Tuesday, September 4, 2012

మా మంచి మాష్టారు.రచన :- శ్రీ పుల్లెల శ్యామ్.


జై శ్రీరామ్.
ఆర్యులారా!
సెప్టెంబరు మాసం ఐదవ తేదీన ఉపధ్యాయ దినోత్సవము సందర్భముగా శ్రీ పుల్లెల శ్యామ్ రచించిన మా మంచి మాష్టారు  వ్యాసము చదువ వలసినదిగా మనవి. 

అవి నేను హనుమకొండ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ చదువుతున్న రోజులు. ఇంచుమించుగా కాలేజీలోని మాస్టారులందరూ క్లాసులో చెప్పవలసిన పాఠాలను ట్యూషన్ పేరిట ఇంట్లో చెప్పి డబ్బులు సంపాదించుకుంటున్న రోజులు. మాకు శ్రీహరి అనే ఒక లెక్చరరు గారు రసాయనిక శాస్త్రమును చెప్పేవారు. చాలా నిజాయితీ గల మనిషి. ప్రభుత్వ కళాశాలకి వచ్చే విద్యార్ధులందరికీ ట్యూషన్లకు వెళ్లే స్థోమత ఉండదనీ అందుకని కాలేజీలోనే వాళ్ళకు చదువు నేర్పాలని నమ్మేవారు. తను ట్యూషన్లు చెబితే ధనాశ పెరిగి కళాశాలలో పాఠాలుచెప్పడానికి అడ్డువస్తుందని, ట్యూషన్లు చెప్పేవారు కాదు. ప్రభుత్వ కళాశాలలో లెక్చరర్లు రోజూ క్లాసుకు వచ్చి పాఠాలు చెప్పడం చాలా అరుదైన విషయం. అటువంటిది, తను రోజూ వచ్చి పాఠాలు చెప్పడమే కాకుండా, కాలేజి ప్రిన్సిపాలు గారిదగ్గర తాళాలు తీసికుని, శని ఆదివారాలలో కూడా ఆసక్తి ఉన్న విద్యార్ధులకు రసాయన శాస్త్రము బోధించేవారు. చాలా ఓపికగా అడిగిన ప్రశ్నలన్నింటికీ విసుగుపడకుండా సమాధానాలు చెబుతూ చాలా ప్రణాలికగా క్లాసుని నడిపేవారు. ఆయనకు పాఠాలు చెప్పడములో ఎంత శ్రద్ధ ఉండేదంటే, ఆయనకు ఒకసారి ఒక వారం రోజులపాటు విపరీతమైన జ్వరము వచ్చినా,  ఇంజినీరింగు ఎంట్రన్సు దగ్గరకి వస్తోంది కాబట్టి క్లాసులు చాలా ముఖ్యమని, మేము వద్దంటున్నా వినకుండా, క్లాసులకి వచ్చి పాఠాలు చెప్పడమే కాకుండా, శని ఆదివారాలు కూడా వచ్చి మాకు రివ్యూ చేసారు. అయితే ఇంజినీరింగు కోచింగుల మోజులో పడి ఈయన చెప్పే ఉచిత క్లాసులకు చాలామంది వచ్చేవారు కాదు. ఆయన ఎంత బాగా చెప్పేవారంటే, శని ఆది వారాలలో వచ్చే మా అయిదుగురిలో ముగ్గురకు మంచి ర్యాంకు వచ్చి, REC (now it's called NIT, Warangal)లో సీటు వచ్చింది. నాకు ఇంజినీరింగు ఎంట్రన్సులో, కెమిస్ట్రీలో, 50 కి 45 మర్కులు వచ్చాయి. తద్వారా నేను ఇంజినీరునయ్యి జీవితంలో స్థిరపడడానికి కారణం మా శ్రీహరి మాస్టారేనని నా ప్రగాఢ నమ్మకం.

ఇంతకీ ఈ శ్రీహరి మాస్టారు ఎవరో కాదు, TDP ద్వార ఎన్నికయి, మొదట MLAగా తరువాత ఒక మినిస్టరుగా ఆంధ్ర రాష్ట్రానికి సేవలందించిన కడియం శ్రీహరి గారు. మొదట ఆయన రాజకీయాలలోకి దిగినప్పుడు ఆశ్చర్యము, కొద్దిగా బాధ కలిగినా, అటువంటి నిజాయితీపరుడు మంత్రి పదవిలో ఉండడం మూలంగా, రాష్ట్రానికి కొంచమైనా మేలు జరిగిందని నా అభిప్రాయం. ఉపాధ్యాయుల దినము సందర్భంగా మీ శ్రీహరి మాష్టారును తలుచుకోవటం నా కనీస విధిగా భావిస్తున్నాను. అయితే ఇంటర్మీడియట్ తరువాత ఆయనను మళ్ళి కలవడం కుదరలేదు. ఆయన మంత్రిగా ఉన్నప్పుడు ఒక సారి కలవడానికి వెళ్ళాను గాని బంట్రోతు పూజారి వరమియ్యలేదు. ఈసారి భారతదేశం వచ్చినప్పుడు మళ్ళీ ప్రయత్నిస్తాను.
 
కం//
కడియం శ్రీహరి మాస్టరు,
బడిలో మీర్నేర్పినట్టి పాఠము లన్నీ
ఇడెనయ చక్కని ర్యాంకును
కడు ప్రణతులు మీకు దయను గైకొనుమయ్యా

భవదీయుడు,
పుల్లెల శ్యామసుందర్.
చదివిరి కదండీ! మరి మీ మంచి మాష్టారు వ్యాసం వ్రాసి పంపకుండా ఉండ గలరా? మరెందుకు ఆలస్యం? పంపొంచేయండి.
నమస్తే.
జైహింద్.

1 comment:

deepa said...

చాలా బాగా చెప్పారు. స్రిహరి గారి గురుంచి తెలియని విషయాన్ని తెలుసుకున్నాను