Saturday, December 6, 2025

నచ విద్యా ... నుండి ... యోజనానాం - వరకు. మేలిమిబంగారం మన సంస్కృతి.(341 - 551వ శ్లోకము)

 341. శ్లో నచ విద్యా సమో బంధుః   నచ వ్యాధి సమో రిపుః

నచాఽఽపత్య సమస్నేహః - నచ దైవాత్ పరం బలమ్.

లేదు విద్య సమాన బంధువు.  - లేదు వ్యాధి సమాన శత్రువు.

లేఁడు పుత్ర సమాన మిత్రుఁడు  - లేదు దైవ సమాన బలమున్.

భావము.  విద్యతో సమానమైన బంధువు లేఁడు. రోగముతో సమానమైన శత్రువు లేఁడు. పుత్రునితో సమానమైన స్నేహితుఁడు లేఁడు. దైవముతో సమానమైన బలము వేరే లేదు.

మనము విద్యావంతులము కావలెననియు, రోగ దూరులమై యుండవలెననియు, సత్ సంతానమును కలిగి యుండవలెననియు, దైవభక్త్ని కలిగి యుండ వల్రెననియు భావము.

శ్లో.  చోర హార్యం నచ రాజ హార్యం - భ్రాతృ భాజ్యం నచ భార కారీ
వ్యయే కృతే వర్ధతయేవ నిత్యం - విద్యా ధనం సర్వ ధన ప్రధానం.
తే.గీ.  దొంగిలింపరు దొంగలు. దొరలు కొనరు.

అన్న దమ్ముల కందదు. అవదు బరువు.

తరుగబోదిది వెచ్చింప పెరుగు చుండు.

విద్య యనబడు ధనమిది విబుధులార!
భావము.  దొంగలచే దొంగిలింప బడనిది, రాజులచే లాగుకొనబడనిది, అన్న దమ్ములలకు పంచ నవసరము లేనిది, ఎంత సంపాదించినా బరువుండనిది, ఖర్చు చేసినకొద్దీ పెరుగుతూ వుండేది, విద్య అనబడే ధనము మాత్రమే సుమా! అట్టి ధనమే మనకు చాలా ప్రథానమైన, నిజమైన ధనము. మనకు తృప్తిని కలిగిస్తుంది. కావుననే ఎంత శ్రమించ వలసి వచ్చిననూ బాధనొందక ఓర్పుతో శ్రమించి విద్యా ధనాన్ని సంపాదించాలి. అన్నారు మన పెద్దలు.

శ్లో.  జాతు కామః కామానాం ఉపభోగేన శామ్యతి |
హవిషా కృష్ణవర్త్మేన భూయ ఎవాభి వర్తతే ||
తే.గీ.  అనుభవించిన కొలదియునధికమగును
కోరిక.హవిస్సు హుతమున చేరు కొలది
వృద్ధి చెందెడు తీరున. శ్రద్ధ తోడ
మనమునదుపునందుంచిన మనకు మేలు.
భావము.  కోరికల ననుభవించిన మాత్రాన కోరిక తీరదు. హవిస్సుచేత అగ్నిహోత్రం వృద్ధి చెందినట్లు కోరికల ననుభవించుటచేత  కోరికలు పెరుగుతూనే ఉంటాయి. 

శ్లో.   న తథాఽసిస్తథా తీక్ష్ణః  -  సర్పో వా దురధిష్ఠితః |

యథా క్రోధో హి జంతూనాం  -  శరీరస్కో వినాశకః ||  (ఆపస్తంబస్మృతి)

తే.గీ.  కత్తిపై, మరి పాముపై కాలుమోప

హాని కలిగించు తప్పక, యది నిజంబు,

వీటికిని మించి హానిని మేటిగాను

కలుఁగఁ జేయును కోపంబు కనఁగ నరుఁడ!         

భావము.  కనిపించకుండా త్రొక్కబడిన కత్తియైనా పామైనా ప్రమాదాన్ని కలిగిస్తాయి.కానీ వాటి కంటే ఎక్కువగా శరీరంలో ఉన్న కోపం జీవులకు హాని చేస్తుంది.

శ్లో.  నతథేచ్ఛన్తి కల్యాణాన్ - పరేషాం వేదితుం గుణాన్

యథేషాం జ్ఞాతుమిచ్ఛన్తి - నిర్గుణ్యం పాపచేతసః.

(విదుర నీతి)

తే.గీ.  పరుల దుర్గుణ గణనకు పాపి యెపుడుఁ

జూపు నాసక్తి, నిజమిది, చూతుముకద,

పరుల సుగుణ సద్గణనమే వాని మదికి

రాదు, చిత్రంబిదేకదా, ప్రాజ్ఞులార!

భావము.  పాపాత్ములు ఇతరుల దుర్గుణములను తెలుసు కొనుటకు ఎంతగా ఆసక్తి గలవారగుదురో అంతగా వారి సద్గుణములను అన్వేషించుటకు మాత్రం ఆసక్తులు కానేరరు.

 శ్లో.  నత్వహం కామయే రాజ్యం. - స్వర్గం, నా పునర్భవం.
కామయే దుఃఖ తప్తానాం - ప్రాణినా మార్తి నాశనం.
.  కోరను రాజ్య సుఖంబును.
కోరను స్వర్గంబు నిజము. కోరను ముక్తిన్.
కోరెద దుఃఖార్తుల దరి
చేరి, తపన బాపి, రక్ష సేయుండనుచున్.
భావము.  భారతీయుడు తన హృదయములో ఇలా అనుకొంటున్నాడు. నేను రాజ్య సంపద కోరను. స్వర్గము ప్రాప్తింప జేయమని కోరను. జన్మ రాహిత్యము వాంఛింపను. సంసార దుఃఖ సంతప్తులైయున్నవారికడనుండి వారి ఆర్తిని బాపి, వారి దుఃఖమును పోగొట్టమని మాత్రము కోరుదును.

శ్లో.  దేవాంశో దదాత్యన్నం! - నారుద్రో రుద్ర మర్చ్యతే!

నా నృషిః కురుతే కావ్యం! - నావిష్ణుః పృథివీపతిః!!

తే.గీ.  కలుఁగ దైవాంశ దాతగా వెలుగునతఁడె.

రుద్రుఁడగువాఁడె చేయు రుద్రార్చనంబు.

ఋషియె కావ్యంబు వ్రాయనౌనెన్ని చూడ.

కలుఁగ విష్ణ్వంశ రాజుగా వెలుగునతఁడె.

భావము. దేవతాంశ లేనియెడల అన్నదాత కాజాలడు; రుద్రాంశ లేనిచో రుద్రుని అర్చించడు; ఋషి గానిచో కావ్యమును రచించలేడు; విష్ణు అంశ లేనివాడు రాజ్యపాలకుడు కాలేడు.

శ్లో.  ద్విషంతి , యాచంతే , పరనిందాం కుర్వతే 
అనాహూత చాయాంతి , తేనాశ్మనో உపి దేవతాః! 
తే.గీ.  ద్వేషమెఱుగదు, యాచనతెలియదెపుడు, 
పరులనిందింప నేరదు. పరులకడకు 
పిలువ కుండగ వెళ్ళదు. వీటి వలన 
దైవమైనది రాయియు. తలపరేల?
భావము. ఎవరినీ ద్వేషించటంలేదు, ఎవరినీ యాచించటంలేదు, పరనింద చేయటంలేదు, పిలువని చోటికి వెళ్ళటంలేదు - కారణాలవల్ల శిలలుకూడా దేవతలౌతున్నాయి !

శ్లో.  నరస్య నరో దాసో  -  దాసస్త్యర్థస్య భూపతే |

గౌరవం లాఘవం వాపి  -  ధనాధననిబంధనమ్ || (హితోపదేశం)

తే.గీ.  నరుఁడు దాసుడు కాడిల నరులకెన్న,

ధనమునకుమాత్రమే యగు దాసునిగను,

సుగుణధము సద్ధనమౌను చూడగాను,

గౌరవాగౌరవములబ్బు కలిమిఁ బట్టి. 

భావము.  మనిషికి మనిషి దాసుడు కాదు, అతను ధనానికి దాసుడు. గౌరవం ఉండటం, లేకపోవటం అనేవి మనిషి వద్ద ఉన్న ధనంపై ఆధారపడి ఉంటాయి.

శ్లో. నిందాం స్తుతిం కుర్యాత్ , కించి న్మర్మణి స్పృశేత్
నా உ తివాదీ భవే త్తద్వత్, సర్వత్రైవ సమో భవేత్. 
. నెగడకుమెవ్వరినైనను 
పొగడకుమెవ్వరినికూడ, పొందని పలుకుల్
తగదెప్పుడు పలుక పరుల, 
సుగుణంబులతోడ మెలగి శోభిల్లుమిలన్.
భావము. ఎవరినీ నిందించకూడదు, పొగడకూడదు, ఎకసక్కెపు మాటలు మాట్లాడకూడదు. అతి భాషణమూ కూడదు.అన్నిటియందు ,అందరియందు సమభావం కలిగి ఉండాలి. 

శ్లో.  నిష్క్రుతై రుదితై: బ్రహ్మ వాదిభి - స్తథా విశుధ్యత్యఘవాన్ వ్రాతాదిభి:
యథా హరేర్నామ పదైరుదాహృతై - సదుత్తమః శ్లోక గుణోపలంభకం (భాగవతము 6-2-11)
. వ్రతముల చెప్పిన విధమున
గతిమార్చగ లేవు పాప కర్ముల దురితో
ద్గతి హరినామ మహాత్మ్యం
బతులితముగ బాపి కాచు, ప్రాపుగ నిలుచున్.
భావము.  చాన్ద్రాయణాది వ్రతములు పాపాత్ములను పాపముల నుండి శాస్త్రములలో చెప్పిన రీతిని తరింప జేయలేవు.  ఏలననగా, తాత్కాలిక వ్రతాదుల వలన పాప వాసన, పాప బీజము నశింపవు.  కాని కృష్ణ నామమును ఉచ్చరించుట వలన పూర్వక్రుత పాపమే గాక, పాపమునకు మూలకారణమగు అవిద్య గూడ తొలగి పోవును.  సమస్త పాపములనుండి రక్షించి ముక్తి నొసంగునది హరి నామమే కావున దీనికి మించిన వ్రతము వేరొకటి లేదు.  

శ్లో.  పశ్యతి జన్మాంధః  - కామాంధో నైవ పశ్యతి!

పశ్యతి మదోన్మత్తః - అర్థీ దోషాన్ పశ్యతి ||

తే.గీ.  పుట్టు గ్రుడ్డి తా కనలేడు పూర్తిగాను,

కనగలేడు కామాంధుండు గణనచేసి,

కనగలేడుమదోన్మాది గౌరవమును,

కనగలేడర్థి చెడు, మంచి, మనసుపెట్టి. 

భావము.  పుట్టుగ్రుడ్డి చూడలేడు. కామాంధుడు కూడ మంచిచెడ్డలను చూడడు. మదోన్మత్తుడైనవాడు కూడ ముందు వెనుక చూడడు. కోరికలుగల మనుష్యుడు కూడా చేయు పనిలోని మంచిచెడ్డల గమనింపడు.

శ్లో.  నమన్తి ఫలితా వృక్షాః   -  నమన్తి విబుధా జనాః

శుష్కకాష్ఠానిమూర్ఖాశ్చ   -  భిద్యన్తే నమన్తి

తే.గీ.  ఫలములిచ్చెడి వృక్షముల్ వంగియుండు,

వంగుదురుబుధుల్ చేయుచు వందనమ్మ,

ఎండు కర్రలున్ మూర్ఖులు నెన్నటికి

వంగఁ బోవక వ్రయ్యలౌన్ వసుధపైన.

భావము.  ఫలాలను ఇచ్చే చెట్టు ఎల్లప్పుడూ (పండ్ల బరువు కారణంగా, భూమి వైపు) వంగి ఉంటుంది. అదేవిధంగా, జ్ఞానులు నమస్కరించడం ద్వారా ఇతరులను గౌరవిస్తారు. అయితే, జ్ఞానం లేని వ్యక్తులు ఎండిన కర్రల లాంటివారు, అవి విరిగిపోతాయి కానీ ఎప్పుడూ వంగవు.

శ్లో.  నమః పవిత్రే జగదేక చక్షుషే  -  జగత్ ప్రసూతి, స్థితి, నాశ హేతవే,
త్రయీమయాయ త్రిగుణాత్మ ధారిణే  -  విరించి, నారాయణ, శంకరాత్మనే.
.  జగదేక చక్షు సవితకు,
జగములకన్నిటికి మూల సంస్థిత రవికిన్,
త్రిగుణాత్మగను, త్రిమూర్త్యా
త్మగ గల సూర్యునికి నుతులు మది నొనరింతున్.
భావము.   జగదేక చక్షువైన సూర్య భగవానునకు నమస్కార సహస్రములు. సర్వ జగత్తుల సృష్టి స్థితి లయలకు కారణభూతుఁడై, వేద స్వరూపుఁడై, త్రిగుణాత్మకుఁడై, బ్రహ్మ, విష్ణు, మహేశ్వరాత్మకుఁడగు సవితకునా నమస్సులు అర్పించుచున్నాను.

శ్లో.  నమః సూర్యాయ శాంతాయ  -  సర్వరోగ నివారిణే!

ఆయు రారోగ్య ఐశ్వర్యo  -  దేహి! దేవః జగత్పతే!!

తే.గీII.  సూర్య దేవా! జగత్పతీ! శుభద! నతులు!

రోగములు పాపి శాంతి సద్యోగములను

కొలుపువాఁడవు కృపతోడఁ గొలుపు మాకు

ఆయురాగ్య సంపదలనుపమముగ.

భావము:-

సూర్యదేవ! జగత్ పరిపాలకా! నీకిదే నా నమస్కారము. నీవు సర్వరోగములను 

తొలగించువాడవు. శాంతిని ఒసంగువాడవు. మాకు ఆయువును,ఆరోగ్యమును, 

సంపదను అనుగ్రహించుము.

శ్లో. న మాతరి దారేషు న సోదర్యో నచాత్మజే
విశ్వాసః తాదృశః పుంసాం యావన్ మిత్రే స్వభావజే.
. తల్లి, దండ్రి కంటె తనయుని కంటెను
భార్య కంటె తనదు భగిని కంటె
తృప్తి నొసగు వాడు మిత్రుడే యని నమ్ము
పురుషులెపుడు కూడ పుడమి పైన.

భావము.  పురుషులెప్పుడూ కూడా తన తల్లిదండ్రుల కంటే, తన సంతానమును కంటే, తన భార్య కంటే, తన సోదరి కంటే కూడా తనకు మిత్రుడే తృప్తిని కలిగిస్తాడని నమ్ముతుంటాడు.

శ్లో. నమృత్యు ర్నశంకా మే జాతి భేదః  పితా నైవ మే నైవ మాతా జన్మ.
బంధు ర్న మిత్రం గురుర్నైవ శిష్యః. చిదానంద రూపః శివోహం శివోహమ్.
తే.గీ . లేవు చావు భయంవులు లేదు జన్మ.
లేరు తల్లియు తండ్రియు, లేరు గురువు.
లేదు జాతి భేదము నాకు లేరు శిష్యు
లిలను బంధువుల్లేరు నేఁ దెలియ శివుఁడ.
భావము. మృత్యువు, భయము, జాతి భేదము, నాకు లేవు. నాకు తల్లి తండ్రి, బంధు మిత్రులు, గురువు, శిష్యుఁడు లేరు. నేను చిదానంద రూపుఁడను,  శివుఁడను, నేను శివుఁడను. 

శ్లో. నమోస్తు రామాయ సలక్షణాయ, - దేవ్యైచ తస్యై జనకాత్మజాయై,
నమోస్తు రుద్రేన్ద్రయమానిలేభ్యో, - నమోస్తు చన్ద్రార్కమరుద్గణేభ్యః. 
.  వందనమాచరింతు రఘువంశ సలక్ష్మణ రామ మూర్తికిన్.
వందనమాచరింతు జనవందిత శ్రీ జనకాత్మజాంబకున్.
వందన మింద్ర, వాయు, యమ, భాస్కర, చంద్ర, మరుద్గణాళికిన్.
వందన మాచరింతు గురు వర్యులు వేంకటరాఘవార్యకున్.
భావము. లక్ష్మణుడితో కూడుకుని ఉన్న రాముడికి నమస్కారము, జనకుని కూతురైన సీతమ్మకి నమస్కారము, రుద్రుడికి, ఇంద్రుడికి, యముడికి, వాయుదేవుడికి నమస్కారము, చంద్రుడికి, సూర్యుడికి, దేవతలందరికి నమస్కారము. గురుశ్రేష్టులై మాగురుదేవులు శ్రీమాన్ కల్వపూడి వేంకట వీర రాఘవాచార్యులవారికి నమస్కారము చేయుచున్నాను.

శ్లో.  నమస్తే కుసుమా ధారే, నమస్తే కమలాలయే

పుష్పాణి విష్ణు పూజార్థం, ఆహరిష్యే తవాజ్ఞయా!

తే.గీ.  వందనము నీకు పుష్ప సౌభాగ్యధారి!

వృక్ష రాజమ! హరికి నే బ్రీతి తోడ

పూజ సేసెద పూలతో. పూలు కోయ

నానతిని వేడు చుంటి. నా కానతిమ్ము.

భావము.  పూవులకు ఆధారమయిన ఓ వృక్షరాజమా! ఓ లక్ష్మీ నిలయమా! నీకు నమస్కరించుచున్నాను.నీ అనుమతితో దేవుని పూజ కొఱకుపూవులు కోసుకొని తీసుకొనుచున్నాను. అనుమతించుము.

శ్లో. న రణే విజయాత్ శూరో అధ్యయనాత్ పండితః
వక్తా వాక్పటుత్వేన దాతా అర్ధ దానతః
ఇంద్రియాణాం జయే శూరో ధర్మాచరతి పండితః
హిత ప్రయోక్తిభిః వక్తా దాతా సన్మాన దానతః
తే.గీ.  యుద్ధ విజయుండు శూరుఁడా యిద్ధరిత్రి?
గ్రంథ పఠనఁ బండితుఁడుగా కాగలుగునె?
వాక్పటుత్వంబు కలిగినన్ వక్త యగునె?
ధనమొసంగిన మాత్రాన దాత యగునె?
తే.గీ.  ఇంద్రియ జితుండె శూరుడౌ నెరుగ నిజము.
ధర్మ వర్తుఁడె సూరియౌ ధరణిపైన
హిత ప్రవక్తయె వక్తయౌ ననుపమ గతి.
తరళ సన్మాన దాతయే దాత. నిజము.
భావము. రణభూమి లో గెలుచినంత మాత్రం శురుడు కాలేడు,  నాలుగు గ్రంధాలు అధ్యయనం చేసినంతమాత్రాన పండితుడు కాలేడు, 
అనర్ఘళంగా మాట్లాడినంత మాత్రాన వక్త అనిపించుకోడు,  ధనం వెచ్చించినంత మాత్రాన దాతా కాడు. ఇంద్రయాలను జయించినవాడు శూరుడు, ధర్మాన్ని ఆచరణలో పెట్టగలిగినవాడు పండితుడు, హితోక్తులు చెప్పగలిగినవాడు వక్త, చివరగా మాన గౌరవాలకు భంగం కలగకుండా సహాయం చేసేవాడు దాత.

శ్లో. నరత్వం దుర్లభం లోకే , విద్యా తత్ర సుదుర్లభా 
శీలం దుర్లభం తత్ర వినయస్తత్ర సుదుర్లభః.
. నర జన్మము దుర్లభమిల, 

వర విద్య సుదుర్లభంబు వర గుణ శీలం

బరయగ దుర్లభమందున

వర వినయము దుర్లభంబు వర్ధిల మనకున్.

తే.గీ.  తొలుత జగతిని నర జన్మ దుర్లభంబు.
తోడనబ్బుట సద్విద్య దుర్లభంబు.
తుదకు సత్ కవి యగుటిల దుర్లభంబు.
దుర్లభోత్పత్తి యుతు డందు దుర్లభంబు.

భావము. లోకంలో మానవజన్మ లభించుటయే దుర్లభం. విద్య (జ్ఞానం) అబ్బటం మరింత దుర్లభం.మంచి నడవడిక , వినయం సిద్ధించటం ఇంకా దుర్లభం.

శ్లో. నరస్యాభరణం రూపం ,రూపస్యాభరణం గుణః
గుణస్యాభరణం జ్ఞానం , జ్ఞానస్యాభరణం క్షమా.
తే.గీ.  మనుజునకు రూపమే యాభరణము తలప.
గుణమె రూపంబునకునాభరణము కనగ.
గుణమునకుజ్ఞానమే యాభరణము తెలియ.
క్షమయె యాభరణంబు సు జ్ఞానమునకు.
భావము.  మానవునకు రూపమే ఆభరణం. రూపానికి గుణం ఆభరణం. గుణానికి జ్ఞానమే ఆభరణం .జ్ఞానానికి క్షమాశీలం ఆభరణం. 

శ్లో.  విత్తందర్శయేత్ప్రాజ్ఞః - కస్య చిత్స్వల్పమప్యహో

మునేరపి యతస్తస్య - దర్శనాచ్ఛలతేమనః ౹౹

తే.గీ. ధనమునించుకైననుగాని ధరను ప్రజకు

చూపుటొప్పదు ప్రాజ్ఞులు, సుగుణభాస!

ధనము కనినచో మునులకున్ దానిపైన

మనసు కలుగు చలించుచు, మాయఁ జిక్కి.     

భావము.  తెలివయినవాఁడు ఎవరికీ కొంచం కూడా డబ్బుని చూపెట్టక్కూడదు. డబ్బుని చూసిన వెంటనే ముని మనస్సుకూడా చంచలంగా మారుతుంది.

శ్లో.  వినా పరవాదేన రమతే దుర్జనో జనః
కాకః సర్వరసాన్భుక్త్వా వినామేధ్యం తృప్యతి. 

.వె.  వ్యర్థ వాదనలననర్థంబు కలిగించు 

దురితుడితరులకు వదరుచు సతము.

మంచి తిండి తినియు మలినము తినునట్టి 

కాకి వోలె బుద్ధి లేక మెలగు.

భావము. దుర్జనుడు ప్రతిరోజూ ఇతరులతో వాదన పెట్టుకుంటేనేగానీ సంతృప్తి చెందడు. కాకి ఎంతో రుచికరమైన పదార్థాలను ఎన్ని తిన్నా, అపవిత్ర పదార్థం తింటేనేగానీ తృప్తి చెందదుకదా! 

శ్లో.  వ్యాధయో నాపి యమః - ప్రాప్తుం శ్రేయః ప్రతీక్షతే |

యావదేవ భవేత్ కల్పః - తావచ్ఛ్రేయః సమాచరేత్ || (మహాభారతం)

తే.గీ.  వ్యాధులును, యముఁ డాగరు పరగు మంచి

పనిని చేయుచుంటిమనుచు, భవ్యులార!

సమయ మది చిక్కినప్పుడే చక్కనైన

మంచి పనులను చేయక మసల రాదు.    

భావము.  మనిషి సత్కార్యములను చేసి ముగించనీ అని రోగాలుగానీ, యముడుగానీ (చావుకానీ) కాచుకుని కూర్చొనివుండవు. ఎప్పుడు అవకాశం కానీ సామర్థ్యం కానీ ఉంటుందో అప్పుడే మంచి పనులను చేసివేయాలి.

శ్లో.  శరీర మల త్యాగాత్ నరో భవతి నిర్మలః.
మానసేతు మలే త్యక్తే తతో భవతి నిర్మలః !!
కం. శారీరక మలినములను
దూరము గావించినంత తొలగదు మలినం
బేరీతినైన మది గల
ఘోరపుమలినంబు బాపు కొన నిర్మలుడౌన్.
భావము.  మనుజుడు స్నానాదులతో శారీరక మలినము బాపుకొనినంత మాత్రాన నిర్మలుడు కాజాలడు. మానసమున స్థిరమైయుండు ఘోరమైన మలినమును సాధన చేసి బాపుకొన గలిగిన నాడే నిర్మలుడవగలడు.

 శ్లో.  శ్రేయః సతతం తేజో  -  నిత్యం శ్రేయసీ క్షమా |

తస్మాన్నాత్యుత్సఽజేత్ తేజో  -  నిత్యం మృదుర్భవేత్ || (హితోపదేశం)

తే.గీ.  కోపమొప్పదు సతతంబు,  గుణనిధాన!

క్షమయు సతతంబు తగదయ్య! గౌరవాఢ్య!

నీ పరాక్రమమనయంబు చూపబోకు,

నీ మృదుత్వమున్ చూపకు నిత్యమిలను.   

భావము.  ఎల్లపుడూ శౌర్యంతో కోపగించుకోవడం శ్రేయస్కరం కాదు. ఎన్నెన్నటికీ క్షమాశీలతతో ఉండటమూ అంత  శ్రేయస్కరం కాదు. అందువలన ఎల్లపుడూ పరాక్రమాన్ని ప్రదర్శించడమూ, మృదువుగా ఉండటమూ మంచిది కాదు.

శ్లో.  నష్టం ద్రవ్యం లభ్యతే కష్టసాధ్యం,నష్టా 

విద్యా లభ్యతే sభ్యాసాయుక్తా

నష్టారోగ్యం సూపచారై: సుసాధ్యం

నష్టా వేలా యా గతా సా గతైవ ౹౹

తే.గీ.  నష్ట ధనమది పొందనౌ కష్టపడిన,

చదువు మరచిన పొందనౌన్ జదివి మరల,

స్వాస్త్యమది చెడన్ వైద్యాన సరిగనగును,

గడుచు కాలము మరిరాదు కనుడు నిజము.

భావము.   పోయిన సంపద కష్టపడి మళ్ళీ సంపాదించ వచ్చు.  మరచి పోయిన విద్యను మళ్ళీ చదివితే పొందవచ్చు. 

ఆరోగ్యం చెడిపోతే చికిత్సలు చేసి అది కూడా పొందవచ్చు.అయితే,పోయిన సమయం తిరిగి మనకి దొరకదు.

శ్లో. సా సభా యత్ర సంతి వృద్ధా, తే వృద్ధా యే వదంతి ధర్మం 
నాసౌ ధర్మో యత్ర సత్యమస్తి , తత్ సత్యం యత్ఛలేనాభ్యుపేతమ్. 
తే.గీ.  సభను పెద్దలు లేనిచో సభ యగునికొ?. 
సిద్ధ ధర్మంబు తెలుపమిన్ బెద్ద యగునె? 
ధర్మ మది సత్య దూరము ధర్మమగునె? 
నిత్య వంచన యుక్తము సత్యమగునె?
తే.గీ.  ఒక్క డైనను వెలుగని, ఒక్కరుండె
వెలుగు సభ యది సభ కాదు. వెలుగ వలయు
సభికు లెల్లరు సభలోన. సభికు లొకరి
కొకరు వెలుగ జేయ వరలు సకల సభలు.

భావము. ఎక్కడ పెద్దలుండరో అది సభయేకాదు. ఎవరు ధర్మం చెప్పరో వారు పెద్దలే కారు. ఎక్కడ సత్యం ఉండదో అది ధర్మమే కాదు. ఏది వంచనతో కూడి ఉంటుందో అది సత్యమేకాదు.

శ్లో.  స్వర్గే బ్రహ్మలోకే వా  - తత్సుఖం ప్రాప్యతే నరైః! 

యదార్తజంతు నిర్వాణ  - దానోత్థమితి మే మతిః!!

తే.గీ. కష్ట జీవులనెన్నుచు కనికరమున

నాదుకొన్నచో నానందమాత్మకబ్బు, 

బ్రహ్మలోకాన, స్వర్గాన వరలు సుఖము

సాటి రావిల దీనికి సత్యమిదియె.

భావము.  కష్టంలో ఉన్న జీవులను ఆదుకోవడంలో ఉన్న సుఖం సామాన్యమైనది కాదు. స్వర్గంలో కానీ, బ్రహ్మలోకంలో కానీ అంతకు సమానమైన సుఖం దొరకదంటే దొరకదు.

శ్లో.  హింస్యాత్ సర్వభూతాని  -  మైత్రాయణచరో భవేత్ |

నేదం జీవితమాసాధ్య  -  వైరం కుర్వీత కేనచిత్ ||  (మహాభారతం)         

తే.గీ.  ప్రాణులనుహింసచేయుట పాపమగును,

జీవులకు స్నేహమందించు జీవితమున,

మనుజ జన్మంబు మహితము, మాను హింస,

మానవునిగ నీధర్మంబు మానవలదు.

భావము.  ప్రాణిని కూడా హింసించకూడదు. ప్రతి జీవితో స్నేహభావంతో వ్యవహరించాలి. మానవ జన్మ లభించిన తర్వాత ఎవరి పట్ల కూడా శత్రుత్వాన్ని సాధించకూడదు.

శ్లో. హి పూరయితుం శక్యః లోభః ప్రీత్యా కథంచన 
నిత్యగంభీర తోయాభిరాపగాభిరివాంబుధిః.
తే.గీ.  వెలయు  నదులెల్ల సతతము  కలియుచుండు
జలధి నైనను సంతృప్తి కలుగనేర
దున్న దంతయు లోభికి నొసగి చూడు
తృప్తి చెందడా యధముఁడు తెలియుఁడయ్య.
భావము.  నిరంతరంగా నదుల జలాలు తనలోనికే ప్రవహిస్తున్నా , సముద్రానికి తృప్తి కలుగనట్లే , ఇష్టమైన దానినిచ్చి లోభిని సంతృప్తి పరచటం ఎవరికీ సాధ్యం కాదు. 

 శ్లో.  హ్యస్త్యవిద్యా మనసోఽతిరిక్తా  - మనో హ్యవిద్యా భవబన్ధహేతుః

తస్మిన్వినష్టే సకలం వినష్టం  - విజృమ్భితేయస్మిన్సకలం విజృమ్భతే ।।

(వివేకచూడామణి 169)

తే.గీ.  వెలుపల మదికి నెన్న నవిద్య లేదు,

మనసవిద్య, బంధముల్ మనకుఁ గొలుపు,

నది నశించిన నశియించు నన్నియుఁ గన

నది విజృంభింప రేకెత్తునన్నియు, హరి!

భావము.  మనస్సు వెలుపల అజ్ఞానం (అవిద్య) లేదు. మనస్సు ఒక్కటే అవిద్య, పరివర్తన బంధానికి కారణం. అది నాశనమైనప్పుడు, మిగతావన్నీ నాశనమవుతాయి, మరియు అది వ్యక్తమైనప్పుడు, మిగతావన్నీ వ్యక్తమవుతాయి.

 శ్లో.  నానృషి: కురుతే కావ్యం, నా గంధర్వః సురూపభ్రుత్

నా దేవాంశో దదాత్యన్నం నా విష్ణు: పృథివీ పతి:.

తే.గీ.  ఋషియె కాకున్న కావ్యము నసదృశముగ

వ్రాయలే డగంధర్వుఁడువరలడంద

ముగ, భగవదంశలేకున్నభుక్తినిడడు.

లేక విష్ణ్వంశ రాజు కాలేడు ధరణి. 

భావము. ఋషి కాకున్నచో కావ్యర్చన చేయ లేడు.  దేవతాంశ లేకున్నవడు 

ఆకర్షణీయమైన రూపముతో నొప్పలేడు.  దైవాంశ లేనివాడు ఎవరికీ అన్నము  

పెట్టఁజాలడు. విష్ణ్వంశ లేనివాడు రాజు కాలేడు.

శ్లో.   నానిష్టం ప్రవదేత్ కస్మిన్  న ఛిద్రం కస్య లక్షయేత్.
ఆజ్ఞా భంగస్తు మహతాం రాజ్ఞః కార్యః నవై క్వచిత్.
.వె.  పలుకకు మితరులకు పరువు బాపెడి మాట.
ఎంచఁ బోకితరుల వంచనలను.
పెఅద్దవారి మాట పెడచెవి పెట్టకు.
రాజునాజ్ఞవుడువ రాదు.గనుమ.
భావము.  ఎవరికినీ అపకారకమైన మాటలు పలుకకుము. ఇతరుల లోపములెంచ వలదు. మహాత్ముల యొక్క, రాజుల యొక్క మాటలను మీరి నడువకుము.

శ్లో.  నాప్రాప్యమభివాంఛంతి   -  నష్టం నేచ్ఛంతి శోచితుం

ఆపత్సు ముహ్యంతి   -  నరాః పండిత బుద్ధయః ౹౹

(కహాభారతం - ఉద్యోగపర్వం)

తే.గీ. ప్రాప్తమవనట్టిదానికై పరుగులిడరు,

తాము కోలుపోయిన దానిఁ దలపరు మది,

ఆపదలవేళ మోహమ్మునందబోరు,

బుద్ధిమంతులౌ పండితుల్, బుధవరేణ్య!   

భావము.  ప్రాప్తి లేనిదాన్ని వివేకం ఉన్న పండితులు ఆశించరు.నష్టమైనదానికి చితించరు.అలాగే, ఆపత్తు కాలంలో మోహానికి గురి కారు.

శ్లో.  నా భుక్తం క్షీయతే కర్మ, కల్ప కోటి శతైరపి, 
అవశ్యమను భోక్తవ్యం కృతం కర్మ శుభాశుభమ్.
.వె.  బ్రహ్మకల్పములవి పదికోట్లు గడిచినా
యనుభవించనట్టి యఖిలకర్మ
ఫలములు నశియించవిల జీవ కోటికి
ననుభవింప వలయునఖిలములును.
భావము.  అనుభవించకుండా కర్మ ఫలము కోటి బ్రహ్మ కల్పములు గడిచిననూ నశింపదు. అది శుభమైననూ, అశుభమైననూ దాని ఫలమును మనము తప్పక అనుభవింపవలసినదే.

శ్లో.  నాభ్యుత్థానక్రియా యత్ర  -  నాలాపా మధురాక్షరా |

గుణదోషకథా నైవ  -  తత్ర హర్మ్యే గమ్యతే ||  (పంచతంత్రం)

తే.గీ.  గౌరవముగ తా నిల్చి స్వాగతము పలుక

నట్టి, తీయగా తగఁ బల్కనట్టి, కష్ట

సుఖములడుగనేర్వనియట్టి సఖుల యింటి

కేగగా రాదు, కనుడు సద్ భాగులార!        

భావము.  నిలచి స్వాగతించని వాడి యింటికి, తీపి మాటలు పలకని వాడి యింటికి, కష్ట సుఖాలను విచారించని వాడి ఇంటికి వెళ్ళకూడదు.

 

శ్లో.  నాఽస్తి కామసమో వ్యాధిః |  -  నాఽస్తి మోహసమో రిపుః |

నాఽస్తి కోపసమో వహ్నిః |  -  నాఽస్తి జ్ఞానాత్‌ పరం సుఖమ్‌ ||

తే.గీ.  కామమును మించు వ్యాధియే కనఁగ లేదు,

మోహమునుమించఁ గల్గు రిపువన లేదు,

కోపమును మించ లేదగ్ని కువలయమున,

జ్ఞానమునుమించు సుఖమిం గనఁగ లేదు. 

భావము.  కామముతో సమానమైన వ్యాధి మఱొకటిలేదు. మోహముతో సమానుడైన శత్రువు మఱొకడు లేడు. కోపముతో సమానమైనది మఱొక యగ్ని లేదు. ఆత్మజ్ఞానమునకు మించిన సుఖమింకొకటి లేదు.

శ్లో.  నాస్తి మేఘసమం తోయం - నాస్తి చాత్మసమం బలమ్!

నాస్తి చక్షుఃసమం తేజో - నాస్తి ధాన్యసమం ప్రియమ్!!

తే.గీ.  జలద జలము కన్నను శుద్ధ జలము  లేదు,

ఘన మనోబలమును మించి కనఁగ లేదు,

కన్నులకు కల్గు తేజమ్ము కలుగఁబోదు.

అన్నమునుమించి ప్రియమైన దరయలేము.

భావము.  మేఘ జలముతో సమానమైన శుద్ధ లము లేదు. ఆత్మ బలముతో సమానమైన బలము మరొకటి లేదు. కన్నుతో సమానమైన తేజస్సు గల యింద్రియము శరీరములో మరొకటి లేదు. ఆహారముతో సమానమైన ప్రియమైన వస్తువు మరొకటి లేదు.

శ్లో.  నారాయణం నమస్కృత్య  -  నరం చైవ నరోత్తమం

దేవీం సరస్వతీం వ్యాసంతతో జయముదీరయేత్

తే.గీ.  నతులు నారాయణునకును, నతులితముగ

నరులలోనుత్తముండైన నరునికి నిక

వాణికిన్ వ్యాసునకుఁ జేసి, పలుకవలెను

పరమ పౌరాణికుల్ జయమరసి మొదటె.

భావము.  నారాయణునికి, నరునికి, నరులలో ఉత్తమునికి, సరస్వతిదేవికి, వ్యాసుడికి నమస్కరించి జయమును (పురాణకథనమును) చెప్పాలి. (ప్రతి పురాణం ప్రారంభంలో శ్లోకం చెప్పటం పరంపర.)

శ్లో.  నారాయణో నామ నరో నరాణాం

ప్రసిద్ధ చౌరః కథితః పృథివ్యామ్ |

అనేక జన్మార్జితపాపసంచయం

హరత్యశేషం స్మరతాం సదైవ ||

(పాండవగీత)

తేగీ.  నరుఁడు నారాయణాఖ్యుఁడు ధరను జనులు

స్మరణ చేసిన మాత్రాన నిరుపమముగ

దోఁచు నార్జిత పాపముల్, దొంగయతఁడు,

మదులలో దాగియుండును, వెదకి కనుఁడు.

భావము.  నారాయణ అనే ఒక మనిషి అత్యంత ప్రసిద్ధి చెందిన దొంగగా లోకంలో చెప్పబడుతున్నాడు. ఎవరైనా అతన్ని ఒకసారి స్మరిస్తే చాలు, వారి అనేక జన్మల పాపఫలాలను అతను క్షణంలోనే పూర్తిగా అపహరిస్తాడని అంటారు.

౪౦౦. శ్లో.  నారికేళ సమాకారా దృశ్యంతేహి సుహృజ్జనా:l
అన్యే బదరికాకారా బహిరేవ మనోహరా: ll 
తే.గీ.  నారికేళ మట్లు ధీరోత్తములు బైట

కగపడినను మనసు కరుణ మయము.

రేఁగు పండు వోలె బాగుగా నితరులు

కనఁ బడినను లోన కఠిన మరయ.

భావము.   మంచి మనసు గల ఉత్తములు కొబ్బరికాయ వంటి వారు.పైకి పెటుకుగా ఉన్ననూ, వారి అంతఃకరణ రస మయము. తదితరులు రేగుపండు వలె పైకిమాత్రం మనోహరమ్గానే ఉంటారు.

శ్లో.  నారుంతుదః స్యాదార్తోఽపి  -  పరద్రోహకర్మధీః |

యయాస్యోద్విజతే వాచా   -  నాలోక్యాం తాముదీరయేత్ ||   (మనుస్మృతి)

తే.గీ.  బాధలందున మనమున్నఁ బరులఁ బాధ

పెట్ట రాదు, ద్రోహముఁ దలపెట్టరాదు,  

పరులకసహనమగునవి పలుకరాదు,

పలుకరాదనుచితములు, బ్రహ్మవిదుఁడ!       

భావము.  మనమే బాధలలో ఉండినా, ఇతరులకు బాధ కలిగించే మాటలు పలుకకూడదు. ఇతరులకు ద్రోహమయ్యే పని చేయకూడదు, అలాగే అలాంటి ఆలోచనలు కూడా ఉండకూడదు. ఇతరులకు అసహనాన్ని కలిగించే, సామాజిక మర్యాదలకు విరుద్ధమైన లేదా అనుచితమైన మాటలు మాట్లాడకూడదు.

శ్లో.  నాహం జానామి కేయూరే, నాహం జానమి కుండలే.

నూపురేత్వభి జానామి, నిత్యం పాదాభి వందనాత్!!

తే.గీ.  ఉండు గావుత కేయూర కుండలములు

తల్లి నాయమ సీతకు. తలప నెఱుగ.

అందెలాతల్లివే. కందు ననవరతము

వందనంబులు చేసెడె వాడనగుట.

భావము.  అన్నా! కేయూర కుండలములను నే నెఱుగను. అందెలు మాత్రము నే నెఱుగుదును. నిత్యమూ నా తల్లి సీతమ్మకు పాదాభి వందనము చేయు సమయమున వీటిని కనెడి వాడను కాన ఇవి సీతమ్మవే అని ఎఱుగుదును.

శ్లో. నిందాం యః కురుతే సాధోః - తథా స్వం దూషయత్యసౌ।

ఖే భూతిం యః క్షిపేదుచ్ఛై - ర్మూర్ధ్ని తస్యైవ సా పతేత్॥

తే.గీ.  సుజనులను నింద చేసిన చూడ తనను

తానె నిందించుకొనుటౌను, జ్ఞానులార!

బూడిదను పైకి విసిరిన పూర్తిగాను

మీదె పడునది, తెలియుఁడు మోదమలర.  

భావము.  సత్పురుషుని నింద చేసేవాడు తనను తానే నిందించుకున్న 

వాడవుతాడు. ఆకాశంలోకి గట్టిగా బూడిదను విసిరితే అది అతడిపైకే 

వచ్చి పడుతుంది కదా.

శ్లో.  నిజ సౌఖ్యం నిరుంధానో యో ధనార్జన మిచ్ఛతి
పరార్థం భారవాహీవ క్లేశస్యైవ హి భాజనమ్.
కం. ధనమును సంపాదించుచు 
తనకొఱకది వాడుకొనక దాచుచుచునుండున్ 
తనవారి కొఱకు నెవ్వఁడు 
తనసుఖమును వీడు నతఁడు. తనదుఃఖమదే.
భావము. తన సుఖాన్ని కాదనుకొని , ఎవడు ధనాన్ని సంపాదించాలనుకుంటాడో , వాడు - పరులకోసమే బరువులు మోసేవాడై కేవలం దుఃఖపాత్రుడౌతాడు.

శ్లో.  నిత్యం క్రోధాచ్ఛ్రియం రక్షేత్త - పో రక్షేచ్చ మత్సరాత్|

విద్యాం మానావమానాభ్యాం - ఆత్మానం తు ప్రమాదతః|| 

తే.గీ.  కోపము వలన లక్ష్మిని, కూరుకొను

సూయ వలన తపంబును, స్వీయ

గౌరవాగౌరవములచే జ్ఞాన విద్య,

తప్పుచే నాత్మఁ జెడనీకు, ధర్మ నిరత!

 తే.గీ.  కోపమున సిరి చెడకుండ, గొప్ప తపము

మత్సరంబున చెడకుండ, మానమునవ

మానములచేత విద్య, ప్రమాదమునను

నాత్మ చెడకుంద చూచుకో, స్వాత్మవిదుఁడ!

భావము. 

ఎల్లప్పుడునూ - కోపము వలన ఐశ్వర్యమును, అసూయ వలన తపస్సు, 

మానావమానముల వలన విద్య, పొరపాటు వలన ఆత్మ చెడకుండా 

కాపాడుకోవలెను.

శ్లో.  నిత్యాన్నదాతా నిరతాగ్నిహోత్రీ వేదాంతవిణ్మాస సహస్ర జీవీ
పరోపకారీచ పతివ్రతాచ షట్ జీవ లోకే మమ వందనీయా:.95.
.వె. అన్నదాతయు; ప్రథిత నిత్యాగ్ని హోత్రి;
వేదసంపన్నుఁడును; వయో వృద్ధ నరుఁడు;
పరుల కుపకారి; నుత పతి వ్రతయు నాకు
వందనీయులు. భువి పైన భాగ్యనిధులు.
.వె.  అన్నదాతయు; ప్రథిత నిత్యాగ్ని హోత్రి;
వేదసంపన్నుఁడును; వయో వృద్ధ నరుఁడు;
పరుల కుపకారి; నుత పతి వ్రతయు నాకు
వందనీయులు. భువి పైన భాగ్యనిధులు.

భావము.  పేదవారికి నిత్యము అన్నదానము చేయువాఁడును; నిత్యాగ్నిహోత్రియు; వేదాంత వేత్తయు; సహస్ర చంద్ర దర్శనము చేసినవయో వృద్ధుఁడు; పరోపకార పరాయణుఁడు; మహా పతివ్రత; ఆరుగురూ నాకు వందనీయులు.

శ్లో.  నిమిషం నిమిషార్థం  వా  -   జ్ఞానినో ధ్యాన చింతయా ౹

క్రతు కోటి  సహస్రాణం  -   ధ్యానమేకం విశిష్యతే ౹౹

తే.గీ.  నిమిషమే యగు లేకర్ధనిమిషమౌను

ధ్యానమన్నది చేసిన దాని ఫలము

కోటిక్రతుతుల్యమౌ గాన గొప్పదయిన

ధ్యాన సాధన చేయుము ధర్మరతుఁడ!

భావము.  నిమిషం గానీ, అరనిమిషం గానీ ధ్యానం చేస్తే వెయ్యి కోట్ల క్రతువులు చేసిన ఫలం వస్తుంది. కాబట్టి ధ్యానం ఎంతో విశిష్టమైనది.

శ్లో.  నిర్గుణ్యమేవ సాధీయో ధిగస్తు గుణ గౌరవం
శాఖినోన్యే విరాజంతే ఖండ్యంతే చందన ధృమాః !
తే.గీ.  నిర్గుణుని గౌరవింతురు నిజము కాదె?
సద్గుణుని గౌరవింపరు చక్కగాను.
విషపు వృక్షము జోలికి వెళ్ళ లేరు.
మంచి గంధపు చెట్టును త్రుంచుదు రిల.

భావము.   దుష్టులన్నను, మూర్ఖులన్నను, భయ విహ్వలురై వారి జోలికి ఎవరూ పోరు. ఆదుష్టత్వమే, మూర్ఖత్వమే వారి రక్షా కవచము. మంచివారన్నచో లోకువ కావుననే వారిని లెక్క చేయరు. చూడండి. ముండ్ల చెట్టు జోలికెవ్వరూ పోరు. మంచి గంఢపు చెట్టునయితే ముక్క ముక్కలు చేసి పట్టుకు పోతారు కదా.

శ్లో.  నిష్ణాతోsపి వేదాంతే  -  సాధుత్వం నైతిదుర్జనః                       

చిరం జలనిధౌ మగ్న : - మైనాక ఇవమార్దవమ్.

తే.గీ.  వేదశాస్త్రాదులందు తా వేత్తయగుత

దుష్టుఁడేవిధంబుగనైన శిష్టుఁడగునె?

చాలకాలము మునిగినన్ సంద్రమందు

మృదువగునొకొ మైనాకుఁడు? మృదుల హృదయ! 

భావము.        

వేదాంత శాస్త్రాలలో ఎంత నిపుణుఁడైనా చెడ్డ స్వభావమున్నవాడు 

మంచివాడుకాలేడు. చాలా కాలం నుంచి సముద్రంలో మునిగినా 

మైనాక పర్వతం మృదువుగా అవదుకదా.

శ్లో.  నిస్సారస్య పదార్థస్య ప్రాయేణాడంబరో మహాన్
సువర్ణే ద్వనిస్తాదృక్ యాదృక్ కాస్యే ప్రజాయతే.
.వె.  సార హీనమైన సకల వస్తువులకు
డంబమెక్కువయ్య! డంబు తోచు. 
కంచుమ్రోగునట్లు  కనకంబు మ్రోగదు.
చూడ ముచ్చటగును సుజన పథము.
భావము.   అల్ప వస్తువులకు ఆడంబరము ఎక్కువగా ఉంటుంది. కంచు మ్రోగునట్లు కనకము మ్రోగదు కదా!

శ్లో.  నో దేశ కాలనియమః   -  శౌచాశౌచ వినిర్ణయః!

పరం సంకీర్తనాదేవ  -  రామరామేతి ముచ్యతే!!

తే.గీ.  పలుక శ్రీ రామ రామాంచు పరవశమున

దేశకాలాల పనియేల? దీపితమగు

నాత్మ శౌచంబునకుమించి యన్యమేల?

బంధముక్తులమై ముక్తి పడయుదుముగ.

భావము.  పరమాత్మ ధ్యానమునకు దేశకాల నియమం లేదు. అదేవిధముగనే శౌచ-అశౌచ బేధమూ లేదు. శ్రీరామరామ అను పరమోత్కృష్టమగు సంకీర్తనను సమయమందు చేసినను బంధములనుండి విముక్తులగుదురు.

