Sunday, April 14, 2024

పద్యసారస్వత పీఠం తెలంగాణ ll క్రోధి ఉగాది వేడుకలు ll శత పద్య కవి సమ్మేళనం... నిర్వహణ .. అష్టావధాని శ్రీ అవుశులభానుప్రకాశ్.

ఆద్యంతము అవధాని అవుశుల భానుప్రకాశ్ చాలా సమర్ధవంతంగా నిరాఘాటంగా నిర్వహించి తనకుగల సామర్ధ్యాన్ని కనబరిచేరనుటలో సందేహం లేదు.
వీరి తల్లిదండ్రులను చూచే భాగ్యం ఈ సభకారణంగా మాకు లభించుట విశేషం.
ఆ జగన్మాత వీరిని చక్కగా కాపాడుతూ జగత్కల్యాణ కారకుఁడుగా నిలబెట్టాలని ప్రార్థిస్తున్నాను..
అవధాని భానుప్రకాశ్ కు నా అభినందనలు.
ఈ సభకు సమయానికి నేను చేరుకోలేకపోయినా నేను వ్రాసిన కవిత ఇక్కడ ప్రకటిస్తున్నాను.
నా కవిత.
౧) శా.  శ్రీరామాయణ భాను తేజ మగుచున్, శ్రీమంత సత్ క్రోధి! ర
మ్మోరమ్యాక్షర దివ్యరూప! ద్యుమణీ! యుత్సాహమొప్పారగా,
ధీరాత్ముల్, కవి పండితుల్, సుజనులున్, నిత్యంబు భావించుచున్
శ్రీ రమ్యాక్షర వత్సరంబుగ నినున్ జిత్తంబులన్ గొల్వగాన్.

౨) ఉ.  శ్రీ స్వగుణానుబంధ వర చిత్ర కవిత్వ విధాన పద్య సా
రస్వత పీఠ తేజమయి రమ్ము కృపన్ గన మమ్ము క్రోధి! తే
జస్వినివై నిరంతరము చక్కిని తెల్గు కవిత్వ తత్త్వ స్రో
తస్వినిగా చెలంగుమిల, ధర్మప్రవృత్తి వివృద్ధి చేయుచున్.

౩) ఉ.  మంగళమౌత భానునకు, మంగముల్ శుభక్రోధికిన్, సదా
మంగళమౌకవీశులకు, మంగళమౌ నిల సజ్జనాళికిన్,
మంగళమౌత హిందువుల మంగళ భావన పాళి కెల్లెడన్,
మంగళమౌత శ్రీహరికి, మంగళముల్ మన భారతాంబకున్.
జైహింద్.

No comments: