Wednesday, October 25, 2017

బాల భావన శతకము. 19 వ పద్యము. రచన. చింతా రామకృష్ణారావు.

జైశ్రీరామ్.
19) తల్లిదండ్రులందు దండిఁగా దొరికెడి   ప్రేమ మధువుఁ గ్రోలఁ బ్రీతి మాకు.
     పిల్లల విడనాడు పెద్దలు పెద్దలాపెద్దలార! జ్ఞాన వృద్ధులార!


భావము. జ్ఞాన సంపన్నులైన ఓ పెద్దలారా! తల్లి దండ్రులలో సమృద్ధముగా లభించెడి అకళంకమైన ప్రేమ అనే అమృతము సేవించుట యనిన మాకెంతయో ప్రీతి.. అట్టి తల్లిదండ్రుల ప్రేమను కోరుకొనే పిల్లల్ని విడిచిపెట్టే పెద్దలు పెద్దలా? ఏనాడూ మీ పిల్లలను మీ ప్రేమకు దూరం చేయకండి.
జైహింద్.

Tuesday, October 24, 2017

బాల భావన శతకము. 18 వ పద్యము. రచన. చింతా రామకృష్ణారావు.

జైశ్రీరామ్.
18) పెద్దలందు మీరు వెలయించు భావన  వెలుగు బాట మాకు నిలుచు మదిని.
    మీరు నడచు దారి మేలైనదే కదాపెద్దలార! జ్ఞాన వృద్ధులార!


భావము. జ్ఞాన సంపన్నులైన ఓ పెద్దలారా! మీ పెద్దవారిపై మీరు చూపించే ప్రేమాదులు మీకుండే భావనలు మాకు వెలుఁగు బాట లగును. అవి మా మనస్సులలో నాటుకుపోతాయి. మీరు సంచరిస్తున్న విధానములో దోషము లేదుకదా? ఒకవేళ ఉన్నట్లైతే అది మాకూ అంటుతుందని మరచిపోకండి.
జైహింద్.

Monday, October 23, 2017

బాల భావన శతకము. 17 వ పద్యము. రచన. చింతా రామకృష్ణారావు.

జైశ్రీరామ్.
17) పెద్దవారిఁ గనుచు పిల్లలు నడుతురు  మంచి చెడ్డ లనున వెంచకుండ.
    మంచి త్రోవ నడిచి మము నడిపించుడుపెద్దలార! జ్ఞాన వృద్ధులార!

భావము. జ్ఞాన సంపన్నులైన ఓ పెద్దలారా! పెద్దవాళ్ళను గమనిస్తూ, వారి ప్రవర్తనా సరళినే మేమూ అనుసరిస్తాము. అందలి మంచిచెడ్డలను మేము పరిగణింపఁ జాలముకదా. అందుచేత మీరు మంచి మార్గంలో నడుస్తూ మమ్మల్నీ నడిపించండి.
జైహింద్.

Sunday, October 22, 2017

బాల భావన శతకము. 16 వ పద్యము. రచన. చింతా రామకృష్ణారావు.

జైశ్రీరామ్.
16) నవత భ్రాంతిలోన నడయాడుచును మీరు  పిల్లల విడుటేల? ప్రేమ లేదొ?
    భవిత మాది. మదిని పట్టించుకొనరేలపెద్దలార! జ్ఞాన వృద్ధులార!


భావము. జ్ఞాన సంపన్నులైన ఓ పెద్దలారా! నవ జీవన భ్రాంతిలో మీరు జీవిస్తూ, పిల్లలను అశ్రద్ధతో అక్కడా ఇక్కడా ఇతరులకు అప్పిచెప్పి విడిచి పెట్టుట యెందులకు? మాపై మీకు ప్రేమ లేదా? మా భవిష్యత్తును గురించి ఆలోచించుతున్నారా? మీరే స్వయముగా పట్టించుకొన వలసి యున్నది. మరి పట్టించుకోరెందుకు?
జైహింద్.

Saturday, October 21, 2017

బాల భావన శతకము. 15 వ పద్యము. రచన. చింతా రామకృష్ణారావు.

జైశ్రీరామ్.
15) శ్రద్ధఁ గొలిపి భవిత నర్థవంతము చేయు  భవ్యమూర్తి తండ్రి బ్రహ్మ మాకు.
    నవత మరిగి మమ్ము నడిపించ మరచిరేపెద్దలార! జ్ఞాన వృద్ధులార!


భావము. జ్ఞాన సంపన్నులైన ఓ పెద్దలారా! మాలో శ్రద్ధ కలిగించి, మా జీవితాలను అర్థవంతంగా తీర్చిదిద్దే తండ్రి మాకు బ్రహ్మయే. అట్టి తండ్రి ఈ నాడు ఆధునిక జీవన సరళిలో మమ్ములను పట్టించుకోవడం లేదుకదా! ఇది ధర్మమేనా?
జైహింద్.

Friday, October 20, 2017

శ్రీ హరి వీయస్సెన్ మూర్తి కవికృత గవాక్ష బంధ కందము.

 జైశ్రీరామ్.
ఆర్యులారా! శ్రీ హరి వీయస్సెన్ మూర్తి గారు
వ్రాసిన గవాక్షబంధ కందము తిలకించండి.
శ్రీ హరి వీయస్సెన్ మూర్తి

మాన్యులు కవివర్యులు శ్రీ చింతా రామకృష్ణారావుగారు 
ఈరోజు పరిచయము చేసిన రచనను 
చూచూటవలన కలిగిన స్ఫూర్తితో చేసిన ప్రయత్నము.
వారికి నమశ్శతములు.

సత్యత్యక్తుం డగునా
నిత్యము కరిరాట్ప్రసాదు నిర్మల దయతో
భృత్యుడు నౌనా ప్రణతిన్
సత్యైశ్వర్యాహరుండు శౌరీ జేజే. 
 హరి వీయస్సెన్ మూర్తీ!
పరమాద్భుత రీతి మీరు పరుగు పరుగునన్
మురియుచు గవాక్ష బంధము
 నరయుచు కందమును వ్రాసిరాహా యనగా!
కవిగారికి అభినందనలు.
జైహింద్.

బాల భావన శతకము. 14 వ పద్యము. రచన. చింతా రామకృష్ణారావు.

జైశ్రీరామ్.
14) తిట్టుచుంద్రు మమ్ము కొట్టుచు నుందురు    పెంచి పెద్ద చేయు పెద్ద మీరు
     మమ్ము మీరు తిట్ట మాటాడ లేముగా  -  పెద్దలార! జ్ఞాన వృద్ధులార!


భావము. జ్ఞాన సంపన్నులైన ఓ పెద్దలారా! మీరు మమ్మల్ని అవసరంగాను, ఒక్కొక్కప్పుడు అనవసరంగాను కొట్టుతూ తిట్టుతూ ఉంటారు. మమ్మల్ని పోషించి, పెంచే పెద్దవారు మీరు తిట్టితే మిమ్మల్ని మేము ఏమి అనఁగలము చెప్పండి?
జైహింద్.