్వయాసనేన ప్రశ్వసితవ్యం.
.  మన శ్రేయము వాంఛించెడి
గుణ మణులగు బ్రాహ్మణులను కూరిమితోడన్
మనమాదరించి సద్ బో
ధనలను గ్రహియింపనగును. ధర్మంబిదియే.
భావము.  సత్ పురుషులు ఎవరు మనకు శ్రేయస్కాములో వారిని సుఖాసీనులను జేసి,
సేద తీర్చి వారి బోధనల సారమును గ్రహింతురు గాక.
07.  శ్రద్ధయా దేయం.. అశ్రద్ధయా z దేయం.
శ్రియా దేయం. హ్రియా దేయం.
భియా దేయం. సంవిదా దేయం.
.  ఈయగ వలయును శ్రద్ధగ,
ఈయగ తగు హెచ్చుగాను. యించుకెయనుచున్
ఈయగ వలయును సిగ్గున.
ఈయగ తగు భయముతోడ. నిచ్చెడి వేళన్.
భావము.  గురువులకు ఏదైనా సమర్పించు నపుడు శ్రద్ధతో ఈయవలెను. అశ్రద్ధతో నీయ రాదు.  హెచ్చుగా ఈయలేదని సిగ్గుతో ఈయవలెను..  భయముతో ఈయవలెను.  సంపదకు తగినట్లుగా ఈయవలెను.
08. అథ యది తే కర్మ విచికిత్సా వా వృత్తి చికిత్సా వా స్యాత్ అథా భ్యాఖ్యాతేషు యే తత్ర బ్రాహ్మణాః సమ్మర్శినః యుక్తా అయుక్తాః అలూక్షాః ధర్మ కామాః స్యుః యథా తే తేషు వర్తేరన్ తథా తేషు వర్తేథాః
తే.గీ.  ధర్మ సందేహ మొందిన తఱిని మనకు
ధర్మ సుజ్ఞాన గణులు, సత్ కర్మ పరులు
ధర్మ కర్ములు సౌమ్యులు దార్శనికులు.
వారు చూపిన మార్గముల్ వలయు నెపుడు.
భావము.  ధర్మ సంశయము కలిగినప్పుడు ధర్మాధర్మ నిర్ణయ సమర్థులు, ఆచార్య పురుషులు, కర్మ స్వతంత్రులు, పరమ సౌమ్యులు, ధర్మ కాములు అగు మహానుభావు లెట్లాచరించిరో ఆయా సందర్భములలో అట్లే ఆచరింప తగును.
09. 
ఏష ఆదేశః
ఏష ఉపదేశః
ఏషా వేదోపనిషత్
ఏతదనుశాసనం
ఏవ ముపాసితవ్యం.
ఏవ ముచైతదుపాస్యం.
. చెప్పిన దాదేశము
చెప్పిన మాట నిక్క మిది యుపదేశం
బీ చెప్పినయది వేదము.
చెప్పుట శాసనంబు నెఱుగుచు నడుమా!
భావము.  పైన చెప్పినదే ఆదేశము.
ఇదే ఉపదేశము, ఇదే వేద రహస్యము. ఇదే ఈశ్వరానుశాసనము. దీనిని ఆచరింతురు గాక. ఇదే ఆచరణీయము.

మంత్రము. 
సత్యమేవ జయతే నానృతమ్
సత్యేన పంథా వితతో దేవయానః
యేనాక్రమాంత్యా ఋషయోహ్యాప్తాకామా
యాత్ర తత్సత్యస్య పరమం నిధానమ్. (ముండకోపనిషత్ 3.1.6)
. సత్యమె జయమును పొందున
సత్యము జయమొందఁబోదు.సత్య సుమార్గౌ
న్నత్యము దివ్యులెఱుకయి,
సత్య పథంబున శుభంబు సతతము కోరున్
భావము. సత్యమే జయిస్తుంది, అసత్యం కాదు. సత్యం ద్వారా దివ్య (దేవ)మార్గం అవగతమౌతుంది. మార్గంలోనే ఋషులు తమ అభీష్టాలను వెరనేర్చుకొని పరమ నిధానాన్ని చేరుకోగలిగారు.

శ్లో.  సంతోషక్షతయే పుంసా - మాకస్మిక ధనాగమః

సరసాం సేతుభేదాయ  - వరషౌఘః స్థిరః ౹౹        

తే.గీ. అధిక ధనమకస్మాత్తుగా నమరెనేని

యున్నసంతోషమును మాపునన్న నిజము,

కోరకుండనే వర్షంబు కుండపోత

పడినచో గట్లుతెగిగొట్టి పాడుచేయు.

భావము.  అకస్మాత్తుగా మనిషికి ధనం వస్తే సంతోషం దూరం అవుతుంది. అలాగే నిరీక్షణ చేయకుండా వచ్చే వాన ప్రవాహము చెరువు గట్టులను పడగొడతాయి..అలాంటివి ఎప్పుడూ స్థిరం కాదు.

శ్లో.  సంపూర్ణకుంభో కరోతి శబ్దం

అర్ధోఘటో ఘోషముపైతినూనం

విద్వాన్కులీనో కరోతి గర్వం

జల్పంతి మూఢాస్తు గుణైర్విహీనాః ౹౹

తే.గీ.  సగము నిండిన కుండ తా సలుపు ధ్వనిని,

నిండుకుం డట్లు చేయదు, నిరుపమాన

పండితుఁడునట్లె వ్యర్థముల్ పలుకఁ బోడు,

పలుకు మూఢుండు గుణహీనుఁడల్పుఁడెపుడు.

భావము. సంపూర్ణంగా నిండిన కుండ చప్పుడు చెయ్యదు.అర్ధ నిండిన కుండ నిజంగా చప్పుడు చేస్తుంది.అలాగే,మేధావి అయిన విద్వాంసుడు ఎప్పుడూ గర్వము పొందడు.అయితే,సద్గుణులు కాని మూఢులు తమకు ఇష్టమైనట్టుగా మాట్లాడుతారు.

 

శ్లో.  సంరోహత్యగ్నినా దగ్ధం   -  వనం పరశునా హతం౹

వాచా దురుక్తం బీభత్సం   -  సంరోహతి వాక్ క్షతం౹౹

తే.గీ.  భూజమును కాల్చ, నరికినన్,  మ్రోడు మరల

చిగురు పెట్టును, చెడుపల్కు చిత్తమునకు

హత్తుకొనినచో విరుగు, తా నతుకుకొనదు,

మాటలన్ గొల్పుమానందమార్గమిలను.

భావము.  అగ్నిచే దహింపబడిన , లేదా గొడ్డలిచే నరకబడిన అడవి కొంతకాలానికి క్రమంగా మళ్ళీ చిగురిస్తుంది. కానీ? కఠినమైన, అనుచితమైన మాటలచే దెబ్బతిన్న మనస్సు కుదుటపడదు.

శ్లో.  సంసార వర్ధకం కర్మ  -   తన్నివృత్యై కల్పతేl

హి పఙ్కస్య పఙ్కేన  -  నివృత్తిరవలోక్యతేll

(మహావాక్య దర్పణమ్ శ్రీ ఆదిశంకరాచార్యులు)

తే.గీ.  కర్మ తాపత్రయముఁ బెంచు, మర్మమిదియె,

కర్మలను కాల్పఁ జాలదు కర్మయెపుడు,

బురదబురదను కడగదు, బుద్ధినెఱిఁగి

కర్మబంధ పంకము వీడఁ గలుగు సుఖము.

భావము. కర్మలు సంసార తాపత్రయాన్ని వృద్ధి చేస్తాయే కానీ నివర్తింపజేయలేవుకదా. బురదని బురద కడగలేదు కదా!

శ్లో.  సజ్జనా ఏవ సాధూనాం - ప్రథయంతి గుణోత్కరం

పుష్పాణాం సౌరభం ప్రాయ - స్త నుతే దిక్షు మారుతం ౹౹ 

తే.గీ.  సజ్జనులు సాధు సంతులు సరసమతులు,

గుణములను వ్యాప్తి చేసెడి ఘనులు చూడ,  

పంచు  పూ వాసనల్  గాలి వరల దిశల

మంచివారలన్ గాలిగా నెంచవచ్చు.   

భావము.  సజ్జనులు సాధు సంతుల పెద్దరికాన్ని ప్రచారం చేస్తారు.

పువ్వుల సుగంధాన్ని గాలి మాత్రమే అన్నిపక్కలకు వ్యాపింపజేస్తుంది.

గాలికి సజ్జనులకు ఇక్కడ పోలిక ఉంది.సజ్జనులు గాలిలా 

సత్కార్యాలు చేయడములో ఎప్పుడూ ములిగివుంటారు.

శ్లో.  సజ్జనా ఏవ సాధూనాం - ప్రథయంతి గుణోత్కరం

పుష్పాణాం సౌరభం ప్రాయ - స్త నుతే దిక్షు మారుతం ౹౹ 

తే.గీ.  సజ్జనులు సాధు సంతులు సరసమతులు,

గుణములను వ్యాప్తి చేసెడి ఘనులు చూడ,  

పంచు  పూ వాసనల్  గాలి వరల దిశల

మంచివారలన్ గాలిగా నెంచవచ్చు.   

భావము.  సజ్జనులు సాధు సంతుల పెద్దరికాన్ని ప్రచారం చేస్తారు. పువ్వుల సుగంధాన్ని గాలి మాత్రమే అన్నిపక్కలకు వ్యాపింపజేస్తుంది.

గాలికి సజ్జనులకు ఇక్కడ పోలిక ఉంది.సజ్జనులు గాలిలా  సత్కార్యాలు చేయడములో ఎప్పుడూ ములిగివుంటారు.

శ్లో.  సత్యం భ్రూయాత్, ప్రియం భ్రూయాత్  - నభ్రూయాత్ సత్యమప్రియం
ప్రియోపి నానృతం భ్రూయాత్ - ఏష ధర్మస్సనాతనః.
తే.గీ.  సత్యమును పల్క వచ్చును సరస మతిని.
ప్రియము పల్కగ వచ్చును ప్రీతి తోడ.
బాధ కలిగించు సత్యము పలుక తగదు.
ప్రియము గొలుప నసత్యము ప్రేల రాదు.
భావము. ఆహా ఎంత చక్కగా చెప్పబడింది. మనము చక్కగా సత్యమును పలుక వచ్చునట. ఆందరికీ ప్రియము గొలుపు విధముగానూ మాటాడ వచ్చునట. ఐతే మనము పలికేది సత్యమైనప్పటికీ అది ఎవరికయినా బాధ కలిగించేదయినట్లయితే అటువంటి సత్యమును పలుక కూడదట. ఇతరులకు ప్రీతి కలిగించుటకొరకని అసత్యమును మాత్రము పలుక రాదట. ఎంత చక్కగా వుంది దీనిలోని భావన. దీనిని బట్టి మనకర్థమయింది కదా ఎప్పుడు, ఎలా మాటాడాలో. అలాగే చేద్దామా మరి?

శ్లో.  సత్యం మాతా పితా జ్ఞానం - ధర్మోభ్రాతా దయా సఖాI

శాంతి: పత్నీ క్షమా పుత్రా: - షడైతే మమ బాంధవా:II

తే.గీ.  సత్యమే తల్లి యగు నాకు, శాంతి భార్య,

ధర్మమే భ్రాత, జ్ఞానంబు తండ్రి యగును,

క్షమయె సుతుఁడగును, దయయె కనగ హితుఁడు, 

పరగు నీయారుగురె నాదు బంధుకోటి. 

భావము: సత్యమే తల్లి, జ్ఞానమే తండ్రి, ధర్మమే సోదరుడు, దయయే స్నేహితుడు, శాంతియే భార్య, ఓర్పే పుత్రుడు. ఆరుగురు మానవునకు నిజమైన బంధువులు.

శ్లో.  సత్యమేవ జాయతే నాఽనృతః - సత్యేన పంథా వితతో దేవయానః 

యేనాక్రమన్త్యృషయో హ్యప్తకామా - యత్ర తత్ సత్యస్యా పరమం నిధానమ్.

తే.గీ.  సత్యమేజయించును కాదసత్యమెపుడు,

దేవమార్గము పెరుగును దీని వలన,

తీరు కోరికల్ దీనిచే, దివ్యమునులు,

దీనిచే ముక్తిఁ గనుదురు తృప్తిఁబడసి.

భావము. "సత్యం మాత్రమే విజయం సాధిస్తుంది, అసత్యం కాదు. సత్యం ద్వారా, దైవిక మార్గం విస్తరించబడింది, దీని ద్వారా కోరికలు పూర్తిగా నెరవేరిన ఋషులు అంతిమ సత్యం యొక్క మూలాన్ని చేరుకుంటారు."

శ్లో.  సత్యమేవేశ్వరో లోకే - సత్యే ధర్మాః సదాశ్రితాః

సత్య మూలాని సర్వాణి - సత్యాన్నాస్తి పరం పదమ్.

తే.గీ.  సత్యమేదైవమీసృష్టి, నిత్యమిదియె,

సత్యమున జేరు ధర్మముల్, శాశ్వతముగ,

సత్యమే మూలమన్నైంట, సరస హృదయ!

సత్యమును మించి లేవయ్య! సత్యపాల!

భావము.  లోకంలో సత్యమే భగవంతుడు. సత్యాన్ని ధర్మాలు అన్నీ ఎల్ల వేళలా ఆశ్రయించుకుని ఉంటాయి. సత్యమే అన్నిటికీ మూలం. సత్యాన్ని మించినది ఏమీ లేదు.

శ్లో.  సత్యాను సారిణీ లక్ష్మీ - కీర్తి: త్యాగానుసారిణీ

అభ్యాసాను సారిణీ విద్యా - బుద్ధి: కర్మాను సారిణీ.

తే.గీ. లక్ష్మి సత్యానుసారిణి. లక్ష్మి లౌల్య. 

కీర్తి త్యాగానుసారిణి. క్షేమకరము. 

విద్య లభ్యాస ఫలములు ప్రీతి కరము.

బుద్ధి కర్మానుసారిణి పుడమిపైన.

భావము.  లక్ష్మి నిత్యం సత్యాన్ని అనుసరించి ఉంటుంది. త్యాగాన్ని అనుసరించి కీర్తి ఉంటుంది. ఎంతగా అభ్యాసం చేస్తే అంతగా విద్య పట్టువడుతుంది. మానవ బుద్ధి వారి కర్మను అనుసరించి ఉంటుంది. వాడి కర్మ ఎలా రాసి పెట్టి ఉంటే అలా జరుగుతుంది.

శ్లో. సదాచారేణ సర్వేషాం  -  శుద్ధం భవతి మానసం!

నిర్మలం విశుద్ధం మానసం దేవమందిరమ్!!

తే.గీ.  వర సదాచారమున మదిన్ వరలు శుద్ధి,

నిర్మలంబైన శుద్ధమౌ మర్మదూర

మనసె దైవంబునకు గొప్ప మందిరంబు,

అట్టి మనసిచ్చు దైవమే పట్టుపట్ట.

భావము. సత్ప్రవర్తనతో అందరికీ మనస్సు పరిశుద్ధమౌతుంది.... 

నిర్మలము, పరిశుద్ధమూ అయిన మనస్సే దేవమందిరం. 

శ్లో. సముద్ర మదనే లాభే  హరిర్లక్ష్మీం హరో విషం

భాగ్యం ఫలతి సర్వత్ర విద్యా పౌరుషం. 

.వె.  జలధి మథన వేళ జనియించి వరలక్ష్మి

హరిని చేరె, విషము హరుని చేరె. 

భాగ్యఫలమె దక్కు. పౌరుష, విద్యలు

పనికిరావు భాగ్య ఫలము ముందు.

భావము.  సముద్రమును మథించినప్పుడు విష్ణువు లక్ష్మిని పొందాడు, శివుడు విషాన్ని పొందాడు. కాబట్టి ఎక్కడైనా అదృష్టమే ఫలిస్తోంది, విద్య కాని పౌరుషం కాని కాదు. 

శ్లో.  సర్పః క్రూరః ఖలః క్రూరః  -  సర్పాత్క్రూరతరః ఖలః

మంత్రేణ శామ్యతే సర్పః   -  నఖలః శామ్యతే కదా!

తే.గీ.  క్రూరుఁడెన్నగ ఖలుఁడిల, క్రూర మహియు,

మంత్రమున లొంగిపోవును మహిని పాము,

ఖలుఁడు లొంగడేవిధినైన కఁలతఁ బెట్టు,

ఖలుఁడుగా నుండఁబోకుము వెలుగుము ధర.

భావము.  సర్పము క్రూరమైనది. ఖలుఁడునూ క్రూరమైనవాఁడే. కాని సర్పము కంటే ఖలుఁడే క్రూరతరుఁడు. ఎందుకనగా, మంత్రముతో సర్పము శాంతించును. ఖలుఁడు (దుష్టుడు) విధముగనూ శాంతింపడు.

 

శ్లో.  సర్వః సర్వం జానాతి  -  సర్వజ్ఞో నాస్తి కశ్చన |

నైకత్ర పరినిష్ఠాస్తి  -  జ్ఞానస్య పురుషే క్వచిత్ ||

తే.గీ.  అందరన్నియునెఱుఁగ రీ యఖిల జగతి,  

కనగ సర్వజ్ఞులుండరు కద ధరిత్రి, 

యెక్కడైనను పరికింప నొక్క పురుషు

నందె సుజ్ఞానముండ దహంబు తగదు.

భావము.  అందరూ అన్నింటినీ తెలుసుకొనివుండరు. ఎవరూ సర్వజ్ఞుడు కాడు. ఎక్కడా ఒక మనిషిలోనే జ్ఞానంయొక్క పరిపూర్ణమైన నిష్ఠ ఉండదు.

శ్లో. “సర్వథా వ్యవహర్తవ్యం  - కుతో హ్యవచనీయతా |
యథా స్త్రీణాం తథా వాచాం - సాధుత్వే దుర్జనో జనః ||(.రా..)
తే.గీ. స్త్రీలు మృదువుగా పలుకుచో బేలలంచు
లోకువగచూతురెల్లరున్ లోకమునను.
కర్కశులయెడ కఠినవైఖరిని మెలగి
తమను తామె కాపాడుకో తగును స్త్రీలు. 
భావము.  స్త్రీలు మృదుప్రవర్తన కలిగి, మెత్తగా మాట్లాడితే సాధారణమానవులైనా దౌష్ట్యం ప్రదర్శిస్తారు. అందువలన లోకంలో స్త్రీలు కాఠిన్యం వహించి ప్రవర్తించడం మేలుచేస్తుంది.  

శ్లో.  సర్వపాపాని వేం ప్రాహుః - కటస్తద్దాహ ఉచ్యతే |

తస్మాద్ వేంకటశైలోఽయం - లోకే ఖ్యాతిం గమిష్యతి ||

(పారమాత్మికోపనిషత్ వ్యాఖ్యా)

తే.గీ. పాపజాలంబు వేం మని పరఁగు, కట

నంగ నశియింపఁ జేయుట, నరుల యఘము

పాపునది కాన వేంకట పర్వత మది

వేంకటాచల మని యొప్పె, విశ్వమునను. 

భావము.  సకల పాపాలు కలిసి "వేం" అవుతుంది. వాటిని కాల్చివేయడమే "కట". అలా పాపాలను కాల్చివేసే పర్వతమే వేంకటాచలం. ఇది అన్ని పాపాలను దహనం చేస్తుంది అనియే దానికి ప్రాశస్త్యం ఉంది. అలాగనే పేరు లోకంలో ప్రసిద్ధి చెందింది.

శ్లో. సర్వా ఏవాపద స్తస్య  - యస్య తుష్టం మానసమ్ !
సర్వాః సమ్పత్తయ స్తస్య  - సన్తుష్టం యస్య మానసమ్ !!
.వె. ఎచట తృప్తి లేదొ యచటయాపదలుండు.
ఎచట తృప్తి యుండునచట ధనము
సంపదలవియెల్ల చక్కగా నుండును.
తృప్తుఁడిలను సుఖము తేజమొందు.                                                                                                                                                                                                                    .వె.   తృప్తి లేకయున్న ప్రాప్తించునశుభముల్.
తృప్తి యున్న వర శుభాప్తి మనకు.
తృప్తి విడిచి దుఃఖ తీరంబు గననేల?
తృప్తితోడ మెలగు జ్ఞప్తిఁ గలిగి.                                                                                                    

భావము. సంతృప్తి జీవితంలో అతి ముఖ్యమైన విషయం. సంతృప్తి లేని వాడ కి లేదా అత్యాశ వున్నవాడికి సర్వాఏవాపద అంటే ప్రతీ విషయమూ ఆపదలాగానే కనిపిస్తుందిట. అదే ఎవరి మనస్సు సంతోషంగా తృప్తి గా వుంటుందో వారికి సర్వాః సంపత్తయ అంటే అన్నీ సంపదలే. తృప్తి గా జీవించగలిగినవాడే జ్ఞాని.

శ్లో:-సర్వే సుఖినస్సంతు. - సర్వే సంతు నిరామయాః
సర్వే భద్రాణి పశ్యంతు - మా కశ్చిత్ దుఃఖ భాగ్ భవేత్.
.  లోకులు సుఖముగ నుండుత.
లోకులు రోగములు లేక లొంగక నిలుతన్.
లోకులు మంగళ మొందుత.
లోకులు దుఃఖములు లేక డుంకక నిలుతన్.
భావము.  లోకమంతటా యెల్లరూ సుఖముగా ఉందురు గాక. ఎల్లరునూ రోగములు లేనివారై యుందురు గాక.
అందరునూ కల్యాణములనే చూచెదరు గాక. ఏఒక్కరూ దుఃఖము పొందకుందురు గాక.

శ్లో.  సహసా విదధీత నక్రియాం.అవివేకః పరమాపదాం పదం
వృణుతేహి విమృశ్య కారిణం గుణ లుబ్థాః స్వయమేవ సంపదః
కం.  తొందర పడి యే పనియును
మందుని వలె చేయ తగదు. మహదాపద యౌన్.
ముందుగ నౌగాములరయు
సుందరుఁ గని చేరు లక్ష్మి శోభిలఁ జేయన్
భావము.  పనినీ తొందర పడి చేయ కూడదు. తొందరపాటు; అవివేకము; అన్ని ఆపదలకూ మూలము. సవిమర్శముగా గాములాలోచించి పని చేయు వానిని గుణ లుద్థయై లక్ష్మి స్వయముగానే కోరి వరించును కదా!

శ్లో.   సాంకేత్యం పారిహాస్యం వా స్తోభం హేలనమేవ వా
వైకుంఠనామ గ్రహణ మశేషాఘహరం విదు: (భాగవతము 6-2-14)
తే.గీ.  ఐహికంబుల కాశించి హరిని పలుక,
హేళనముఁ జేయ నితరుల పలుక హరిని,
గానమును చేయ, నశ్రద్ధగా హరి యన
అట్టి వారల పాపాళి యిట్టె పోవు.
భావము.  ప్రాపంచిక ఫలితములనాశించి గాని ఇతరులను హేళన చేయు ఉద్దేశ్యముతో గాని, గానము చేయవలెనని గాని, ఆశ్రద్ధతో గాని వైకుంఠుని నామమును ఎవరు ఆశ్రయించుదురో, వారి అశేష పాపములు హరింపబడును.  ఈ విషయమును శాస్త్రవేత్తలగు భాగవతోత్తములు తెలిసికొని ఉన్నారు. 

శ్లో. సాక్షరా విపరీతాశ్చేత్  - రాక్షసా యేవ కేవలం.
సరసో విపరీతో2పి - సరసత్వం నముంచతి.
తే.గీ. సాక్షరాశ్యులు శృతి మించి రాక్షసాన
వెనుక మార్గము పట్టుట కనగ నుండె.
సరస వర్తులు సతతము సరసులుగనె
యుండు చూచిన. కనుడిది నిండు మదిని.

భావము.  సాక్షరాశ్యులు = అక్షర జ్ఞానము కలవారు = విద్యా వంతులు అని మనం గ్రహించినట్లయితే అట్టి వారు తమజ్ఞానాన్ని సద్వినియోగం చేస్తే సమాజానికి చాలా మేలు జరుగు తుందనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఐతే అక్షరాశ్యులే తమ విపరీతమయిన తెలివినుపయోగించుకొని విపరీత పోకడలతో ప్రవర్తించినట్లయితే అది సమాజానికి ఎనలేని కీడు కలిగిస్తుందనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఒక్క మాటలో చెప్పాలంటే వారు రాక్షసులే.
దీనినే కవి చమత్కరించి " సాక్షరా " తిరగ బడితే అంటే వెనుకనుండి చదివినట్లయితే 
 " 
రాక్షసా " { సాక్షరా ; =  రాక్షసా } అని అవుతుందని చమత్కరించడం ఒక ఎత్తయితే,
సరస హృదయులు ఎప్పుడూ స్థిర స్వభావులుగా వుంటారని చెప్పడంలో మరో చమత్కారాన్ని కనబరచడం జరిగింది. గమనించండి. " సరస  = సరస " ఏవిధముగ చూచినను, ఏవిధముగ వెనుకనుండి ముందుకైనా, ముందు నుండి వెనుకకైనా చదివిననూ మార్పు వుండదు. సరసుడయిన వాని స్థిర స్వభావం అటువంటిది.అని చెప్పడం మరొకెత్తు.

శ్లో.  సాధవో యాదృశా లోకే - సాగరాశ్చ తాదృశాః |

సాధవో యాంతి మర్యాదాం - యుగాంతేఽపి సాగరాః ||(వ్యాస సుభాషితం)

తే.గీ.  సాధువులవోలెనుండవు సాగరములు,

ప్రళయమందైన లోకాన కలతపడుచు

హద్దుమీరరు సాధువుల్, హద్దుమీరు

సాగరంబులు లోకాన శ్రీగణేశ!

భావము.  ప్రపంచములో సాధువులున్నట్లు సాగరములు ఉండవు. ప్రళయకాలములోనూ సాధువులు మర్యాదను మీరి వర్తించరు. అయితే సాగరాలు మీరుతాయి.

శ్లో. సాధురేవార్థిభిర్యాచ్యః క్షీణవిత్తోஉపి సర్వదా 
శుష్కోஉపి హి నదీమార్గః ఖన్యతే సలిలార్థిభిః. 
తే.గీ. సంపదంతయు వ్యయమయ్యు సజ్జనుండు 
కోరఁ బడుచునుండర్థిచే. నీర మిచ్చు 
నదులు భువి నెండిపోయినన్ వదలరు కద 
చెలమలను త్రవ్వుచుందురు సలిలములకు.
భావము. తమ సంపదలను తాము కోల్పోయినా, సజ్జనులు అర్థులచే ఎల్లప్పుడూ యాచింపబడుతూనే ఉంటారు. నది ఎండిపోయినా, జలార్థులు నదీ మార్గాన్నే నీటికోసం త్రవ్వుతూ ఉంటారుకదా. 

శ్లో. సాధుసజ్జనసాంగత్యం - సంతోషం సత్ప్రవర్తనం,
సద్బుద్ధిం సద్విచారాంశ్ఛ  - దేహి మే మధుసూదన !
తే.గీ. సాధు సజ్జన సంగతి సతతమిమ్ము.
సత్ప్రవృత్తి సంతోష సంచయములిమ్ము.
సద్విచారము సద్బుద్ధి సరిగనిమ్ము.
నాకునొసగుము దైవమా! శ్రీకరముగ.
భావము. మధుసూదనా! నాకు సాధుస్వభావముండేవారితోను, మంచి ప్రవర్తన గలవారితోను సాంగత్యమును కలుగజేయుము. నిరతము సంతోషముతో మంచి ప్రవర్తనతో ఉండునట్లు చేయ్ము. మంచి బుద్ధిని మంచి ఆలోచనలను నాకు ప్రసాదించుము.

శ్లో. సాధోః ప్రకోపితస్యాపి మనో నాయాతి విక్రియాం

హి తాపయితుం శక్యం సాగరాంభః తృణోల్కయా.

తే.గీ. సాధువులకోపమప్పుడే సమసిపోవు. 

మదిని నిలువదు. శాంతియే మదిని కుదురు.

సాగరాంబువు నెవరైన శక్తి చూపి

గడ్డిమంటనుపెట్టుచు కాచనగునె?

తే.గీ.  సాధువులు కోపమొందినన్ సహజమైన

శాంతమును వీడరెన్నడున్, క్షాంతినొప్పి,

ఎండుగడ్డిని మండించి యెట్టులయిన

జలధిలోనీరు కాచుట సాధ్యపడదు.

భావము. సజ్జనులు కొన్నిసందర్భాల్లో కోపించినా వారి మనస్సు లు మాత్రం వికారమూ చెందవు. సముద్రజలాన్ని గడ్డిమంటతో కాచటం సాధ్యంకాదు కదా.

శ్లో. సా విద్యా యా మదం హంతి , సా శ్రీ ర్యర్థిషు వర్షతి
ధర్మానుసారిణో యా సా బుద్ధిరభిదీయతే.
తే.గీ. మదము నణచునదే విద్య మహిని కనగ. 
అర్హులకునీయఁబడునెద్ది అదియె ధనము.
ధర్మవర్తనగలబుద్ధి ధరణి బుద్ధి. 
సుజనులందుననివి యుండి శోభ కూర్చు.
భావము. ఏది గర్వాన్ని అణచివేస్తుందో,అదే నిజమైన విద్య. అర్థుల కోసం ఏది ధారాళంగా వర్షింప బడుతుందో అదే నిజమైన సంపద. ఏది ధర్మాన్ని అనుసరిస్తుందో అదే నిజమైన బుద్ధి. 

శ్లో. సా శ్రీర్యా మదం కుర్యాత్స సుఖీ తృష్ణయోజ్ఝితః 
తన్మిత్రం యత్ర విశ్వాసః పురుషః జితేంద్రియః.                                            

తే.గీ. గర్వమును చేర నీయని కలిమి కలిమి.                                                            

ఆశనెడఁ బాసి పొందెడి హాయి హాయి,                                                                  

లను విశ్వాసపాతృఁడౌ హితుఁడు హితుఁడు.                                            

మహిజితేంద్రియుఁడైనట్టి మనిషి మనిషి.

భావము. గర్వాన్ని కలుగజేయనిదే అసలైన సంపద.ఆశను జయించినవాడే సుఖవంతుడు. విశ్వాసపాత్రుడే నిజమైన మిత్రుడు.ఇంద్రియాలను జయించినవాడే ఉత్తమపురుషుడు.

శ్లో. సుందరే సుందరో రామః.  -  సుందరే సుందరీ కథా.

సుందరే సుందరీ సీతా.  - సుందరే సుందరం వనం.

సుందరే సుందరం కావ్యం. - సుందరే సుందరః కపిః.

సుందరే సుందరం మంత్రం. - సుందరే కిం సుందరం?

ఉ.  సుందరుఁడా రఘూద్వహుఁడు, సుందరమైనది తత్కథాంశమున్.

సుందరి జానకీ సతియు, సుందరమైన వనంబు నొప్పు. సత్

సుందరమైన కావ్యమది, సుందరుడా కపి. సుందరం బహో

సుందరమైన మంత్రము సుందర మెయ్యది సుందరమ్మునన్?

భావము.  రాముఁడు సుందరుఁడు. కథాంశము సుందరమైనది. సీత సుందరమైనది. వనము సుందరమైనది. కావ్యము సుందరమైనది. ఆత్మస్వరూపం దర్శించిన యోగి హనుమంతుడు సుందరమైనవాడు. మంత్రము సుందరమైనది. సుందరకాండలో సుందరము కానిదేమున్నద? అన్నియు సుందరమగుటచేతనే అది సుందరకాంద అయినది.

శ్లో.  సుందరోsపి సుశీలోsపి  -  కులినోsపి మహాధనః ౹

శోభతే న వినా విద్యాo విద్యా  -  సర్వస్య భూషణం ౹౹

తే.గీ.  సుందరంబగు రూపము, నందమయిన                                                                             

శీలసంపద, ధనమును, శ్రీకరమగు

వంశమందున జననము, పడయవచ్చు

విద్య మనకు లేకున్నచో వెలుగ లేము.

భావము.  అందంగా ఉన్నా, సరళమైన నడతలు ఉన్నవాడైనా,ఉత్తమమైన కులములో పుట్టినా,ఎక్కువ సంపదలు ఉన్నవాడైనా సరే విద్య లేనిచో ఆ మనిషి శోభించడు. అన్నిటికీ మూలం విద్య.

శ్లో.  సుకృతేన కులే జన్మ - సుకృతేన సుభాషితమ్l

సుకృతేన సతీ భార్యా - సుకృతేన కృతీ సుత:ll

తే.గీ.  మంచి కులమున పుట్టుట మహిత సుకృతి,

మంచి సుకృతిని లభియించు మంచి వాక్కు,

మంచి సుకృతిచేత లభించు మంచి భార్య,

మంచి సుకృతినే పుత్రుఁడున్ మహిని కలుగు.

తే.గీ.  మంచి కులమునఁ బుట్టుత, మంచి వాక్కు, 

మంచి సాధ్వియౌ భార్యయు, మంచి సుతుఁడు,

సుకృత ఫలములు మనలకు చూడగాను,

సుకృతములు చేయుచుండుట సుకృతఫలమె.   

భావము.  సత్కులములో జన్మించడమూ, మంచి మాటకారితనమూ, సాధ్వియైన భార్యా, వివేకవంతుడైన పుత్రుడూ పుణ్యం వలన మాత్రమే లభ్యము.

శ్లో. సుఖస్య దుఃఖస్య కోஉపి దాతా , పరో దదాతీతి కుబుద్ధిరేషా 
అహం కరోమీతి వృథాభిమానః , స్వకర్మసూత్రే గ్రథితో హి లోకః 
తే.గీ. ఈయరెవ్వరు సుఖ దుఃఖ శ్రేయములను. 
మనము చేయుచు గొనలేని మర్మ జనిత
కర్మ ఫలముగ మనకవి కల్గుచుండు. 
మంచి కర్మలు చేసిన మంచి కలుగు.
భావము. మనకు సుఖదుఃఖాలను ఇచ్చే వారు ప్రత్యేకంగా ఎవరూ లేరు. ఎవరో వాటిని మనకు ఇస్తున్నారనుకోవటం అసంబద్ధం. నేనే చేస్తున్నాననుకోవటం కూడా వ్యర్థం. లోకమంతా స్వకర్మ సూత్రంతో బంధింపబడి ఉంది. 
శ్లో.  సుఖస్యానంతరం దుఃఖం దుఃఖస్యానంతరం సుఖం

ద్వయమేతద్ధి జంతూనాం అలంఘ్యం దిన రాత్రవత్.

ఆ.వె.  పగలు రాత్రి వోలె ప్రబలును సుఖ దుఃఖ

ములు సతతమును జీవనులకు; నిజము.

ధరణి పైన మనకు దురతిక్రమములివి.

విజ్ఞు లెఱిగి మెలగు భీతి విడిచి.

తే.గీ.  సుఖము పిదపను దుఃఖంబు. సుఖము దుఃఖ
మునకు పిదపను, వచ్చును. పుడమి పైన
రాత్రి బవలట్లు. తప్పదీ ప్రాప్త ఫలము.
జీవు లకును. నరుడు దుఃఖ స్పృహను వీడు.

భావము.  రాత్రింబవళ్ళ వలె సుఖము తరువాత దుఃఖము; దుంఖము తరువాత సుఖము వచ్చుచునే యుండును. జీవులకీ రెండునూ తప్పని సరైనవి. ఇక వీనికై వివేకి యైన వాఁడు దుఃఖము నొందడు.శ్లో. సుఖార్థీ చే త్త్త్యజేద్విద్యాం , -  విద్యార్థీ త్యజేత్సుఖం

తే.గీ.  విడువ వలయు సుఖార్థి తా విద్యనపుడు.

విద్య నేర్వగ సుఖములు వీడ వలయు.

సుఖము కోరిన విద్యకు చోటులేదు

విద్య కోరిన సుఖములు వీలుపడవు.

భావము. సుఖాన్ని కాంక్షించేవాడైతే విద్యను వదలిపెట్టుకోవాలి. విద్య కావాలనుకుంటే సుఖాన్ని వదలుకోవాలి. సుఖం కోరేవాడికి విద్య ఎక్కడ ? విద్యకావాలనుకుంటే సుఖం ఎక్కడ ? 

శ్లో.సుగంధేనవినాపుష్పం  -  కుత్రాపి నచశోభతే

సదాచారైర్వినా కోపి  -  పూజ్యతాం నాధిగచ్ఛతి.

తే.గీ.  పరిమళము లేని పుష్పంబు  నిరుపయోగ

మరయగా నట్టులే భువి నిరుపమాన

మౌ సదాచార విరహిత మయిన జన్మ

గౌరవముపొంద నేరదు, స్మార జనక!

భావము.  పువ్వు ఎన్నెన్నిరంగులతో అందంగానున్ననూ ,సువాసనలేనిచో శోభింపదు.అట్లే మంచిఅలవాట్లులేనిచో ,మానవుడూ గౌరవాన్ని పొందలేడు.

శ్లో.  సుమహాంత్యపి శాస్త్రాణి - ధారయంతే బహు శ్రుతాః
భేత్తారః సంశయానాంచ - క్లిశ్యంతే లోభ మోహితః
తే.గీ. గొప్ప, గొప్పగు షట్ శాస్త్ర కోవిదులును,
శృతుల నెన్నుచు, బహు ధర్మ గతులు చెప్పు
స్థుత మతులు, లోభ కలుషిత మతిని, సతము
దుస్థితిని పొంది, కష్ఠాల తోఁగుదురిల.

భావము.  చక్కని శాస్త్ర పరిజ్ఞానము కలిగియుండియు, వేద పరిజ్ఞానమును కలిగి యుండియు, ధర్మ సందేహములను నివృత్తి చేయగలిగి యుండియు, వారిలో లోభ గుణము కలిగియుండు వారు దుస్థితిని పొంది, నానా యాతనలకు గురి అవుతూ వుంటారు కదా!

శ్లో. సులభాః పురుషాలోకే సతతం ప్రియవాదినః
అప్రియస్య పధ్యస్య వక్తాశ్రోతా చదుర్లభః
తే.గీ. జగతి ప్రియవాదులనునొప్పు నగణితముగ.
అప్రియంబయ్యు మేల్గూర్చు నద్భుతోక్తి
సత్యయుక్తంబు పలికెడి సరస సుమతు
లరుదు, వినువారలరుదుగ ధరణి నుంద్రు.
భావము. కమ్మని కబుర్లు చెప్పేవారు ఎక్కడ పడితే అక్కడ ఉంటారు. అయితే చెప్పేటప్పుడు కష్టంగా ఉన్నా తరువాత మేలుకూర్చే మాటలు చెప్పేవాడు. దాన్ని వినేవారు దొరకడం కష్టం. 

శ్లో. సుహృదాం హిత కామానాం - యశ్శ్రుణోతి భాషణం
విపత్సన్నిహితా తస్య- నరశ్శత్రు నందనః. 
తే.గీ. బంధు మిత్రుల సద్బోధ వరలనీక 
దుష్ట వర్తన మెలిగిన భ్రష్టుఁడగును. 
శతృకోటికి యానంద పాత్రుఁడగును. 
మంచి చెప్పిన వినవలె మహితులార!
భావము.   ఎవడు - సజ్జనులు, తన మేలుకోరేవారు చెప్పే హితభాషణలు వినడో , వాడు ఆపదలను పొంది తన శత్రువులకు ఆనందం కలిగించేవాడౌతాడు. 

శ్లో.  స్త్రియో, రత్నా, స్తథా విద్యా , ధర్మం, శౌచం, సుభాషితం,

వివిధాని శిల్పాని, సమాధేయాని సర్వతః ll

తే.గీ.   తరుణి, రత్నంబు, విద్యయు, ధర్మబుద్ధి,

శుచియు, సద్భాషణములు, శిల్ప చయములను

యెచ్చటున్నను గొన వచ్చు, నిచ్చ యున్న.

సద్గుణంబులఁ గలిగిన సరళిఁ గనుచు.

భావము.   తరుణీ్రత్నము, రత్నము, విద్య, ధర్మము, సదాచారము, మంచి మాట, సుందర శిల్పములు, ఇవి ఎక్కడ నుండి యైనను స్వీకరింప వచ్చును.

శ్లో. స్త్రీరూపాం చింతయే ద్దేవీం - పుంరూపం వా విచిన్తయేత్ |
అథవా  నిష్కలం ధ్యాయే - త్సచ్చిదానంద   లక్షణమ్ || (తంత్రసార:) 
. చింతింప వచ్చు స్త్రీగను,
చింతింపగ వచ్చు పురుష చిద్రూపముగన్.
చింతింప తగునిరాకృతి,
సంతోషముతో జననిని సచ్చిద్రూపిన్.
భావము. జగన్మాతను స్త్రీ రూపమున చింతింప వచ్చును, లేదా పురుషాకృతిలోనైనను చింతింప వచ్చును. లేదా నిరాకారముగనైనను ధ్యానించ వచ్చును. ఇది సచ్చిదానంద లక్షణము.

శ్లో. స్నేహో హివరమఘటితో - నవరం సంజాత విఘటితః స్నేహః
హృతనయనోహి విషాదీ -  నవిషాదీ భవతి సఖలు జాత్యంధః
తే.గీ. మైత్రి చేయక పోవుటే మహిని మేలు.
మిత్రుడై, తుది విడుచుట మేలు కాదు.
పుట్టు గ్రుడ్డియే మేలుగా పుడమిపైన
కోలుపోయిన కనులున్న గ్రుడ్డికన్న.
భావము. మైత్రి చేయకుండుటే మేలు. స్నేహం చేసి వదిలేయడం విడిపోవడం మంచిది కాదు
కళ్ళుపోయిన వానికి బాధ. కానీ పుట్టుగుడ్డికి అంత బాధ ఉండదు కదా!

శ్లో. స్వగృహే పూజ్యతే మూర్ఖః స్వగ్రామే పూజ్యతే ప్రభుః
స్వదేశే పూజ్యతే రాజా విద్వాన్ సర్వత్ర పూజ్యతే.
తే.గీ. మూర్ఖులింటిలోపలననే పూజలందు. 
గ్రామమందునే పూజలు గాంచు ప్రభువు.
రాజు తన దేశమందునే రాణఁ గాంచు. 
పూజ్య విద్వాంసులెల్లెడన్ పూజలందు
భావము.   మూర్ఖుఁడు తన ఇంటిలోనే పూజింపఁబడును. ప్రభువు తన గ్రామమునందే పూజింపఁబడును. రాజు తన దేశమునందే పూజింపఁబడును. కాని విద్వాంసుఁడు మాత్రము అన్నిచోటులందూ పూజింపఁబడును.

శ్లో. స్వదత్తా ద్ద్విగుణం పుణ్యం పరదత్తానుపాలనమ్,
పరదత్తాపహారేణ, స్వదత్తం నిష్పలం భవేత్. 
తే.గీ. ఇతరు లొనరించు దానమ్ము నతిశయముగ 
కాయ, ద్విగుణమౌ తన దాన కర్మ ఫలము.  
వాటి హరణంబు చేసెడివారికిలను 
పుణ్యఫలములు నశియించిపోవు. నిజము.
భావము.  ఇతరులు చేసిన దానమును పాడుచేయక దానిని సంరక్షించినట్లయితే, తాను స్వయంగా చేసిన దానముకన్నను రెండు రెట్లు అధికంగా పుణ్యము ప్రాప్తిస్తుంది. ఇతరులు చేసిన దానమును హరించుట వల్ల తాను చేసిన దానముల వల్ల సంపాదించుకున్న పుణ్యవిశేషం ఏదైనా వుంటే అది నిష్ఫలమైపోతుంది. ( జనకుడు చేసిన కన్యా దానానికి ఘాత కలుగించి, రావణుడు తన తపస్సు అంతా నష్టపోయి నశించాడు.) గమనిక: పరోపకారం చెయ్యండి. లోకం కోసం ఇతరులు చేసిన మంచిని కాపాడడం కూడా ఉపకారమే. 

శ్లో.  స్వభావం జహాత్యేవ - సాధురాపద్గతోపి సన్

కర్పూరోపావకస్పృష్టో - సౌరభం లభతేతరం ।।

తే.గీ.  పోవదుగ నైజ  మరయ కప్పురపకళిక

కగ్ని కాల్చుచునున్నను, నటులె సుజను

లందు నైజము విడిపోదు కుందఁజేయు

బాధలాపదల్ కలిగినన్, భవ్యమదియె.

భావము.  కర్పూరము చూచుటకు, ఎంతో పరిశుభ్రముగా, స్వచ్ఛముగా, సువాసన కలిగి ఉండును. చాలా సాధు రూపములో కనిపించును. కర్పూరమునకు నిప్పు తగిలినంతనే అది తన స్వాభావికమైన సువాసనని కోల్పోదు. సరి కదా తన సువాసనలని మరింత ఎక్కువగా ప్రదేశమంతా విస్తరింపజేయుచుండును. అదే విధముగా మంచి వారు సాధు జనులు కూడా తమ స్వభావ సిద్ధమైన మంచితనమును, సహాయ ప్రకృతిని వారికి ఆపద కలిగినంత మాత్రాన వదలిపెట్టరు. అట్టి వారు ఎల్లప్పుడూ, పరులకు ఉపయోగ కారకులుగానే ఉందురు.

శ్లో.  స్వభావేన హి తుష్యంతి   -  దేవ: సత్పురుషా: పితాl

జ్ఞానయస్త్వన్న పానేన  -  వాక్య దానేన పండితా:ll

తే.గీ.  తృప్తిగాంతురు పితరులు, దేవతలును,

మంచివారును, మనయొక్క మంచిఁ గాంచి,

జ్ఞానులకు తృప్తిపరమాన్నపానములను,

వాక్య దానమ్ముచే పొందు పండితాళి.

భావము. మంచి స్వభావముచేత దేవతలు, సజ్జనులు, తండ్రి సంతృప్తి చెందుతారు. బంధు మిత్రులు అన్నపానాలతో సంతుష్టులవుతారు. విద్వాంసులైతే చక్కని మాటలతోనే ఆనందపడతారు.

శ్లో.  స్వభావోనోపదేశేన - శక్యతే కర్తుమన్యథా,

సుతప్త మపి పానీయం - పునర్గచ్చతి శీతతామ్.

తే.గీ.  మార్చలేము స్వభావమున్ మాటలాడి,

నీటినెంతగా కాచినన్ నిజమునకది

చల్లగానగు మరల నో సత్యదేవ!

నైజమది మారబోవదనంతశయన!

భావం: ఉపదేశాలతో ఎవరి స్వభావాన్ని ఎప్పటికీ మార్చడానికి సాధ్యం కాదు. నీటిని బాగా మరగ కాచినా మళ్ళీ మళ్ళీ చల్లగా అవుతాయి. అలాగే, పుట్టుకతో వచ్చిన స్వభావాన్ని ఎవరివలన మార్చడానికి సాధ్యపడదు.

శ్లో. స్వయం తథా కర్తవ్యం  - స్వగుణాఖ్యాపనం పునః
స్వగుణాఖ్యాపనం యుక్త్యా  - పరద్వారా ప్రయోజయేత్. 
. తమ సద్గుణ సంపదలను 
ప్రముదంబున తా వచింప రాదు జగతిలో. 
తమగుణముల నితరులు కని 
ప్రముదంబుగ పొగడ వలయు. భవ్యంబదియే.
భావము. ఎవరును తమ సద్గుణములను మరల మరల తామే చెప్పుకొనకూడదు. యుక్తిగా పరులద్వారా గుణాలు లోకానికి తెలియజేయాలి. 

శ్లో. స్వయం మహేశః , శ్వశురో నగేశః , సఖా ధనేశశ్చ , సుతో గణేశః 
తథాపి భిక్షాటనమేవ శంభోః, బలీయసీ కేవలమీశ్వరేచ్ఛా !

తానీశుఁడుమామగపతి

మానిత ధనపతి హితుడగుమాన్య గణేశుం

డానిటలలోచను సుతుం

డైనను భిక్షాటనంబెయిది విధి బలమే.

భావము. తాను స్వయంగా మహేశ్వరుడు! మామగారా - పర్వతాధీశ్వరుడు! స్నేహితుడా - ధనాధిపతియైన కుబేరుడు!కుమారుడా -గణేశ్వరుడు! అయినా శివునకు భిక్షాటనం తప్పలేదంటే ,కేవలం ఈశ్వర సంకల్పమే. ఇది ఎంత బలీయమైనది! 

శ్లో. స్వల్పాపి దీపకళికా -  బహుళం నాశయేత్తమః|

బోధస్స్వల్పో౭పి తత్ తీవ్రం - బహుళం నాశయేత్తమః||

తే.గీ.  దివ్వె చిన్నదే యయినను దీర్ఘ తమము

నణచి వేయుగా, యట్టులే యల్పబోధ

యైననుంగాని గురువులు జ్ఞాన దీప్తి

శిష్యులన్ గొల్పి, పోఁగొట్టు చీకటులను.

భావము. "దీపము ఎంత చిన్న దైనను చీకట్లను పోగొట్టునట్లు ఉత్తమ గురువుల బోధనలు ఎంత కొద్దిగా ఉన్ననూ అంతకంటే గొప్పదైన 

అజ్ఞానమనే చీకట్లను నశింప జేయును"  [గ్రహించే శక్తి గల శిష్యునికే యిది వర్తించును

శ్లో.  స్వశరీరే స్వయం జ్యోతిః  -  స్వరూపం సర్వ సాక్షిణం,

క్షీణ దోషాః ప్రపశ్యంతి   -  నేతరే మాయయావృతాః.

(అన్నపూర్ణోపనిషత్. 4-36).

తే.గీ.  దేహమందునె వెలిగెడి దివ్య మైన

సర్వసాక్షియౌ జ్యోతిని సాధు జనులు

పాపదూరులె చూతురు, పాప యుతులు

కానగాలేరు నిజమిది కమలనయన.

భావము.  

తన శరీరమందే స్వయముగా ప్రకాశిస్తూ సర్వ సాక్షిగా ఉండే ఆత్మస్వరూపమును దోషరహితులు మాత్రమే దర్శింపఁగలరు. మాయలో చిక్కినవారు దర్శింపలేరు.

700. శ్లో.  స్వాగతేనాగ్నయ స్తృప్తా, ఆసనేన శతక్రతుః। 

పాదశౌచేన పితరః, అర్ఘ్యాచ్ఛమ్భుస్తథాతిథేః॥

తే.గీ. స్వాగతము పల్క నగ్నులు సంతసింతు,

రాసమున నింద్రుఁ డానంద మం దతిథికి,

పాదపాద్యాన పితరులు పరవశింతు,

రర్ఘ్యమున శంభుఁడానందమందు, మహిత!

భావము.  అతిథికి స్వాగతము పలుకుటతో అగ్ని, ఆసనము వేయుటతో ఇంద్రుడు, 

పాదములు కడుగుటతో పితృదేవతలు, అర్థ్య, ఫల, పుష్ప, నైవేద్యాదులు 

సమర్పించుటతో పరమేశ్వరుడు, సంతోషము పొందుదురు.

మనం గ్రహాన్ని పుష్పాలతో అర్చించాలి?


701. శ్లో.  హయారికుసుమైః సూర్యం, - కుముదై శ్చంద్రమర్చయేత్,

క్షితిజంతు జపాపుష్పైః, - చంపకేనతు సోమజమ్,

శతపత్రై ర్గురుః పూజ్యో, - జాజి పుష్పైస్తు భార్గవః,

మల్లికా కుసుమైః పంగుః, - కుందపుష్పై ర్విధుం తుదః,

కేతస్తు వివిధైః పుష్పైః శాంతికాలేషు సర్వదా……… (భవిష్య పురాణం)

తే. గీ. పచ్చ గన్నేరు తగునయ్య భాస్కరునకు 

చలువ రేనికి తగినది కలువ పూజ,

దిరిసెనలతోడ కుజునకు, దివ్యుఁడైన

బుధుని సంపెంగ తోడను, పూజ్యుఁడైన

గురుని పద్మాలతోడను, విరిసినట్టి

జాజి పూలను శుక్రుని, శనిని మల్లె, 

రాహువును మొల్ల పూలతో, రమ్యమైన

వివిధ పుష్పాల కేతువున్, బ్రీతిఁ గొలుతు.

భావము.  సూర్యుని పచ్చగన్నేరుతోను, చంద్రుణ్ణి కలువపూలతోను, కుజుణ్ణి దాసాని పూలతోను, బుధుణ్ణి సంపెంగపూలతోను, గురువును పద్మాలతోను, శుక్రుని జాజిపూలతోను, శనిని మల్లెపూలతోను, రాహువును మొల్లపూలతోను, కేతువును వివిధపుష్పములతోను పూజింపవలెను.

శ్లో.  హరణం పరస్వానాం  -  పరదారాభిమర్శనమ్ |

సుహృదశ్చ పరిత్యాగః  -  త్రయో దోషాః క్షయావహాః || (మహాభారతం)

కం.  ఇతరుల సొమ్మును దోచుట,

యితరుల స్త్రీలను చెరచుట,  యెంచక మంచిన్

నుతుఁడగు మిత్రుని విడుచుట,

క్షితిపైన వినాశ మొసగు, కీడును గొలుపున్.

భావము.  ఇతరుల ఆస్తిని అపహరించడం, ఇతరుల భార్యలను రెచ్చగొట్టడం, స్నేహితులను విడిచిపెట్టడం - ఇవి మూడు పూర్తిగా నాశనం చేసే దోషాలు.

శ్లో. హితోపదేశం శృణుయాత్ కుర్వీత యథోదితం
విదురోక్తమకృత్వాభూత్కౌరవః శోకశల్యభాక్. 

.వె. మంచి మాట చెప్ప మన్నించి వినవలె. 

వినిన దాని నాచరణను పెట్ట 

వలెను. విదురు మాట వినియు, చరింపక 

చెడిరి కౌరవులిల. చెడకు నీవు. 

భావము. హితంకోరేవారు చెప్పే మాటలను శ్రద్ధగా విని, ఆచరించాలి. కురువంశీయుడైన దుర్యోధనుడు - విదురాదులు చేసిన ఉపదేశాలను విన్నాడేగానీ , పాటింపక దుఃఖం అనుభవించాడు. 

ఏకాదశరుద్రులు
శో. హరశ్చ బహురూపశ్చ, త్ర్యంబకశ్చాపరాజితః
వృషాకపిశ్చ శంభుశ్చ, కపర్దీ రైవతస్తథా
మృగవ్యాధశ్చ శర్వశ్చ, కపాలీ విశాంపతే
ఏకాదశైతే కథితా, రుద్రాస్త్రిభువనేశ్వరాః.(హరి వంశము 1-3-51; 52)
తే.గీ. హరుఁడు, బహురూపుఁడు, జగన్నిరుపమేయ
త్ర్యంబకుఁ, డపరాజి,కపర్ధి, రైవతుండు,
శంభుఁడును, మృగవ్యాధుఁడు, శర్వుఁడును,
పాలియును వృషాకపిరుద్రులేలు జగతి.
భావము.  1.హరుడు 2.బహురూపుడు 3.త్ర్యంబకుడు 4.అపరాజితుడు 5.వృషాకపి 6.శంభుడు 7.కపర్ది 8.రైవతుడు 9.మృగవ్యాధుడ 10.శర్వుడ 11.కపాలి అను పదునొక్కండ్రు రుద్రులు జగతిని ఏలుచుండిరి.

శ్లో.  హరిణాపి హరేణాపి బ్రహ్మణాపి సురైరపి

లలాట లిఖితా రేఖా పరిమార్ష్టుం నశక్యతే.

.  హరియును హరుడును బ్రహ్మయు

సురగణములు కూడ తగరు చుట్టిన కర్మల్

చెరుపగ. కర్మ ఫలంబులు

నరు నుదుటను గలుగు వ్రాత, నడపును సతమున్.

భావము.  నుదుట వ్రాయఁబడిన వ్రాతను చెరుపుట హరి హర బ్రహ్మలకు గాని, దేవతలకు గాని సాధ్యము కాదు కదా !

శ్లో. నమో గోభ్యః శ్రీమతీభ్యః సౌరభేయాభ్యయేవచ.
నమో బ్రహ్మ నుతాభ్యశ్చ పవిత్రాభ్యో నమోనమః.
.   శ్రీమంత కామధేనువు 
ధీమంతపు సంతు, బ్రహ్మదేవ నుతోద్ధత్
శ్రీమద్గోమాతలకున్ 
క్షేమంబిడ వందనంబు చేసెద భక్తిన్.
భావము. శ్రీమంతంబులైన కామధేను సంతతులైన, బ్రహ్మచే స్తుతింపబడిన, పవిత్రములైన గోవులకు నా నమస్కారము.
శ్లో. గావో మమాగ్రతః నను గావోమే సంతు పృష్టతః.
గావోమే హృదయం నిత్యంవాం మధ్యే వసామ్యహమ్.
.వె. గోవులుండుగాక గొప్పగా నాముందు
వెనుకలందు నెపుడు, వినుతముగను.
నిలుచు నాదు మదిని నిరతము గోవులు.
మసలుదెపుడునాలమందలందు.
భావము. గోవులు నా ముందు వెనుకల నుండు గాక. గోవులే నాహృదయము. గోవుల మధ్య నివశించుచున్నాను.
శ్లో.  సర్వం పరవశం దుఃఖం   -  సర్వం ఆత్మవశం సుఖమ్ |

ఏతత్విద్యాత్సమానేన   -  లక్షణం సుఖదుఃఖయోః ||

తే.గీ.  పరవశంబగు స్వధనంబు బాధపెట్టు,

మనవశంబగు మనదేను మనకు సుఖము

నిచ్చు నీవిషయంబునే నెఱుగి సుఖము

గొలుపునదినది కోరి చేయుచున్ గొనుము సుఖము. 

భావము. మనదే అయినా ఇతరులు గనుక తీసుకుంటే, ఇక అది దుఃఖాన్నే కలిగిస్తుంది. మనకు దక్కింది మాత్రమే సుఖాన్ని ఇస్తుంది. సుఖదుఃఖాలను ఇలాగే నిర్వచించుకోవాలి. అంటే మనవద్ద లేనివాటికోసం దిగులు పడకూడదని, ఉన్నవాటితో సంతృప్తిగా ఉండాలని భావం.

శ్లో. సర్వతీర్థమయీం దేవీ! వేద దేవాత్మికాం శివమ్.
సురభిం యజ్ఞస్య జననీ! మాతరం త్వాం నమామ్యహమ్.
.వె. సర్వతీర్థములును సర్వ వేదంబులు
సర్వదేవతలును చక్కనెపుడు
కలిగియుండి శుభము కలిగించు గోమాత!
వందనములు సురభి భవ్య మాత!
భావము. సర్వ తీర్థములను నీలోనే కలిగిన గోమాతా! వేదములన్నియు నీలోనే ఉన్నవి.దేవతలందరు నీలోనే ఉండిరి. నీవు సర్వ శుభ రూపిణివి. సురభి మాతా! నీవు యజ్ఞమునకు తల్లివంటి దానవు. నీకు నా ప్రణామములు.
శ్లో. సర్వ దేవ మయే దేవీ!ర్వదేవైరలంకృతే!
మాభిలాషితం కర్మ సఫలం కురు నందిని.
.వె. దివ్యమైన సకల దేవతా రూపిణీ!
దేవతతికి నిలయ మీవె గోవ!
నిరుపమానవైన నీకు నా ప్రణతులు.
కోర్కెలెల్లతీర్చి కూర్చు శుభము.
భావము. గోమాతా! సర్వ దేవతా స్వరూపిణీ! సర్వ దేవతలచే అలంకరింపబడినదానా! నా కోర్కెలను సఫలము చేయుము.

శ్లో.  వేద శాస్త్ర ధ్వని పూరితాని  - విప్ర పాదోదక కర్దమాని |

స్వాహా స్వధాకార నిరంతరాణి - వైకుంఠ తుల్యాని గృహాణి తాని ||

తే.గీ.  వేదశాస్త్రాసాధననొప్పు వేశ్మ మొకటి,

వేదపండితులడుగిడు వీడదొకటి,

దేవపితృసేవలను దేల్చు దిష్ట్యమొకటి

కనగవైకుంఠసమమని కనగవలయు.   

భావము.  " ఇంట్లో వేదశాస్త్రాల ధ్వని ప్రతిధ్వనిస్తుందో, ఇంట్లో బ్రాహ్మణుల మరియు వేద పండితుల అడుగుల చిహ్నాలు ఉంటాయో, ఇంట్లో నిరంతరం దేవతల ఆరాధన (స్వాహాకారం), పితృవుల ఆరాధన (స్వధాకారం) జరుగుతుందో, ఇల్లు సాక్షాత్ వైకుంఠంతో సమానమవుతుంది.

శ్లో.  సా సభా యత్ర సభ్యోఽస్తి - సభ్యో ధర్మమాహ యః |

ధర్మో యత్ర సత్యం స్యాత్త - త్సత్యం యత్ర చ్ఛలమ్ ||  (కథాసరిత్సాగరం)

తే.గీ.  సభ్యతను ధర్మమును బల్కు సరసమతులు  

సభ్యులై యున్నవే చూడ సభలు భువిని,

ధర్మమది సత్యముండినన్, మర్మ హీన

మైనదే సత్యమరయఁగ నిందువదన!   

భావము.  సభ్యతగలవాడుంటే మాత్రమే అది సభ అవుతుంది. ధర్మాన్ని చెప్పేవాడే సభ్యత కలవాడు. సత్యమెక్కడున్నదో అదియే ధర్మము. మోసమెక్కడ లేదో అదియే సత్యము.

శ్లో.  సుకృతేన కులే జన్మ - సుకృతేన సుభాషితమ్ |

సుకృతేన సతీ భార్యా - సుకృతేన కృతీ సుతః ||

(హరిహర సుభాషితం)

శ్లో.  సత్ కులోద్భవ మొక పుణ్య సాధ్య ఫలము,    

పూర్ణ వాగ్ధాటి లభియించు పుణ్యముననె, 

సాధ్వి పుణ్యఫలముననే సతిగ దొరకు,

పుణ్యముననే వివేకియౌ పుత్రుఁడొదవు.

భావము.  సత్కులములో జన్మించడమూ, మంచి మాటకారితనమూ, సాధ్వియైన భార్యా, వివేకవంతుడైన పుత్రుడూ పుణ్యం వలన మాత్రమే లభ్యమగును..

శ్లో.  సుఖార్థీ త్యజతే విద్యాం, విద్యార్థీ త్యజతే సుఖం |

సుఖార్థినః కుతో విద్యా, కుతో విద్యార్థినః సుఖం ||

తే.గీ.  సుఖపిపాసి తా విడుచును సుకరవిద్య,

సుఖము విడుచును విద్యార్థి శోభఁగాంచ.

విద్య సుఖవాంఛితునకెట్లు పేర్మినబ్బు?

సుఖము విద్యార్థికెట్లబ్బు? శుభచరితుఁడ!

భావము.  సుఖము కోరుకునే వాడు విద్యని వదలి వేస్తాడు. విద్యని కోరుకునే వాడు సుఖాన్ని వదలి వేస్తాడు. సుఖం కోరుకునే వానికి విద్య ఎక్కడ? వానికి విద్య రాదు. విద్యని కోరికునే వానికి సుఖము ఎక్కడ? వానికి సుఖాల మీద దృష్టి ఉండదు.

శ్లో.  సుజనాః పరోపకారం - శూరాః శస్త్రం ధనం కృపణాః |

కులవత్యో మందాక్షం - ప్రాణాత్యయ ఏవ ముంచతి ||

(రసగంగాధరం)

తే.గీ.  పరులకుపకృతిన్ సుజనులు, భవ్య శస్త్ర

మును పరాక్రముల్, పిసినారి ధనము, సాధ్వి

సిగ్గును, విడువరు మృతిని చెందువరకు,

జన్మసార్ధకమగుటకు, జయనిధాన!    

భావము.  సత్పురుషులు పరోపకారాన్నీ, శూరులు శస్త్రాన్నీ, పిసినారులు ధనాన్నీ, కులస్త్రీలు సిగ్గునూ ప్రాణం పోయినప్పుడు మాత్రమే వదిలిపెడతారు.

శ్లో.  సుమహాంత్యపి శాస్త్రాణి  -  ధారయంతో బహుశ్రుతాః |

ఛేత్తారః సంశయానాం చ  -  క్లిశ్యంతే లుబ్ధమోహితాః ||

(హితోపదేశము)

తే.గీ.  కఠినమౌ శాస్త్రవిజ్ఞానఘనత కలిగి,

విషయములు పెక్కు తెలిసియు, ప్రీతి నితర

జనుల సంశయచ్ఛేదకుల్ జగతిలోన

లోభమోహాదులన్ జిక్కి క్లేశపడెడు.     

భావము.  కఠినతమమైన శాస్త్రాల జ్ఞానాన్ని కలిగి ఉన్నవారు, అనేక విషయాలను విని తెలుసుకున్నవారు, మరియు ఇతరుల సందేహాలను తొలగించే సామర్థ్యం ఉన్నవారు కూడా లోభం మరియు మోహానికి లోనై కష్టపడతారు. 

శ్లో.  సులభాః పురుషా రాజన్సతతం ప్రియవాదినః |

అప్రియస్య తు పథ్యస్యవక్తా శ్రోతా దుర్లభః ||

(రామాయణం-అరణ్యకాండం 37-2 మారీచుఁడు రావణునితో పలికినది.(

తే.గీ.  ప్రియము పలికెడి వారలు పృథివిపైన

సులభు లెప్పుడున్, గనగ నసులభు లప్రి

యమును, హితమునున్ బలుకు మహాత్ములు, విను

వారు, నిజమిది, సత్యమే పలుకుటొప్పు.

భావము.  రాజా! ఎల్లపుడూ ప్రియమైనదానినే పలికే పురుషులు సులభంగా ఎల్లెడలా దొరకుతారు. అయితే అప్రియమైననూ హితమైన మాటలను పలికేవారు కానీ, వినువారు కానీ దుర్లభులు.

శ్లో. స్థానేష్వేవ నియోక్తవ్యా  -  భృత్యా ఆభరణాని l

హి చూడామణిః పాదే  -  ప్రభవామీతి బధ్యతేll

తే.గీ.  సేవకులనాభరణములఁ జింతఁ జేసి

యుండుటకు తగ్గ చోటునే యుంచవలయు,

చూడచక్కనంచెంచుచు వాడలేము

పాదములకుచూడామణిన్ పరవశించి.

భావము.  సేవకులను, ఆభరణములను వారి వారి స్థానములందే ఉంచాలి. "ఇది శ్రేష్ఠం" అని తలచి చూడామణిని పాదానికి బంధించముగదా! అనగా ఎవరు హద్దులో ఉండదగినవారో వారిని హద్దులోనే ఉంచవలెను.

శ్లో. స్వభావం న జహాత్యేవ - సాధురాపద్గతోఽపి సన్।

కర్పూరః పావకః స్పృష్టః - సౌరభం లభతేతరామ్॥

తే.గీ.  ఆపదలు చుట్టుముట్టిన నోపు నుత్త

ముండు నైజంబు విడఁబోడు పుడమిపైన,

కప్పురము నగ్ని కాల్చినన్ ఘనతరముగ

సౌరభము పంచుచున్నట్లు, సౌమ్యులార!

భావము. ఆపదలు ఎదురైననూ ఉత్తముడు తన నైజమును విడనాడడు. కర్పూరం అగ్నిచే దహించబడిననూ పరులకు సువాసన అందించుచున్నదిగదా.

శ్లో.  స్వభావేన హి తుష్యంతి  -  దేవాః సత్పరుషాః పితా |

జ్ఞాతయస్త్వన్నపానేన  -  వాక్యదానేన పండితాః ||

తే.గీ.  సత్స్వభావాన గనుదురు సంతసమును

దేవ, పితరులు, సజ్జనుల్, దివ్యమైన

భోజనమునను బంధువుల్ సాజముగనె,

పండితులు మంచిమాటకే పరవశింత్రు.

భావము.  మంచి స్వభావంచేత దేవతలు, సజ్జనులు, తండ్రి - వీరు సంతృప్తి చెందుతారు. బంధుబాంధవులు అన్నపానాలతో సంతుష్టులౌతారు. విద్వాంసులైతే చక్కని మాటలతోనే ఆనందపడతారు.

శ్లో.  స్వభావో నోపదేశేన - శక్యతే కర్తుమన్యథా

సుతప్తమపి పానీయం - పునగచ్ఛతి శీతతామ్ ౹౹

తే.గీ. ఎన్ని యుపదేశములుచేయ నేమి ఫలము?

పుట్టుచునె వచ్చు గుణములో పోవు కనగ,

నెంతగా కాచిననుకాని సుంతయైన

వేడి మిగులునే నీటిలో, వినుత నృహరి!       

భావము.  ఎవరి స్వభావాలు ఉపదేశాలతో మార్చడానికి సాధ్యం లేదు.బాగా మరగించిన నీరు కూడా మళ్ళీ  చల్లగా అవుతుంది.జన్మ స్వభావాన్ని ఎవరివల్ల మార్చడానికి అవ్వదు.

*****

శ్లో. అపరాధ సహస్రాణి, క్రియంతే‌உహర్నిశం మయా |

దాసో‌உయ మితి మాం మత్వా, క్షమస్వ పరమేశ్వర ||
. లెక్కకు మించిన తప్పుల
నక్కజముగ చేసి యుందు నహరహమును నేన్.
మక్కువతో నను దాసుని
చక్కగ కని, కొను క్షమించి, సర్వేశ్వరుఁడా!

శ్లో. కరచరణ కృతం వా కర్మ వాక్కాయజం వా

శ్రవణ నయనజం వా మానసం వాపరాధమ్ |

విహిత మవిహితం వా సర్వమేతత్ క్షమస్వ

శివ శివ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో ||
తే.గీ. కర చరణముల చేసిన కర్మలందు,
మాటలను చేతలను చేయు మర్మములను,
శ్రవణ నయనములను చేయు చర్యలందు,
మనసు చేసెడి కర్మల, మసలవచ్చు
మరువ రానట్టి యపరాధ మలిన తతులు.
తెలిసి, తెలియక చేసెడి మలిన తతుల
నెల్ల మన్నించి కావుమో చల్లనయ్య.
కరుణఁజూడుమో పరమేశ! హర! మహేశ!

724. శ్లో. కాయేన వాచా మనసేంద్రియైర్వా

బుద్ధ్యాత్మనా వా ప్రకృతేః స్వభావాత్ |

కరోమి యద్యత్సకలం పరస్మై 
నారాయణాయేతి సమర్పయామి ||
. త్రికరణ ములచే, నాత్మను,
ప్రకృతి సహజ బుద్ధి చేత భ్రమచేతను నే
రక, నేర్చియు చేసిన 
సకలము రామార్పణంబు సలుపుచునుంటిన్.

 

 

 

 

No comments: