Saturday, May 7, 2011

మాతృ దేవో భవ. మాతృ మూర్తులందరికీ శిరసు వంచి పాదభివందనం చేస్తున్నాను.



సుమధుర భావనామృత సుశోభిత మాతృ హృదంతమ్మదో
మమతల మందిరమ్ము, తరమా పరమాత్మకునైననిట్టి త్యా
గమయ ప్రజానురంజనము? గౌరవ కల్పక కల్పకమ్మదే.
సమరస భావ శోభితము. సంతత సంతతి యోగ దాయి తాన్.

తల్లిని మించు నట్టి పర దైవము లేదిల సృష్టి నెందు. రా
గిల్లుచు, ముద్దు పెట్టుకొను, క్షేమము కోరును. దైవ సన్నిధిన్ 
జల్లగ కావుమంచు మనసార పదింబది మ్రొక్కు చుండు. నా
తల్లి పదాబ్జముల్ శిరము తాకి నుతింతును భక్తియుక్తునై.

తల్లి పాలు త్రాగి తనువును పెంచిన
ధర్మవృత్తి నున్న తనయుడెపుడు
తల్లి ఋణము తీర్చ తహ తహ పడునయ్య!
తల్లి కన్న గొప్ప దైన దేది ?

మల్లె మరిమళమ్ము, మహనీయ కస్తూరి,
ఘనత కన్న యట్టి కప్పురమ్ము
తల్లి ఘనతఁ బోల తహ తహ పడునయ్య!
తల్లి కన్న గొప్ప దైన దేది ?

తల్లి దండ్రి లేని దైవంబు భూమిపై
తల్లి ప్రేమ గ్రోల తనయుఁడగుచు
పుట్టు చుండె కాదె పొంగుచు పలుమార్లు.
తల్లి కన్న గొప్ప దైన దేది ?

మా అమ్మగారు దైవాంశ సంభూతురాలైన చింతా వేంకట రత్నం పాదారవిందములకు ప్రణమిల్లుతూ,
దైవాంశ విరాజితులైన పుడమిఁ గల మాతృ మూర్తులందరికీ శిరసు వంచి పాదభివందనం చేస్తున్నాను.
మాతృ దేవోభవ.
జై శ్రీరాం.
జై హింద్.

వేసవి శిక్షణా శిబిరాల ద్వారా మన సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతిబింబాలౌతున్న చిరంజీవులు.

వేసవి శిక్షణా శిబిరము(సమ్మర్ కేంపు)లద్వారా మన సంస్కృతీ సంప్రదాయాలను మన చిరంజీవులకు వివిధ కళలలో శిక్షణను ఇవ్వడం,ఇప్పించడం ద్వారా వారిలో మనో వికాసం, తద్వారా ఆత్మ విశ్వాసం పెంపొందించ వచ్చు. చక్కని భావి భారత పౌరులుగా తీర్చి దిద్ద వచ్చు.
వివిధ సాంఘిక సంక్షేమ సంస్థలు వేసవి తాపానికి మూలకు చేరకుండా, వేసవి తాపాన్ని మరిపిస్తూ, పిల్లకూ, పెద్దలకు కూడా వేసవి శిక్షణా శిబిరాలు నిర్వహిస్తూ, తద్వారా భారతీయ అపురూప సంస్కృతీ సంప్రదాయాలను ప్రతిబింబించే కళలలో శిక్షణ నిప్పించడం చేస్తే బహుళ ప్రయోజనకరంగా ఉంటుంది. 
ఇప్పటికే ఇలాంటి కార్యక్రమాలు చేపట్టిన మహానుభావులనేకమంది ఉన్నారు. వారందరికీ నేను హృదయ పూర్వకంగా అభినందిస్తూ, అంజలిస్తున్నాను.
పిల్లలు నిరుపయోగమైన టీవీ సీరియల్స్ కు అతుక్కు పోయే ప్రమాదం ఈ సమ్మర్ లో చాలా ఎక్కువగా ఉంటుంది.
అట్టి ప్రమాదం నుండి తమ పిల్లలను కాపాడుకోవడానికి తల్లిదండ్రులు తప్పక ఇటువంటి వేసవి శిక్ష్ణా శిబిరము(సమ్మర్ కేంపు)లలో చేరేందుకు తమ పిల్లలను ఉత్సాహ పరచాలి. 
దయ చేసి తల్లిదండ్రులు తమ పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని కొన్ని స్వార్థ చింతనలకు స్వస్తి పలకాలి. తమ పిల్లలు భావి భారత పౌరులు. బాధ్యతా యుతమైన పౌరులుగా మీ పిల్లలు సిద్ధమవాలంటే అది తల్లిదండ్రుల, సామాజికుల, ఉపాధ్యాయుల, తోటి బాలుర క్రమశిక్షణపైన ఆధార పడి ఉంటుంది.మనయొక్క క్రమశిక్షణ, మనము  పిల్లలకు నేర్పుతున్న క్రమ శిక్షణ పైనా ఆధారపడి ఉంటుంది.
ముందు మీరు ఏహ్యమైన టీవీ సీరియల్స్ కు తప్పక   దూరంగా ఉండి, పిల్లలను సక్రమ మార్గంలో నడిపిస్తారు కదూ?
నా మాట మన్నిస్తున్నందుకు మీకు నా ధన్యవాదములు. మీ పిల్లలు ఆదర్శవంతమై భావి భారత పౌరులుగా తయారయి, మీకు, మీ కుటుంబానికి, వారుంటున్న సమాజానికి, మాతృ దేశానికీ తప్పక మంచి పేరు తేవాలని ఆశిస్తూ, నా ఆశలు పండాలని కోరుకొంటున్నాను.
జైశ్రీరాం.
జైహింద్.

