Sunday, June 23, 2013

శివాలాపము. 91 నుండి సాంతము. రచన:- శ్రీ బులుసు వేంకటేశ్వర్లు.

శా:-
శాపంబిచ్చి, విమర్శికాగ్రిణుల గెల్చన్ తప్పు కాదా? కప
ర్దీ! పద్మమ్మునఁ దప్పు పట్టగనె నత్కీరున్ మహా రోగ సం
తాపుం జేసితి వెప్పుడో తుదకు నిన్ ధ్యానింప రక్షించినా
వాపై, నీ మహిమానుభావము భయంబౌనయ్య తల్చన్ శివా! 91.

శా:-
శ్రీనాధాది మహా కవీశ కవితా శ్రీ మగ్నభావుండ  వౌ
రా! నా కైత సు శబ్ద భావ సరసాలంకార పాక ధ్వని
శ్రీ నిర్వ్యూఢముఁ గాక యుండినను నిన్ జేఁ బట్టగాఁ జూచు స్నే
హానం దీని ననుగ్రహింపఁ గదవే, యానంద రూపా! శివా! 92.

శా:-
నీకంటెన్నొడ యుండు వేఱొకఁడు తండ్రీ! నాకు లేడయ్య. నీ
కా! కోకొల్లలు నిత్య పూజ రచనా కైంకర్య భావాత్ముల
స్తోక ధ్యాన తపో విధిక్రమ మహాత్ముల్ భక్తు లవ్వారికిన్
యే కొంచెంబునుఁ బోల్ప రాని నను నెట్లేఁ బ్రోవ వయ్యా! శివా! 93.

శా:-
ఊహాపోహలు నీకు నాకు నడుమన్ ఒక్కింతయున్ లేవు. సం
దేహింపం బని లేదు. సత్కరుణ సంధింపంగ వాంఛింతు. న
య్యా! హాలాహల ఘోర శౌర్య దళనానంత ప్రభావామల
శ్రీ  హేలా మధు మూర్తి! నిన్నును వినా సేవింప నేరిన్. శివా! 94.

 శా:-
వైముఖ్యబు ఘటిల్లు లౌక్య విషయ వ్యాపారముల్ పల్క తత్
శ్రీమద్భావము సుంత నిల్వదు తటిద్రేఖా ప్రభా భాసమై
స్వామీ! వెన్క మహాంధకారము సృజింపం జిత్రమయ్యా! కనుల్
తా మూయంగను, విచ్చినం దిమిర సంతానమ్మె తోచున్ శివా! 95.

శా:-
స్నేహంబీవు. వెలార్పదీవ.శిఖినై నే వెల్గునట్లున్ మహా
మోహ ధ్వాంతము విచ్చి చిద్రుపలుఁగాఁ బోకారునట్లున్ భవ
న్మాహాత్మ్యాంబుధి నోలలాడు నటులున్ మన్నింప రావే, సదా
నీహారాచల కన్యకా హృదయ నిర్ణిద్రైకభావా! శివా! 96.

శా:-
వేలున్ లక్షలు తత్ కృపాగతులు భావింపంగ నల్పాల్పమే
ధోలంకారితమౌ మదీయ భవముందూగాడునో త్వ న్మహా
లీలా సాగర వీచి మధ్యమున . కేళీ తాండవారంభ. దు
శ్శీలంబన్నది త్వత్ కటాక్షముల విచ్ఛిన్నంబు కాదో! శివా! 97.

శా:-
నే నేమీ యొక సత్ కవీశ్వరుని కానే కాను, కానీ, ప్రభూ!
ప్రాణాయామ పథాంతరోజ్వలిత! సర్వ జ్యోతి రూపా!సుర
క్షా!నా యీ కవనమ్ము నీ కరుణకై సత్యమ్ము మీదెత్తితిన్.
ఈ నా భక్తి పదార్పితంబు కద! నీకిష్టంబొ? కాదో? శివా! 98.

శా:-
పదియైదేడుల ప్రాయమందున తలంపం బద్య నిర్మాణ సం
పదకై యఱ్ఱులఁ జాచు నన్నుఁ గని, సంభావించి నా తండ్రి! కా
వ్య దశల్, తత్ కవితా రహస్యములు చెప్పన్ గాంచు మాయమ్మ స
మ్మదముల్ నేటికిఁ బండె నిట్లుగ భవన్మాహాత్మ్య లీలన్. శివా! 99.

మ:-
తలకున్ మించిన భారమిద్ది కృతి ముద్రా కార్య సంభార మం
చెలమిన్ నిస్పృహ నున్నచోఁ దనకు తానే కోరి మద్వాణి మి
క్కిలి పూన్కన్ ప్రకటింపఁ జేసిన హయగ్రీవున్ సుధా స్వాదు పే
శల భావున్, కరుణాంతరంగమునఁ గాంచం గోరెదయ్యా! శివా! 100.

శా:-
ఓ విశ్వేశ్వర! యో జగత్రయ గురో! యో విశ్వ రక్షా! శివా!
యో విశ్వోదయ! యో దయ గుణ నిధే! యో భక్త కల్పా! శివా!
యో వేద స్తుత! యో హృదంతర రుచీ! యో జ్ఞాన రూపా! శివా!
యో విశ్వాం తర సర్వ భూత హృదయ ధ్యేయైక దీపా! శివా! 101.
శ్రీ బులుసు వేంకటేశ్వర్లు కవి వతంస విరచిత శివాలాపము అను శతకము సమాప్తము. 
స్వస్తి. 

Saturday, June 22, 2013

శివాలాపము. 81 To 90 రచన:- శ్రీ బులుసు వేంకటేశ్వర్లు.

శా:- భావింపం దగ పొట్టకూటి కొఱకై ప్ర్రాల్మాలి దౌర్గత్యపుం
ద్రోవల్ ద్రొక్కి, యవస్థలం బడి సదా దుర్మార్గులం గొల్చి తత్
శ్రీ వాల్లభ్యముఁ గోరువారి వరుసం జేరంగ నేఱన్. భవత్
సేవా స్వీకృతి దివ్య భాగ్యమునుగా జింతింతునయ్యా! శివా! 81.

శా:- తుచ్ఛాధ్వంబుల నేగగా హృదయమెంతో స్వాభిమానైక భా
వచ్ఛన్నంబయి యొప్పదే యితర త్రోవల్ కానగరావు ని
ర్విచ్ఛేదంబవునట్లు కన్పడెడి దారిద్ర్యాంధకారమ్మునన్
త్వచ్ఛీర్షాంచల లగ్న చంద్ర రుచులన్ దండింపవయ్యా! శివా! 82.

శా:- ప్రాణాధార మరుద్గతి క్రమ లసత్ పాణింధమంబైన దే
హానన్నాంతరమై వెలింగెడు మహేశా! నిన్ను వర్ణింపఁఘా
వాణీనాధుఁడు దొట్టిసర్వ సురలుంభావింపఁఘా నేఱర
య్యా! న్ఏనెంత? మదీయ మూఢత క్షమార్హంబౌనొ కాదో? శివా! 83.

మ:- పిసినారిన్ మరి కర్ణుఁడంచు, జడునిన్ విద్వాంసుఁడంచున్ అస
ద్వ్యసనున్ సచ్చరితుండటంచు, కపట వ్యాపారు శాంతాత్ముగాఁ
బొసగం బల్కుచు, మెచ్చు మా కవుల జబ్బుంగాంచి, భీతిల్లెదన్.
అసదౌతద్గతి నాకు దూరముగ బాయం జేయవయ్యా! శివా! 84.

శా:- నీపై పద్దెము లెన్నియేనికానీ వ్రాయఁఘావచ్చు, ధా
రా పీయూష మనోహరార్ధముగ, వైరాగ్యంబె తా నల్ల పూ
సై పోవున్ మరి పల్క నేటికిక వేదాంతాలు, విద్యా మద
వ్యాపారాళికి నీ శతాంశమునుఁ దెల్పన్ శక్తు యున్నే? శివా! 85.

శా:- నీవున్నిల్చిన చోటు వెండి మలయౌ, నీ నవ్వు కార్తీక రా
కా విశ్వామల కాంతియే యగును. నీ కారుణ్యముల్ వర్షధా
రావిర్భూత వృషత్తుషార కలనాంతశ్మైత్యముల్ త్వత్కృధల్
దావాగ్ని చ్ఛటలై వెలుంగు గిరిజాలావణ్య లోలా శివా! 86.

శా:- విజ్ఞానాంతర మూర్తి! తావక కృపావిస్ఫూర్తి గాంక్షింతులౌ
క్య జ్ఞానంబున నీడ్చునట్టి బ్రతుకయ్యా! నిన్ను దర్శించునో?
తజ్ఞుల్ బ్రహ్మ పదార్థవర్ణన కళా ధౌరేయులూహింప రా
ని జ్ఞానంబవు నిన్ను తల్చుఅయె తండ్రీ! భాగ్యమయ్యా! శివా! 87.

శా:- నిస్వార్థంబుగఁ గొల్వఁ జూతు నిను కానీ జీవ యాత్రా గతుల్
భాస్వద్భాగ్యచయమ్ముఁ గోరుటకు నిర్బంధించు కైవల్య ర
క్షాస్వాదు ప్రభలిచ్చు నిన్నుధనమున్ గాంక్షింప మోమోటమై
నా స్వామీ! యెద లజ్జితుండనయినిన్దర్శింతునయ్యా! శివా! 88.

మ:- మతినొక్కించుక నన్నుఁ జూడుము మహా మాయాంధకారావిల
వ్రతతుల్తాండవ మాడు కట్టెదుట తత్ ప్రాబల్యమోహప్రభా
గతులందించిన కంటకాధ్వములఁ బోఁగాఁ జూచు నాకుం భవత్
స్తుత కారుణ్య కటాక్ష ధారల మహస్సుం జూపరాదో? శివా! 89.

నా కష్టంబులు నీవె దీర్పుదని విజ్ఞానాంకుర శ్రీ కళా
లోకాలోకము వెల్గ జేతువని, నాలో నిల్చు మోహాంధ వీ
చీ కేళిం బరిమార్చి, ప్రోతువని, సు స్నేహార్ద్రభావమ్మునన్
నీ కైలాసముఁ ద్రోవ నిల్చుదని తండ్రీ! నమ్మితయ్యా! శివా! 90.
(సశేషం)
జైహింద్.

Thursday, June 20, 2013

శివాలాపము. 71 To 80 రచన:- శ్రీ బులుసు వేంకటేశ్వర్లు.

శా:- జీర్ణారణ్య పథమ్మున న్నిలువ పెంజీకట్లు కప్పం భయో
ద్గూర్ణంబౌ హృదయంబు తల్లడిల యోహో స్వామి! విశ్వ ప్రభూ
వర్ణింతున్ భవదీయ తత్వమును నిర్ద్వంద్వంబుగా, యోగిరాట్
పూర్ణానంద హృదంతర స్థిత ప్రభా మోహైక దీపా! శివా! 71.

శా:-  గూఢంబై చను శైశరానిల మహా క్రోద్శాగ్నికిం బత్ర ని
ర్వ్యూఢ శ్రీ మధు మాస దివ్య కళలం  బోకార్చు వృక్షంబునై
మూఢత్వంబున నిల్చి యుంటి నిదె సమ్మోదంబు పండించి నీ
గాఢ ప్రేమ వసంత వీచి నెదలోఁ గల్పింపవయ్యా!  శివా! 72.

శా:- రావయ్యా రజతాద్రి వాస ఇది మర్యాదా? మదిన్నిన్నె సం
భావింతు న్నిరతంబుఁ గోరుటకు  మోమోటంబు నీ వద్దనే
లా? వాంఛించితినా మహా ధనములన్ లక్షోపలక్షల్? భవత్
సేవా భాగ్య ఫలమ్ము, మోక్ష పదవిన్ జింతింతు నింతే. శివా! 73.

శా:- ఈ దంపుళ్ళివి యింత నెందులకు కానీ యొక్కటే మాట, తం
డ్రీ! దాక్షిణ్య నిధీ! యిదే వినుము దారిద్ర్యమ్ము బంధింపుమా!
లేదా దుఃఖ విమోహ కోప పదవుల్ లేనట్టి కైలాసమం
దేదో మూల వసింపనిమ్ము నను. నాకేదైన చాలున్ శివా! 74.

శా:- వీడుం జూడగ ఠింగణా మదిని భావింపంగ వైరాగ్యపుం
జాడల్ తోచును పైపయిం బలుకులే చాల్చాలునంచున్ ననున్
వీడం బోకు పరీక్షపెట్టుమిదె. రావే కష్టముల్ నష్టముల్?.
తాడో పేడొ నిజంబు తేలవలె గాదా!  తేల్చవయ్యా! శివా! 75.

శా:- నా బాబూ! నమకమ్ము నేర్చునపుడుం భావింప గ్రుడ్డెద్దు చే
లో బడ్డట్లుగ సంత చెప్పితిని, యాలో వెల్గు తత్వంబు ధా
రా బాహుళ్యము గ్రోలగాఁ దలచి, యౌరా! లౌక్య కార్యంబు లి
ట్టే బంధిపఁగ బోనులో నెలుకయట్లే చిక్కి నిల్తున్, శివా! 76.

శా:- ఎన్నో సత్కళ లన్ని సత్కళల కీవే మూల కందమ్మువౌ
యెన్నో మార్గము లన్ని మార్గముల కీవే గమ్యమం చెంచుచున్
నిన్నున్ మంజుల భావ వీచికల రాణింపంగ శయ్యా సము
త్పన్నప్రాభవ సత్ కవిత్వమున సంభావింతునయ్యా! శివా! 77.

శా:- నేత్రంబుల్ విడు సమ్మదాశ్రులు హిమానీ శైత్యమై గుండెపై
చైత్రశ్రీ మధు ధార వోలె కురియున్ స్వామీ! భవ ద్దర్శన
స్తోత్రంబుల్ ఘటియించువేళ నెడదం దూగాడు వైరాగ్యపుం
జిత్రార్చిస్సులు, పుల్కరింత లొడలం జెన్నొందునయ్యా! శివా! 78.

శా:- నీవే తండ్రి మదంతరాంతముల సందీపింతువెల్లప్ప్డు  నీ
పై విశ్వాసము శుక్ల పక్ష కళయై పాటిల్లు డెందమ్మునన్.
నీవుం జిక్కియు జిక్కనట్లుగను కన్పింతోయి, దొంగాటల
య్యా! వారింపుము, పఱ్వఁ జాల నిక నాయాసమ్ము వచ్చున్ శివా! 79.

శా:- గుండెం జీల్చెడు నట్టివౌ వ్యధలు రేగున్ దుచ్ఛ కామమ్ములన్
బండింపం జను, మోహముల్ హృదయముం బంధించు. నా స్వామి నీ
యండం జూచియె కత్తి నెత్తితిని, మోహ క్రోధ కామమ్ములన్
ఖండింపన్ విజయుండఁ జేసెదవొ నన్ కారుణ్య దృష్టిన్? శివా! 80.
(సశేషం)
జైహింద్. 

Wednesday, June 19, 2013

శివాలాపము. 61 To 70 రచన:- శ్రీ బులుసు వేంకటేశ్వర్లు.

శా:- వైచిత్ర్యంబిది యేమొ!  కోరికలు దేవా! దావ దాహ చ్ఛటా
వీచీ కేళి ఘటించు. నార్పగ మదిన్ విశ్రాంతిఁ జల్లారిన
ట్లే చల్లారియు ధూమ సంగతి శిఖాలీనంబులై గుప్ఫునం
జాచున్నాల్కలు.వాని నాఱ్పవె, దాయా సారాంబు ధారన్ శివా! 61.

శ్ర:- ఈ కాఠిన్యము నేలఁ బూనితివొ తండ్రీ! యింతకున్ బొందితో
నే కైలాస నివాస భాగ్య మడుగన్. నీ నెత్తిపై చేతులన్
వీకం బెట్టను. నీ గృహమ్ము పెరుకన్. నిన్నాత్మ సంధించి మో
హైక ప్రాకట దుఃఖమున్ విడుతునయ్యా! కాంక్ష యింతే. శివా! 62.

శా:- దృఙ్మాత్రైక వినాశ మన్మధ కళా హేవాక! మద్భావ మీ
దృఙ్మాంగళ్య పథమ్మునన్ వెలయగా నెంతేని శిక్షించి స
ద్వాఙ్మాధుర్య రస స్రవాంచిత సుధా ధారాళ హేరాళ సం
స్పృఙ్మోహాంచిత సత్ కవిత్వమది తండ్రీ! యిచ్చితయ్యా శివా! 63.

శా:- విఘ్నానీకము దాకినన్ సతము హృద్వీధిన్ భవద్రమ్య దుః
ఖఘ్నాస్తోత్రమె రక్ష యంచు తలతున్. కైవల్య మార్గాను స
న్నిఘ్నంబై కొనసాగఁగా తలతు తండ్రీ! మోహ వార్ధిన్ శిరో
దఘ్నంబౌ నటు ముంపకయ్య, చలితాంతః ప్రాణ రూపా! శివా! 64.

శా:-దిక్సీమాంతర పూర్ణ! తావక కృపా దీప ప్రభా రాశియో!
ఋక్సూక్త్యుద్భవ దివ్య భావ విలస ద్రింఛోళియో వచ్చి, మ
ద్వాక్సందీపితమౌ మహార్ధ ఘటనన్ దర్శించునట్లే మరు
ద్భుక్సమ్మానిత కంఠ! తల్చెదను శంభో! నిక్కమయ్యా! శివా! 65.

శా:- నిన్నున్ నమ్మినవారి కెన్నడును రానేరావు తండ్రీ మహా
పన్న ప్రాభవ దుఃఖముల్. మది భవద్ధ్యానంబునే సేసెదన్.
త్వన్నామైక విచింతితామల కళా వైదగ్ధ్య మేపార వి
చ్ఛిన్నానంత విమోహ బంధనునిగా సేయంగ రావో! శివా! 66.

శా:- కామాహంకృతికిన్ చపేటమురుదుఃఖప్రాభవాంద్యమ్ముకున్
ద్యో మాణిక్యము మోక్ష మార్గ పదవీ యోగైక సామగ్రికిన్
శ్రీ మంజూషముఁ జింతితార్థ ఫలముం జింతింప నీ నిత్య పూ
జా మాంగళ్య పథమ్ము. నాకు దయతో సంధింప రావే శివా! 67.

శా:- ఆక్రోశించుచు నుంటి నిట్లుఁ గనవయ్యా! పార్వతీ నాధ. కా
మ క్రోధంబుల నెంత మాపిన తలం బాదంగ పుచ్ఛాంతమున్
చక్రాకారముఁ ద్రిప్పు పన్నగముగా సంధిల్లు లోలోన.  త
ద్విక్రాంతిం దొలగింపవే భుజగ సంవిశ్లేష కంఠా! శివా! 68.

శా:- నిన్నున్నాశ్రయ కాంక్షనేయగను తండ్రీ! దుఃఖ వారాశిలో
నన్నున్ముంపుదు వార్త భక్తజన మందారంబు వెట్లైతి వా
పన్నుం గానవొ? వెండి కొండ దిగవో? ప్రాలేయ భూ భృత్సుతా
సన్న ప్రౌఢ కుచోపగూహ మృదు సౌఖ్యం బంది రావో? శివా! 69.

శా:- తత్తాదృఙ్మహిమానుభావమెద సంధానించి  త్వత్పూజనా
యత్త ప్రాకట బుద్ధినై నిలుతు నత్యంత మ్ము గానీ స్ఫుర
న్మత్తేభంబగునా మనంబు నిలుప న్నొక్కింతగా నేఱ. నీ
చిత్తం బాపయి.  చక్క దిద్దుము కృపా శ్రీ స్ఫార లీలా! శివా! 70.

(సశేషం) 

Tuesday, June 18, 2013

శివాలాపము. 51 To 60 రచన:- శ్రీ బులుసు వేంకటేశ్వర్లు.

శా:- శ్రేయో భాగ్య ధురంధరమ్ము సకల శ్రీవాసమున్ ముక్తి కాం
తా యోగామల భాసమున్ విదిత నానా దుఃఖ నిర్వాపమున్
భూయోభూయ పునః పునర్భవ దశా ప్రోత్థామ నాశంబులున్
మాయా రక్షణలై చెలంగును భవన్మాహాత్మ్య లీలల్, శివా! 51.

శా:- మౌళిం బూవులనుంచఁ గంధరమునన్మల్లీ సరంబుంచగా
లీలం భూతి నిటాలమందలుమఁ గల్పింపంగ శ్రీ గంధమున్
కేళీ లోల! వియఝ్ఝరంబు భయదక్ష్వేళోగ్రమౌ సర్పమున్
వైలక్షణ్యపుఁ గన్ను, పచ్చి పులితోల్, నన్నడ్డునయ్యా! శివా! 52.

శా:- నీవే మత్ హృదయాంతరంబునను సందీపించి యీ స్తోత్రముం
భావింపం బురి గొల్పినాఁడవు, భవన్మాహాత్మ్య మీరీతి నా
పై వర్షించి విచంచలాత్ముఁడగు నన్ బంధించి నాకిట్లు నీ
సేవా భాగ్యము నందఁ జేసితి.  నతుల్ చెల్లింతు లక్షల్, శివా! 53.

శా:- యోగాభ్యాసము లేదు ధూర్జటి వలెన్, ఓంకార నాదైక వి
ద్యా గాంభీర్యము లేదు సోమన వలెన్, తాదాత్మ్య భావప్రసూ
రాగం బింతయు లేదు పోతన వలెన్, రక్షింపవే తన్మహా
భాగుల్ తీసిన త్రోవ కెక్కితిని యప్పా! నడ్పవయ్యా! శివా! 54.

శా:- ఈ వైరాగ్యమిదెన్ని జన్మముల తండ్రీ నన్ను వెంటాడునో?
ఈవే దిక్కని యన్ని జన్మముల తండ్రీ! నిన్నె వెంటాడెదన్.
నీవే నేనని, నేనె నీవని పురా నిర్ణీతమద్వైత భా
వావిర్భూత మమత్వ బంధనల దేవా, సాగెదయ్యా! శివా! 55.

శా:- బీటల్ విచ్చిన పంట చేను గతిఁ గన్పించున్ మహా గర్వ గ్రీ
ష్మాటోపంబున నిష్ఫలంబగునొ! దేవా, నాదు పెంపెల్ల త్వ
జ్జాటాంతర్ ప్రవినిశ్రుతామర ధునీ సంభార ధారా నిరా
ఘాటైక క్రమ సత్కృపం దడుప సంకల్పింపవయ్యా! శివా! 56.

శా:- నిద్రాహారము మాని వ్రాసితిని తండ్రీ! దీని నొక్కూపునన్
భద్రాత్ముండవు భక్త రక్షణ కళా ప్రాభాసిత స్ఫార చి
న్ముద్ర స్వామివి. దీనిఁ జేకొనుము. మన్మూఢ ప్రసంగంబులన్
నిద్రం బాలుని తొక్కు పల్కులుగ మన్నింపంగ రావే! శివా! 57.

శా:- స్వర్ఘంటా పథ పాంధ భవమున నాశల్ లేని నాపైన యీ
నైర్ఘృణ్యంబు వహింప నాయమొకొ? నానా భక్త కామ్యార్త చిం
తార్ఘంబుల్ గ్రహియించు సామివి. కృపానంతార్ద్ర భావాన మ
న్నిర్ఘోషల్ చెవిఁ బెట్టి సుంత దయ రానీ, చాలునయ్యా! శివా! 58.

శా:- నీకున్ వాహనమైన నందికిని తండ్రీ మాకు సౌభ్రాతృత
శ్లోకోదంచిత బాంధవమ్ము గల దెట్లో తెల్పుదున్. మోహ వాం
ఛా కామమ్ములు కొమ్ములైన పశు సంస్కారమ్ముమాయందు ని
త్యా! కన్పించెడు, నార్పవే పశు పతీ! తద్ఘోర బాధల్ శివా! 59.

శా:- క్పంబుల్, కొఱగాని కామములు, సాకూతాలు, మిధ్యా పటా
టోపంబుల్, మరి మెచ్చుకోళ్ళు,  బహు మర్యాదల్, వృధా జీవ యా
త్రాపథ్యాగత రంగమందు నటనన్, రంజింపగా నాట్య వి
ద్యా పారీణత లేని నా బ్రతుకు నెట్లాడింతు వయ్యా! శివా! 60.

(సశేషం)


Monday, June 17, 2013

శివాలాపము. 41 నుమ్డి 50 రచన:- శ్రీ బులుసు వేంకటేశ్వర్లు.

శా:- లోకమ్మెట్లు చరించుచున్నదియొ, ఆలోకించినావే? మహే
శా కాఠిన్యము లంతరంగములలో స్వార్ధ క్రియల్ బుద్ధిలో
నైకోద్రిక్త దురంత భావ ఘటనాంతర్భూత దాహ చ్ఛటా
నీకమ్మార్పగ రావె, దివ్య తటినీ నిర్ణిద్ర జూటా! శివా! 41.

శా:- నీ పాదమ్ముల యాన. నిక్కము సుమీ! నీ నామ మాధ్వీక ధా
రా పానోద్ధత ముక్తి వాంఛ కలనా రాగాంకుర ప్రౌఢిమ
శ్రీ పారంగత బుద్ధి దక్క పరముం జింతింప. దుర్మోహ సం
తాప ప్రాభవ దుఃఖముంజితుపు మన్నా! వ్యోమ కేశా! శివా! 42.

శా:- నిష్కాపట్యముగా వచించెదను తండ్రీ! భక్త మందార! శో
చిష్కేశాంకుర దీప్త దేహ ఘటిత శ్రీ జ్ఞాన యోగ ప్రభా
నిష్కామైక పథమ్మునన్ వెలుగువున్నీవే తమో హేలలన్
శుష్కీభూతము సేయవే! పరివహత్ శుభ్రాంశుతేజా! శివా! 43.

శా:- ఎట్లో పైకెగబ్రాకమందువవు నీకేమయ్య? నా దేహమున్
గాట్లై యున్ననుఁ ద్రాటి పట్టెకెదురెక్కం ద్రోయు చున్నావు.నా
పట్లెల్లం జెడి భీతి నొందితి ధరాభాగమ్ముపై కూల్తువో?
పాట్లుం జాలును కాంక్షితమ్ము నెరవేర్పన్ రమ్ము వేగన్, శివా! 44.

శా:- స్పూర్జత్తాండవ లీల నా యెడకు రావో, తోడు కావో, సదా
గర్జానేకము లోహితాక్షి ముఖ భంగమ్మున్ మహా వ్యాఘ్రమున్
నిర్జింపం దలపోతు, వ్యాఘ్రమది తండ్రీ మోహమయ్యా! శర
త్ ఫర్జన్యామల కాంతి సుందర కటి వ్యాఘ్రాజిన శ్రీ. శివా! 45.

శా:- గ్రీవా దఘ్నముగా నిలంబడితి తండ్రీ! ఘోర దుర్వార వీ
చీ విస్తారిత మోహ బంధ జలధిన్ శీఘ్రమ్ముగా సత్కృపా
ప్రావీణ్యంబు కరావలంబన విధిం బండిచి నన్నొడ్డు తే
వే! వేదాఖిల మార్గ సంస్తుత! కృపా పీయూష ధారా! శివా! 46.

శా:- ఆజన్మాంతము నిల్చునంచు తలచున్ ఐశ్వర్య సౌదామినిన్
భ్రాజద్భోగము శాశ్వితమ్మనుకొనున్ పత్రాగ్ర వార్బిందువున్
శ్రీ జాడ్యాగత దుష్ట మానవులు వాసింపంగ త్వత్ పాద పూ
జ జన్యాగతనిత్య భోగ మెదపై సంధింపరయ్యా! శివా!. 47.

శా:- స్వః కాంతా కర పద్మ సంగ్రహణ నిష్టా భావముం గాని, స
ద్యః కల్యాణమిహైక భోగ చయ భాగ్యానీకముంగాని, తే
జః కైవల్యద మూర్తి, కోరను సదా జన్మాగతంబౌమదే
నః కూలంకష వీచి శాంతి పఱుపన్ కాంక్షింతు నింతే శివా! 48.

శా:- భోళా శంకరుడన్న పేరు కద శంభో నీకు, రావేమి? శ
య్యాలంకారము సాహితీ విమల దీవ్యత్ స్తోత్రముల్ జేసినన్?
ప్రాలేయాచల కన్యకా రచిత సేవా సౌఖ్య సంభావనా
కైలాసాచల వాసముల్ విడిచి రాగా వొప్పవేమో! శివా! 49.

శా:- స్పష్టాస్పష్ష్టము జ్ఞాన రేఖ లవియున్ భాసించు వెన్కన్ కృధా
వష్టంభోజ్వల మోహముల్ నిలుచు ఘోరాకారమై, రెంటికిన్
ముష్టాముష్టి కచా కచీ యెడదలో! మోహాంధమున్ త్వన్మహా
దృష్టిం బారఁగఁ జేసి కాంతి చయ మీవే . అంధకారీ! శివా!. 50.

(సశేషం)


Sunday, June 16, 2013

శివాలాపము. 31 నుండి 40 రచన:- శ్రీ బులుసు వేంకటేశ్వర్లు.

జైశ్రీరామ్.
శా:- నిద్రాణంబులు దివ్య మోక్ష పదవీ నిర్ధూత వాంఛా విని
ర్ణిద్ర ప్రాభవముల్ మదీయములు తండ్రీ! భావ కల్హారముల్.
త్వద్రాఘిష్ఠ జటాటవీ ఘటిత భాస్వచ్చంద్రమ శ్శ్రీకళా
ముద్రా స్వీకృతి విచ్చె నేటికివిగో పూమాలలయ్యెన్, శివా! 31.

శా:- విస్మేరాంబుజ వక్త్ర! నీ కృపకు నైవేద్యంబుగా నిల్చితిన్
అస్మత్ స్వాదు మరంద బిందు సుషమానంత ప్రభా మాధురీ
క స్మేరంబులు పద్య పుష్పములు దుఃఖ ప్రాభవద్గూఢమా
కస్మాత్పాతిత మోహ బంధనములన్ ఖండింపుమయ్యా! శివా! 32.

శా:- త్వత్కంఠాగ్ర విలగ్న బంధమది దేవా! యొక్క సర్పంబెగా
మత్కంఠాగ్రమునందగుల్కొనిన సంసారార్ణవోద్భూతముల్
ఛూత్కార క్రమ సంచరద్భయద చక్షుః శ్రోత్రముల్, వేలు, సం
విత్కల్యాణ! భరింప నేఱనిక నన్ వేధింపకయ్యా! శివా! 33.

శా:-ఉద్బీజంబులు పుత్ర పౌత్ర ధన దారోదార సంధాన దీ
వ్యద్బద్ధస్థితికిన్ సుధామల కళావైశద్య సమ్మోహ  సం
వి ద్బింబాగమ కాంతికిన్ సుర పురీ వీధీ చరద్రేఖకున్
మద్బంధూ! భవదీయ సార పద పద్మస్ఫార పూజల్. శివా! 34.

శా:- ఉద్యోగంబులు పొట్ట కూటి కొఱకోహో! స్వామి లౌక్య క్రియన్
సద్యోలగ్నుఁడ వోలె కన్పడెదు, నేనా! సర్వ మాంగళ్య చి
ద్విద్యా మూర్తిని నిన్ను గాంచెదను హృద్వీధిం దివా రాత్రులన్
శ్రీద్యోగాఁగ జలాభిషిక్త సరసార్ధీభూత జూటా శివా! 35.

శా:- విద్వాంసుల్ పలుమంది సర్వ పరిషత్ వీధ్యంతరంబుండి రా
గ ద్వేష వ్యతిరిక్త భావ సుషమా గాంభీర్యముంగూర్చి ధ
ర్మాద్వైతంబుల గూర్చి పల్కుచును కర్మానేక సంప్రాప్త సం
పద్వైభోగ సుఖానుభూతినిఁ దలంపం జూతు రాత్మన్ శివా! 36.

శా:- శశ్వత్ సుందర శుభ్ర కార్తికిక భాస్వజ్జ్యోత్స్నవద్రమ్యమా!
విశ్వైక స్థిర మంగళంబయిన నీవిస్ఫూర్జిత శ్రీ కృపల్
విశ్వాసంబున నా పయిన్ జినుక రావే, చాలు, మద్దుఃఖముల్
నిశ్వాసల్ వలె జారిపోవును భవానీ ప్రాణ మూలా! శివా! 37.

శా:- వార్ధుల్ దాటెద, మిన్ను నెక్కెద, భవద్వాల్లభ్యముం బొందగా
స్పర్థల్ ద్రోచెదఁ గాన దూరెద భవత్పాదంబులం బట్టగా
నిర్ధూతాఖిల మోహ బంధన కళా నిర్ణిద్ర భావాప్తి స
ర్వార్ధ స్వామిని నిన్నుఁ బట్టితిని దేవా! గాఢ భావా! శివా! 38.

శా:- శర్వాణీ హృదయానురాగ పదవీ సమ్రాట్కళా మంగళా!
ఖర్వ ప్రాభవుఁడాదిదేవుఁడగు నిన్ గాఢానురాగ ప్రభా
సర్వాంగీణ మనోజ్ఞమౌ గతి సమర్చల్ సేతునయ్యా! మహా
నిర్వాణైక పదమ్ము లక్ష్యముగ తండ్రీ! శూల పాణీ! శివా! 39.

శా:- అర్హ ప్రస్తుతముల్ మదీయ కవితా వ్యాహారముల్, వారి భృ
న్నిర్హాదంబులు నీల కంఠమగు నిన్నే తండ్రీ! యాడించెడున్.
గర్హింపం బని లేదు. కావ్య గుణముల్ కాసంత లేవంచు  దృక్
బర్హిశ్శుష్మ, మదీయ భక్తిని తలంపంజూడుమయ్యా! శివా! 40.

(సశేషం)
జైహింద్.

Saturday, June 15, 2013

శివాలాపము. 21 నుండి 30 రచన:- శ్రీ బులుసు వేంకటేశ్వర్లు.

జైశ్రీరామ్.
శివాలాపము.  21 నుండి 30 
రచన:- శ్రీ బులుసు వేంకటేశ్వర్లు.
మ:- అభిమానైక ధనమ్ము ముఖ్యమని గ్రంథానేకముల్ పల్కు. తం
డ్రి! భయోద్విగ్నము గాగ వర్తిలేడు దారిద్ర్య ప్రభా భూతమున్
అభవా! త్వత్ కర పద్మ సంగతి చలద్వ్యాపార నాట్యాంత సం
ప్రభవద్భీప్రద ఢక్కికా ధ్వనుల పాఱం ద్రోలవయ్యా! శివా! 21.

శా:- సద్భావంబున పాదు కట్టిన మహేశా! స్వచ్ఛ చాంద్రీక భా
స్వద్భూమీ ధర కన్యకా లలిత హాస వ్యక్త రాగార్ద్ర దీ
వ్యద్భావాంతర మూర్తియౌ నిను మదీయ ప్రాణ మూలమ్ముఁగా
మద్భాగ్యోప చయమ్మునందలచితిన్ మన్నింప రావే శివా! 22.

శా:- వేళాకోళము కాదు నిక్కమిది. నీవే వచ్చి మద్దుఃఖముల్
లీలం ద్రోపవయేని, దుష్ట విష వల్లీ బద్ధ సమ్మోహ దు
శ్శీలాభ్యస్త విముగ్ధ భావనలు వాసించున్ మదిన్, నాడు ని
న్నేలెక్కింపని యట్టి మొండిని, శిఖండిన్, నేను కానో? శివా! 23.

శా:- నీవుం దాండవమాడునప్పుడు భవానీ మాత తత్తాండవ
శ్రీ వైదగ్ధ్యముఁ జూపునంట రజతాద్రిన్ గాఢ రాగ ప్రసూ
భావైక్యంబది యెట్టిదో ప్రమథ రూపంబందివీక్షింతు త్వ
త్సేవా భాగ్య ఫలమ్ము నాకదియె, అందింపగ రావే శివా!24.

మ:- గిరులున్ నిర్ఝరులున్,  వియత్తలము సంగీతాది విద్యల్ సురా
సురులున్, కీటక ముఖ్య జీవ గణముల్, సూర్యేందు తారల్, జగ
త్పరమంబైన భవ చ్ఛతాంశమునుఁ దాల్పన్ వెల్గు లోకమ్మునన్
వర సంభావిత పార్వతీ హృదయ భావ వ్యక్త రూపా! శివా! 25.

శా:- వాదాతీతము త్వన్మహాత్మ్యమని సంభావించియున్ నైకవి
వ్యాదంభంబున నిన్నుఁ గూర్చి యురు గ్రంథానేకముల్ పల్కనే
వా?దంతావళ లూతముల్ నిలిచె మోక్షానంద సామ్రాజ్యమం
దేదీ వాటికి విద్య? భక్తి గతి కాదే! తెల్పుమయ్యా! శివా! 26.

మ:- వనముల్ గ్రుమ్మరి బిల్వ పత్రములు సంపాదింపగా లేను. మం
త్ర నిబద్ధార్చన సేయ లేను. మృదు నానా పుష్పముల్ కాన్కగా
గొని తేలేను. విశుద్ధ గాంగ జలముల్ కూర్పఁగ లేనింత నీ
వినుతాంఘ్రిద్వయముం దలంతుఁ బరమీవే! భక్త కల్పా! శివా! 27.

మ:- కపటోపాయ విధాన వంచన కళా కర్మిష్ఠులున్, మేకవ
న్నె పులుల్ నిండిన ధూర్త లోకమున తండ్రీ! స్వచ్ఛ సౌహార్దముల్
కపురంబుంబలె కాలిపోయినవి త్వత్ కంజాత పాదాగ్ర ల
గ్న పునీతంబగు బుద్ధి యొక్కటియె నన్ రక్షించునయ్యా! శివా! 28.

శా:- హుంకారంబులు క్షుద్ర మన్మధ ప్రభా భావోదగ్ర రేఖా ధను
ష్ఠంకారంబులకున్ నిరంతర మనస్సంఛన్న బోధేతర
క్రేంకారంబులకున్ బురాకృత తరంగీ భూత పాపౌఘ దు
ర్ఘాంకారంబులకున్ త్వదీయ పద కంజాతాగ్ర కాంతుల్,  శివా! 29.

శా:- కంఠే కాలుఁడ! త్వన్మహామహిమ వక్కాణింపఁగా శాస్త్రముల్
కంఠాగ్రంబున దాల్చు పండితునకున్ గాదయ్య. సర్వార్థముల్
కంఠీ భూతములౌ పదంబున వెలుంగున్నిన్ను వర్ణింప, త్వం
శుంఠ ప్రాభవ పాండితీ కళ లెటుల్ చూడంగ చాలున్? శివా! 30.

(సశేషం)
జైహింద్.

Friday, June 14, 2013

శివాలాపము. 11 To 20 రచన:- శ్రీ బులుసు వేంకటేశ్వర్లు.

శివాలాపము.  11 To 20
రచన:- శ్రీ బులుసు వేంకటేశ్వర్లు.
శా:- నీవే తల్చితివేని మూకునకు తండ్రీ! దివ్య చైత్రాగమ 
శ్రీ వేళా మధు కోశ పాతిత రసశ్రీ స్నిగ్ధ మాధుర్య ధా
రా వర్షోదయ కల్ప మంజుల రసార్ద్ర ప్రౌఢ సాహిత్య శ
య్యా వైభోగము కంఠ భూషణము కాదా! గాంగ జూటా! శివా! 11.

శా:- నీవే తల్చితివేని నజ్ఞునకు నిర్ణిద్ర ప్రభా దుఃఖ  భీ
దావాగ్న్యాంతర సంప్రభూత విచలత్ గాఢప్రవాహైక ని
ష్ఠా విస్ఫోటిత ముగ్రదారుణ శిఖా సర్వస్వమాశాంతమై
జీవన్ముక్తి పదంబు లభ్యమగు రాశీభూత తేజా! శివా! 12.

శా:- నీవే తల్చితి వేని విఘ్హ్నములు తండ్రీ గాఢ ఝంఝాహత 
శ్రీ విస్తీర్ణ గుణైక నైక శకల క్షీణ ప్రభా శారదాం
భో వాహంబులు నర్క తూలౌలు గాఁ బోవున్మహా కార్య దీ
క్షా విద్యోతిత చింతితార్ధ ఫలముల్ సంధిల్లునయ్యా! శివా! 13.

శా:- శ్రీ గౌరీ వదనాంబుజాత మధులిట్ శృంగార లీలా కళా
యోగానూన దరస్మితాంకుర విశేషోద్దీప్త భాస్వన్మనో
రాగ ప్రాభవమౌ భవన్మృదు దయార్ద్ర స్వచ్ఛదృఙ్మల్లికల్
వాగాతీత సుఖమ్ములం బరిమళింపం జూడు నాపై శివా! 14.

మ:- కనిపించన్ వలె కామినీ మధుర రాగ వ్యక్త హాస ద్యుతుల్
తనివోవన్ వలె భవ్య దివ్య మృదు పాద స్నిగ్ధ నవ్యార్చనన్
కనగా నేమి విరుద్ధ భావతతి?సంఘర్షింతు నిత్యంబు  కాం
తను దేహార్ధమునందు దాల్చితివి కాదా! చెప్పుమయ్యా! శివా! 15.

శా:- ఏ నేయోగ్య సుగంధ బంధుర మిళద్దేవాక పుష్పవ్రజం
బేనే నవ్య సుధా స్రవత్ఫలము నేనే స్వర్గ గంగా నదిన్
నేనే స్వచ్ఛత రార్ద్ర మారుతము నేనే స్వామి! కైలాసమున్
నేనే నీకుపహారమై నిలుతునోయీ మధృదంతా! శివా! 16.

శా:- ఆ గర్జద్గగనావిలంబిత తమ శ్యామాయమాణ ప్రభా
శ్రీ గండూషిత గాఢ నీల రుచిమత్ శృంగార లీలా తటి
ద్యోగాశ్లిష్టనవాంబువాహ విగళ ద్యోమార్గ ధారౌఘ వ
ర్షా! గాంభీర్యములయ్య! త్వత్కృపలు! భాస్వచ్చంద్ర చూడా! శివా! 17.

శా:- నిష్ఠా బంధుర మైన జీవితము కానీ, త్వత్ పదాంభోజ నే
దిష్ఠ ప్రాంత విలగ్న చింతన కళా దృక్ కాని లేనట్టి, య
ల్పిష్ఠ స్వాంతుఁడనయ్య నీ కరుణకుం బేరాసతోఁ దండ్రి సా
ధిష్ఠ! స్తోత్రముఁ జూరలిచ్చితిని. నీదే భారమాపై. శివా! 18.

శా:- యోగాభ్యాసము, నిత్య కర్మ, జప సంయోగమ్ము, శాస్త్రార్థ చ
ర్చా గాంభీర్యము, నీ పద ద్వితయకంజాత ప్రసూ మాధురీ
శ్రీ గాఢార్ద్ర మరంద పాన మకటా! చీకాకు సంసార దు
ర్యోగంబందున మందుకేనియును, బాబూ! కానవయ్యా! శివా! 19.

మ:- పరులన్ వేడుట యన్న నాకు మిగులన్ బ్రాణాంతకంబౌను, నె
వ్వరినేనిన్ మరి యింద్రుఁడంచు పొగడం భాసించుకాలమ్మునన్
కరుణా నిర్ఝర! నిన్నుఁ దక్క పొగడంగా బోనునెవ్వారలన్.
వరమో నాకిది శాపమో తెలియదప్పా! తేల్చవయ్యా! శివా! 20.

(సశేషం) 

శివాలాపము. 01 To 10 రచన:- శ్రీ బులుసు వేంకటేశ్వర్లు.

శివాలాపము 1 to 10.
రచన:- శ్రీ బులుసు వేంకటేశ్వర్లు.
శా:- శ్రీ కైలాస నగాగ్రభాగ ఘటితశ్రీ మాధు కోశంబవి
ద్యైక ధ్వాంత విదారణార్హసుషమాంతర్జ్యోతి, కారుణ్య హే
లా కూలంకష వీచికానిచయ డోలాలోల హంసంబు, గౌ
రీ కేకీ ప్రియ నీల మేఘ మెదలోఁ గ్రీడింప నెంతున్ శివా! 1.

శా:- ఆనందావధి, మోక్ష మార్గము. చిదానందైక సామ్రాజ్య యో 
గానూనంబగు కాణయాచి, సకలామ్నాయార్ధ రూపంబు దుః
ఖానేకాతప ఘోర బాధకు లసత్ కల్యాణ ఛత్రంబు, మత్
ప్రాణ ప్రాణమునైన పెన్నిధివి సంభావింప నీవే! శివా! 2.

మ:- అఘ సంతాన మహాంధకార విధుర వ్యాపార దీపంబు కా
మ ఘనోద్యద్విష వల్లికా ప్రచుర శుంభత్ ఖడ్గ రాజంబు, దు:
ఖ ఘనాక్రామిత మానసాంబర చలద్గాఢానిలంబున్, మదా
ది ఘటాటోప నివార కేసరి భవద్దీవ్యత్ కృపాశ్రీ. శివా! 3.

శా:- శ్రీమత్ కార్తిక చంద్రమః పృథు కళా శ్రీ స్ఫార సంభారశో
భామంద ప్రకటాయమాన పరితో ప్రవ్యాపితాచ్ఛాచ్ఛరుక్
సామీచీన్య సుధామలాక్ష తర హాస వ్యక్త నవ్యాంకుర
స్వామీ! నా యెడదన్ వసింపుము! కృపా సారళ్య సింధూ! శివా! 4.

మ:- తలపై సన్నని చంద్ర వంక వెలుగుల్, సంధింపగా - సర్వదా
కల గుంజన్మృదు రావముల్ సలుపగా, గంగా ప్రవాహంబు, మం
జుల సంధానిత ధ్యాస మూర్తి వయి-అచ్చో మంచుకొండన్ వెలుం
గులుచల్లున్నిను నాశ్రయించెదను భర్గో! మంగళాంగా! శివా! 5.

శా:- ఈ సంసారము దుఃఖ భాజనము తండ్రీ! నేవె యానందమౌ
ఈ సర్వాశలు మోహ కందములు స్వామీ! నీవే నిర్మోహమౌ
ఈ సందీపిత గర్వ కారణతమో  హేలా పరిష్వంగ దు
ర్భాసావాసవిచేష్ట చేష్టముల మాన్పం జూడ రావో! శివా! 6.

మ:- స్వ శరీరాంచల నిర్గత ప్రకట భాస్వత్తంతు సంతాన ల
గ్న శరీరంబయి నిల్చు సాలె విధముం గామ ప్రభా మోహ దు
ర్దశ ఉద్భూతము స్వాత్మ జన్య గత మిధ్యా సౌఖ్య సంతోష
ద్ధశవంబున్ నను తేల్చరావొ! నగ జాత ప్రాణ మూలా! శివా! 7.

శా:- జ్ఞానుల్ త్వద్గత దివ్య భావ సుషమా సంప్రాప్త కల్యాణ  సం
ధా నిత్యోత్సవమబ్బి యుండెదరు! నేనా! గాఢ జీమూత వే
ళానిశ్మేష తిరస్కృతామల కళాగ్లౌ మూర్తినయ్యా! ప్రభా
పౌనః పున్యునిగా నొనర్చి తలపైఁ బండించుకోవా! శివా! 8.

శా:- నీవే తల్చితివేని పూటకు ఠికానీ లేని నిఱ్పేద  ల
క్ష్మీ వైభోగ సదానురంజిత కళా శ్రీ మంజు మంజీర  నా
దావిర్భూత తరంగితాత్మ నిలయుండై సౌఖ్య సంధాన లీ
లా వైదగ్ధ్యముఁ జూపఁడో మహిత కైలాసాద్రివాసా! శివా! 9.

శా:- నీవే తల్చితివేని ఘోర దురితాంధీ భూత సంసార బం
ధావిర్భూత విమూఢ భావన వృధాహంకార జీమూత  కే
ళీ వైగుణ్య మహాంధకార నటనల్ నిర్ధూతమై, ముక్తి వాం
ఛా విస్ఫారిత చిత్ప్రకాశ మెదలన్ సంధిల్లునయ్యా! శివా! 10.

(సశేషం)