Sunday, December 29, 2024

514. ఓం చక్రికాయై నమః.🙏🏼 శ్రీ లక్ష్మీసహస్ర నామములలో 514వ నామము.

జైశ్రీరామ్.

 514. ఓం చక్రికాయై నమః.🙏🏼

శ్రీ లక్ష్మీసహస్ర నామములలో 514వ నామము.


నామ వివరణ. 

దివ్య చక్రాయుధము కల తల్లి.


తే.గీ.  చక్రికా! నన్ను నీ కాల చక్రమందు

నలిగి పోనీకు, నిన్ను నే నమ్మియుంటి,

వక్రగతిఁ బాపి వరలనీ వసుధ నన్ను,

వందనంబులు చేసెద నందుకొనుము.

🙏🏼

రచన .. చింతా రామకృష్ణారావు.

ఈ పద్యముపై


వేంకట్ ఉపాధ్యాయులవారి స్పందన.


ప్రతిగా నా స్పందన.

ఓం శ్రీమాత్రే నమః.🙏🏼
ఆర్యా!🙏🏼

శా.  ప్రాతఃకాలమునందె యమ్మ కృపకై ప్రార్ధించ నా పద్యమున్
శ్రీతత్త్వప్రతిబోధకంబనుచు మీ చిత్తంబునందెంచి, శ్రీ
మాతానందమనోజ్ఞ భావనను క్షేమంబొప్పగా చూచు మీ
ఖ్యాతిన్, భాతిని, సచ్చరిత్రమును విఖ్యాతిన్ బెంచునా యమ్మయే.

మీ అభిమానపూర్వక సద్విశ్లేషణకు ఆనందంగా ఉందండి. మీకు నా ధన్యవాదములు.👍🏻
అమ్మ కృపతో🙏🏼
చింతా రామకృష్ణారావు.
జైహింద్.


మన్మథుని నిందించిన వింత పద్యము

 



Tuesday, December 24, 2024

508 లక్ష్మీ నామ పద్యము ప్రజా సంకల్పంలో.

 

జైశ్రీరామ్.
జైహింద్.

భాషాసు ముఖ్యా మధురా...

జైశ్రీరామ్. 

శ్లో. భాషాసు ముఖ్యా మధురా  -  దివ్యా గీర్వాణ భారతీ|             

తస్యాం హి కావ్యం మధురం  -  తస్మాదపి సుభాషితం ||  

తే.గీ. సంస్కృతము దివ్య భవ్య భాష మధురమిల

నగును భాషలన్నిటనెన్న, నందు కూడ

మధురమైనది కావ్యము, సుధలుచిలుకు

సూక్తి ఘనమంతకన్నను సుజనులార!

భావము.   భాషలన్నిటిలోనూ ముఖ్యమైనది, తీయనిది, దివ్యమైనది. 

గీర్వాణ భారతి అనగా సంస్కృత భాష. అందులోకూడా కావ్యం మధురమైనది. 

దాని కంటెనూ కూడా సుభాషితం మధురమైనది.

జైహింద్. 

Saturday, December 21, 2024

ప్రజాసంకల్పంలో నా పద్యం. లక్ష్మీ సహస్రనామావళిలో 505 వ నామం పద్యము.

 

జైశ్రీరామ్.

జైహింద్.

ఆంధ్ర పద్య సహిత ప్రతిపదార్థ భావ సహిత సౌందర్యలహరి. పద్య రచన…చింతా రామకృష్ణారావు.

జైశ్రీరామ్.

 ఆంధ్ర పద్య సహిత ప్రతిపదార్థ భావ సహిత సౌందర్యలహరి

పద్యరచన…చింతా రామకృష్ణారావు.

ఓం శ్రీమాత్రే నమః.
ప్రార్థన.
శా.  శ్రీమన్మంగళ! శాంభవీ జనని!  హృచ్ఛ్రీ చక్ర సంవాసినీ!
సామాన్యుండను, నీ కృపామృత రుచిన్ సౌందర్య సద్వీచికన్
నీమంబొప్పఁ దెనుంగు చేసెద, నతుల్, నీవే లసద్వాణిగాఁ
బ్రేమన్ వెల్గుము శంకరాత్మ గతితోఁ బ్రీతిన్ గనన్ శంకరుల్.
భావము.
ఓ మంగళా! ఓ శాంభవీమాతా! నా హృదయమనెడి శ్రీచక్రమునందు వసియించు తల్లీ! నేను అల్పుఁడను. నీ కృపామృతముయొక్క తేజస్సు చేత సౌందర్యలహరిని తెలుఁగు పద్యములుగా వ్రాయుచున్నానమ్మా. నీకు నమస్కరించెదను. నీవే ప్రకాశవంతమైన వాణిగా శంకరులయొక్క ఆత్మమార్గమున ఆ శంకరులే ఆనందించు విధముగా ప్రకాశింపుము.

తే.గీ.  ధరణిఁ బడ్డ పాదములకు ధరణి తానె
చూడనాధారమమ్మరో! శోభనాంగి!
నీదు సృష్టిలో దోషులన్ నీవె కాచి
శరణమొసగంగవలెనమ్మ! శరణు శరణు.
భావము.
భూమిపై పడిన పాదములకు భూమియే ఆధారము. అటులనే నీ సృష్టిలో ఉన్న దోషులను నీవే కాపాడి శరణమొసగవలెనమ్మా! నీవే నాకు శరణు.

సౌందర్య లహరి.
శ్రీశంకరభగవత్పాదులు సమయ యను చంద్రకళను పద్యశతముచేఁ బ్రస్తుతించుచున్నారు.

1 వ శ్లోకము.  
శివశ్శక్త్యా యుక్తో యది భవతి శక్తః ప్రభవితుం
న చేదేవం దేవో న ఖలు కుశలః స్పందితుమపి|
అతస్త్వామారాధ్యాం హరి హర విరించాదిభి రపి
ప్రణంతుం స్తోతుం వా కథ మకృత పుణ్యః ప్రభవతి || 
శా.  అమ్మా! నీవె శివుండవై వెలుఁగఁ జేయంగల్గు నీ సృష్టి తా
నెమ్మిన్, గల్గని నాడహో, కదలనే నేరండుగా సాంబుఁ డో
యమ్మా!  శంభుఁడు, బ్రహ్మయున్, హరియు నిన్నర్చింప దీపింత్రు,  ని
న్నిమ్మేనన్ దగ నెట్లు కొల్చెదరిలన్ హీనంపుఁబుణ్యుల్, శివా! ॥ 1 ॥
ప్రతిపదార్థము. 
శివః = శివుడు; 
శక్త్యా = శక్తితో, 
యుక్తః = కూడి యున్నపుడు; 
ప్రభవితుం = సృష్టించుటకు; 
శక్తః = సమర్థుఁడు; 
ఏవం = ఈ విధముగా; 
నచేత్‌ = కాదేని (అనగా శక్తితో కూడి ఉండనిచో), 
దేవః = ఆ శివుడు; 
స్పందితుం అపి = చలించుటకు కూడా; 
నకుశలః = నేర్పరికాడు, 
అతః = ఈ కారణము వలన, 
హరిహరవిరించాదిభిరపి = విష్ణువు, శివుడు, బ్రహ్మ మొదలగు వారి చేత గూడా; 
ఆరాధ్యాం = పూజింప దగిన; 
త్వాం = నిన్ను గూర్చి, 
ప్రణంతుం = నమస్కరించుటకుగాని; 
స్తోతుంవా = స్తుతించుటకుగాని; 
అకృత పుణ్యః = పుణ్యము చేయనివాడు; 
కథం = ఏ విధముగా; 
ప్రభవతి = శక్తుడగును? శక్తుఁడు కాలేడమ్మా.
భావము.  
శివుడు శక్తితో కూడి యున్నపుడు సృష్టించుటకు సమర్థుఁడు ఈ విధముగా కాదేని (అనగా శక్తితో కూడి ఉండనిచో), ఆ శివుడు చలించుటకు కూడా నేర్పరికాడు. ఈ కారణము వలన విష్ణువు, శివుడు, బ్రహ్మ మొదలగు వారి చేత గూడా పూజింప దగిన నిన్ను గూర్చి నమస్కరించుటకుగాని; స్తుతించుటకుగాని; పుణ్యము చేయనివాడు ఏ విధముగా శక్తుడగును?

2 వ శ్లోకము.  
తనీయాంసం పాంసుం తవ చరణ పంకేరుహ భవం 
విరించిస్సంచిన్వన్‌ విరచయతి లోకా నవికలమ్‌, 
వహత్యేనం శౌరిః కథమపి సహస్రేణ శిరసాం 
హరః సంక్షుద్యైనం భజతి భసితోద్ధూళన విధిమ్ || 
శా.  నీ పాదాంబుజ రేణువున్ గొని, జగన్నిర్మాణ మా పద్మజుం
డోపున్ జేయఁగ, విష్ణు వా రజమునే యొప్పార కష్టంబుతో 
దీపింపన్ దగ వేయి శీర్షములతో ధీరాత్ముఁడై మోయునే,
యాపాదమ్ముల పాంశువద్దును శివుం డంగాంగ భస్మమ్ముగా.॥ 2 ॥
ప్రతిపదార్థము. 
విరించిః = బ్రహ్మ, 
తవ = నీ యొక్క, 
చరణ పంకేరుహ భవం = పాద పద్మము నందు పుట్టిన, 
పాంసుం = ధూళిని, 
తనీయాంసం = లేశమాత్రమును, 
సంచిన్వన్‌ = గ్రహించుచున్నవాఁడై, 
లోకాన్‌ = చతుర్దశ భువనములను, 
అవికలం = ఏ మాత్రము దెబ్బతినకుండా, 
విరచయతి = సృష్టించుచున్నాడు, 
ఏనం = ఈ లేశ మాత్ర ధూళినే, 
శౌరిః = విష్ణువు, 
సహస్రేణ శిరసాం = (ఆది శేషువుగా) తన వెయ్యి తలలతో, 
కథమపీ = అతికష్టముతో, 
వహతి = భరించుచున్నాడు, 
ఏవం = ఈ లేశ మాత్ర ధూళినే, 
హరః = హరుడు (శివుడు), 
సంక్షుద్య = చక్కగా మెదిపి, 
భసీతోద్దూలన విధిం = మైపూతగా పూసుకొను చర్యతో, 
భజతి = సేవించుచున్నాడు.
భావము.  
అమ్మా! నీ పాదపద్మములనంటిన లేశమాత్ర ధూళిని గ్రహించి, బ్రహ్మ ఈ లోకాలన్నింటినీ ఏ విధమైన లోపములు లేకుండా సృష్టి చేయగలుగుతున్నాడు. అలాగే శ్రీమహావిష్ణువు ఈ లేశమాత్ర పాదధూళిని ప్రయత్నపూర్వకంగా తన వేయితలల మీద ధరించుచున్నాడు. ఈ నీ లేశమాత్ర పాదధూళినే శివుడు మెదిపి తన శరీరానికి అంగరాగంగా పూసుకొంటున్నాడు. నీపాద ధూళి మహిమచే సృష్టింపబడిన ఈ లోకాలన్నిటినీ శివుడు యుగాంతములలో బాగా మెదిపి, ఆయన ఒళ్ళంతా విభూతిగా పూసుకొంటున్నాడు.

3 వ శ్లోకము.  
అవిద్యానామంతస్తిమిర మిహిరద్వీపనగరీ, 
జడానాం చైతన్యస్తబక మకరంద స్రుతి ఝరీ, 
దరిద్రాణాం చింతామణి గుణనికా జన్మజలధౌ
నిమగ్నానాం దంష్ట్రా మురరిపు వరాహస్య భవతి || 
సీ.  అజ్ఞాన తిమిరాననలమటించెడువారి కమిత! సూర్యోదయమయిన పురివి,
మందబుద్ధులకును మహిత చైతన్యమన్ మంచి పూవులనొల్కు మధువవీవు,
దారిద్ర్యముననున్న వారిని కరుణించు చింతామణులహార కాంతివీవు,
సంసారసాగర సంలగ్నులకునిలన్ ధరణిఁ గాచిన కిరిదంష్ట్రవీవు.
తే.గీ.  శంకరుని యాత్మలో వెల్గు శశివి నీవు,
రామకృష్ణుని కవితాభిరామవీవు,
పాఠకుల చిత్తముల నిల్చు ప్రతిభవీవు,
నిన్ను సేవించువారిలోనున్నదీవు.॥ 3 ॥
ప్రతిపదార్థము.  
హే భగవతి! = ఓ జననీ!
ఏషః = ఏ నీ పాద ధూళి ఉన్నదో అది
అవిద్యానాం = అజ్ఞానులకు, 
అంతస్తిమిర= లోపల ఉన్న (అభ్ఞానమను) చీకటికి, 
మిహిర ద్వీపనగరీ = సూర్యుడు ఉదయించు ప్రదేశమునకు చెందిన పట్టణము, 
జడానాం = అలసులగు మంద బుద్ది గలవారికి, 
చైతన్య= జ్ఞానమను 
స్తబక = పుష్ప గుచ్చమునుండి వెలువడు, 
మకరంద స్రుతి = తేనె ధారల యొక్క  
ఝరీ = నిరంతర ప్రవాహము, 
దరిద్రాణాం = దరిద్రుల పట్ల, 
చింతామణి = చింతామణుల 
గుణనికా = వరుస (పేరు) 
జన్మజలధౌ = సంసార సముద్రము నందు, 
నిమగ్నానాం = మునిగి సతమతమగు వారి పట్ల, 
మురరిపు వరాహస్య = వరాహరూపుఁడగు విష్ణుమూర్తియొక్క, 
దంష్ట్రా భవతి = కోరలు అగుచున్నవి.
భావము. 
తల్లీ! జగజ్జననీ! నీ పాద పద్మ పరాగము అజ్ఞానుల పట్ల సూర్యుడుదయించు పట్టణము వంటిది. మంద బుద్ధి గల జడుల పట్ల జ్ఞానమను తేనెను జాలువార్చు ప్రవాహము వంటిది. దరిద్రుల పట్ల చింతామణుల వరుస వంటిది. సంసార సాగరమున మునిగి సతమతమగు వారికి, సముద్రమున దిగబడి వున్న భూమిని పైకి ఉద్ధరించిన విష్ణుమూర్తి అవతారమైన ఆది వరాహవు కోరవంటిది.

4 వ శ్లోకము.  
త్వదన్యః పాణిభ్యామభయవరదో దైవతగణః
త్వమేకా నైవాసి ప్రకటిత వరాభీత్యభినయా |
భయాత్ త్రాతుం దాతుం ఫలమపి చ వాంఛాసమధికం
శరణ్యే లోకానాం తవ హి చరణావేవ నిపుణౌ || 
సీ.  నీకంటెనన్యులౌ నిఖిలదేవతలెన్న నభయముద్రను గల్గి యలరుదురిల,
శ్రీద! వరాభయచిహ్నముల్ ప్రకటితముద్రల నభినయములు ధరింప
వీవేను, ముఖ్యమౌ యీశ్వరీ! సృష్టిలోఁ గారణమొకటుండెఁ గనగ నిజము,
కోరక పూర్వమే కోరికలను తీర్చి నీ పాదముల్ భీతినే దహించు,
తే.గీ.  నట్టి నీ పాదములు నేను పట్టనుంటి,
శరణు కోరుచు, మా యమ్మ! శరణమిమ్మ.
రామకృష్ణుని కవితలో ప్రాణమగుచు
వెలుఁగు మాయమ్మ! నిన్ను నే విడువనమ్మ! ॥ 4 ॥
ప్రతిపదార్థము.  
లోకానాం = లోకములకు, 
శరణ్యే = రక్షకురాలవగు, 
హే భగవతి = ఓ తల్లీ, 
త్వదన్యః = నీకంటె వేరైన, 
దైవతగణః = దేవసముదాయము, 
పాణిభ్యాం = చేతులతో, 
అభయవరదః = అభయవరముద్రలను ధరించుచున్నది.
ఏకా = (ఒక) ముఖ్యురాలగు, 
త్వమేవ = నీవుమాత్ర మే, 
పాణిభ్యాం = హ స్తముల చేత, 
ప్రకటిత = వెల్ల డింపఁబడిన, 
వరాభీత్యభినయా = వరాభయవ్యంజక ముద్రలను ధరించుదానవు, 
నైవాసి = కావుగదా,
హీ = ఇట్లని, 
తవ = నీ యొక్క
చరణా వేవ= పాదములే, 
భయాత్ = భయము నుండి, 
త్రాతుం= కాపాడుట కొఱకున్ను, 
వాంఛాసమధికం = కోరికకి మించిన, 
ఫలం = ఇష్టలాభమును, 
దాతుం = ఇచ్చుటకును, 
నిపుణౌ = నేర్చినవి.
భావము. 
సర్వలోకముల వారికి దిక్కైన ఓ జగజ్జననీ! ఇంద్రాది ఇతర దేవతలందరు తమ రెండు హస్తములందు వరద, అభయ ముద్రలను దాల్చుచుండగా నీవు ఒక్కదానివి నీ హస్తములతో వాటిని అభినయించకున్నావు. భయము నుండి రక్షించుటకు, కోరిన వాటిని మించి వరములను ప్రసాదించుటకు – నీ రెండు పాదములే సమర్థములై ఉన్నవి గదా! (మరి ఇంక హస్తముల అవసరము నీకేల యుండును అని భావము).

5 వ శ్లోకము.  
హరిస్త్వామారాధ్య ప్రణత జన సౌభాగ్య జననీం
పురా నారీ భూత్వా పురరిపుమపి క్షోభ మనయత్ |
స్మరోఽపి త్వాం నత్వా రతినయన లేహ్యేన వపుషా
మునీనామప్యంతః ప్రభవతి హి మోహాయ మహతామ్ || 
ఉ.  నీ యభయమ్మునొంది హరి నేర్పుగ స్త్రీ యవతారమెత్తి, తా 
మాయను ముంచె నా శివుని, మన్మథుఁడున్ నినుఁ గొల్చి దివ్యమౌ
మాయని సుస్వరూపుఁడయి మానిని యారతి కంటికింపునై,
శ్రీ యతి పుంగవుల్ గలతఁ జెందఁగ మోహముఁ గొల్ప నేర్చెనే. ॥ 5 ॥
ప్రతిపదార్థము.  
హే భగవతి! = ఓ జననీ!
హరిః = విష్ణువు, 
ప్రణత = నమస్కరించు 
జన = జనులకు, 
సౌభాగ్య జననీం = సౌభాగ్యమును ప్రసాదించు తల్లివైన,  
త్వాం = నిన్ను, 
ఆరాధ్య = ఆరాధించి, 
పురా = పూర్వము ఒకప్పుడు, 
నారీ = స్త్రీ రూపమును 
భూత్వా = ధరించి, 
పురరిపుం + అపి = త్రిపుర హరుడైన శివునకు సైతము, 
క్షోభం =  చిత్తక్షోభమును, 
అనయత్‌ = కలుగ జేసెను, 
స్మరః + అపీ = స్మరోఽపి = మన్మథుడు కూడా, 
త్వాం = నిన్ను; (గూర్చి) 
నత్వా = నమస్కరించి, (అనగా - పూజించి); 
రతి = రతీదేవి 
నయన = కన్నులకు 
లేహ్యేన = ఆనందాస్వాదకరమైన, 
వపుషా = చక్కని దేహముతో, 
మహతాం = గొప్పవారైన, 
మునీనాం + అపి = మౌనముగా తపస్సు గావించు ఋషులను సహితము, 
అంతః = (వారి) మనస్సు లోపల; 
మోహాయ = మోహపరవశులను చేయుటకు, 
ప్రభవతి హి = సమర్ధుఁడగుచున్నాడు కదా. 
భావము.
నమస్కారము చేసేవారికి సమస్త సౌభాగ్యములు ప్రసాదించే ఓ తల్లీ! ముందు నిన్ను హరి ఆరాధించి మోహినీ రూపమును పొంది శివునికి చిత్త క్షోభను కలిగించాడు. మన్మథుడు నిన్ను ప్రార్థించి రతీదేవి కనులకు లేహ్యము వంటి మేనితో మునులను మహామోహవశులను చేయగలిగాడు.

6 వ శ్లోకము.  
ధనుః పౌష్పం మౌర్వీ మధుకరమయీ పంచ విశిఖాః
వసంతః సామంతో మలయమరు దాయోధనరథః |
తథాప్యేకః సర్వం హిమగిరిసుతే కామపి కృపాం
అపాంగాత్తే లబ్ధ్వా జగదిదమనంగో విజయతే || 
సీ.  హేమాద్రి పుత్రి! నిన్నేమని పొగడుదు, నీ చూపు పడెనేని నిత్య శుభము
లందగవచ్చును, మందస్మితా! నీదు కడగంటి చూపునన్ గంతుడిలను
పూలవిల్లే కల్గి, పూర్తిగా తుమ్మెదల్ నారిగా కల్గి, యనారతంబు
నైదు బాణములనే యాయుధాలుగఁ గల్గి, జడుఁడుగా నుండియు వడివడిగను
తే.గీ.  మలయ మారుత రథముపై మసలుచుండి
సృష్టినే గెల్చుచుండె, నీ దృష్టి కొఱకు
భక్తులల్లాడుచుంద్రు నీ ప్రాపుఁ గోరి,
చూచి రక్షింపు, నేనునున్ వేచియుంటి. ॥ 6 ॥
ప్రతిపదార్థము.  
హిమగిరిసుతే = హిమవత్సర్వత రాజపుత్రికా! 
ధనుః = విల్లు, 
పౌష్పం = పుష్పమయమైనది, 
మౌర్వీ = అల్లెత్రాడు, 
మధుకరమయీ = తుమ్మెదలతో కూర్పఁబడినది, 
విశిఖాః = బాణములు, 
పంచ = ఐదుమాత్రమే, 
సామంతః = చెలికాడు, 
వసంతః = రెండు నెలలే ఉండు వసంత ఋతువు, 
ఆయోధన రథః = యుద్ధ రథము, 
మలయమరుత్‌ = మలయ మారుతము, 
తథాపీ = ఐనప్పటికీ 
అనంగః = శరీరమే లేని మన్మథుడు, 
ఏకః = ఒక్కడే, 
తే = నీ యొక్క, 
అపాంగాత్‌ = కడగంటి చూపు వలన, 
కాం + అపి = అనిర్వచనీయమైన, 
కృపాం = దయను, 
లబ్ధ్వా = పొంది, 
ఇదం = ఈ, 
సర్వం జగత్‌ = సమస్త జగత్తును, 
విజయతే = జయించుచున్నాడు. 
భావము. 
ఓ హిమవత్పర్వత రాజపుత్రీ! పుష్పమయమైన విల్లు, తుమ్మెదల వరుసతో కూర్చిన అల్లెత్రాడు, లెక్కకు ఐదు మాత్రమే బాణములు, అల్పాయుష్కుడు-జడుడు అయిన వసంతుడు చెలికాడు, మలయ మారుతమే రథము. ఇలా ఏ మాత్రము సమర్ధములు కానివగు ఇట్టి సాధన సామగ్రితో కనీసము శరీరము గూడా లేనివాడైన మన్మథుడు నిన్ను ఆరాధించి, అనిర్వచనీయమైన నీ కరుణా కటాక్షమును పొంది ఈ సమస్త జగత్తును జయించుచున్నాడు కదా!

7 వ శ్లోకము.  
క్వణత్కాంచీ దామా కరి కలభ కుంభ స్తననతా
పరిక్షీణా మధ్యే పరిణత శరచ్చంద్ర వదనా |
ధనుర్బాణాన్ పాశం సృణిమపి దధానా కరతలైః
పురస్తా దాస్తాం నః పురమథితు రాహో పురుషికా || 
సీ.  మణుల గజ్జియలతో మహనీయ మేఖలన్ మిలమిల కనిపించు మెఱుపుతోడ,
గున్నయేనుగు యొక్క కుంభంబులన్ బోలు పాలిండ్ల బరువుచే వంగి యున్న
సన్నని నడుముతో, శరదిందుముఖముతోఁ, జెఱకు విల్లును, పూలచెండుటమ్ము
నంకుశమ్మును గల్గి, యరచేతఁ బాశమ్ము కల్గి శూలికినహంకారమైన
తే.గీ.  లోకములనేలు మాతల్లి శ్రీకరముగ 
మాకునెదురుగ నిలుచుత మమ్ము గావ,
జన్మసాఫల్యమొసఁగంగ, సన్నుతముగ
ముక్తి సామ్రాజ్యమీయంగఁ బొలుపు మీఱ. ॥ 7 ॥
ప్రతిపదార్థము.  
హే భగవతి! = ఓ జననీ!
క్వణత్‌ = చిఱుసవ్వడి చేయు, 
కాంచీదామా = గజ్జెల మొలనూలు గలదియు, 
కరి కలభ = గున్నఏనుగుల, 
కుంభ = కుంభస్తలములతో పోల్చదగిన, 
స్తన = స్తనములచేత, 
నతా = ఇంచుక వంగినట్లుగా కనబడునదియు, 
పరిక్షీణా = కృశించిన, 
మధ్యే = నడుము గలదియు, 
పరిణత = పరిపూర్ణమైన, 
శరత్‌ చంద్ర వదనా = శరదృతువు నందలి పూర్ణిమా చంద్రుని వంటి వదనము గలదియు, 
కరతలైః = నాలుగు చేతులయందు, 
ధనుః = విల్లును, 
బాణాన్‌ =  బాణములను, 
పాశం = పాశమును, 
అపి = మరియు, 
సృణి = అంకుశమును, 
దధానా = ధరించునదియు, 
పురమధితుః = త్రిపురహరుడైన శివుని యొక్క, 
ఆహో పురుషికా = అహంకార స్వరూపిణి యగు జగన్మాత, 
నః = మా యొక్క, 
పురస్తాత్‌ = ఎదుట, 
ఆస్తాం = సాక్షాత్కరించు గాక ! 
భావము. 
చిరుసవ్వడి చేయు గజ్జెల వడ్డాణము గలది, గున్న ఏనుగు కుంభములను పోలు స్తనములు కలిగి కొద్దిగా వంగినట్లు కనబడునది, సన్నని నడుము గలది, శరదృతువు నందలి పరిపూర్ణమైన పూర్ణిమ చంద్రుని పోలే ముఖము గలది, నాలుగు చేతులయందు వరుసగా ధనుస్సు, బాణములు,  పాశము, అంకుశములను ధరించి యుండునది, శివుని యొక్క శక్తి స్వరూపిణియునగు జగన్మాత మాకు ఎదురుగా సుఖాసీనురాలై సాక్షాత్కరించుగాక!

8 వ శ్లోకము.  
సుధాసింధోర్మధ్యే సురవిటపి వాటీ పరివృతే
మణిద్వీపే నీపోపవనవతి చింతామణి గృహే |
శివాకారే మంచే పరమశివ పర్యంక నిలయాం
భజంతి త్వాం ధన్యాః కతిచన చిదానంద లహరీమ్ || 
సీ.  అమృత సింధువు మధ్య నమరిన రతనాల దీవియందున్నట్టి దివ్యమైన
కల్పవృక్షంబుల ఘన కదంబముల పూదోట లోపలనున్న మేటియైన
చింతామణులనొప్పు శ్రీకరంబైనట్టి గృహములో శివుని యాకృతిగనున్న
మంచంబున శివుని మంగళోరువు గొప్ప స్థానంబుగాఁ గల జ్ఞానపూర్ణ
తే.గీ.  వర దయానందఝరివైన భవ్యరూప!
ధన్య జీవులు కొందరే ధరను నీకు
సేవ చేయగాఁ దగుదురు, చిత్తమలర
నిన్ను సేవింపనీ, సతీ! నిరుపమాన! ॥ 8 ॥
ప్రతిపదార్థము.  
హే భగవతి! = ఓ జననీ!
సుధాసింధోః = అమృత సముద్రము యొక్క, 
మధ్యే = నడుమ, 
సురవిటపి = కల్పవృక్షముల యొక్క, 
వాటీ = తోటలచే 
పరివృతే = చుట్టబడిన, 
మణిద్వీపే = మణిమయమైన దీవియందు, 
నీప = కడిమి చెట్ల 
ఉపవన వతి = ఉద్యానము కలిగిన, 
చింతామణి = చింతామణులచే నిర్మింపబడిన 
గృహే = గృహము నందు, 
శివాకారే = శివశక్తి రూపమైన,  
మంచే = మంచము నందు, 
పరమశివ = సదాశివుడను 
పర్యంక = తొడనే, 
నిలయాం = నెలవుగా గలిగిన, 
చిత్‌ + ఆనంద + లహరీం = జ్ఞానానందతరంగ రూపమగు, 
త్వాం = నిన్ను, 
కతిచన = కొందరు, 
ధన్యాః = ధన్యులు (మాత్రమే), 
భజంతి = సేవించుదురు.
భావము. 
అమ్మా…అమృతసముద్రము మధ్యలో కల్పవృక్షాలతో నిండియున్న మణిద్వీపములో, కదంబవనములో, చింతామణులతో నిర్మించిన గృహమునందు, త్రికోణాకారపు మంచము మీద, పరమశివుని పర్యంకస్థితవై ప్రకాశించుచు, జ్ఞాన స్వరూపమై నిరతిశయ సుఖప్రవాహ రూపముగా ఉన్న నిన్ను- స్వల్ప సంఖ్యాకులైన ధన్యులు మాత్రమే సేవించుకో గలుగుతున్నారు.

9 వ శ్లోకము.  
మహీం మూలాధారే కమపి మణిపూరే హుతవహం
స్థితం స్వాధిష్ఠానే హృది మరుతమాకాశముపరి |
మనోఽపి భ్రూమధ్యే సకలమపి భిత్వా కులపథం
సహస్రారే పద్మే సహ రహసి పత్యా విహరసి || 
సీ.  పూజ్య పృథ్వీ తత్వముగను మూలాధారముననుండు తల్లివి ఘనతరముగ,
జలతత్త్వముగ నీవు కలుగుచు మణిపూర చక్రమందున నొప్పు చక్కనమ్మ!
యగ్ని తత్త్వమ్ముగానమరి యుంటివిగ స్వాధిష్ఠాన చక్రాన దివ్యముగను,
వాయు తత్త్వమ్ముగా వరలి యుంటివి యనాహత చక్రమందున నుతిగ జనని!
తే.గీ.  యల విశుద్ధచక్రాన నీ వాకసముగ,
మనసువగుచు నాజ్ఞాచక్రమునను నిలిచి,
మరి సహస్రారము సుషుమ్న మార్గమునను
చేరి, పతితోడ విహరించు ధీరవమ్మ! ॥ 9 ॥
ప్రతిపదార్థము.  
హే భగవతి! = ఓ జననీ!
మూలాధారే = మూలాధార చక్రమునందు, 
మహీం = పృథివీ తత్త్వమును, 
మణిపూరే = మణిపూర చక్రము నందు, 
కం = ఆపస్తత్త్వము, అనగా- జలతత్త్వమును, 
స్వాధిష్టానే = స్వాధిష్థాన చక్రము నందు, 
హుతవహం = అగ్నితత్వమును, 
హృది = హృదయమందలి అనాహత చక్రము వద్ద, 
మరుతమ్‌ = వాయు తత్త్వమును, 
ఉపరి = పైన ఉన్న విశుద్ధ చక్రము నందు, 
ఆకాశం = అకాశతత్త్వమును, 
భ్రూమధ్యే = కనుబొమల నడుమ గల ఆజ్ఞా చక్రము నందు, 
మనోఽపి = మనస్తత్త్వమును గూడా (కలుపుకొని), 
కులపథం = కులమార్గము, అనగా - సుషుమ్నామార్గమును, 
సకలం + అపి - సకలమపి = అంతను కూడ, 
భిత్వా = ఛేదించుకొని చివరకు, 
సహస్రారే - పద్మే = సహస్రార కమలమందు, 
రహసి = ఏకాంతముగా నున్న, 
పత్యాసహ = భర్తయగు సదాశివునితో గూడి, 
విహరసి = క్రీడింతువు.
భావము. 
అమ్మా! నీవు సుషుమ్నా మార్గములో మూలాధార చక్రమునందు భూతత్త్వమును, మణిపూరకమందు జలతత్త్వమును, స్వాధిష్థాన చక్రము నందు అగ్నితత్వమును, అనాహత మందు వాయుతత్త్వమును, విశుద్ద చక్రమందు ఆకాశతత్త్వమును, ఆజ్ఞా చక్రమునందు మనోతత్త్వమును చేధించుకొని సహస్రార చక్రమందు నీ భర్తతో ఏకాంతముగా విహరిస్తున్నావు.

10 వ శ్లోకము.  
సుధాధారాసారైశ్చరణయుగళాంతర్విగళితైః
ప్రపంచం సించంతీ పునరపి రసామ్నాయ మహసః|
అవాప్య స్వాం భూమిం భుజగ నిభమధ్యుష్ఠవలయం
స్వమాత్మానం కృత్వా స్వపిషి కులకుండే కుహరిణి || 
సీ.  శ్రీపాదముల నుండి చిందుచుఁ బ్రవహించు నమృతవర్షంబుతోనలరు నీవు
నిండుగ డెబ్బది రెండు వేలున్నట్టి నాడీప్రపంచమున్ దడుపుచుండి,
యమృతాతిశయముననలరెడి చంద్రుని కాంతినిఁ గలుగుచుఁ, గదలుచుండి
మరల మూలాధార మహిత చక్రము చేరి, స్వస్వరూపము పొంది సన్నుతముగ
తే.గీ.  కుహరిణిని బోలు కులకుండమహిత చక్ర
మునను చుట్టగాచుట్టుకొనిన జననివి,
నీవె కుండలినీశక్తి, నిదురపోవు
చుందువమ్మరో! మాలోన నుందు వీవె. ॥ 10 ॥ 
ప్రతిపదార్థము.  
హే భగవతి! = ఓ జననీ!
చరణ = పాదముల 
యుగళ = జంట యొక్క, 
అంతర్విగళితైః = మధ్య నుండి స్రవించుచున్న, 
సుధా = అమృతము యొక్క 
ధార = ధారయొక్క 
ఆసారైః = వర్షముచేత, 
ప్రపంచం = పంచతత్త్వదేహమును ప్రేరేపించు నాడీ మండలమును, 
సించంతీ = తడుపుచున్నదానవై, 
రస = అమృతము యొక్క 
ఆమ్నాయ = గుణాతిశయ రూపమయిన
మహసః = కాంతులు గల చంద్రుని నుండి, 
స్వాం = స్వకీయమైన 
భూమిం = భూతత్త్వమునకు సంబంధించిన ఆధార చక్రమును, 
పునః = మరల, 
ఆవాప్య = పొంది, 
భుజగ నిభం = సర్పమువలె, 
అధ్యుష్ఠ = అధిష్ఠింపబడిన 
వలయం = కుండలాకారమైన దానినిగా, 
స్వం = తనదగు 
ఆత్మానం = నిజ స్వరూపమును, 
కృత్వా = చేసి (అనగా - ధరించి, లేదా - పొంది), 
కుహరిణి = తామర పూవు బొడ్డు వద్దనుండు సన్నని రంధ్రము వంటిదైన, 
కుల (కు = పృథివీ తత్త్వము, ల = లయము నొందు) సుషుమ్నా మూల మందలి, 
కుండే = కమల కందరూపమైన చక్రము నందు, 
స్వపిషి = నిద్రింతువు.
భావము. 
తల్లీ! నీ పాదముల జంట యొక్క మధ్య నుండి స్రవించుచున్న అమృతము చేత పంచతత్త్వ దేహమును ప్రేరేపించు నాడీ మండలమును తడుపుచున్న దానవై, చంద్రుని నుండి స్వకీయమైన భూతత్త్వమునకు సంబంధించిన ఆధార చక్రమును మరల పొంది, సర్పమువలె అధిష్ఠింపబడిన కుండలాకారమైన దానినిగా తనదగు నిజ స్వరూపమును పొంది, తామర పూవు బొడ్డు వద్దనుండు సన్నని రంధ్రము వంటిదైన సుషుమ్నా మూల మందలి కమల కందరూపమైన చక్రము నందు నిద్రింతువు.

11 వ శ్లోకము.  
చతుర్భిశ్శ్రీకంఠైశ్శివయువతిభిః పంచభిరపి
ప్రభిన్నాభిశ్శంభోర్నవభిరపి మూలప్రకృతిభిః |
చతుశ్చత్వారింశద్వసుదల కలాశ్ర త్రివలయ-
త్రిరేఖాభిస్సార్ధం తవ శరణకోణాః పరిణతాః || 
సీ.  శ్రీచక్రమది నాల్గు శివచక్రములు, వాటి నుండియే విడివడి యున్న శక్తి
చక్రమ్ము లైదుతోఁ జక్కఁగ నున్నట్టి, సృష్టికి మూలమై చెలగుచున్న
తత్త్వమ్ముతోఁ గూడి తనరు నీ వాసమౌ శ్రీచక్రమందలి చెలగు కోణ
ములనష్టదళముల నలపద్మషోడశమును మేఖలాతంత్రముగను, మూడు
తే.గీ.  భూపురములును కలిసిన మొత్తమటుల
నలుబదియు నాలుగంచులు కలిగి యుండె
నమ్మ నీవాసమపురూపమైనదమ్మ!
నెమ్మి నిన్ను నేఁ బూజింతునమ్మ నమ్మి. ॥ 11 ॥
ప్రతిపదార్థము.  
హే భగవతి = ఓ జననీ!
చతుర్భిః = నలుగురైన, 
శ్రీ కంఠైః = శివులచేతను, 
శంభోః = శివుని కంటె 
ప్రభిన్నాభిః =వేరైన, 
పంచభిరపి = ఐదుగురైన, 
శివయువతిభిః= శివశక్తుల చేతను, 
నవభిః = తొమ్మిదిఐన, 
మూల ప్రకృతిభిః అపి = మూల కారణముల చేతను, 
తవ = నీ యొక్క, 
శరణ = నిలయమగు శ్రీ చక్రము యొక్క, 
కోణాః = కోణములు, 
వసుదళ = ఎనిమిది దళముల చేతను, 
కలాశ్ర = పదునాఱు దళముల చేతను, 
త్రివలయ = మూడు మేఖలల (వర్తుల రేఖల) చేతను, 
త్రిరేఖాభిఃసార్ధం = మూడు భూపుర రేఖల చేతను, 
పరిణతాః = పరిణామమును పొందినవై, 
చతుశ్చత్వారింశత్‌ = నలుబది నాలుగు అగుచున్నవి. 
భావము. 
తల్లీ! నాలుగు శివకోణములు, తద్భిన్నములైన అయిదు శక్తికోణములు, తొమ్మిది మూల ప్రకృతులతోనూ, అష్టదళ పద్మము, షోడశదళ పద్మము, మేఖలాత్రయము, భూపురత్రయములతో నీవుండే శ్రీచక్రము 44 త్రికోణములతో అలరారుచున్నది.

12 వ శ్లోకము.  
త్వదీయం సౌందర్యం తుహినగిరికన్యే తులయితుం
కవీంద్రాః కల్పంతే కథమపి విరించి ప్రభృతయః |
యదాలోకౌత్సుక్యాదమరలలనా యాంతి మనసా
తపోభిర్దుష్ప్రాపామపి గిరిశ సాయుజ్య పదవీమ్ || 
శా. నీ సౌందర్యము పోల్పఁ జాలరు భవానీ! బ్రహ్మసుత్రాములున్
నీ సౌందర్యము గాంచి యప్సరసలున్ నిన్బోలలేనందునన్
ధ్యాసన్నిల్పి మహేశ్వరున్ మనములన్ ధ్యానించి తాదాత్మ్యతన్
భాసింపంగను జూతురైక్యమగుచున్, భక్తిప్రదా! శాంభవీ! ॥ 12 ॥
ప్రతిపదార్థము.  
తుహిన గిరికన్యే = ఓ పార్వతీ! 
త్వదీయం = నీ యొక్క 
సౌందర్యం = అందచందములను, 
తులయితుం = ఉపమానములతో సరిపోల్చి చెప్పుటకు, 
విరించి ప్రభృతయః = బ్రహ్మమున్నగు, 
కవీంద్రాః = కవిశ్రేష్ఠులు సైతము, 
కథమపి = ఏ విధముగను 
కల్పంతే = సమర్థులు కాకున్నారు 
యత్‌ = ఏ కారణము వలన అనగా 
ఆలోక = నీ సౌందర్యమును చూచుట యందలి 
ఔత్సుక్యాత్‌ = కుతూహలము వలన 
అమర లలనాః = దేవతా స్త్రీలు,
తపోభిః = నియమనిష్టలతో తపస్సు చేసి గూడ, 
దుష్ప్రాపాం అపి = పొంద శక్యము కానిదైనను, 
గిరిశ = శివునితో
సాయుజ్య = సాయుజ్యము, 
పదవీం = పదవిని,
మనసా = మనస్సుచేత, 
యాంతి = పొందుచున్నారు. 
భావము. 
అమ్మా! బ్రహ్మ విష్ణు ఇంద్రాది కవీంద్రులు కూడా ఎంత ప్రయత్నించినా నీ దేహ సౌందర్యముకు సాటి చెప్పలేకపోతున్నారు. దేవతా స్త్రీలు, అప్సరసలు నీ సౌందర్యము చూచుటకు కుతూహలము కలవారై, నీ అందముతో సాటిరాని వారై, కఠిన తపస్సులచే కూడా పొందలేని శివసాయుజ్యమును మనస్సుచే పొందుతున్నారు.

13 వ శ్లోకము.  
నరం వర్షీయాంసం నయన విరసం నర్మసుజడం
తవాపాంగాలోకే పతిత మనుధావంతి శతశః |
గలద్వేణీబంధాః కుచకలశ విస్రస్త సిచయాః
హటాత్ త్రుట్యత్కాఞ్చ్యో విగళిత దుకూలా యువతయః || 
శా.  కన్నుల్ కాంతి విహీనమై చూడ వికారమై, జడుఁడునై, కాలంబె తాఁ జెల్లెనం
చెన్నంజాలిన వానిపైన బడినన్ హృద్యంపు నీ చూపహో!
కన్నెల్ చూడగ నెంచి వానిని మదిన్ గాంక్షించుచున్ బయ్యెదల్
క్రన్నన్ జారఁగ, నీవి, మేఖలలు జారన్, వెన్దవుల్చుందురే ॥ 13 ॥
ప్రతిపదార్థము.  
హే భగవతి! = ఓ అమ్మా!
వర్షీయాంసం = మిక్కిలి ముసలివాడైనను,
నయన విరసం = వికారమును గొలుపు కన్నులు గలవాడైనను, 
నర్మసు = ప్రణయకామకేళీ విలాసాదుల యందు 
జడం = మోటువాడైనను, 
తవ = నీ యొక్క, 
అపాంగాలోకే = క్రీగంటి అనుగ్రహ వీక్షణమునకు పాత్రమైన, 
నరం = మనుష్యుని (అతడు మన్మథుని వలె కనబడి) చూచి, 
యువతయః = యువతులు, 
గళత్ = జాఱుచున్న, (విడివడుచున్న) 
వేణీ = జడల యొక్క 
బంధాః = ముడులు కలవారై; 
కుచకలశ = కడవల వంటి స్తనములపై నుండి, 
విస్రస్త = జాఱిపోయిన, 
సిచయాః = పైట కొంగులు గల వారై, 
హఠాత్‌ = ఆకస్మికముగా, 
త్రుట్యత్ = తెగివిడిపోయిన 
కాఞ్చ్యః = మొలనూళ్ళు గలవారై, 
విగళిత = వీడిపోయిన 
దుకూలాః = పోకముడులు కలవారై; 
శతశః = వందలకొలది, 
అనుధావంతి = అనుసరించి వెంట పరుగెత్తుచుండిరి.   
భావము. 
తల్లీ! నీ క్రీగంటి చూపుపడిన మానవుడు, అతడు కురూపియైనా, ముదుసలి అయినా, సరసమెరుగని వాడయినా, అలాంటి వాడిని చూసి- మహా మోహముతో కొప్పులు వీడిపోవగా, పైట చెంగులు జారిపోవగా, గజ్జెలమొలనూళ్ళు తెగిపోవగా, ప్రాయములో ఉన్న వందల కొద్దీ స్త్రీలు అతని వెంటపడతారు. అంటే అమ్మవారి అనుగ్రహము అట్టి కురూపిని కూడా మన్మథుని వంటి అందగాడిని చేయునని భావం.

14 వ శ్లోకము.  
క్షితౌ షట్పఞ్చాశద్ ద్విసమధిక పఞ్చాశదుదకే
హుతాశే ద్వాషష్టి శ్చతురధిక పఞ్చాశ దనిలే |
దివి ద్విష్షట్ త్రింశన్మనసి చ చతుష్షష్టిరితి యే
మయూఖాస్తేషామప్యుపరి తవ పాదాంబుజయుగమ్ || 
సీ.  భూతత్త్వముననొప్పి పూజ్య మూలాధార మున నేబదారు కిరణములుండ,
జలతత్త్వముననున్న చక్కని మణిపూరమున నేబదియు రెండు ఘనతనుండ,
నగ్నితత్త్వంబుననలరి స్వాధిష్ఠానమున నరువదిరెండు ప్రణుతినుండ,
వాయుతత్త్వముతోడ వరలు ననాహత మందేబదియునాల్గు,  ననితరమగు
నాకాశ తత్త్వాన నల విశుద్ధమునందు డెబ్బదిరెండు ఘటిల్లి యుండ,
మానస తత్త్వాన మసలు నాజ్ఞాచక్రమున నరువదినాల్గు వినుతినొప్ప
తే.గీ.  నట్టి వాని సహస్రారమందునున్న
బైందవ స్థానమున నీదు పాదపంక
జయుగ మొప్పి యుండును దేజసంబు తోడ,
నట్టి నిన్ గొల్తునమ్మరో! యనుపమముగ. ॥ 14 ॥
ప్రతిపదార్థము.  
హే భగవతి! = ఓ జననీ!
క్షితౌ = పృథివీ తత్త్వమునకు చెందిన మూలాధార చక్రమునందు, 
షట్‌పఞ్చాశత్‌ = ఏబది యారు, 
ఉదకే = జలతత్త్వమునకు చెందిన మణిపూర చక్రమునందు, 
ద్వి సమధిక పఞ్చాశత్‌ = ఏబది రెండును, 
హుతాశే = అగ్నితత్త్వమునకు చెందిన స్వాధిష్ఠాన చక్రమునందు, 
ద్వాషష్టిః = అరువది రెండును, 
అనిలే = వాయు తత్త్యమునకు చెందిన అనాహత చక్రమునందు, 
చతురధిక పఞ్చాశత్‌ = ఏబది నాలుగును, 
దివి = అకాశతత్త్వమునకు చెందిన విశుద్ధి చక్రమునందు, 
ద్విఃషట్‌ త్రింశత్‌ = డెబ్బది రెండును, 
మనసిచ = మనస్తత్వమునకు చెందిన ఆజ్ఞా చక్రము నందు, 
చతుష్షష్టిః = అరువదినాలుగును, 
ఇతి = ఈ విధముగా, 
యే మయూఖాః = ఏ కిరణములున్నవో, 
తేషాం = వాటి అన్నిటికిని గూడ, 
ఉపరి = పై భాగమున, 
తవ = నీ యొక్క, 
పాదాంబుజయుగమ్‌ = చరణ కమలముల జంటవర్తించును. 
భావము. 
ఓ దేవీ! మూలాధారము పృథ్వీతత్త్వముతో కూడినది. అందు కాంతి కిరణములు 56. మణిపూరకము జలతత్త్వముతో కూడినది. అందు కాంతి కిరణములు 52. స్వాధిష్ఠానము అగ్నితత్త్వాత్మకము. అందు కిరణములు 62. అనాహతము వాయుతత్త్వాత్మకము, అందు కిరణములు 54. విశుద్ధిచక్రము ఆకాశతత్త్వాత్మకము. అందలి మయూఖములు 72. మనస్తత్త్వాత్మకమగు ఆజ్ఞాచక్రమునందు కిరణములు 64. ఈ వెలుగు కిరణములన్నింటినీ అధిగమించి, వాటి పైన నీ చరణ కమలములు ప్రకాశించుచున్నవి.

15 వ శ్లోకము.  
శరజ్జ్యోత్స్నా శుద్ధాం శశియుత జటాజూట మకుటాం
వర త్రాస త్రాణ స్ఫటికఘుటికా పుస్తక కరామ్ |
సకృన్నత్వా న త్వా కథమివ సతాం సన్నిదధతే
మధు క్షీర ద్రాక్షా మధురిమ ధురీణాః ఫణితయః || 
సీ.  శరదిందు చంద్రికల్ సరితూగునంతటి నిర్మలదేహంపు నెలతవీవు,
పిల్ల జాబిలి తోడనల్ల జడలతోడ నుతకిరీటమునొప్పు నతివవీవు,
కోరికల్ తీర్చెడి తీరైన వరముద్ర, భయమును బాపు నభయపు ముద్ర,
స్ఫటిక మాలను దాల్చి, సన్నుతంబుగ దివ్య పుస్తకంబును దాల్చి నిస్తులవయి
తే.గీ.  యొప్పు నీకు వందనములు గొప్పగాను
జేయు సజ్జనులకునబ్బు శ్రీకరముగ
మధువు, గోక్షీర, ఫలరస మాధురులను
మించు వాగ్ధాటి భువిపైన మేల్తరముగ. ॥ 15 ॥ 
ప్రతిపదార్థము.  
హే భగవతి! = ఓ జననీ!
శరత్‌ = శరత్కాలపు 
జ్యోత్న్నా = వెన్నెలవలె, 
శుద్ధాం = నిర్మలమైనదియు,  
శశియుత = నెలవంకరేఖను కూడినదియు నయిన, 
జటాజూట = జుట్టు ముడి అనెడి, 
మకుటాం = కిరీటము గలదియు, 
వర = వరద ముద్రను, 
త్రాసత్రాణ = అభయముద్రయు, 
స్ఫటిక ఘుటికా = స్ఫటికములతో కూర్చడిన అక్షమాలయు, 
పుస్తక = పుస్తకమును, 
కరాం = హస్తములందు గలిగినదానిగా, 
త్వా = నిన్ను, 
సకృత్‌ = ఒక్కమారు, 
నత్వా = నమస్కరించిన, 
సతాం = బుద్ధిమంతులకు, 
మధు = తేనె, 
క్షీర = పాలు, 
ద్రాక్షా = ద్రాక్షా ఫలముల, 
మధురిమ = తీయదనమును, 
ధురీణాః = వహించి యున్న మధురాతిమధురమైన,
ఫణితయః = వాగ్విలాస వైఖరులు, 
కథమివ = ఎట్లు, 
సన్నిదధతే = ప్రాప్తించకుండును? 
భావము. 
తల్లీ! శరత్కాలపు వెన్నెలవలె శుద్ధమైన తెల్లని కాంతి కలిగినట్టి, చంద్రునితో కూడిన జటాజూటమే కిరీటముగా కలిగినట్టి, వరదాభయ ముద్రలను, స్ఫటిక మాలా పుస్తకములను నాలుగు చేతులలో ధరించి ఉన్న నీకు, ఒకసారైనా నమస్కరించక సజ్జనులు, కవులు తేనె, పాలు, ద్రాక్ష పండ్లయొక్క మాధుర్యము నిండి యున్న వాక్కులను ఎలా పొందగలరు?

16 వ శ్లోకము.  
కవీంద్రాణాం చేతః కమలవన బాలాతప రుచిం
భజంతే యే సంతః కతిచిదరుణామేవ భవతీమ్ |
విరించి ప్రేయస్యాస్తరుణతర శృంగార లహరీ
గభీరాభిర్వాగ్భిర్విదధతి సతాం రంజనమమీ || 
చం.  కవుల సుచేతనాబ్జవన గణ్య దినాది రవిప్రకాశమౌ,
ప్రవర మనోజ్ఞమౌ నరుణ పావననామ! నినున్ భజించుచున్
బ్రవరులు బ్రహ్మరాజ్ఞి పరువంపు విలాస ఝరీ గభీరమౌ
శ్రవణ సుపేయ వాగ్ఝరిని ప్రాజ్ఞులకున్ బరితృప్తినిత్తురే. ॥ 16 ॥
ప్రతిపదార్థము.  
హే భగవతి! = ఓ జననీ!
కవీంద్రాణాం = కవిశ్రేష్ఠుల యొక్క,  
చేతః = చిత్తములు అనెడి 
కమలవన = పద్మ వనములకు, 
బాలాతపరుచిం = ఉదయసూర్యుని కాంతి వంటిదగు, 
అరుణాం + ఏవ = అరుణ యను పేరు గల, 
భవతీం = నిన్ను, 
కతిచిత్‌ = కొందఱు,  
సంతః = ఏ విబుధ జనులు, 
భజంతే = సేవించుదురో 
అమీ = అట్టి వీరు, 
విరించి ప్రేయస్యాః = సరస్వతీ దేవి యొక్క,  
తరుణతర = ఉప్పాంగు పరువపు, 
శృంగార = శృంగార రసము యొక్క, 
లహరీ = కెరటము వలె, 
గభీరాభిః = గంభీరములైన, 
వాగ్భిః = వాగ్విలాసము చేత, 
సతాం = సత్పురుషులకు, 
రంజనం = హృదయానందమును, 
విదధతి = చేయుచున్నారు. 
భావము. 
తల్లీ! బాల సూర్యుని కాంతి- పద్మములను వికసింపజేసినట్లుగా, కవీంద్రుల హృదయ పద్మములను వికసింపచేసే నిన్ను, అరుణవర్ణముగా ధ్యానించే సత్పురుషులు- సరస్వతీదేవి నవయౌవన శృంగార ప్రవాహము వంటి గంభీరమైన వాగ్విలాస సంపదతో, సత్పురుషుల హృదయములను రంజింపచేసెదరు.

17 వ శ్లోకము.  
సవిత్రీభిర్వాచాం శశిమణి శిలాభంగ రుచిభి
ర్వశిన్యాద్యాభిస్త్వాం సహ జనని సంచింతయతి యః |
స కర్తా కావ్యానాం భవతి మహతాం భంగిరుచిభి
ర్వచోభిర్వాగ్దేవీ వదన కమలామోద మధురైః || 
సీ.  అనుపమవాక్కునకును మూలహేతువై చంద్రకాంతిమణుల చక్కనైన
ముక్కల కాంతులఁ బోలి వశిన్యాది శక్తులతోఁ గూడ చక్కగ నిను
నెవరు ధ్యానింతురో యిలపైన వారలు మహనీయ సుకవుల మాన్యతయును,
రసవత్తరంబును, రమ్య సరస్వతీ ముఖపద్మసంభూత పూజ్య వాక్సు
ధామోద మధుర మహావచనంబులన్ గమనీయమైనట్టి కావ్యకర్త
తే.గీ.  యగుట నిక్కంబు, శాంభవీ! ప్రగణితముగ,
శక్తి సామర్థ్యముల ననురక్తితోడ
నాకునొసగంగ వేడెదన్ శ్రీకరముగ
నిన్నుఁ గవితలన్ వర్ణింప నిరుపమముగ. ॥ 17 ॥
ప్రతిపదార్థము.  
హే భగవతి! = ఓ జననీ!
వాచాం = వాక్కులకు, 
సవిత్రీభిః = జనక స్థానీయులును, 
శశిమణి శిలా = చంద్రకాంతమణుల, 
భంగ = ముక్కల యొక్క, 
రుచిభిః = కాంతులను పోలెడు, 
వశిన్యాదిభిః సహ = వశినీ మొదలగు శక్తులతో గూడ, 
త్వాం = నిన్ను 
యః= ఎవడు, 
సంచింతయతి = చక్కగా ధ్యానించునో 
సః = అతఁడు, 
మహతాం = వాల్మీకి మొదలైన మహాకవుల యొక్క, 
భంగి = (రచనల) రీతుల వలె నుండు 
రుచిభిః = రసవంతమైన, 
వాగ్దేవీ వదన కమల = సరస్వతీదేవి ముఖము అనెడు కమలము నందలి, 
ఆమోద = పరిమళముచేత, 
మధురైః = మధురములైన, 
వచోభిః = వాక్సంపత్తితో, 
కావ్యానాం = కావ్యములకు, 
కర్తాభవతి = రచయితగా సమర్ధుఁడగు చున్నాడు. 
భావము. 
జగజ్జననీ! వాక్కులను సృజించు వారు, చంద్రకాంతమణుల శకలముల వలె తెల్లనైన దేహముల కాంతికలవారు అగు – వశినీ మొదలగు శక్తులతో కూడిన నిన్ను ఎవరు చక్కగా ధ్యానించునో వాడు – మహాకవులైన వాల్మీకి కాళిదాసాదుల కవిత్వరచన వలె మధురమైన, శ్రవణరమణీయమైన, సరస్వతీ దేవి యొక్క ముఖ కమల పరిమళములను వెదజల్లు మృదువైన వాక్కులతో – రసవంతమైన కావ్య రచన చేయగల సమర్థుఁడగును.

18 వ శ్లోకము.  
తనుచ్ఛాయాభిస్తే తరుణ తరణి శ్రీసరణిభి
ర్దివం సర్వాముర్వీమరుణిమ నిమగ్నాం స్మరతి యః |
భవంత్యస్య త్రస్యద్వన హరిణ శాలీన నయనాః
సహోర్వశ్యా వశ్యాః కతి కతి న గీర్వాణ గణికాః || 
సీ.  తరుణ తరుణిఁ బోలు నిరుపమ కాంతితో వెలిఁగెడి నీదైన వెలుఁగు లమరి
యాకాశమున్ భూమినంతటన్ గాంతులు చెలఁగు నా యరుణిమన్ దలచు నెవ్వ
డట్టి సాధకునికి హరిణముల కరణి బెదరుచూపుల సుర వేశ్యలు మరి
యూర్వశిఁ బోలెడి సర్వాంగసుందరుల్ వశముకాకెట్టుల మసలగలరు?
తే.గీ.  నిన్ను నిరతంబుఁ గొలిచెడి నిత్యభక్తి
నాకొసంగుము మాయమ్మ! శ్రీకరముగ,
నీదు పాద పరాగమే నియతిఁ గొలుపు
నాకుఁ బ్రాపింపఁ జేయుమో నయనిధాన! ॥ 18 ॥
ప్రతిపదార్థము.  
హే భగవతి! = ఓ అమ్మా!
తరుణ తరణి = ఉదయ సూర్యుని యొక్క, 
శ్రీ సరణిభిః = కాంతి సౌభాగ్యమును బోలు, 
తే = నీ యొక్క, 
తనుచ్ఛాయాభిః = దేహపు కాంతుల చేత, 
సర్వా = సమస్తమైన, 
దివం = ఆకాశమును, 
ఉర్వీం = భూమిని, 
అరుణిమ = అరుణ వర్ణము నందు, 
నిమగ్నాం = మునిగినదానిగా, 
యః = ఏ సాధకుడు, 
స్మరతి = తలంచుచున్నాడో, 
అస్య = అట్టి సాధకునికి, 
త్రస్యత్‌ = బెదరుచుండు, 
వనహరిణ = అడవి లేళ్ళ యొక్క, 
శాలీన = సుందరము లైన, 
నయనా = కన్నులు కలిగిన వారు, 
గీర్వాణ గణికాః = దేవలోక వేశ్యలు, 
ఊర్వశ్యాసహ = ఊర్వశి అను అప్సర స్త్రీతో సహా, 
కతికతి = ఎందరెందరో, 
న వశ్యాః భవంతి = లొంగిన వారుగా ఏలకాకుందురు ? అందఱూ వశ్యులగుదురు. 
భావము. 
జగజ్జననీ! ఉదయించుచున్న బాల సూర్యుని అరుణారుణ కాంతి సౌభాగ్యమును పోలిన నీ దివ్యదేహపు కాంతులలో- ఈ సమస్తమైన ఆకాశము, భూమి మునిగి ఉన్నట్లు భావించి ధ్యానించే సాధకునికి- బెదురు చూపులతో ఉండు లేడి వంటి కన్నులు కలిగిన దేవలోక అప్సర స్త్రీలు ఊర్వశితో సహా వశులవుతారు.

19 వ శ్లోకము.  
ముఖం బిందుం కృత్వా కుచయుగమధస్తస్య తదధో
హరార్ధం ధ్యాయేద్యో హరమహిషి తే మన్మథ కలామ్ |
స సద్యః సంక్షోభం నయతి వనితా ఇత్యతిలఘు
త్రిలోకీమప్యాశు భ్రమయతి రవీందుస్తనయుగామ్ || 
సీ.  శ్రీచక్రముననున్నచిన్మయ బిందువున్ నీముఖసీమగాఁ బ్రేమఁ గనుచు,
దానిక్రిందను కుచ ద్వయము నాక్రిందను శివునర్ధభాగమౌ భవుని సతిని,
బిందువు క్రిందను వెలుఁగు త్రికోణాన క్లీమ్ బీజమున్ మదిన్ లీలఁ గనుచు
నెవరుందురో వార లెవరినైననుగాని మోహంబులో ముంచి ముగ్ధులుగను
తే.గీ. జేయఁ గలుగుదురోయమ్మ! శ్రీ రవీందు
లను గుచములుగ నొప్పెడి వినుతయౌ త్రి
లోకినిని భ్రమన్ ముంచు తా నేకబిగిని
శీఘ్రముగనమ్మ, నీ శక్తి చెప్పఁ దరమె? ॥ 19 ॥ 
ప్రతిపదార్థము.  
హరమహిషి = శివుని పట్టమహిషివైన ఓ జననీ!
ముఖం = ముఖమును, 
బిందుం కృత్వా = బిందువుగా చేసి (అనగా - బిందుస్తానమును ముఖముగా ధ్యానించి అని అర్థము), 
తస్య = ఆ ముఖమునకు, 
అధః = క్రిందిభాగమునందు, 
కుచయుగం కృత్వా = స్తనద్వయమును ధ్యానించి, 
తత్‌ = ఆ స్తనద్వయమునకు 
అధః = క్రిందుగా, 
హరార్థం = హరునిలో అర్థభాగమై యున్నశక్తి రూపమును,(త్రికోణమును) 
కృత్వా = ఉంచి
తత్ర = అక్కడ,
తే = నీ యొక్క,
మన్మథ కలాం = కామబీజమును,
యః = ఏ సాధకుడు, 
ధ్యాయేత్‌ = ధ్యానించునో, 
సః= ఆ సాధకుడు, 
సద్యః = వెనువెంటనే, 
వనితా = కామాసక్తులగు స్త్రీలను, 
సంక్షోభం = కలవరము, 
నయతి ఇతి = పొందించుచుండుట అనునది, 
అతిలఘు = అతిస్వల్ప విషయము,
రవీందు = 'సూర్యచంద్రులే 
స్తనయుగాం = స్తనములుగా గల,  
త్రిలోకీం అపి = స్వర్గ, మర్త్య, పాతాళలోకములనెడు స్త్రీని సైతము, 
ఆశు = శీఘ్రముగా, 
భ్రమయతి = అతడు భ్రమింప చేయుచున్నాడు . 
భావము. 
ఓ మాతా! నీ మోమును బిందువుగా జేసి, దానిక్రిందుగా కుచయుగమునుంచి, దాని క్రిందుగా త్రికోణముంచి నీమన్మథకళ నెవడు ధ్యానిస్తాడో, ఆ ధ్యాన ఫలితంగా కామాసక్తులైన వనితలను కలవరపెడుతున్నాడు. అంతే కాదు ఆ సాధకుడు సూర్య చంద్రులను స్తనములుగా కలిగిన త్రిలోకిని అనగా స్వర్గ, మర్త్య, పాతాళ లోకాలనే స్త్రీలను మోహమునకు గురిచేయుచున్నాడు.

20 వ శ్లోకము.  
కిరంతీమంగేభ్యః కిరణ నికురుంబామృతరసం
హృది త్వా మాధత్తే హిమకరశిలామూర్తిమివ యః |
స సర్పాణాం దర్పం శమయతి శకుంతాధిప ఇవ
జ్వరప్లుష్టాన్ దృష్ట్యా సుఖయతి సుధాధార సిరయా || 
సీ.  ఆపాద మస్తకంబంతటి కిరణాలఁ బ్రసరించు నమృతమ్ము నసమరీతిఁ
గురిపించుచున్నట్టి నిరుపమ శశిశిలా మూర్తిగా భావించి స్ఫూర్తితోడ
నే సాధకుండు నిన్ హితముతోఁ బ్రార్థించునట్టివాఁ డసమానుఁడయిన గొప్ప
గరుడుని యట్టుల నురగ దంష్ట్రల నుండి వెల్వడు విషమును వింతగాను
తే.గీ.  బాపువాఁడగుచుండెను, జ్వరముతోడ
బాధనందువారికి బాధఁ బాయఁజేయు,
నమృతపు సిరల దృక్కుల ననితరముగ
నమ్మ! నా ప్రార్థనల నందుకొమ్మ నీవు. ॥ 20 ॥
ప్రతిపదార్థము.  
హే మాత! = ఓ జననీ!
యః = ఏ సాధకుడు, 
అంగేభ్యః = కరచరణాది అవయవముల నుండి, 
కిరణ = వెలుగుల యొక్క, 
నికురుంబ = సమూహము వలన కలిగిన,
అమృత రసం = అమృత రసమును, 
కిరంతీం = వర్షించుచున్న, 
త్వాం = నిన్ను, 
హృది= హృదయమునందు, 
హిమకరశిలా = చంద్రకాంతిశిలయొక్క 
మూర్తి + ఇవ = ప్రతిమవలె, 
ఆధత్తే = ధారణ చేసి ధ్యానించునో, 
సః = ఆ సాధకుడు, 
సర్పాణాం = పాముల యొక్క, 
దర్పం = పొగరును, శాంతింపఁజేయుటయందు
శకుంతాధిప ఇవ = గరుత్మంతుని వలె,
శమయతి = శాంతింప చేయుచున్నాడు. 
జ్వర=జ్వరతాపముచే 
ప్లుష్టాన్‌ = బాధపడువారిని, 
సుధాధార సిరయా = అమృతమును స్రవించు నాడివంటి, 
దృష్ట్యా = వీక్షణము చేత, 
సుఖయతి = సుఖమును కలుగ చేయుచున్నాడు. 
భావము. 
తల్లీ! అవయవముల నుండి కిరణ సమూహ రూపమున అమృత రసమును వెదజల్లుతున్న చంద్రకాంత శిలామూర్తిగా నిన్ను హృదయమందు ధ్యానించువాడు, గరుత్మంతుని వలె సర్పముల యొక్క మదమడచగలడు. అమృతధారలు ప్రవహించు సిరలు గల దృష్టితో జ్వర పీడితులను చల్లబరచగలడు.

21 వ శ్లోకము.  
తటిల్లేఖా తన్వీం తపన శశి వైశ్వానర మయీం
నిషణ్ణాం షణ్ణామప్యుపరి కమలానాం తవ కలాం |
మహాపద్మాటవ్యాం మృదితమలమాయేన మనసా
మహాంతః పశ్యంతో దధతి పరమానంద లహరీమ్ || 
సీ.  మెరుపు తీగను బోలు మేలైన కాంతితోఁ జంద్రసూర్యాగ్నుల సహజమైన
రూపంబుతోనొప్పి, రూఢిగ షట్ చక్ర ములపైన నొప్పెడి మూలమైన
వర సహస్రారాన వరలు నీ సత్ కళన్ గామాది మలములు క్షాళితమయి,
మనసులన్ గాంచుచు మహితాత్ము లానంద లహరులందేలుదు రిహము మరచి,
తే.గీ.  ఎంత వర్ణించినన్ నిన్నుఁ గొంతె యగును,
శంకరాచార్యులే కాదు శంకరుఁడును
నిన్ను వర్ణింపలేడమ్మ! నిరుపమాన
సగుణ నిర్గుణ సాక్షి వో చక్కనమ్మ! ॥ 21 ॥
ప్రతిపదార్థము.  
హే భగవతి! = ఓ జననీ!
తటిత్‌ + లేఖా = మెఱువు తీగవంటి, 
తన్వీం = శరీరము కలదియు,
తపన శశి వైశ్వానర మయీం = సూర్యచంద్రాగ్ని రూపము కలదియు, 
షణ్ణాం = ఆరు సంఖ్యగలదియు, 
కమలానాం = పద్మముల యొక్క ( షట్చక్రముల యొక్క,) 
అపి = మరియు, 
ఉపరి = పై భాగమందు, 
మహా పద్మాటవ్యాం = గొప్పతామర తోటయందు (సహస్రార కమలమందు,) 
నిషణ్ణాం = కూర్చున్న, 
తవ = నీ యొక్క, 
కలాం = సాదాఖ్య బైందవీ కళచే, 
మృదిత = క్షాళనము కావింపబడిన, 
మలమాయేన = కామాది మలినములు, 
అనగా - మాయ, అవిద్య, అహంకారాదులు గల, 
మనసా = మనస్సు చేత, 
పశ్యన్తః = చూచుచున్న, 
మహాంతః = సజ్జనులు, 
పర మానందలహరీం = ఉత్తమ సుఖానుభవ రసానంద ప్రవాహమును, 
దధతి = పొందుచున్నారు.  
భావము. 
తల్లీ! భగవతీ! మెరుపు తీగవలె సొగసైన, సూక్ష్మమైన, పొడవైన, ప్రకాశించు లక్షణము కలిగిన, సూర్య చంద్రాగ్ని స్వరూపమైనది, షట్చక్రాలకు పైన సహస్రారంలో మహాపద్మాటవిలో కూర్చున్న నీ యొక్క సాదాఖ్య అనే బైందవీ కళను- కామాది మలినములను పోగొట్టుకున్న మహాపురుషులైన యోగీశ్వరులు ధ్యానించి, మహానంద ప్రవాహములో ఓలలాడుచున్నారు. 

22 వ శ్లోకము.  
భవాని త్వం దాసే మయి వితర దృష్టిం సకరుణాం
ఇతి స్తోతుం వాంఛన్ కథయతి భవాని త్వమితి యః |
తదైవ త్వం తస్మై దిశసి నిజసాయుజ్య పదవీం
ముకుంద బ్రహ్మేంద్ర స్ఫుట మకుట నీరాజితపదామ్ || 
ఉ.  అమ్మ! భవాని! దాసుఁడ మహాకరుణన్ గనుమంచునెంచి నే
నమ్మ! భవాని నీవనుచు నార్తిగ పల్కుచునుండునంత నా
బమ్మయు, నింద్రుఁడున్, హరి, సభక్తిని గొల్చెడి నీదు పాద పీ
ఠమ్మునఁ జేరఁ జేయుచు నెడందను గాంచుచు ముక్తి నిత్తువే. ॥ 22 ॥ 
ప్రతిపదార్థము.  
భవాని! = ఓ భవానీ జననీ!
త్వం = నీవు, 
దాసే = దాసుడనైన, 
మయి = నాయందు, 
సకరుణాం = దయతో కూడిన, 
దృష్టిం = చూపును, 
వితర = ప్రసరింప చేయుము, 
ఇతి = ఈ ప్రకారముగా, 
స్తోతుం = స్తుతించుటకు, 
వాంఛన్‌ = ఇచ్చగించువాడై, 
“భవానిత్వం' ఇతి = “భవానిత్వం అని, 
కథయతి = పలుకునో, 
తస్మై = ఆ విధముగా ఉచ్చరించు వానికి, 
త్వం = నీవు, 
తదైవ = ఆ విధముగా ఉచ్చరించుట పూర్తి కాకమునుపే, 
ముకుంద = విష్ణువు, 
బ్రహ్మ = బ్రహ్మదేవుడు, 
ఇంద్ర = దేవేంద్రుడు అనువారి యొక్క, 
స్ఫుట మకుట = స్పష్టముగా కనబడు కాంతివంతమగు కిరీటముల చేత, 
నీరాజిత = హారతి ఇవ్వబడిన, 
పదాం = అడుగులు కల, 
నిజ సాయుజ్య పదవీం = నీ తోడి తాదాత్మ్యము అను పదవిని, 
దిశసి = ఇచ్చెదవు.   
భావము. 
“తల్లీ! భవానీ! నేను దాసుడను. నీవు నా యందు దయతో కూడిన నీ చల్లని చూపును ప్రసరింపచేయుము” అని  స్తుతిస్తూ, “భవానీత్వం” అని మొదలుపెట్టి ఇంకా చెప్పబోయేలోపే వారికి హరి బ్రహ్మేంద్రులు రత్న కిరీటములచే హారతి పట్టబడు నీ పద సాయుజ్యమును ఇచ్చెదవు.

23 వ శ్లోకము.  
త్వయా హృత్వా వామం వపురపరితృప్తేన మనసా
శరీరార్ధం శంభోరపరమపి శంకే హృతమభూత్ |
యదేతత్ త్వద్రూపం సకలమరుణాభం త్రినయనం
కుచాభ్యామానమ్రం కుటిల శశిచూడాల మకుటమ్ || 
సీ.  వామ భాగము నీవు భవునిలో గ్రహియించి, సంతృప్తి కనకేమొ శంభురాజ్ఞి! 
కుడిసగముం గూడఁ గోరి కొంటివనుచు శంక కలుగుచుండె జయనిధాన!
భవ్యారుణప్రభల్ వామ దక్షిణభాగముల నీదు దేహంబు పొంది యుండె,
నేత్రత్రయంబొప్పె, నీ కుచభారాన వంగినమేనాయె, వంకరైన
తే.గీ.  చంద్ర రేఖ నీ శిరమునఁ జక్కఁగాను 
వినుత చూడామణి మకుట మన రహించె,
నిట్టి హేతువులుండుటన్ గట్టిగాను
శంక కలిగెను నాకు నో జయనిధాన! ॥ 23 ॥
ప్రతిపదార్థము.  
హే భగవతి! = ఓ జననీ!
త్వయా = నీ చేత, 
శంభోః = శివుని యొక్క, 
వామం = ఎడమ భాగమైన, 
వపుః = దేహము, 
హృత్వా = అపహరించి, 
అపరితృప్తేన = సంతుష్టినొందని, 
మనసా = మనస్సు చేత, 
అపరం = రెండవ (కుడి) భాగమైన, 
శరీరార్ధం అపి = శివుని శరీరము యొక్క రెండవ దైనకుడి భాగమును సైతము, 
హృతం = గ్రహింపబడినదిగా, 
అభూత్‌ = ఆయెనని, 
శంకే = సందేహపడెదను, 
యత్‌ = ఏ కారణము వలన, 
ఏతత్‌ = (నా హృదయములో భాసించు) ఈ, 
త్వత్‌ రూపం = నీ దేహము, 
సకలం = వామ దక్షిణ భాగములు రెండును, 
అరుణాభం = ఎఱ్ఱని కాంతి గలదియు, 
త్రినయనం = మూడు కన్నులతో గూడినదియు, 
కుచాభ్యాం = స్తన యుగ్మముచే, 
ఆనమ్రం = కొద్దిగా ముందుకు వంగినదియు, 
కుటిల = వంకరగా నుండు 
శశిచూడాల మకుటం = చంద్రకళచే శిరోమణి గల కిరీటము గలదై ఒప్పుచున్నదియును అగుటవలననే సుమా.
భావము. 
తల్లీ! జగజ్జననీ! నీ దేహమంతా అరుణకాంతులు వెదజల్లుతూ, మూడు కన్నులు గలిగి, స్తనభారముచే కొద్దిగా వంగినట్లు కనబడుతూ, నెలవంకను శిరోమణిగా కలిగియుండుటను చూడగా – మొదట నీవు శివుని శరీర వామభాగమును హరించి, అంతటితో సంతృప్తి చెందక, కుడిభాగమైన శరీరార్ధమును కూడా హరించితివి కాబోలునని సందేహము కలుగుచున్నది.

24 వ శ్లోకము.  
జగత్సూతే ధాతా హరిరవతి రుద్రః క్షపయతే
తిరస్కుర్వన్నేతత్ స్వమపి వపురీశస్తిరయతి |
సదా పూర్వస్సర్వం తదిద మనుగృహ్ణాతి చ శివ
స్తవాజ్ఞా మాలంబ్య క్షణచలితయోర్భ్రూలతికయోః || 
ఉ.  హే కరుణామయీ! విధి గణించుచుఁ జేయును సృష్టి, విష్ణు వా
శ్రీకర సృష్టిఁ బెంచు, హృతిఁ జేయును రుద్రుఁడు, నీ త్రిమూర్తులన్
బ్రాకటమొప్ప నెట్టి, తన రమ్యసుదేహము దాచు నీశుఁడున్,
నీ కను సన్నచే మరల నేర్పునఁ  గొల్పు సదాశివుండు తాన్. ॥ 24 ॥
ప్రతిపదార్థము.  
హే భగవతి! = ఓ జననీ!
ధాతా = బ్రహ్మ, 
జగత్‌ = ప్రపంచమును, 
సూతే = సృజించుచున్నాడు, 
హరిః = విష్ణువు, 
అవతి = పాలించి రక్షించుచున్నాడు, 
రుద్రః= రుద్రుడు, 
క్షపయతే = లీనము చేయుచున్నాడు, 
ఈశః = ఈశ్వరుడు, 
ఏతత్‌ = ఈ ముగ్గుఱిని, 
తిరస్కుర్వన్‌ = తిరస్కరించు వాడై, 
స్వమపి = తనదగు, 
వపుః = శరీరమును, 
తిరయతి = అంతర్ధానమును పొందించుచున్నాడు,  
సదాపూర్వః = సదా అను శబ్దము ముందు గల, 
శివః = (సదా) శివుడు, 
తదిదం = (ఈ చెప్పబడిన) తత్త్వ చతుష్టయమును, 
క్షణ చలితయోః = క్షణ కాలమాత్ర వికాసము గల, 
తవ = నీ యొక్క, 
భ్రూలతికయోః = కనుబొమల యొక్క, 
ఆజ్ఞాం = ఆజ్ఞను, 
ఆలంబ్య = పొంది, 
అనుగృహ్ణాతి = అనుగ్రహంచుచున్నాడు. అనగా మఱల సృజించు చున్నాడు. 
భావము. 
అమ్మా! నీ లతలవంటి కనుబొమల కదలికనుండి ఆజ్ఞను స్వీకరించి, బ్రహ్మ ప్రపంచమును సృష్టించును. విష్ణువు పాలించును. రుద్రుడు లయింపజేయును. ఈశ్వరుడు ఈ త్రయమును తన శరీరమునందు అంతర్ధానము నొందించును. సదాశివుడు నీ కటాక్షమును అనుసరించి ఈ నాలుగు పనులను మరలా ఉద్ధరించుచున్నాడు.

25 వ శ్లోకము.  
త్రయాణాం దేవానాం త్రిగుణ జనితానాం తవ శివే
భవేత్ పూజా పూజా తవ చరణయోర్యా విరచితా |
తథా హి త్వత్పాదోద్వహన మణిపీఠస్య నికటే
స్థితా హ్యేతే శశ్వన్ముకుళిత కరోత్తంస మకుటాః || 
ఉ.  నీదు గుణత్రయంబున గణింప త్రిమూర్తులు పుట్టిరోసతీ!
నీ దరి నిల్చి మ్రొక్కిన, గణింతురు వారలు వారికన్నటుల్,
మోదముతోడ నిన్నుఁ గని పూజ్యముగా మది నిల్పి కొల్తురే,
నీ దయ కల్గినన్ గలుగు నీ పద పంకజ సేవ మాకిలన్.॥ 25 ॥
ప్రతిపదార్థము.  
శివే! = ఓ భవానీ! 
తవ = నీ యొక్క, 
త్రిగుణ జనితానాం = సత్త్వ రజస్తమో గుణముల వలన ఉద్భవించిన, 
త్రయాణాం = ముగ్గుఱైన, 
దేవానాం = బ్రహ్మ, విష్ణు, రుద్రులకు, 
తవ = నీ యొక్క, 
చరణయోః = పాదములందు, 
యా పూజా = ఏ పూజ, 
విరచితా = చేయఁబడినదో, 
పూజా = అదియే పూజగా, 
భవేత్‌ = అగును. (వేరొకటి పూజ కాదు - అని భావము) 
తథాహి = ఇది యుక్తము, (ఏలననగా) 
త్వత్పాద = నీ పాదములను, 
ఉద్వహన = వహించుచున్న, 
మణిపీఠస్య = రత్న పీఠము యొక్క, 
నికటే = సమీపము నందు, 
శశ్వత్‌ = ఎల్లపుడూ, 
ముకుళిత = మోడ్చబడిన 
కర = హస్తములే, 
ఉత్తంస = శిరోభూషణముగాగల, 
మకుటాః = కిరీటములు గలవారై, 
ఏతే = ఈ త్రిమూర్తులు, 
స్తితాః = వర్తించుచున్నారు కాబట్టి.
భావము. 
తల్లీ! నీ సత్త్వరజస్తమోగుణములచేత జనించిన బ్రహ్మ విష్ణు రుద్రులు ముగ్గురూ, నీవు పాదములుంచెడి మణిపీఠమునకు దగ్గరగా చేతులు జోడించి, శిరస్సున దాల్చి ఎల్లప్పుడు నిలిచి ఉండెదరు. అందువలన నీ పదములకు చేసే పూజ త్రిమూర్తులకు కూడా పూజ అగుచున్నది.

26 వ శ్లోకము.  
విరించిః పంచత్వం ప్రజతి హరిరాప్నోతి విరతిం
వినాశం కీనాశో భజతి ధనదో యాతి నిధనమ్ |
వితంద్రీ మాహేంద్రీ వితతిరపి సమ్మీలిత దృశా
మహాసంహారేఽస్మిన్ విహరతి సతి త్వత్పతి రసౌ || 
చం.  కలిగెడి యా మహా ప్రళయ కాలమునందున బ్రహ్మ, విష్ణు రు
ద్రులు, యముఁడున్, గుబేరుఁడు, నరుల్దివిజాధిపుడింద్రుడున్, మునుల్,
కలియుటనిక్కమెన్నగను కాలగతిన్, గమనించి చూడగన్
గలియుచు నిన్ను గూడి కఱకంఠుఁడు తాను సుఖించునేకదా. ॥ 26 ॥
ప్రతిపదార్థము.  
హే భగవతి! = ఓ జననీ!
విరించిః = బ్రహ్మ 
పంచత్వం = మరణమును, 
ప్రజతి = పొందుచున్నాడు, 
హరిః = విష్ణువు, 
విరతిం = విశ్రాంతిని, 
ఆప్నోతి = పొందుచున్నాడు, 
కీనాశః = యముడు, 
వినాశం = వినాశమును 
భజతి = పొందుచున్నాడు. 
ధనః = కుబేరుడు, 
నిధనం = మరణమును,  
యాతి = పొందుచున్నాడు. 
మాహేంద్రీ = ఇంద్రునికి సంబంధించిన, 
వితతిః అపి = పరివారము గూడ, 
సమ్మీలితదృశా = కనులు మూతపడి, 
వితంద్రీ = నిద్రాణమగుచున్నది. 
హే సతి! = ఓ సతీ! 
అస్మిన్‌ = ఈ కనబడు ప్రపంచము, 
మహా సంహారే = మహా ప్రళయము పొందునపుడు, 
త్వత్‌ = నీ యొక్క, 
పతి = భర్త అయిన, 
అసౌ = ఈ సదాశివుడు మాత్రము 
విహరతి = ఏ మార్పునకు గుఱికాక క్రీడించుచున్నాడు. 
భావము. 
తల్లీ! జగజ్జననీ! ఈ ప్రపంచమునకు మహా ప్రళయము సంభవించినపుడు బ్రహ్మదేవుడు, విష్ణువు, యముడు, కుబేరుడు, చివరకు ఇంద్రుడు – వీరందరూ కాలధర్మము చెందుచున్నారు. కాని, ఓ పతివ్రతామతల్లీ ! నీ భర్త అయిన సదాశివుడు మాత్రము, ఎట్టి మార్పులకు గురికాకుండా విహరించుచున్నాడు గదా!

27 వ శ్లోకము.  
జపో జల్ప శ్శిల్పం సకలమపి ముద్రా విరచనా
గతిః ప్రాదక్షిణ్య క్రమణ మశనాద్యాహుతి విధిః |
ప్రణామ స్సంవేశః సుఖమఖిలమాత్మార్పణ దృశా
సపర్యా పర్యాయస్తవ భవతు యన్మే విలసితమ్ || 
శా.  నా సల్లాపములీకు మంత్రజపముల్, నా హస్త విన్యాసముల్
భాసించున్ దగ నీకు ముద్రలగు, నా పాదప్రవృత్తుల్ సతీ!
ధ్యాసన్ జేయు ప్రదక్షిణల్, కొనెడు నాహారంబులే యాహుతుల్,
నా సౌఖ్యాదులు పవ్వళింత సుఖముల్ నా నీకు సాష్టాంగముల్. || 27 ||
ప్రతిపదార్థము.  
హే భగవతి! = ఓ తల్లీ!
ఆత్మ + అర్పణ + దృశా = ఆత్మ సమర్పణ బుద్ధితో, అనగా - సర్వమును పరమాత్మకు సమర్శించుచున్నానను బుద్దితో, 
జుల్పః = నేను చేయు సల్లాపమే, 
జపః = నీకు చేయు జపము; 
శిల్పం = నేను చేయు క్రియా కలాపములు, 
సకలం = సమస్తమును, 
ముద్రా విరచనా = నీకు చేయు ముద్రలు, 
గతిః = నా గమనములు, 
ప్రాదక్షిణ్య క్రమణం = నీకు చేయు ప్రదక్షిణలు; 
అశనా + అది = చేయుచున్న భోజనాదులు, 
ఆహుతి విధిః = నీకు సమర్పించు హవిస్సులు; 
సంవేశః = నేను నిద్రించునపుడు దొర్లుటయే, 
ప్రణామః = నీకు చేయు సాష్టాంగ ప్రణామములు; 
అఖిలం = సమస్తమైన, 
సుఖం = సుఖకరమైన, 
విలసితం = నా విలాసములు, 
తవ = నీకు, 
సపర్యా పర్యాయః = పరిచర్యలు గా అయి నీ పూజయేఅగుగాక! 
భావము. 
తల్లీ! నా మాటలన్నీ నీ జపముగా, నా కార్యకలాపమంతయూ నీకు అర్పించే ముద్రలుగా, నా గమనము అంతా నీ ప్రదక్షిణగా, నేను భుజించేదంతా నీకు ఆహుతిగా, నిద్రించేటప్పుడు, పరుండినప్పుడు జరుగు దేహములోని మార్పులు- నీకు సాష్టాంగ ప్రణామములుగా, శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాది సుఖములు నేను ఆత్మార్పణ బుద్దితో చేసే నీ పూజలుగా అగుగాక.

28 వ శ్లోకము.  
సుధామప్యాస్వాద్య ప్రతి భయ జరా మృత్యు హరిణీం
విపద్యంతే విశ్వే విధి శతమఖాద్యా దివిషదః |
కరాళం యత్ క్ష్వేలం కబలితవతః కాలకలనా
న శంభోస్తన్మూలం తవ జనని తాటంక మహిమా || 
మ.  సుధ సేవించియు మృత్యువొందుదురుగా సోలంగ నా కల్పమా
విధి యింద్రాదులు, కాలకూట విషమున్ విశ్వేశుఁడే త్రాగియున్                    నిధనంబొందఁడు నిన్నుఁ జేరి మనుటన్ నిక్కంబు, తాటంకముల్
సుధలన్ జిందుచు రక్షణన్ గొలుపనో, శుభ్రాంతరంగప్రభా! ॥ 28 ॥
ప్రతిపదార్థము.  
హే భగవతి! = ఓ తల్లీ!
విధి = బ్రహ్మ 
శతమఖాద్యాః = ఇంద్రుడు మొదలగు ముఖ్యమైన, 
విశ్వే = సృష్టిలో ఉన్న 
దివిషదః = దేవతలు, 
ప్రతిభయ = మిక్కిలి భయంకరములయిన 
జరామృత్యు = జరామరణములను 
హరిణీం = పోగొట్టునది అయిన, 
సుధా = అమృతమును, 
ఆస్వాద్య అపి = త్రాగినవారై కూడా, 
విపద్యంతే = కాలధర్మము చెందుచున్నారు. 
కరాళం = భయంకరమైన, 
యత్‌ క్ష్వేలం = ఏ కాలకూటవిషమున్నదో, 
కబళితవతః = అది భక్షించినను, 
శంభోః = (నీపతియైన) శివునకు, 
కాలకలనా = కాలధర్మము, 
న = సంభవించ లేదు, 
తత్‌ మూలం = దానికి కారణము, 
తవ = నీ యొక్క 
తాటంక మహిమా = చెవికమ్మల ( కర్ణాభరణముల) ప్రభావమే, 
భావము. 
తల్లీ ! భయంకరమైన జరామృత్యువులను పరిహరించు అమృతమును త్రాగి కూడా బ్రహ్మేంద్రాది దేవతలందరూ మృతి చెందుతున్నారు. కానీ నీ భర్త అయిన శివునకు- కాలకూటము భుజించినప్పటికీ కల్పాంతములందు కూడా చావు లేడు. దానికి కారణము నీ కర్ణాభరణములయిన తాటంకముల మహిమయే.

29 వ శ్లోకము.  
కిరీటం వైరించం పరిహర పురః కైటభభిదః
కఠోరే కోటీరే స్ఖలసి జహి జంభారి మకుటమ్ |
ప్రణమ్రేష్వేతేషు ప్రసభముపయాతస్య భవనం
భవస్యాభ్యుత్థానే తవ పరిజనోక్తి ర్విజయతే || 
సీ.  విధికిరీటంబిది పదిలంబుగా నీవు తప్పించుకొని నడు, తగులకుండ,
హరి కిరీటంబది, యటు కాలు మోపకు, కాలుకు తగిలినఁ గందిపోవు,
నింద్రమకుటమది, యిటుప్రక్క పోఁబోకు, తగిలినచో బాధ తప్పదమ్మ,
ప్రణమిల్లుచుండిన బ్రహ్మాదులనునెన్ని, పరిజనంబులు నీవు వచ్చుచున్న
తే.గీ. పతికెదురుగనేగఁ గనుచుఁ బలికినట్టి
పలుకు లరయ సర్వోత్కృష్ట భాసితములు,
పరమసుకుమార వరపాద పద్మములకు
వందనంబులు చేసెదన్ బరవశమున.|| 29 ||
ప్రతిపదార్థము.  
హే భగవతి! = ఓ తల్లీ!
పురః = ఎదుట, 
వైరించం = బ్రహ్మకు సంబంధించిన, 
కిరీటం = కిరీటమును, 
పరిహర = తొలఁగ జేయుము, 
కైటభ భిదః = కైటభుడను రాక్షసుని వధించిన విష్ణుమూర్తి యొక్క, 
కఠోరే = కఠినమయిన, 
కోటీరే = కిరీటము అంచులందు తాకి, 
స్థలసి = జాఱెదవేమో, 
జంభారి = దేవేంద్రుని 
మకుటమ్‌ = కిరీటమును, 
జహి = వదలి దూరముగా నడువుము - అని ఈ విధముగా 
ఏతేషు = బ్రహ్మేంద్రాదులు  
ప్రణమ్యేషు = మోకరిల్లుచుండగా, 
భవనం = నీ మందిరమునకు, 
ఉపయాతస్య = వచ్చిన, 
భవస్య = నీ పతియగు పరమేశ్వరునికి, 
ప్రసభ = వెంటనే, 
తవ అభ్యుత్థానే = నీవు ఎదురు వెళ్ళు సమయమందు, 
తవ = నీ యొక్క, 
పరిజన + ఉక్తి = సేవికల వచనము, 
విజయతే = సర్వోత్కర్షతో విరాజిల్లుచున్నది.  
భావము. 
మాతా! నీ మందిరమునకు నీ పతియగు పరమేశ్వరుడు వచ్చిన తరుణములో, నీవు వెనువెంటనే స్వాగత వచనములతో ఎదురేగి, ఆయనను పలుకరించుటకు లేచి ముందుకు సాగు ప్రయత్నములోనుండగా – దారిలో నీకు సాష్టాంగ దండప్రణామము లాచరించు స్థితిలోనున్న బ్రహ్మ, విష్ణు, ఇంద్రాదుల యొక్క కిరీటములు- నీ పాదములకు అడ్డు తగులుతాయి అన్న ఉద్దేశ్యముతో- వీటిని జాగ్రత్తగా దాటుతూ నడువుమని చెప్పే నీ పరిచారికల మాటలు ఎంతో గొప్పవిగా ఉన్నవి.

30 వ శ్లోకము.  
స్వదేహోద్భూతాభిర్ఘృణిభిరణిమాద్యాభిరభితో
నిషేవ్యే నిత్యే త్వా మహమితి సదా భావయతి యః |
కిమాశ్చర్యం తస్య త్రినయన సమృద్ధిం తృణయతో
మహాసంవర్తాగ్నిర్విరచయతి నీరాజనవిధిమ్ || 
శా.  అమ్మా! నిత్యవు, నీ పదాబ్జ జనితంబౌ కాంతులే సిద్ధులో
యమ్మా! వాటికి మధ్యనున్న నిను తానంచెంచు భక్తుండు తా
నెమ్మిన్ సాంబు సమృద్ధినైనఁ గొనఁ డా నిత్యాత్మునే యెన్నుచున్
సమ్మాన్యంపు నివాళియౌనతనికిన్, సంవర్త కాలాగ్నియున్.  30.
ప్రతిపదార్థము.  
నిత్యే = ఆద్యంతములు లేని తల్లీ !, 
నిషేవ్యే = చక్కగా సేవింపదగిన మాతా! 
స్వదేహ + ఉద్భూతాభిః = (తన)నీకు సంబంధించిన దేహము నుండి, (అనగా - ప్రస్తుతము పాదముల నుండి)ఉద్భవించినట్టి, 
ఘృణిభిః = కిరణములతోడను, 
అణిమా + ఆద్యాభిః = అణిమాగరిమాది అష్టసిద్ధులతోడను, 
అభితః = చుట్టును ఉండు వానితోడను, (కూడి), 
త్వాం = (ఉన్న) నిన్ను, 
అహం ఇతి = నేను అను అహంభావన చేత, 
సదా = ఎల్లవేళల, 
యః = ఏ సాధకుడు, 
భావయతి = ధ్యానము చేయునో, 
త్రినయన సమృద్ధిం = సదాశివుని యొక్క ఐశ్వర్యమును, 
తృణయత = తృణీకరించుచున్న గడ్డి పోచవలె నెంచుచున్న, 
తస్య = ఆ సాధకునికి, 
మహా సంవర్త + అగ్ని = మహా ప్రళయాగ్ని, 
నీరాజన విధిం = నీరాజనమును, 
కరోతి = ఇచ్చుచున్నది (అని అనుటలో), 
కిం ఆశ్చర్యం = ఏమి ఆశ్చర్యము ఇది ? 
భావము. 
అమ్మా! నిత్యురాలవగు నీ చరణములనుండి ఉద్భవించిన కాంతులతో, అణిమ, మహిమా మొదలైన అష్ట సిద్ధులతో కూడిన నిన్ను “నీవే నేను” అనే భావముతో, నిత్యమూ ధ్యానము చేయు భక్తుడు ముక్కంటి అయిన శివుని ఐశ్వర్యమును కూడ తృణీకరించగలడు. ఇక వానికి ప్రళయకాలాగ్ని నీరాజనమువలె అగుచున్నదనుటలో ఆశ్చర్యమేమున్నది?

31 వ శ్లోకము.  
చతుష్షష్ట్యా తంత్రై స్సకలమతిసంధాయ భువనం
స్థితస్తత్తత్సిద్ధి ప్రసవ పరతంత్రైః పశుపతిః
పునస్త్వన్నిర్బంధాదఖిల పురుషార్థైక ఘటనా
స్వతంత్రం తే తంత్రం క్షితితల మవాతీతరదిదమ్  || 
సీ.  అరువదినాల్గైన యపురూప తంత్రముల్ ప్రభవింపఁ జేసెను భవుఁడు తలచి,
యొక్కొక్కటొక్కొక్కటొప్పుగానొరలించి కోరిన విధముగా దారి చూపి,
హరుఁడు విశ్రమమొంది, హరుపత్నియౌ దేవి హరుని నాజ్ఞాపింప వరలఁజేసె
శ్రీవిద్యననితరచిద్భాసమగు విద్య, విశ్వమందున బ్రహ్మ విద్య కలుగ
తే.గీ.  నాత్మనే దెల్పెడి దరయ నాత్మ విద్య,
రెంటికిసమన్వయముగూర్చి శ్రేయమునిడు
నట్టిదగు విద్య శ్రీవిద్య, పట్టినేర్పె,
ముక్తి నిడునట్టి యీ విద్య పూజ్య శివుఁడు. ॥  31 ॥
ప్రతిపదార్థము.  
హే భగవతి! = ఓ తల్లీ!
పశుపతిః = శివుడు, 
సకలం భువనం = సమస్త ప్రపంచమును, 
తత్‌తత్‌ = ఆయా, 
సిద్ధి = సిద్ధులయొక్క,
ప్రసవ = ఉత్పత్తి యందు,
పరతంత్రైః = ఇష్టపడునవైన, 
చతుష్షష్ట్యా = మహామాయాశాంబరాదులగు అరువదినాలుగు సంఖ్యగల, 
తంత్రైః = తంత్ర గ్రంథముల చేత, 
అతిసంధాయ =మోసపుచ్చ దాచిపెట్టి, 
స్థితః = స్థిమితముగా నుండెను. 
పునః= మఱల, 
త్వత్‌ = నీ 
నిర్భంధాత్‌ = నిర్భంధము వలన, 
అఖిల = సమస్తమైన
పురుషార్థ = చతుర్విధ పురుషార్థములను, 
ఏక ఘటనా = ముఖ్యముగా సమకూర్చుట యందు, 
స్వతంత్రం = స్వతంత్రమైన,  
తే= నీయొక్క, 
తంత్రం = శ్రీ విద్యా తంత్రమును, 
ఇదం = ఈ చెప్పబడుచున్న దానిని, 
క్షితి తలం = భూతల వాసులనుద్దేశించి, 
అవాతీతరత్‌ = అవతరింప జేసెను. 
భావము. 
తల్లీ! జగజ్జననీ! పశుపతి అయిన శివుడు, జీవులను తృప్తి పరచడానికి వివిధ ప్రక్రియలతో వివిధ ఫలితాలనిచ్చు 64 రకముల తంత్రములను ఈ లోకమునకు ఇచ్చి, జీవులను మోహవ్యామోహములలో చిక్కుకొనునట్లు చేయగా – ఆ విధముగా మోహమునందు పడకుండుటకు బిడ్డలైన జీవులయందు వాత్సల్యముతో – నీవు నీ భర్త అయిన శివుని ప్రేమతో నిర్బంధ పెట్టగా – పరమ పురుషార్థ ప్రదమైన- నీదైన శ్రీవిద్యాతంత్రమును, ఈ భూలోక వాసులకు ప్రసాదింపజేసితివి.

32 వ శ్లోకము.  
శివః శక్తిః కామః క్షితిరథ రవి శ్శీతకిరణః
స్మరో హంస శ్శక్రః తదను చ పరా మార హరయః |
అమీ హృల్లేఖాభిస్తిసృభిరవసానేషు ఘటితాః
భజంతే వర్ణాస్తే తవ జనని నామావయవతామ్ || 
మ.  శివుఁడున్ శక్తియుఁ గాముఁడున్ క్షితియు నా శీరుండు, చంద్రుండు, చి
ద్భవుఁడున్, హంసయు, శక్రుఁడున్, గన ఘనంబౌ తత్ పరాశక్తి, హృ
ద్భవుఁడౌ మన్మథుఁడున్, దగన్ హరియు, నీ భవ్యంపు సంకేత స
ద్భవ హృల్లేఖలు చేరగాఁ దుదల, నీ భాస్వంత మంత్రంబగున్. ॥ 32 ॥
ప్రతిపదార్థము.  
జనని! = ఓ మాతా!, 
శివః = శివుడు (కకారము) 
శక్తిః = శక్తి (ఏ కారము)
కామః = మన్మథుడు (ఈ కారము) 
క్షితిః = భూమి (లకారము) 
అథః = తర్వాత, 
రవిః = సూర్యుడు (హకారము) 
శీతకిరణః = చంద్రుడు (సకారము) 
స్మరః = మన్మథుడు (కకారము) 
హంసః = సూర్యుడు (హః కారము) 
శక్రః = ఇంద్రుడు (ల కారము); 
తత్‌ + అనుచ = వానికి తర్వాత, 
పరా = పరాశక్తి (సి కారము) 
మారః = మన్మథుడు (కి కారము) 
హరిః = విష్ణువు (లకారము) 
అమీ = (ఈ మూడు వర్గములుగానున్న) ఈ వర్ణములు, 
త్రిసృభిః = మూడైన, 
హృల్లేఖాభిః = హ్రీం కారముల చేత, 
అవసానేషు = వర్గాంతములందు, 
ఘటితాః = కూడినదై, 
తే = ఆ, 
వర్ణాః = అక్షరములు, 
తవ = నీ యొక్క, 
నామ + అవయవతాం = అవయవములగుటను, అనగా - మంత్ర స్వరూపవుగుటను, 
భజంతే = పొందుచున్నవి. 
భావము. 
ఓ జననీ! శివుడు, శక్తి మన్మథుడు, భూమి – ఈ నలుగురూ వరుసగా సూచించు క, ఏ, ఈ, ల – అను అక్షర కూటము;
సూర్యుడు, చంద్రుడు, మన్మథుడు, సూర్యుడు, ఇంద్రుడు – ఈ ఐదుగురు వరుసగా సూచించు హ, స, క, హ, ల- అను అక్షర కూటము,   పరాశక్తి, మన్మథుడు, హరి – ఈ ముగ్గురు వరుసగా ‘సూచించు స, క, ల – అను అక్షర కూటములు –
వాటి అంతము నందలి విరామ స్థానములందు – “హ్రీం” కారముల చేత సమకూర్చబడినపుడు ఏర్పడు ఆ మూడు కూటములలోని మొత్తము 15 అక్షరములు ‘ఓ జగజ్జననీ! నీ పంచదశాక్షరీ మంత్ర స్వరూపమునకు అవయవములుగా భాసించుచున్నవి.

33 వ శ్లోకము.  
స్మరం యోనిం లక్ష్మీం త్రితయమిదమాదౌ తవ మనో
ర్నిధాయైకే నిత్యే నిరవధి మహాభోగ రసికాః |
భజంతి త్వాం చింతామణి గుణనిబద్ధాక్ష వలయాః
శివాగ్నౌ జుహ్వంతః సురభిఘృత ధారాహుతి శతైః  || 
మ.  స్మర బీజంబును, యోని బీజమును, శ్రీ మాతృప్రభా బీజమున్,
వరలన్ నీదగు నామమంత్రములకున్ బ్రారంభమున్ నిల్పుచున్
వరచింతామణి  తావళాంచితులు సద్భావుల్ శివాగ్నిన్, నినున్, 
బరమానందము తోడఁ జేయుదురు సద్భావంబుతో హోమమున్, ॥ 33 ॥
ప్రతిపదార్థము.  
నిత్యే = శాశ్వతమైన ఓ తల్లీ !, 
తవ = నీ యొక్క, 
మనోః = మంత్రమునకు, 
ఆదౌ = మొదటను, 
స్మరం = కామరాజ బీజమును (క్లీం), 
యోనిం= భువనేశ్వరీ బీజమును (హ్రీం), 
లక్ష్మీం = శ్రీ బీజమును (శ్రీం), 
ఇదం = ఈ మూడింటిని 
నిధాయ = చేర్చి, 
ఏకే = కొందఱు మాత్రము, 
నిరవధిక = హద్దులులేని, 
మహాభోగ = దొడ్డదైన ఆనందానుభవము యొక్క, 
రసికాః= రసజ్ఞులు, 
చింతామణి = చింతామణుల యొక్క, 
గుణ = సరముల చేత, 
నిబద్ధ = కూర్చబడిన, 
అక్షవలయాః = అక్షమాలలు గలవారై, 
శివా + అగ్నౌ = శివాగ్ని యందు, (అనగా స్వాధిష్ఠా గ్నియందుంచి) 
త్వాం = నిన్ను, సహస్రారము నుండి హృదయ కమల మందు నిల్పి, 
సురభి = కామధేనువు యొక్క, 
ఘృత = నేయి యొక్క, 
ధారా = ధారల చేత, 
ఆహుతి = ఆహుతల యొక్క, 
శతైః = పలు మారులు, 
జుహ్వంతః = హోమము చేయుచు, 
భజంతి = సేవించుచున్నారు. 
భావము. 
ఓ నిత్యస్వరూపిణీ! రసజ్ఞులు, సమయాచారపరులు అయిన కొంతమంది యోగీంద్రులు- నీ మంత్రమునకు ముందు కామరాజ బీజమును, భువనేశ్వరీ బీజమును, శ్రీ బీజమును చేర్చి చింతామణులతో కూర్చిన జపమాలికను బూని, కామధేనువు యొక్క ఆజ్యధారలతో నిత్యస్వరూపురాలవైన నిన్ను- తమ హృదయ కమలములందు నిలిపి హోమము చేస్తూ, నిన్ను సంతృప్తి పరుస్తూ తాము నిరుపమాన, శాశ్వత సుఖానుభవమును పొందుతున్నారు.

34 వ శ్లోకము.  
శరీరం త్వం శంభోశ్శశిమిహిరవక్షోరుహయుగం
తవాత్మానం మన్యే భగవతి నవాత్మానమనఘమ్ |
అతశ్శేషశ్శేషీత్యయముభయసాధారణతయా
స్థితస్సంబంధో వాం సమరసపరానందపరయోః  || 
చం.  శివునకు దేహమీవెగ, ప్రసిద్ధిగ నీవల సూర్య చంద్రులన్
గవలిగ వక్షమందుఁ గల కాంతవు, నిన్ శివుఁడంచు నెంచినన్
బ్రవిమల శేషి యా శివుఁడు, వర్ధిలు శేషము నీవె చూడగా,
భవుఁడు పరుండు, నీవు పరభవ్యుని సంతసమమ్మరో! సతీ! ॥ 34 ॥
ప్రతిపదార్థము.  
భగవతి = ఓ భగవతీ ! 
శంభోః = శంభునకు, 
త్వం = నీవు, 
శశి మిహిర = చంద్రుడు, సూర్యుడు, 
వక్షోరుహయుగం = స్తనముల జంటగా గలిగిన, 
శరీరం = దేహముగల దానివి, 
తవ = నీ యొక్క, 
ఆత్మానం = దేహమును, 
అనఘమ్‌ = దోషము లేని, 
నవాత్మానం = నవవ్యూహాత్మకుడగు శివానంద భైరవునిగా, 
మన్యే = తలంచుచున్నాను. 
అతః = ఈ కారణమువలన, 
శేషః = గుణముగా నుండునది, అనగా - ఆధేయమై వుండు అప్రధానము, 
శ్లేషీ = ఆధారమై వుండు ప్రధానము, 
ఇతి = అను 
అయం = ఈ, 
సంబంధః = సంబంధము, 
సమరస = సామ్య సామరస్యములతో గూడిన, 
పరానంద = ఆనందరూపుడైన ఆనంద భైరవుడు, 
పరయోః = ఆనంద రూపమైన భైరవీరూపులుగా, 
వాం = మీ, 
ఉభయ = ఇరువురకు, 
సాధారణ తయా = సామ్యము సామాన్యమై, 
స్థితః = ఉండుట అన్నది ధ్రువమై చెల్లుతున్నది. 
భావము. 
ఓ భగవతీ! నవాత్మకుఁడయిన శంభునకు సూర్యచంద్రులు వక్షోరుహములుగా గల నీవు శరీరమగుచున్నావు. కాబట్టి అతడు శేషి (ప్రధానము) నీవు శేషము (అప్రధానము) అగుచున్నారు. ఆయన పరుడు. నీవు పరానందము. మీ ఇద్దరికిని ఉభయ సాధారణమైన సంబంధము కలద
ని తోచుచున్నది.

35 వ శ్లోకము.  
మనస్త్వం వ్యోమ త్వం మరుదసి మరుత్సారథిరసి
త్వమాపస్త్వం భూమిస్త్వయి పరిణతాయాం న హి పరమ్ |
త్వమేవ స్వాత్మానం పరిణమయితుం విశ్వ వపుషా
చిదానందాకారం శివయువతి భావేన బిభృషే || 
సీ.  ఆజ్ఞా సుచక్రాన నల మనస్తత్త్వమై, యలవిశుద్ధినిజూడ నాకసముగ,
వరలనాహతమున వాయుతత్త్వంబుగా, జలముగా మణిపూర చక్రమందు,
నరయ స్వాధిష్ఠాన నగ్నిగా నీవెయై, యరయ మూలాధారమందుఁ బృథ్వి
గను నీవె యుంటివి, ఘనముగా సృష్టితోఁ బరిణమింపఁగఁ జేయ వరలు నీవె
తే.గీ.  స్వస్వరూపమున్ శివునిగా సరగునఁ గని
యనుపమానంద భైరవునాకృతి గను
ధారణను జేయుచున్ సతీ! స్మేర ముఖిగ
నుండి భక్తులన్ గాచుచు నుందువమ్మ. ॥ 35 ॥
ప్రతిపదార్థము.  
హే శివయువతీ ! = ఓ శివుని ప్రియురాలా! 
మనః = ఆజ్ఞాచక్రము నందలి మనస్తత్వము, 
త్వం + ఏవ = నీవే 
అసి = అగుచున్నావు, 
వ్యోమ = విశుద్ధి చక్రమునందలి ఆకాశ తత్త్వము, 
మరుత్‌ = అనాహత చక్రమందలి వాయుతత్త్వము, 
మరుత్సారధిః = స్వాధిష్టాన చక్రము నందలి వాయు సఖుడైన అగ్ని తత్త్వము, 
ఆపః = మణిపూర చక్రమందలి జలతత్త్వము, 
భూమిః = మూలధార చక్రము నందలి భూతత్త్వము కూడా, 
త్వం ఏవ = నీవే 
అసి = అగుచున్నావు, 
త్వం = నీవు, 
పరిణతాయాం = తదాత్మతను పొందించుటకు, 
నహిపరం = నీ కంటె ఇతరమగు నది కొంచెము కూడా లేదు. 
త్వం ఏవ = నీవే 
స్వ + ఆత్మానం = స్వస్వరూపమును, 
విశ్వవపుషా = ప్రపంచ రూపముతో, 
పరిణమయితుం = పరిణమింప చేయుటకు, 
చిత్‌ + ఆనంద + ఆకారం =చిచ్ఛక్తియుతుడైన ఆ ఆనంద భైరవుని, లేదా - శివతత్త్వమును, 
శివయువతి భావేన = శివయువతి భావముచేత, 
బిభృషే= భరించుచున్నావు.  
భావము. 
ఓ శివుని ప్రియురాలైన జగజ్జననీ! ఆజ్ఞా చక్రమందలి మనస్తత్వము, విశుద్ధియందలి ఆకాశతత్త్వము, అనాహత మందలి వాయుతత్త్వము, స్వాధిష్ఠాన మందలి అగ్నితత్త్వము, మణిపూరమందలి జలతత్త్వము, మూలాధార మందలి భూతత్త్వము గూడా నీవే అయి వున్నావు. ఈ విధముగా పంచభూతములు నీవే అయినపుడు ఇంక ఈ విశ్వమందు నీ కంటె ఇతరమైన పదార్ధము ఏదియు కొంచెము కూడా వుండదు, ఉండలేదు. నీవే నీ స్వరూపమును జగదాకారముగ పరిణమింప చేయుటకు చిచ్ఛక్తియుతుడైన ఆనందభైరవుని స్వరూపమును లేదా శివతత్త్వమును నీ చిత్తముతో ధరించుచున్నావు.

36 వ శ్లోకము.  
తవాజ్ఞా చక్రస్థం తపన శశికోటి ద్యుతిధరం
పరం శంభుం వందే పరిమిలిత పార్శ్వం పరచితా |
యమారాధ్యన్ భక్త్యా రవి శశి శుచీనా మవిషయే
నిరాలోకే ఽలోకే నివసతి హి భాలోక భువనే || 
సీ.  నీకు చెందినదైన నిరుప మాజ్ఞాచక్ర మది రవి శశికాంతు లలరునట్టి
పరమచిచ్ఛక్తిచే నిరువైపులందునన్ గలిగిన పరుఁడైన కాలగళునిఁ
జేరి చేసెద నతుల్, గౌరీపతిని భక్తి నారాధనము చేయు ననుపముఁడగు
సాధకుండిద్ధరఁ జక్కగా రవిచంద్ర కాంతికిన్ గనరాక, కానబడక
తే.గీ.  బాహ్యదృష్టికి, నేకాంత భాసమాన
గణ్యమౌ సహస్రారమన్ కమలమునను
నిరుపమానందుఁడై యొప్పి మురియుచుండు
నమ్మ! నీ దయ నాపైనఁ గ్రమ్మనిమ్ము. ॥ 36 ॥
ప్రతిపదార్థము.  
హే భగవతి! = ఓ తల్లీ!
తవ = నీ సంబంధమైన, 
ఆజ్ఞా చక్రస్థమ్ = ఆజ్ఞాచక్రము నందున్న వాడును, 
తపన శశి = కోటి సూర్య చంద్రుల 
కోటి = కాంతి వంటి
ద్యుతిధరం = కాంతి ధరించినవాడును, 
పరచితా = పరి మగు చిచ్చక్తి చేత; 
పరిమిళిత పార్శ్వం = ఆవరింపఁబడిన ఇరు పార్శ్వములు కలవాడును, 
పరం = పరమును అయిన, 
శంభుం = శంభుని గూర్చి, 
వందే = నమస్కరించుచున్నాను. 
యం = అట్టి ఏ పరమశివుని, 
భక్త్యా = భక్తితో, 
ఆరాధ్యన్‌ = పూజించుచు ప్రసన్నునిగా చేసుకొను సాధకుడు, 
రవిశశి శుచీనాం = రవిచంద్రాగ్నులకు, 
అవిషయే = అగోచరమైనదియు, 
నిరాలోకే = బాహ్యదృష్టికి అందరానిదియు, 
అలోకే = జనము లేని ఏకాంత మైనుటవంటిదియునైన, 
భాలోక భువనే = వెలుగుల లోకమునందు (సంపూర్ణముగా వెన్నెల వెలుగులతో నిండిన లోకవుందు, అనగా - సహస్రారకవములము నందు) 
నివసతివా = వసించును. అనగా - నీ సాయుజ్యమును పొందును అని అర్థము. 
భావము. 
ఓ జగజ్జననీ! నీకు సంబంధించినదైన ఆజ్ఞాచక్రము నందు- కొన్ని కోట్ల సూర్య, చంద్రుల కాంతిని ధరించిన వాడును, “పర”యను పేరు పొందిన చిచ్చక్తిచేత కలిసిన, ఇరు పార్శ్యములు కలవాడును అగు పరమశివునికి నమస్కరించుచున్నాను. ఏ సాధకుడు భజనతత్పరుడై ఇట్టి పరమ శివుని ప్రసన్నునిగా చేసుకొనునో- అతడు రవిచంద్రాగ్నులకు సైతం వెలిగించడానికి వీలుకానటువంటిది, బాహ్యదృష్టికి గోచరింపనిది అయిన నీ సాయుజ్యమును పొందును.

37 వ శ్లోకము.  
విశుద్ధౌ తే శుద్ధస్ఫటిక విశదం వ్యోమ జనకం
శివం సేవే దేవీమపి శివసమాన వ్యవసితామ్ |
యయోః కాంత్యా యాంత్యాశ్శశికిరణ సారూప్యసరణేః
విధూతాంతర్ధ్వాంతా విలసతి చకోరీవ జగతీ || 
ఉ.  నీదు విశుద్ధి చక్రమున నిర్మలమౌ దివితత్త్వ హేతువౌ
జోదుగ వెల్గు నాశివుని, శోభిలుచుండెడి నిన్నుఁ గొల్చెదన్,
మోదమునొప్పు మీ కళలు పూర్ణముగా లభియింపఁ వీడెడున్
నాదు తమిస్రమున్, మదిననంత మహాద్భుత కాంతినొప్పెదన్. ॥ 37 ॥
ప్రతిపదార్థము.
హే భగవతి! = ఓ తల్లీ!
తే = నీ యొక్క, 
విశుద్ధౌ = విశుద్ధ చక్రము నందు, 
శుద్ధ = దోషము లేని 
స్ఫటిక = స్ఫటిక స్వచ్ఛతతో 
విశదం = మిక్కిలి నిర్మలమైన వాడును,  
వ్యోమ =ఆకాశతత్త్వమును 
జనకం = ఉత్పాదించు వాడును అగు, 
శివం = శివునిని, 
శివ = శివునితో 
సమాన = సమానమైన 
వ్యవసితాం = సామర్థ్యము గల,  
దేవీం అపి = భగవతి ఐన నిన్నుగూడ, 
సేవే = ఉపాసించెదను, 
యయోః = ఏ శివాశివుల నుండి,  
యాంత్యాః = వచ్చుచున్నదైన, 
శశికిరణ = చంద్రకిరణముల 
సారూప్య = పోలికయొక్క, 
సరణేః = పరిపాటి కల,
కాంత్యా = కాంతివలన, 
జగతీ = లోకము,
విధూత = వదలగొట్ట బడిన 
అంతః + ధ్వాంతా = ఆత్మలోనుండు అజ్ఞానమను చీకటి గలదై, 
చకోరీ + ఇవ = ఆడ చకోర పక్షివలె, 
విలసతి = ప్రకాశించుచున్నది - (అనగా - అట్టి శివాశివులను సేవించెదను అని భావము.) 
భావము. 
ఓ జగజ్జననీ! నీ విశుద్ధి చక్రము నందు దోషరహితమైన స్ఫటిక స్వచ్ఛతతో మిక్కిలి నిర్మలమై వుండు వాడు, ఆకాశోత్పత్తికి హేతువైన వాడు అగు శివునిని, అట్టి శివునితో సమానమైన దేవివైన నిన్ను గూడా ఉపాసించుచున్నాను. చంద్రకాంతులతో సాటి వచ్చు మీ ఇరువురి కాంతులు క్రమ్ముకొనుటచే, ఈ సాధక లోకము- అజ్ఞానము నుండి తొలగి, ఆడు చకోర పక్షివలె ఆనందించును.

38 వ శ్లోకము.  
సమున్మీలత్ సంవిత్కమల మకరందైక రసికం
భజే హంసద్వంద్వం కిమపి మహతాం మానస చరం |
యదాలాపాదష్టాదశ గుణిత విద్యాపరిణతిః
యదాదత్తే దోషాద్ గుణమఖిలమద్భ్యః పయ ఇవ || 
తే.గీ.  జ్ఞాన సుమ మధువును గోరు, కరుణనొప్పు
యోగులగువారి మదులలోనుండు, మంచి
నే గ్రహించు హంసలజంటనే సతంబు
మదిని నినిపి కొల్చెదనమ్మ! మన్ననమున. ॥ 38 ॥
ప్రతిపదార్థము.  
హే భగవతి! = ఓ తల్లీ!
యత్‌ = ఏ హంసమిథునము యొక్క 
ఆలాపాత్‌ = సంభాషణ వలన, 
అష్టాదశ గుణిత = పదునెనిమిది సంఖ్యగా చెప్పబడిన, 
విద్యా పరిణతిః = విద్యల యొక్క పరిణతి కలుగునో, 
యత్‌ = ఏ హంసల జంట, 
దోషాత్‌ = అవలక్షణముల నుండి, 
గుణం అఖిలం = సమస్తమైన సద్గుణ సముదాయమును, 
అద్భ్యః = నీళ్ళనుండి, 
పయః ఇవ = పాలను వలె, 
ఆదత్తే = గ్రహించుచున్నదో. 
సమున్మీలత్‌ = వికసించుచున్న, 
సంవిత్‌ = జ్ఞానము అను 
కమల = పద్మము నందలి, 
మకరంద = తేనెయందు మాత్రమే,  
ఏకరసికం = ముఖ్యముగా ఇష్టపడునదియో, 
మహతాం = యోగీశ్వరుల యొక్క, 
మానస =మనస్సులలో (మానస సరోవరము నందు) 
చరం = చరించునదియో,  
కిమపి = ఇట్టిదని చెప్పుటకు వీలులేని, 
హంస ద్వంద్వం = ఆ రాజహంసల జంటను, 
భజే = సేవించెదను, 
భావము. 
ఓ జగజ్జననీ! అనాహత జ్ఞాన కమలము నందలి తేనెను మాత్రమే గ్రోలుట యందు ఆసక్తి కలిగినది, యోగీశ్వరుల మానస సరోవరములందు విహరించునది, నీరమును విడిచి పాలను మాత్రమే గ్రహించు సామర్థ్యము గలది, దేనిని భజించినచో అష్టాదశ విద్యలు చేకూరునో- అట్టి అనిర్వచనీయమైన శివశక్తులనే రాజహంసల జంటను ధ్యానించి భజించుచున్నాను.

39 వ శ్లోకము.  
తవ స్వాధిష్ఠానే హుతవహ మధిష్ఠాయ నిరతం
తమీడే సంవర్తం జనని మహతీం తాం చ సమయామ్ |
యదాలోకే లోకాన్ దహతి మహతి క్రోధ కలితే
దయార్ద్రా యా దృష్టిః శిశిర ముపచారం రచయతి || 
సీ.  నీదు స్వాధిష్ఠాన నిరుపమ చక్రాన నగ్ని తత్త్వంబున నమరియుండు
నగ్నిరూపుండైన యాశివున్ స్తుతియింతు, సమయ పేరునఁ గల సన్నుత మగు
మహిమాన్వితంబైన మాతృస్వరూపిణీ! నిన్నునున్ దలచుచు సన్నుతింతు
నేకాగ్రతను జేయు నీశుని ధ్యానాగ్నినల లోకములు కాలుననెడియపుడు
తే.గీ.  నీదు కృపనొప్పు చూడ్కులు నిరుపమాన
పూర్ణ శశిచంద్రికలె యార్పు పూర్తిగాను,
లోకములనేలు జనని! సులోచనాంబ! 
నన్ను వీక్షింపు కృపతోడ మిన్నగాను. ॥ 39 ॥
ప్రతిపదార్థము.  
హే భగవతి! = ఓ తల్లీ!
తవ = నీ యొక్క, 
స్వాధిష్ఠానే = స్వాధిష్ఠాన చక్రమందలి, 
హుతవహం = అగ్నితత్త్వమును, 
అధిష్ఠాయ = అధిష్ఠించి, 
నిరతం = ఎల్లపుడు (వెలుగొందు) 
సంవర్తమ్‌ = “సంవర్తము” అను అగ్ని రూపములో ప్రకాశించు 
తం = ఆ పరశివుని, 
ఈడే = స్తుతించెదను, 
సమయాం = సమయము అను పేరుగలదైన, 
మహతీం = మహిమాన్వితమైన, 
తాంచ = సంవర్తాగ్ని రూపమైన నిన్ను గూడ, 
ఈడే = స్తుతించెదను, 
మహతి = మిక్కిలి గొప్పదై, 
క్రోధ = క్రోధముతో 
కలితే = కూడినదైన, 
యత్‌ = సంవర్తాగ్నిరూపుడైన ఏ  పరమేశ్వరుని యొక్క, 
ఆలోకే = వీక్షణము, 
లోకాన్‌ = లోకములను, 
దహతి = దహించునది అగుచుండగా, 
యా = ఏదైతే, 
దయార్ద్రా = కృపకలిగిన, 
దృష్టిః = చూపు ఉన్నదో ఆ నీ చూపు, 
శిశిరం = శీతలమున, 
ఉపచారం = ఉపశమనమును,
రచయితి = కావించుచున్నది. 
భావము. 
తల్లీ! నీ స్వాధిష్ఠాన చక్రంలో అగ్ని తత్త్వాన్ని అధిష్టించి, నిరంతరం వెలిగే సదాశివుడిని నిత్యం స్మరిస్తాను. అలాగే ‘సమయ‘ అనే పేరు కలిగిన, చల్లని దయార్ద్రపూరిత దృష్టి గల నిన్ను స్తుతిస్తాను. ఎందుకంటే మహత్తరము, అద్భుతము అయిన పమశివుని క్రోధాగ్ని దృష్టి భూలోకాదులను దహించగా, నీవు నీ దయతో కూడిన చల్లని చూపులతో- లోకాలన్నింటికీ ఉపశమనము కలుగజేసి సంరక్షిస్తున్నావు.

40 వ శ్లోకము.  
తటిత్వంతం శక్త్యా తిమిర పరిపంథిస్ఫురణయా  
స్ఫురన్నానారత్నాభరణ పరిణద్ధేంద్రధనుషమ్ |
తవ శ్యామం మేఘం కమపి మణిపూరైక శరణం
నిషేవే వర్షంతం హరమిహిర తప్తం త్రిభువనమ్ || 
సీ.  మణిపూర చక్రమే మహిత వాసమ్ముగాఁ గలిగి చీకటినట వెలుఁగునదియు,
కలిగిన శక్తిచే వెలుఁగు లీనునదియు, వెలుఁగులీనెడి రత్న ములను గలిగి
యున్న యింద్రధనువు నొప్పుచు, జగతిని శివరవి తప్తమౌ చిక్కుచున్న
ముల్లోకములకును బూర్ణ వృష్టి నొసఁగు మేఘరూప శివుని మేలు గొలుతు.
తే.గీ.  అమ్మ! నీ దివ్య రూపంబు కమ్మగాను
వర్ణనము చేయు శక్తితోఁ బరగనిమ్మ!
నమ్మి నినుఁ గొల్చుచుంటినోయమ్మ నేను,
ముక్తి మార్గంబుఁ జూపుమా, భక్తిఁ గొలుతు. ॥ 40 ॥
ప్రతిపదార్థము.  
హే భగవతి! = ఓ తల్లీ!
తవ = నీ యొక్క, 
మణిపూర = మణిపూరక చక్రమే, 
ఏక శరణం = ముఖ్య నివాసముగా గలదియు, 
తిమిర = ఆ మణిపూర చక్రమున పొందిన చీకటికి,
పరిపంథి = శత్రువై; 
స్ఫురణయా = ప్రకాశించునట్టి, 
శక్త్యా = శక్తి చేత, 
తటిత్వంతం = మెఱుపు గలదియు,  
స్ఫురత్‌ = ప్రకాశించుచున్న, 
నానారత్న = వివిధములైన రత్నముల చేత నిర్మింపబడిన, 
ఆభరణ = నగలచేత, 
పరిణద్ధ = కూర్చబడిన, 
ఇంద్రధనుషం = ఇంద్రధనుస్సు గలదియు, 
శ్యామం = నీలి వన్నెలు గలదియు, 
హర మిహిర తప్తం = శివుఁడను సూర్యునిచే దగ్ధమైన, 
త్రిభువనం = మూడు లోకములను గూర్చి, 
వర్షంతం = వర్షించునదియు, 
కం అపి = ఇట్టిది అని చెప్పడానికి వీలుకాని, 
మేఘం = మేఘస్వరూపముననున్న శివుని, 
నిషేవే = చక్కగా సేవించెదను.  
భావము. 
అమ్మా ఓ భగవతీ! నీ మణిపూర చక్రమే నివాసముగా గలిగి, ఆ మణిపూర చక్రమును ఆక్రమించి యుండు చీకటికి శత్రువై ప్రకాశించునట్టి మెరుపుశక్తిని గలిగి, వివిధ రత్నముల చేత తయారు చేయబడిన నగల చేత కూర్చబడిన ఇంద్రధనుస్సును గలిగి, నీలి వన్నెలు గలిగిన హరుడను సూర్యునిచే దగ్ధమైన మూడు లోకములకు- తాపము నుండి ఉపశమనముగా వర్షించునది, ఇంతటిది అని చెప్పనలవి కానిదీ అయిన – మేఘమును, మేఘ స్వరూపములోనున్న శివుని సేవించుచున్నాను.

41 వ శ్లోకము.  
తవాధారే మూలే సహ సమయయా లాస్యపరయా
నవాత్మానం మన్యే నవరస మహాతాండవ నటమ్ |
ఉభాభ్యా మేతాభ్యాముదయ విధి ముద్దిశ్య దయయా
సనాథాభ్యాం జజ్ఞే జనక జననీమత్ జగదిదమ్ || 
సీ.  నీదు మూలాధార నిర్మల చక్రాన సమయ యనెడి గొప్ప శక్తిఁ గూడి
ప్రవర శృంగారాది నవరసమ్ములనొప్పు నానంద తాండవమమరఁ జేయు
నిన్ను నేను నవాత్ముని సతతానందభై రవుని దలంచెద, ప్రళయ దగ్ధ
లోకాల సృజనకై శ్రీకరముగఁ గూడి యిటులొప్పు మీచేత నీ జగమ్ము
తే.గీ.  తల్లిదండ్రులు కలదిగాఁ దలతు నేను,
లోకములనేలు తలిదండ్రులేకమగుచు
దివ్యదర్శనభాగ్యమీ దీనునకిడ
వేడుకొందును, నిలుడిల నీడవోలె. ॥ 41 ॥
ప్రతిపదార్థము.  
హే భగవతి! = ఓ తల్లీ!
తవ = నీ యొక్క, 
మూలే ఆధారే = మూలాధార చక్రమునందు, 
లాస్యపరయా = నృత్యాసక్తిగల, 
సమయయా సహ = “సమయకళ” అను శక్తి గూడ, 
నవ = తొమ్మిది, 
రస = శృంగారాదిరసముల చేత, 
మహత్‌ = అద్భుతమైన, 
తాండవ = నాట్యమునందు, 
నటమ్ = అభినయించువాడైనవానిని, 
నవ + ఆత్మానం = తొమ్మిది రూపులుగల ఆనందభైరవునిగా, మన్యే = తలచెదను, 
ఉదయవిధిం = జగదుత్పత్తి కార్యమును, 
ఉద్దిశ్య = ఉద్దేశించి, 
ఏతాభ్యాం = ఈ, 
ఉభాభ్యాం = ఇరువురి చేత (అనగా - ఆనందభైరవ మహాభైరవుల చేత), 
దయయా = (ప్రళయాగ్నికి దగ్ధమైన లోకములను మరల నుత్పత్తి చేయుట యందు) కరుణతో, 
సనాథాభ్యాం = ఇరువురి కలయిక చేత, 
ఇదంజగత్‌ = ఈ జగత్తు, 
జనక జననీమత్‌ = తండ్రియు తల్లియు గలదిగా 
జజ్ఞే = అయినది.  
భావము. 
ఓ తల్లీ! నీ యొక్క మూలాధార చక్రమునందు లాస్యాసక్తిగల, “సమయకళ” అను పేరుగల శక్తి గూడ, తొమ్మిది శృంగారాదిరసముల చేత అద్భుతమైన తాండవమునందు అభినయించువాడైనవానిని తొమ్మిది రూపులుగల ఆనందభైరవునిగా తలచెదను. జగదుత్పత్తి కార్యమును ఉద్దేశించి, ఈ ఇరువురి చేత (అనగా - ఆనందభైరవ మహాభైరవుల చేత) (ప్రళయాగ్నికి దగ్ధమైన లోకములను మరల నుత్పత్తి చేయుట యందు) కరుణతో, ఇరువురి కలయిక చేత ఈ జగత్తు తండ్రియు తల్లియు గలదిగా అయినది. 

42 వ శ్లోకము.  
గతైర్మాణిక్యత్వం గగనమణిభిస్సాంద్రఘటితం
కిరీటం తే హైమం హిమగిరిసుతే కీర్తయతి యః ||
స నీడేయచ్ఛాయా చ్ఛురణ శబలం చంద్ర శకలం
ధనుశ్శౌనాసీరం కిమితి న నిబధ్నాతి ధిషణామ్ || 
సీ.  హిమగిరి నందినీ! సముచితముగ సూర్యులందరిన్ మణులుగ పొందఁబడిన
నీ స్వర్ణమకుటమున్ నియతితోఁ గీర్తించునెవ్వండతండిల నెంచకున్నె
ద్వాదశాదిత్యుల వరలెడు మణికాంతి సోకుచు నొప్పెడి సోముని గని
యింద్ర ధనుస్సుగా, సాంద్రకృపాంబ! తత్ కల్యాణతేజంబు ఘనతరంబు.
తే.గీ. నీ కిరీటంబు తేజంబు నే దలంచి
యాత్మలోఁ దృప్తినందెదనమ్మ కృపను
నీవు నామదిలోననే నిలిచి యుండి
మకుట తేజంబు కననిమ్ము సుకరముగను. ॥ 42 ॥
ప్రతిపదార్థము.  
హీమగిరిసుతే ! = ఓ పార్వతీ, 
మాణిక్యత్వం = మానికములగుటను, 
గతైః = పొందిన, 
గగనమణిభిః = ఆదిత్యుల చేత, 
సాంద్రఘటితం = దగ్గర దగ్గరగా కూర్చడిన, 
హైమం = బంగారముతో నిర్మింపబడిన, 
తే = నీ యొక్క, 
కిరీటం = కిరీటమును, 
యః = ఎవఁడు
కీర్తయతి = కీర్తించునో, 
సః = అతడు 
నీడేయ = కుదుళ్ల యందు బిగింపఁబడిన నానా
రత్నములయొక్క, 
ఛాయా = కాంతి, 
ఛురణ = ప్రసారము చేత, 
శబలం = చిత్ర వర్ణము గల, 
చంద్ర శకలం = చంద్రరేఖను, 
శౌనాసీరం = ఇంద్ర సంబంధమైన, 
ధనుః ఇతి = ధనుస్సు అని, 
ధిషణాం = (అతని) ఊహను, 
కిం ననిబధ్నాతి= ఎందుకు చేయఁడు? చేయునని భావము.  
భావము. 
అమ్మా! హిమగిరితనయా! పన్నెండుగురు సూర్యులు మణులుగా ఏర్పడి పొదగబడిన నీ బంగారు కిరీటమును వర్ణించు కవి ఆ కాంతులు నానా విధములుగా వ్యాపించి యున్న నీ శిరము మీది చంద్రకళను చూచి “ఇది ఏమి ఇంద్రధనుస్సా” అని సందేహపడగలఁడు.

43 వ శ్లోకము.  
ధునోతు ధ్వాంతం నస్తులిత దలితేందీవర వనం
ఘనస్నిగ్ధ శ్లక్ష్ణం చికుర నికురుంబం తవ శివే |
యదీయం సౌరభ్యం సహజముపలబ్ధుం సుమనసో
వసంత్యస్మిన్ మన్యే బలమథన వాటీ విటపినామ్ || 
తే.గీ.  నల్లకలువలన్, మేఘమునల్లఁ బోలు
శ్లక్ష్ణమగు స్నిగ్ధమగు కురుల్ చక్కగాను
మాదు మదులలోఁ జీకటిన్ మాపు, కల్ప
కుసుమములు వాసనలు పొందఁ గోరి నీదు
కురుల వసియించె నని దల్తు గుణనిధాన! ॥ 43 ॥
ప్రతిపదార్థము.  
శివే! = ఓ పార్వతీ!, 
తులిత = పోల్చఁబడిన
దలిత = వికసించిన, 
ఇందీవరవనం = నల్లకలువల తోట,
ఘన = (నల్లని) మేఘము వంటి,
స్నిగ్ధ = మెఱుగైన, చిక్కనైన,
శ్లక్ష్ణం = మృదులమైన
తవ = నీ యొక్క, 
చికుర నికురుంబం = కేశకలాపము
నః = మా యొక్క, 
ధ్వాంతం = అజ్ఞానాంధకారమును, 
ధునోతు = తొలగించుగాక, 
యదీయం = ఏ కేశపాశ సంబంధమైనది కలదో దాని, 
సహజం = స్వభావసిద్దమైన, 
సౌరభ్యం = పరిమళమును, 
ఉపలబ్ధుం = పొందుటకు, 
అస్మిన్‌ = ఈ కేశపాశమందు, 
బలమథన = ఇంద్రుని, 
వాటీ = నందనోద్యానమందలి, 
విటపినాం = కల్పవృక్షముల యొక్క, 
సుమనసః = పుష్పములు, 
వసంతి = నివసించుచున్నవని, 
మన్యే = తలంచెదను.   
భావము. 
ఓ హిమగిరి తనయా! తల్లీ! పార్వతీ దేవీ! అప్పుడే వికసిస్తున్న నల్ల కలువల సమూహంతో సాటియైనది, మేఘమువలె దట్టమై, నునుపై, మెత్తనిది అయిన నీ శిరోజముల సమూహము- మాలోని అజ్ఞానము అనే చీకటిని పోగొట్టుగాక ! నీ కేశములకు సహజంగా ఉన్న సుగంధాన్ని తాము పొందడానికేమో, బలుఁడనే రాక్షసుని చంపిన ఇంద్రుని యొక్క నందనోద్యానములో ఉన్న కల్పవృక్షపు  పుష్పములు, నీకేశ సమూహాన్నిచేరి, అక్కడ ఉంటున్నాయని నేను భావిస్తున్నాను.

44 వ శ్లోకము.  
తనోతు క్షేమం నస్తవ వదనసౌందర్యలహరీ
పరీవాహస్రోత స్సరణిరివ సీమంత సరణిః|
వహంతీ సిందూరం ప్రబలకబరీభార తిమిర
ద్విషాం బృందైర్వందీకృతమివ నవీనార్క కిరణమ్ || 
సీ.  శర్వాణి! నీముఖ సౌందర్య లహరీపరీవాహ దివ్యగిరిస్రవంబుఁ
బోలుచు గొప్పగా పొంగుచు సాగెడి మార్గమా యననొప్పె మహిత గతిని,
యందలి సిందూరమందగించుచు బాల సూర్య కిరణకాంతి సొబగులీని,
కటికచీకటిపోలు కచపాళి రిపులచేఁ జెరబట్టఁ బడినట్లు చిక్కి యచట
తే.గీ.  మెఱయుచుండె నీ సీమంత మరసి చూడ
నట్టి సిందూర సీమంత మమ్మ! మాకు
క్షేమమును గల్గఁ జేయుత, చిత్తమలర
నీదు సాన్నిధ్యమున నన్ను నిలువనిమ్మ. ॥ 44 ॥
ప్రతిపదార్థము.  
హే భగవతి! = ఓ తల్లీ!
తవ = నీ యొక్క, 
వదన = ముఖము యొక్క
సౌందర్య = సౌందర్యపు, 
లహరీ = అలల వెల్లువల యొక్క, 
పరీవాహ = కాలువయందు, 
స్రోతః = నీటి ప్రవాహము వలె పారుచున్న, 
సరణిః ఇవ = దారివలె కనబడు, 
సీమంత సరణిః = నీ పాపట దారి, 
ప్రబల = బలమయిన, 
కబరీభార = (నీ) కురుల మొత్తమనెడి, 
తిమిర = కటిక చీకటి రూపముగా గలిగి యున్న, 
ద్విషాం = శత్రువుల, 
బృందైః = సమూహముచేత, 
బందీకృతం = బందీగా చేయబడిన, 
నవీన + అర్క = ప్రాతః కాలపు సూర్యుని, 
కిరణం = కిరణమువలెనున్న, 
సిందూర = సిందూరపురేఖను, 
వహంతీ = వహించుచున్నదై, 
నః = మాకు; 
క్షేమం = క్షేమమును, 
తనోతు = విస్తరింప చేయుగాక !   
భావము. 
తల్లీ! జగజ్జననీ! నీ ముఖ సౌందర్య ప్రకాశ ప్రవాహము ప్రవహించుటకు వీలుగా నుండు కాలువవలె – నీ పాపట దారి కనబడుచున్నది. ఆ పాపటకు ఇరువైపులా దట్టముగానున్న నీ కురుల సమూహములు – కటికచీకటి రూపముతో ఇరువైపులా బృందములుగా తీరి యున్న శత్రువులవలె కనబడుచుండగా – వాటి మధ్య బందీగా చిక్కబడిన ప్రాతః కాలసూర్య కిరణము వలె – నీ పాపట యందలి సిందూరపు రేఖ భాసించుచున్నది. అట్టి సిందూర రేఖతో నుండు నీ పాపట మాకు నిత్యము శుభ సౌభాగ్య యోగ క్షేమములను విస్తరింపచేయుగాక.

45 వ శ్లోకము.  
అరాళైస్వాభావ్యాదళికలభ సశ్రీభి రలకైః
పరీతం తే వక్త్రం పరిహసతి పంకేరుహ రుచిమ్ |
దరస్మేరే యస్మిన్ దశన రుచి కింజల్క రుచిరే
సుగంధౌ మాద్యంతిస్మరదహన చక్షుర్మధులిహః || 
సీ.  స్వాభావికంబుగా వంకరలౌ తుమ్మెదలవంటి ముంగురుల్ దర్పమెలర
నందగించెడి నీదు సుందరమగు మోము పంకేరుహంబులన్ బరిహసించుఁ,
జిఱునవ్వుతోఁ గూడు శ్రీకరమగు దంతకాంతి, కేసరకాంతి, ఘనతరమగు
సౌగంధ్య పూర్ణమై చక్కనౌ ముఖమొప్పు నా ముఖపద్మమ్ము నలరియున్న
తే.గీ. సుందరత్వమున్ గనుచుండి సోమశేఖ
రుని కనులను ద్విరేఫముల్ కనును మత్తు
నట్టి నీ పాదములను నే పట్టి విడువ,
నీదు కృపఁ జూపు మమ్మ! నన్నాదుకొనుమ. ॥  45 ॥
ప్రతిపదార్థము.  
హే భగవతి! = ఓ తల్లీ!
స్వాభావ్యాత్‌ = సహజముగనే, 
అరాళైః = వంకరగానుండు, 
అళికలభ = గండు తుమ్మెదల
స శ్రీభిః = కాంతి వంటి కాంతులు గల, 
అలకైః = ముంగురుల చేత, 
పరీతం = అందముగా తీర్చి దిద్దబడిన, 
తే = నీ యొక్క, 
వక్త్రం = వదనము, 
పంకేరుహ రుచిం = కమలముల యొక్కసొబగును, 
పరిహసతి = తనతో సాటి రాదని ఎగతాళి చేయుచున్నది. 
(కారణమేమనగా) 
దరస్మేరే = వికాస స్వభావముగల లేనగవు గలదై, 
దశన = దంతముల యొక్క, 
రుచి = కాంతులనెడి, 
కింజల్క = కేసరములచే, 
రుచిరే = సుందరమైన, 
సుగంధౌ = సహజ సుగంధముతో ఒప్పారుచునుండు, 
యస్మిన్‌ = ఏ ముఖ పద్మము నందు, 
స్మరదహన = మన్మథుని (తన మూడవ కంటితో) దహించిన శివుని యొక్క, 
చక్షుః మధులిహః = కన్నులు అను తుమ్మెదలు, 
మాద్యంతి = మత్తు గొని ఆనందించుచున్నవో అందువలననే సుమా. 
భావము. 
ఓ జగన్మాతా! సహజంగానే వంకరలు తిరిగినవై, కొదమ తుమ్మెదల కాంతివంటి నల్లని కాంతిని కల్గియున్న ముంగురులతో కూడిన నీముఖము, పద్మ కాంతిని, అందాన్ని పరిహసిస్తూన్నది.  చిరునవ్వుతో వికసించుచున్నది, దంతముల కాంతులు అనే కేసరములచే సుందరమైనది, సువాసన కలది అయిన నీ ముఖపద్మమునందు, మన్మథుని దహించిన శివుని చూపులు అనే తుమ్మెదలు కూడా మోహపడుతున్నాయి.

46 వ శ్లోకము.  
లలాటం లావణ్య ద్యుతి విమలమాభాతి తవ యత్
ద్వితీయం తన్మన్యే మకుటఘటితం చంద్రశకలమ్ |
విపర్యాసన్యాసాదుభయమపి సంభూయ చ మిథః
సుధాలేపస్యూతిః పరిణమతి రాకాహిమకరః || 
శా.  లావణ్యాంచిత సల్లలాట కలనా! శ్లాఘింతునద్దానినే
భావంబందున నర్ధచంద్రుఁడనుచున్ భాసించుటన్ గాంచి, పై
నావంకన్ గల నీ కిరీట శశి వ్యత్యస్తంబుగాఁ గూడుటన్
భావింపన్ సుధ పూతఁబూర్ణ శశిగా భాసించుఁగా శాంభవీ!॥46॥
ప్రతిపదార్థము.  
హే భగవతి! = ఓ తల్లీ!
తవ = నీ యొక్క, 
లలాటం = నుదురు భాగము, 
లావణ్యద్యుతి = సౌందర్యాతిశయకాంతితో, 
విమలం = స్వచ్చమై, 
ఆభాతి = అంతటా ప్రకాశించుచున్నదై, 
యత్‌ = ఏది కలదో 
తత్‌ = దానిని, 
మకుట ఘటితం = కిరీటము నందు కూర్చబడినదైన, ద్వితీయం = రెండవ దైన, 
చంద్రశకలం = చంద్రుని అర్ధఖండముగా, 
మన్యే = ఊహించుచున్నాను. 
యత్‌ = ఏ కారణము వలన, 
ఉభయం అపి = నీలలాటభాగము, ఆ చంద్ర ఖండము - ఈ రెండును, 
విపర్యాసన్యాసాత్‌ = వ్యత్యస్తముగా కలుపుట వలన, 
మిథః = పరస్పరము, 
సంభూయచ = కలసికొని, 
సుధాలేపస్యూతిః = అమృతపు పూత కలిగిన, 
రాకాహిమకరః = పూర్ణిమచంద్రునిగా, 
పరిణమతి = అగుచున్నది. 
భావము. 
తల్లీ! జగజ్జననీ! నీ నుదురు భాగము పవిత్రమైన సౌందర్యాతిశయముతో ప్రకాశించుచున్నది. అట్టి ఈ లలాటభాగము నీ కిరీటమునందు కనబడకుండానున్న చంద్రుని రెండవ అర్ధభాగముగా ఉన్నట్లు ఊహించుచున్నాను. నా ఈ ఊహ నిజమే అయి వుండవచ్చును. కారణమేమనగా నీ లలాట భాగమును ఆ అర్ధచంద్ర భాగమును కలిపినచో అమృతమును స్రవించు పూర్ణచంద్రుని ఆకారమును పొందుచున్నది. ఆ స్రవింపబడు అమృతముతోనే ఆ రెండూ అతకబడినట్లు గూడా కనబడని విధముగా కలసిపోయి, పూర్ణచంద్రుని వలె భాసించుచున్నవి గదా!

47 వ శ్లోకము.  
భ్రువౌ భుగ్నే కించిద్భువన భయ భంగ వ్యసనిని
త్వదీయే నేత్రాభ్యాం మధుకర రుచిభ్యాం ధృతగుణమ్ |
ధనుర్మన్యే సవ్యేతరకర గృహీతం రతిపతేః
ప్రకోష్ఠే ముష్టౌ చ స్థగయతే నిగూఢాంతరముమే || 
తే.గీ.  భువన భయ హర వ్యసన! కన్ బొమలు నీవి
మరుని విల్లు, కనుల్ త్రాడు కరణినొప్పఁ,
బిడికిటనుపట్టి యుండుటన్ వింటిత్రాడు 
మధ్య కనరాని మరువిల్లు మదినిఁ దోచు. ॥ 47 ॥
ప్రతిపదార్థము.  
ఉమే! = ఓ పార్వతీ ! 
భువన = లోకముల యొక్క, 
భయ = ఉపద్రవములను, 
భంగ = నాశము చేయుట యందే, 
వ్యసనిని = ఆసక్తిగలదేవీ! 
త్వదీయే = నీ యొక్క, 
కించిత్‌ = కొద్దిగా 
భుగ్నే = వంగినవి అయిన, 
భ్రువే = కనుబొమలను, 
మధుకర = తుమ్మెదలవంటి 
రుచిభ్యాం = శోభ కలిగినటువంటి,
నేత్రాభ్యాం = కనుదోయిచేతను, 
ధృత = పొందిన 
గుణం = అల్లెత్రాడు గలదై, 
రతిపతేః = మన్మథుని యొక్క,  
సవ్యేతర = ఎడమది అయిన, 
కర = హస్తముచేత, 
గృహీతం = పట్టుకొనబడినదియు, 
ప్రకోష్ఠే = మణికట్టును, 
ముష్టౌచ = పిడికిలియు, 
స్థగయతి = కప్పుచున్నది కాగా, 
నిగూఢ = కప్పబడి చూడబడని వింటినారి, 
అంతరం = వింటి నడిమి భాగము గలదైన, 
ధనుః = విల్లునుగా, 
మన్యే = తలంచుచున్నాను.  
భావము. 
ఓ మాతా! సమస్త లోకాలకు కలుగు ఆపదలనుండి వాటిని రక్షించుటయందే పట్టుదలతో గూడిన ఆసక్తి గల ఓ తల్లీ, ఉమా! కొద్దిగా వంపుగా వంగినట్లున్న నీకనుబొమల తీరు – తుమ్మెదల వంటి శోభను గలిగి, అడ్డముగా వరుసలోనున్న నల్లని కనుదోయిని వింటినారిగా గలిగి – మన్మథుని వామహస్తము యొక్క పిడికిలిచేత నడిమి భాగములో పట్టుబడుటచే కనబడకుండానున్న కొంత నారి భాగమును, దండభాగమును కలిగిన – విల్లుగా అనిపించుచున్నది.

48 వ శ్లోకము.  
అహస్సూతే సవ్యం తవ నయనమర్కాత్మకతయా
త్రియామాం వామం తే సృజతి రజనీనాయకతయా |
తృతీయా తే దృష్టిర్దరదళిత హేమాంబుజ రుచిః
సమాధత్తే సంధ్యాం దివసనిశయోరంతరచరీమ్  || 
తే.గీ.  పగలు కొలుపు నీ కుడికన్ను పరగు రవిని,
రాత్రి నెడమకన్నది కొల్పు రాజుఁ గలిగి,
నడిమి నేత్రమగ్నియగుటన్ నడుపు సంధ్య,
కాలరూపమే నీవమ్మ కమలనయన! ॥ 48 ॥
ప్రతిపదార్థము.  
హే భగవతీ! = ఓ జననీ! 
తవ = నీ యొక్క, 
సవ్యం = కుడివైపున దైన, 
నయనం = కన్ను, 
అర్కాత్మకతయా = సూర్యసంబంధమైన దగుటచేత, 
అహః = పగటిని, 
సూతే = పుట్టించుచున్నది, 
వామం = ఎడమవైపునదైన, 
తే = నీ యొక్క, 
నయనం = కన్ను, 
రజనీ నాయకతయా = చంద్రుడగుటచేత, 
త్రియామాం = రాత్రిని, 
సృజతి = కలిగించుచున్నది. 
దర = కొంచెముగా, 
దళిత = వికసించినదైన, 
హేమాంబుజ = స్వర్ణకమలము యొక్క, 
రుచిం = ప్రకాశము వంటి రంగుగల, 
తే = నీ యొక్క, 
తృతీయా దృష్టిః = లలాటమున నున్న మూడవ కన్ను, 
దివస నిశయోః = పగలు రాత్రి అను వాని యొక్క, 
అంతరచరీ = నడుమ వర్తించు చున్నదైన, 
సంధ్యాం = సాయం ప్రాతః సంబంధమైన సంధ్యల జంటను, 
సమాధత్తే = చక్కగా ధరించుచున్నది.  
భావము. 
అమ్మా! జగజ్జననీ! నీ కుడికన్ను సూర్య సంబంధమైనదగుటచే పగటిని జనింపజేయుతున్నది. నీ యొక్క ఎడమకన్ను చంద్ర సంబంధమైనదగుటచే రాత్రిని పుట్టించుచున్నది. ఎర్రతామరపూవురంగు గల నీ లలాటనేత్రము అహోరాత్రముల నడుమ వర్తించుచూ సాయం పాత్రః కాల సంబంధమైన ఉభయ సంధ్యలను అగ్నిని సూచించు ఎరుపుదనము తన వర్ణ లక్షణముగా గలదని సూచించుట వలన ఈ తృతీయ నేత్రము అగ్ని సంబంధమైనదని గ్రహించబడుతున్నది.

49 వ శ్లోకము.  
విశాలా కల్యాణీ స్ఫుటరుచిరయోధ్యా కువలయైః
కృపాధారాధారా కిమపి మధురాఽఽభోగవతికా |
అవంతీ దృష్టిస్తే బహునగర విస్తార విజయా
ధ్రువం తత్తన్నామ వ్యవహరణ యోగ్యావిజయతే || 
మ.  కరుణాపాంగ! విశాలమై, కనుబొమల్ కల్యాణ కాంతిన్, సతీ!
పరగున్ జూడ నయోధ్యయై కలువకున్, భవ్యకృపాధార సుం
దరధారా మధురాత్మ, భోగవతియై, నా యందవంతీ ధృతిన్,
బరమంబై విజయాష్టపట్టణములన్ భావింపనౌ నీ యెడన్. ॥ 49 ॥
ప్రతిపదార్థము.  
హే భగవతీ! = ఓ అమ్మా!
తే = నీ యొక్క, 
దృష్టిః = చూపు, 
విశాలా = విపులమై, 
కళ్యాణీ = మంగళ స్వరూపమై, 
స్ఫుటరుచిః = స్పష్టకాంతివంతమై, 
కువలయైః = నల్లకలువల చేత, 
అయోధ్యా = జయించుటకు వీలుకానిదై, 
కృపాధారా = కరుణా ప్రవాహమునకు 
ఆధారా = ఆధారమగుచున్నదై,
కిమపి = ఇట్టిదని చెప్పుటకు వీలుకానిదై, 
మధురా = మధురమై, 
ఆభోగవతికా = విశాల దృక్పథము గలదై, 
అవంతీ = రక్షణ లక్షణము గలదై, 
బహునగర = పెక్కుపట్టణముల యొక్క, 
విస్తార = సమూహముయొక్క,
విజయా = విజయము గలదియై,
తత్‌తత్‌ = ఆయా నామ నగరముల పేర్ల చేత, అనగా విశాలా, కళ్యాణీ ' అయోధ్యా, ధారా, మధురా, భోగవతీ, అవంతీ, విజయా - అను ఎనిమిది నగర నామముల చేత, 
వ్యవహరణ = వ్యవహరించుటయందు, 
యోగ్యా = తగినదై, 
విజయతే = విజయవంతమై వర్ధిల్లుచున్నది, 
ధ్రువం = ఇది నిశ్చయము. 
భావము. 
తల్లీ ! జగజ్జననీ ! నీ చూపు
విశాలమై – విశాలయను నగర నామము వ్యవహరించుటకు తగినదియై;
కళ్యాణవంతమై – కళ్యాణీ అనునగర నామ వ్యవహారమునకు యోగ్యమై;
స్పష్టమైన కాంతి గలిగి – నల్ల కలువలు జయించలేని సౌందర్యము కలది అగుచు;
అయోధ్య అను నగరము పేర పిలుచుటకు తగినదై,
కృపారస ప్రవాహమునకు ఆధారవుగుచూ ధారానగర నామముతో వ్యవహరించుటకు తగినదై;
వ్యక్తము చేయ వీలులేని మధుర మనోజ్ఞమగుచు – మధురానగర నామముతో పిలుచుటకు అర్హమై;
విశాలము, పరిపూర్ణ దృక్పథమును గలుగుచు – భోగవతీ నగర నామముతో వ్యవహరించటకు తగినదై;
రక్షణ లక్షణము కలిగి – అవంతీ నగర నామముతో పిలుచుటకు తగినదై;
విజయ లక్షణముతో- విజయనగర నామముతో వ్యవహరింప తగినదై –
ఈ విధమైన ఎనిమిది లక్షణములతో ఎనిమిది నగరముల పేర వ్యవహరించుటకు తగినదై – సర్వోత్కర్షత చేత స్వాతిశయముతో వర్తించుచున్నది.

50 వ శ్లోకము.  
కవీనాం సందర్భ స్తబక మకరందైక రసికం
కటాక్ష వ్యాక్షేప భ్రమరకలభౌ కర్ణయుగలమ్ |
అముంచంతౌ దృష్ట్వా తవ నవరసాస్వాద తరళౌ
అసూయా సంసర్గా దళికనయనం కించిదరుణమ్ || 
చం.  కవుల కవిత్వసన్మధువు కమ్మగ ప్రీతిని గ్రోలనెంచియున్, 
జెవులను వీడనట్టివియు, శ్రీకరమైన సునేత్ర సన్మిషన్,
బ్రవిమల తేజ సద్భ్రమర భాతిని చూచి యసూయఁ జెంది, మూ
డవదగు నేత్ర మెఱ్ఱఁబడె నమ్మరొ నీకు, మనోహరాకృతీ! ॥ 50 ॥
ప్రతిపదార్థము.  
హే భగవతీ! = ఓ జననీ!
కవీనాం = కవుల యొక్క, 
సందర్భ = రసవత్తర రచనలు అనెడి, 
స్తబక = పుష్ప గుచ్ఛము నందలి, 
మకరంద = తేనె యందు (మాత్రమే), 
ఏకరసికం = ముఖ్యముగా ఇష్టపడు, 
తవ = నీ యొక్క, 
కర్ణయుగళం = రెండు చెవులను, 
కటాక్ష= కడగంటి చూపులను, 
వ్యాక్షేప = నెపముగా పెట్టుకొని, 
భ్రమర కలభౌ = గండు తుమ్మెదలు రెండు – 
నవరస = శృంగారాది నవ రసముల యొక్క, 
ఆస్వాద = ఆస్వాదమునందు, 
తరళౌ = అత్యంతాసక్తి కలిగినవై, 
అముంచంతౌ = ఆ రసాస్వాదనలాంపట్యము చేత (రసాస్వాదన చేయు) నీ వీనుల జంటను విడువలేక యుండుటను, 
దృష్ట్వా = చూచి, 
అలిక నయనం = మూడవదైన నీ లలాట నేత్రము, 
అసూయా సంసర్గాత్‌ = ఈర్ష్య చెందుట వలన, 
కించిత్‌ = = కొంచెము 
అరుణమ్ ఎఱుపు వన్నెగలదైనది, (ఎఱ్ఱబడినది.)  
భావము. 
అమ్మా, ఓ భగవతీ! సుకవీశ్వరుల రసవత్తర రచనలనే పుష్ప గుచ్ఛముల నుండి జాలువారు తేనెయందు మాత్రమే అత్యంతాసక్తిని చూపు నీ యొక్క చెవుల జతను – కడగంటి చూపులు అను నెపముతో నీ రెండు కన్నులు అను గండు తుమ్మెదలు – శృంగారాది నవరసాస్వాదనానుభూతిని పొందుట యందు అత్యంతాసక్తిని కలిగినవై – ఆ రసాస్వాదన లాంపట్యము చేత నీ వీనుల జంటను విడువలేక యుండగా – పైన ఉన్న లలాట నేత్రము చూసి – మిక్కిలిగా అసూయ చెంది, ఎఱుపు వన్నెకలదైనది అనగా “కోపముతో ఎఱ్ఱఁబడినది” అని భావము.

51 వ శ్లోకము.  
శివే శృంగారార్ద్రా తదితరజనే కుత్సనపరా
సరోషా గంగాయాం గిరిశచరితే విస్మయవతీ |
హరాహిభ్యో భీతా సరసిరుహ సౌభాగ్యజయినీ
సఖీషు స్మేరా తే మయి జనని దృష్టిస్సకరుణా || 
ఉ.  సారస నేత్ర! నీ కనులు శర్వునెడన్ గురిపించు దివ్య శృం
గారము, నారడిన్ గొలుపుఁగల్మషులందు, భయానకంబు సం
చార భుజంగ భూషలన, స్వర్ఝరిపైన ననన్యరోషమున్,
గోరుచు నా పయిన్ గరుణ, గోపతి గాథలకద్భుతంబు నా
వీరము పద్మరోచులను, విస్తృత హాసము మిత్రపాళికిన్,
జేరఁగ వచ్చు భక్తులకు శ్రీలను గొల్పుచు నొప్పుచుండెనే. ॥ 51 ॥
ప్రతిపదార్థము.
హే జనని = ఓ జగజ్జననీ! 
తే = నీ యొక్క, 
దృష్టిః = చూపు, 
శివే = సదాశివుని యందు, 
శృంగార = శృంగార రసముచేత 
ఆర్ద్రా = తడుపబడినదియు, 
తత్‌ + ఇతరజనే = ఆ సదాశివుని కంటె ఇతరులైన జనుల విషయమై, 
కుత్సునపరా = ఏవగింపు కలదియు, 
గంగాయాం = సపత్నిగా నెంచఁబడు గంగవిషయమున, 
సరోషా = రౌద్రరసముతో గూడినదియు, 
గిరిశ = శివుని యొక్క, 
చరితే = నడవడి విషయమున, 
విస్మయవతీ = అద్భుత రసము గలదియు, 
హర = శివుడు ధరించిన 
అహిభ్యః = సర్పముల వలన,
భీతా = భయానక రసావేశము గలదియు, 
సరసిరుహ = కమలము యొక్క, 
సౌభాగ్య = సౌందర్యమును, 
జయినీ = జయించిన విషయమున వీరరసముతో గూడినదియు, 
సఖీషు = చెలుల యందు, 
స్మేరా = చిఱునగవుతోఁ గూడిన హాస్య రసము గలదియు, 
మయి = నా యందు; 
కరుణా = అనుగ్రహము వలన కరుణ రసము గలిగినదయునయి ఒప్పుచుండెను. 
భావము. 
తల్లీ! జగజ్జననీ! నీ యొక్క చూపు –నీ పతి అయిన శివునియందు శృంగార రసమును,శివేతర జనులయందు అయిష్ట, పరాణ్ముఖత్వములతో బీభత్సరసమును,  గంగ యెడల రోషముతో రౌద్రరసమును,శివుని చరిత్రను వినుచున్నపుడు అద్భుతరసమును,శివుడు ధరించెడి సర్పముల యెడ భయానకరసమును,
ఎఱ్ఱతామర వర్ణ ప్రకాశముల యెడ జయించిన భావము పొడ సూపు వీరరసమును,నీ సఖురాండ్ర యెడల హాస్యరసమును,
నా యెడల కరుణ రసమును,మామూలుగానున్నప్పుడు శాంతరసమును పొందుచు నవరసాత్మకముగా నుండును.

52 వ శ్లోకము.  
గతే కర్ణాభ్యర్ణం గరుత ఇవ పక్ష్మాణి దధతీ
పురాం భేత్తుశ్చిత్తప్రశమరసవిద్రావణ ఫలే |
ఇమే నేత్రే గోత్రాధరపతి కులోత్తంస కలికే
తవాకర్ణాకృష్ట స్మరశర విలాసం కలయతః || 
సీ.  గిరిరాజకన్యకా! పరికింపగా నీదు కర్ణాంతమున్నట్టి కంటి చూపు
మదను నారవబాణ మహిమతోనొప్పుచుఁ ద్రిపురాసురాంతకు దివ్యమతిని
శృంగార భావనల్ చెలగునట్లుగఁ జేయు చున్నదో జగదంబ! మన్ననముగ, 
బలశాలియౌ శివున్ బలహీనునిగఁ జేసె మానసమందున మరులు కొలిపి,
తే.గీ. కరుణకాకరంబైనట్టి కనులు నీవి
భక్తపాళినిఁ గాపాడు శక్తి కలవి,
నేను నీ భక్తుఁడను, గృపన్ నీవు నన్నుఁ
గరుణఁ జూచుచున్ గాపాడు కమల నయన! ॥ 52 ॥
ప్రతిపదార్థము.  
హే గోత్రాధరపతికుల + ఉత్తంస = భూమిని ధరించు పర్వతరాజ వంశమునకు సిగను ధరించు పువ్వు మొగ్గ అయిన, 
కలికే ! = ఓ పార్వతీ! 
ఇమే = ఈ నా హృదయకమలమందు,  
తవ = నీ యొక్క, 
నేత్రే= కన్నులు, 
కర్ణ + అభ్యర్ణం = చెవుల సమీపమును, 
గతే = పొందినవై, 
పక్ష్మాణి = కనుఱెప్ప వెంట్రుకలను, 
గరుత ఇవ = ఈకలవలె, 
దధతీ = ధరించుచున్నవై, 
పురాం = త్రిపురముల యొక్క, 
భేత్తుః = భేదించిన వాడైన శివుని యొక్క, 
చిత్తే = మనస్సునందు, 
ప్రశమ రస = (మనోవికారము పుట్టించుటద్వారా)శాంతమును, 
విద్రావేణ = పారద్రోలుటయే, 
ఫలే = ప్రయోజనముగా గలవియై, 
ఆ కర్ణ = చెవుల వరకు, 
ఆకృష్ట = ఆకర్షింపబడిన, 
స్మర శర = మన్మథుని బాణముల యొక్క, 
విలాసం = సౌభాగ్యమును, 
కలయతః = చేయుచున్నట్లు భాసించుచున్నది. 
భావము. 
భూమిని ధరించు పర్వత రాజైన హిమవంతుని వంశమునకు సిగను ధరించు పూమొగ్గ అయిన ఓ పార్వతీ ! చెవుల వరకూ సాగు నీ కనుఱెప్పల తీరు చూచుచున్నపుడు, నా మనస్సునకు ఈ విధముగా అనిపిస్తున్నది. బాణములకిరు ప్రక్కల కట్టు గ్రద్ద ఈకలవలె నుండు ఱెప్ప వెంట్రుకలతో- చెవుల వరకు సాగు నీ నేత్రములలో – త్రిపుర హరుని మనస్సునకు ప్రాప్తించిన శాంతమైన నిస్పృహను పోగొట్టి, మోహమును కలిగించుటయే ప్రయోజనముగా గలవియై, ఆకర్ణాంతము లాగబడిన – మన్మథుని బాణముల సౌందర్యము గోచరించుచున్నది.

53 వ శ్లోకము.  
విభక్త త్రైవర్ణ్యం వ్యతికరిత లీలాంజనతయా
విభాతి త్వన్నేత్ర త్రితయ మిదమీశానదయితే |
పునః స్రష్టుం దేవాన్ ద్రుహిణ హరి రుద్రానుపరతాన్
రజః సత్వం బిభ్రత్ తమ ఇతి గుణానాం త్రయమివ || 
తే.గీ.  అర్ధవలయ నేత్రత్రయ మమరె నీకు
మూడు వర్ణంబుల లయము పొందినట్టి
బ్రహ్మవిష్ణుమహేశులన్ వరలఁజేయ
త్రిగుణ తేజంబునొప్పెను త్రినయనములు. ॥ 53 ॥
ప్రతిపదార్థము.  
హే ఈశానదయితే= ఓ మహాదేవుని ప్రియురాలా ! 
ఇదం = ఈ కనబడు, 
త్వత్‌ = నీ యొక్క 
నేత్ర త్రితయం = కన్నుల మూడింటి సమూహము,  
వ్యతికరిత = పరస్పర మేళనముగా,  
లీలా = లీలార్థమై పెట్టఁబడిన, 
అంజనతయా = కాటుక గలిగినదగుట చేత, 
విభక్త = వేఱుపరచఁబడిన, 
త్రైవర్ణ్యం = తెలుపు, నలుపు, ఎఱుపు అను మూడు వన్నెలు గలదై, 
ఉపరతాన్‌ = ఆత్మ యందు లీనమైనవారగు, 
ద్రుహిణ హరి రుద్రాన్‌ = బ్రహ్మ, విష్ణు, రుద్రుల ముగ్గుఱగు, 
దేవాన్‌ = దేవులను, 
పునః = మరల, 
స్రష్టుం = సృజించుట కొఱకు, 
రజః = రజోగుణమును, 
సత్త్వం = సత్త్వ గుణమును, 
తమః = తమోగుణమును, 
ఇతి = అను, 
గుణానాం = గుణముల యొక్క, 
త్రయం ఇవ = మూడింటి వలె, 
బిభ్రదివ = ధరించుచున్నట్లు 
విభాతి = ప్రకాశించుచున్నది. 
భావము. 
ఓ సదాశివుని ప్రియురాలా!  నీ మూడు కన్నులు అర్ధవలయాకారముగా తీర్చినవై; లీలా విలాసార్థము ధరించిన కాటుక కలిగినదగుట చేత, ఒక దానితో ఒకటి కలసికొనని తెలుపు, నలుపు, ఎరుపు అను మూడు రంగులు కలదై; గత ప్రళయమునందు తన యందు లీనమైన బ్రహ్మ, విష్ణు, రుద్రులు అను త్రిమూర్తులను మరల మరల విశ్వ సృష్టికొరకు –రజస్సు, సత్త్వము, తమస్సు  అను మూడు గుణములను ధరించు దాని వలె ప్రకాశించుచున్నవి.

54 వ శ్లోకము.  
పవిత్రీకర్తుం నః పశుపతి పరాధీన హృదయే
దయామిత్రైర్నేత్రైరరుణ ధవళ శ్యామ రుచిభిః |
నదశ్శోణో గంగా తపనతనయేతి ధ్రువమయమ్
త్రయాణాం తీర్థానాముపనయసి సంభేదమనఘమ్ || 
శా.  మమ్ముం జేయగ సత్ పవిత్రులుగ నమ్మా! సద్దయార్ద్రంపు శో
ణమ్మున్ శ్వేతము, కృష్ణమున్, గలుగు జ్ఞానంబిచ్చు నీ మూడు నే
త్రమ్ముల్ శోణను, గంగ నా యముననిద్ధాత్రిన్ గృపన్నొక్కెడన్
నెమ్మిన్ మూడగు తీర్థముల్ నిలిపితే, నిన్ గొల్వ నే నేర్తునే? ॥ 54 ॥
ప్రతిపదార్థము.  
పశుపతి పరాధీన హృదయే ! = శివునికి అధీనమైన చిత్తము గల ఓ దేవీ! 
దయామిత్రైః = దయతో గూడిన,
అరుణ ధవళ శ్యామ = ఎఱుపు, తెలుపు, నలుపు అను 
రుచిభిః = కాంతి గలవియైన, 
నేత్రైః= నేత్రముల చేత, 
శోణః నదః = శోణయను పేరు గల నదము, 
గంగా = గంగానది, 
తపన తనయా = సూర్యుని కూతురైన యమున, 
ఇతి= అను, 
త్రయాణాం = మూడుగా నున్న, 
తీర్థానాం = పుణ్యతీర్థముల యొక్క, 
అనఘం = పాపములను పోగొట్టు జలము కలదైన, 
అయం = ఈ, 
సంభేదం = నదీ సంగమ స్థానమును, 
నః = మమ్ములను, 
పవిత్రీకర్తుం = పవిత్రవంతముగా చేయుటకు, 
ఉపనయసి = దగ్గఱకు చేర్చుచున్నావు. 
భావము. 
శివాధీనమైన చిత్తము గల ఓ పార్వతీ! కరుణరసార్ద్రత వలన మృదుత్వమును, ఎరుపు, తెలువు, నలుపు అను మూడు వన్నెల వికాసమునుగల నీ నేత్రత్రయము చేత ఎరుపురంగు నీటితో ప్రవహించు ‘శోణ’యను నదము, తెల్లని నీటితో ప్రవహించు గంగానది, నల్లని నీటితో ప్రవహించు సూర్యపుత్రిక అయిన యమునానది – ఈ మూడు పుణ్య తీర్థములతో పాపములను పోగొట్టి అపవిత్రులను పావనులుగా చేయుటకు – వాటిని త్రివేణీ సంగమ స్థానముగా ఒక చోటకు చేర్చుచున్నావు.

55 వ శ్లోకము.  
నిమేషోన్మేషాభ్యాం ప్రలయముదయం యాతి జగతీ
తవేత్యాహుస్సంతో ధరణిధరరాజన్యతనయే
త్వదున్మేషాజ్జాతం జగదిదమశేషం ప్రలయతః
పరిత్రాతుం శంకే పరిహృతనిమేషాస్తవ దృశః  || 
కం.  నీ కనులు మూసి తెరచిన 
లోకమె ప్రళయంబునకును లోనగునమ్మా!
లోకప్రళయము నిలుపన్
నీ కనులను మూయవీవు నిత్యముగ సతీ! ॥ 55 ॥
ప్రతిపదార్థము.  
ధరణి ధర రాజన్యతనయే ! = ఓ పర్వతరాజపుత్రివైన ఓ పార్వతీ! 
తవ = నీ యొక్క, 
నిమేష + ఉన్మేషాత్ = కంటి ఱెప్పలు మూయుట చేతను, తెఱచుట చేతను, 
జగతీ = జగత్తు, 
ప్రళయం = ప్రళయమును, 
ఉదయం = ఉద్భవమును, 
యాతి = పొందును అని, 
సంతః = సత్పురుషులు, 
ఆహుః = చెప్పుదురు, 
అతః = ఇందువలన, 
త్వత్‌ = ఆ, 
ఉన్మేషాత్‌ = నీ కంటీ టెప్పలు తెరుచుట వలన, 
జాతం = ఉద్భవించిన, 
అశేషం = సమస్తమైన, 
ఇదం జగత్ = ఈ జగత్తును, 
ప్రళయతః = ప్రళయము నుండి, 
పరిత్రాతుం = రక్షించుట కొఱకు, 
తవ = నీ యొక్క, 
దృశః = కన్నులు, 
పరిహృత నిమేషాః = తిరస్కరించిన రెప్పపాటులు గలవి, 
ఇతి = అని, 
శంకే = తలంచుదును.
భావము. 
పర్వతరాజపుత్రికా, ఓ పార్వతీ ! నీ కనురెప్పలు మూసికొనుట చేత జగత్తుకు ప్రళయమును, రెప్పలు తెఱచుకొనుట చేత జగత్తుకు సృష్టియు ఉద్భవించునని సత్పురుషులు చెప్పుదురు. అందువలన నీ కనురెప్పలు తెఱచుట వలన ఉద్భవించిన యావజ్జగత్తును ప్రళయము నుండి రక్షించుట కొఱకు, నీ కన్నులు రెప్పపాటు లేక ఎప్పుడూ తెఱచుకొని ఉన్న స్థితిలోనే యున్నవని తలంచుచున్నాను.

56 వ శ్లోకము.  
తవాపర్ణే కర్ణే జపనయన పైశున్య చకితాః
నిలీయంతే తోయే నియత మనిమేషాశ్శఫరికాః |
ఇయం చ శ్రీబద్ధచ్ఛద పుటకవాటం కువలయం
జహాతి ప్రత్యూషే నిశి చ విఘటయ్య ప్రవిశతి || 
సీ.  అమ్మ నీకండ్లతో నెమ్మిఁ బోల్చుకొనెడి మత్స్యముల్ బెదరుచు మడుగులోన
దాగు, నీ చెవులలోఁ దమ గుట్టు చెప్పు నీ కన్నులనుచు, మచ్చెకంటి! వినితె?
నీ నేత్రలక్ష్మియు నిరుపమ! ముకుళిత దళముల డొప్పలఁ దలుపులుగను
గలిగిన కలువలన్ గనుచుఁ బ్రాతఃకాల మునవిడ్చి, రాత్రులన్ బూజ్య! తెరచి, 
తే.గీ. లోపలను జేరునోయమ్మ! ప్రాపువైన 
కలువ కంటివి, నీరూపుఁ గనెడి కనులు
కనులు నిజముగ, కాకున్నఁ గనులు కావు, 
నిన్నుఁ గాంచగాఁ జేయుమా నేర్పునొసఁగి. ॥ 56 ॥
ప్రతిపదార్థము.  
హే అపర్ణే = ఓ పార్వతీ! 
తవ = నీ యొక్క, 
కర్ణేజప = చెవుల - సామీప్యమును (కొండెములు చెప్పు నైజముతో) నిరంతరము పొందుచున్న 
నయన = కన్నులచేత అయిన, 
పైశున్య = రహస్యమును వెల్లడి చేయుట వలన, 
చకితాః = భయపడినవై, 
శఫరికాః = ఆడుచేపలు, 
అనిమేషా = ఱెప్పపాటు లేనివియై, 
తోయే = నీటియందు, 
నిలీయంతే = దాగుకొనుచున్నవి. 
నియతం = ఇది నిశ్చయము, మరియును,
ఇయం = ఈ, 
శ్రీః చ= నీ నేత్రలక్ష్మియు, 
బద్ధ = మూయబడిన,
ఛద = దళముల యొక్క 
పుట = దొప్పలనే, 
కవాటం = తలుపుగా గలదైన, 
కువలయం = కలువను, 
ప్రత్యూష = ఉషః కాలమందు, 
జహాతి = త్యజించుచున్నది, 
నిశిచ = రాత్రియందు,
తత్‌ = ఆ కలువను 
విఘటయ్య = తెఱచుచుకొని, 
ప్రవిశతి = లోపల ప్రవేశించుచున్నది. 
భావము. 
ఓ తల్లీ అపర్ణాదేవీ! తాము చూసిన ఏదో రహస్యమును చెప్పుటకై, ఎప్పుడూ నీ చెవుల వద్దనే నివసించు అందమైన నీ రెండు కన్నుల తీరును చూచి, భయపడిన ఆడ చేపలు కంటికి రెప్పపాటు లేక నీటిలో దాగుకొనుచున్నవి. నీ నేత్ర సౌందర్యలక్ష్మిని చూచిన నల్ల కలువలు, పగలు బిడియముతో తమ అందమును రేకులలో ముకుళింపచేసుకుని దాచుచూ, నీవు నిద్రపోవు రాత్రివరకు అట్లే వేచియుండి, అటుపై తమ రేకుల తలుపులను తెరచి, తమ అందమును బయటపెట్టుటకు సాహసించుచున్నవి.

57 వ శ్లోకము.  
దృశా ద్రాఘీయస్యా దరదళిత నీలోత్పల రుచా
దవీయాంసం దీనం స్నపయ కృపయా మామపి శివే |
అనేనాయం ధన్యో భవతి న చ తే హానిరియతా
వనే వా హర్మ్యే వా సమకర నిపాతో హిమకరః || 
ఉ.  దీనుఁడనమ్మ! దూరముగ తేజము కోల్పడి యున్న నాపయిన్
నీ నయన ప్రదీప్తి నిక నిత్యముగా ప్రసరింపనీయుమా,
హాని యొకింతయున్ గలుగదమ్మరొ! నీకు, నమస్కరింతు, నే
నేణధృతుండు వెన్నెలనదెక్కడనైననుఁ బంచు తీరునన్. ॥ 57 ॥
ప్రతిపదార్థము.  
శివే! = ఓ పార్వతీ ! 
ద్రాఘీయస్యా = మిక్కిలి పొడవుగాను, విశాలముగాను ఉన్నదియు, 
దరదళిత = కొంచెముగా వికసించిన, 
నీలోత్పలరుచా = నల్లకలువల వంటి కాంతి కలదియునగు, 
దృశా = కడకంటి చూపుచే 
దవీయాంసం = చాలా దూరముననున్న 
దీనం = దీనావస్థలో నున్న, 
మాం = నన్ను, 
అపి = సైతము 
కృపయా = దయతో, 
స్నపయ = తడుపుము, 
అనేన = ఈ మాత్రము సహాయము చేత, 
అయం = ఈ జడుడు (అనగా – నేను) 
ధన్యః = కృతార్థుఁడు, 
భవతి = అగుచున్నాడు. 
ఇయతా = ఇంత మాత్రము చేత, 
తే = నీకు 
హానిః = వచ్చిన నష్టము, 
నచ = లేనే లేదు (తథాహి = అదియుక్తము) 
హిమకరః = చంద్రుడు, 
వనేవా = అరణ్యము నందైనను, 
హర్మ్యేవా = సౌధములందైనను, 
సమకర నిపాతః = సమానమగునట్టి కిరణములను ప్రసరించుచున్నాడు గదా!
భావము. 
తల్లీ! పార్వతీ! బాగా పొడవుగా సాగినట్లుగా, విశాలముగా, కొంచెము వికసించిన నల్లకలువ కాంతివంటి కాంతికలది అయిన నీ కడకంటి చూపుచే – చాలా దూరములో, దీనావస్థలోనున్న నన్ను సైతము తడుపుము. ఈ మాత్రము సహాయముచేత ఈ దీనుడు ధన్యుడగును. నీకు వచ్చిన నష్టము గాని, ద్రవ్యనాశము గాని లేదు. ఇది విపరీతమేమీ కాదు. ఎందువలన అనగా నీ ఎడమ కన్నైన చంద్రుడు అరణ్యములలోను, సౌధములపైనను గూడా సమానముగానే తన కిరణములను ప్రసరింపచేయుచున్నాడు గదా!

58 వ శ్లోకము.  
అరాళం తే పాళీయుగళమగరాజన్యతనయే
న కేషామాధత్తే కుసుమశర కోదండ కుతుకమ్ |
తిరశ్చీనో యత్ర శ్రవణపథ ముల్లంఘ్య విలసన్
అపాంగ వ్యాసంగో దిశతి శరసంధాన ధిషణామ్ || 
ఉ.  వంకరనుండు నీ దయిన పాళి విభాగము లెన్ని పార్వతీ!
జంకరదెవ్వరున్ దలపఁ జక్కని కాముని విల్లటంచు, న
ల్వంకను కన్నులడ్డముగ భాసిలుచున్ మది నమ్ము విల్లుపై
నంకితమైనటుల్ తలచునట్టులనొప్పుచునుండెనొప్పుగన్. ॥ 58 ॥
ప్రతిపదార్థము.  
అగరాజన్యతనయే ! = ఓ పర్వతరాజపుత్రివైన పార్వతీ ! 
అరాళ = వంకరగానున్న, 
తే = నీ యొక్క, 
పాళీ = చెవితమ్మె
యుగళం = జంట
కుసుమ శర = మన్మథుని 
కోదండ = వింటి యొక్క 
కుతుకమ్‌ = సౌభాగ్యముగా, 
కేషాం = ఎవరికి, 
న ఆధత్తే = సందేహము కలిగించదు ? 
యత్‌ = ఏ కారణము వలన, 
యత్ర = ఏ చెవితమ్మె జంట యందు, 
తిరశ్చీనః = అడ్డముగా తిరిగి, 
విలసన్‌ = ప్రకాశించుచున్నదై, 
అపాంగ వ్యాసంగః = కడగంటి యొక్క వ్యాపన విలాసము, శ్రవణపథం = చెవి సామీప్యమును, 
ఉల్లంఘ్య = దాటుచు, 
శరసంథాన థిషణాం = అమ్మును గూర్చు బుద్దిని, 
దిశతి = ఇచ్చుచున్నది.
భావము. 
ఓ పర్వతరాజుపుత్రీ ! పార్వతీ ! అందమైన వంపులతో సొంపుగానున్న నీ చెవితమ్మె జంట ప్రదేశమును చూచుట తోడనే అది – “పుష్పబాణమును ఎక్కుపెట్టిన మన్మథుని వింటి సొగసు అయి ఉండునేమో” అని అనిపించకుండా నుండునా? కారణమేమనగా – వంగిన విల్లువలె ఉండి, వంపుసొంపుల చెవితమ్మెల గుండా నీ కృపావీక్షణ ప్రకాశము, బాణము వలె నీ చెవులను చేరుటయే గాక, వాటిని దాటుచూ ఉన్నది గదా!

59 వ శ్లోకము.  
స్ఫురద్గండాభోగ ప్రతిఫలిత తాటంక యుగళం
చతుశ్చక్రం మన్యే తవ ముఖమిదం మన్మథరథమ్ |
యమారుహ్య ద్రుహ్య త్యవనిరథ మర్కేందుచరణం
మహావీరో మారః ప్రమథపతయే సజ్జితవతే || 
చం.  సురుచిరమైన నీ ముఖము, సుందర గండ యుగంబు గొప్పగా
మెరయుచు నీదు కమ్మల భ్రమింపగఁ జేసెడుఁ నాల్గు చక్రముల్
ధర మరు తేరిఁ బోల, శశి  ధత్ర సుచక్ర ధరా రథాన సుం
దరహరుఁడెక్కియుండ హరినందనుఁడేచుచుఁ బ్రేమఁ గొల్పెనే. ॥ 59 ॥
ప్రతిపదార్థము.  
హే భగవతీ = ఓ జననీ! 
తవ = నీ యొక్క, 
ఇదం = ఈ, 
ముఖం = నీ ముఖము, 
స్ఫురత్‌ = మెఱయుచున్న, 
గండ = చెక్కిళ్ళ యొక్క, 
ఆ భోగ = విశదమైన తలము నందు, 
ప్రతిఫలిత = ప్రతిబింబించిన, 
తాటంక యుగళం = చెవి కమ్మల జత గలదై, 
చతుశ్చక్రం = నాలుగు చక్రములు గల, 
మన్మథ రథం = మన్మథుని రథముగా, 
మన్యే = ఊహించుచున్నాను. 
యం = ఏ నీ ముఖము అను అట్టి రథమును, 
ఆరుహ్య = ఎక్కి, 
మహావీరం = గొప్పవీరుడైన, 
మారః = మన్మథుడు, 
అర్కేందు చరణం = సూర్యచంద్రులను చక్రములుగా గలిగిన, 
అవని రథం = భూమి అను రథమును, 
సజ్జితవతే = యుద్ధమునకై సిద్ధబడి రథమును ఎక్కియున్నవాడై, 
ప్రమథపతయే = ప్రమథ గణములకు ప్రభువైన, త్రిపురహరుడైన శివుని కొఱకు, 
ద్రుహ్యతి = ద్రోహము చేయుచున్నాడు.
భావము. 
తల్లీ! జగజ్జననీ! స్వచ్ఛమైన ప్రకాశ లక్షణముతో అద్దమువలె మెరయుచున్న నీ చెక్కిళ్ళు, నీ చెవుల తాటంకముల జత యొక్క ప్రతిఫలించిన చక్రబింబములు కలిగిన నీ ముఖము – నాలుగు చక్రముల రథము వలె తోచుచున్నది. ఇట్టి నీ ముఖరథమును ఎక్కి మన్మథుడు మహావీరుని వలె భూమిని రథముగాను, సూర్యచంద్రులను దాని చక్రములు గాను ఏర్పాటు చేసుకొని, యుద్ధ సన్నద్ధుఁడై దాని నెక్కి వచ్చిన ప్రమథగణ ప్రభువు, త్రిపురహరుడు అయిన శివుని ఎదుర్కొనగలుగుచున్నాడు.

60 వ శ్లోకము.  
సరస్వత్యాస్సూక్తీరమృతలహరీ కౌశలహరీః
పిబంత్యాశ్శర్వాణి శ్రవణ చులుకాభ్యామవిరళమ్
చమత్కారశ్శ్లాఘాచలిత శిరసః కుండలగణో
ఝణత్కారైస్తారైః ప్రతివచనమాచష్ట ఇవ తే  || 
శా.  వాణీ గానసుధాస్రవంతి కుశలత్వప్రాభవంబీవు సు
జ్ఞానీ! దోసిటఁ గ్రోలుచున్ వర శిరఃకంపంబుతో నెన్నుటన్
మాణిక్యాంచిత కర్ణభూషలటులే మార్మ్రోగుఁ గంపించుచున్
దానిన్ సత్ప్రణవంబుఁ బోలెడి ఝణత్కారంబహో! శ్లాఘ్యమే. ॥ 60 ॥
ప్రతిపదార్థము.  
శర్వాణీ! = ఓ ఈశ్వరపత్నీ, పార్వతీ !, 
సరస్వత్యాః = సరస్వతీ దేవి యొక్క, 
సూక్తీ రమృతలహరీ = మధురగానామృత ప్రవాహపు పొంగు యొక్క, 
కౌశల = సౌభాగ్యమును, 
హరీః = హరించుచున్న
అవిరళమ్‌ = ఎడతెగని విధముగా, 
శ్రవణచులుకాభ్యాం = చెవులు అను దోసిళ్ళ చేత, 
పిబంత్యాః = గ్రోలుచుండుట యొక్క, 
చమత్కార = ఆనందమును 
శ్లాఘా = శ్లాఘించుటచే, 
చలిత శిరసః = కంపించు (ఆడించు) శిరస్సుగల, 
తే = ని యొక్క, 
కుండల గణః = కర్ణాభరణములు అన్నియు, 
తారైః = ఎక్కువైన, 
ఝణత్కారైః = ఝణఝణ ధ్వనులచేత, 
ప్రతివచనం = ఆమోదపు బదులు మాటలను, 
ఆచష్ట ఇవ = వచించున్నట్టులున్నది. 
భావము. 
తల్లీ శర్వాణీ! సరస్వతీ దేవి చేయు మధురగానామృత ప్రవాహపు పొంగును, ఎడతెగని విధముగా, చెవులు అను పుడిసిళ్ళ చేత గ్రోలుటలో పొందు, ఆశ్చర్య ఆనందములను శ్లాఘించుటకు, శిరస్సును చలింపచేయగా, నీ కర్ణాభరణములన్నియు ఒక్కసారిగా ఎక్కువ స్థాయిలో ఝణఝణత్కార ధ్వనుల చేత ఆమోదపు మాటలను, అనగా – “బాగున్నది – బాగున్నది” అని చెప్పే బదులు మాటలను వచించుచున్నట్లున్నది.

61 వ శ్లోకము.  
అసౌ నాసావంశస్తుహినగిరివంశ ధ్వజపటి
త్వదీయో నేదీయః ఫలతు ఫలమస్మాకముచితమ్ |
వహత్యంతర్ముక్తాశ్శిశిరకర నిశ్వాస గళితం
సమృద్ధ్యా యత్తాసాం బహిరపి చ ముక్తామణి ధరః || 
చం.  హిమగిరి వంశ కేతన! మహేశ్వరి! నీ దగు ఘ్రాణ వంశ మ
ద్ది మహిత సత్ఫలంబులిడు, దేవి! త్వదీయ కృపన్ గనంగ న
క్రము తన లోన నిందు వర రత్నముదాల్చుచు నిందునాడి మా
ర్గమున గమించుదానినె దగన్ బయటన్ ధరియించె గొప్పగన్. ॥ 61॥
(నక్రము=ముక్కు,ఇందు(వర)రత్నము=ముత్యము,ఇందు నాడి=ఇడానాడి)
ప్రతిపదార్థము.  
తుహిన గిరి వంశ = మంచుకొండవంశము అను 
ధ్వజ పటి = ధ్వజమునకు పతాకమైన ఓ హైమవతీ ! 
త్వదీయః = నీ సంబంధమైన, 
అసౌ = ఈ, 
నాసా వంశః = నాసిక అను వంశదండము, 
శిశిరకర = చంద్ర సంబంధమైన, 
నిశ్వాస = వామనాడి యగు ఇడానాడీ మార్గవాయువుచే, 
గళితాః = జాఱిన,
అంతః = లోపల, 
ముక్తాః= ముత్యములను, 
వహంతి = ధరించుచున్నది. 
యత్‌ = ఏ కారణము వలన, 
తాసాం = ఆ ముత్యముల యొక్క, 
సమృద్ధ్యా = నిండుతనము చేత, 
బహిరపి = వెలుపల కూడా,
ముక్తామణి ధరః = ముత్యములను ధరించునదో.
సః = ఆ నాసావంశ దండము, 
అస్మాకం = మాకు, 
ఉచితం = తగిన విధముగా, 
నేదీయః = సమీపించినదై, 
ఫలం = కోరిన ఫలమును, 
ఫలతు = ఫలింప చేయు గాక! 
భావము. 
హిమగిరి వంశధ్వజమునకు పతాకము వంటి ఓ హైమవతీ ! నీ నాసిక అను వెదురు దండము  లోపల ముత్యములను ధరించుచున్నదని చెప్పవచ్చును. కారణమేమనగా – నీ నాసాదండము ముత్యములతో సమృద్ధిగా నిండి యుండగా చంద్ర సంబంధమైన వామనిశ్వాస మార్గము ద్వారా (ముక్కుకు ఎడమవైపు) ముత్యము బయటకు వచ్చి నాసికకు కింద కొన యందు ముత్యముతో కూడిన ఆభరణమగుచున్నది గదా! ఆ నీ నాసావంశదండముమాకు తగిన విధముగా కోరిన వాటిని ప్రాప్తింపచేయుగాక! 

62 వ శ్లోకము.  
ప్రకృత్యాఽఽరక్తాయాస్తవ సుదతి దంతచ్ఛదరుచేః
ప్రవక్ష్యే సాదృశ్యం జనయతు ఫలం విద్రుమలతా |
న బింబం తద్బింబ ప్రతిఫలన రాగాదరుణితం
తులామధ్యారోఢుం కథమివ నలజ్జేత కలయా || 
మ.  జననీ! నీ యధరారుణప్రభలు సాజంబమ్మ! నే దెల్పెద
న్వినుతింపందగు పోలికన్, బగడమే బింబంబు పుట్టించినన్
ఘనమౌ నీ యధరారుణప్రభలనే కల్గించు నవ్వాటికిన్,
విన సొంపౌ తగు సామ్యమున్ దలపగా వ్రీడన్ మదిన్ బొందదే? ॥ 62 ॥
ప్రతిపదార్థము.  
హే సుదతి = మంచి పలువరసగల ఓ జననీ! 
ప్రకృత్యా = స్వభావ సిద్ధముగనే, 
ఆరక్తాయాః = అంతట కెంపువన్నెగలదైన, 
తవ = నీ యొక్క, 
దంతచ్ఛద రుచేః = రెండు పెదవుల యొక్క సౌందర్య సౌభాగ్యమునకు, 
సాదృశ్యం = సరియైన పోలికను, 
ప్రవక్షే = చక్కగా చెప్పుచున్నాను. 
విద్రుమలతా = పగడపు తీగ 
ఫలం = పండిన పండును, 
జనయతు = పుట్టించినదైనచో అది పోలికకు సరిపోవును,
బింబం = దొండ పండుతో పోల్చవలసి వచ్చినచో, 
తత్‌ = ఆ నీ రెండు పెదవుల యొక్క 
బింబ = బింబములను తనపై ప్రతి ఫలించుట చేత అయిన, 
రాగాత్‌ = ఎరుపురంగువలన, 
అరుణితం = ఎరుపు వన్నె పొందినదైనది, 
(అన్యథా) న = అటుల కానిచో బింబము కానేరదు.
కలయా - అపీ = లేశ మాత్రము చేతను గూడా, 
తులాం = సామ్యమును, 
అధ్యారోఢుం = అధిష్ఠించుటకు, 
కథం ఇవ = ఏవిధముగా, 
నలజ్జేత = సిగ్గుపడకుండును ? 
భావము. 
ఓ జగన్మాతా! తల్లీ! చక్కని పలువరుసగల ఓ దేవీ! సహజముగా కెంపులు దేలుచున్న నీపెదవుల సౌందర్యానికి పగడపు తీగెకు పండు పండితే, ఆ విద్రుమఫలము యొక్క ఎరుపుదనము, నీ పెదవులకాంతికి సరితూగుతుంది. కేవలం పగడపు తీగెమాత్రం నీ అధరాల ఎఱుపునకు సాటికాజాలదు.
ఇక బింబఫలమన్నచో - దొండపండు. నీ పెదవుల అరుణ వర్ణము అరువు తెచ్చుకున్నట్లున్నదే గానీ- సహజముగా దొండపండు నీ అధరముల ఎఱుపుదనానికి సాటిరాదు. అది తెలిసికొని - బింబఫలము (దొండపండు) సిగ్గుపడుచున్నది.

63 వ శ్లోకము.  
స్మితజ్యోత్స్నాజాలం తవ వదనచంద్రస్య పిబతాం
చకోరాణామాసీదతిరసతయా చంచుజడిమా |
అతస్తే శీతాంశోరమృతలహరీరామ్లరుచయః
పిబంతీ స్వచ్ఛందం నిశి నిశి భృశం కాంచిక ధియా || 
శా.  అమలా! నీ నగుమోము చంద్రికలదివ్యాస్వాదనన్ జీవజీ
వములా తీపిదనమ్ముచే రసనలున్ వాయన్ రుచిన్ దివ్యమౌ
రమణీ! చంద్రునినుండియామ్లరుచులన్ బ్రార్థించి యాచంద్రికల్
ప్రముదంబున్ గొనుఁ గాంచికన్ నిశలలో భావింప చిత్రంబిదే. ॥ 63 ॥
ప్రతిపదార్థము.  
హే పార్వతీ = ఓ జననీ! 
తవ = నీ యొక్క, 
వదనచంద్రస్య = ముఖము అను చంద్రుని యొక్క, 
స్మిత = చిరునవ్వు అను 
జ్యోత్నాజాలం = వెన్నెల సమూహము నంతను, 
పిబతాం = త్రాగుచున్న, 
చకోరాణాం = చకోరపక్షులకు, 
అతిరసతయా = మిక్కిలి తీపి దనము చేత, 
చంచుజడిమా = నాలుకలకు రుచి తప్పి మొద్దుబాఱుట యనునది, 
ఆసీత్‌ = కలిగెను, 
అతః = ఇందువలన, 
తే = ఆ చకోర పక్షులు, 
ఆమ్లరుచయః = పుల్లగా నుండు వాటి యందు ఆసక్తి కలిగినవై, 
శీతాంశోః = చంద్రుని యొక్క, 
అమృతలహరీః = సుధాప్రవాహములను, 
కాంచికధియా = అన్నపు గంజి యనెడి భ్రాంతితో, 
స్వచ్ఛందం = ఇష్టము వచ్చినట్లుగా, 
నిశినిశి = ప్రతి రాత్రి యందు, 
భృశం = మిక్కిలి, 
పిబంతీ = త్రాగుచున్నవి.
భావము.
తల్లీ జగజ్జననీ! నీ ముఖము అనే చంద్రుని యొక్క, చిరునవ్వు అను వెన్నెలనంతా అమితముగా గ్రోలిన చకోర పక్షులకు – ఆ వెన్నెల వెర్రి తీపిగా ఉండుటచేత, వాని నాలుకలు ఆ తీపితో చచ్చుబారి రుచి గూడా పట్టనివయ్యెను. అందువలన ఆ చకోర పక్షులు ఏదైనా పుల్లగా ఉండు వాటిని త్రాగి, తీపితో నాలుక మొద్దుబారినతనమును పోగొట్టుకొనదలచి, చంద్రుని వెన్నెల అను అమృతమును బియ్యపు కడుగునీరు లేదా అన్నపు గంజి అను భ్రాంతితో ప్రతి రాత్రి మిక్కిలిగా తాగుచున్నవి. (అంటే అమ్మ చిరునవ్వు అమృతము కంటే మిన్నగా ఉన్నదని భావం).

64 వ శ్లోకము.  
అవిశ్రాంతం పత్యుర్గుణగణ కథామ్రేడనజపా
జపాపుష్పచ్ఛాయా తవ జనని జిహ్వా జయతి సా |
యదగ్రాసీనాయాః స్ఫటికదృష దచ్ఛచ్ఛవిమయీ
సరస్వత్యా మూర్తిః పరిణమతి మాణిక్యవపుషా || 
చం.  సతతము నీ సదాశివుని సన్నుతిఁ జేయుచునుండుటన్ సతీ!
యతులిత జిహ్వ యెఱ్ఱఁబడెనమ్మరొ నీకు, గణింపగా, సర
స్వతి సతతంబు నాల్కపయి సన్నుతినొప్పుచునుండుటన్ లస
న్నుతమగు పద్మరాగ రుచితోఁ బరిణామము పొందియుండెడిన్. ॥ 64 ॥
ప్రతిపదార్థము.  
హే జననీ! = ఓ జగన్మాతా ! 
జపాపుష్ప= మందార పువ్వు యొక్క 
చ్చాయా = రంగు వంటి ఎఱ్ఱని కాంతి గలదై, 
తవ = నీ యొక్క, 
సా = ఆ, 
జిహ్వా = నాలుక, 
అవిశ్రాంతం = నిరంతరము, 
పత్యుః = సదాశివుని యొక్క, 
గుణ = గుణముల,
గణ = సమూహ సంపద యొక్క, 
కథా = వృత్తాంతముల యొక్క, 
ఆమ్రేడన = మరల మరల వచించుటయే, 
జపా = జపముగా కలదై, 
జయతి = ప్రకాశించుచున్నది. 
యత్‌ = ఏ 
అగ్ర = జిహ్వాగ్రము నందు 
ఆసీనాయాః = ఆసీనురాలైన, 
సరస్వత్యాః = సరస్వతీ దేవి యొక్క, 
స్ఫటిక దృషత్‌ = స్ఫృటికమణివలె, 
అచ్ఛ = తెల్లన, 
ఛవిమయీ = అధికమైన, 
మూర్తిః = స్వరూపము, 
మాణిక్య = పద్మరాగము యొక్క 
వపుషా = రూపముతో, 
పరిణమతి = మార్పు చెందుచున్నది.  
భావము. 
తల్లీ! జగజ్జననీ! నీ నాలుక, నిరంతరము నీ పతియైన సదాశివుని విజయ గుణగణముల చరిత్రలను, ఎడతెరిపి లేకుండా చెప్పుచుండుట వలన, మందార పుష్పము యొక్క ఎఱ్ఱని కాంతులు గలదై ప్రకాశించుచుండుటయేగాక, తన నాలుక యందే ఎప్పుడూ ఆసీనురాలై, పూర్తిగా స్ఫటికము వలె తెల్లగా ఉండే సరస్వతీ దేవిని సైతము పద్మరాగమణి కాంతులతో ఎఱ్ఱని రూపముగల దానిగా మార్చుచున్నది.

65 వ శ్లోకము.  
రణే జిత్వా దైత్యానపహృత శిరస్త్రైః కవచిభిః
నివృత్తైశ్చండాంశత్రిపురహర నిర్మాల్య విముఖైః |
విశాఖేంద్రోపేంద్రైశ్శశి విశద కర్పూర శకలాః
విలీయన్తే మాతస్తవ వదన తాంబూల కబళాః || 
తే.గీ.  పావకియు నింద్రవిష్ణువుల్ బవరవిజయు
లయి నినున్ గాంచఁ దలపాగ లచట వదలి
కవచములు దాల్చి శివమాల్యము విడి నీదు
వదన తాంబూల మందగ  వచ్చిరమ్మ. ॥ 65 ॥
ప్రతిపదార్థము.  
హే మాత ! = ఓ జగజ్జననీ ! 
రణే = యుద్ధమునందు, 
దైత్యాన్‌ = రాక్షసులను, 
జిత్వా = జయించి, 
అపహృత = తీసివేయబడిన 
శిరస్త్రైః = శిరస్త్రాణములు గల వారును, 
కవచిభిః = కవచములు గల వారును, 
నివృత్తెః = యుద్ధరంగము నుండి మరలి వచ్చిన వారును, చండాంశ = చండేశ్వరుని భాగము అగు, 
త్రిపురహర = త్రిపురాసురులను సంహరించిన శివుని యొక్క, 
నిర్మాల్య = నిర్మాల్యమును, 
విముఖైః = గ్రహింపని వారును ఐన 
విశాఖ = కుమారస్వామి, 
ఇంద్ర = ఇంద్రుడు, 
ఉపేంద్ర = విష్ణువు, అను ముగ్గురి చేత, 
శశి విశద = చంద్రుని వలె స్వచ్ఛముగా నున్న, 
కర్పూర శకలాః = పచ్చకర్ఫూరపు తునకలుకలిగిన, 
తవ = నీ యొక్క, 
వదన = ముఖము (నోరు) నుండి వెలువడి వచ్చిన, 
తాంబూల = తాంబూలపు 
కబళాః = ముద్దలు, 
విలీయంతే = లీనమై పోవుచున్నవి.  
భావము.
తల్లీ! జగజ్జననీ! యుధ్ధమునందు రాక్షసులను జయించి, తమ తలపాగలను తీసివేసి, కవచములు మాత్రము ధరించిన వారై, యుద్ధరంగము నుండి మరలి వచ్చుచు, ప్రమథగణములలో ఒకడైన చండునికి చెందు శివుడు స్వీకరించి విడిచిన నిర్మాల్యమును వదలి, జగదంబ నివాసమునకు  వచ్చిన కుమారస్వామి, ఇంద్రుడు, విష్ణువులు నీ నోటినుండి వెలువడి వచ్చిన తాంబూలపు ముద్దలను గ్రహించగా ఆ తాంబూలపు ముద్దలలో చంద్రుని వలె స్వచ్ఛముగాను, నిర్మలముగాను ఉండు పచ్చకర్పూరపు తునకలు గూడా పూర్తిగా నమలబడి, మ్రింగబడి ఆ తాంబూలములు పూర్తిగా జీర్ణమై లీనమైపోవుచున్నవి.

66 వ శ్లోకము. 
విపఞ్చ్యా గాయన్తీ వివిధ మపదానం పశుపతే
స్త్వయారబ్ధే వక్తుం చలిత శిరసా సాధు వచనే |
తదీయైర్మాధుర్యైరపలపిత తన్త్రీ కలరవాం
నిజాం వీణాం వాణీ నిచుళయతి చోళేన నిభృతమ్ ||
ఉ.  వాణి విపంచిపై శివుని పావనసచ్చరితంబు మీటుచున్
నీ నయవాక్సుధార్ణవము నెమ్మిని భావనఁ జేసి దానితో
వీణియ పోలదంచు కని వేగమె కొంగునఁ గప్పె వీణనే,
ప్రాణము నీవెయై మదిని వర్ధిలు తల్లి! నమస్కరించెదన్. ॥ 66 ॥
ప్రతిపదార్థము. 
హే జగజ్జనని !
వాణీ = సరస్వతి,
పశుపతేః = ఈశ్వరుని యొక్క,
వివిధం = అనేక విధములైన,
అపదానం = సాహస కృత్యములు మొదలగు వాటిని,
విపంచ్యా = వీణచేత,
గాయంత్యా = గానము చేయుచున్నదై,
చలిత శిరసా = మనస్సు నందు కలిగిన సంతోష వశమున స్వయముగా గలిగిన శిరః కంపమున,
త్వయా = నీ చేత,
సాధు వచనే = ప్రశంసావచనము,
వక్తుం = వచించుటకు,
ఆరబ్ధేసతి = ప్రారంభించినదగుచుండగా,
తదీయై = ఆవచన సంబంధులైన,
మాధుర్యైః = మాధుర్య గుణముల చేత,
అపలపిత = అపహసింపబడిన,
తంత్రీ = తంత్రుల యొక్క
కలరవాం = అవ్యక్త మధురములైన ధ్వనులు గలదైన,
నిజాం = తన యొక్క,
వీణాం = వీణను,
చోలేన = వీణను ఉంచు పైముసుగు చేత,
నిభృతం = కనబడకుండా నుండునట్లు,
నిచులయతి = బాగుగా కప్పుచున్నది.
భావము.
తల్లీ! సరస్వతీదేవి వీణను శ్రుతిచేసి నీ ఎదుట పశుపతి వీరగాథలను గానం చేస్తూంటె నువ్వు ఆనందం పొంది , ఆమెపాటను మెచ్చుకుంటూ ప్రశంసా వాక్యాలు చెబుతుంటె , నీ వాఙ్మాధుర్యం తన వీణానాదంకంటె మాధుర్యం కలదని తెలిసి ఆమె తనవీణను కనపడకుండా వస్త్రంతో కప్పి దాస్తుంది.

67 వ శ్లోకము. 
కరాగ్రేణ స్పృష్టం తుహినగిరిణా వత్సలతయా
గిరీశేనోదస్తం ముహురధరపానాకులతయా |
కరగ్రాహ్యం శంభోర్ముఖ ముకుర వృంతం గిరిసుతే!
కథంకారం బ్రూమస్తవ చుబుకమౌపమ్యరహితమ్. ||
చం.  జనకుఁడు ప్రేమగా నిమురు చక్కని నీ చుబుకంబు, నీ ధవుం
డనవరతంబు నీ యధరమానెడి వేడ్కను దొట్రుపాటుతోఁ
జనువున పట్టి తేల్చుఁ గద చక్కని మోవి, సఖుండు చేత లే
పిన ముఖమన్ లసన్ముకురవృంతము, నాకది పోల్ప సాధ్యమా. ॥ 67 ॥
ప్రతిపదార్థము. 
హే గిరిసుతే = ఓ గిరిరాజపుత్రీ !
తుహినగిరిణా = మంచుకొండ చేత, (తండ్రిచేత)
వత్సలతయా = వాత్సల్యముతో,
కరాగ్రేణ = మునివ్రేళ్ళతో
స్పృష్టం = పుడుక బడునదియు,
గిరీశేన = శివుని చేత,
అధర పాన = అధర పానము నందలి
ఆకులతయా = తొట్రుపాటు చేత,
ముహుః = మాటిమాటికి,
ఉదస్తం = పైకెత్తబడినదియు,
శంభోః= శివుని యొక్క,
కర గ్రాహ్యం = చేతిని గైకొన దగినదియు,
ముఖ = ముఖము అను
ముకురవృంతం = అద్దమునకు పిడి అయినదియు,
ఔపమ్యరహితం = సరిపోల్చఁ దగిన వస్తువు లేనిదియునగు
తవ = నీ యొక్క,
చుబుకం = గడ్డమును,
కథంకారం = ఏ విధముగా,
బ్రూమః = వర్ణించగలము ?

భావము.
ఓ గిరి రాజకుమారీ! తండ్రి అయిన హిమవంతుని చేత, అమితమైన వాత్సల్యముతో మునివేళ్ళతో తాకబడినది, అధరామృతపానమునందలి ఆత్రుత, తొట్రుపాటులతో శివునిచే మాటి మాటికీ పైకెత్తబడినది, శంభుని హస్తమును చేకొనతగినది, సరిపోల్చతగినది ఏమీ లేనిది అయిన- నీ ముఖము అను అద్దమును పుచ్చుకొనుటకు, అందమైన పిడివలె నున్న నీ ముద్దులొలుకు చుబుకమును(గడ్డము)ను ఏ విధముగా వర్ణించగలను?

68 వ శ్లోకము. 
భుజాశ్లేషాన్నిత్యం పురదమయితుః కంటకవతీ
తవ గ్రీవా ధత్తే ముఖకమలనాళ శ్రియమియమ్ |
స్వతశ్శ్వేతా కాలా గరు బహుళ జంబాల మలినా
మృణాలీ లాలిత్యం వహతి యదధో హారలతికా. ||
చం.  పురహరు బాహు బంధమునఁ బొల్పగు నీదగు కంఠనాళమే
సురనుత! కంటకాంకుర సుశోభిత వారిజనాళమట్లు కాన్
వరలుచు గంధ పంకమున భాసిలె హారము నాళమట్లుగన్.
నిరుపమ! నిన్ మదిన్ నిలిపి నేను భజించెదఁ గాంచుమా కృపన్. ॥ 68 ॥
ప్రతిపదార్థము. 
హే జగజ్జననీ = ఓ లోకమాతా!
పురదమయితుః = పురహరుడైన శివుని యొక్క,
భుజ = బాహువుల,
ఆశ్లేషాత్‌ = కౌగిలింతల వలన,
నిత్యం = ఎల్లప్పుడు,
తవ = నీ యొక్క,
ఇయం గ్రీవా = ఈ కంఠనాళము,
కంటకవతీ = గగుర్పాటు వలను రోమాంచము గలదైన
ముఖ = ముఖమనెడి
కమల = తామరపూవు యొక్క,
నాళ శ్రియ = కాడ అందమును,
ధత్తే = ధరించుచున్నది.
యత్‌ = ఏ కారణము వలన
అథః = (ఆ కంఠమునకు) క్రిందుగా నున్న ప్రదేశము నందు,
స్వతః = స్వయముగనే,
శ్వేతా = స్వచ్ఛమైనదై,
కాల + అగురు = నల్లనైన అగురు గంధపు చెక్క యొక్క,
బహుళ = విస్తారముగా నున్న,
జంబాల= పంకము యొక్క,
మలినా = నలుపు వన్నె చేత మాసిన,
హారలతికా = ముత్యాల హారము,
మృణాళీ = తామరతూడు యొక్క
లాలిత్యం = సౌందర్యమును,
వహతి = ధరించుచున్నది.
భావము.
తల్లీ! జగజ్జననీ! పురహరుని బాహువులతో, కౌగిలింతలతో నిత్యము గగుర్పాటుతో రోమాంచితమై, క్రింది భాగము సహజముగానే స్వచ్ఛముగా ఉండి- నల్లగా, విస్తారముగా ఉన్న అగరుగంధపు సువాసనతో, తామరుతూడు అందమును మించిన ముత్యాల హారముతో ఉండుటవలన – నీ మెడ నీ ముఖమనే పద్మమునకు ఒక కాడవలె ఉన్నది.
69 వ శ్లోకము.  
గళే రేఖాస్తిస్రో గతి గమక గీతైక నిపుణే! 
వివాహ వ్యానద్ధ ప్రగుణ గుణసంఖ్యా ప్రతిభువః |
విరాజంతే నానావిధ మధుర రాగాకర భువాం
త్రయాణాం గ్రామాణాం స్థితి నియమ సీమాన ఇవ తే ||
తే.గీ.  గమక గీతైక నిపుణ! నీ కంఠ రేఖ
లు తగె మూడు సూత్రపు ముడులువలెనమ్మ!
షడ్జ, మధ్యమ, గాంధార, సంస్తుతగతి
కమరు హద్దన నొప్పె, మహత్వముగను. ॥ 69 ॥
ప్రతిపదార్థము.  
హే జగజ్జననీ!
గతి = సంగీత మార్గముల యందును, 
గమక = స్వరకంపన విశేషములందును, 
గీత = గానము నందును, 
ఏక = ముఖ్యమైన, 
నివుణే = నేర్పరితనము గలదానా! 
తే = నీ యొక్క, 
గళే = కంఠ ప్రదేశమునందు, 
తిస్రః రేఖాః = మూడు భాగ్య రేఖలు, 
వివాహ = పెళ్ళి సమయమందు, 
వ్యానద్ధ = (కంఠము చుట్టును వచ్చునట్లు)చక్కగా కట్టబడిన, 
ప్రగుణ = పెక్కునూలు పోగులచే కూర్చబడిన 
గుణ = దారముల యొక్క, 
సంఖ్యా = మూడు సంఖ్యకు, 
ప్రతిభువః = ప్రతినిధులైనవియు, 
నానావిధ = అనేక విధములైన, 
రాగ = కళ్యాణి మొదలగు రాగములకు, 
ఆకర భువాం = (స్వరస్థానములను)ఆశ్రమస్థానములైనవియు, 
త్రయాణాం = మూడైన, 
గ్రామాణాం = షడ్జమ, మధ్యమ, గాంధార గ్రామములకు, 
స్థితి = ఉనికి యొక్క, 
నియమ = నియమము కొఱకు ఏర్పరచిన, 
సీమానః ఇవ = సరిహద్దులవలె, 
విరాజంతే = మిక్కిలి శోభాయమానముగా ప్రకాశించుచున్నవి. 
భావము. 
సంగీత స్వరగాననిపుణీ, జగజ్జననీ! నీ కంఠము నందు కనబడు మూడు భాగ్యరేఖలు – వివాహ సమయమునందు పెక్కు నూలు పోగులతో ముప్పేటలుగా కూర్చబడి కట్టిన సూత్రమును గుర్తుతెచ్చుచు, నానా విధములైన మధుర రాగములకు ఆశ్రయ స్థానములైన షడ్జమ, మధ్యమ, గాంధార గ్రామముల ఉనికి యొక్క నియమము కొరకు ఏర్పరచిన సరిహద్దుల వలె ఉన్నట్లు శోభాయామానముగా ప్రకాశించుచున్నవి.
70 వ శ్లోకము.  
మృణాలీ మృద్వీనాం తవ భుజలతానాం చతసృణాం
చతుర్భిస్సౌందర్యం సరసిజభవస్స్తౌతి వదనైః |
నఖేభ్యస్సన్త్రస్యన్ ప్రథమ మథనా దంధకరిపోః
చతుర్ణాం శీర్షాణాం సమమభయహస్తార్పణ ధియా || 
శా.  అమ్మా! గోర్లను శూలి బ్రహ్మ తలఁ బాయన్ ద్రుంప, భీతిల్లుచున్,
బమ్మే నాలుగు మోములన్ గిలిని బాపం గోరుచున్ రక్షణం
బిమ్మంచున్ నుతియించుచుండె సుకుమారీ! భీతిఁ బోఁగొట్టు నీ
యిమ్మౌ కోరకమార్దవంపు భుజముల్ హృద్యంబులౌ నాల్గిటిన్.
70 ॥
ప్రతిపదార్థము.  
ఓ జగజ్జననీ = ఓ లోకమాతా! 
సరసిజభవః = బ్రహ్మదేవుడు, 
ప్రథమమథనాత్‌ = మొట్టమొదటి తన శిరస్సును ఖండించిన వాడైన, 
అంధకరిపోః = అంధకుడను అసురుని సంహరించిన సదాశివుని యొక్క, 
నఖేభ్యః = గోళ్ళవలన, 
సంత్రస్యన్‌ = మిగులభయపడుచున్నవాడై, 
చతుర్ణాం = నాలుగుగా నున్న, 
శీర్షాణాం = తన శిరస్సులకు, 
సమం = సమానముగా, 
అభయహస్త = అభయదానము చేయగలిగిన నీ హస్తముల యొక్క 
అర్పణ ధియా = అభయమును గోరి, 
చతుర్భిః = నాలుగుగా నున్న, 
వదనైః = తన ముఖములచేత, 
మృణాలీమృద్వీనాం = తామరతూడువలె మెత్తదనము 
గలవియు, 
చతసృణాం = నాలుగుగా వున్నవియు, 
తవ = నీ యొక్క, 
భుజలతానాం= తీగల వంటి భుజముల యొక్క, 
సౌందర్యం = అందమును, 
స్తౌతి = స్తుతించుచున్నాడు. 
భావము. 
తల్లీ జగజ్జననీ! తామర తూడువలె మృదువుగా తీగలవలె ఉండు నీ బాహువుల చక్కదనమును చూసి, బ్రహ్మ తన నాలుగు ముఖములతో – పూర్వము తన ఐదవ శిరస్సును గోటితో గిల్లి వేసిన శివుని గోళ్ళకు భయపడుచూ, ఒక్కసారిగా తన మిగిలిన నాలుగు శిరస్సులకు నీ నాలుగు హస్తముల నుండి అభయ దానము కోరుచూ, నిన్ను స్తుతించుచున్నాడు.

71 వ శ్లోకము.  

నఖానాముద్యోతైర్నవనళిన రాగం విహసతాం

కరాణాం తే కాంతిం కథయ కథయామః కథముమే |

కయాచిద్వా సామ్యం భజతు కలయా హంత కమలం

యది క్రీడల్లక్ష్మీచరణతల లాక్షారస చణమ్ ||

చం.  విరియుచునున్న తామరల విస్తృతశోభనె వెక్కిరించు నీ

మురిపెము గొల్పు చేతులను బోల్పఁగ నాకది సాధ్యమౌనొకో?

సరసునఁ గ్రీడసల్పురమ చక్కగనున్నెడ, కాలిలత్తుక

స్ఫురణను బొందినన్ దగును బోల్పఁగఁ గొంత, నిజంబు పార్వతీ! ॥ 71 ॥

ప్రతిపదార్థము.  

నఖానాం = గోళ్ళయొక్క, 

ఉద్యోతైః = ఉత్పన్నమగు కాంతుల చేత, 

నవ నళిన రాగం = అప్పుడే వికసించెడు తామరపూవు యొక్క ఎఱ్ఱని కాంతిని, 

విహసతాం = అపహసించుచున్న, 

తే = నీ యొక్క, 

కరాణాం = హస్తముల యొక్క, 

కాంతిం = శోభను, 

కథం = ఏ విధముగా, 

కథయామః = అలంకారయుతముగా వర్ణించగలమో, 

కథయ = చెప్పుము, 

కమలం = పద్మము, 

కయాచిత్‌వా = ఏ విధము చేతనైనను, 

కలయా అపి = పదునారవ పాలయినను, 

సామ్యం = పోలికను,

భజతు = పొందునా? 

హంత = అయ్యో, 

క్రీడత్‌ = క్రీడించుచున్న, 

లక్షీ = లక్ష్మీ దేవి యొక్క, 

చరణతల = పాదము యొక్క, 

లాక్షారస=లత్తుకరసముతో గూడి సమర్ధమైనదయినచో ,

చణం = పోల్చవచ్చునేమో!  

భావము. 

సూర్యోదయ కాలమున వికసించుచున్న క్రొత్తతామరపూవు కాంతిని పరిహసించు చున్న గోళ్ల యొక్క ప్రకాశముచేత విలసిల్లుచున్న నీ హస్తముల యొక్క సౌందర్యమును ఏప్రకారముగా, అలంకార శోభితముగా వర్ణింపగలను ? ఒకవేళ - కమలములను తనపాదపీఠముగా చేసుకున్న లక్ష్మి దేవి చరణముల లత్తు కరసము (పారాణి) అంటుట వలన లేత ఎరుపురంగుకు వచ్చిన కమలములు - కొంతవరకూ, నీ కరముల కాంతి లేశమునకు సాదృశము కాగలదేమో.

72 వ శ్లోకము.  

సమం దేవి స్కంద ద్విపవదన పీతం స్తనయుగం

త వేదం నః ఖేదం హరతు సతతం ప్రస్నుత ముఖమ్ |

యదాలోక్యాశంకాకులిత హృదయో హాస జనకః

స్వకుంభౌ హేరంబః పరిమృశతి హస్తేన ఝటితి || 

చం.  గణపతిచేత పూజ్యుఁడగు స్కందునిచేతను త్రాగఁబడ్డ, పా

ల నిడెడి నీ స్తనంబు లిల లక్ష్యముతో మముఁ గాచుఁ గావుతన్,

కని యవి నాదు కుంభములె కానగునంచు గణేశుఁడప్పుడా

క్షణమున శీర్షమున్ దడుమసాగెను తొండముతోడ శాంభవీ! 72.

ప్రతిపదార్థము.  

హే దేవి = ఓ భగవతీ ! 

సమం = ఒకే సమయములో, 

స్కంద = కుమారస్వామి చేతను, 

ద్విప వదన = ఏనుగు ముఖము కల వినాయకుని చేతను, 

పీతం = పాలుత్రాగబడినదియు,  

ప్రస్నుత ముఖం = పాలను స్రవింప జేయు 

కుచాగ్రముల గలదియునగు, 

తవ = నీ యొక్క, 

స్తనయుగం = వక్షోజముల జంట, 

నః = మా యొక్క, 

ఖేదం = దుఃఖమును, 

హరతు = తొలగించు గాక! 

యత్‌ = ఏ స్తనయుగమును, 

ఆలోక్య = చూచి, 

ఆశంకా = నా యొక్క తలపై నుండు 

కుంభములు దొంగిలింపబడినవను సంశయము చేత, 

ఆకులిత = ఆలోచనలో పడిన, 

హృదయః = మనస్సుగలవాడై, 

హేరంభః = వినాయకుడు, 

హాసజనకః = నవ్వు పుట్టించు చున్నవాడై 

స్వకుంభౌ = తన కుంభములను

హస్తేన = తొండము చేత, 

ఝటితి = ఆ క్షణములోనే, 

పరిమృశతి = తడవుకొనుచున్నాడు.

భావము. 

తల్లీ జగన్మాతా! నీ పుత్రులైన విఘ్నేశ్వర కుమార స్వాములచే, చనుబాలు ద్రావబడిన, నీకు చకుంభములు మా సర్వ క్లేశములను పోగొట్టుగాక! అమాయకుడైన బాల్య చాపల్యంతో కూడిన - విఘ్నేశ్వరుడు. నీ చనుబాలు ద్రావుచూ, మధ్యలో నీ స్తనములు తన చేతులతో తడివి ఒకవేళ తన కుంభస్థలం అక్కడకు వచ్చిందేమోనని భయపడి  తన తలపై కుంభస్థలం వుందో లేదోనని అనుమానం వచ్చి, తొండముతో తన తలను తడవుకొనటమనే చేష్టతో, తలి తండ్రులైన నీకు ఈశ్వరునికీ సోదరుడైన కుమారస్వామికీ -నవ్వు తెప్పించు చున్నాడు.

73 వ శ్లోకము.  

అమూ తే వక్షోజావమృతరస మాణిక్య కుతుపౌ

న సందేహస్పందో నగపతి పతాకే మనసి నః |

పిబంతౌ తౌ యస్మాదవిదిత వధూసంగ రసికౌ

కుమారావద్యాపి ద్విరద వదన క్రౌంచ దళనౌ || 

చం.  అమిత సుధారసాంచితము లద్దిన కెంపులకుప్పెలెన్న నీ

విమల పయోధరంబులు, స్రవించెడి పాలను గ్రోలుటన్ సదా

హిమగిరి వంశ కేతన మహేశ్వరి! నీ వరపుత్రులిద్దరున్

బ్రముదముతోడ బాలురుగ వర్ధిలు చుండిరి బ్రహ్మచారులై. ॥ 73 ॥

ప్రతిపదార్థము.  

నగపతి పతాకే = కొండరాజు కులమునకు వన్ని తెచ్చిన గిరిజాదేవీ! 

అమూ = ఈ కన్పట్టుచున్న, 

తే = నీ యొక్క, 

వక్షోజౌ = స్తనములు, 

అమృత రస = అమృతముతో నిండిన, 

మాణిక్య=మాణిక్యములతో నిర్మింపబడిన 

కుతుపౌ = కుప్పెలు, 

నః = మా యొక్క, 

మనసి = మనస్సునందు, 

సందేహస్పందః = లేశమాత్రమైన సందేహమును, 

న = లేదు, 

యస్మాత్‌ = ఏ కారణము వలన, 

తే = ఆ కెంపు కుప్పెలైన నీ స్తనములను, 

పిబంతే = పాలుత్రాగుచున్నవారై, 

అవిదిత = తెలియని, 

వధూ = స్త్రీల యొక్క, 

సంగ = కూటిమి యందు, 

ద్విరవదన క్రౌంచదళనే = గణపతి, కుమారస్వామి,

అద్య + అపి = ఇప్పటికి గూడ, 

కుమారౌ = బాలురుగానే వున్నారు. 

భావము.

అమ్మా! హిమవంతుని వంశమనే ధ్వజమునకుపతాక అయిన ఓ పార్వతీమాతా! నీ కుచములు అమృత రసముతో నిండి, మాణిక్యములతో నిర్మింపబడిన కుప్పెలు అనుటకు మాకు ఎటువంటి సందేహమునూ లేదు. ఎందుకు అనగా ఆ కుచముల పాలు త్రాగిన గణపతి, కుమారస్వామి ఇప్పటికినీ బాలురు గానే ఉన్నారు కదా!

74 వ శ్లోకము.  

వహత్యంబ స్తంబేరమదనుజ కుంభ ప్రకృతిభిః

సమారబ్ధాం ముక్తామణిభిరమలాం హారలతికామ్ |

కుచాభోగో బింబాధర రుచిభిరంతశ్శబలతాం

ప్రతాప వ్యామిశ్రాం పురదమయితుః కీర్తిమివ తే || 

ఉ.  అమ్మరొ! నీదు హారము గజాసుర కుంభజ మౌక్తికాభమై

యెమ్మెయిఁ జూడ నిర్మలమహీనశుభాస్పద దోషదూరమో

యమ్మ! నిజారుణద్యుతి శుభాధర బింబము నుండి సోకి సాం

తమ్మును చిత్రవర్ణమయి త్ర్యక్షుని కీర్తి వహించెఁ జూడగన్. ॥ 74 ॥

ప్రతిపదార్థము.  

అంబ! = ఓ జగన్మాతా !, 

తే = నీ యొక్క, 

కుచ = స్తనముల యొక్క 

ఆభోగః = విస్తారము, 

స్తంబేరమ దనుజ = గజాసురుని యొక్క, 

కుంభ = కుంభస్థలము నుండి, 

ప్రకృతిభిః = పుట్టుకగాగల, 

ముక్తామణిభిః =ముత్యముల చేత, 

సమారబ్ధాం = కూర్పఁబడినదియు, 

అమలాం = దోషరహితమైనదియు, 

బింబ = దొండపండు వంటి కెంపు రూపుగలదైన

అధర రుచిభిః = క్రింది పెదవి కాంతుల చేత, 

అంతః = లోన ప్రతి ఫలించిన 

శబలతాం = చిత్రవర్ణములతో కూడినదియు అయి, 

హార లతికాం = తీగవంటి ముత్యాల హారమును, 

ప్రతాపవ్యామిశ్రాం = ప్రతాపముతో కూడిన, 

పురదమయితుః = త్రిపురహరుని యొక్క, 

కీర్తిం ఇవ = కీర్తిని వలె, 

వహతి = తాల్చుచున్నది. 

భావము. 

అమ్మా! నీ మెడలో ధరించిన హారము గజాసురుని కుంభస్థలమునుండి పుట్టిన ముత్యములచే కూర్చబడినదియూ, దోష రహితమై నిర్మలమైనదియూ, దొండపండు వంటి పెదవి యొక్క కాంతులచే చిత్ర వర్ణముగా చేయబడి ఈశ్వరుని పరాక్రమము తో కూడిన కీర్తి ని వహించుచున్నట్లుగా కనబడుచున్నది.

75 వ శ్లోకము.  

తవ స్తన్యం మన్యే ధరణిధరకన్యే హృదయతః

పయః పారావారః పరివహతి సారస్వతమివ |

దయావత్యా దత్తం ద్రవిడశిశురాస్వాద్య తవ యత్

కవీనాం ప్రౌఢానా మజని కమనీయః కవయితా ||

మ.  హృదయోద్భూత మహత్వ వాఙ్మయ సుధా ధృత్వంబుగానెంచెదన్

క్షుధపోకార్పెడి నీదు స్తన్యమును, నాకున్ నీవు వాత్సల్య మొ

ప్ప దయన్ బట్టిన కారణంబుననె యీ బాలుండు ప్రౌఢంపు సత్

సుధలన్ జిందెడి ప్రౌఢ సత్కవులలోశోభిల్లెనొక్కండుగా. ॥ 75 ॥

ప్రతిపదార్థము.  

ధరణి ధరకన్యే = పర్వతరాజపుత్రికా ఓ పార్వతీ ! 

తవ = నీ యొక్క, 

స్తన్యం = చనుబాలు అను, 

హృదయతః = హృదయము నుండి పుట్టినదైన, 

పయః పారావారః = పాల సముద్రము, 

సారస్వతం ఇవ = వాఙ్మయము వలె, 

పరివహతి = ప్రవహంచుచున్నది అని, 

మన్యే = తలచెదను. 

యత్‌ = ఏ కారణము వలన, 

దయావత్యా = దయతో కూడిన నీ చేత, 

దత్తం = ఈయబడిన చనుబాలను, 

ద్రవిడ శిశుః= ద్రవిడ దేశమునందు పుట్టిన బాలుడు(అయిన నేను) 

ఆస్వాద్య = త్రాగి 

ప్రౌఢానాం = ప్రౌఢులు నిపుణులు అయిన, 

కవీనాం = కవీశ్వరులలో 

కమనీయః = సర్వ జగన్మోహనుఁడైన

కవయితా = కవిగా, 

అజని = మార్గముపొందెను(కాగలిగితిని)

భావము. 

అమ్మా! పర్వత నందినీ! నీ చనుబాలను హృదయము నుండి ప్రవహించుచున్న వాఙ్మయముతో నిండిన పాలసముద్రము వలె నేను తలచు చున్నాను. ఎందువలన అనగా వాత్సల్యముతో నీవు ఇచ్చిన స్తన్యము త్రాగి ఈ ద్రవిడ బాలుడు ( శ్రీ శంకర భగవత్పాదులు) కవులలో మనోహరుడు అయిన కవి కాజాలెను కదా !

76 వ శ్లోకము.  

హరక్రోధజ్వాలావళిభిరవళీఢేన వపుషా

గభీరే తే నాభీసరసి కృతసఙ్గో మనసిజః |

సముత్తస్థౌ తస్మాదచలతనయే ధూమలతికా

జనస్తాం జానీతే తవ జనని రోమావళిరితి ||

శా.  శ్రీమాతా! మదనుండు దగ్ధమగుచున్ శ్రీశంభు కోపాగ్నిలో

నీమంబొప్పగ రక్షకై దుమికెఁ దా నీ నాభి సత్రమ్ములో,

ధీమంతుండు ప్రశాంతిఁబొందె శిఖి శాంతింపన్ బొగల్ వెల్వడెన్

ధూమంబున్ గనుగొంచు నెంచితది నీ నూగారుగా శాంభవీ! ॥ 

76 ॥

ప్రతిపదార్థము.  

అచలతనయే = ఓ పార్వతీ ! 

మనసిజ = మన్మథుడు, 

హర = శివుని యొక్క, 

క్రోధ = క్రోధము అను 

జ్వాలా = అగ్ని వలన జనించిన జ్వాలల యొక్క 

ఆవళిభిః = సమూహము చేత, 

అవళీఢేన = క్రమ్మబడిన, 

వపుషా = శరీరముతో, 

గభీరే = లోతైన, 

తే= నీ యొక్క, 

నాభీ = బొడ్డు అను 

సరసి = సరస్సునందు, 

కృతసంగః = కూడిన వాడయ్యెను, అనగా  మునిగిన వాడయ్యెను,  

తస్మాత్‌ = అందువలన ఆ బొడ్డు అను కొలను నుండి, 

ధూమలతికా = పొగతీగ, 

సముత్తస్థౌ = పైకి ప్రాకెను, 

జనని = ఓ తల్లీ! 

తాం = ఆ ధూమలతీకను, 

జనః = జనము, 

తవ = నీ యొక్క, 

రోమావలళిః ఇతి = నూగారు అని, 

జానీతే = తెలుసుకొనుచున్నారు. 

భావము. 

అమ్మా! పర్వతరాజ కుమారీ ! మన్మధుడు పరమ శివుని కోపాగ్ని కీలలతో దహింప బడిన శరీరముతో నీ యొక్క లోతయిన నాభి మడువున దూకి తనను తాను కాపాడుకొనెను. కాలుచున్న వాని శరీరము చల్లారుట చేత వెడలిన పొగ తీగ బయల్పడగా , దానిని నీ యొక్క నూగారు ప్రాంతముగా కనబడుచున్నది కదా!

77 వ శ్లోకము.  

యదే తత్కాళిందీ తనుతర తరంగాకృతి శివే

కృశే మధ్యే కించిజ్జనని తవ యద్భాతి సుధియామ్

విమర్దాదన్యోన్యం కుచకలశయోరంతరగతం

తనూభూతం వ్యోమ ప్రవిశదివ నాభిం కుహరిణీమ్  ||

మ.  ఉమ! నీదౌ కృశమధ్య నే యమున శుష్కోర్మ్యాకృతిన్గల్గి కొం

చెము ధీయుక్తుల కేది దివ్యముగ భాసించున్ మహోద్ఘట్ట వి

భ్రమవక్షోజ గతాభ్రమెన్నఁ గృశమై స్వాంతోపమంబౌ యుదా

నమునే చేరు విధంబునొప్పెనది, యో జ్ఞానప్రదా! కాంచినన్.  ॥ 77 ॥

ప్రతిపదార్థము.  

జనని = జగజ్జననీ! 

శివే! = ఓ భగవతీ !

కృశే = సన్ననైన, 

తవ = నీ యొక్క, 

మధ్యే = నడుము భాగము నందు, 

యత్‌ యేతత్ = ఏయీ, 

కాళిందీ = యమునా నదియొక్క, 

తనుతర = మిక్కిలి చిన్నదియైన, 

తరంగ = అలవంటి 

ఆకృతి = రూపు గలదై, 

యత్ = ఏ

కించిత్‌ = కొంచెముగా కనబడు నూగారు, 

సుధియాం = విద్వాంసులకు, 

భాతి = ప్రకాశించుచు కనబడుచున్నదో అది, 

తవ = నీ యొక్క, 

కుచకలశయోః = కుచ కుంభములు, 

అన్యోన్యం = పరస్పరము, 

విమర్దాత్‌ = ఒరసి కొనునట్లు స్పృశించుకొనుట వలన, 

అంతరగతం = మధ్య భాగమున వర్తించునదైన, 

వ్యోమ = ఆకాశము, 

తనూభూతం = సన్ననిదై, 

కుహరిణీం = గుహవంటిదైన, 

నాభిం = బొడ్డును, 

ప్రవిశత్‌ + ఇవ = ప్రవేశించుచున్నది వలె ఉన్నది.

భావము. 

ఓ భగవతీ! యమునానదీ తరంగంవలె సన్ననిదై, నీ కృశమధ్యంలో అగపడే నూగారనే చిన్నవస్తువును చూచి యోచించగా - నీ కుచముల మధ్యనున్న ఆకాశం ఆకుచములురెండు పరస్పరం ఒరయటం వల్ల ఆఒరపిడికి తాళలేక నలిగినల్లనై సన్నగా క్రిందికి నాభివరకు జారినదిగా వున్నది.

78 వ శ్లోకము.  

స్థిరో గంగా వర్తస్స్తనముకుళ రోమావళి లతా

కలావాలం కుండం కుసుమశర తేజో హుతభుజః |

రతేర్లీలాగారం కిమపి తవ నాభిర్గిరిసుతే

బిలద్వారం సిద్ధేర్గిరిశనయనానాం విజయతే  ||

ఉ.  నీదగు నాభి, గాంగ నుతనిర్ఝరలో సుడి, గుబ్బమొగ్గలన్

మోదము నిల్పు రోమలత మూలము, మన్మథ కాంతివహ్నికిన్

బాదగునగ్నికుండ, మనవద్యరతీగృహ మాత్రిశూలికిన్

శ్రీద సునేత్రపర్వ గుహసీమపు ద్వారమవర్ణ్యమమ్మరో! ॥ 78 ॥

ప్రతిపదార్థము.  

గిరిసుతే = ఓ పార్వతీమాతా!, 

తవ = నీ యొక్క, 

నాభిః = బొడ్డు, 

స్థిరః = స్థిరముగా నున్న 

గంగా= గంగానది యొక్క 

ఆవర్తః = సుడి, 

స్తన = స్తనములు అను 

ముకుళ = పూల మొగ్గలకు ఆధారమైన, 

రోమావళి = నూగారు అను 

లతా = తీగయొక్క, 

కలా = రేఖకు,

ఆవాలం = పాదు,  

కుసుమశర = మన్మథుని యొక్క, 

తేజః = ప్రకాశమనెడి

హుతభుజః = అగ్నికి, 

కుండం = హోమగుండము, 

రతేః = రతీదేవికి, 

లీలాగారం = విలాసగృహము, 

గిరిశ నయనాం = సదాశివుని కన్నుల యొక్క, 

సిద్దాః = తపస్సు సిద్ధించుటకు, 

బిలద్వారం = గుహద్వారము, 

కిమపి = ఏమని వర్ణించుటకును వీలు కానిదై, 

విజయతే = సర్వోత్కృష్టముగా భాసిల్లుచున్నది. 

భావము. 

ఓ హిమగిరికన్యకా ! నీ నాభి చలనంలేని గంగానది నీటి సుడిగాను , పాలిండ్లనే పూమొగ్గలకు ఆధారమైన రోమరాజి అనే తీగయొక్క పాదుగాను , మన్మథుడి తేజస్సనే అగ్నికి హోమకుండంగాను , మరుని చెలువ ఐన రతీదేవికి శృంగారభవనంగాను , నీ పతి ఐన సదాశివుడి నయనాల తపస్సిధ్ధికి గుహాద్వారమై , అనిర్వాచ్యమై , అతిసుందరమై సర్వోత్కర్షతో ప్రకాశించుచున్నది.

79 వ శ్లోకము.  

నిసర్గ క్షీణస్య స్తనతట భరేణ క్లమజుషో

నమన్మూర్తే ర్నారీతిలక శనకైస్త్రుట్యత ఇవ |

చిరం తే మధ్యస్య త్రుటిత తటినీ తీర తరుణా

సమావస్థా స్థేమ్నో భవతు కుశలం శైలతనయే  || 

ఉ.  శైలతనూజ! నీ నడుము చక్కని నీ స్తనభారమోపమిన్

బేలవమై కృశించి జడిపించును దా విఱుగంగనున్నటుల్

వాలిన యేటిగట్టుపయి వాలిన చెట్టును బోలి, నీకికన్

మేలగుగాత, నీ నడుము మేలుగ వర్ధిలుగాక నిచ్చలున్. ॥ 79 ॥

ప్రతిపదార్థము.  

నారీ తిలక! = స్త్రీ రత్నమైన 

హే శైల తనయే = ఓ గిరిపుత్రీ!   

నిసర్గ= స్వభావసిద్ధముగనే 

క్షీణస్య = కృశించినదియు, 

స్తనతట = కుచప్రదేశముయొక్క, 

భరేణ = బరువుచే,  

క్లమజుషః = బడలినదియు, 

నమత్‌ = వంగిన 

మూర్తేః = రూపము గలదియు, 

శనకైః = కొంచెముగా, 

త్రుట్యత ఇవ = తెగిపోవుచున్నదో అనునట్లున్నదియు,

త్రుటిత = ఒడ్డు విఱిగిన, 

తటినీ = నది యొక్క, 

తీర= గట్టునందలి, 

తరుణా = వృక్షముతో, 

సమ = సమానమగు 

అవస్థా= అవస్థలో 

స్థేమ్నః = నిలకడగా నున్న, 

తే = నీ యొక్క, 

మధ్యస్య = నడుమునకు, 

చిరం = కలకాలము, 

కుశలం = క్షేమము, 

భవతు = అగుగాక ! 

భావము. 

ఓ శైలతనయా ! ఓ నారీ తిలకమా ! సన్ననిదీ , పాలిండ్ల భారంచేత బడలినదీ క్రిందకువంగి తెగుతున్నదో అన్నట్లున్నదీ , కట్టతెగిన ఏటిగట్టునందలి చెట్టుతో సమానమైన స్థితిని పొందినదీ , ఐన నీ నడుము చిరకాలం సురక్షితంగా ఉండుగాక.

80 వ శ్లోకము.  

కుచౌ సద్యస్స్విద్యత్తట ఘటిత కూర్పాస భిదురౌ

కషంతౌ దోర్మూలే కనకకలశాభౌ కలయతా |

తవ త్రాతుం భంగాదలమితి వలగ్నం తనుభువా

త్రిధా నద్ధం దేవీ త్రివళి లవలీవల్లిభిరివ  || 

చం.  చెమరుచు నీదు పార్శ్వములఁ జీలునొ చోలమనంగ నొత్తు నీ

విమల పయోధరంబులను విస్తృతిఁ గొల్పెడి మన్మథుండు భం

గము కలిగింపరాదను గౌనునకున్ లవలీ త్రివల్లులన్

సముచితరీతిఁ గట్టినటు చక్కగ నొప్పుచు నున్నదమ్మరో! ॥ 80 ॥

ప్రతిపదార్థము.  

దేవి! = ఓ దివ్యమంగళ స్వరూపిణీ ! 

సద్యః = ఎప్పటికప్పుడే, 

స్విద్యత్‌ = (ఈశ్వరిని తలంపుచే)చెమర్చుచున్న 

తట = పార్శ్వములందు, 

ఘటిత = తొడగఁబడిన, 

కూర్పాస = రవికను, 

భిదురౌ = పిగిల్చుచున్నవియు, 

దోర్మూలే = బాహువుల మూలములను, 

కషంతౌ = ఒఱియుచున్న, 

కనక + కలశ + ఆభౌ = బంగారు కడవలవంటి, 

కుచౌ = స్తనములను, 

కలయతా = నిర్మించుచున్న, 

తనుభువా = మన్మథుని చేత, 

భంగాత్‌ = అపాయము నుండి, 

త్రాతుం = కాపాడుటకు, 

అలమితి = చాలునని,

తవ = నీ యొక్క, 

వలగ్నం = నడుము, 

త్రివళి = మూడు ముడుతలు అనెడి, 

లవలీ వల్లిభిః = ఏలకి తీగల చేత, 

త్రిధా = ముప్పేటలుగా, 

నద్ధం ఇవ = కట్టబడినదియా అన్నట్లున్నది.  

భావము. 

ఓ ప్రకాశించే రూపుగల దేవీ! ఎప్పటికప్పుడే చెమట పోస్తున్న పార్శ్వములలో అంటుకొనియున్న రవికెను పిగుల్చుచున్నవీ , బాహుమూలల సమీప ప్రదేశాలను ఒరయుచున్నవీ, బంగారుకలశంవలె ఒప్పారుచున్నవీ ఐన కుచములను నిర్మిస్తూన్న మన్మథుఁడు, యీ (స్తన భారంవల్ల) భంగం కలుగరాదని నడుమును కాపాడటానికి లవలీ లతలతోముప్పేటగా కట్టబడెనా అన్నట్లు నీ పొట్టమీద మూడుముడతలు తోచుచున్నవి.

81 వ శ్లోకము.  

గురుత్వం విస్తారం క్షితిధరపతిః పార్వతి నిజా

న్నితంబాదాచ్ఛిద్య త్వయి హరణ రూపేణ నిదధే |

అతస్తే విస్తీర్ణో గురురయమశేషాం వసుమతీం

నితంబ ప్రాగ్భారస్స్థగయతి లఘుత్వం నయతి చ  ||

చం.  తనదు గురుత్వమున్, విరివి, తండ్రి నితంబము నుండి తీసి నీ

కని యరణం బొసంగుటను గల్గిన నీదు నితంబ భారమీ

ఘన ధరాభారమున్ గెలిచెఁ గప్పి విశాలతనొప్పి హైమ! నీ 

జనకుని కీర్తి పెంపుఁ గొనెఁ జక్కగ నీవు వెలుంగుచుండుటన్. ॥ 81 ॥

ప్రతిపదార్థము.  

పార్వతీ ! = ఓ గిరిజా !, 

క్షితిధరపతిః = పర్వతరాజగు నీ తండ్రి హిమవంతుడు,  

గురుత్వం = బరువును, 

విస్తారం = విశాలత్వమును, 

నిజాత్‌ = తనకు చెందిన, 

నితంబాత్‌ = కొండనడుమ నుండి, 

ఆచ్ఛిద్య = వేరుచేసి తీసి 

త్వయి = నీయందు, 

హరణ రూపేణ = కూతురునకు తండ్రీ యిచ్చు స్త్రీ ధనము రూపముగా, 

నిదధే = సమర్పించెను, 

అతః = ఇందువలననే, 

తే = నీ యొక్క, 

అయం = కనబడుచున్న, 

నితంబ = మొలవెనుకపట్టి యొక్క 

ప్రాగ్భారః = అతిశయము, 

గురుః = గొప్పగా బరువు గలదియు, 

విస్తీర్ణః = విశాలమైనదియునగుచు, 

అశేషాం = సమస్తమైన, 

వసుమతీం = భూమిని, 

స్థగయతి = కప్పుచున్నది, 

లఘుత్వం = చులకనను, 

నయతి చ = పొందించుచున్నది కూడా.

భావము.

ఓ గిరిజా ! పర్వతరాజగు నీ తండ్రి హిమవంతుడు బరువును, విశాలత్వమును, తనకు చెందినకొండనడుమ యందు గల చదునైన ప్రదేశము నుండి వేరుచేసి తీసి కూతురునకు తండ్రి యిచ్చు స్త్రీ ధనము రూపముగా సమర్పించెను, ఇందువలననే, నీ యొక్కకనబడుచున్నపిఱుదుల యొక్క అతిశయము, గొప్పగా బరువు గలదియు, విశాలమైనదగుచు, సమస్తమైనభూమిని, ఆచ్ఛాదించుచున్నది. అనగా, కప్పుచున్నది. చులకన చేయుచున్నది, అనగా - తన కంటె తక్కువ చేయుచున్నదికూడా.

82 వ శ్లోకము.  

కరీంద్రాణాం శుండాన్ కనకకదళీ కాండపటలీ

ముభాభ్యామూరుభ్యాముభయమపి నిర్జిత్య భవతి |

సువృత్తాభ్యాం పత్యుః ప్రణతి కఠినాభ్యాం గిరిసుతే

విధిజ్ఞే జానుభ్యాం విబుధ కరికుంభద్వయమసి  ||

మ.  గిరిజా! సన్నుత! యో విధిజ్ఞ! జయసంకేతమ్మ!  నీ యూరువుల్

కరి తొండమ్ముల, నవ్యదివ్య కదళీకాండమ్ములన్ గెల్చునే,

పరమేశానుని సత్ప్రదక్షిణవిధిన్ బ్రార్థించుటన్ జానువుల్

కరి కుంభమ్ముల మించియుండెఁ, గన సంకాశమ్మె లేదీశ్వరీ! ॥ 82 ॥

ప్రతిపదార్థము.  

విధిజ్ఞే = శాస్త్రార్థమునెఱింగిన, 

గిరిసుతే ! = ఓ పార్వతీ ! 

భవతి = నీవు, 

కరీంద్రాణాం = ఏనుగుల యొక్క, 

శుండాన్‌ = తొండములను, 

కనక = బంగారు 

కదళీ = అరటి చెట్లయొక్క,

కాండ = స్తంభాల యొక్క

పటలీం = సమూహమును, 

ఉభాభ్యాం ఊరుభ్యాం = నీ రెండు తొడలచే, 

ఉభయం అపి = ఏనుగు తొండములు, అరటి స్తంభములు అను రెంటిని గూడ, 

నిర్జిత్య = జయించి

సువృత్తాభ్యాం = అందముగాను, వర్తులాకారములోను వుండి, 

పత్యుః = భర్తయగు పరమేశ్వరునికి, 

ప్రణతి కఠినాభ్యాం = చేయు నమస్కారముల చేత కఠినములైన, 

జానుభ్యాం = మోకాళ్ళ చేత, 

విబుధ కరి = ఐరావతము యొక్క, 

కుంభద్వయం = కుంభస్థలముల రెంటిని, 

నిర్జిత్య = జయించినదానివిగా, 

అసి = ఉంటివి.  

భావము. 

ఓ హిమగిరిపుత్రీ! వేదార్థవిధి నెఱిగి అనుష్ఠించే రాణీ, నీ ఊరువులు అందంలో గజరాజాల తొండములను ,బంగారు అరటిస్తంభాల సముదాయములను ధిక్కరిస్తున్నవి. నీ రెండు ఊరువులు ( తొడల) చేత జయించి , శోభనములై వర్తులములు కలిగినవీ భర్త ఐన పరమేశ్వరుడికి మ్రొక్కుటచేత గట్టిపడినవైన నీ జానువులు , ఐరావతం కుంభస్థలముల జంటలను కూడ జయించి ప్రకాశిస్తున్నాయి.( ఈ బ్రహ్మాండమే అమ్మ స్వరూపమైనప్పుడు సృష్టిలోని ఏ శరీరం ఆమె సౌందర్యంతో తులతూగ గలదు ? తులతూగలేదు అని భావము.

83 వ శ్లోకము.  

పరాజేతుం రుద్రం ద్విగుణశరగర్భౌ గిరిసుతే

నిషంగౌ జంఘే తే విషమవిశిఖో బాఢమకృత |

యదగ్రే దృశ్యంతే దశశరఫలాః పాదయుగళీ

నఖాగ్రచ్ఛద్మానస్సుర మకుట శాణైక నిశితాః  ||

చం.  మదనుఁడు శంభునిన్ గెలువ మాతరొ! తా శరపంచకంబునే

పదిగనొనర్పనెంచి, తమ పాదపు వ్రేళ్ళను, బిక్కలన్ దగన్ 

మది శరపాళిగా, దొనగ, మన్ననఁ జేసె, నఖాళిముల్కులా

పదనుగఁజేయఁబడ్డ సురపాళి కిరీటపుఁ గెంపులే కనన్. ॥ 83 ॥

ప్రతిపదార్థము.  

గిరిసుతే = ఓ గిరిపుత్రీ! 

విషమ విశిఖః = విషమశరుఁడగు మన్మథుఁడు, 

రుద్రం = శివుని, 

పరాజేతుం = పరాజయము పాలు చేయుటకు, 

తే = నీ యొక్క, 

జంఘే = పిక్కలను,

ద్విగుణ = రెట్టింపుగా చేయబడిన,  

శర = బాణములనే 

(సహజముగా తనకు వున్న ఐదు బాణములు రెండు రెట్లు అయినపుడు పదిబాణములు అగును) 

గర్భౌ = లోపల నిక్షిప్తమైయుంచఁబడిన, 

నిషంగౌ = అమ్ములపొదులుగా, 

అకృత = చేసినాడు, 

బాఢం = (ఇది) నిజము. 

యత్‌ + అగ్రే = ఏ పిక్కల తుదను, 

పాదయుగళీ = పాదముల జంటయొక్క, 

నఖ + అగ్ర = గోళ్ళ చివరల యొక్క, 

ఛద్మానః = నెపము గలవైన, 

సుర = దేవతల యొక్క, 

మకుట = కిరీటములనెడు, 

శాణ = సాన పెట్టెడు రాళ్ళ చేత, 

ఏక నికషాః = పదును పెట్టబడినవై, 

దశ = రెండింతలు,

శర = బాణముల యొక్క, 

ఫలాః = ములుకులు, 

దృశ్యంతే = కనబడుచున్నవి.  

భావము. 

ఓ హిమగిరిసుతా! మన్మథుఁడు రుద్రుణ్ణి ఓడించటానికి తన ఐదుబాణాలు చాలవని వాటిని పదిబాణాలు చేసుకోనెంచి , నీ పిక్కలను అమ్ముల పొదులుగాను, కాలివ్రేళ్ళను బాణాలుగాను , నఖాగ్రాలను బాణాల కొనలందు పదనుబెట్టి ఉంచిన ఉక్కుముక్కలుగాను గావించుకొన్నాడు .( నమస్కరిస్తూన్న దేవతల కిరీటాలలోని మణులనే ఒరపిడి రాళ్ళచే నఖాగ్రాలనే ములుకులు పదను పెట్టబడినవి). 

84 వ శ్లోకము.  

శ్రుతీనాం మూర్ధానో దధతి తవ యౌ శేఖరతయా

మమాప్యేతౌ మాతశ్శిరసి దయయా ధేహి చరణౌ |

యయోః పాద్యం పాథః పశుపతి జటాజూట తటినీ

యయోర్లాక్షాలక్ష్మీరరుణ హరిచూడామణి రుచిః ||

శా.  ఏ నీ పాదములన్ ధరించు శ్రుతులే ధ్యేయంబుతో నౌదల 

న్నే నీ పాదజలంబు నెత్తిని హరుండే కల్గు నా గంగయో,

యే నీ పాదపు లత్తుకారుణము లక్ష్మీశాను రత్నాంశువో, 

యా నీ పాదములుంచు నా శిరముపై నమ్మా! కృపన్, నిత్యమున్. ॥ 84 ॥

ప్రతిపదార్థము.  

మాతః = ఓ తల్లీ !, 

తవ = నీ యొక్క, 

యౌ = ఏ, 

చరణౌ = పాదములను, 

శ్రుతీనాం = వేదముల యొక్క, 

మూర్ధానః = శిరములైన వేదాంతములు, లేదా ఉపనిషత్తులు, 

శేఖరతయా = శిరోభూషణములుగా, 

దధతి = ధరించుచున్నవో, 

(హే) మాతః = ఓ తల్లీ |, 

యయోః = ఏ నీ చరణములకు, 

పాద్యం = పాదములను కడుగు, 

పాథః = జలము, 

పశుపతి = శివుని యొక్క, 

జటాజూట = జడముడి యందలి, 

తటినీ = గంగయో, 

యయోః = ఏ చరణముల యొక్క, 

లాక్షా లక్ష్మీః = లత్తుక శోభ కలదో అది

అరుణ = ఎఱ్ఱని, 

హరి = విష్ణువు యొక్క, 

చూడామణి = శిరోభూషణము యొక్క, 

రుచిః = కాంతియో.  

ఏతౌ = అట్టి  ఈ, 

చరణౌ = పాదములను, 

మమాఽపి = నా యొక్కయు, 

శిరసి = శిరస్పునందు, 

దయయా = దయతో, 

ధేహి = ఉంచుము, 

భావము. 

ఓ లోకమాతా ! ఏ నీ చరణాలకు శివుడి జటాజూటంలో వర్తించే గంగ పాదప్రక్షాళన జలం అవుతుందో , ఏ నీ చరణలత్తుక రసంపు కాంతికెంజాయలు శ్రీ మహావిష్ణువు మణిమయ కిరీటానికి వెలుగును ఆపాదిస్తున్నాయో , శ్రుతులశిరస్సులైన ఉపనిషత్తులు ఏ నీ పదాలను సిగపువ్వుగా ధరిస్తున్నవో, ఓ మాతా! కృపతో కూడిన చిత్తంగల దానవైన నీవు , ఆ నీ చరణాలను నాశిరస్సుమీద కూడా ఉంచు.


85 వ శ్లోకము.  

నమో వాకం బ్రూమో నయన రమణీయాయ పదయో

స్తవాస్మై ద్వంద్వాయ స్ఫుట రుచి రసాలక్తకవతే |

అసూయత్యత్యంతం యదభిహననాయ స్పృహయతే

పశూనామీశానః ప్రమదవన కంకేళి తరవే  ||

మ.  నయనానందకరంబుగా వెలుఁగు గణ్యంబైన పారాణితో.

జయ కంకేళికిఁ దాకుటెంచి హరుఁ డీర్ష్యన్ బొంది యా పాదముల్ 

ప్రియమొప్పన్ దగులంగఁ గోరుఁ దనకున్, శ్రీదేవి! నీ పాదముల్ 

జయదంబై కృపఁ జూడ నన్నుఁ గొలుతున్ జక్కంగ నే భక్తితోన్.

॥ 85 ॥

ప్రతిపదార్థము.  

ఓ జగజ్జననీ = ఓ లోకమాతా! 

పశూనాం ఈశానః = పశుపతి అయిన శివుడు, 

యత్‌ అభిహననాయ = ఏ నీ పాద యుగ్మ తాడనమును, స్పృహయతే = కోరుచున్నాడో, 

ప్రమదవన = ఉద్యానము నందలి, 

కంకేళి తరవే = అశోక వృక్షము కొఱకు, 

అత్యంతం అసూయతి = నీ సంచారముచే నీ పాదములకు వాటికి తాకెనని వాటిపై మిక్కిలి అసూయపడుచున్నాడో.  

నయన = కన్నులకు 

రమణీయాయ = ఇంపు గొలుపునదై, 

స్ఫుట = స్పష్టముగా ప్రకాశించు 

రుచి = కాంతి గలదై, 

రస + అలక్తకవతే = తడి లత్తుక కలిగిన, 

పదయోః = అట్టి నీ పాదముల యొక్క, 

అస్మై = ఈ కనబడు, 

ద్వంద్వాయ = జంటకు, 

నమోవాకం = నమస్కార వచనమును, 

బ్రూమః = వచించెదము, 

భావము. 

ఓ భగవతీ! లత్తుక రసంచే తడిసి కెంపుగొన్నదై , చూచువారి కనుదమ్ములకు మిగుల సొంపు నింపు గొలిపేదై చక్కగా వెలుగొందుతున్న నీ పాదద్వయానికి నమస్కరిస్తున్నాం. పశుపతి ఐన శివుడు ఏనీ పాదపద్మ తాడనాన్ని కోరుతూ , ఆతాడన భాగ్యానికి నోచుకునే అలరుల తోటలోని అశోకవృక్షాన్ని గాంచి దానిపై అసూయపడుతున్నాడో అట్టి నీ చరణారవిందాలకు నమస్కరిస్తున్నాను.


86 వ శ్లోకము.  

మృషా కృత్వా గోత్రస్ఖలనమథ వైలక్ష్యనమితం

లలాటే భర్తారం చరణకమలే తాడయతి తే |

చిరాదంతశ్శల్యం దహనకృత మున్మూలితవతా

తులాకోటిక్వాణైః కిలికిలిత మీశాన రిపుణా || 

చం.  పొరపడి నీ సపత్నినధిపుం డల పిల్చియు తెల్లఁబోయి, నీ

చరణము మ్రొక్కఁ, దన్నితివి శంభుని ఫాలముపై, మనంబులో

స్మరుఁడు దహింపఁబడ్డ యవమానపుఁ గంటకుఁడై హసించిన

ట్లరయగ నూపురధ్వని మహాద్భుత కిల్కిలశబ్దమొప్పెనే,॥ 86 ॥

ప్రతిపదార్థము.  

ఓ జగజ్జననీ! = ఓ లోకమాతా!

మృషా = పొరపాటున, 

గోత్ర స్ఖలనం = భార్యను సవతి పేరుతో పిలుచుట, 

కృత్వా = చేసి, 

అథ = ఆ తర్వాత, 

వైలక్ష్య = వెల్లపాటుచే, 

నమితం = పాద ప్రణామము చేసిన, 

భర్తారం = పతి అగుశివుని, 

తే = నీ యొక్క, 

చరణ కమలే = పాదపద్మముతో, 

లలాటే = లలాట ప్రదేశమునందు, అనగా - ఫాల భాగము 

నందు, 

తాడయతి = తన్నినదానివి కాగా, 

ఈశాన రిపుణా = శివుని శత్రువగు మన్మథుని చేత, 

చిరాత్‌ = చాలా కాలము నుండి (బాధించు చున్న) దహనకృతం = (శివుని మూడవకంటి) చిచ్చుచేత, కాల్చబడినదై చేయబడిన, 

అంతశ్శల్యం = హృదయమునందున్న వైరమును, (బాధ)

ఉన్మూలితవతా =మాపుకొనిన వానికి, (తీరినవాడయిన మదనునికి)

తులాకోటి = నీ కాలి అందెల యొక్క, 

క్వాణైః = మ్రోతల చేత, 

కిలికిలితం = కిలకిలా రావానుకరణముతో విజయ సూచక మగుచున్నది.  

భావము. 

తల్లీ! పొరపాటుగా నీదగ్గర సవతి పేరు జెప్పి తరువాత ఏమీ చేయటానికి తోచక వెలవెలబాటుచే లొంగిన భర్తను, నీ చరణ కమలంతో నుదుట తాడనం జరుపగా గాంచి శివుడికి శత్రువైన మన్మథుఁడు (ఇలాగైనా తనపగ తీరేట్లు శాస్తి జరిగిందని) నీ కాలి అందెల మ్రోతలచేత కిలకిలారావాన్ని గావించారు.


87 వ శ్లోకము.  

హిమానీ హంతవ్యం హిమగిరినివాసైక చతురౌ

నిశాయాం నిద్రాణం నిశి చరమభాగే చ విశదౌ |

వరం లక్ష్మీపాత్రం శ్రియ మతిసృజంతౌ సమయినాం

సరోజం త్వత్పాదౌ జనని జయతశ్చిత్రమిహ కిమ్  ||

ఉ.  నీ పదముల్ హిమాద్రిపయి నేర్పున నిల్చును, శుద్ధమై, పవల్ 

మాపటి యంతమందునను, మాయవు, భక్తులభాగ్యమాచు నా

మాపటి వేళఁ గ్రుంకుచును, మంచున మాసెడి శ్రీకిఁ పీఠమై,

ప్రాపుగనున్న పద్మమును వాసిగ గెల్చుట చిత్రమా? సతీ! ॥ 87 ॥

ప్రతిపదార్థము.  

హే జననీ! = ఓ తల్లీ!  

హిమగిరి=మంచుకొండ యందు 

నివాస = నివసించుటలో, 

ఏకచతురౌ = నైపుణ్యము గలవియు, 

నిశి = రాత్రియందును, 

చరమభాగేచ = రాత్రి చివరి సమయములందు గూడ, 

విశదౌ = ప్రకాశ వికాసము గలవియు, 

సమయినాం = సమయాచారపరులైన భక్తులకు, 

శ్రియం = సంపదను, 

అతిసృజంతౌ = మిక్కుటముగా కలుగ జేయునవియును, అయిన, 

త్వత్‌ పాదౌ = నీ పాదములు  

హిమానీ = మంచుచే 

హంతవ్యం = నశింపచేయ తగినవియు, 

నిశాయాం = రాత్రియందు, 

నిద్రాణం = నిద్రించునదియు, 

వరం = ఇష్టమైన, 

లక్ష్మీపాత్రం = లక్ష్మీదేవి అధిష్ఠించుటకు పీఠమైన, 

సరోజం = పద్మమును, 

జయతః = జయించుచున్నవి. 

ఇహ = ఈ విషయమునందు, 

కిం చిత్రం = ఏమి ఆశ్చర్యమున్నది? 

భావము. 

ఓ జననీ! మంచుకొండలలో సైతం కుంచించుకు పోకుండా ఉండగలిగేవీ రాత్రీ పగలు వికసిస్తూ నీ భక్తులకు అనూన సంపదలను కలిగించేవీ ఐన నీ పాద కమలాలతో , మంచుచేత నశింపజేయదగినదీ లక్ష్మీదేవికి ఆలవాలమై రాత్రివేళలో ముడుచుకొని పోయేదీ ఐన సామాన్య కమలం ఏవిధంగానూ సరితూగదని చెప్పడంలో ఆశ్చర్యం ఏమున్నది ? 


88 వ శ్లోకము.  

పదం తే కీర్తీనాం ప్రపదమపదం దేవి విపదాం

కథం నీతం సద్భిః కఠిన కమఠీ కర్పర తులామ్ |

కథం వా పాణిభ్యాముపయమనకాలే పురభిదా

యదాదాయ న్యస్తం దృషది దయమానేన మనసా  || 

శా.  ఆమ్మా! కీర్తికి దావలంబగుచు, ఘోరాఘంబులన్, వ్యాధులన్,

నెమ్మిన్ బాపు సుకోమలంబయినవౌ నీ పాద పైభాగమున్,

సమ్మాన్యుల్,కమఠీకరోటి యనగన్ సామ్యంబె? శ్రీకంఠుఁ డో

యమ్మా! పెండ్లికి సన్నికల్లుపయినె ట్లానించె నీ పాదముల్. ॥ 88 ॥

ప్రతిపదార్థము.  

దేవి! = ఓ పార్వతీదేవీ!  

తే = నీ యొక్క, 

ప్రపదం = పాదము చివరి భాగము, 

కీర్తీనాం = యశస్సులకు, 

పదం = ఉనికిపట్టును, 

విపదాం = ఆపదలకు, 

అపదం = కానిచోటును, (అయిన) 

సద్భిః = సత్కవులచేత 

కఠిన = బిరుసయిన, 

కమఠీ = ఆడుతాబేలు యొక్క, 

కర్పర = వీపుపై డిప్పతో, 

తులాం = పోలికను, 

కథం = ఏ విధముగా, 

నీతం = పొందఁబడినది ? 

ఉపయమనకాలే = వివాహ సమయమందు, 

పురభిదా = త్రిపురహరుడైన శివుని, 

పాణిభ్యాం = హస్తముల చేత, 

యత్‌ = ఏ నీ పాదము, 

దయామానేన = దయగల, 

మనసా = మనస్సు చేత, 

ఆదాయ = పట్టుకోబడి, 

కథం వా = ఏ విధముగా, 

దృషది = సన్నికల్లుపైన, 

న్యస్తం = ఉంచ బడినవి కదా! 

భావము. 

ఓ దేవీ! కీర్తికినెలవై సంకటములను పారదోలు కుసుమసుకుమారమగు నీపాదమును మహాకవులు క్రూరముగా తాబేటిబొచ్చెతో నెట్లుపోల్చిరో తెలియదు. వివాహకాలమందు శంకరుడు తాను దయగలవాడయ్యుండి రెండుచేతులతోబట్టి యెట్లుసన్నెకంటి (నూఱుడుఱాయి) ని నొక్కించెనో తెలియదు.


89 వ శ్లోకము.  

నఖైర్నాకస్త్రీణాం కరకమలసంకోచశశిభి

స్తరూణాం దివ్యానాం హసత ఇవ తే చండి చరణౌ |

ఫలాని స్వస్థేభ్యః కిసలయ కరాగ్రేణ దదతాం

దరిద్రేభ్యో భద్రాం శ్రియమనిశమహ్నాయ దదతౌ  ||

ఉ.  పేదకు పుష్కలంబుగ భువిన్ సిరులిచ్చెడి నీదుపాదముల్

బాధను దేవమానినుల పాణ్యుదజంబుల మోడ్పుఁ గొల్పుటన్

గ్లేదువులౌ నఖాళిఁ బరికింపగ దైవతపాళి కోరికల్

లేదనకిచ్చు కల్పకపు లే జివురాకుల గేలి చేసెడిన్. ॥ 89 ॥

ప్రతిపదార్థము.

చండి = ఓ పార్వతీ! 

దరిద్రేభ్యః = బీదల కొఱకు, 

భద్రాం = పుష్కలమైన, 

శ్రియం = లక్ష్మిని, 

అనిశం = ఎల్లపుడు, 

అహ్నాయ = శీఘ్రముగా, 

దదతౌ = ఇచ్చుచున్న, 

తే = నీయొక్క, 

చరణౌ =  పాదములు, 

నాక స్త్రీణాం = దేవ వనితల యొక్క, 

కర = హస్తములనెడి, 

కమల = తామర పూవులను, 

సజ్కోచ = ముకుళింపఁ జేయుట యందు, 

శశిభిః = చంద్రులైన (దేవి పాదదర్శన మైనతోడనే దేవాంగనలు అంజలి ఘటియింతురు), 

నఖైః = గోళ్ల చేత, 

స్వఃస్థేభ్యః = స్వర్గ మందున్న (సర్వసంపత్సమృద్ధిగల) దేవతల కొఱకు, 

ఫలాని = కోరిన వస్తువులను, 

కిసలయ = చిగురుటాకులవంటి, 

కర = హస్తముల యొక్క, 

అగ్రేణ = కొనలచేత, 

దదతాం = ఇచ్చుచున్న, 

దివ్యానాం = స్వర్గమందున్న, 

తరూణాం = కల్పవృక్షములకు, 

హసత ఇవ = నవ్వుచున్నవో అనువిధముగ ఉన్నవి.

భావము .

చండీ నామంతో శోభిల్లే తల్లీ ! నీ పాదాలు, సకలసంపదలతో తులతూగుతున్న దేవతలకు మాత్రమే కోరికలు తీర్చే కల్పవృక్షాన్ని తలదన్నుతూ , దీనజనులకు మంగళకరమైన అధిక సంపదలను ఒసగుతున్నాయి. నీ గోళ్ళు దేవతాస్త్రీల కరపద్మాలను ముకుళింపజేసే చంద్రుడిలా శోభిల్లుతున్నాయి.


90 వ శ్లోకము.  

దదానే దీనేభ్యశ్శ్రియమనిశమాశానుసదృశీ

మమందం సౌందర్య ప్రకర మకరందం వికిరతి |

తవాస్మిన్ మందారస్తబకసుభగే యాతు చరణే

నిమజ్జన్ మజ్జీవః కరణ చరణైష్షట్ చరణతామ్  ||

మ.  వన మందార సుపుష్పగుచ్ఛములు నీ పాదద్వయంబెన్న, భా

వనఁ జేయంగ మరందముల్ చిలుకుచున్ భాగ్యాళినిచ్చున్గదా,

నిను భావించెడి నాదు జీవన సుకాండి క్షోభలే పాయుతన్

వినుతిన్ నీపదపద్మసన్మధువులే ప్రీతిన్ సదా క్రోలుటన్. ॥ 90 ॥ (సుకాండి=తుమ్మెద)

ప్రతిపదార్థము.  

హె జగజ్జననీ! = ఓ లోకమాతా! 

దీనేభ్యః = దరిద్రుల కొఱకు, 

శ్రియం = సిరిసంపదలను, 

అనిశం = ఎల్లప్పుడు, 

ఆశానుసదృశీం = కోర్కెలకు తగినట్లుగా, 

దదానే = ఇచ్చుచున్నదియు, 

అమందం = అధికమైన, 

సౌందర్య = అందము యొక్క, 

ప్రకర = సమూహము అను, 

మకరందం = తేనెను, 

వికిరతి = వెదజల్లునదియు, 

మందార = మందారము అను 

స్తబకసుభగే = కల్పవృక్షము యొక్క పూలగుత్తు వలె 

శోభాయమాన మైనదియు అగు, 

అస్మిన్‌ = ఈ (కనబడు) 

తవ = నీ యొక్క, 

చరణే = పాదమునందు 

కరణ చరణైః = అరు ఇంద్రియములచే, 

మత్‌ జీవః = నేను అను జీవుడు, 

నిమజ్జన్‌ = మునుగుచున్నవాడై, 

షట్చరణతాం = భ్రమర భావమును, 

యాతు = పొందుగాక ! 

భావము. 

తల్లీ! భగవతీ! జగన్మాతా! దీనుల కెల్లరకును, వాంఛానురూపమైన (వారి వారి కోర్కెలననుసరించి) సంపదను నిరంతరం ప్రసాదించేదియును, మిక్కిలి సౌందర్యము, లావణ్య సమూహము అనుపూ దేనియను (మకరందమును) వెదజల్లుచున్నదియు, కల్పవృక్ష రూపమైన నీ పాద పద్మముల యందు.మనస్సు + పంచేంద్రియములు అనెడి ఆరు పాదముల భ్రమరమునై నీ పాదకమలములందలి మకరందమును గ్రోలుదును గాక. 


91 వ శ్లోకము.  
పదన్యాసక్రీడా పరిచయమివారబ్ధుమనసః
స్ఖలంతస్తే ఖేలం భవన కలహంసా న జహతి |
అతస్తేషాం శిక్షాం సుభగమణిమంజీరరణిత
చ్ఛలాదాచక్షాణం చరణకమలం చారుచరితే  ||
శా.  నిత్యంబున్ గలహంసలెన్నొ కనుచున్  నీదౌ పదన్యాసమున్
బ్రత్యేకంబుగ నేర్చుచుండె జననీ! వర్ధిల్లగా నెంచి, యౌ
న్నత్యంబుం గొలుపంగ శిక్షణము గ్రన్నన్ నేర్పునట్లొప్పుచున్
నిత్యంబీవు ధరించునందెల రవల్ స్నిగ్ధంబుగా నొప్పెడిన్.॥ 91 ॥
ప్రతిపదార్థము.  
చారుచరితే = సుందరమైన నడతగల ఓ దేవీ ! 
తే = నీ యొక్క, 
భవన = ఇంటియందలి 
కలహంసాః = పెంపుడు హంసల యొక్క, 
పద = పాదములను, 
న్యాస = ఉంచుట యందలి,  
క్రీడా = ఆటయందు, 
పరిచయం = శిక్షణవలె, 
ఆరబ్ధుమనస ఇవ = పొందగోరు మనస్సు గలవైనవాటివలె, 
స్ఖలంతః = జాఱుచున్న నడక గలవై, 
ఖేలం = విలాస గమనమును, 
న జహతి = వదలుట లేదు, 
అతః = ఇందువలన, 
చరణ కమలం = నీ పాదపద్మము, 
సుభగ = సుందరమైన, 
మణిమంజీర = మణులతో గూడిన అందియ యొక్క, 
రణిత = సవ్వడుల యొక్క 
ఛలాత్‌ = నెపము వలన, 
తేషాం = ఆ కలహంసలకు, 
శిక్షాం = నడకకు సంబంధించిన శిక్షణగ అగుటకు, 
ఆచక్షాణం = నేర్పుచున్నది వలె వున్నది. 
భావము. 
ఓ చారుచరితా ! నీ అద్భుత గమన విన్యాసాన్ని గాంచి నడక నేర్చుకోదలచినవై, నీ పెంపుడు హంసలు తొట్రుపాటు చెందుతూ నీ గమన విలాసాన్ని వీడకున్నవి. అందువల్ల నీ పాద కమలం కెంపులు మొదలగు రత్నాలు తాపిన అందియ మ్రోతలనే నెపంతో, ఆరాజహంసకు ఖేలన శిక్షను గరుపుతున్నట్లుగా ఉన్నది.

92 వ శ్లోకము.  
గతాస్తే మంచత్వం ద్రుహిణ హరి రుద్రేశ్వర భృతః
శివస్స్వచ్ఛచ్ఛాయా ఘటిత కపటప్రచ్ఛదపటః |
త్వదీయానాం భాసాం ప్రతిఫలన రాగారుణతయా
శరీరీ శృంగారో రస ఇవ దృశాం దోగ్ధి కుతుకమ్ ||
చం.  శివుఁడును, బ్రహ్మ విష్ణువులు, శ్రీకరి! రుద్రుఁడు మంచమై భరిం
ప, వర సదా శివత్వమది వర్ధిలు కాంతినెపంబు నొప్పి నీ  
బ్రవర నిచోళమై తనరి, భాసిలు నీదగు రాగ శోణమౌ
చు, వలపు బోళ మమ్మ! తమ శోభిలు కన్నులవిందుఁ జేసెనే. ॥ 92 ॥
ప్రతిపదార్థము.  
హే జగజ్జననీ = ఓ లోకమాతా!
ద్రుహిణ = బ్రహ్మ, 
హరి = విష్ణువు, 
రుద్ర = రుద్రుడు, 
ఈశ్వర = ఈశ్వరుడు, 
భృతః = భరించువారుగా ఈ నలుగురు, 
తే = నీయొక్క, 
మంచత్వం = మంచము యొక్క రూపముగా అగుటను, 
గతాః = పొందినవారైరి, 
శివః = సదాశివతత్త్వము, 
స్వచ్ఛచ్ఛాయా = నిర్మలమైన కాంతి అను, 
కపట = నెపము గల, 
ఘటిత = కూడబడిన, 
ప్రచ్చద పటః= కప్పుకొను దుప్పటియై,  
త్వదీయానాం = నీకు సంబంధించిన వారైన, 
భాసాం = కాంతుల యొక్క, 
ప్రతిఫలన = ప్రతిఫలించుటచేతనైన, 
రాగ= ఏ ఎఱ్ఱదనము సంక్రమించినదో దానినే, 
అరుణతయా = రక్తవర్ణమగుటచే, 
శరీరీ = భౌతికమైన రూపు పొందిన, 
శృంగారః రస ఇవ = శృంగార రసము వలె, 
దృశాం = నీ యొక్క వీక్షణములకు, 
కుతుకం = ఆనందమును, 
దోగ్ధి = పిదుకుచున్నాడు, అనగా - కలిగించుచున్నాడు. 
భావము. 
హే భగవతీ ! బ్రహ్మ, విష్ణువు, రుద్రుడు, ఈశ్వరుడు అనే అధికార పురుషులు నలుగురు మహేశ్వరతత్త్వంలో అంతర్గతులైనవారు కాబట్టి నువ్వు అధిష్ఠించే మంచముయొక్క నాలుగు కోడులై వున్నారు. సదాశివుడు విమలకాంతి ఘటనారూపం వ్యాజాన దుప్పటమగుతూ , నీ మేనికాంతులు ప్రతిఫలించటంచేత ఎర్రబారిమూర్తిమంతమైన శృంగారరసంవలె నయనాలకు ఆనందాన్ని ఇస్తున్నాడు. ( తెల్లని కాంతిగల శివుడు దేవి మేని ఎర్రని కాంతులు ప్రతిఫలించగా ఎర్రనివాడై ఆమెను సేవిస్తున్నాడని భావము.)

93 వ శ్లోకము.  
అరాళా కేశేషు ప్రకృత సరళా మందహసితే
శిరీషాభా చిత్తే దృషదుపలశోభా కుచతటే |
భృశం తన్వీ మధ్యే పృథురురసిజారోహ విషయే
జగత్త్రాతుం శంభోర్జయతి కరుణా కాచిదరుణా  ||
చం.  జనని యరాళ కేశములు, చక్కని నవ్వు, శిరీషపేశలం
 న మది, రొమ్ముభాగము మహాఘనమౌ యుపల ప్రశోభయున్, 
స్తన జఘనంబులన్ ఘనము, సన్నగఁ జిక్కిన కౌను, కాచెడున్
ఘనమగు శ్రీసదాశివుని కమ్మని యా యరుణప్రభల్ క్షితిన్. ॥ 93 ॥
ప్రతిపదార్థము.  
(హే జగజ్జననీ ) 
కేశేషు = కురులందు, 
అరాళా = వంకరయైనదియు, 
మందహసితే = చిఱునవ్వునందు, 
ప్రకృతి = స్వభావము చేతనే 
సరళా = సుకుమారమైనదియు, 
చిత్తే = మనస్సునందు, 
శిరీష + ఆభా = దిరిసెన పూవు వంటి మెత్తని స్వభావము గలదియు, 
కుచతటే = వక్షః స్థలము, 
దృషత్‌ + ఉపలశోభా = సన్నికల్లు పొత్రమువంటి బలుపుగలదియు, 
మధ్యే = నడుమునందు
భృశం = మిక్కిలి,
తన్వీ = కృశించినదియు,
ఉరసిజ = స్తనముల విషయమునందును, 
ఆరోహ = పిరుదుల విషయమునందును, 
పృథుః = మిగుల గొప్పదియు, 
శంభోః = సదాశివునికి సంబంధమైనదగు, 
కాచిత్‌ = వర్ణనాతీతమైన, 
అరుణా = “అరుణ” అనుశక్తి 
కరుణా = దయాస్వరూపము గలది, 
జగత్‌ = ప్రపంచమును, 
త్రాతుం = రక్షించుటకు, 
జయతి = సర్వోత్కర్షతో వర్తించుచున్నది.  
భావము.
తల్లీ ! శంభుడి అనిర్వాచ్యమైన అరాళా అనేశక్తి నీ కురులలో ప్రకాశిస్తోంది. చిరునవ్వులో నీదు సహజమైన సరళా అనేశక్తి ప్రకాశిస్తూంది. చిత్తంలో దిరిసెన పువ్వులాగా మిక్కిలి మెత్తనైన శక్తి ప్రకాశిస్తోంది. స్తనప్రదేశంలో సన్నికల్లు శోభగల శక్తి ప్రకాశిస్తోంది. పిరుదులలో స్థూలశక్తి ప్రకాశిస్తూంది. దేవి జగత్తును రక్షించటానికి అరుణ అనే శక్తీ, కరుణ అనే శక్తీ భాసిల్లుతున్నాయి.

94 వ శ్లోకము.  
కళంకః కస్తూరీ రజనికర బింబం జలమయం
కళాభిః కర్పూరైర్మరకతకరండం నిబిడితమ్ |
అతస్త్వద్భోగేన ప్రతిదినమిదం రిక్తకుహరం
విధిర్భూయో భూయో నిబిడయతి నూనం తవ కృతే  ||
చం. చందురుఁడంచునెంచునది చంద్రుఁడు కాదు, మరక్త పేటియే, 
యందలి మచ్చ నీదగు ప్రియంబగు కస్తురి, యెవ్వరెన్నుచున్ 
జందురుడందురందరది చక్కని నీ జలకంపుఁ దావగున్,
జందురునొప్పునాకళలు చల్లని కప్రపు మొట్టికల్ సతీ!
యందవి నీవు వాడ విధి యాత్రముతోడను నింపువెండియున్. ॥ 94 ॥
ప్రతిపదార్థము.  
హే జగజ్జననీ! = ఓ లోకమాతా! 
ఇదం = ఈ కనబడు చంద్రమండలమునందు, 
కలంకః = ఆకలిగిన చిహ్నము, 
కస్తూరీ = అది కస్తూరి అగును. 
రజనికర బింబం = చంద్రబింబమనినచో, 
జలమయం = అది జలస్వరూపమైనది, 
కళాభిః = కిరణములనే, 
కర్నూరైః = పచ్చకర్పూరముతో, 
నిబిడితం = నిండింపఁ బడినది అగు, 
మరకత కరండం = గరుడ పచ్చలచే నిర్మింపబడిన భరణియగును, 
నూనం = ఇది భరణి అనుట నిశ్చయము. 
అతః = ఇందువలన, 
ప్రతిదినం = దినదినమునందు, 
త్వత్‌ భోగేన = నీవు ఉపయోగించుట చేత, 
రిక్త కుహరం = ఖాళీ అయిన లోపలిభాగము కలది, 
విధిః = బ్రహ్మ 
భూయః భూయః = మరల మరల, 
తవకృతే = నీ కొఱకు, 
నిబిడయతి = ఆయా వస్తువుల చేత నిండించుచున్నాడు. 
భావము. 
తల్లీ! జగజ్జననీ! ఆకాశములో కనబడు చంద్రమండలము – మరకత మణులచే చేయబడి, నువ్వు – కస్తూరి, కాటుక, పన్నీరు మొదలైన వస్తువులను ఉంచుకొను భరణియే! చంద్రునిలో మచ్చవలె నల్లగా కనబడునది కస్తూరి. ఆ చంద్రునిలోని జలతత్త్వము – నువ్వు జలకమాడుటకు ఉపయోగించు పన్నీరు. చంద్రుని కళలుగా భావించబడునవి – పచ్చకర్పూరపు ఖండములు. ఈ వస్తువులు ఆ భరణి నుండి నువ్వు ప్రతిదినము వాడుకొనుచుండుట వలన తరిగి పోవుటచే -నీ ఆజ్ఞను అనుసరించి నీ పాలనలో సృష్టిపనిచేయు బ్రహ్మ మరల ఆ వస్తువులను పూరించుచున్నాడు. 

95 వ శ్లోకము.  
పురారాతేరంతః పురమసి తతస్త్వచ్చరణయో
స్సపర్యామర్యాదా తరలకరణానామసులభా |
తథా హ్యేతే నీతాశ్శతమఖముఖాస్సిద్ధిమతులాం
తవ ద్వారోపాంతస్స్థితిభిరణిమాద్యాభిరమరాః   ||
ఉ.  పట్టపురాణివాశివుని పార్వతి! నీ పద పూజనంబహో
యెట్టులఁ గల్గు నల్పులకు? నింద్రుఁడు మున్నగువారలున్ నిను
న్నట్టులె చూడ ద్వారముల కావలె యుండియు సిద్ధులొందిరో
గట్టుతనూజ! నే నెటుల గాంచగఁ జాలుదు నిన్ భజింపగన్? ॥ 95 ॥
ప్రతిపదార్థము.  
(హే జగజ్జననీ) 
పుర + అరాతౌ = త్రిపుర హరుడైన శివుని యొక్క, 
అంతఃపురః = అంతఃపురవాసినియగు పట్టమహిషివి 
అసి = అయియున్నావు, 
తతః = ఆ కారణము వలన, 
త్వత్‌ చరణయోః = నీ పాదముల యొక్క, 
సపర్యా మర్యాదా = పూజచేయు భాగ్యము, 
తరళ కరణానాం = చపల చిత్తులకు, 
అసులభా = సులభమైనది కాదు, 
తథాహి = అది యుక్తమే అగును (ఎందువలన అనగా), 
అణిమాదిభిః = అణిమ, గరిమా మొదలగు అష్టసిద్ధుల చేతనొప్పు, 
ఏతే = ఈ, 
శత మఖముఖాః = ఇంద్రాదులైన 
అమరాః = దేవతలు, 
తవ = నీ యొక్క, 
ద్వార + ఉపాంతస్థితిభిః = అంతఃపుర ద్వార సమీపము నందుండినవారై, 
అతులాం = సాటిలేని, 
సిద్ధిం = ఇష్టార్థ ఫలసిద్ధిని, 
నీతాః = పొందిరి. 
భావము.
అమ్మా! జగజ్జననీ! నీవు త్రిపురహరుడైన శివుని పట్టమహిషివి. అందువలన నీ పాద పద్మపూజ చేయగల భాగ్యము చపల చిత్తులైన వారికి లభించునది గాదు. అందువలననే ఈ ఇంద్రాది దేవతలందరూ, తాము కోరుకున్న అల్పమైన అణిమాది అష్టసిద్ధుల గూడి, వారితో పాటు నీ ద్వార సమీపమునందే కావలివారి వలె పడిగాపులు గాచుచున్నారు.

96 వ శ్లోకము.  
కళత్రం వైధాత్రం కతికతి భజంతే న కవయః
శ్రియో దేవ్యాః కో వా న భవతి పతిః కైరపి ధనైః |
మహాదేవం హిత్వా తవ సతి సతీనామచరమే
కుచాభ్యామాసంగః కురవకతరోరప్యసులభః ||
సీ.  బ్రహ్మరాజ్ఞిని గొల్చి భవ్య సత్ కవులయి వాణీ పతులటంచుఁ బరగువారు,
శ్రీలక్ష్మినే గొల్చి శ్రీదేవి కృపచేత ధనికులై పేరొంది ధనపతులుగ
వెలుఁగువారు కలరు, విశ్వేశుఁడొక్కఁడే పార్వతీపతియని ప్రబలు ధాత్రి,
పతిని వీడక నిత్యమతనినే యెదనిల్పి పరవశించెడి నిన్ను బడయనేర
తే.గీ.  దవని కురవకమయిననో యమ్మ! నీదు
నెదను పులకించు భాగ్యము నిందువదన!
నీదుపతిఁగూడి యున్న నిన్ నాదు మదిని 
నిలిపి పులకింపనిమ్ము నన్ నీరజాక్షి! ॥ 96 ॥
ప్రతిపదార్థము.  
(హే) సతి = ఓ పార్వతీ !, 
వైధాత్రం = విధాతకు సంబంధించినదైన, 
కళత్రం = భార్య అయిన సరస్వతిని, 
కతికతి = ఎందరెందఱు, 
కవయః = కవులు, 
న భజంతే = సేవించుట లేదు, 
శ్రియః దేవ్యా = లక్ష్మిదేవి యొక్క, 
కైః అపి ధనైః = ఏదో కొంత ధనము చేత కాని, 
కోవా = ఏ పురుషుడు, 
పతిః = ధనపతి, 
నభవతి = కాకున్నాడు, 
సతీనాం అచరమే = పతివ్రతలలో అగ్రగణ్యమైన దేవీ! మహాదేవం = సదాశివుని, 
హిత్వా = వీడి, 
తవ = నీ యొక్క, 
కుచాభ్యాం = స్తనయుగము చేతనైన, 
ఆసంగః = కౌగిలింత, 
కురవక తరోరపి = గోరంట చెట్టునకు సైతము, 
అసులభః = సులభము కాదు. 
భావము. 
ఓ పతివ్రతా శిరోమణీ! పార్వతీ! బ్రహ్మదేవుని భార్య అయిన సరస్వతిని ఎందరెందరు కవులు సేవింపకున్నారు? లక్ష్మీదేవి యొక్క ధనసంపదలను పొంది ఏ పురుషుడు ధనపతి కాకున్నాడు? కాని పతివ్రతలలో మొట్టమొదట లెక్కింపదగిన దేవీ! నీ స్తనయుగముతోడి కౌగిలింత ఆ సదాశివునికి ఒకనికే తప్ప గోరంట చెట్టుకు గూడా లభించదు కదా!

97 వ శ్లోకము.  
గిరామాహుర్దేవీం ద్రుహిణగృహిణీమాగమవిదో
హరేః పత్నీం పద్మాం హరసహచరీమద్రితనయామ్ |
తురీయా కాపి త్వం దురధిగమనిస్సీమమహిమా
మహామాయా విశ్వం భ్రమయసి పరబ్రహ్మమహిషి ||
శా.  నిన్నేబ్రహ్మకుఁ బత్నిగాఁ దలచుచున్ నిత్యంబు సేవింతు రా
నిన్నే విష్ణుని పత్నిగాఁ గొలుచుచున్ నేర్పార పూజింతు రా
నిన్నే శంభుని పత్నిగాఁ దలతురే నిత్యంబు వేదజ్ఞు లే
మన్నన్ వేరగు శక్తి వీ జగతి మోహభ్రాంతులన్ గొల్పుదే. ॥ 97 ॥
ప్రతిపదార్థము.  
పరబ్రహ్మమహిషి = ఓ సదాశివుని పట్టమహిషీ |! 
ఆగమవిదః = వేదార్థరహస్యార్థములు తెలిసిన వారు, 
త్వాం ఏవ = నిన్నే, 
దృహిణ గృహిణీం = బ్రహ్మ ఇల్లాలైన, 
గిరాందేవి = వాగ్దేవి అయిన సరస్వతినిగా, 
ఆహుః = వచింతురు, 
త్వాం ఏవ = నిన్నే, 
హరేః = విష్ణువు యొక్క, 
పత్నీం = భార్యఅయిన, 
పద్మాం = కమలవాసిని అయిన లక్ష్మీదేవిగా, 
ఆహుః = చెప్పుదురు, 
త్వమేవ = నిన్నే, 
హరసహచరీం = శివుని సహధర్మచారిణి అయిన, 
అద్రితనయాం = పార్వతిగా 
ఆహుః = చెప్పుదురు, 
త్వం = నీవు, 
తురీయా = ఆ మువ్వురి కంటె నాల్గవ ఆమెవై, 
కాపి = ఇట్టిదని చెప్పనలవి కాని, 
దురధిగమ = పొందనలవి కాని, 
నిస్సీమ = హద్దులేని, 
మహిమా = ప్రభావము కలదైన, 
మహామాయా = మాయాతత్త్వమగుచు, 
విశ్వం = ఈ జగత్తును, 
భ్రమయసి = భ్రమింప చేయుచున్నావు. 
భావము. 
ఓ పరబ్రహ్మ పట్టపుదేవీ! ఆగమవిదులు నిన్నే బ్రహ్మ పత్నివైన సరస్వతి అంటారు. నిన్నే శ్రీహరి పత్ని లక్ష్మి అంటారు. నిన్నే హరుని సహచారిణి ఐన గిరితనయ అంటారు. కానీ నువ్వు ఈ మువ్వురి కంటే వేరై నాల్గవదేవియై ఇట్టిదట్టిదని వచింప నలవిగాని ఆమెవై అనిర్వాచ్యవై, దేశ కాల వస్తువులకు అపరిచ్ఛిన్నవై, భేదించరాని మహాప్రభావం కలిగినదానవై, శుద్ధవిద్యలో అంతర్గతమైన మహామాయవై, మాయాతత్త్వ మవుతూ ఈ ప్రపంచాన్ని నానా విధాలుగా మోహ పెట్టుతున్నావు.

98 వ శ్లోకము.  
కదా కాలే మాతః కథయ కలితాలక్తకరసం
పిబేయం విద్యార్థీ తవ చరణ నిర్ణేజన జలమ్ |
ప్రకృత్యా మూకానామపి చ కవితాకారణతయా
కదాధత్తే వాణీ ముఖ కమల తాంబూల రసతామ్ ||
శా.  శ్రీలన్ జిందు కవిత్వమొందగను నిన్ సేవించు విద్యార్థినే,
నీ లాక్షారస యుక్త పాదజలమున్ నే గ్రోలగానెప్పుడౌన్?
జాలున్ మూకకుఁ బల్కుశక్తినిడుచున్ సద్గీతమల్లింప నా
మేలౌ శారద వీటిఁ బోలు రయి భూమిన్ నాకదెట్లబ్బునో? ॥ 98 ॥ 
(రయి = నీరు)
ప్రతిపదార్థము.  
మాతః = ఓ తల్లీ! 
కలిత + అలక్తకరసం = లత్తుకరసము గలదైన, 
తవ = నీ యొక్క, 
చరణ నిర్ణేజన జలం = పాదములు కడిగిన ఉదకమును, 
విద్యార్థీ = బ్రహ్మ విద్యనర్థించువాఁడనయిన, 
అహం = నేను, 
కదాకాలే = ఎప్పుడు, 
పిబేయం = త్రాగుదునో, 
తచ్చ = ఆ జలము, 
ప్రకృత్యా = స్వభావముచేతనే, 
మూకానాం అపి = మూగ చెవిటి వారలకు సైతము, 
కవితాకారణతయా = కవిత్వ రచన గావించుటకు కారణమైన దగుటచేత, 
వాణీ = సరస్వతి యొక్క, 
ముఖ కమలం = ముఖ పద్మము నందలి, 
తాంబూల రసతామ్‌ = తాంబూల రసము సారస్యమును, 
కదా = ఎప్పుడు, 
ధత్తే = ధరించుచున్నదో. 
కథయ = చెప్పుము. 
భావము. 
తల్లీ! జగజ్జననీ! స్వాభావికముగానే – చెవిటివారికి వినికిడి శక్తిని, మూగవారికి మాట్లాడుశక్తిని కలిగించునదై, పూర్వానుభవము, సామర్థ్యము లేకున్నా కవిత్వరచనా సౌభాగ్యమును ప్రసాదించునదై, సరస్వతీదేవి తాంబూల రసము వంటిదగు లత్తుకరసముతో కలసిన నీ పాద ప్రక్షాళన జలమును-  విద్యార్థినైన నేను ఎప్పుడు గ్రోలుదునో చెప్పుము. 

99 వ శ్లోకము.  
సరస్వత్యా లక్ష్మ్యా విధి హరి సపత్నో విహరతే
రతేః పాతివ్రత్యం శిథిలయతి రమ్యేణ వపుషా |
చిరం జీవన్నేవ క్షపితపశుపాశవ్యతికరః
పరానందాభిఖ్యం రసయతి రసం త్వద్భజనవాన్ ||
మ.  నిను సేవించెడివాఁడు దివ్య ధనుఁడై, నిష్ణాతుఁడై విద్యలన్,
ఘనుఁడౌ బ్రహ్మకుఁ, బద్మగర్భునకుఁ, గాకన్నీర్ష్యచేఁ గొ,ల్పుఁ దాఁ
దనువున్ దీప్తిని గల్గి యా రతిపునీతన్ మార్చు, నిస్సారమౌ
తనువున్ వీడి ప్రశస్త ముక్తిని గొనున్ దా సాంబునే దల్చుచున్. ॥ 99 ॥
ప్రతిపదార్థము.  
జగజ్జననీ! = ఓ లోకమాతా!
త్వత్‌ + భజనవాన్‌ = నిన్నుసేవించు భక్తుడు, 
సరస్వత్యా = వాగ్దేవి తోడను, 
లక్ష్మ్యా = లక్ష్మీదేవితోడను గూడిన, 
విధి హరి = వరుసగా బ్రహ్మకు విష్ణువునకును, 
సపత్నః  = పోటీదారుఁడగుచు, 
విహరతే = విహరించుచున్నవాఁడై, 
రమ్యేణ = అతిసుందరమైన, 
వపుషా = శరీరము చేత, 
రతేః = రతీదేవి యొక్క, 
పాతివ్రత్యం = పతివ్రతా ధర్మమును, 
శిధిలయతి = సడలింప జేయుచున్నవాడై, 
చిరం = తడవుగా
జీవన్నేవ = బ్రతికి యుండినవాఁడై,
క్షపిత = విదళింపబడిన, 
పశు = జీవుల యొక్కయు, అవిద్య యొక్కయు, 
వ్యతికరః = సంబంధము కలవాడై, 
పరానంద + అభిఖ్యం = బ్రహ్మానందము అనఁబడు, 
రసం = సుఖమును, 
రసయతి = ఆస్వాదించుచున్నాడు. 
భావము. 
అమ్మా ఓ భగవతీ ! నిన్ను ఉపాసించువారు , సరస్వతీ దేవినీ (సర్వవిద్యలను)లక్ష్మీదేవినీ(సర్వసంపదలను ) పొంది వాళ్ళభర్తలైన బ్రహ్మవిష్ణువులకు వైరిగా మారుతున్నారు . రమ్య శరీరంచే రతీదేవిని సైతం ఆకర్షించి ఆమె పాతివ్రత్యానికి భంగం కలిగిస్తున్నాడు. పశుతుల్య శరీరాన్ని తొలగించుకొని, జీవన్ముక్తుడై కేవలం సదాశివ తత్త్వాత్ముడై పరానంద సుఖాన్ని ఆస్వాదిస్తున్నాడు. 

100 వ శ్లోకము.  
ప్రదీప జ్వాలాభిర్దివసకరనీరాజనవిధి
స్సుధాసూతేశ్చంద్రోపలజలలవైరర్ఘ్యరచనా |
స్వకీయైరంభోభిస్సలిలనిధిసౌహిత్యకరణం
త్వదీయాభిర్వాగ్భిస్తవ జనని వాచాం స్తుతిరియమ్  ||
సీ.  నే చేతి దివిటీల నీరాజనంబును సూర్యదేవునికిచ్చుచొప్పు కనఁగ,
శశికాంతిశిలనుండి జాలువారెడి బిందు జలములనర్ఘ్యంబు శశికొసంగు
నట్లుదకంబులనర్ఘ్యంబు దధికిచ్చినట్టుల నీ నుండి యిట్టులేను
నిరుపమా! పొడమిన నిరుపమ వాగ్ఘరిన్ నిను నుతియించుచున్ నిలిచియుండి,
తే.గీ. ధన్య జీవుఁడనయితి  సౌందర్యలహరి
శంకరులు వ్రాయఁ దెలిఁగించి, శాశ్వతమగు
ముక్తి, సత్కీర్తి, నొసఁగెడి శక్తి! జనని!
యంకితము చేసితిని నీకు నందుకొనుము. ॥ 100 ॥
ప్రతిపదార్థము.  
వాచాంజనని = ఓ వాక్ప్రపంచమునకు తల్లీ !, 
యథా = ఏ విధముగా, 
స్వకీయాభిః = తనకు సంబంధించినవే అయిన, 
ప్రదీపజ్వాలాభిః = చేతి దివిటీల యొక్క జ్వాలలచే, 
దివసకర = సూర్యునికి, 
నీరాజనవిధిః = కర్పూరహారతి నిచ్చుటయో, 
యథా = ఏ విధముగా, 
స్వకీయైః = తనకు సంబంధించినవే అయిన, 
చంద్ర + ఉపజలలవైః = స్రవించు చంద్రకాంత శిలా జల బిందువులచేత, 
సుధాసూతేః = చంద్రునికి, 
అర్ఘ్య రచనా = అర్ఘ్యము సమర్శించుటయో, 
యథా = ఏ ప్రకారము, 
స్వకీయైః = తనకు సంబంధించినవే అయిన, 
అంభోభిః = జలముల చేత, 
సలిల నిధి = సముద్రునకు, 
సౌహిత్యకరణం = తృప్తికొఱకు తర్పణము చేయుటయో, 
త్వదీయాభిః = నీ వలన ఉత్పన్నములైన, 
వాగ్భిః= వాక్కుల చేత, 
తవ = నీకు, 
ఇయం = ఈ , 
స్తుతిః = సోత్రము 
తథా = ఆ ప్రకారము,  అగుచున్నది.
భావము. 
ఓ భగవతీ! స్వకీయాలైన చేతి దివిటీల జ్వాలలచేత సూర్యుడికి ఆరతి గావిస్తూన్నట్లు చంద్రకాంత శిలనుండి స్రవిస్తూన్న జలబిందువులచేత చంద్రుడికి అర్ఘ్యము సమర్పిస్తూన్నట్లూ, ఉదకాలచే సముద్రుడికి తృప్తికారణమైన తర్పణం కావిస్తూన్నట్లూ , నీ వల్ల పొడిమినటువంటి నీ స్వరూపాలైన వాక్కుల కూర్పులచే నిన్ను నేను స్తుతిస్తున్నాను.

*సౌందర్యలహరి స్తోత్రం సంపూర్ణమ్*
01 . 6 . 2023.
శా.  శ్రీమన్మంగళ శాంభవీజనని నా చిత్తంబులోఁ బ్రేరణన్
బ్రేమన్ గొల్పగఁ, దెల్గు పద్యములుగా విఖ్యాతిగా మార్చితిన్
సామోద్భాసిత మాతృ రూప విలసత్ సౌందర్య సద్వీచికన్,
శ్రీమన్మంజులభావపాఠకులకున్ శ్రేయంబు గూర్పన్ సదా.
ఫలశ్రుతి
శా.  శ్రీమన్మంగళ శాంభవీ! లలిత! హృచ్ఛ్రీచక్ర సంచారిణీ!
సామాన్యుల్ కన నే రచించిన కృతిన్ సౌందర్య సద్వీచికన్
క్షేమంబొందఁ బఠింపఁగాఁ దలతు రా చిన్మార్గులన్ బ్రోవుమా, 
నీ మంత్రాక్షరి పాఠకాళికిడుమా నిర్వాణ సంపత్ప్రభల్.
నివేదన
శా. శ్రీమాతా! వరలోకపావని! సతీ! చింతాన్వయుండన్, భవత్
ప్రేమన్ గాంచెడి రామకృష్ణను, జగద్విఖ్యాత సౌందర్యమన్
ధీమచ్ఛంకర సత్ కృతిన్ లహరినే తెన్గించితిన్ శ్రీసతీ!
క్షేమంబున్ గలిగింప పాఠకులకున్ చిద్రూపిణీ! కావుమా.
అంకితము.
ఉ. సాకల్యంబుగఁ దెల్గులో మలచితిన్ సౌందర్య సద్వీచికన్
నీకే యంకితమిత్తునమ్మ! కొనుమా! నీవే కృపన్ దీని, నో
శ్రీ కల్యాణి! భవాంబుధిన్ గడపుమా, చిత్తంబునందుండుమా,
నీకున్ మ్రొక్కెద భక్తితోడను భవానీ! సమ్మతిన్ గాంచుమా!

https://bharatiyasamskruthi.net/soundaryalahari-meaning-in-telugu-1-10/
జైహింద్.