Wednesday, June 19, 2013

శివాలాపము. 61 To 70 రచన:- శ్రీ బులుసు వేంకటేశ్వర్లు.

శా:- వైచిత్ర్యంబిది యేమొ!  కోరికలు దేవా! దావ దాహ చ్ఛటా
వీచీ కేళి ఘటించు. నార్పగ మదిన్ విశ్రాంతిఁ జల్లారిన
ట్లే చల్లారియు ధూమ సంగతి శిఖాలీనంబులై గుప్ఫునం
జాచున్నాల్కలు.వాని నాఱ్పవె, దాయా సారాంబు ధారన్ శివా! 61.

శ్ర:- ఈ కాఠిన్యము నేలఁ బూనితివొ తండ్రీ! యింతకున్ బొందితో
నే కైలాస నివాస భాగ్య మడుగన్. నీ నెత్తిపై చేతులన్
వీకం బెట్టను. నీ గృహమ్ము పెరుకన్. నిన్నాత్మ సంధించి మో
హైక ప్రాకట దుఃఖమున్ విడుతునయ్యా! కాంక్ష యింతే. శివా! 62.

శా:- దృఙ్మాత్రైక వినాశ మన్మధ కళా హేవాక! మద్భావ మీ
దృఙ్మాంగళ్య పథమ్మునన్ వెలయగా నెంతేని శిక్షించి స
ద్వాఙ్మాధుర్య రస స్రవాంచిత సుధా ధారాళ హేరాళ సం
స్పృఙ్మోహాంచిత సత్ కవిత్వమది తండ్రీ! యిచ్చితయ్యా శివా! 63.

శా:- విఘ్నానీకము దాకినన్ సతము హృద్వీధిన్ భవద్రమ్య దుః
ఖఘ్నాస్తోత్రమె రక్ష యంచు తలతున్. కైవల్య మార్గాను స
న్నిఘ్నంబై కొనసాగఁగా తలతు తండ్రీ! మోహ వార్ధిన్ శిరో
దఘ్నంబౌ నటు ముంపకయ్య, చలితాంతః ప్రాణ రూపా! శివా! 64.

శా:-దిక్సీమాంతర పూర్ణ! తావక కృపా దీప ప్రభా రాశియో!
ఋక్సూక్త్యుద్భవ దివ్య భావ విలస ద్రింఛోళియో వచ్చి, మ
ద్వాక్సందీపితమౌ మహార్ధ ఘటనన్ దర్శించునట్లే మరు
ద్భుక్సమ్మానిత కంఠ! తల్చెదను శంభో! నిక్కమయ్యా! శివా! 65.

శా:- నిన్నున్ నమ్మినవారి కెన్నడును రానేరావు తండ్రీ మహా
పన్న ప్రాభవ దుఃఖముల్. మది భవద్ధ్యానంబునే సేసెదన్.
త్వన్నామైక విచింతితామల కళా వైదగ్ధ్య మేపార వి
చ్ఛిన్నానంత విమోహ బంధనునిగా సేయంగ రావో! శివా! 66.

శా:- కామాహంకృతికిన్ చపేటమురుదుఃఖప్రాభవాంద్యమ్ముకున్
ద్యో మాణిక్యము మోక్ష మార్గ పదవీ యోగైక సామగ్రికిన్
శ్రీ మంజూషముఁ జింతితార్థ ఫలముం జింతింప నీ నిత్య పూ
జా మాంగళ్య పథమ్ము. నాకు దయతో సంధింప రావే శివా! 67.

శా:- ఆక్రోశించుచు నుంటి నిట్లుఁ గనవయ్యా! పార్వతీ నాధ. కా
మ క్రోధంబుల నెంత మాపిన తలం బాదంగ పుచ్ఛాంతమున్
చక్రాకారముఁ ద్రిప్పు పన్నగముగా సంధిల్లు లోలోన.  త
ద్విక్రాంతిం దొలగింపవే భుజగ సంవిశ్లేష కంఠా! శివా! 68.

శా:- నిన్నున్నాశ్రయ కాంక్షనేయగను తండ్రీ! దుఃఖ వారాశిలో
నన్నున్ముంపుదు వార్త భక్తజన మందారంబు వెట్లైతి వా
పన్నుం గానవొ? వెండి కొండ దిగవో? ప్రాలేయ భూ భృత్సుతా
సన్న ప్రౌఢ కుచోపగూహ మృదు సౌఖ్యం బంది రావో? శివా! 69.

శా:- తత్తాదృఙ్మహిమానుభావమెద సంధానించి  త్వత్పూజనా
యత్త ప్రాకట బుద్ధినై నిలుతు నత్యంత మ్ము గానీ స్ఫుర
న్మత్తేభంబగునా మనంబు నిలుప న్నొక్కింతగా నేఱ. నీ
చిత్తం బాపయి.  చక్క దిద్దుము కృపా శ్రీ స్ఫార లీలా! శివా! 70.

(సశేషం) 

No comments: