Friday, March 25, 2011

చంద్ర గణములు, వాటిని కలిగి యుండు పద్యముల లక్షణములు.


సరస్వతీ! నమస్తుభ్యం.
సరస సాహిత్య సౌందర్యోపాసకులారా! అనేక మంది పాఠకులు చంద్ర గణములను, అవి ప్రయోగింప బడిన పద్యములను గూర్చి తెలుసుకొనఁ గోరిరి.
నే నెఱిగిన వాటిని ఆంధ్రామృతం ద్వారా అందిస్తున్నందుకు ఆనందంగా ఉంది.
ఇంకా వివరంగా కాని, సవరణలు గాని తెలియ జేయ గోరు వారు. తమ అమూల్యమైన వ్యాఖ్యల ద్వారా పంప గలందులకు మనవి.
ఇక చూడండి.
చంద్ర గణములు:-
UIUU = రగ
I I IUU = నగగ
UUIU = తగ
I I U IU = సలగ
U I I U = భగ
I I  I IU =నలగ
UUUI = మల
I I UU I = సగల
U I U I = రల
I I  I U I =నగల
U U I I = తల
I I  U I I = సలల
U  I I  I = భల
I I  I I  I = నలల
చంద్ర గణములను కలిగి యుండే కొన్ని  పద్యముల వివరణ.
మహాక్కర:- 
౧ సూ.౫ ఇం. ౧ చం. యతి: 
ద్వితీయ చతుర్థ గణములు ఇంద్ర గణములకు బదులు సూర్య గణములైనను ఉండ వచ్చును.
ఐదవ గణము మొదటి అక్షరము యతి స్థానము.
ప్రాస నియమము కలదు.
ఉదా:-
సీత హృదయాబ్జ భృంగమా! శ్రీరామ!క్షితిజుల వెతలను తీర్చవయ్య!
మధురాక్కర:- 
౧ సూ. ౩ ఇం. ౧ చం. యతి: ౪ వ గణము మొదటి అక్షరము.
నాల్గవ గణము మొదటి అక్షరము యతి స్థానము.
ప్రాస ప్రాస నియమము కలదు.
ఉదా:-
రామ శ్రీరామ సీతాభిరామ! మ మ్మరయుమయ్య!
అంతరాక్కర:- 
౧ సూ. ౨ ఇం. ౧ చం. యతి: ౩ వ గణము చివరి అక్షరము.
మూడవ గణము తుది వర్ణము యతి స్థానము. కవి జనాశ్రయము, కావ్యాలంకార చూడామణులను బట్టి చూచినచో ౪ వ గణము మొదటి అక్షరము యతిస్థానముగా తెలియును. 
ప్రాస నియమము కలదు.
ఉదా:-
రాము కనుగొంటి సుందరారామమందు
అల్పాక్కర:- 
౨ ఇం. ౧ చం. 
౩ వ గణము మొదట యతి యుండును.
ప్రాస నియమము కలదు.
ఉదా:-
శ్రీరామ చంద్రుఁడు క్షేమ మిచ్చు.
షట్పదము:- 
౬ ఇంద్ర గణములు + ౧ చంద్రగణము = ౭ గణముల లోను 
౧, ౨ ఇంద్రగణములు మొదటి పాదమునందును,
౩,౪, ఇంద్రగణములు రెండవ పాదమునందును,
౫, ౬, ఇంద్ర గణములు, ౧ చంద్రగణము మూడవ పాదమునందును వచ్చును, అట్టివి మూడు + మూడు =  పాదములు మొత్తం ఆరు పాదములు షట్ పదముగా ఒప్పిదమై యుండును.
౬పాదములందు అమరి యుండునది అగుటచే ఇది షట్ పదమనబడును.
యతి ఉండదు.
ప్రాస నియమమున్నది.
ఉదా:-
శ్రీ రామ! జయరామ!
ధీరాత్మ! నీ ప్రేమ
ధారాళముగ గొన్నధన్య సీత!
కారుణ్య మును జూపి
నీరూప మును జూపి,
కోరిన ముక్తిని కొలుపుమయ్య!
జై శ్రీరామ్.
జైహింద్.