Sunday, May 31, 2009

కవితాభినందనం:- శ్రీ బులుసు వేంకటేశ్వర్లు.

తెలుగు సాహిత్యంలో శతక రచన అగ్ర స్థానం పొంది యున్నది. కవులు తమ అనుభవాల్ని - ఆశల్ని - ఆర్తితో - ఆనందంతో చెప్పుకొనడానికి చక్కని వీలుంది శతక రచన లోనే! లౌకిక అలౌకిక భావాలు ప్రక్క ప్రక్కనే చెప్పుకోడానికి ఒక్క శతక ప్రక్రియలోనే అవకాశం కలుగుతుంది.

పూర్వం అంటే ఇప్పటికి ముప్ఫై నలభై ఏళ్ళ క్రితం పల్లెల్లో సాధారణ రైతులు కూడా సమయోచితంగా శతక పద్యాల్ని తమ సంభాషణల్లో ఉదహరిస్తూ మాటలాడేవారు. అలాగే అప్పటి గృహ లక్ష్ములు కూడా చక్కని తెలుగులో జాతీయాల సౌరభాలు గుబాళించే లాగ మాటలాడే వారు. ఇప్పటి తరం పిల్లలకి అనివార్యంగా సంకర తెలుగు మాటలాడే దౌర్భాగ్యం వచ్చింది.

సాధారణంగా ఉద్యమమైనా ప్రజలనుంచి వస్తేనే అది కార్య రూపం ధరిస్తుంది. కొందరు విద్యావంతుల ఆశల్ని ముందుగా పసిగట్టి రాజకీయ నాయకులు వారిని సంతృప్తి పరచడం కోసం ఆయా విషయాల్ని ఉద్యమాలుగా ప్రచారం చేస్తారు. దానితో అది రాజకీయ అజెండాలో చేరి ఒక పార్టీ ప్రణాళికలో అంశంగా చేరిపోతుంది. అంతే ఇంక అది ఎక్కడ వేసిన గొంగళీ అక్కడే అన్నట్లు తయారు అవుతుంది. పది మందిలో పాము చావదు అన్నట్లు కాలంలో బడి నలుగుతూ ఉంటుంది. ప్రస్తుతం తెలుగు భాష ఔజ్వల్యం అలాగే తయారయింది. అందుకనే మాతృ భాషలో విద్యా బోధన అనే విప్లవం ప్రజల్లోంచి రావాలి. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు మాధ్యమం ప్రవేశ పెట్టినప్పుడు ప్రజల్లోంచి తగినంత స్పందన రాలేదు.

నేపథ్యం అంతా ఎందుకంటే ప్రస్తుతం అధునిక కవులు కూడా శతకాలు వ్రాస్తున్నారు. శతక ప్రక్రియ వెనక బడ లేదు. కొంచెం తన ప్రణాళీకను మార్పు చేసుకొని, అనేకానేక అంశాలు స్పృశిస్తూ ముందుకు సాగుతోంది. భక్తి శతకమే అయినా అనివార్యంగా సమాజం లోని అనేక కోణాల్ని చూపుతోంది ఈనాటి శతకం. శ్రీ షిరిడీశ దేవరా! అన్న మకుటంతో 108పద్యాల్లో సాగిన శతకం మిత్రులు శ్రీ చింతా రామ కృష్ణా రావు గారు రచించారు.వీరు తెలుగు అధ్యాపకునిగా పని చేసారు. సాహిత్య మిత్రులు. ఆంధ్ర, ఆంగ్ల సాహిత్యాలను ఆపోశన పట్టిన పండితులు. సమాజాన్ని నిశితంగా పరిశీలించే హృదయం కలవారు. దీనులయెడ సహానుభూతి కలిగిన ఉత్తమ సంస్కారవంతులు. అందుకే శతకం నిండా సమాజం లోని చీకటి కోణాల నుండి అనేకానేక అసమంజస విషయాలపై కవి తీర్పు లుంటాయి. వేదన లుంటాయి. ఆశావహ దృక్పథంతో కూడిన సందేశాలుంటాయి. ఏతావాతా శ్రీ చింతా రామ కృష్ణా రావు గారి శతకం భక్తితో పాటు లోకజ్ఞతను కూడ పంచి పెడుతుంది పాఠకులకు.

పద్య నిర్మాణంలో కూడా ఈ కవి చాలా సిద్ధ హస్తులు. పద్యం గోదావరిలా సాగి పోతుంది. భావ కూలంకషయై మనల్ని నివ్వెఱ పరుస్తుంది. అభ్యుదయ భావాలు, దేశ భక్తి ప్రపూర్ణమైన భావనలూ ఈ శతకంలో దర్శనమిస్తాయి.
యువ తరాన్ని ఎంతగా శ్లాఘించారో ఈ కవి.
ఉ:-
భారత మాత రక్షణము భవ్య మహోజ్వల భావిఁ గొల్పగా,
ధీరులు, సజ్జనావళి విధేయులు, మా యువ భారతీయులే
కారణ భూతు లయ్య. కలి కల్మష దూరులఁ జేయుమయ్య. నీ
వారికి శక్తి నీయుమయ భవ్యుడ! శ్రీ షిరిడీశ దేవరా! 47

యువతకు దేశ భక్తి - రక్షణా శక్తి - యీయుమని సాయిని ప్రార్థించడం హర్షణీయం.

అలాగే స్త్రీలను వేధించే వారిని వీరు చాలా గర్హించారు.
"అద్వైతం సుఖ దుఃఖయోః" అంటూ దాంపత్య బంధాన్ని ఎంత గొప్పగా భవభూతి చెప్పాడో. అట్టి దాంపత్య బంధాల్ని తృణీకరించే "పురుష పుంగవుల్ని" వీరు చాలా సూటిగా, కరుకుగా విమర్శించారు. " కన్నులఁ బెట్టి కావుమయ! కాంతల" నంటూ సాయి దైవాన్ని ప్రార్థిస్తారు. చాలా పద్యాల్లో వీరి సంస్కార హృదయం దర్శనమిస్తోంది. చక్కని పోలికలు కూడా కనిపిస్తాయి.
" శరీరము గుమ్మడి పండులా గుట్టుగా కుళ్ళి నశిస్తుంది" అని అంతారు. ఎంత మంచి పోలిక! గుమ్మడి పండు కంటికి బాగానే కనిపిస్తున్నట్లుంటుంది. కాని లోపల కుళ్ళిన సంగతి మనకు తెలియదు దానిని తాకేదాకా!

ఉ:-
నీ దరి చేరు వాడనయ! నీ శతకంబుఁ బఠించు వాడ. స
మ్మోదము తోడఁ గాంచుమయ! మూలము నీవయి కావుమయ్య! యా
వేదనఁ బాపుమయ్య! సమ దృష్టి నొసంగి రహింపఁ జేయుమా!
మేదిని పైన నన్ గనుమ మేలుగ. శ్రీ షిరిడీశ దేవరా! 98

పద్యం వీరి భక్తి, మోక్షము యెడల వీరికి గల కాంక్ష, సాయిపై గల ప్రేమనూ ప్రత్యక్షరం ప్రత్యక్షం చేస్తున్నది.

ఇలా శతక మంతా ఉదహరించ వలసి వస్తుంది మంచి మంచి పద్యాల కోసం. పాఠకులుగా మీరు శతకంలో ఎలాగూ ప్రవేశిస్తారు. కాబట్టి ఈ ముందు మాటను ముగిస్తున్నాను.

శ్రీ చింతా రామ కృష్ణా రావు గారు తమ చిక్కని, చక్కని భావాల్ని పద్య రూపంగా మలచి, శిరీష కుసుమ పేశలంగా సాయి శతకంగా రచించి, ఆ దేవ దేవునకు సమర్పించి, మనకు చక్కని మాధుర్య కవిత్వ ప్రసాదం పెట్టారు. ఈ శతకాన్ని కన్నుల కద్దుకొని ఆస్వాదించ వచ్చును.

మిత్రులు శ్రీ చింతా రామ కృష్ణా రావు గారు ఇతోధికంగా సాహిత్య సేవ చేస్తూ - పరిణతి చెందిన తమ కవితా ధోరణిని మంచి కావ్యాలు రచించాలని, మనసారా ఆకాంక్షిస్తూ - అభినందిస్తున్నాను.

బులుసు వేంకటేశ్వర్లు,
కల్ప వృక్షం,
చిట్టివలస.