Friday, May 6, 2011

కాలేజీ గడియారమా పద్యాలు.కవి కీ.శే. భోగరాజు నారాయణ మూర్తి గారు.విజయనగరం(1889-1944)


ప్రత్యక్ష రాఘవము కావ్యకర్త ఐన కీ.శే. భోగరాజు నారాయణ మూర్తి గారు విజయనగర సంస్థానాస్థాన కవి. విజయనగరం మహారాజ కాలేజీ హైస్కూలులో తెలుగు పండితులుగా ఉండేవారు.
మహారాజ కాలేజీ గడియారం సరిగా పని చేయకపోవడంతో  వారానాడు వ్రాసిన పద్యాలివి
శా. తైలాభ్యంగన వాంఛ కల్గినదొ? వృద్ధత్వంబు సిద్దించుటో
నీలోనన్ జవసత్వముల్ తొలగెనో?నిక్కంబెరింగింప కీ
వేలా నిత్యము వక్రగామివయి మమ్మీలీల బాధింతువో
కాలేజీ గడియారమా! గమన వక్రత్వంబు వర్జింపుమా!
శా.  కాలంబెప్పుడు నొక్కరీతిని  చనంగా బోవదన్నీతి మీ
రాలోకింపు ” డటంచు తెల్పెదె యుపాధ్యాయాళికిన్?! నీతిశా-
స్త్రాలెన్నేనియు  మేమెరుంగుదుము నీడంబంబులన్ మానియో
కాలేజీ గడియారమా! గమన వక్రత్వంబు వర్జింపుమా!
శా. ఆలోకింపగ మేము వేళ కిటు రాకాలస్యమౌచుంటకున్
మూలంబీవె యటంచు నెంచక నయమ్మున్ బెట్టు చీవాట్లకుం
బాలై మా యధికార్ల దృప్తుల నొనర్పం జాల కున్నారమో
కాలేజీ గడియారమా! గమన వక్రత్వంబు వర్జింపుమా!
శా. ఏలా జూపెదు తప్పు వేళలను నీవీలీల ? నీ వేళనే
వేళం జూపక మౌసమూను మని మా విజ్ఞప్తి ! మాకున్న వా-
చీలా ధ్వంసము కాక యుండు! బయిగా చీవాట్లు లేకుండు ! నో
కాలేజీ గడియారమా! గమన వక్రత్వంబు వర్జింపుమా!
శా. కాలజ్ఞుల్ గ్రహతారకాది గతులన్ గన్‌పెట్టి వాక్రుచ్ఛి యే
కాలంబందును నీగతి క్రమములన్ గన్‌పట్టగాలేక, శా-
స్త్రాలెల్లం దిరుగంగవేయుచు బ్రయాసంబొందుచున్నార లో
కాలేజీ గడియారమా! గమన వక్రత్వంబు వర్జింపుమా!
శా. నీ లీలల్ మరి నీ గతిక్రమములున్, నిత్యంబు వీక్షింపగా
మాలో కల్గిన సంశయంబు తొలగింపన్నిన్ను ప్రార్థించెదన్
వాలాయంబుగ నీకు వావికల గంటస్తంభమేమౌనొ ? యో
కాలేజీ గడియారమా ! గమన వక్రత్వంబు వర్జింపుమా!
శా. పోలంగా దొలినాడె నీదు గమనంబున్ బెట్టుకొన్నట్టి వా-
చీలం జూచుచు వేళ యున్నదని నిశ్చింతం బయల్దేరి రా
నాలో నక్కట సంతకాల కడ ప్రత్యక్షంబు లేట్మార్కుతో
కాలేజీ గడియారమా ! గమన వక్రత్వంబు వర్జింపుమా!
శా. ఆలిందూలుచు, కోటగంట పది పైనయ్యెంగదాయంచు, చే
గాలంగా దిని, వేగ ప్రేవులు తెగంగా వచ్చి నిన్ జూచినన్
నీలోనన్ పదియైన గాదుకద, మా నిర్భాగ్యమేమందుమో
కాలేజీ గడియారమా ! గమన వక్రత్వంబు వర్జింపుమా!
శా. ఆలోకించిన మందగామి వగుదీవప్డప్పుడుద్వేగమౌ
కేళిన్ సల్పెదొకొక్క యప్పుడిది నీ ” కీ ” లోపమో?! తైల మం-
దే లోపంబొకొ? మాదు జాతకములందే లోపమో తెల్పుమా!
కాలేజీ గడియారమా ! గమన వక్రత్వంబు వర్జింపుమా!
శా. నీ  లీలాగమన ప్రభావములు వర్ణింపంగ నా శక్యమే?
లోలత్వంబున నీవు మమ్మమెరికాలో జేర్చి యూరోపు ఖం-
డాలం ద్రిప్పి స్వదేశమందు దిగ బెట్టంగల్గు చున్నావహో
కాలేజీ గడియారమా ! గమన వక్రత్వంబు వర్జింపుమా!
శా. పోలన్ సృష్టిని దేహధారులకు నెప్డున్ లేని స్వాతంత్ర్యముల్
మాలో కల్గునె? యెప్పుడే కరణి రామస్వామి నంద్రిప్పునో
యాలీలం జనుచుందు ” నందు విది హాస్యంబో నిజంబో కదా !
కాలేజీ గడియారమా ! గమన వక్రత్వంబు వర్జింపుమా!
శా. ఏలం గల్గితి వింత కాలమును మమ్మేకాత పత్రంబుగా
జాలున్నీవిక పింఛినీ గొనుము, తత్సందర్భమందేము చం-
దాలం గూర్చి యొనర్తుముత్సవము నుత్సాహంబుతో నీకు నో
కాలేజీ గడియారమా ! గమన వక్రత్వంబు వర్జింపుమా!
ఎంత అలవోకగా ఎంతటి అద్భుతమైన పద్యాలు రచించే శక్తి ఆనాటి కవులకెంతగా ఉండేదో చెప్పడానికి ఈ మహా కవి భోగరాజు నారాయణమూర్తి గారు రచించిన  పై పద్యాలే తెలియ జేస్తున్నాయి.
వీరు రచించిన ప్రత్యక్ష రాఘవము కావ్యము కూడా చాలా చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ విషయాన్ని ఇంతకు పూర్వం మనం ఆంధ్రామృతంలో ఉంచిన రామదాసు పద్యాలు చదివితే తెలుస్తుంది.
జైశ్రీరాం.
జైహింద్.