సోమవారం 26 జూలై 2010
అంశం:- దత్త పది
ఇడ్లీ,
పూరీ,
ఉప్మా,
కాఫీ,
ఈ పదాలాతో, ముంబయి మారణ కాండని, గజేంద్ర మోక్షానికి అన్వయిస్తూ, మత్తేభంలో పద్యం చెప్పాలి
ఈ సమస్య అడగదగినదేనా? ఒక వేళ అయినచో మీరు పూరించగలరా? నేను ఏవో చిన్న చిన్న కంద పద్యాలు వ్రాయగలను గానీ, వృత్తాలు కష్టం. దయచేసి సహాయము జేయఁ గలరు.
ఒకవేళ ఇది కష్టతరమైనచో, కొన్ని మార్పులు చేసి, పద్యమునందించగలరు.
This mattebhamu, does not permit the avadhani to use any
of these words to begin the poem as all of them start with a guruvu and to my
knowledge, there are no words that star with డ్లీ and ప్మా.
So, it will be interesting to see how the avadhani can
crack this?
Any thought? Please let me know at your earliest. I am
consulting some people to see if this is possible.
కృతజ్ఞలతో,
ధవళ సోమశేఖర్.
నా పూరణ
మll
కసభుక్కీల దురంత నక్ర మిచటన్ "కాల్చుండిదిడ్లీ యనన్"
ముసుగుల్ దాలిచి పట్టె మమ్ము గనుడీ! పూరీ జగన్నాయకా!
ఉసురుల్ తీయగ నుండె కావు డిలలో ఉప్మాక దేవా మమున్!
విషమంబియ్యది. ఇట్టి చిన్న పనికా ఫిర్యాదటం చెంచకన్!
(ఇక్కడ నా మనోగతమును మీకు కొంచెం వివరిస్తున్నాను.
కాల్చుండు + ఇది + ఈ + ఢిల్లీ + అనన్ > కల్చుండిది +ఇడ్డిల్లీ + అనన్ >
కాల్చుండిదిడ్లీ యనన్ = ఇదే ఢిల్లీ; కాల్చేయండి అని సందేశమివ్వగానే)
భావము:-
టెఱ్ఱరిష్టులు వేసే గడ్డి తినే కసబ్ అనెడి పేరు గల అగ్ని జ్వాల యనెడి మొసలి ఇక్కడ " ఇది ఈ ధిల్లీయే; కాల్చుఁడు " అని పలుకగానే చెలరేగిన పొగ యనెడి ముసుగులు ధరించి మమ్ము పట్టుకొనెను. ఓ పూరీ జగన్నాయకా! ఓ ఉప్మాక వెంకటేశ్వరా! ఇది చూడండి. మాప్రాణములు తీయుటకు సిద్ధముగా నుండెను. ఇది మాకు మిక్కిలి విషమ మయిన సమయము. " ఇటువంటి చిన్న పనికేనా ఇలా ఈ మానవకుంజరములు పిర్యాదు చేయుచున్నవి " అని మాత్రము భావించక భూలోకములో మమ్ములను కాపాడండి.
ఇదండీ నామెదడుకు తోచిన ముంబాయ్ కాల్పుల గజేంద్ర మోక్షం. ఇది గొప్పగా ఉందని నేననుకోను. ఆ విషయంలో లోపాలోపాలను సూచించే పాఠకులే నా కవితకు మెఱుగులు దిద్దే నిపుణులు.
ఏది యేమైనా సరే ఒకటి యదార్థమండి నావిషయంలో. ఆశారదామాత కనికరించిందా. పద్య రచన ; పూరణ; పెద్ద పనికాదు. ఆమె కటాక్షమే లేకుంటే చాలా చిన్న పదమైనా;
తప్పే వ్రాయడం జరుగుతుంది. అంతా ఆ సరస్వతీదేవి కటాక్షం చేతనేనండీ యీ జరుగుతున్న దంతా.
ఇక మీరూ ప్రయత్నించారంటే ఈమాత్రం పద్యం రచించ లేకపోతారా! ఇంతకన్నా అద్భుతంగా పూరించ గలరని నా ప్రగాఢ విశ్వాసం. నా నమ్మకం ఒమ్ము కాదని నా విశ్వాసం. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే ప్రయత్నించండి. మీ పూరణలను కామెంట్ ద్వారా అందఁ జేయమని నా మనవి.
No comments:
Post a Comment