శ్లో. న్యాయార్జితధనస్తత్త్వజ్ఞాననిష్ఠోஉతిథిప్రియః
శాస్త్రవిత్సత్యవాదీ గృహస్థోஉపి విముచ్యతే. 
తే.గీ.  న్యాయమార్గ సంపాదన, జ్ఞాన నిష్ట, 
అతిథి ప్రీతియు, శాస్త్రజ్ఞతాసమాన 
సత్యవాక్కులనొప్పెడి సజ్జనుండు 
నయిన సంసారియును ముక్తి నందఁగలఁడు.
భావము. న్యాయంగా ధనాన్ని సంపాదించేవాడు, తత్త్వ జ్ఞాన నిష్ఠుడు, అతిథులయందు ప్రీతి కలవాడు, శాస్త్రజ్ఞుడు, సత్యం పలికేవాడు అయితే గృహస్థు కూడా ముక్తిని పొందుతాడు. (గహస్థాశ్రమం ముక్తికి ఆటంకం కాదు)

శ్లో.   పండితైః సహ సాంగత్యం - పండితైః సహ సంకథా.
పండితైః సహ మిత్రత్వం - కుర్వాణో నాஉవసీదతి.
తే.గీ.  పండితులతోడ కలయుచు వరలు వారు,
పండితులతోడ భాషించు భవ్య మతులు,
పండితులతోడ స్నేహంబు పడయువారు
నుంద్రు సుగతిని. చెడిపోవకుంద్రు, భువిని.

తే.గీ.  పండితులతోడ జీవించి ప్రబలువారు,

పండితులతోడ పల్కు సద్భాగ్యవరులు,

పండితులతోడ సన్మైత్రి వరలువారు,

పండితులవలె నిల్తురు, మెండుగాను.

తే.గీ. పండితులతోడ సహవాస భాగ్యమొకటి,

పండితులతోడ నిత్య సంభాషణొకటి,

పండితులతోడ సన్ మిత్రభావమొకటి,

కనుగు వానికి నాశంబు కలుగఁ బోదు.
భావము.  పండితులతో సాంగత్యము, పండితులతో సంభాషణము, పండితులతో స్నేహము చేయువారు ఎన్నటికీ చెడిపోరు.

శ్లో.  పక్షీణాం బలమాకాశం, - మత్స్యానా ముదకం బలణ్,

దుర్బలస్య బలం రాజా, - బాలానాం రోదనం బలమ్.

తే.గీ.  పక్షులకుబలమాకాశమక్షయజ్ఞ!

మత్స్యములకుదకంబగు మహిని బలము,

బలము దుర్బలులలు రాజు, బ్రహ్మతేజ!

బలము పసివారికేడుపే, పాపరహిత!

భావము.  అక్షయపదార్థ జ్ఞానము కలవాఁడా! బ్రహ్మతేజముతోనొప్పారు ఓ మహానుభా! పాపరహితుఁడా! పక్షులకు ఆకాశమే బలము. చేపలకు 

నీరే బలము. దుర్బలులకు రాజే బలము. పసివారికి ఏడుపే బలము.

శ్లో. పతితః స్ఖలితో భగ్నః సందష్టస్తప్త ఆహతః 
హరిరిత్యవశే నాహ పుమాన్ నార్హతి యాతనాః (భాగవతము 6-2-15)
తే.గీ.  పడెడి వేళల, జారుచు పడెడి వేళ,
గాయమగునప్డు,హానియే కలుగు నపుడు,
రోగ పీడన బాధచే రోయునపుడు
హరి హరీ యన యాతనల్ కరిగి పోవు.
భావము. పైనుండి క్రింద పడినపుడు గాని, నడచుచు జారినపుడు గాని, శరీరమునకు గాయము తగిలినపుడు గాని, సర్పాది క్రూర జంతువుల వలన హాని కలిగినపుడు గాని, రోగపీడితుడైనపుడు లేదా ఇతరులు శిక్షించినపుడు గాని ఎవరు కృష్ణ, హరి, నారాయణ అను నామములను ఉచ్చరించుదురో వారికి ఎన్నడును నరక బాధ కలుగదు.

శ్లో.  పత్నీం మనోరమాం దేహి మనోవృత్తానుసారిణీం,
తారిణీం దుర్గ సంసార సాగరస్య కులోద్భవామ్.
తే.గీ.  మనసు రమియింప చేసెడి, మనసు నెఱిగి 
మెలగి, నన్ దరియింపఁ జేయు, కులము నిలుపు
పుత్రునొసగెడి భార్యను బ్రోవ నన్ను
నాకొసంగుమ దుర్గాంబ! సాకుము నను.
భావము.  దుర్గామాతా! నా మనస్సును రమింపఁ జేయునట్టిదియు, నా మనసుననుసరించి వ్యవహరించునట్టిదియును, నన్ను తరింప జేయునట్టిదియును, సంసార సాగరమునుండి నన్ను తరింపఁ జేయ సమర్ధుఁడైన కులోద్ధారకుఁడైన పుత్రునొసంగునట్టిదియును అగు భార్యను నాకు ప్రసాదించుము. 

400. శ్లో. పద్మాకరం దినకరో వికచం కరోతి చంద్రో వికాసయతి కైరవచక్రవాలమ్
నాభ్యర్ధితో జలధరోపి జలం దదాతి సంతస్స్వయం పరహితే విహితాభియోగాః!!
.   కోరకనెవిరియఁ జేయును
నీరజముల రవి, కలువల నేర్పున శశియున్.
నీరదుఁడు వర్షమిచ్చును
సూరులుపకృతిమతులగుచు శోభిలుదురిలన్.
భావము.  తామరలచే సూర్యుడు యాచింపబడకయే వానిని వికసింపజేయుచున్నాడు. కలువలచే చంద్రుడు యాచింపబడకయే వానిని వికసింపజేయుచున్నాడు.


401. శ్లో. పరద్రవ్యేష్వభిధ్యానం, మనసాஉనిష్ట చింతనం
వితతాభినివేశశ్చ త్రివిధం కర్మ మానసమ్. 
తే.గీ.  పరుల సంపదపై ధ్యాస ప్రబలుటయును, 
పరులకహితము కోరుట, దరియ రాని 
దగు యసత్యదుర్మార్గాన నడరుటయును 
మానసికపాప కర్మలు. మహితులార!
భావము. పరుల సంపదయందు తదేకధ్యాస,మనస్సులో ఇతరులకు అహితం కోరుకోవటం, అసత్యమునందు ఆసక్తి అనే మూడూ మానసిక పాపాలు. 

శ్లో.  పరవాచ్యేషు నిపుణః   -  సర్వో భవతి సర్వదా

ఆత్మవాచ్యం జానతి   -  జానన్నపి గుహ్యతే

తే.గీ.  పరుల దోషము లందరున్ బట్టువారె,

యాత్మ దోషంబు లెఱిఁగియు నాత్మలోనె 

దాచుకొందురు,  తప్పంచు తలపఁబోరు.

దోషములకాత్మ సాక్షియై దూరుచుండు.

భావము. ఇతరుల దోషాల నెంచి చూపడంలో అందరూ అన్ని వేళలా నిపుణులే. కాని తమ దోషాలను తెలుసుకోలేరు. ఒకవేళ తెలిసి నప్పటికినీ తెలియనట్లే ప్రవర్తిస్తారు.

శ్లో. పరవాదే దశవదనః - పరరంధ్రనిరీక్షణే సహస్రాక్షః
సద్వృత్త విత్తహరణే - బాహుసహస్రార్జునో నీచః. 
తే.గీ.  పరుల నైచ్యంబులాడను పదియు నోర్లు.
పరుల దోషముల్ వెదుకను వంద కనులు,
పరుల ధనమునపహరింప పాలసులకు
వేయి చేతులు నిజమిది విశ్వమందు.
భావము. ఇతరుల దోషాలు వెతుకునప్పుడు పది ముఖములు, ఇతరుల లోపములను చూచుటలో వేయి కళ్ళు. మంచివారి మంచిని, డబ్బు దొంగిలించడంలో వేయి చేతులు కలిగినట్లుందురు - ఇది నీచుని స్వభావము. జనులచే మేఘుడు యాచింపబడకయే జలము గురిపించుచున్నాడు. గావున సుజనులు పరులు యాచింపకయే వారలకు సహాయము చేయుదురు.

శ్లో.  పరాధీనం వృథా జన్మ  -  పరస్త్రీషు వృథా సుఖం।

పరగేహే వృథా లక్ష్మీః  -  విద్యా యా పుస్తకే వృథా॥

తే.గీ.  పరులకాధీనమగు జన్మ వ్యర్థమిలను,

పరులకాంతల పొందును వ్యర్థమరయ,

పరుల యింటిలో గల సిరి వ్యర్థమెన్న,

భవ్యగ్రంథస్థ జ్ఞానమ్ము వ్యర్థము గన.

భావము. పరాధీనమైనట్టి బ్రతుకు, పరస్త్రీల వలన సుఖము, పరుల యింట‌ నున్న ధనము, పుస్తకముల యందలి జ్ఞానము సమయమునకు అక్కరకు వచ్చునవి గావు.... అందుచేత, మన దగ్గర ఎన్ని పుస్తకాలను పోగు చేసుకున్నామన్నది కాదు, ఎన్నింటిని పూర్తిగా చదివి ఆకళింపు చేసుకున్నామన్నదే గమనించాల్సిన విషయం.

శ్లో.  పరోక్షే కార్యహంతారం  - ప్రత్యక్షే ప్రియవాదినమ్

వర్జయేత్తాదృశం మిత్రం - విషకుంభం పయోముఖమ్

తే.గీ.  మన పరోక్షమునన్ దిట్టు మనను దురితుఁ

డెదురు పడినచో పొగడు, నటించుఁ  బ్రేమ,

వీడు క్షీరపూర్ణాహిత విషఘటంబు

విడువవలెనిట్టి మిత్రునిన్ వేగిరముగ.

తే.గీ. ఎదుట ప్రీతిఁ బలుకు నెదలోన విషముండు

మన పరోక్షమందు మనలఁ జెరచు

నట్టి దుష్ట మిత్రుఁడనురాగ విరహితుఁ

డట్టివాని విడిచిపెట్టవలయు.

తే.గీ.  పనులు చెరచు పరోక్షాన పలుకు తానె

ప్రియముగాను ప్రత్యక్షాన ప్రేమతోడ

నట్టి మిత్రుండు విషముండినట్టి పాల

కుండ,  విడవలె నామిత్రు గుణమెఱింగి.

భావము.  ఎవడైనా ఒక దుష్టుడు ఒకవ్యక్తి చేసే మంచి పనులను చాటుగా విమర్శిస్తూ  వ్యక్తి నాశనాన్ని కోరుకుంటూ మళ్లీ మంచిపనులు చేసే వ్యక్తి  ఎదురు పడినప్పుడు స్నేహితుని వలె నటిస్తూ గౌరవంగా  మాట్లాడుతున్నట్లైతే అటువంటి వానిని దూరంగా ఉంచాలేగాని 

స్నేహితునిలా చేరదీయకూడదు..... సుగంధద్రవ్యములతో  ఘుమఘుమలాడుతున్న తీయని పాలు కడువడున్నా అందులో 

విషమున్నట్లైతే ఎవరైనా పాలకడవని దూరంగా వదిలుదురు కాని  తీయగా ఉన్నా యని త్రాగరు కదా!

శ్లో.  పరోపకారాయ ఫలంతి వృక్షా: - పరోపకారాయ దుహంతి గావ:

పరోప కారాయ వహంతి నద్య: - పరోపకారార్థమిదం శరీరం.

తే.గీ.  పరుల కొఱకని వృక్షము ఫలములిచ్చు.

పరుల కొఱకని ధేనువు పాల నిచ్చు.

పరుల కొఱకని నదులిల పారుచుండు.

పరులకుపకారములుఁ జేయఁ బ్రతుక వలయు.

భావము.   చెట్లు పరులకుపకరించుట కొఱకే ఫలించుచుండును. ఆవులు పరులకుపకరించుట కొఱకే పాలనిచ్చును. నదులు పరుల కుపకరించుట కొఱకే ప్రవహించు చుండును. పరుల కుపకారము చేయుటయే యీ శరీరము కలిగి యున్నందులకు ప్రయోజనము.

శ్లో.  పరోపి హితవాన్ బంధుః బంధురప్యహితః పరః
అహితో దేహజో వ్యాధిః హితమారణ్యమౌషధం.

తే.గీ.  హితకరుండిల పరుఁడయ్యు బంధువతఁడు.
బంధువహితకరుండైన పరుఁడె మనకు
రోగభాగంబు దేహాన రోత గాదె?
రోగమును బాపు వనజ మారోగ్యమనమె?
భావము. మన హితమును కోరువారు పరులైనప్పతికి మనకు బంధువులే. మనకహితమును కూర్చువారు మన బంధువులైనప్పటికీ వారు పరులే. వ్యాధి సోకియున్నది మన శరీర భాగమైనను అది అహితమే. అదవియందుద్భవించినదైనను శరీరమునకు మేలుకూర్చెడి ఔషధము మనకు హితమేకదా!  

శ్లో.  "పరోపదేశే పాండిత్యం సర్వేషాం సుకరం నృణాం 
ధర్మే స్వయ మనుస్టానం కస్య చిత్తు మహాత్మనామ్ !
తే.గీ.  పరులకుపదేశమిచ్చుట పరమ సుఖము.
తదుపదేశ ధర్మంబు తాను చేయు
టన్న కష్టంబు. కన కొందరున్నతులిల
ధర్మ బోధన మొనరించు, తాము చేయు. 

తే.గీ.  చెప్పుటన్నది సులభము. చేయలేము.
ధర్మభోధన పరులకు. తానకు కాదు.
మహితమొనరించి చెప్పుట. మాన్యులెపుడు
చేసి చెప్పుదురిలను సద్భాస మహిత!
భావము.  పరులకు ఉపదేశము చేయడములో అందరూ మహా పండితులే కానీ వారు ఉపదేశించిన ధర్మమును స్వయముగా తాము పాటించడము మాత్రం ఎవరో మహాను భావులు మాత్రమే చేయగలరు.

శ్లో.  పఠకాః పాఠకశ్చైవ  -  యే చాన్యే శాస్త్ర చింతకాః |

సర్వే వ్యసనినో మూర్ఖాః  -  యః క్రియావాన్ పండితః ||  (మహాభారతం)

తే.గీ.  పఠక పాఠకుల్, శాస్త్ర సంభాషకులును

తద్వ్యసనముచే మూర్ఖులు, దాని నొడిసి

పట్టి పాటింపకున్నచో,    భవ్యగతిని

యాచరింపంగ వలయు తా మరసినయవి.

భావము.  చదివేవారు, చదివించేవారు, మరియు శాస్త్ర విషయాలను చర్చించే ఇతరులు  వీరందరూ కేవలం గ్రంథాల వ్యసనంలోనే మునిగిపోయి ఉంటే, వారు మూర్ఖులే. శాస్త్రోక్త ప్రకారం క్రియాశీలుడైనవాడే నిజమైన పండితుడు.

తే.గీ.  పాత్రులకుఁ దానమీయంగ వలయు మనమ
పాత్రులకునీయ రాదిల. పట్టి చూడ
పసిరినొసగఁగ ధేనువు పాలనిచ్చు,
పాలు త్రాగియు విషమిడు పన్నగంబు.

తే.గీ. గడ్డిని తిని పాలిచ్చును గంగి గోవు.
పాలు త్రావి విషము చిందు పన్నగమ్ము. 
పాత్రతాపాత్రములఁబట్టి వర్థిలునిల 
మంచి చెడ్డలు మనలోన మహితులార!
భావము. మనం సహాయం చేసేటప్పుడు పాత్రత కలిగివున్న వారికే చేయాలి. అపాత్రదానం చేయకూడదు అంటారు. అలాంటి పాత్ర అపాత్ర వివేకాన్ని సుభాషితకారుడు ధేను పన్నగ యోరివ అంటాడు అంటే పాత్రత కలిగిన వాడిని ధేనువు (ఆవు) తోనూ లేనివాడిని పన్నగం (పాము) తోనూ పోలుస్తాడు. ధేనువు గ్రాసం (గడ్డి) తిని మనకు క్షీరం (పాలు) ఇస్తుంది. అదే పాము పాలు తాగి విషం కక్కుతుంది. పాత్రుడికి తృణం (చిన్న) దానం ఇచ్చినా సహాయం మరిచిపోకుండా పాల లాంటి మనస్సు తిరిగి ఇస్తాడు. అదే అపాత్రదానం పాలు (పెద్ద సహాయం) చేసినా సంతృప్తి పొందడు సరి కదా తిరిగి విషం కక్కుతాడు.

 శ్లో.  పితా ధర్మః పితా స్వర్గః  - పితా హి పరమం తపః |

పితరి ప్రీతిమాపన్నే  - ప్రియతే సర్వదేవతాః || 

(పద్మ పురాణ శ్లోకం 1.50.9) 

తే.గీ.  తండ్రి ధర్మంబు, స్వర్గమున్ దండ్రి ధరను,

తండ్రి సేవయే మనలకు తపము తలఁప,

తండ్రి మన సేవలను గొని తనిసిరేని

దేవతాళియు నెంతయు తృప్తినొందు.

భావము.  తండ్రియే  ధర్మము, తండ్రియే స్వర్గము, తండ్రియే పరమ తపము, ఆతడు సంతోషపడితే సర్వదేవతలు సంతుష్టులౌతారు.

శ్లో. పితృభి స్తాడితో పుత్రః ౹  -  శిష్యస్తు  గురు శిక్షితః  ౹     

ఘనాహతం సువర్ణం ౹  -  జాయతే జనమండనమ్౹౹

తే.గీ.  తల్లిదండ్రుల దండనవల్ల సంతు,

గురు సుశిక్షిత శిష్యుఁడు, నిరుపమముగ

భువి ఘనాహతమైనట్టి పుత్తడియును

కనగ జనమండనంబగు ఘనతరముగ.

భావము.  తల్లిదండ్రులచే దండింపఁబడు సంతానము,  గురువుచే శిక్షితుఁడయిన శిష్యుఁడు, అలంకారముగా చేయఁబడునప్పుడు సుత్తి దెబ్బలు తిన బంగారము సమాజములో అలంకారముగా అగుట నిశ్చయము.

శ్లో.  పిత్రోర్నిత్యం ప్రియం కుర్యాత్. - ఆచార్యస్య సర్వదా.
తేషు హి త్రిషు తృప్తేషు - తపస్సర్వం సమాప్యతే.
కం.  ప్రియమందగ తలి దండ్రులు
ప్రియమందగ గురువు మనదు ప్రియ వర్తనచే.
జయ శీలుడ! మన కదియె వి
జయము. తపః ఫలము. మనకు జయముల నొసగున్.
భావము.  తల్లి దండ్రులకు ఎల్లప్పుడు ప్రియముగ నడచుకొన వలెను. అటులనే గురువులకునూ ప్రియ మొనర్చు చుండవలెను. ముగ్గురును తృప్తులైనచో మన తపము లన్నియు ఫలించినట్లే.

శ్లో.  పిపీలకార్జితం ధాన్యం - మాక్షికా సంచితం మధు౹

లుబ్ధేన సంచితం ద్రవ్యం - సమూలం వినశ్యతి ౹౹      

తే.గీ.  చీమలార్జించు దినుసు నశించిపోవు,

మక్షికార్జిత మధువును మాయమగును,

పిసిని సంపాదననశించు విశ్వమునను,

దాచు కొనునట్టిదెల్లయు దోచఁవడును.

భావము.  చీమలు సంగ్రహించిన ధాన్యం, తేనీటీగలు కూడబెట్టిన తేనె, అలాగే లోభి కూడ్చి పెట్టిన ధనం ఇవన్నీ స్థిరంగా లేకుండా నాశనము అయ్యేవి.

శ్లో.  పీత్వా కర్దమపానీయం   -  భేకో రటరటాయతే!

పక్వం చూతరసం పీత్వా   -  గర్వం నాయాతి కోకిలః!!

తే.గీ.  బురదలోనీరు త్రాగుచున్ పొగరుతోడ

బెకబెకంచును వాగును వింత యిదియె,

పక్వచూతఫలరసము వరలఁ గొనియు

కూయు కోకిల, గర్వంబు కూడదిలను.

భావము.  బురదలో నీరు తాగి కూడా కప్ప పొగరుతో బెకబెకమంటుంది. బాగాపండిన మామిడి రసం తాగి కూడా కోకిల గర్వాన్ని పొందదు. మనం ఎప్పుడు గర్వాన్ని పొందకూడదు అని భావము..

శ్లో.  పుం రూపం వా స్మరేద్దేవీం  -  స్త్రీ రూపం వా విచింతయేత్ |

అథవా నిష్కలం ధ్యాయేత్స  -  చ్చిదానందలక్షణమ్ ||

తే.గీ.  సచ్చిదానంద చైతన్యశక్తి నెన్ని

పురుషునిగ, లేక వనితగా నరయవచ్చు,

నటులఁ గాకున్న నిర్గుణ మనుపమాన

మనుచు మదినెంచ వచ్చునర్చనమున.

భావము.  విశ్వ చైతన్యాన్ని పురుషరూపంలో కానీ, స్త్రీరూపంలో కానీ, లేదా రూపమూ లేని నిర్గుణతత్త్వంగా కానీ ధ్యానించవచ్చు.

శ్లో. పుణ్యస్య ఫలమిచ్ఛంతి, పుణ్యం నేచ్ఛంతి మానవాః
పాప ఫలమిచ్ఛంతి, పాపం కుర్వంతి యత్నతః.  

. పుణ్య ఫలము కోరు, పుణ్యంబు చేయరు.   

పాప కార్య పరులు. పాప ఫలము

వలదు వలదనంద్రు, వలదన్న వదలునా?

పుణ్యకర్తవగుము పూజ్య సుగుణ!

తే.గీ. పుణ్య కార్యము లొనరింపఁ బోరు  కాని

పుణ్య ఫలము కోరుదు రయ్య! పుడమిఁ జనులు.

పాప కార్యము లొనరింత్రు. పాప ఫలము

వల దటంచును తలతురు. భావ్య మౌనె?

భావము. మానవులు పుణ్యఫలాన్ని కోరుకుంటారేగానీ, పుణ్యకార్యాచరణకు ఇష్టపడరు! పాపఫలాన్ని కోరరు గానీ, ప్రయత్నపూర్వకంగా పాపాలు చేస్తూ ఉంటారు.

శ్లో.  పుత్ర పౌత్ర వధూ భృత్యై రాక్రాంతమపి సర్వత:
భార్యా హీనం గృహస్థస్య శూన్యమేవ గృహం భవేత్.
తే.గీ.  పుత్ర, పౌత్రులు, కోడళ్ళు, ముఖ్య భృత్య
గణము తోడుత నున్నట్టి తనదు గృహము,
భార్య లేకున్నశూన్యము భర్తలకును.
భార్య లేనట్టి గృహపతి బ్రతుకు భరము. 
భావము.  పుత్రులు, పౌత్రులు, కోడళ్ళు సేవకులు, మొదలైన వాళ్ళతో నిండి యున్నదైనాసరే తన గృహం  తన భార్య లేనిచో గృహస్తునికి శూన్యంగానే ఉన్నట్లుంటుంది.  

శ్లో.  పురాణ న్యాయమీమాంసా - ధర్మశాస్త్రాంగమిశ్రితాః |

వేదాః స్థానాని విద్యానాం - ధర్మస్య చతుర్దశః ||

(యాజ్ఞవల్క్య స్మృతి)

తే.గీ.  మహి పురాణాళి, న్యాయ, మీమాంస,  మరియు

ధర్మ శాస్త్రాంగములును, వేదములు నాల్గు,

స్థానములు పదునాలుగు ధర్మపథము

లరయ మనలకు నెఱుఁగుమో నిరుపమాన!

భావము.  1. అష్టాదశ పురాణాలు, 2. తర్కశాస్త్రము, 3. మీమాంసా, 4. మనుస్మృత్యాది ధర్మశాస్త్రములు, 5. వేదాంగములైన - శిక్షా, 6. కల్పము, 7. వ్యాకరణము, 8. నిరుక్తము, 9. ఛందస్సు, 10. జ్యోతిషము, 11. ఋగ్వేదము, 12. యజుర్వేదము, 13. సామవేదము, 14. అథర్వవేదము, - పదునాలుగు జ్ఞానసాధనములును ధర్మహేతువులును.

శ్లో.  పుస్తకం వనితా విత్తం - పర హస్తం గతం గత:

అధవా పునరా యాతి - జీర్ణం భ్రష్ఠా ఖండశ:

తే.గీ.  పుస్తకంబు, వనితయును, పూజ్యమైన

ధనము పరులచేతికిఁ జిక్క, తరలిపోవు

చేతులవిమారి, మరలవి చేరెనేని, 

జీర్ణముగనయి, భష్ఠమై, సిధిలముగనె.

భావము.  పుస్తకం, స్త్రీ , ధనం ఇవి మన వద్ద ఉన్నంత సేపే . ఇతరుల చేతిలో పడితే మరి వాటి పని అంతే. తిరిగి వస్తాయను కో వద్దు. ఒక వేళ వచ్చినా. సర్వ నాశన మయి పోయిన స్థితిలో మనకి తిరిగి దక్కుతాయి సుమీ. ( స్త్రీని జాగ్రత్తగా చూసుకోవాలి అనే భావం ఇక్కడ గ్రహించాలి).  

శ్లో.  పూజితం హ్యశనం నిత్యం,  -  బలమూర్జం యచ్ఛతి.                        

అపూజితం తు యద్భుక్తం,   -   ఉభయం నాశయేత్ ధృవమ్.

తే.గీ.  శుచిగ, శుభ్రముగానుండి శోభలీను

పూజితాహారమే శక్తి తేజములిడు,

పాచి క్రుళ్ళినవి తినిన వేచు మనను,

క్షీణమౌ బల తజముల్ కీడు కలుగు.

భావము.  పూజ్యమైన ఆహారము నిత్యమూ సేవించుట వలన మాత్రమే బలము తేజస్సు మనకు లభిస్తాయి. అపూజితమైన ఆహారము అనగా అపవిత్రంగా పాచిపోయిన క్రుళ్ళిపోయిన ఆహారము సేవించినచో బలము తేజస్సు రెండూ నశించును.

మంత్రము.  ఓం పూర్ణమదః పూర్ణిమదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే 

పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావ శిష్యతే. (ఈశావాస్యోపనిషత్ )

తే.గీ.  పూర్ణమెన్నంగ దైనంబు, పూర్ణమైన

దరయ నీ సృష్టి, మదిలోన నరసిచూడ

పూర్ణముననుండి తీసినన్ బూర్ణమపుడు

పూర్ణమేశేషమైయుండు పూజ్యులార!

భావము.  దేవుడు పరిపూర్ణుడు. ఇది ( ప్రపంచం) పరిపూర్ణమైనది. పరిపూర్ణమైన భగవంతుడి నుండే పరిపూర్ణమైన ప్రపంచం పుట్టింది. పరిపూర్ణం నుండి పరిపూర్ణాన్ని తీసివేసిన తర్వాత కూడా పరిపూర్ణతే మిగిలి ఉంది.

శ్లో.  ప్రస్తావసదృశం వాక్యం  -  సద్భావసదృశం ప్రియమ్

ఆత్మశక్తిసమం కోపం యో  -  జానాతి పండితః ౹౹

(చాణక్యనీతి ౧౪ - ౧౪)      

తే.గీ.  సమయమునకు తగిన మాట చక్కదనము,

మంచి భావనకు తగుచు మనెడి ప్రియము,

అవసరమున కోపించుట యనునవిగల

మనుఁజుడేపండితుండిల, మహితులార!

భావము.  సమయానికి తగినట్టుగా చూడండి.సద్భావనము ఉన్నట్టుగా ప్రియమైన పని, తన ఆత్మశక్తికి అనుగుణంగా ఉండే కోపం,వీటన్నింటిని తెలిసిన వ్యక్తి ఎవరు ఉంటారో అతనే పండితుడు.

శ్లో.  ప్రియః ప్రజానాం దాతైవ - నపునర్ద్రవిణేశ్వరః |

ఆగచ్ఛన్ కాంక్షతే లోకైః - వారిదో తు వారిధిః ||

(భోజచరిత్ర)

తే.గీ.  ప్రజలకిల దాతయే కనఁ బరమప్రియము,    

విత్తవంతుఁడు కాదిలన్ బ్రియము ప్రజకు, 

వారిదంబన్న ప్రియమిల ప్రజలకిలను,

వారిధిని కోరరెన్నడున్ నీరు కోరి. 

భావము. ప్రజల పాలిట దానం చేసే (ఇచ్చే) దొరయే కావలసినవాడు. 

ధనాధిక్యత గలవాడు కాదు. నీటినిచ్చే మేఘాలకొఱకు అందరూ ఎదురుచూస్తారు 

కానీ సముద్రము కొఱకు కాదు.

శ్లో. పురాఽజనాభనామ్నాయం - మహాన్ దేశః సువిశ్రుతః।

భరతైః పాలితః పశ్చా - ద్భవద్భారతాభిదః॥

(కౌండిన్యస్మృతిః)

తే.గీ.  పూర్వ మజనాభ పేరుతో పుడమినున్న

పుణ్యభూమి, భరతుఁడను పుణ్యమూర్తి

పాలనము చేసినందునన్ భారతాఖ్య

దేశమయ్యెను మనదైన దేశమాత.

భావము. గొప్పదైన దేశం పూర్వం అజనాభము అనే పేరుతో ప్రసిద్ధమైయుండేది. దీనిని భరతవంశీయులు పాలించడం చేత కాలాంతరంలో దీనికి భారతదేశం అను పేరు ప్రసిద్ధిలోనికి వచ్చినది.

శ్లో.  పూర్ణిమాయామ్ అమాయాచ ద్వాదశే రవిసంక్రమే
తైలాభ్యంగంచ కృత్వాచ, మధ్యాహ్నే నిశి సంధ్యయోః, 
అశౌచే శుచి కాలే యే, రాత్రివా సోన్వితా నరాః
తులసీం యో విచిన్వంతి తే ఛిందంతి హరేః శిరః. (దేవీభాగవతము - నారాయణ నారద సంవాదమున  ౪౯ - ౫౦ శ్లోకములు)
శా.  మేలైనట్టి పవిత్రమైన తులసిన్ తృంచన్, మహత్ పూర్ణిమన్,
వాలన్ జీకటి నొప్పుచుండెడి యమావాశ్యన్, సుసంక్రాంతులన్,
తైలాభ్యంగనవేళ, ద్వాదశిని, మధ్యాహ్మంబు, సంధ్యన్, నిశిన్,
శ్రీలన్బాపెడి యాయశౌచమపుడున్, శ్రీవిష్ణు హన్యంబగున్.
భావము. పూర్ణిమ అమావాశ్య, ద్వదశి, రవి సంక్రమణము, నూని రాచుకొనిన వేళ, మధ్యాహ్న సమయమున, రాత్రి, సంధ్యలోను, మైల వేళ, అశుచివేళ, ఎవరు తులసిని గిల్లునో వారు విష్ణువు యొక్క శిరమును ఛేదించినవాఁడగును.

 శ్లో.  పైశున్యం సాహసం ద్రోహం   -  ఈర్ష్యాసూయార్థ దూషణమ్!

వాగ్దండయోశ్చ పౌరుష్యం   -  క్రోధజోఁపి గుణోష్టకః!!

తే.గీ. కొండెమాడుట, సాహసంబొండు, ద్రోహ,

మీర్ష్య, దూషణ, తొందర, నితరులఁగని,

శిక్షవేయుట,  కటువుగ చెలగు పలుకు

టనెడి యెనిమిది కోపాన మనకు కలుగు.

భావము.  చాడీలు చెప్పడం, తొందరపాటుతనం, ఇతరులకు హాని చేయడం, ఓర్వలేనితనం, ఇతరులలో ఉన్న మంచి గుణాలను దోషాలుగా ప్రచారం చేయడం, కఠినంగా మాట్లాడడం, నిష్కారణంగా శిక్షించడం, పరుషంగా మాట్లాడడం - ఈ ఎనిమిదీ కోపం నుండి పుట్టిన దుర్గుణాలు.

శ్లో.  ప్రతివాదినీ భార్యా - పరసేవా పరగృహే సదా భుక్తిః
క్షిప్రం జరయతి పురుషం - నీచైర్వాసః ప్రవాసశ్చ. 
తే.గీ. పత్ని ప్రతికూలవతియౌట, పరుల సేవ, 
పర గృహంబున భుక్తియు, పాలసులగు
వారితోబ్రతుకుగడుపువారిలిలను
వృద్ధులగుదురు పిననాడె వింతగాను.
భావము. ప్రతి మాటకూ అడ్డుచెప్పే భార్య ఉన్నను, పరులను సేవించుచు జీవనము సాగించుచున్నను, పరుల యింట నిత్యము భోజనము చేయుచు జీవించుచున్నను,  నీచులతో సహవాసము చేయుచున్నను, వాసమూ, అట్టివారిని చిన్న వయసులోనే ముసలితనము ఆవరించును.

శ్లో.  ప్రత్యక్షే గురవః స్తుత్యాఃI  -  పరోక్షే మిత్రబాంధవాఃII

కర్మాంతే దాసభృత్యాశ్ఛ I  -  కదాచన పుత్రకాః II

తే.గీ.  పూజ్య గురుదేవునెదురుగా పొగడ వచ్చు,

ప్రోచు బంధులన్ హితులఁ బరోక్షమందె

అవని పనివార్ని పనిపూర్తి యయిన పిదప,

పుత్రునెప్పుడిన్ బొగడకు పొసగఁబోదు.

భావము.  గురువులను వారి ఎదుటనే స్తుతించ వచ్చు. మిత్రులను బంధువులను వారి పరోక్షంలో పొగడాలి. సేవకులను వారి పని ముగిసాక పొగడాలి. కొడుకులను ఎప్పుడూ పొగడ కూడదు.

శ్లో.  ప్రత్యహం ప్రత్యవేక్షేత, నరశ్చరిత మాత్మనః.
కిం ను మే పశుభిస్తుల్యం? కిం ను సత్ పురుషైరివ?----{మహాభారతం.--అరణ్య పర్వం---29 శ్లోకం.}తే:-
తే.గీ.  పశువు వోలె ప్రవర్తించు పాపినా! సు
జనుని వలె నడచు కొను సుజనుడినా! య
ని యను దినము ప్రశ్నించుకొని.మన నగును.
మానవాళికి తగునిది. మహితులార.

భావము.  మానవుడు తాను సత్ పురుషుని వలే ప్రవర్తిస్తున్నాడా, లేక పసువు వలె ప్రవర్తిస్తున్నాడా అని ప్రతీ దినము ఆత్మ అరిశీలన చేసుకొంటూ ఉండాలి.

శ్లో.  ప్రత్యాఖ్యానేచ, దానేచ,  సుఖ దు:ఖే, ప్రియాzప్రియేl
ఆత్మౌపన్యేన, పురుష: ప్రమాణ మధి గచ్ఛతిll
కం.   ప్రత్యాఖ్యానము, దానము,
నిత్యము సుఖ, దు:, ప్రియము, నెఱ నప్రియమున్,
స్తుత్యత నాత్మౌపన్యుఁడు
నిత్యుఁడగు ప్రమాణమగుచు, నిశ్చయ మరయన్.
భావము.  ప్రత్యాఖ్యానము నందు, దానము నందు, సుఖ దు:ఖముల యందు, ప్రియాప్రియముల యందు, తననే ఉదాహరణ ప్రాయముగా దిద్దుకోగల మనుజుఁడే లోకంలో ప్రామాణికుఁ డగుచున్నాఁడు.

శ్లో. ప్రథమ వయసి పీతం తోయమల్పం స్మరన్తః - శిరసి నిహిత ధారాః నారికేలా నరాణామ్.
సలిలమమృత కల్పం దద్యురాజీవనాంతమ్, - నహి కృతముపకారం సాధవో విస్మరంతి. 
తే.గీ.  చిన్న తనమున త్రాగిన చిన్న పాటి
నీటి విషయము మరువకేనాటివరకు
బ్రతుకునన్నాళ్ళు మ్రోయుచు, ఫలములిచ్చు
మేలు మఱువక సతతము మేలు చేయు.

. నీరము పోసి బాల్యమున నేర్పుగ రక్షణ చేసి, పెంచినా
రీనరపుంగవుండనుచు నీప్సిత చిత్తము తోడ నేర్పుతో
వారి సుపూర్ణ కేళములవారిత రీతినొసంగునెప్పుడున్
ధీరత నారికేళతరు ధీమణి సద్గుణ సంస్తుతాత్మయై.
భావము.  తనకు చిన్న తనముతో నీరుపోసి రక్షైంచి పెంచెనీమనుఁఝుఁడని తలపోసి కొబ్బరి చెట్టు చేసిన ఉపకారమును మరువలేక తాను జీవించి యున్నంత కాలము, తన శిరమున మోసి కాయలద్వారా కొబ్బరి నీటిని, కొబ్బరిని అందించుచునే యుండును. మంచివారు తాము పొందిన ఉపకారములనెన్నటికీ మరురువరు. ప్రత్యుపకారము చేయుచునే ఉందురు.

శ్లో.   ప్రదోషే దీపకశ్చంద్రః ,ప్రభాతే దీపకో రవిః

త్రైలోక్యే దీపకో ధర్మః ,  సుపుత్రః కులదీపకః.

తే.గీ.  రాత్రి వేళను దీప్తి రేరాజొసంగు.

పగలు వెల్గునొసంగును భాస్కరుండు.

ధర్మ దీప్తి ముల్లోకాలఁ దనరఁ జేయు.

కులమునకు దీప్తిసత్పుత్రకుఁడు నిజంబు. 

భావము.  చీకటి వేళ చంద్రుడు దీప్తినిస్తాడు. ఉదయాన్ని సూర్యుడు ప్రకాశవంతం చేస్తాడు. మూడు లోకాలనూ ధర్మమే ప్రకాశింపజేస్తుంది. కులాన్ని సుపుత్రుడు ప్రకాశింపజేస్తాడు.

శ్లో.  ప్రభుర్వివేకీ ధనవాంశ్చ దాతా  -  విద్వాన్ విరాగీ ప్రమదా సుశీలా।

తురఙ్గమః శస్త్రనిపాతధీరః"  -  భూమణ్డలస్యాభరణాని పఞ్చ॥ 

తే.గీ.  తెలివి కల రాజు నీవిని కలుగు ధనుఁడు,

నుత విరాగియౌ చదువరి, క్షితి సుశీల

వనిత, యుద్ధముననిలుచు ఘనతరాశ్వ

మనెడి యైదును ధాత్రికి కనగ నగలు. 

భావము. తెలివైన రాజు, దానగుణంకల ధనవంతుడు, పేరుప్రతిష్టలయందు కోరిక లేనట్టి విద్వాంసుడు, సత్ప్రవర్తనగల స్త్రీ, శత్రుసమూహమునందు ధైర్యంగా నిలిచే గుఱ్ఱం - అయిదుగురు భూమికి ఆభరణములు." 

శ్లో.  ప్రవృత్తిర్వా నివృత్తిర్వా  -  నిత్యేన కృతకేన వా |

పుంసాం యేనోపదిశ్యేత  -  తచ్ఛాస్త్రమభిధీయతే || 

తే.గీ.  చేయఁ దగినట్టి వేవియో చేయఁ దగని

వేవియో తెలియునటుల హితము చెప్పు

నట్టి వేదమైనను, నన్యమయినదయిన

నెద్దియైనను శాస్త్రమే, యెరుఁగఁ దగును.

భావము. మానవుఁడు చేయవలసినదేదియో, చేయకూడనిదేదియో, వేదముల చేత కాని, మరియే యితర రచనలచేత కాని తెలియఁజేయఁబడునదే శాస్త్రము. 

శ్లో.  ప్రవేశాన్నిర్గమశ్చైవ నిర్గమాచ్ఛ ప్రవేశనం,

నవమే జాతు నో కుర్యాత్, దినే వారే తిథావితి.

తే.గీ.  బయలు వెడలిన, చేరిన వారు తాము

తొమ్మిదవ రోజు, తిథి యందు సమ్మతించి

తిరిగి వచ్చిన, వెళ్ళిన జరుగ బోవు

శుభము, లశుభంబు లలమును. చూచుకొనుడు.

భావము.  ప్రయాణము చేసిన తొమ్మిదవ దినమున కాని, తొమ్మిదవ తిథిలో కాని, ప్రవేశము చేయరాదు. ప్రవేశము చేసిన తొమ్మిదవనాడు మర్ల అచ్చటనుండి వెడలరాదు. ఎప్పటికినీ ఉది అష్ట కష్టమములనిచ్చునది.దీనికే ప్రయాణ నవమి, ప్రవేశ నవమి, ప్రత్యక్ష నవమి అందురుంఅవమి ప్రయాణమునకు నిషిద్ధము.

శ్లో.  ప్రసాదో యస్య వదనే కృపా యస్యావలోకనే 
వచనే యస్య మాధుర్యం సాక్షాత్పురుషోత్తమః. 
తే.గీ.  సుప్రసన్న ముఖాబ్జపు శోభ తోడ,
జాలు వారెడు చూపుల జాలి తోడ, 
తీయనైనట్టి మాటల తీరు తోడ 
నొప్పునాతడె శ్రీహరి. గొప్ప వాఁడు. 
భావము.  ఎవని ముఖంలో ప్రసన్నత గోచరిస్తుందో, ఎవని చూపులలో దయ జాలువారుతూ ఉంటుందో, ఎవని మాటలలో తీయదనం ఉంటుందో అతడు సాక్షాత్తు పురుష శ్రేష్ఠుడే. (విష్ణువే). 

శ్లో. ప్రస్తావ సదృశం వాక్యం, స్వభావ సదృశీం క్రియాం 
ఆత్మశక్తి సమం కోపం, యో జానాతి పండితః.
.  సమయోచిత భాషణమును, 
తమ బుద్ధికి తగిన పనిని, తమ కొలదిని క్రో
ధము నెఱిగి మెలగు వారలె 
సమవర్తులు, పండితులును, సద్గుణ వరులౌన్.
భావము.  సందర్భానికి తగిన సంభాషణం, తన స్వభావానికి తగిన పని, తనశక్తికి తగిన కోపం ఏవియో బాగుగా గ్రహించినవాడే పండితుడు. 

శ్లో.  ప్రియః ప్రజానాం దాతైవ పునర్ద్రవిణేశ్వరః
అగచ్ఛన్ కాంక్ష్యతే లోకై ర్వారిదో తు వారిధిః. 
.  ప్రజలకు దాతయె ప్రియమిల, 
నిజధన సంవర్ధి కాడు. నేర్పున కురిసే 
సుజలములు కలుగు మేఘమె 
ప్రజలకు హితమౌను, జలధిఁ వలవరు ప్రీతిన్.
భావము.  ప్రజలకు ధనవంతునికంటే దాతయే ప్రియమైనవాడు. లోకంలో అందరూ నీటినిచ్చే మేఘాన్నే కోరుకుంటారు గానీ నీటికి నిధియైన సముద్రుని కాదు. 

260. శ్లో.  ప్రియ వాక్య ప్రదానేన - సర్వే తుష్యంతి జంతవః
తస్మాత్ తదేవ కర్తవ్యం - వచనే కా దరిద్రతా?
కం.  ప్రియముగ భాషించినచో
ప్రియమందును జీవకోటి. ప్రేమగ జూచున్.
ప్రియముగ పలుకుము సతతము.
నయముగ  ప్రియముగను పలుక నలుగురు మెచ్చున్.

ర్మానికి ప్రతికూలుడో , వాడు బలవంతుడైనా శక్తిహీనుడే. ధనవంతుడైనా దరిద్రుడే, చదువుకొన్న వాడైనా మూర్ఖుడే. 

శ్లో. ఫణినో బహవః సంతి భేక భక్షణ తత్పరాః

ఏక ఏవహి శేషో உయం ధరణీ ధరణ క్షమః. 
.  కప్పలను తినెడి ప్లాములు 
తెప్పలుగానుండు కాని దివ్య ధరిత్రిన్ 
గొప్పగ మూపున మోసెడు 
నప్పలువురి లోననొకఁడె యధిపతి యననౌన్. 
భావము. కప్పలను తినటంలో ఆసక్తిగల పాములు చాలాఉన్నాయి. కానీ , భూ భారాన్ని వహించగల సామర్థ్యం , ఓర్పు గలవాడు శేషుడు ఒక్కడే.

శ్లో. బలవాన ప్యశక్తో உసౌ, ధనవానపి నిర్ధనః
శ్రుతవానపి మూర్ఖశ్చ యో ధర్మ విముఖో జనః.
తే.గీ.  ఎవఁ డధర్మాతిరిక్తుఁడో యిలనతండు 
బలసుసంపన్నుఁడయ్యు నబలుఁడె కనఁగ, 
ధనికుఁడయ్యును చూడ నిర్ధనుఁడతండు. 
విద్య కల్గుయుహీనుఁడే విద్య చేత.                                         

భావము. ఎవడు ధర్మానికి ప్రతికూలుడో , వాడు బలవంతుడైనా శక్తిహీనుడే. ధనవంతుడైనా దరిద్రుడే, చదువుకొన్న వాడైనా మూర్ఖుడే. 

శ్లో.  బహిర్భ్రమతి యః కశ్చిత్ త్యక్త్వా దేహస్థ మీశ్వరం
సో గృహపాయసం త్యక్త్వా భిక్షామటతి దుర్మతిః. 
.వె.  దేహమందునున్న దేవుని కానక 
వెదకు నచటనిచట వెఱ్ఱివాఁడు. 
ఇంటనున్నభుక్తినెఱుగక మూర్ఖుఁడు 
బైట ముష్టి కొఱకు భ్రమయునట్లు.
భావము. తన దేహమందే ఉన్న దైవాన్ని వదలి, బయట దైవంకోసం వెతుకుతూ తిరిగేవాడు , తన ఇంటిలో ఉన్న పాయసాన్ని విడిచి పరగృహాల్లో బిచ్చమెత్తుకునే మతిహీనుడు. 

శ్లో.  బాలక సఖత్వమకారణహాస్యం  -  స్త్రీషు వివాదమసజ్జనసేవా।

గార్దభయానమసంస్కృతవాణీ  -  షట్సు నరో లఘుతాముపయాతి॥

తే.గీ.  బాలకుల తోడ స్నేహము, స్త్రీలతోడ

తగవు, కారణమే లేని నగవు, దుష్ట

జనుల సేవ, యవాగ్ఝరి, చనుట గార్ధ

భముపయి, ననునారును, విలువలను చెరచు!

భావము.  బాలురతో స్నేహం, కారణంలేని నవ్వు, స్త్రీలతో వివాదం, దుర్జనులను సేవించుట, గాడిదపై ప్రయాణించుట, సంస్కారయుక్తముకాని మాట - ఆరింటివల్ల మనుష్యుడు అల్పుడగుచున్నాడు.

శ్లో.  బాలార్కః ప్రేత ధూమశ్చ, వృద్ధా స్త్రీ, పల్వలోదకమ్,
రాత్రౌ దధ్యన్న భుక్తిశ్చ ఆయు క్షీణమ్ దినే దినే.
ఆ.వె.  బాల సూర్య రశ్మి, వరహీన రతి కేళి,
ప్రేత ధూమము, కడు ప్రాత నీరు,
రాత్రులఁ బెరుగన్న మాత్రతన్ దినుచుంట
ఆయువంత తరుగునార్యులార!

తే.గీ. ఉదయరశ్మి, కాటిపొగయు, నొప్పు తప్పి
వలచు వృద్ధురాల్ పొందును, పడియనీరు.
రాత్రి దధ్యన్న భుక్తము ప్రముదమగునె
దినదినంబున కాయువు తీయుచుండ?
భావము. ఉదయించే సూర్య రశ్మి, శవము కాలుచున్నప్పుడు వచ్చే పొగ, తనకంటే పెద్దదైన స్త్రీసంగమము, నిలువయున్న నీరు, రాత్రి సమయమున పెరుగన్నము తినుట ఇవి క్రమముగా ఆయువును హరించును.

శ్లో.  బుద్ధిర్బలం యశో ధైర్యం, నిర్భయత్వ మరోగతా
అజాఢ్యం వాక్పటుత్వంచ హనుమత్ స్మరణాద్భవేత్.
.వె.   బుద్ధి, బలము, కీర్తి, పూజ్యమౌ ధైర్యము,
నిర్భయత, యరోగ నిగ్రహములు,
కన యజాఢ్యతయును, కమనీయ వాగ్ధాటిఁ
గొలుపు హనుమ తలపు, గురు తరముగ.
భావము.  హనుమంతుని యొక్క తలంపు మనకు సద్బుద్ధిని, మంచి బలమును, సత్కీర్తిని, ధైర్యమును, నిర్భయత్వమును, రోగ రాహిత్యమును, అజాఢ్యమును, మంచి వాగ్ధాటిని, సంప్రాప్తింప చేస్తుంది.

శ్లో.   బ్రహ్మఘ్నేచ సురాపేచ చోరే భగ్నవ్రతే తథా!

నిష్కృతిర్వహితాసద్భిః కృతఘ్నేనాస్తి నిష్కృతిః! 

తే.గీ.  బ్రహ్మ హత్యకు, నిల సురాపానమునకు, 

చౌర్యమునకును, వ్రతభగ్న క్రౌర్యమునకు,

మంచి వారికి నిష్కృతి నెంచఁ గలదు.   

కన కృతఘ్నత నిష్కృతి కానరాదు. 

భావము.  సహృదయులు అనుకోని పరిస్థితులలో తమచే చేయఁబడిన   బ్రహ్మ హత్యకు, సురాపానమునకు, వ్రతభంగమునకు, దొంగతనానికి ప్రాయశ్చిత్తమున్నది. కాని కృతఘ్నతకు మాత్రము నిష్కృతి లేదు.

శ్లో.  బ్రహ్మ నిష్ఠో గృహస్థః స్యాత్; బ్రహ్మ జ్ఞాన పరాయణః
యద్యత్ కర్మ ప్రకుర్వంతి తద్బ్రహ్మణి సమర్పయేత్.
తే.గీ. బ్రహ్మ నిష్ఠయు; జ్ఞానము; భక్తియు; మది
కలిగి యుండి; గృహస్థుఁడు కర్మములను
చేయ వలయును. అతఁడవి చేయు చుండి;
ఫలము కృష్ణార్పణము చేయ వలయు సతము. 
భావము.  గృహస్థు బ్రహ్మ జ్ఞాన పరాయణుఁడై; బ్రహ్మ నిష్ఠుఁడై; ఈశ్వరార్పన బుద్ధితోనే సర్వ కర్మలను చేస్తూ ఉండ వలెను.

మంత్రము.

ఓం భద్రం కర్ణేభిః  శృణు యామ దేవాః  భద్రం పశ్యేమా క్ష్యభి ర్యజత్రాః 
స్థిరై రంగై స్తుష్టువాగ్ఒస స్తనూభిః  వ్యశేమ దేవహితం యదాయుః 
తే.గీ.  శుభములే కర్ణముల విన్చు శోభిలుదుము.
శుభములే కన్నులన్ గాంచు చున్నడతుము.
బలము సంపద నారోగ్య ఫలములంది
యజ్ఞములదేవతతిఁగొల్తుమనవరతము!
తే.గీ.  చెవులు భద్రంబె విను గాక జీవితమున.
కనులు కను గాక కల్యాణ కరము లెపుడు.
సాంగ మంత్రంబులను గొల్చి సకల దైవ
తములను, సుఖము లను పొంది తనియు గాక.

భావము. దేవతలారా! మా చెవులతో శుభమైన దానినే వినెదముగాక ! పూజనీయులారా ! మా నేత్రములతో శుభప్రదమగు దానినే దర్శించెదము గాక ! మిమ్ములను స్తుతించుచు మా కొసంగబడిన ఆయుష్కాలమును సంపూర్ణ ఆరోగ్యముతో, శక్తితో జీవించెదముగాక!

శ్లో.  భద్రం భద్ర మితి భ్రూయాత్ - భద్రమిత్యేవవావదేత్
శుష్కవైరం వివాదంచ - కుర్యాత్ కేనచిత్ సహ.
.వె.  శుభము శుభమటంచు శోభిల్ల పలుకుము.
వ్యర్థ భాషణంబనర్థమయ్య.
తగవు లాడరాదు తక్కిన వారితో
శుభము పలుకుటదియె సుఖము మనకు.
భావము.  శుభము శుభము అనే మంచి మాటలనే పలుకు చుండుము. వృథా వివాదములను, తగవులను ఎవ్వరి తోడనూ పెట్టుకొన వలదు.

వ్యశేషు దేవహితం యదాయుః
స్వస్తిన యింద్రో వృద్ధశ్రవాః
తే.గీ. దేవతాళిని గొల్చుచు తేజరిలగ
తగిన ఆయువునొందుత. తాను గురుని
నుండి పొందిన యింద్రుడు నిండు గాను
ఆయువునొసంగి మనలను కాయు గాక.
భావము.  ప్రస్తావింప బడిన దేవతా సమూహమును స్తుతించుటకు తగిన ఆయుర్దాయమును మనము పొందుదుము గాక.
బృహస్పతి యొద్ద గ్రహించిన యింద్రుడు మనకు పరి పూర్ణమైన ఆయువును ప్రసాదించి కాపాడును గాక.
స్వస్తినః పూషా విశ్వ వేదాః
స్వస్తినస్తార్క్ష్యో అరిష్ఠ నేమిః
స్వస్తినో బృహస్పతిర్ దదాతు.
భావము. మంచైనా చెడ్డైనా యితరులతో మనం భాషించే భాషణను బట్టే ఉంటుందనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఏలనంటారా. చూడండి " మీ నాన్నగా రున్నారా? అని అడిగిన దానికీ, నీ అమ్మ మొగుడున్నాడా? అని అడిగిన దానికీ ఉన్న తేడా " తెలుసుకోలేమా మనం.
తే.గీ.  రవి యుపాసనాశయమును రగులఁ గొల్పు.
గరుడుఁ డొసఁగుత పూజ యోగ్యతను మనకు.
దేవుడగు గురుఁడొసఁగుత దివ్య శుభము.
మంచి నెన్ని మనకు కలిగించుగాక.
భావము.  సకల దేవతా స్వరూపుడగు సూర్యుడు మనకు స్వస్తిని అనగా ఉపాసన యొక్క ఆశయము ప్రసాదించును గాక.
వజ్రాయుధముచే కొట్టబడిన గరుత్మంతుడు మనకు స్వస్తిని అనగా పూజించుటకు తగిన యోగ్యతను ప్రసాదించును గాక.
భగవంతుడగు బృహస్పతి మనకు స్వస్తిని అనగా శుభములను ప్రసాదించును గాక.
మంత్రము. 

స్వస్తి ఇంద్రో వృద్ధశ్రవాః స్వస్తి నః పూషా విశ్వవేదాః 
స్వస్తి స్తార్యో అరిష్టనేమిః స్వస్తి నో బృహస్పతిర్దధాతు. 
ఓం శాంతిః శాంతిః శాంతిః 
తే.గీ.  ఋషి నుతేంద్రుఁడు శుభములనిచ్చుఁ గాత!.
సర్వవిత్సూసూర్యుడిచ్చుత సకల శుభము
లాపదలఁ గాచి వాయువు హాయినిడుత!
గురుఁడు కాచుత శుభములు కూర్చి మాకు.
భావము.  సనాతన ఋషులచే స్తుతించబడిన ఇంద్రుడు మాకు శుభము చేకూర్చుగాక !
సర్వజ్ఞుడైన సూర్యుడు మాకు శుభమును కలుగజేయుగాక !
ఆపదలనుండి కాపాడు వాయువు మాకు శుభమును అనుగ్రహించుగాక !
మాలోని ఆధ్యాత్మిక ఐశ్వర్యమును రక్షించి కాపాడు బృహస్పతి మాకు శుభమును ప్రసాదించుగాక !

శ్లో.  భద్రం కృతం కృతం మౌనం కోకిలైర్జలదాగమే
దుర్దురా యత్ర వక్తారః తత్ర మౌనం హి శోభనమ్.
. కప్పలు వక్తలగుతరిన్ 
దప్పక కోకిలలు మౌన ధారణ చేయున్. 
గొప్పలు పల్కెడి కుకవులు 
చెప్పునచట పండితులిక చెప్పకునికి మేల్.
భావము.  వానకాలము రాగానే కప్పలే వక్తలౌతాయి కనుక, కోకిలలు మౌనాన్ని ఆశ్రయించటమే శోభిస్తుంది !

శ్లో. భద్రం భద్రమితి బ్రూయాత్, భద్రమిత్యేవ వా వదేత్
శుష్క వైరం, వివాదం కుర్యాత్ కేనచిత్ సహ.
.వె. శుభము, శుభమటంచు శుభమునే పల్కుఁడు. 
శుభము పల్క నీకు శుభము కలుగు. 
శుష్క వైరములకు చూడబోవకుమయ్య. 
వ్యర్థ వాదనంబు వద్దు వద్దు.
భావము. ఎల్లప్పుడూ శుభం, శుభం అంటూనే ఉండాలి. శుభమగుగాక అనే పలుకుతూ ఉండాలి. ఎవరి తోనూ కూడా శుష్క విరోధాలూ, తగవులకు దారితీసే వితండ వాదాలు కూడదు.

శ్లో.  భారస్యోద్వాహనార్థంచ   -  రథాక్షోభాజ్యతే యథా

భోజనం ప్రాణాయాత్రార్థం   -  తద్వత్విద్వాన్ని శేవతే ౹౹ 

తే.గీ.  రథము బరువును లాగ చక్రముల యిరుసు

లందు నూనెను పోయుట కందుము కద?

యటులె గుణులు జీవించంగ పటువునొసగు

నోగిరమె కోరుచును ననుయమొందఁ గనరు.     

భావము.  భారము ఎక్కకువ అయ్యినపుడు సులువుగా లాగుటకు రథ చక్రానికి నూనె వేయుదురు.అదేవిధముగ విద్య ఉన్న జ్ఞానులు తమ జీవితం సాగించుటకు మాత్రమే భోజనము చేయుదురు కానీ, భోజనము కోసమని జీవితము సాగించరు.

శ్లో.  భార్యావియోగశ్చ,  జనాపవాదొ, ఋణస్య శేషః కుజనస్య సేవా,
దారిద్ర్యకాలే ప్రియ దర్శనం , వినాగ్నినా పంచ దహన్తి కాయమ్॥
గీ. ఆలి యెడబాటు, మరియు జనాపవాదు,
ఋణము భారము, దుస్సేవ, భౄణ హత్య, 
లేమిలో మిత్ర దర్శనం బీ మనుజుల 
నిప్పు లేకయే కాల్చురా నిరుపమముగ. 

భావము. భార్యా వియోగం, లోకనింద, ఋణ శేషం, నీచుల సేవ, దారిద్ర్యమందు ప్రియదర్శనం, ఇవి నిప్పులేకుండానే మనని కాల్చేస్తాయి. 

శ్లో.  భవన్తి నమ్రాస్తరవః ఫలోద్గమైః

నవాంబుభిర్భూరి విలంబినో ఘనాః

అనుద్ధతాః సత్పురుషాః సమృద్ధిభిః

స్వభావ ఏవైష పరోపకారిణామ్.

తే.గీ. పండ్లతోనున్న వృక్షము వంగియుండు,

నీటితోనున్న మేఘంబు నింగి వ్రేలు,

జ్ఞానసంపన్నులణకువఁ గలిగియుంద్రు,

పరులకుపకారగుణులిట్లె వరలుదురుగ.

భావము. ఫలములతో నిండిన వృక్షము, నీటితో నిండిన మేఘము, జ్ఞానంతో పండిన సత్పురుషుడు ఎల్లప్పుడూ వినయశీలురై వంగి(అణగి)వుందురు.

శ్లో.  భావేషు విద్యతే దేవో నపాషాణే మృణ్మయే
నఫలం భావ హీనానాం తస్మాత్ భావోహి కారణం.
.  భావన చే నెఱుగంబడు 
దైవము.మరి మట్టి రాయి, దారువులందున్
భావనచేయక కొలిచిన
దేవుఁడు ఫలమీడు. తెలిసి దేవునిఁ గనుమా.
భావము.  మనుష్యుఁడు భావించే భావన లోనే దేవుఁడున్నాఁడు. కాని రాతియందు కాని, మట్టియందు కాని చిత్రమునందు కాని దేవుఁడు లేడు.కనుక భావింప లేని వానికి ఫలము లేదు.

శ్లో. భాషాసు ముఖ్యా మధురా  -  దివ్యా గీర్వాణ భారతీ|             

తస్యాం హి కావ్యం మధురం  -  తస్మాదపి సుభాషితం ||  

తే.గీ.  భాషలందున ముఖ్యమై వరలు మధుర

భాష గీర్వణ భాషయే, వాస్తవమిది,

అందుకావ్యముల్ మధురమ్ము లరసి చూడ,

వరసుభాషితములు గొప్ప వాటికన్న.

భావము. భాషలన్నిటిలోనూ ముఖ్యమైనది, తీయనిది, దివ్యమైనది (విశేషమైనది) గీర్వాణ భారతి అనగా సంస్కృత భాష. అందులోకూడా కావ్యం మధురమైనది. దాని కంటెనూ కూడా సుభాషితం మధురమైనది.

శ్లో.  భీతేభ్యశ్చాభయం దేయం. వ్యాధితేభ్యస్తథౌషధం.
దేయ విద్యార్థినాం విద్యా. దేయమన్నం క్షుథార్తినాం
తే.గీ.   భీతునకు గొల్పుమభయంబు ప్రీతి తోడ.

వ్యాధికౌషధ మిడుమయ్య! భక్తి తోడ.

విద్య కోరిన గరపుమా హృద్యముగను;

ఆకలన్నట్టి వారికినన్న మిడుము.

తే.గీ.   భీతిగొనువారికభయంబు ప్రీతి నిడుము.
రోగికౌషధమొసగుము బాగు చేయ;
చదువుకొనఁ గోరువారికి చదువు చెపుము!
ఆకలన్నట్టివారలకన్న మిడుము.

భావము.   భయము చెందిన వానికభయ దానము; రోగ పీడితులకు ఔషధ దానము; విద్యార్థులకు విద్యా దానము; ఆకొన్న వారికి అన్న దానము చేయుట ఉచితము.

శ్లో. భుంజానో బహు బ్రూయాత్ , నిందేదపి కంచన
జుగుప్సిత కథాం నైవ శృణుయాదపి నా వదేత్. 
తే.గీ.  భోజనము  చేయునప్పుడు మూగ వగుము. 
పరుల నింపఁ బోకుము. పరమ రోత 
కొలుపు మాటలు వినకుము పలుకఁ బోకు. 
శాంత మతివౌచు భుజియింప సత్ఫలమిడు.
భావము.  భోజన సమయంలో అతిగా మాట్లాడకూడదు. ఎవరిని గూర్చియు నిందచేయరాదు. రోత కలిగించే విషయాలను వినకూడదు. ప్రస్తావించకూడదు. 

శ్లో.  ఏకయేవ భుంజీత - యదిచ్ఛేత్ సిద్ధిమాత్మనః.
ద్విత్రిభిర్బహుభిస్సార్ధం భోజనంతు దివా నిశమ్.
కం.  భుజియింపగ రాదొంటిగ.

నిజమిది రాత్రింబవళులు. నిరుపమగతి సత్

స్వజనులనిద్దరి, ముగ్గురి

భుజియింపగ తోడు గలిగి భుజియింప వలెన్.

భావము.  పగలు కాని, రాత్రి కాని, ఒంటరిగా భుజింప కూడదు. ఇద్దరు, ముగ్గురు కలసి భుజిస్తున్న పంక్తిలో కూర్చొని భుజించాలి.ఇది శ్రేయస్కరమైన పద్ధతి. అని పెద్దలు చెప్పుదురు.

శ్లో.  భూతాని దుర్గా. భువనాని దుర్గా. స్త్రీయో నరశ్చాపి పశుశ్చ దుర్గా.
యద్యద్ధి దృశ్యం ఖలు నైవ దుర్గా. దుర్గాస్వరూపదపరం నకించిత్.
.  దుర్గయె భూతావళి కన.
దుర్గయె భువనాళి తెలియ. తోయజ ముఖి యా
దుర్గయె స్త్రీ పురుష పశులు.
దుర్గయె కనఁబడునవెల్ల.దొరకవపరముల్.
భావము. ప్రాణికోటి దుర్గా స్వరూపమే. లోకములన్నియు దుర్గా స్వరూపమే. స్త్రీలు, నరులు, పశువులును దుర్గా స్వరూపమే.ంటికి కనిపించునవన్నియు దుర్గా స్వరూపమే. దుర్గా స్వరూపము కంటే వేరే మరేదీ లేదు.

శ్లో.   భౌమాశ్వని ప్రయాణంచ ప్రవేశే శని రోహిణి । 
వివాహే గురు పుష్యేతు షాణ్మాసం మరణం ధృవమ్ ॥ 
తే.గీ.   అశ్వనీయుక్త భౌమనాడరుగ రాదు.
రోహిణీ స్థిరవారము గృహ ప్రవేశ
మొప్పదు గురు పుష్యమి పెండ్లి యొప్పదయ్య
ఒప్పనివి చేయ మృతి కల్గు. తప్పదయ్య.
భావము. అశ్వనీ మంగళవారము నందు ప్రయాణము, రోహిణి శనివారము నందు గృహ ప్రవేశము, పుష్యమీ గురువారము నందు వివాహమును ముఖ్యముగా చేయకూడదు. ఆయా తిది నక్షత్ర వారములతో కూడిన దుష్ట యోగములందు వాటి నాచరించిన మరణ ప్రదము కాగలదు.

శ్లో.  బ్రహ్మ నిష్ఠో గృహస్థః స్యాత్; బ్రహ్మ జ్ఞాన పరాయణః
యద్యత్ కర్మ ప్రకుర్వంతి తద్బ్రహ్మణి సమర్పయేత్.100.
తే.గీ.  బ్రహ్మ నిష్ఠయు; జ్ఞానము; భక్తియు; మది
కలిగి యుండి; గృహస్థుఁడు కర్మములను
చేయ వలయును. అతఁడవి చేయు చుండి;
ఫలము కృష్ణార్పణము చేయ వలయు సతము. 
భావము.  గృహస్థు బ్రహ్మ జ్ఞాన పరాయణుఁడై; బ్రహ్మ నిష్ఠుఁడై; ఈశ్వరార్పన బుద్ధితోనే సర్వ కర్మలను చేస్తూ ఉండ వలెను.

 శ్లో. మందోஉప్యమందతామేతి సంసర్గేణ విపశ్చితః 
పంకచ్ఛిదః ఫలస్యేవ నికషేణావిలం పయః .
తే.గీ. అల్పుడధికునితో గూడ నధికుఁడగును.
ఘనుల సంసర్గమునకల్గు ఘన ఫలంబు.
మలిన జలబిందువైనను మంచిముత్య
మట్లు మెఱయును పద్మపత్రాంబువయిన.
భావము.  అల్పుడైనా విద్వాంసులతో కలిసి ఉండటంతో అనల్పుడౌతాడు. కలుషిత జలబిందువైనా తామరాకుమీద పడిన కారణంగా ఒక మంచి ముత్యంలా తళతళలాడిపోతుందికదా!

శ్లో.  మక్షికా వ్రణమిచ్ఛంతి , ధనమిచ్ఛంతి పార్థివాః

నీచాః కలహమిచ్ఛంతి , సంధిమిచ్ఛంతి పండితాః.  

తే.గీ. చెడిన చోటు కోరి చేరుచుండును యీగ 

ధరణి పతులు కోరు ధనము భువిని..         

నీచ కలహ వాంఛ నీచులకుండును.  

వరలు సంధి కోరు పండితుండు.                                  

భావము. ఈగలు పుండ్లను , రాజులు ధనమును , నీచులు కలహమును ,పండితులు సంధిని కోరుకుంటారు. 

శ్లో.  మత్తః ప్రమత్తోశ్చోన్మత్తః - శ్రాన్తః క్రోధీ బుభుక్షితఃl

లుబ్ధో భీరుః త్వరాయుక్తః - కాముకశ్చ న ధర్మవిత్ll

తే.గీ.  మత్తుఁ, డున్మత్త, లుబ్ధ, ప్రమత్త,  భీరు

వులును, క్రోధి, కాముకుఁడునా కలినినున్న

వాఁడును,మరియు నలసినవాఁడు,త్వరను

కలుగు వాఁడు, నిలపైన ధర్మంబు కానలేరు.

భావము. "మత్తుడు, ప్రమత్తుడు, ఉన్మత్తుడు, అలసిపోయి ఉన్నవాడు, కోపంతో ఉన్నవాడు, ఆకలితో ఉన్నవాడు, లోభి, పిరికివాడు, తొందరపాటులో ఉన్నవాడు, కాముకుడు - వీరు ధర్మమును తెలుసుకోలేరు".

శ్లో.  మత్తస్త్వముత్కృష్టః. త్వత్తోzహమపకృష్టః.
ఇత్యాకారకాంగుళి సంపుటీకరణం నమస్కారః.
తే.గీ. నీవు ఘనుఁడవు నాకంటె నేలపైన ,
నేను తక్కువ నీకంటె నిజమటంచు
మదిని తలపోసి, యహమును మదిని వీడ, 
ప్రబలు యంగుళి సంపుటి వందనమగు.  
భావము.   రెండు చేతుల వ్రేళ్ళు జోడించి, నాకంటే నీవు గొప్ప వాఁడవు. నీకంటే న్ను తక్కువ వాఁడను.అని మనస్స్ భావించి చేయు క్రియ నమస్కారమని తెలియు చున్నది. అనగా అహంకారమును వీడి మనస్సును అడంచుటయే నమస్కారమన్న మాట. 

శ్లో.  మత్సమః పాతకీ నాస్తి! పాపఘ్నీ త్వత్సమా హి!
ఏవం జ్ఞాత్వా మహాదేవి! యథాయోగ్యం తథా కురు!!
తే.గీ.  నన్నుఁ బోలిన పపిలేడెన్ని చూడ.
పాపులనుబ్రోవ నీవంటివారు లేరు.
పాపినైనట్టి నన్ను కాపాడవమ్మ. 
నీకు తోచిన విధముగా నీరజాక్షి.
భావము.  మహాదేవి! నావంటి పాపాత్ముడు మరొకడు లేనేలేడమ్మా. అట్లే ప్రాణులు చేసిన పాపాలను నాశనం చేయుటలొ నీతో సరిసమానులు వేరొకరు లేనేలేరు మాతా! కావున నా వేడికోలును మన్నించి జననీ! ఏది, ఎట్లు ఉచితమని భావించెదవో, అది అట్లే చేయుమని అర్థించెదను.

శ్లో.   మనయేవ మనుష్యాణాం కారణం బంధ మోక్షయోః.
బంధాయ విషయా సంగీ. ముక్త్యైనిర్విషయం స్మృతమ్.
.వె.  మనసు కారణంబు మహనీయ ముక్తికిం
బంధ కారణంబు మనసె యగును,
బంధమొసగు విషయ వర్తిత చిత్తము
ముక్తబంధ యైన ముక్తినొసగు.
.  మనిషికి బంధము మోక్షము
మనసువలన కలుగుచుండు, మది విషయమునన్
తనియక నిలచిన బంధము,
తనియుచు నిర్ విషయమైన ధర మోక్షమిడున్.

భావము.   ఐహిక బంధములకైనా, ఐహికాతీత మోక్షమునకైనా మనస్సే కారణము. మనస్సు విషయాసక్తి కలిగి యున్నచో బంధనములు దానితోపాటు పెఱుగును. అదే మనస్సు నిర్విషయాసక్తమైనచో ముక్తిని పొందును.

 శ్లో.  మనసాఽపి యదస్పృష్టం  -  దూరాదపి యదుజ్ఝితమ్ |

తదప్యుపాయైర్వివిధైః  -  విధిరిచ్ఛన్ ప్రయచ్ఛతి ||

(సుభాషితసుధానిధి)

తే.గీ.  మనసుచేనైన తాకంగ ననువుకాని,

ప్రబలినట్టి నిరాశన్ దిరస్కరింప

బడిన దేనినైనను విధి ప్రకటితముగ

నిచ్చుచుండును, విధివశమీజగమ్ము.

 భావము.  ఏది మనసుతో కూడా తాకడం సాధ్యపడదో, ఏది నిరాశతో తిరస్కరించబడిందో, అలాంటిదాన్ని కూడా విధి అనేక మార్గాల్లో నిర్ధరించి ఇస్తుంది.

 శ్లో.  మనస్యేకం వచస్యేకం  - కర్మణ్యేకం మహాత్మనః,

మనస్యన్యత్ వచస్యన్యత్క - ర్మణ్యన్యత్ దురాత్మనః.

తే.గీ.  ఆత్మ నున్నదె చెప్పుచు నదియెచేయు,

మహి మహాత్ములు, దుహష్టుల స్పృహయె వేరు.

చింత చేయునదొక్కటి చెప్పి చేయు

నవి కనగ వేరువేరగునరసిచూడ.

భావము.

మహాత్ములు ఏది తలచుదురో అదియే చెప్పుదురు. చెప్పినదే చేయుదురు.దురాత్ములు విధముగా కాదు. వీరు తలచునది ఒకటి, చెప్పునదొకటి, చేయునది వేరొకటి.

శ్లో.   మనీషిణః సంతి తే హితైషిణః 
హితైషిణస్సంతి తే మనీషిణః
సహృచ్చల విద్వానపి దుర్లభో నృణాం 
యథౌషధం స్వాదు హితంచ దుర్లభమ్.
.వె.   బుద్ధిమంతులహిత మూర్తులు కావచ్చు. 
హితము కోరు జ్ఞానమతులునరుదు.
హితము కోరు జ్ఞాన మతులుకల్గుటయన్న, 
మందు రుచిగనొప్పి ముందునుంట.
భావము. బుద్ధిమంతులున్నా, వారు హితాన్ని కోరేవారు కాకపోవచ్చు. హితాన్ని కోరేవారున్నా , వారు విద్వాంసులు కాకపోవచ్చు. సహృదయులు,విద్వాంసులు కూడా ఐనవారురుచిగల ఔషధం వంటివారు. మానవులలో అలాంటివారు లభించటం చాలా అరుదు.

శ్లో.  మన్నిందయా యది జన: పరితోష మేతి
నన్వ ప్రయత్న జనితోz మనుగ్రహో మే,
శ్రేయోర్ధినో హి పురుషా: పరతుష్ఠి హేతో:
దు:ఖార్జితాన్యపి ధనాని పరిత్యజంతి.
.  నను నిందించుచు తృప్తిని
గనఁ గలిగిన సంతసంబె కదనా కన్యుల్
ధనమును వెచ్చింతురు పర
జనులను తృప్తులను జేయ, సత్కృతునగుదున్..
భావము.  నన్ను తిట్టడం వలన జనాలకి ఆనందం కలుగుతోందా ? ఆహా ! ఎంత అదృష్టవంతుడిని ! నా భాగ్యం ఎంత గొప్పది ! నా మీద అప్రయత్నమైన అనుగ్రహం చూపించడమే కదా, నన్ను నిందించడమంటే. విధంగానయినా నన్ను పట్టించుకుంటున్నారంటే నాకు అంత కన్నా ఇంకేం కావాలి? లోకంలో చాలా మంది ఎంతో డబ్బు తగలేసి, ఇతరులకు సంతృప్తిని కలిగించి మరీ వారి కి ఆనందాన్ని కలిగిస్తూ ఉంటారు. మరి నాకో? ఒక్క పైసా ఖర్చు చేయకుండానే ఇతరులకు ఆనందాన్ని కలిగించే భాగ్యం దక్కుతోంది. నన్ను తిట్టడం వలన వారికి అట్టి ఆనందం కలుగుతూ ఉంటే నాకు అంతకన్నా ఏం కావాలి చెప్పండి !

శ్లో. మహతామాశ్రయః పుంసాం , ఫలం భాగ్యానుసారతః
ఈశస్య కంఠ లగ్నో உపి వాసుకిః వాయుభక్షకః.

తే.గీ.  ఘనుల యాశ్రయమున్నను కలుగ బోదు
లేని యోగము. మనకున్నదేను కలుగు.
శివుని కంఠంబు నుండియు చిత్రముగను
గాలినే తిను వాసుకి. కలిగె నదియె.

భావము.  మానవుల్కు మహాత్ముల ఆశ్రయము లభించి యున్నప్పటికీ, తనభాగ్యానుసారమే ఫలము లభించును.వాసుకొ పరమశివుని కంఠాలంకారముగా యున్నప్పటికీ అతడు గాలియేకదా భుజించుటకు దక్కుచున్నది?

శ్లో.  మహాజనస్య సంపర్క : -  కస్య నోన్నతికారకః

పద్మపాత్రస్థితం తోయం  -  ధత్తే ముక్తాఫల శ్రియమ్ ౹౹ 

తే.గీ.  మాన్య జనుల సంపర్కమ్ము మహిత గతిని

యీయకుండగ నెట్లుండు? జ్ఞేయముగను, 

పర్మపత్ర పాత్రంబుపై పడిన నీటి

బిందువది మౌక్తిక ప్రభ పొందకున్నె?

భావము.  మహావ్యక్తుల సంబంధం ఎవరికైనా కానీ తానే ప్రసిద్ధిని ఇవ్వకుండా 

ఉండగలదా?అలాగే,పద్మపత్ర అంటే తామరాకు మీద ఉన్నా నీటిబొట్టు 

ముత్యంలా ప్రకాశిస్తుంది.
శ్లో.  మహానదీ ప్రతరణం - మహా పురుష నిగ్రహం
మహా జన విరోధంచ - దూరతః పరి వర్జయేత్.
తే.గీ.  ఆదరువు లేక నది దాట నమరు ముప్పు.
అధికు లకుభిన్నముగనుమాటాడరాదు.
పూన రాదు విరోధము జ్ఞానులయెడ.
నాశనంబగు వినకున్న నాదు మాట.
భావము.  మహా ప్రవాహములను నిరాధారుడై దాట యత్నించ రాదు. మహా పురుషులతో నిగ్రహించి మాటలాడరాదు. మహాత్ములతో విరొధము పూన రాదు. ఇవి వినాశకరములు సుమా.భావము. ఎంత గొప్పవారిని ఆశ్రయించుకొని ఉన్నా, ఫలితం మాత్రం అదృష్టానుసారమే దక్కుతుంది. ఐశ్వర్యకారకుడైన శివుని కంఠాన్ని కౌగిలించుకొని ఉన్నా వాసుకి కేవలం గాలినే భక్షిస్తున్నాడు కదా.

శ్లో.   మాతరమ్ పితరంచైవ  -  సాక్షాత్ ప్రత్యక్ష దేవతామ్.
మత్వా గృహీ నిషేవేత  -  సదా సర్వ ప్రయత్నతః.
తే.గీ.   తల్లిదండ్రులు ప్రత్యక్ష దైవములిల  
దాని భావించి గేస్తు సద్భక్తితోడ
సేవలను చేసి నిరతము బ్రోవ వలెను.
సత్య, సత్వర్తనాదులు శ్రద్ధనొదవు.
భావము. కుటుంబి తల్లిదండ్రులను ప్రత్యక్ష దైవముగా భావించుచు, అన్ని విధముల వారిని సేవింప యత్నించవలెను.

శ్లో.  మాతా పార్వతీ దేవీ  -  పితా దేవో మహేశ్వరః!

బాంధవా శ్శివభక్తాశ్చ   -  స్వదేశో భువన త్రయమ్.

తే.గీ.   పార్వతీమాత నా మాత! భక్త సులభ,

శివుఁడు నా తండ్రి, మెదలు నా చిత్తమందు,

వరలు  శివ భక్తులే నాకు బంధువులిల,

నా నివాసంబు గన భువనత్రయంబు. 

తే.గీ.   పార్వతీ దేవి మా తల్లి భక్తి కొలుతు.
పార్వతీ పతి మా తండ్రి  ప్రాణ మతఁడు.
శివుని భక్తులు బంధువుల్  ప్రవర సఖులు.
త్రిభువనమ్ములు నా దేశ మభవునాన.

భావము.  నాతల్లి పార్వతీమాత. నా తండ్రి మహేశ్వరుఁడు.  శివభక్తులే నా బంధువులు.  ముల్లోకములూ నా నివాస స్థానము.

శ్లో.  మాతృవత్ పర దారేషు – పర్ ద్రవ్యేషు లోష్టవత్,

ఆత్మవత్ సర్వ భూతేషు, - యః పశ్యతి స పండితః.

కం.  పర సతులను తన తల్లిగ

పర ధనమును మట్టివలెను, భావించుచునే

పరులను తనగా చూచెడి

నిరుపములిల పండితులు పునీతులు వారే.

భావము. పర కాంతలను తన తల్లిగాను, పరుల ధనమును మట్టి వలెను, ఇతరులను తన వలెను తెలియువారే పండితులు.

శ్లో.  మహానుభావ సంసర్గః కస్యనోన్నతికారణం. 
ప్రవిశ్య గంగాం రథ్యాంబు త్రిదశైరపి సేవ్యతే.(పండిత రాయ శతకం)
.వె.   గొప్పవారి జేరు కొలది వారును కూడ

గౌరవంబు పొందు ఘనతరముగ.

గంగలోన చేరు కలుష జలము కూడ

దేవ గణము చేత సేవితమగు

భావము.   మహానుభావుల సంసర్గము అల్పులకును ఔన్నత్యము కల్పిస్తుంది. గంగలో కలిసిన వీధి నీటికి కూడా దేవతలచే సేవింపఁబడు యోగ్యత కలగడం చూడట లేదా?

శ్లో. మానాద్వా యది వా లోభాత్ క్రోధాద్వా యది వా భయాత్ 
యో న్యాయమన్యథా బ్రూతే , యాతి నరకం నరః. 
తే.గీ. హేతు వేదైన కావచ్చు ఖ్యాతమైన
న్యాయమును వీడి తీర్పరి నడచెనేని
రౌరవాది నరకములఁ జేరునతఁడు.
జన్మజన్మలకీ పాప చయము విడదు.
భావము. దురభిమానం వల్లగానీ , లోభం వల్లగానీ , కోపంతోనో, భయంతోనో గానీ న్యాయాన్ని దాచిపెట్టి మరో విధంగా తీర్పుచెప్పిన మనిషి నరకానికి పోతాడు.

శ్లో. "మాహాత్మ్యస్య సమగ్రస్య  ధెైర్యస్య యశస శ్శ్రియ: 
జ్ఞాన వైరాగ్యయో శ్చైవ షణ్ణాం - భగ ఉచ్యతే
ఇత్యుక్త భగోZస్యాస్తీ తి భగవాన్"
తే.గీ.  వినుత మాహాత్మ్యమును, ధైర్యమనునదియును
యశము సంపద జ్ఞానము విశదమయెడి
గొప్ప వైరాగ్య మనునవి కూడ భగము.
కూడి భగవంతుఁడనఁబడి కొలువఁ బడును.
భావము.  1) మాహాత్న్యము. 2) ధైర్యము. 3) యశస్సు. 4) సంపద. 5) జ్ఞానము. 6) వైరాగ్యము, అనే ఆరింటిని షడైశ్వైర్యములు అందురు. వీటికే "భగ" అని పేరు. ఆరు ఐశ్వైర్యములను సంపూర్ణంగా కలిగి ఉండుట వలననే "భగవంతుడు" అని పేరు కలిగినది.
శ్లో.  మాతా సమం నాస్తి శరీర పోషణమ్, - చింతా సమం నాస్తి శరీర శోషణమ్.
భార్యా సమం నాస్తి శరీర తోషణమ్. - విద్యా సాం నాస్తి శరీర భూషణమ్.
తే.గీ. మనలఁ బోషించి కాచును మాతృమూర్తి.
పాయనిది చింత, శుష్కింపఁ జేయు మనల.
భార్య సంతోషదాయిని. భాగ్య రాశి.
విద్య భూషణంబయినిల్చు వేల్పు మనకు.
భావము.  మన శరీరమును పోషించుటలో తల్లికన్న గొప్పవారు ఉండరు. మనలను శుష్కింప జేయుటలో చింత కంటే మించినది వేరు లేదు. మన శరీరమునకు ఆనందము కలిగించుటలో భార్యను మించినవారుండరు.
మన శరీరమునకు విద్యకు మించిన అలమ్కారము లేదు.

శ్లో.  మాతృ నిందా మహావ్యాధిః  -  పితృ నిందా పిశాచతః

దైవ నిందా దరిద్ర స్యాత్  - గురు నిందా కుల క్షయమ్.

తే.గీ.  తల్లినే నింద చేసిన తగులు వ్యాధి,

తండ్రినే నింద చేసిన తా పిశాచి

యగును, దైవనిందను పేద యగును,

గురుని నిందింప క్షయమగు కులము, నృహరి!

భావము.  తల్లిని నిందించినచో మహావ్యాధిసంక్రమించును. తండ్రినినిందించినచో పిశాచి అగును. దైవమును నిందించినచో దరిద్రుఁడగును. గురువును నిందించినచో కుల క్షయ మగును.

శ్లో.  మాతృవత్ పర దారేషు - పర ద్రవ్యేషు లోష్ఠవత్
ఆత్మవత్ సర్వ భూతేషు - యః పశ్యతి పండితః.
.  పరసతులను తన తల్లిగ
పర ధనమును మట్టివోలె పరికించుచు తా
పరులను తన వలె తలచుచు
చరియించెడి వాడె భువిని సత్ పండితుడోయ్.
భావము.  భూమిపై యెవరయితే పర కాంతలను తన కన్న తల్లిగాను, పరుల ధనాదులను మట్టి వలెను, చూచే జ్ఞానం కలిగి ప్రవర్తిస్తూ అన్ని ప్రాణులను తనవలె భావిస్తూ అత్యద్భుతమైన సత్ప్రవర్తన కలిగి వుంటారో వారే నిజమయిన పండితులు.

శ్లో.  మా నిషాద ప్రతిష్ఠాం త్వ మగమః శాశ్వతీః సమాః|

యత్ క్రౌంచమిథునాదేకమ్ అవధీః కామమోహితమ్| 

తే.గీ.    కిరాతుఁడా! కామ మోహోపజీవి,

క్రౌంచ దంపతులం దొక క్రౌంచము నిటు

చంపి, కొఱగాని యపకీర్తి నింపుకొంటి

వేల? నెందులకయ్య నీ పాడు జన్మ?

భావము.    కిరాతుఁడా! క్రౌంచ దంపతులలో కామ మోహితమగు ఒక దానిని చంపి, నీవు శాశ్వితమగు అప కీర్తిని పొందితివి. 

నాటి విషాదకర సంఘటనయే అంతటి మహత్తర ఆదికావ్య రామాయణావిర్భావానికి తద్వారా సాహిత్య సోపానానికీ మూలమయింది.మహాత్ములైనవారు విషాదము పొందినను, సంతోషము పొందినను లోక కల్యాణకర ప్రవృత్తినే కలిగి ఉంటారు.

శ్లో. మితం భుంక్తే సంవిభజ్యాశ్రితేభ్యః.,మితం స్వపిత్యమితం కర్మ కృత్వా , 
దదాత్యమిత్రేష్వపి యాచితః సన్,తమాత్మవంతం ప్రజహత్యనర్థాః. 
తే.గీ.  ఆశ్రితులఁ గూడి మితముగ నారగించి, 
శ్రమను చేయుచు నల్పవిశ్రాంతినుండి, 
యాచకులకిచ్చి తృప్తిగ యలరువాని 
చేరబోవనర్థముల్ ధీరులార!
భావము. ఉన్న ఆహారాన్ని ఆశ్రితులతో కలిసి విభజించుకొని మితంగా భుజించాలి. పని ఎంత ఎక్కువచేసినా మితంగానే నిద్రించాలి.యాచించినవాడు శత్రువైనా ఆనందంగా ఇవ్వాలి. లక్షణాలున్నవానికి అనర్థాలూ రానేరావు.

శ్లో.   మిత్రే నివేదితే దుఃఖే - దుఃఖినో జాయతే లఘు

భారం భారవహస్యేన - స్కంధయో: పరివర్తతే.

తే.గీ.  దుఃఖమును మిత్రునకుఁ జెప్ప దుఃఖమణఁగు,

దుఃఖితునిమది తేలికౌన్ దోయజాక్ష!

భుజములనుమార్చి బరువును మోయుచున్న

భారమనిపించదది తగ్గి, భక్తవరద!

భావము.  భుజము మీద బరువుమోసేవాడు బరువునును రెండుభుజాల మధ్యకు మార్చుకుంటే  భారము తగ్గినట్లుగా,  మంచిమిత్రునికి బాధ చెప్పుకుంటే బాధపడేవాని దుఃఖము తగ్గి మనసు తేలికపడుతుంది. అంటే మన దుఃఖము మన ఆత్మీయయులతో పంచుకుంటే కొంత ఉపశమనము కలుగునని భావము.

శ్లో. . ముక్తాఫలైః కిం మృగపక్షిణాం - మృష్టాన్న పానం కిము గార్దభానామ్। 

అంధస్య దీపో బధిరస్య గీతం - మూర్ఖస్య కిం ధర్మకథాప్రసంగః|| (నీతి చంద్రిక)

తే.గీ.  అల మృగములు పక్షులకు ముత్యములవేల?

మధురమైనట్టి భుక్తి గాడిదలకేల?

నంధ బధిరులకును దీప, సుందర నుత

గీతమేల? ద్రాబకు ధర్మ గీతులేల?

భావము.  మృగాలకుగానీ పక్షులకుగానీ ముత్యాల అవసరమే లేదు.  గాడిదలకు మధురమైన భోజనము గానీ, మధురపానీయము గానీ అవసరమే లేదు.  గ్రుడ్డివానికి దీపముతో పని లేదు. చెవిటివానికి సంగీత మవసరము లేదు.  మూర్ఖునికి ధర్మబోధలతో ప్రయోజనము లేదు.

శ్లో.  ముఖం పద్మ దళా కారం - వచశ్చందన శీతలం.
హృత్కర్తరి సమం చాzతి - వినయం ధూర్త లక్షణం.
కం.  సుందర ముఖ పద్మమ్ములు,
నందంబగు పలుకులందు నమృతపు జల్లుల్.,
డెందమ్ములు చుర కత్తులు,
ముందుగనతి వినయమొలయు మూర్ఖుఁలు ధూర్తుల్.
భావము.  చక్కని ముఖ వైఖరి, చల్లని మెత్తని మాటలు, కత్తెర బోను వంటి హృదయము, అతి వినయము ఇవన్నియు ధూర్త లక్షణములు.
ఇట్టి ధూర్తుల విషయంలో మిక్కిలి జాగరూకతతో మనం ప్రవర్తించాలి.

శ్లో.  ముహూర్తమపి తం ప్రాజ్ఞః పండితం పర్యుపాస్యహి.
క్షిప్రం ధర్మ విజానాతి జిహ్వా సూప రసానివ.
తే.గీ.  పండితులఁ జేరి క్షణమున ప్రాజ్ఞుఁడరయు
ధర్మ సూక్ష్మమ్మునిక్కము ధరణి పైన.
పులుసు రుచినొక్క క్షణములో తెలియు జిహ్వ. 
రసనమును పోలి ప్రాజ్ఞులు వసుధ నలరు.
భావము.   ప్రాజ్ఞుఁడైనవాఁడు ఒక్కక్షణమే యైనను పండితుల సహవాసము చేసి;ధర్మమును తెలుసుకో గలుగు తున్నాఁడు. పులుసు రుచిని నాలుక ఎంతలో తెలుసుకొంటుంది.?

శ్లో.  మూకం కరోతి వాచాలం, పంగుం లంఘయతే గిరిమ్ 

యత్కృపా తమహం వందే పరమానందమాధవమ్!

తే.గీ.  మూగవానిచే పలికించు ముచ్చటగను,

కుంటివానిని నడిపించు కొండపైకి,

యేకృపారాశి చేసెడునిట్టు లేను

నాకృపామూర్తికిన్ మ్రొక్కి యభినుతింతు.

భావము. "ఎవ్వరి కృప మూగవానికి అద్భుతంగా మాటలిచ్చి, కుంటువానిని కొండలు దాటిస్తుందో, పరమానంద మాధవునికి వందనం!”

శ్లో.  మూర్ఖాణాం పండితా ద్వేష్యా  -  దరిద్రాణాం మహాధనాః |

అధార్మికాణాం ధర్మిష్ఠా  -  విరూపాణాం సురూపిణః ||  (మహాభారతం)   

తే.గీ.  మూర్ఖులకు పండితులు రిపుల్ భూమిపైన,

బీదలకు రిపుల్ ధనుకులు, పృథ్విపైన

ధర్మ దూరులకును రిపుల్ ధర్మపరులు,

రూపవంతులు రిపులు కురూపులకును.

భావము.  మూర్ఖులకు పండితులు శత్రువులు. బీదవాళ్లకు ధనికులు శత్రువులు. పాపులకు ధార్మికులు శత్రువులు. కురూపులకు సురూపులు శత్రువులు.

శ్లో. మూర్ఖా యత్ర పూజ్యంతే, ధాన్యం యత్ర సుసంచితం
దంపత్యో కలహం నాస్తి తత్ర శ్రీః స్వయమాగతః. 
. ఎక్కడ కలహములుండవొ, 
యెక్కడ దుర్గుణు లపూజ్య హీనులగుదురో, 
యెక్కడ ధాన్యము దాచెద 
రక్కడకే సిరియె చేరునడగక ముందే.
భావము. ఎక్కడ మూర్ఖులు పూజింపబడరో, ఎక్కడ ధాన్యం నిలువచేయబడుతుందో, ఎక్కడ దంపతులకు కలహం ఉండదో అక్కడకు సంపదలు తమంతట తాముగా వస్తాయి. 

శ్లో.  మూర్ఖస్య పంచ చిహ్నాని గర్వో దుర్వచనం తథా 
క్రోధశ్చ దృఢవాదశ్చ పరవాక్యేష్వనాదరః.
తే.గీ.  గర్వమును, దుర్వచనతను కలిగి యుంట,
కోప వర్తన,పిడివాద మాపరాని
పరులవాగనాదరతయు ప్రబలియుండు
మూర్ఖులం దుండవివి కనఁ బూజ్యులందు.
భావము. గర్వము, చెడుమాటలు మాట్లాడుట, కోపము, పిడివాదము, ఇతరుల భాషణమునందు అనాదర భావము అను ఐదు మూర్ఖుల లక్షణములు.

శ్లో.  మూర్ఖేణ సహ సంయోగో - విషాదపి సుదుర్జరః

విజ్ఞాన సహ సంయోగ: - సుధారససమ: స్మృత:.

తే.గీ.  విషముకన్నను ఘోరమౌ విషము తలప  

మూర్ఖ సంగతి జనులకున్, బూజ్యులార!

సుజన సంగతి పరికింప సుధకు మించి

గొప్ప సుధయౌను మనలకు కువలయమున.

భావము. మూర్ఖుడితో సంబంధాలు విషం కన్నా ఎక్కువ విషం. సజ్జనులతో సహవాసం సుధ అంటే అమృతంతో సమానం.

శ్లో. మృగమద! మాకీరు గర్వమ్.  -  పరిమళమాత్రేణ తం త్వముపయాసి.
పరిమళ, శీతలతా, నిర్మలతా,  - స్సుకుమారతా , కర్పూరే.(పండితరాయలశ్లోకము)
.  గరువంబొందఁగబోకు నీవు వినుమా కస్తూరి! నీ సౌరభం
బరయన్ సద్గుణమొక్కటేను. కనుమాయానంద కర్పూరమున్.
పరమోదంచిత సౌరభంబు, నవురున్, బ్రఖ్యాత నైర్మల్యమున్,
వరణీయంబగు సీతలత్వమును సంవాసించునద్దానిలో.
భావము.   కస్తూరీ ! ఒక్కపరిమళము తప్ప నీలో మరోసుగుణ్ము ఏదీ లేదు. కర్పూరములో పరిమళమూ  శీతలతా నిర్మలతా  సుకుమారతా కూడాఉన్నాయి కనుక అనవసరంగా గర్వపడకు.

500. శ్లో. మృత్పిండ ఏకో బహుభాండ రూప - స్సువర్ణ మేకం బహుభూషణాని,
గోక్షీర మేకం బహు ధేనుజాత  - మేకః పరాత్మా బహుదేహవర్తీ॥ 
తే.గీ.  మలయు కుండలన్నిట నుండు మట్టి యొకటె. 
స్వర్ణ భూషణంబుల నుండు స్వర్ణమొకటె. 
ధేనువులు వేరు పాలొకటేను తెలియ. 
దేహములు వేరు, మసలెడి దేహి యొకడె.

భావము. కుండలకు చాలారూపాలు. దానికి మూలప్రకృతి అయిన మట్టిముద్ద ఒక్కటే, ఒక్కటే అయిన బంగారమే నానావిధాలైన ఆభరణరూపాల్లో దర్శింపబడేది. తెల్లావు, నల్లావు, కపిలగోవు ఇలా ఎన్నివున్నా (ధయ త్యేనాం వత్సీ ఇతి ధేనుః) వీటి అమ్మతనానికి కారణమైన పాలు ఒక్కటిగానే వున్నయి. అదే విధంగా హరిహరబ్రహ్మేన్ద్రాదులు, మత్స్య, కూర్మ, వరాహ, నారసింహ, పరశురామ, శ్రీరామ, శ్రీకృష్ణ, దత్తాది నానారూపాలల్లో వున్న దేవతల దైవత్వానికి మూలమైన పరమాత్మ ఒక్కడే. 


501. శ్లో. మృదులం నవనీతమీరితం - నవనీతాదపి సజ్జనస్యహృత్
తదిదం ద్రవతి స్వతాపనాత్ - పరతాపాద్రవతే సతాం పునః
.వె. మృదుల మిలను వెన్న, మృదులంబు హృదయంబు
సతము వెన్న కన్న సజ్జనునకు, 
వెన్న తనకు తా నెన్నఁడు కరుగదు.
కరుగు మంచి మనసు కష్టముఁ గని.
భావము.  నవనీతం అంటే వెన్న, వెన్న అన్నిటికంటే మృదువైన పదార్థం అంటారు. కానీ నవనీతంకన్నా కూడా సజ్జనుల హృదయం మృదువైనదట. ఎందుకంటే వెన్న స్వతాపనాత్ ద్రవతే, తనని తాను వేడి చేస్తే కానీ కరగదు. కానీ సజ్జనహృదయం పరతాపా ద్రవతే అంటే పరుల తాపాల కి కూడా కరిగిపోతుందట. ఇక్కడ తాపం, వేడి అంటే కష్టం అని చూడండి వెన్న కరగాలంటే అది కష్టం అనుభవించాలి కానీ తన మృదుత్వం వలన చిటికెలో కరిగి పోతుంది. మరి సజ్జనులు ఎదుటివారి కష్టాలకి కూడా మళ్ళీ మళ్ళీ కరిగి పోతారు. ఇలా ఎదుటివారిని కష్టాలలో చూసి ఓర్వలేక తమ జీవితం ధారపోసిన మహానుభావులెందరో అందరికీ వందనములు.

శ్లో. మృషావాదం పరిహరేత్ కుర్యాత్ ప్రియమయాచితః
కామాన్న సంరంభాన్న ద్వేషాద్ధర్మముత్సృజేత్.

. చేయకుమసత్యవాదము.

చేయుము హితమాశవీడి, చేయకహితముల్. 

చేయుము ధర్మము వీడకు 

మాయవలన, ద్వేషమునను, మతి త్వరపడుటన్,

భావము. అసత్యవాదాలు మానుకోవాలి. దేనినీ ఆశించక ఇతరులకు హితం చేయాలి. కావాలనిగానీ, వేగిరపాటుతో గానీ, ద్వేషంతోగానీ ధర్మాన్ని వదలకూడదు.

శ్లో. మోక్షకారణ సామగ్ర్యాం భక్తిరేవ గరీయసీ 

స్వస్వరూపానుసంధానం భక్తి రిత్యభిదీయతే” (శంకర భగవత్పాదులు)

తే.గీ.  మోక్షకారణమగునది పూర్ణభక్తి,

గొప్పదదియంచు శంకరుల్ చెప్పినారు,

స్వస్వరూపానుసంధానమే స్వయముగ

ముక్తినిడు భక్తిగాఁ జెప్పె పూజ్యులార!

భావము.  మోక్ష కారణలైన సామాగ్రులలో “భక్తి” గొప్పది. “స్వస్వరూప అనుసంధానమేఽనగా తనరూపముననే భగవంతుని నిలుపుకొనుటయే భక్తి అనబడును.

శ్లో.  మౌనేన కలహో నాస్తి - మౌనం కలహేనచ
ప్రథమే సుఖమాప్నోతి - అన్యత్తు క్లేశ సంకులమ్
తే.గీ. కలహమది మౌనముననెప్డు కలుగఁబోదు.
కలహమున మౌనమెప్పుడు కలుఁగబోదు.
మొదటి దానిచే సుఖముండు, పిదప దాని
చేత క్లేశముల్ కలుగును ఖ్యాతి పాయు.
భావము. మౌనముగా ఉన్నచో కలహము కలుగదు. కలహము వలన మౌనము కలుగదు. మొదటిదాని చేత సుఖము ప్రాప్తించును. రెండవదానిచేత క్లేశము సంభవించును.

శ్లో.  : పూతనా మారణ లబ్ధ వర్ణ:, - కా కోదరోయేన వినీత దర్ప:,
యస్సత్యభామా సహితస్సపాయా - న్నాధో యదునా మధనా రఘూణామ్!(రచన:- కోలాచలం పెద్దిభట్టు)
తే.గీ.  లక్ష్య పూతనామారణ లబ్ధ కీర్తి,
ఉగ్ర కాకోదరో వినీతోద్ధతియును,
తుష్టి సత్యభామా సహితుండు నయిన
కృష్ణ రాముఁడు మిమ్ము రక్షించుఁ గాక!
రాముని పరముగా అన్వయార్థ దండాన్వయములు.:-
లక్ష్య = లక్ష్యముతోఁ గూడిన,

పూత=పవిత్రమైన

నామా=పేరు గలవాడును,

రణ = యుద్ధము చేయుటయందు,

లబ్ధ కీర్తి=లభించిన కీర్తి గలవాడును,

ఉగ్ర =భయంకరమైన

కాకోదరో(కాక+ఉదర:)=నిర్భయముగ ప్రవర్తించు కాకాసురుని యొక్క, 

వినీతోద్ధతియును=గర్వాపహారియును,

తుష్టి =తృప్తి కరముగా,

సత్య=సత్య వర్తియు,

భా=ప్రకాశవంతమైనవాడును,

మా సహితుండు నయిన=లక్ష్మితో కూడిన వాడును అయిన,

కృష్ణ =నీలి వర్ణుడయిన,

రాముఁడు=శ్రీరాముడు, 

మిమ్ము రక్షించుఁ గాక=మిమ్ములను కాపాడును గాక!

దండాన్వయము:-

లక్ష్యముతోఁ గూడిన పవిత్రమైన పేరు గలవాడును, యుద్ధముఁ జేయుట యందు లభించిన కీర్తి కలవాడును, నిర్భయముగ ప్రవర్తించు భయంకరుడగు కాకాసురుని యొక్క గర్వాపహారియును, తుష్టుగా సత్యప్రవర్తకుడును, కాంతివంతుడును,గృహ రాల్య లక్ష్మితో కూడుకొన్నవాడును, నీలి వర్ణుడయిన శ్రీరాముడు మిమ్ములను కాపాడు గాక!

కృష్ణుని  పరముగా అన్వయార్థదండాన్వయములు:-

లక్ష్య =లక్ష్యమును కలిగి,

పూతనా=పూతన యను రాక్షసిని,

మారణ =చంపుట చేత,

లబ్ధ కీర్తి=లభించిన కీర్తి కలవాడును,

ఉగ్ర =భయంకరమైన,

కాకోదరో=కాళియుడను సర్పము యొక్క, 

వినీతోద్ధతియును=అణచివేయఁబడిన గర్వము కలవాడును,

తుష్టి =తృప్తికరముగ,

సత్యభామా సహితుండు నయిన=సత్యభామా సహితుడును అయిన,

కృష్ణ = కృష్ణుడను పేరుతోగల,

రాముఁడు=రమ్య మూర్తి, 

మిమ్ము రక్షించుఁ గాక= మిమ్ములను కాపాడును గాక.

దండాన్వయము:-

లక్ష్యమును కలిగి పూతన యను రాక్షసిని చంపుట చేత లభించిన కీర్తి గలవాడును, భయంకరమైన కాళీయుఁడను సర్పము యొక్క గర్వ మడంచిన వాడును, తృప్తికరముగ సత్యభామతో కూడి యున్నవాడును,  రమ్యమూర్తి యగు కృష్ణుఁడు మిమ్ములను రక్షించుఁ గాక!

 శ్లో. యచ్ఛ్రుతం న విరాగాయ, - న ధర్మాయ, న శాంతయే

సుశబ్దమపి శబ్దేన - కాకవాశితమేవ తత్.

తే.గీ.  శబ్దమేదైన వినినచో సన్నుతమగు

ధర్మ సంబంధమవవలె, ధరను శాంతి

నిలుపునట్టిదియవవలె, కొలుప వలెను

కలుగు తత్త్వంబు, కానిచో కాకిగోల.

భావము.  విన్నదేదో వైరాగ్యాన్ని కలిగించకపోతే, ధర్మాచరణకు ప్రోత్సహించకపోతే, అది ఎంత గొప్ప సుశబ్ద మైనా కేవలం కాకి అరుపుగానే భావించఁబడును.

శ్లో. యతిభ్యశ్చాధమం ప్రోక్తం - వానప్రస్థశ్చ మధ్యమం 
గృహస్థాత్ స్వీకరో మంత్రం - ప్రకుర్వీత గురూత్తమాత్.
.వె.  మంత్ర ముపదేశమునుగొను మహితులకును
యతుల వల్లను గొనుటది యధమమరయ.
మధ్యమము వానప్రత్శుచే మహిని గొనిన.
ఉత్తమము గృహస్థునినుండి యొనరఁ గొనిన.
భావము. యతులదగ్గర మంత్రోపదేశం అధమం, వానప్రస్థుని వల్ల ఉపదేశం మధ్యమం, గృహస్థునివల్ల ఉపదేశం ఉత్తమపధ్ధతి. 

శ్లో. యచ్ఛ్రుతం విరాగాయ, - ధర్మాయ, శాంతయే
సుశబ్దమపి శబ్దేన  - కాకవాశితమేవ తత్.
తే.గీ.  విన్న శబ్దాన జ్ఞానంబు పెరుగ వలయు. 
విన్న శబ్దాన ధర్మంబు పెరుగ వలయు. 
విన్న శబ్దాన శాంతియు పెరుగ వలయు. 
అట్టి శబ్దంబు కానిది వట్టి గోల.
భావము. విన్నదేదో వైరాగ్యాన్ని కలిగించకపోతే, ధర్మాచరణకు ప్రోత్సహించకపోతే, శాంతిదాయిని కాకుంటేఅది ఎంత గొప్ప సుశబ్ద మైనా , కేవలం కాకి అరుపుగానే భావించాలి.

శ్లో. యత్ కటాక్ష సముపార్జనా విధిః - సేవకస్య సకలార్థ సంపదః.
సంతనోతి వచనాంగ మానసైః - తామ్, మురారి హృదయేశ్వరీమ్ భజే.
తే.గీ.  సకల పురుషార్థ సంపద లొసగు నెట్టి
లక్ష్మి క్రీఁగంటి చూపుఁ దలచి భజించు
సేవకుల కట్టి హరిపత్ని! సేవఁజేతు
మనసు వాక్కాయ కర్మలన్ మహిని నీకు.
భావము. వరలక్ష్మీదేవీ! తల్లి క్రీగంటి చూపు నారాధించుట సేవకునకు సకల పురుషార్థ సంపను సమృద్ధిఁగ కలిగించునో అట్టి మురారి హృదయేశ్వరివైన నిన్ను వాక్కాయ మానసములతో సేవించెదను.

శ్లో.  యత్యథోzథోవ్రజత్యుచ్చై: నర: స్వైరేవ కర్మభి:
కూపస్య ఖనితా యద్వ త్ప్రాకారస్యేవ కారక:ll
తే.గీ.  కూప ఖనితుఁ డట్టడుగుకు కూరి పోవు,
హర్మ్య నిర్మాత పైపైకి నరుగు చుండుఁ.
గాంచ నట్టులె ఊర్ధ్వzథో గతులు మనకు
మనము చేసిన కర్మల మహిమ నొదవు.
భావము.  నూయి త్రవ్వువాడ అంతకంతకు క్రిందికి,, మేడ కట్టువాడు అంతకంతకు పైపైకి, ఏ విధముగ పోవుచున్నారో అదే విధముగా మానవులు తమతమ కర్మల వల్లనే అథోగతో, ఉచ్ఛైర్గతో, పొందుతుంటారు. 

శ్లో. యత్ర యత్ర హరేరర్చా - దేశః శ్రేయసాం పదమ్,
వై పుణ్యతమో దేశః - సత్పాత్రం యత్ర లభ్యతే.
తే.గీ. శ్రేయమిడు విష్ణు పూజలు చేయు చోటు.
దివ్య పాత్రులుండెడి చోటె తీర్థమరయ.
విష్ణుపూజలు జరుగుచు విశ్వమెల్ల
పాత్రులను వెల్గుగావుత భవ్యముగను.
భావము. ఎక్కడెక్కడైతే విష్ణు పూజ జరుగుతుందో దేశం (ప్రాంతం) శ్రేయస్సులకు నిలయం.
ఎక్కడైతే సత్పాత్రదానం ఇవ్వడానికి తగిన ఉత్తమ వ్యక్తి లభిస్తాడో (ఉత్తమ వ్యక్తి నివసిస్తాడో) ప్రాంతం గొప్ప పుణ్యక్షేత్రము.

శ్లో.  యత్ర నార్యస్తు పూజ్యంతే  -  రమంతే తత్ర దేవతాః
యత్రైతాస్తు నపూజ్యంతే  -  సర్వాస్తత్రాఫలాక్రియాః
తే.గీ.  ఎచట స్త్రీ గౌరవము గల్గు నచట నెపుడు
దేవతలు కొల్వు తీరును. దివ్యముగను.
ఎచట స్త్రీ గౌరవములేక నీసడింతు
రచట పనులన్ని వ్యర్థము లగును నిజము.
భావము.  ఎచ్చట స్త్రీ గౌరవింపబడునో అచట ఎల్లప్పుడూ దేవతలు ఆనంద నాట్యం చేస్తారు.
ఎచట స్తీ గౌరవింప బడదో అచట జరిపెడి కార్యము లన్నియు వ్యర్థములే సుమా!

శ్లో. యత్ర విద్వజ్జనో నాస్తి, శ్లాఘ్యస్తత్రా உ ల్ప ధీరపి
అపాద పాదపే దేశే హ్యేరండోஉపి ద్రుమాయతే.

.  విద్వజ్జను లెచటుండరొ

విద్వద్విరహితుఁడు గౌరవింపఁబడునటన్.

పృథ్విజములు లేకుండిన 

పృథ్విని యాముదము చెట్టు పెంపు వహించున్.

తే.గీ.  వృక్షములు లేని చోటులన్ పృథివిపైన

నాముదపు వృక్షమే ఘనంబరసి చూడ,

పండితులు లేని చోటులన్ వరలు ఘనత

నల్పమైనట్టు జ్ఞానియుననుపమముగ.

భావము. ఎక్కడ విద్వాంసులుండరో అక్కడ అల్పజ్ఞుడు కూడా పొగడబడుతాడు. అసలు చెట్టే లేనిచోట ఆముదపు చెట్టే మహావృక్షమౌతుంది. 

శ్లో.  యథా చిత్తం తథా వాచ:  -  యథా వాచస్తథా క్రియా:l

చిత్తే వాచ క్రియాయాం చ   -  సాధూనామేక రూపతాll 

తే.గీ.  మనసునెటులుండునటులుండు మాటకూడ,

మాటలెటులుండు పనులును మాటలటులె

యుండు త్రుకరణ శుద్ధిగా ననుపమముగ,

సరస జీవన మార్గపు సరళి యదియె.

భావము. మనస్సున్నట్టు మాటలు, మాటల్లానే చేతలు.. మనస్సు, మాట, చేతల్లో మంచివారు కాలంలోనైనా ఒకే రకంగా ఉంటారు. అనగా త్రికరణశుద్ధిని కలిగి ఉంటారు.

 శ్లో. యథా పరోపకారేషు నిత్యం జాగర్తి సజ్జనః
తథా పరాపకారేషు జాగర్తి సతతం ఖలః.
తే.గీ.  నిత్యముపకారమును చేయు నియతి తోడ 
మెలగు సజ్జనుండెపుడును వెలుగు జగతి. 
నిత్యమపకారమును చేయు నియతితోడ 
మెలగు దుర్జనుండెపుడును మిడిసి పడుచు.
భావము. విధంగా సజ్జనుడు పరోపకారం చేయటానికి ఎల్లప్పుడూ జాగరూకుడై ఉంటాడో, అలాగే దుష్టుడు ఇతరులకు అపకారం చేయటానికి నిత్యం మేల్కొని ఉంటాడు!

శ్లో.  యథాన్నం మధుసంయుక్తం  -  మధువాన్యేన సంయుతం ౹ 

ఏవం తపశ్చ విద్యా సంయుక్తం  -  భేషజం మహత్ ౹౹   

తే.గీ.  అన్నమందున చేరిన నన్యమందు

చేరినన్ మధు వౌషధ మై రహించు,

నటులె విద్యయున్ దపము నొకటిగనైన

మంగళప్రదమగునది మందువోలె.      

భావము.  అన్నంతో మధు చేరినా, లేక మధువే వేరే దేనిలో చేరినా అది ఔషధము అయిన విధముగనే, విద్య, తపస్సు ఒక్కటి అయినపుడు అన్ని విధములుగనూ అది మంగళప్రదముగనే ఉంటుంది.

శ్లో.  యథా ప్రదీప్తః పురతః ప్రదీపః  -  ప్రకాశమన్యస్య కరోతి దీప్యన్।

తధేహ పంచేంద్రియదీపవృక్షాః  -  జ్ఞానప్రదీప్తాఃపరవంత ఏవ॥

తే.గీ.  వెలుగఁ జేసిన దీపంబు వెలుగుచుండి,

వెలుగఁ జేయునన్యములను వెలుతురిచ్చి,

దేహవృక్షమింద్రియములన్ దీప్తమగుచు

దీప్తి గొలుపు నన్యులకును, ధీప్రదమయి.

భావము. వెలిగించిన దీపం తాను ప్రకాశిస్తూ, తన సమీపాన గల 

ఇతర వస్తువులను కూడా ప్రకాశింప జేసినట్లు శరీరమనే వృక్షంలోనున్న 

పంచేంద్రియాలు జ్ఞానంతో తాము ప్రకాశిస్తూ, ఇతరులను కూడా ప్రకాశింపజేస్తాయి.

శ్లో.  యథాఽస్త్రరహితే పుంసి  - వృథా శౌర్యపరిగ్రహః

తథోపన్యాస హీనస్య  - వృథా శాస్ట్రపరిగ్రహః ౹౹

తే.గీ.  అస్త్ర హీనుని శౌర్యంబు వ్యర్థమేను, 

శాస్త్ర విజ్ఞాన మున్నను సభలలోన

పలుకుటయె చేతకానట్టి పండితునకు

వ్యర్థమేకద, విద్యనిరర్ధకమగు.       

భావము.  అస్త్రాలు లేనివానికి శౌర్యము ఉన్నను వ్యర్థమే. అలాగే ఉపన్యాసము చేసే సామర్థ్యం లేనివారికి శాస్త్ర జ్ఞానము ఉన్నను వ్యర్థమే అగును.

శ్లో. యథా వాతరథో ఘ్రాణమావృంక్తే గంధ ఆశయాత్|

ఏవం యోగరతం చేతః ఆత్మానమవికారి యత్॥...కపిల గీత - 210

తే.గీ.  పూల వాసన వాయువు మూలమునను

ఘ్రాణమును చేరు విధముగా ఘనతరముగ

యోగరతుని చేతనమది రాగము పగ

లకది దూరమై బ్రహ్మలో లయమగునయ.

భావము.   పుష్పముల పరిమళము వాయువు ద్వారా ఘ్రాణేంద్రియమునకు చేరినట్లు, భక్తియోగ తత్పరుడైన పురుషుని చిత్తము రాగద్వేషాది వికార శూన్యమై పరమాత్మను చేరును.

శ్లో  యథా వ్యాళ గళస్థో -పి , భేకో దంశానపేక్షతే
తథా కాలాహినా గ్రస్తః , జనో భోగానశాశ్వతాన్.
తే.గీ.  వ్యాళ గళమందు చిక్కిన వేళ కూడ

కప్ప యీగనుతినఁగోరి విప్పు నోరు.

కాలసర్పంబు పట్టిన వేళ కూడ

భోగములకాశ చేతుము బుద్ధి లేక

భావము.  పాము నోటికి చిక్కి తాను చనిపోయే దశలోకూడా , కప్ప ఈగలను పట్టి తినాలని ఆశపడుతుంది. అలాగే కాలమనే సర్పం చే మ్రింగబడుతూ కూడా మనము అశాశ్వత భోగాలను కోరుకుంటున్నాము.

శ్లో.  యథా శిఖా మయూరాణాం - నాగానాం మణయో యథా

తద్వ ద్వేదాంగ శాస్త్రాణాం - గణితం మూర్ధని వర్తతే.

తే.గీ.  నెమలి తలపైన శిఖయెట్టులమరియుండు,

పాము తలపైన మణియెట్లు వరలియుండు,

సరిగనట్టులె వేదాంగ శాస్త్రములను

గణితమొప్పును తలపై, ప్రగణితముగను.

భావము.  నెమళ్ళకు శిఖలు వలెను, పాములకు మణుల వలెను, వేద వేదాంగ శాస్త్రము లన్నింటికినీ శిరస్సున అంటే అగ్ర భాగమున గణితము ఉన్నది, అని వేదాంగ జ్యోతిష గ్రంథమున కలదు.

శ్లో.  యథా సముద్రో భగవాన్ యథా మేరుర్ మహా నగ:

ఉభౌ ఖ్యాతౌ రత్న నిధయ: తథా భారత ముచ్యతే.

కం.  రత్నములకు నిధి సంద్రము.

రత్నములకునిధి సుమేరు. రాజిలు రెండున్

రత్నములను! భారతమును

రత్నమయము తలప! భరత రత్నమె జయమౌన్.

(జయము=సంస్కృత భారతాన్ని జయము అంటారు)

భావము.  సముద్రము మేరు పర్వతము రెండూ రత్న నిధులు అని ప్రసిద్ధి. భారతం రెంటి వంటిది.

శ్లో.  యథా సునిపుణ: సమ్యక్! పరదోషే క్షణే రతః! 
తథాచేన్నిపుణః స్వేషు! కోనముచ్యేత బంధనాత్!!
చం.  ఇతరుల దోషముల్ వెదక నెవ్వరు కల్గుదురట్టివారు తా
సతతము వారి దోషములు చక్కఁగ గాంచి చెలంగిరేని
న్నుతమగు సత్పథంబున గనుంగొన జాలుదురయ్య ముక్తి. సం
స్తుతమతిమంతులెప్పుడును దోషములెంచరు సుస్వభావులై.
భావము.  ఇతరుల దోషముల నెంచుట లో చూపు సహజ చాకచక్యమును,తెలివినీ తమ 
దోషములను గుర్తించుటలో వినియోగించినచో వాడు సంసార బంధనమునుండి విముక్తి 
శ్లో. యథా హ్యేకేన చక్రేణ రథస్య గతిర్భవేత్ 

ఏవం పురుష కారేణ వినా దైవం సిద్ధ్యతే. 

తే.గీ.  చక్రమొకటున్న రథమెట్లు సరిగ పోదొ
దైవ బలమొక్కటను సిద్ధి దక్కబోదు
నరుని యత్నము కావలె నరసి చూడ.
పిదప దైవంబు తోడౌను వివిధ గతుల. 

భావము. ఒక్క చక్రముతో మాత్రమే గల రథము నడక ఏవిధముగ సాధ్యము కాదో అదే విధముగా పురుష ప్రయత్నము లేకుండా దైవము వలన మాత్రమే కార్యములు సిద్ధింప బడవు. 

శ్లో.  యథైకేన హస్తేన  -  తాలికా సంప్రపద్యతే |

తథోద్యమపరిత్యక్తం  -  కర్మనోత్పాద్యతే ఫలమ్ ||

తే.గీ.  చప్పటుల్ గొట్ట నొకచేత నొప్పనటులె

ఉద్యమించక కార్యమ్ము లొసగవెపుడు

సత్ఫలంబులన్, గావున సాధనకయి

కలిసిపనిచేయు డందరున్, ఘనతరముగ.

భావము.  ఒకే చేయితో చప్పట్లు ఎలా కొట్టలేమో అలాగే ఉద్యమించనిదే ఫలనీయఁజాలదనిభావము.

శ్లో.  యదధీత మవిజ్ఞాతం - నిగదేనైవ శబ్ధ్యతే

అనగ్నావివ శుష్కేంధౌ - నతజ్జ్వలతి కర్హిచిత్.

తే.గీ.  అర్థమెఱుఁగుచు చదివిన వ్యర్థమవదు

మంత్రమైననునేదైన మహితులార!

అర్థమెఱుగక చదివిన వ్యర్థమగును,

అగ్ని లేనట్టి కట్టెలట్లరసి చూడ.

భావము. చదివిన దానికి తప్పక ఆర్థము తెలుసుకొన వలయును. జప మంత్రములకు జప కాలములో   అర్థ భావన చేయ వలయును. అర్థము తెలియని అక్షర జపము వలన అగ్ని లేని యెండు కట్టెలు వలె అది జ్వలించదు.

శ్లో.  యదధ్రువస్య దేహస్య - సానుబంధస్య దుర్మతిః |

ధ్రువాణి మన్యతే మోహాద్గృ - హక్షేత్రవసూని || (భాగవతం(

తే.గీ. నిత్యదూరమౌ దేహ సన్నిహితమైన

ధరను గృహము, పొలము, స్వర్ణ ధనములయెడ,

భ్రాంతి వీడక మూర్ఖుఁడు బ్రతుకుచుండు,

మోసపోవుచుండెనుండె తా నాస మునిగి.        

భావము.  వివేకంలేని మనిషి అనిత్యమైన మరియు అనేక బంధాలతో కలిగిన శరీరానికి సంబంధించిన ఇల్లు, భూమి, ధనం మొదలైన వాటిని మోహంతో శాశ్వతమైనవి అని తలుస్తాడు.

శ్లో. యది నాత్మని పుత్రేషు నచేత్పౌత్రేషు,నప్తృషు
నత్వేవ తు కృతోஉధర్మః కర్తుర్భవతి నిష్ఫలః. 
తే.గీ.  కర్తయె యధర్మఫలభోక్త. కాని నాడు,  
కొడుకులో, కాక మనుమలో కుడువ కుండ 
సమసి పోవదధర్మము. సరళిఁ గనుఁడు. 
ధర్మవైరుధ్య  పాపిష్టి కర్మవిడుడు.
భావము. ఒకడు తాను చేసిన అధర్మఫలం తాను అనుభవించకపోతే, దానిని అతని కుమారుడో, అతని మనుమడో, మునిమనుమడో అనుభవించక తప్పదు. అధర్మఫలకర్తృత్వం ఎప్పటికీ సమసిపోయేదికాదు. 

శ్లో.  యద్దదాసి విశిష్టేభ్యో యచ్చాశ్నాసి దినే దినే
తత్తే విత్తమహం మన్యే శేషమన్యస్య రక్షసి.
తే.గీ.  సజ్జనులకిచ్చు ద్రవ్యము సద్ధనంబు
పొట్ట నింపెడి ధనమును పూజ్య ధనము.
మిగులు ధనమది వ్యర్థంబు పగలు రేపు
ధనము సత్కార్యములకీయ ధన్యతనిడు.  
భావము. ఏది ఒక విశిష్టవ్యక్తికి ఇవ్వబడుతుందో, ఏది దినదినమూ ఆహారంగా స్వీకరింపబడుతుందో అదే అసలైన ధనమని భావించాలి. మిగిలినది అన్యులను రక్షించటానికే !(అది సజ్జనులకూ దక్కదు, తనకూ దక్కదు) 

శ్లో.  యద్యదా చరతి శ్రేష్ఠః  -  తత్తదేవేతరో జనః
యత్ ప్రమాణం కురుతే  -  లోకస్తదనువర్తతే. { గీ. అ. 3. శ్లో.21. }
కం.  ఉత్తముడు నడచు మార్గమె
యుత్తమమని తలచి నడచుచుండెద రితరుల్.
ఉత్తమమని దేనిని గొను
నుత్తము డదెగొనెదరయ్య.! యుర్విని లోకుల్.
తే.గీ.  శ్రేష్ఠులెయ్యవి చేయునో శ్రేష్ఠమనుచు

జనులు చేసెదరయ్యవి సరస మతిని.

శ్రేష్ఠులెద్దాని నిల్పిన చేయు. కాన

శ్రేష్ఠులితరములెన్నడు చేయ రాదు.

భావము.  లోకములో ఉత్తమ వ్యక్తి ఎట్లు నడచుచున్నాడో ఇతర జనులునూ అట్లే నడుస్తారు. ఉత్తముడు దేనిని ప్రమాణంగా స్వీకరిస్తాడో దానినే లోకం కూడా అనుసరిస్తుంది.

శ్లో.   యద్యదిష్టతమంలోకే యచ్చాస్యదయితం గృహే.
తత్తద్గుణవతే దేయం తదేవాzక్షయమిచ్ఛతా.
తే.గీ.  తనకు నెయ్యది యిష్టమో తలచి చూచి,
తన గృహంబున నెయ్యవి తనుపు తనను,
తనకు నక్షయంబుగ కోరు దాని నెంచి
యోగ్యులకునీయ పాడియౌ. భాగ్య మదియె.
భావము.  లోకమున తనకేది మిక్కిలి యిష్టమో, వేటిని తన యింట ప్రియతమముగా చూసుకుంటారో, ఏయే ప్రియమైన వస్తువులు తనకు అక్షయంగా ఉండాలని కోరుకొంటారో, ఆయా వస్తువులను యోగ్యులకు ఇచ్చుచుండ వలెను.
మనకు నచ్చిన, ఇష్టమైన విగా వస్తువులుండునో అట్టి విశిష్టమైన వస్తువులనే యితరులకు ఈయ వలెను కాని, తనకక్కరలేని, ఇష్టము లేని, పనికిరాని వస్తువులను ఈయరాదు అని తాత్పర్యము.

శ, ష, స  అనే అక్షరాలు ఎలా పలకాలో తెలియని కొందరు దీనిని గమనిస్తారని ఆశ.

శ్లో .  యద్యపి బహునాధీషే  -  తథాపి పఠ పుత్ర! వ్యాకరణమ్ |

స్వజనః ....శ్వజనో... మా భూత్  -  సకలం ....శకలం,     సకృత్..... శకృత్ ||

తే.గీ.   చదువు వ్యాకరణంబును సరిగ పలుక,

స్వజన... శ్వజనము కారాదు, ..సకృతు.... శకృతు,

సకల...శకలగ కారాదు,  స్పష్టముగను

పలుక సరియగు నర్థమున్ వరలఁ గొలుపు.

భావము.   నాయనా! నీవు ఎక్కువ చదవకపోయినా పర్వాలేదు,

వ్యాకరణం మాత్రం నేర్చుకో. ఎందుకంటే స్వజన అనగా  (మన వాళ్ళు)

అన్న శబ్దాన్ని శ్వజన అంటే కుక్కలు అని అర్థం వస్తుంది కాబట్టి. అలాగే

సకలం అనగా (సర్వం) అన్న శబ్దాన్ని శకలం అంటే (ముక్కలు)

సకృత్ అనగా (ఒకసారి) అన్న శబ్దాన్ని శకృత్ అంటే (మలము)

అని పలకకుండా ఉండడానికే కాక  తదితర పదాలను కూడా

సక్రమముగా పలకడానికి  ఉపయోగపడుతుంది .

శ్లో.  యయోరేవ సమం విత్తం  -  యయోరేవ సమం శ్రుతం |

తయోర్వివాహః సఖ్యం చ  -  తు పుష్టవిపుష్టయోః ||   (మహాభారతం)

తే.గీ.  ధనము విద్యయు సమముగా ధరణిఁ గలుగు

వారి మధ్యనే స్నేహ వివాహములును,

హెచ్చు తగ్గులు గలవారికెన్నటికిని 

శ్రేయముగనొప్పఁబోవవి శ్రీనృసింహ!     

భావము.  ఎవరికి ధనం మరియు విద్య సమానంగా ఉన్నాయో, వారి మధ్య మాత్రమే వివాహం మరియు స్నేహం ఉత్తమం. హెచ్చుతగ్గులు ఉన్నవారిలో ఇది శ్రేయస్కరం కాదు.

శ్లో. యస్త్వమిత్రేణ సన్దధ్యాత్  - మిత్రేణ విరుద్ధ్యతే|

అర్థయుక్తిం సమాలోక్య  - స మహద్విన్దతే ఫలమ్||

తే.గీ.  అర్థయుక్తిని యోచించి స్వార్థమునను

రిపునితో సంధి, సఖునితో ప్రీతి దూరుఁ

డగుచు వర్తించు నతనికి నమరు

మంచి ఫలితముల్, సత్యంబునెంచి చూడ.

తా. ఎవరు ప్రయోజనలాభాన్ని గమనించి శత్రువుతో సంధిని, 

మిత్రుడితో విరోధాన్ని ఏర్పరుచుకుంటాడో వాడు మంచిఫలితాన్ని 

పొందుతాడు.

శ్లో.  యస్య చిత్తం ద్రవీభూతం  -  కృపయా సర్వ జంతుషు
తస్య జ్ఞానేన మోక్షేణ  -  కిం జటా భస్మ లేపనైః
.వె.  ప్రాణి కోటిని తన ప్రాణ మట్టుల జూచి,
జాలి నొందు వాని జన్మ జన్మ.
భక్తి తోడ తపము, భస్మానులేపంబు
లేల? ముక్తి గొలుప, జాలి చాలు.

భావము.   దయార్ద్ర హృదయ మున్నచో ముక్తి కొఱకై జప తపాదులు, విభూతి లేపనములు, జడలు కట్టేంతటి కఠోర తపములతో పని లేదు. అన్నింటినీ మించినది దయ. ఎవరు దయార్ద్ర హృదయులై బ్రతికున్నంత కాలమూ ప్రాణి కోటిపై దయకలిగి ప్రవర్తిస్తారో వారికి ముక్తి సుకరముగ లభించును.

శ్లో.  యస్య నాస్తి స్వయం ప్రజ్ఞా శాస్త్రం తస్య కరోతి కిం

లోచనాభ్యాం విహీనస్య దర్పణః కిం కరిష్యతి

.వె.  శాస్త్ర మేమి చేయు చక్కని దగు ప్రజ్ఞ

లేనినాడు జగతిలోన మనకు,

కనులు లేనినాడు కరమున నద్దంబు

కలిగియున్ననేమి కలదు సుఖము?

భావము.  ఎవనికైతే స్వయం ప్రజ్ఞ ఉండదో వానికి శాస్త్రం ఏమి చేయగలదు? కనులు లేనివానికి దర్పణము ఏమి చేయగలదు? 

కనుక మనం తెలిసికున్నదానిని లోతుగా పరిశీలించుకోనపుడు అర్థం చేసికోనపుడు తెలిసికున్నదానివలన ప్రయోజనము ఉండదు.

శ్లో. యస్మాచ్చ యేన యదా యథా యచ్చ
యావచ్చ యత్ర శుభాశుభ మాత్మకర్మ,
తస్మాచ్చ తేన తదా తథా తచ్చ,
తావచ్చ తత్ర కృతాంతవశా దుపైతి. (మహాభారతం)
.  చేసెడి పుణ్యము పాపము 
చేసిన కొలదిగనె మనలఁ జేరును ఫలమై. 
వాసిగ యనుభవమగునది. 
ధ్యాస కలిగి సుచరితముల తనిసిన శుభమౌన్.
భావం. పుణ్య పాప కృత్యములను ఎందువలన, దేనిచేత, ఎప్పుడు, ఎట్లు, ఎంతవరకు, ఎచ్చట ఆచరిస్తున్నాడో దానికి అనుగుణంగానే యా కర్మల ఫలాలను అందువలన, అప్పుడు, అట్లు, అంతవరకు, అక్కడ విధినిర్దేశంగా అనుభవిస్తూనే ఉంటున్నాడు. 

శ్లో.  యస్మాదభావీ భావీ వా  -  భవేదర్థో నరం ప్రతి |

అప్రాప్తౌ తస్య వా ప్రాప్తౌ  -  కశ్చిద్వ్యథతే బుధః ||  (మహాభారతం)

తే.గీ.  కోరుకొనునది చేరునో, చేరబోదొ

దైవవశమది, దానికై తగదు వగవ,

జ్ఞాని వగవఁడు దేనినైనను సహించు,

నుత్తమునిలక్షణంబిది యుర్విపైన.

భావము.  అదృష్టం అనేది దైవవశమైనందువల్ల మనిషికి ఇష్టమైన వస్తువులు లభించవచ్చు లేదా లభించకపోవచ్చు. అందుచేత, జ్ఞానవంతుడైనవాడు తనకు ఇష్టమైన వస్తువు లభించకపోయినా లేదా అనిష్టం కలిగినా దుఃఖపడడు.

శ్లో. యస్య నాస్తి స్వయం ప్రజ్ఞా శాస్త్రమేవ కరోతి కిమ్
లోచనాభ్యాం విహీనస్య దర్పణం కిమ్ కరిష్యతి.
తే.గీ.  ఎట్లు తలకెక్కు విద్య విహీన ప్రజ్ఞు.
ముకుర ఫలమేమి లోచనములవి లేక.
తనకు తానుగ యోచించి తగినదెంచు
శక్తి వృద్ధికి యత్నంబు సలుప వలయు.

భావము.  స్వయం ప్రజ్ఞ అనేదే లేకుంటే వాడు ఎన్ని శాస్త్రాలు చదివినా వాటి జ్ఞానం వంట పట్టదు. దానికి సుభాషితకారుడు చెప్పిన ఉదాహరణ కళ్ళు లేనివాడికి దర్పణం అంటే అద్దం ఇస్తే దానివల్ల ఉపయోగం ఏమీ వుండదు.

శ్లో.  యః సతతం పరిపృచ్ఛతి - శృణోతి సంధారయత్యనిశమ్ |

తస్య దివాకరకిరణైః - నలినీవ వివర్ధతే బుద్ధిః || (పంచతంత్రమ్)

తే.గీ.  ఎవఁడు ప్రశ్నించుచుండునో యెల్లవేళ

లందు, వినుచుండునో, నిత్య మరయుచుండు

నో యతనిబుద్ధి రవికాంతి నొందినట్టి

పద్మమట్టుల వికసించు, భక్తవరుఁడ!

భావము.  ఎవరు ఎల్లపుడూ ప్రశ్నిస్తాడో, చెవులారా వింటాడో మరియు ఎల్లపుడూ చక్కగా గ్రహిస్తాడో అతని బుద్ధి సూర్యకిరణాలతో తామరపుష్పం ఎలాగో అలాగే వృద్ధిచెందును.

శ్లో. యాచకో లఘుతాం యాతి | సద్య:శీల గుణాన్విత:
శ్రీపతి ర్వామనో భూత్వా | యాచతే స్మ బలిం పురా.
. యాచన చులకన చేయును.
యాచనచే వామనుఁడయె హరి బలి యెదుటన్.
యాచనఁ గుణములు మాయును.
యాచించని బ్రతుకు బ్రతుకు.హరినే మించున్.
భావము. ఎంత గుణవంతుడైతేనేమి, యాచించే సరికి తేలిక అయిపోతాడు. సాక్షాత్తు లక్ష్మీ దేవికి మగడై ఉండి కూడా, విష్ణువు రాక్షస రాజైన బలి ముందు వామను(మరిగుజ్జు)డై పోయాడు కదా.

శ్లో. యాదృశైః సంనివిశతే యాదృశాంశ్చోప సేవతే|

యాదృగిచ్ఛతి భవితుం తాదృగ్భవతి పూరుషః||

తే.గీ.  ఎట్టివారితోడ చరించు నిలను మనుజు

డెట్టివారిని సేవించు నెపుడుఁ బ్రీతి

నెట్టిదర్ధించునో యగునట్టివాఁడె.

పట్టి మంచినే వెలిగినన్ ప్రబలఁ గలఁడు.

 తే.గీ.  మనదు సహవాసు లేవిధో మనము నటులె,

మనము సేవించు వారెట్లొ మనము నటులె,

మన మెటులనుండ నెంతుమో మనమటులనె,

మనము మంచినే యెంచుచు మసలనొప్పు.

భావము.  "మానవుడు ఎటువంటివారితో సహవాసం చేస్తాడో అటువంటివాడే అవుతాడు. ఎటువంటివారిని సేవిస్తాడో అటువంటివాడే అవుతాడు. ఎటువంటివాడు కావాలనుకుంటాడో అటువంటివాడే అవుతాడు"..

శ్లో.  యా దేవీ సర్వ భూతేషు శక్తి రూపేణ సంస్థితా.

నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః.

తే.గీ.  యుక్తి నేతల్లి మనలోన శక్తి పేర

నుండి నిత్యంబు నలరారుచుండు, నట్టి

తల్లి దుర్గాంబ మది నెంచి తనివి తీర

నంజలించెద నామెకు నంజలింతు.

భావము.  అన్ని ప్రాణులందును తల్లి శక్తి రూపములో నున్నదో అట్టి తల్లికి నేను త్రికరణ శుద్ధిగా నమస్కరించెదను.

శ్లో: యావచ్చ వేద ధర్మాస్తు, యావద్వై శంకరార్చనం
యావచ్చ శుచి కృత్యాది తావన్నాశో భవేన్నహి.
తే.గీ. వేద ధర్మ ప్రమాణంబు మేదినిపయి
నెంత వరకీశ్వరార్చనదెంత వరకు
నెంత వరకు సత్ సుచి కర్మ లెలమి నుండు
నంతవరకును జగముండు నంతమవక.
భావము.  ఎంత వరకు వేద ధర్మములు ప్రమాణములుగా నిలిచి యుండునో, ఎప్పటి వరకు ఈశ్వరార్చన ఉండునో, శుచికర్మ లెంత వరకు ఉజ్జగింప బడవో అంతవరకున్ను లోకమునకు నాశము లేదు.

శ్లో.  యావత్స్వస్థో హ్యయం దేహో  -  యావన్మృత్యుశ్చ దూరతః |

తావదాత్మహితం కుర్యాత్‌  -  ప్రాణాన్తే కిం కరిష్యతి || 

తే.గీ.  స్వస్థతన్య్గల్గునన్నాళ్ళు సన్మనమున

మృత్యువొందకమునుపె సత్ స్తుత్యముగను

ధర్మమాచరించుట మన ధర్మమౌను,

మృతుఁడు చేయలేడేమియు క్షితిని దలప.

భావము. శరీరమెంతకాలము రోగము లేనిదై సాస్థ్యము కలదై యుండునో, 

యంతవఱకు తనకు మేలు కలిగించు శుభకర్మలను, ధర్మాచరణము, 

పుణ్యకర్మలు చేయవలెను. మరణించిన తరువాత యేమి చేయలేముకదా.

 శ్లో.  యావద్విత్తోపార్జన సక్తః - తావన్నిజ పరివారో రక్తః|
పశ్చాజ్జీవతి జర్జర దేహే - వార్తాం కోపి పృచ్ఛతి గేహే||

కం.  ధనముగడించెడి వేళనె

వినయముతో బంధుకోటి ప్రీతిని వచ్చున్,

ధనముగడింపని ముదిమిని

కనరారిల నొక్కరైన కనుటకు నిన్నున్.

భావము.  ధనమును సంపాదింస్తుంన్నంత వరకే నీ బంధు మిత్ర పరివార జనము నీ మీద అనురాగము, ఆసక్తి చూపింతురు. ముసలితనమున నీ దేహము శిథిలమై శక్తిహీనమైనప్పుడు నీ ఇంట నిన్ను పలుకరించేవారు ఎవ్వరూ ఉండరు.

శ్లో.  యుక్తి యుక్త ముపాదేయం వచనం బాలకాదపి.

అన్యత్ తృణమివ త్యాజ్యం అప్యుక్తం పద్మ యోనినా.

.వె.  యుక్తి యుక్తమైన యుద్బోధ బాలుని

వల్ల నైన వినగ చెల్లునయ్య.

అట్టిదవని మాట నా బ్రహ్మ చెప్పినా 

వినగ రాదు, నిజము, విజ్ఞులెపుడు.

భావము.   యుక్తి యుక్తముగా చెప్పిన మాటనైతే బాలుని నుంచి కూడా గ్రహింప వచ్చును. అదే పండితుఁడు చెప్పిన విధగా స్వీకరింప వలెను. చెడు మాటలు బ్రహ్మ చెప్పిననూ త్రోసిపుచ్చ వలెను.

శ్లో. యుగాంతే ప్రచలేన్మేరుః , కల్పాంతే సప్త సాగరాః
సాధవః ప్రతిపన్నార్థాన్న చలంతి కదాచ . 
. మేరువు కదిలిన కదులును, 
మేరలధిగమింప వచ్చు మేదిని జలధుల్,
నోరార పలికు మాటలు
మీరరు భువి సాధు జనులు మేరువు పడినన్.
భావము. యుగాంతంలో మేరు పర్వతం చలించవచ్చుగాక. కల్పాంతంలో సప్త సముద్రాలూ తమ మేరలు మీరవచ్చుగాక సజ్జనులు మాత్రం ఏనాడూ తాము పలికిన మాటలనుండి చలించరు.(మాట తప్పరు)

శ్లో.  యేన కేన ప్రకారేణ, యస్య కస్యాపి దేహినః
సంతోషం జనయేత్ప్రాజ్ఞః తదేవేశ్వర పూజనమ్.
తే.గీ.  మార్గ మేదైన, ప్రాణులమంచి చేసి
సంతసముఁ గొల్ప నొప్పును సజ్జనునకు.
ప్రాజ్ఞుఁడొనరించు తత్ పూజ భవ్య మెన్న. 
ఈశ్వరార్చనమద్దియే ప్రేమనుగన.
భావము. ప్రాజ్ఞుడైనవాడు ఏదో ఒక విధంగా, ఏదో ఒక ప్రాణికి ఒక మంచి పనితోసంతోషం కలిగించాలి. అదే ఈశ్వర పూజ.

శ్లో. యేనాస్య పితరో యాతాః,యేన యాతాః పితామహాః
తేన యాయా త్సతాం మార్గం , తేన గచ్ఛన్నరిష్యతే. 
తే.గీ.  సుజనులౌ తల్లిదండ్రులు చూపు త్రోవ 
విడువబోకుండ నడచిన ప్రీతితోడ 
హానిఁ గొలుపదదెన్నడు, హాయి గొలుపు. 
మంచి మార్గంబు మనకద్ది మాన్యులార!
భావము. ఏమార్గములో తమ తండ్రులు, తాతలు వెళ్ళారో , సన్మార్గాన్నే అనుసరించిన వారికి హాని జరుగదు. 

శ్లో. యేషాం తపశ్శ్రీ రనఘా శరీరే,   -  వివేచికా చేతసి తత్త్వ బుద్ధిః
సరస్వతీ తిష్ఠతి వక్త్ర పద్మే   -  పునంతు తే உ ధ్యాపకపుంగవా నః. 
తే.గీ.  ఘన తపశ్శోభ దేహాన కలుగు ఘనుఁడు, 
ధరణి సంపూర్ణ సువివేక తత్వ వ్వేత్త, 
వాణివశియించు ముఖపద్మభాగ్యశాలి,
గురువు పదమున కర్హుఁడు ధరణిపైన.
భావము. ఎవరి శరీరమునందు నిర్మలమైన తపశ్శోభ ఉంటుందో, ఎవరి మనస్సులో వివేచనతో కూడిన తత్త్వ బుద్ధి ఉంటుందో, ఎవరి ముఖ పద్మమునందు సరస్వతీదేవి కొలువై ఉంటుందో అట్టి అధ్యాపకశ్రేష్ఠులు మమ్ము పునీతులను చేయుదురుగాక. 

551. శ్లో.  యోజనానాం సహస్రాణి – యాతి గచ్ఛన్ పిపీలికః

అగచ్ఛన్ వైనతేయోపి – పదమేకం న గచ్ఛతి.

తే.గీ.  నడచిపోవుచు యోజనాల్ గడచు చీమ,

నడవకున్నను నడుగైన గడవ లేదు

గరుఁడుడైనను, గమ్యంబు నరసి మనము

యత్నమొనరింపసాధ్యమౌననుపమగతి.

భావము.  నడక మొదలుపెడితే చీమైనా వేలమైళ్ళుప్రయాణించ గలదు.  ఏ ప్రయత్నం చేయకుండా ఉంటే గరుత్మంతుఁడైనా ఒక్క అడుగు కూడా ముందుకు కదలదు.

సాయణా

No comments: