జై శ్రీరామ్.
మా మంచి మాష్టారు డా. ఏ. గోపాలరావు గురుదేవులు.
ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా మా మంచి మాష్టారు శ్రీ ఏ.గోపాలరావుగారికి పాదాభివందనములు.
శ్రీరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు
శ్రీ గురుభ్యోనమః.
1.కంద గీత గర్భ ఉత్పల మాల.
శ్రీ గురు దేవ మీ చరణ సేవ రహిం గనఁ జాల నేను.స
చ్ఛ్రీఁ గొలుపున్ గదా! సుజన సేవిత పాద! విశుద్ధ చిత్త! స
ద్ధీ గురు వంద్య! ఈ భువి సుధీవర! మీ కృపఁ బొందితేను. భ
వ్యా! గణనన్ సదా సుజన పాల! నమస్కృతి శుభ్ర తేజసా!
౧.ఉత్పల గర్భస్థ కందము:-
గురు దేవ మీ చరణ సే
వ రహిం గనఁ జాల నేను. సచ్ఛ్రీఁ గొలుపున్.
గురు వంద్య! ఈ భువి సుధీ
వర! మీ కృపఁ బొందితేను. భవ్యా! గణనన్.
౨.ఉత్పల గర్భస్థ గీతము:-
చరణ సేవ రహిం గనఁ జాల నేను.
సుజన సేవిత పాద! విశుద్ధ చిత్త!
భువి సుధీవర! మీ కృపఁ బొందితేను.
సుజన పాల! నమస్కృతి శుభ్ర తేజ!
2.ద్విపద - మత్త కోకిల - కంద గర్భ సీసము:-
ఓ దయామయ! జ్ఞాన మొప్పుగ నుండగా - మది నెంచుచున్, గురు మాన్య తమరు
బోధఁ గొల్పిరి మాదు పుణ్యము పొంగఁగా! - సుజనాళిలో మేము శోభిలంగ!
మీ దయాశ్రయ మేధ మేదిని మిన్నగా - గన నొప్పునే కద! వినుతముగను.
మీదు పాద యుగంబు మిన్నగు మేలు కొల్తుము దేవరా! గోప ప్రముఖ నామ!
గీ:-
ప్రముఖ గురు దేవ మీ దయ యమలము తమ
జ్ఞాన సుధ మహాద్భుతమగును గాదె! మహిని.
సుజనులు పొగడన్ దమ బోధ సులభ గతిని
ముదముగ కనంగ నగునయ! మురియుచునిల.
౧.సీస గర్భస్థ ద్విపద:-
ఓ దయామయ! జ్ఞాన మొప్పుగ నుండ
బోధఁ గొల్పిరి మాదు పుణ్యము పొంగ! -
మీ దయాశ్రయ మేధ మేదిని మిన్న!
మీదు పాద యుగంబు మిన్నగు మేలు!
౨.సీస గర్భస్థ మత్తకోకిల:-
ఓ దయామయ! జ్ఞాన మొప్పుగ నుండగా మది నెంచుచున్,
బోధఁ గొల్పిరి మాదు పుణ్యము పొంగగా! - సుజనాళిలో!
మీ దయాశ్రయ మేధ మేదిని మిన్నగాఁ - గన నొప్పునే !
మీదు పాద యుగంబు మిన్నగు మేలు కొల్తుము దేవరా!
౩.సీస గర్భస్థ కందము:-
ప్రముఖ గురు దేవ మీ దయ
యమలము తమ జ్ఞాన సుధ మహాద్భుతమగును గా
దె! మహిని. సుజనులు పొగడన్
దమ బోధ సులభ గతిని ముదముగ కనంగన్ !
3. నిరోష్ఠ్య ఆట వెలది:-
సరస! సకల శాస్త్ర సాన్నిధ్య సహృదయ!
రస జగాన శిష్య రాజి నునిచి,
జగతి కీర్తి నెదిగి చక్కగా నిలిచిన
జ్ఞాన దాన నిరత! జయ నిధాన!
4. శ్రీ చక్ర బంధ తేట గీతి:-
సకల పూజిత శ్రీ కవి చంద్ర భాస !
ధరణి దేవుఁడ శ్రీకర ధర్మ మోద !
విశ్వ కవి శేవ్య శ్రీ గోప వేద్య నామ !
సవిధ సేవిత సత్పద సామ భాస !
5. చతురంగ బంధ కందము:- ( గురువరు - పదములు - సుకవికి - వరములు )
సుమ సమ మృదుల వర గురు ప
దములు ఘన రుచిని వరలు బుధ వరులు నవనిన్
తమ పదవికి విజయ మొదవు.
తమ కవితలు ముదము వసుధ తనరును సతమున్.
6. నక్షత్ర బంధ కందము:- ( సుగుణ వర - వందనములు )
సుమ సహృదయ! మనమున ప్రా
ణముగా మములన్ నిలుప తనర కవిసత్ వం
శము దయఁ గని గుర్తించిరి
నమనమున విభవ! ప్రణతులు నయ వంశ శశీ!
7. క:- గురువర! మీ పాదాబ్జము
లరసి కొలువ కవిత ధార లసదృశ రీతిన్
పొరలుచు వచ్చును. నిజమిది.
కరుణనుఁ గను మిమ్ముఁ బోలు ఘను లిలఁ గలరే!
8. క:- దోషము లున్నను సైచెడి
మీ సము లెవరయ్య భువిని? మేల్తరమగు మీ
ధ్యాసను కలిగినవా రిల
భూషణులగు భారతికిని. పూజింపఁ బడున్.
స్వస్తి.
ఇట్లు
మీ ప్రియ శిష్యుఁడు
చింతా రామ కృష్ణా రావు.
ఇందలి చిత్రకవితలకు చిత్రములు నిర్మించి పద్యముల నమర్చి సహకరించిన చిరంజీవి లంక రవీంద్ర కు నా అభినందనలు తెలియ జేసుకొనుచున్నాను.
జైహింద్.
జైహింద్.