జైశ్రీరామ్.
71 వ శ్లోకము.
నఖానాముద్యోతైర్నవనళిన రాగం విహసతాం
కరాణాం తే కాంతిం కథయ కథయామః కథముమే |
కయాచిద్వా సామ్యం భజతు కలయా హంత కమలం
యది క్రీడల్లక్ష్మీచరణతల లాక్షారస చణమ్ ||
పదచ్ఛేదము.
నఖానామ్ - ఉద్యోతైః - నవ - నళిన - రాగమ్ - విహసతామ్ -
కరాణామ్ - తే - కాంతిమ్ - కథయ - కథయామః - కథమ్ - ఉమే -
కయాచిత్ - వా - సామ్యమ్ - భజతు - కలయా - హంత - కమలమ్ -
యది - క్రీడత్ - లక్ష్మీ - చరణ - తల - లాక్షా - రస - చణమ్.
అన్వయక్రమము.
ఉమే, నఖానామ్, ఉద్యోతైః, నవ నళిన రాగమ్, విహసతామ్, తే, కరాణామ్, కాంతిమ్, కథమ్, కథయామః, కథయ, కమలమ్, కయాచిత్‌వా, కలయా, సామ్యమ్, భజతు, హంత, క్రీడత్, లక్షీ, చరణతల, లాక్షారస, చణమ్.
పద్యము.
చం. విరియుచునున్న తామరల విస్తృతశోభనె వెక్కిరించు నీ
మురిపెము గొల్పు చేతులను బోల్పఁగ నాకది సాధ్యమౌనొకో?
సరసునఁ గ్రీడసల్పురమ చక్కగనున్నెడ, కాలిలత్తుక
స్ఫురణను బొందినన్ దగును బోల్పఁగఁ గొంత, నిజంబు పార్వతీ! ॥ 71 ॥
ప్రతిపదార్థము.
ఉమే = ఓ పార్వతీ,
నఖానామ్ = గోళ్ళయొక్క,
ఉద్యోతైః = ఉత్పన్నమగు కాంతుల చేత,
నవ నళిన రాగమ్ = అప్పుడే వికసించెడు తామరపూవు యొక్క ఎఱ్ఱని కాంతిని,
విహసతామ్ = అపహసించుచున్న,
తే = నీ యొక్క,
కరాణామ్ = హస్తముల యొక్క,
కాంతిమ్ = శోభను,
కథమ్ = ఏ విధముగా,
కథయామః = వర్ణించగలమో,
కథయ = చెప్పుము,
కమలమ్ = పద్మము,
కయాచిత్‌వా = ఏ విధము చేతనైనను,
కలయా = పదునారవ పాలయినను,
సామ్యమ్ = పోలికను,
భజతు = పొందునా,
హంత = అయ్యో,
క్రీడత్ = క్రీడించుచున్న,
లక్షీ = లక్ష్మీ దేవి యొక్క,
చరణతల = పాదము యొక్క,
లాక్షారస = లత్తుకరసముతో గూడి సమర్ధమైనదయినచో ,
చణమ్ = పోల్చనైపుణ్యముతోనొప్పునేమో!
భావము.
సూర్యోదయ కాలమున వికసించుచున్న క్రొత్తతామరపూవు కాంతిని పరిహసించు చున్న గోళ్ల యొక్క ప్రకాశముచేత విలసిల్లుచున్న నీ హస్తముల యొక్క సౌందర్యమును ఏప్రకారముగా, అలంకార శోభితముగా వర్ణింపగలను ? ఒకవేళ - కమలములను తనపాదపీఠముగా చేసుకున్న లక్ష్మి దేవి చరణముల లత్తు కరసము (పారాణి) అంటుట వలన లేత ఎరుపురంగుకు వచ్చిన కమలములు - కొంతవరకూ, నీ కరముల కాంతి లేశమునకు సాదృశము కాగలదేమో.
72 వ శ్లోకము.
సమం దేవి స్కంద ద్విపవదన పీతం స్తనయుగం
త వేదం నః ఖేదం హరతు సతతం ప్రస్నుత ముఖమ్ |
యదాలోక్యాశంకాకులిత హృదయో హాస జనకః
స్వకుంభౌ హేరంబః పరిమృశతి హస్తేన ఝటితి ||
పదచ్ఛేదము.
సమమ్ - దేవి - స్కంద - ద్విప - వదన - పీతమ్ - స్తన - యుగమ్ -
తవ - ఇదమ్ - నః - ఖేదమ్ - హరతు - సతతమ్ - ప్రస్నుత - ముఖమ్ -
యత్ - ఆలోక్య - ఆశంకా - ఆకులిత - హృదయః - హాస - జనకః -
స్వ - కుంభౌ - హేరంబః - పరిమృశతి - హస్తేన - ఝటితి.
అన్వయక్రమము.
దేవి, యత్, ఆలోక్య, ఆశంకా, ఆకులిత, హృదయః, హేరంభః, హాసజనకః, స్వకుంభౌ, హస్తేన, ఝటితి, పరిమృశతి, సమమ్, స్కంద, ద్విప వదన, పీతమ్, ప్రస్నుత ముఖమ్, తవ, ఇదమ్, స్తనయుగమ్, నః, ఖేదమ్, హరతు.
పద్యము.
చం. కని యవి నాదు కుంభములె కానగునంచు గణేశుఁడప్పుడా
క్షణమున శీర్షమున్ దడుమసాగెను తొండముతోడ శాంభవీ!
గణపతిచేత పూజ్యుఁడగు స్కందునిచేతను త్రాగఁబడ్డ, పా
ల నిడెడి నీ స్తనంబు లవి, లక్ష్యముతో మముఁ గాచుఁ గావుతన్. ॥ 72 ॥
ప్రతిపదార్థము.
దేవి = ఓ భగవతీ,
యత్ = ఏ స్తనయుగమును,
ఆలోక్య = చూచి,
ఆశంకా = నా యొక్క తలపై నుండు కుంభములు దొంగిలింపబడినవను సంశయము చేత,
ఆకులిత = కలత పడిన,
హృదయః = మనస్సుగలవాడై,
హేరంభః = వినాయకుడు,
హాసజనకః = నవ్వు పుట్టించు చున్నవాడై,
స్వకుంభౌ = తన కుంభములను,
హస్తేన = తొండము చేత,
ఝటితి = ఆ క్షణములోనే,
పరిమృశతి = తడవుకొనుచున్నాడో,
సమమ్ = ఒకే సమయములో,
స్కంద = కుమారస్వామి చేతను,
ద్విప వదన = ఏనుగు ముఖము కల వినాయకుని చేతను,
పీతమ్ = పాలు త్రాగఁబడినదియు,
ప్రస్నుత ముఖమ్ = పాలను స్రవింప జేయు కుచాగ్రముల గలదియునగు,
తవ = నీ యొక్క,
ఇదమ్ = ఈ,
స్తనయుగమ్ = వక్షోజముల జంట,
నః = మా యొక్క,
ఖేదమ్ = దుఃఖమును,
హరతు = తొలగించు గాక.
భావము.
ఓ భగవతీ! ఏ స్తనయుగమును చూచి నా యొక్క తలపై నుండు కుంభములు దొంగిలింప బడినవను సంశయము చేత కలత పడిన మనస్సుగలవాడై వినాయకుడు నవ్వు పుట్టించు చున్నవాడై తన కుంభములను తొండము చేత ఆ క్షణములోనే తడవు కొనుచున్నాడో ఒకే సమయములో కుమారస్వామి చేతను ఏనుగు ముఖము కల వినాయకుని చేతను పాలు త్రాగఁబడినదియు, పాలను స్రవింప జేయు కుచాగ్రముల గలదియునగు నీ యొక్క ఈ వక్షోజముల జంట మా యొక్క దుఃఖమును తొలగించు గాక.
73 వ శ్లోకము.
అమూ తే వక్షోజావమృతరస మాణిక్య కుతుపౌ
న సందేహస్పందో నగపతి పతాకే మనసి నః |
పిబంతౌ తౌ యస్మాదవిదిత వధూసంగ రసికౌ
కుమారావద్యాపి ద్విరద వదన క్రౌంచ దళనౌ ||
పదచ్ఛేదము.
అమూ - తే - వక్షోజౌ - అమృత రస - మాణిక్య - కుతుపౌ -
న - సందేహ - స్పందః - నగ - పతి - పతాకే - మనసి - నః -
పిబంతౌ - తౌ - యస్మాత్ - అవిదిత - వధూ - సంగ - రసికౌ -
కుమారౌ - అద్య - అపి - ద్విరద - వదన - క్రౌంచ - దళనౌ.
అన్వయక్రమము.
నగపతి పతాకే! అమూ, తే, వక్షోజౌ, అమృత రస, మాణిక్య, కుతుపౌ, నః, మనసి, సందేహ స్పందః, న, యస్మాత్, తౌ, పిబంతౌ, అవిదిత, వధూ, సంగ, రసికౌ, ద్విరదవదన క్రౌంచదళనౌ, అద్య + అపి, కుమారౌ.
పద్యము.
చం. అమిత సుధారసాంచితము లద్దిన కెంపులకుప్పెలెన్న నీ
విమల పయోధరంబులు, స్రవించెడి పాలను గ్రోలుటన్ సదా
హిమగిరి వంశ కేతన మహేశ్వరి! నీ వరపుత్రులిద్దరున్
బ్రముదముతోడ బాలురుగ వర్ధిలు చుండిరి బ్రహ్మచారులై. ॥ 73 ॥
ప్రతిపదార్థము.
నగపతి పతాకే = హిమవంతుని కీర్తిపతాకవైన ఓ గిరిజాదేవీ!
అమూ = ఈ కన్పట్టుచున్న,
తే = నీ యొక్క,
వక్షోజౌ = స్తనములు,
అమృత రస = అమృతముతో నిండిన,
మాణిక్య=మాణిక్యములతో నిర్మింపబడిన,
కుతుపౌ = కుప్పెలు,
నః = మా యొక్క,
మనసి = మనస్సునందు,
సందేహ స్పందః = లేశమాత్రమైన సందేహమును,
న = లేదు,
యస్మాత్ = ఏ కారణము చేతననగా,
తౌ = ఆ కెంపు కుప్పెలైన నీ స్తనములను,
పిబంతౌ = పాలుత్రాగుచున్నవారై,
అవిదిత = తెలియని,
వధూ = స్త్రీల యొక్క,
సంగ = కూటిమి యందు,
రసికౌ = రాసిక్యము కలవారైన,
ద్విరద వదన క్రౌంచదళనౌ = గణపతి, కుమారస్వామి,
అద్య + అపి = ఇప్పటికి గూడ,
కుమారౌ = బాలురుగానే వున్నారు.
భావము.
అమ్మా! హిమవంతుని వంశమనే ధ్వజమునకుపతాక అయిన ఓ పార్వతీమాతా! నీ కుచములు అమృత రసముతో నిండి, మాణిక్యములతో నిర్మింపబడిన కుప్పెలు అనుటకు మాకు ఎటువంటి సందేహమునూ లేదు. ఎందుకు అనగా ఆ కుచముల పాలు త్రాగిన గణపతి, కుమారస్వామి ఇప్పటికినీ బాలురు గానే ఉన్నారు కదా!
74 వ శ్లోకము.
వహత్యంబ స్తంబేరమదనుజ కుంభ ప్రకృతిభిః
సమారబ్ధాం ముక్తామణిభిరమలాం హారలతికామ్ |
కుచాభోగో బింబాధర రుచిభిరంతశ్శబలతాం
ప్రతాప వ్యామిశ్రాం పురదమయితుః కీర్తిమివ తే ||
పదచ్ఛేదము.
వహతి - అంబ - స్తంబేరమ - దనుజ - కుంభ - ప్రకృతిభిః -
సమ - ఆరబ్ధామ్ - ముక్తా మణిభిః - అమలామ్ - హార - లతికామ్ -
కుచ - ఆభోగః - బింబ - అధర - రుచిభిః - అంతః - శబలతామ్ -
ప్రతాప - వ్యామిశ్రామ్ - పుర - దమయితుః - కీర్తిమ్ - ఇవ - తే.
అన్వయక్రమము.
అంబ, తే, కుచ, ఆభోగః, స్తంబేరమ దనుజ, కుంభ, ప్రకృతిభిః, ముక్తామణిభిః, సమారబ్ధామ్, అమలామ్, బింబ, అధర రుచిభిః, అంతః, శబలతామ్, హార లతికామ్, ప్రతాపవ్యామిశ్రామ్, పురదమయితుః, కీర్తిమ్ ఇవ, వహతి.
పద్యము.
ఉ. అమ్మరొ! నీదు హారము గజాసుర కుంభజ మౌక్తికాభమై
యెమ్మెయిఁ జూడ నిర్మలమహీనశుభాస్పద దోషదూరమో
యమ్మ! నిజారుణద్యుతి శుభాధర బింబము నుండి సోకి సాం
తమ్మును చిత్రవర్ణమయి త్ర్యక్షుని కీర్తి వహించెఁ జూడగన్. ॥ 74 ॥
ప్రతిపదార్థము.
అంబ = ఓ జగన్మాతా ,
తే = నీ యొక్క,
కుచ = స్తనముల యొక్క,
ఆభోగః = విస్తారము,
స్తంబేరమ దనుజ = గజాసురుని యొక్క,
కుంభ = కుంభస్థలము నుండి,
ప్రకృతిభిః = పుట్టుకగాగల,
ముక్తామణిభిః =ముత్యముల చేత,
సమారబ్ధామ్ = కూర్పఁబడినదియు,
అమలామ్ = దోషరహితమైనదియు,
బింబ = దొండపండు వంటి కెంపు రూపుగలదైన,
అధర రుచిభిః = క్రింది పెదవి కాంతుల చేత,
అంతః = లోన ,
శబలతామ్ = చిత్రవర్ణములతో కూడినదియు అయి,
హార లతికామ్ = తీగవంటి ముత్యాల హారమును,
ప్రతాపవ్యామిశ్రామ్ = ప్రతాపముతో కూడిన,
పురదమయితుః = త్రిపురహరుని యొక్క,
కీర్తిం ఇవ = కీర్తిని వలె,
వహతి = తాల్చుచున్నది.
భావము.
అమ్మా! నీ మెడలో ధరించిన హారము గజాసురుని కుంభస్థలమునుండి పుట్టిన ముత్యములచే కూర్చబడినదియూ, దోష రహితమై నిర్మలమైనదియూ, దొండపండు వంటి పెదవి యొక్క కాంతులచే చిత్ర వర్ణముగా చేయబడి ఈశ్వరుని పరాక్రమము తో కూడిన కీర్తి ని వహించుచున్నట్లుగా కనబడుచున్నది.
75 వ శ్లోకము.
తవ స్తన్యం మన్యే ధరణిధరకన్యే హృదయతః
పయః పారావారః పరివహతి సారస్వతమివ |
దయావత్యా దత్తం ద్రవిడశిశురాస్వాద్య తవ యత్
కవీనాం ప్రౌఢానా మజని కమనీయః కవయితా ||
పదచ్ఛేదము.
తవ - స్తన్యమ్ - మన్యే - ధరణి - ధర - కన్యే - హృదయతః -
పయః - పారావారః - పరివహతి - సారస్వతమ్ - ఇవ -
దయావత్యా - దత్తమ్ - ద్రవిడ - శిశుః - ఆస్వాద్య - తవ - యత్ -
కవీనామ్ - ప్రౌఢానామ్ - అజని - కమనీయః - కవయితా.
అన్వయక్రమము.
ధరణి ధరకన్యే, తవ, స్తన్యమ్, హృదయతః, పయః పారావారః, సారస్వతం ఇవ, పరివహతి, మన్యే, యత్, దయావత్యా, దత్తమ్, ద్రవిడ శిశుః, ఆస్వాద్య, ప్రౌఢానామ్, కవీనామ్, కమనీయః, కవయితా, అజని.
పద్యము.
మ. హృదయోద్భూత మహత్వ వాఙ్మయ సుధా ధృత్వంబుగానెంచెదన్
క్షుధపోకార్పెడి నీదు స్తన్యమును, నాకున్ నీవు వాత్సల్య మొ
ప్ప దయన్ బట్టిన కారణంబుననె యీ బాలుండు ప్రౌఢంపు సత్
సుధలన్ జిందెడి ప్రౌఢ సత్కవులలోశోభిల్లెనొక్కండుగా. ॥ 75 ॥
ప్రతిపదార్థము.
ధరణి ధరకన్యే = పర్వతరాజపుత్రికా ఓ పార్వతీ,
తవ = నీ యొక్క,
స్తన్యమ్ = చనుబాలు అను,
హృదయతః = హృదయము నుండి పుట్టినదైన,
పయః పారావారః = పాల సముద్రము,
సారస్వతం ఇవ = వాఙ్మయము వలె,
పరివహతి = ప్రవహంచుచున్నదిగా,
మన్యే = తలచెదను,
యత్ = ఏ కారణము వలన,
దయావత్యా = దయతో కూడిన నీ చేత,
దత్తమ్ = ఈయబడిన చనుబాలను,
ద్రవిడ శిశుః= ద్రవిడ దేశమునందు పుట్టిన బాలుడు(అయిన నేను),
ఆస్వాద్య = త్రాగి ,
ప్రౌఢానామ్ = ప్రౌఢులు నిపుణులు అయిన,
కవీనామ్ = కవీశ్వరులలో,
కమనీయః = సర్వ జగన్మోహనమైన,
కవయితా = కవిత్వము చెప్పేవానిగా,
అజని = మార్గముపొందెను (కాగలిగితిని).
భావము.
అమ్మా! పర్వత నందినీ! నీ చనుబాలను హృదయము నుండి ప్రవహించుచున్న వాఙ్మయముతో నిండిన పాలసముద్రము వలె నేను తలచు చున్నాను. ఎందువలన అనగా వాత్సల్యముతో నీవు ఇచ్చిన స్తన్యము త్రాగి ఈ ద్రవిడ బాలుడు ( శ్రీ శంకర భగవత్పాదులు) కవులలో మనోహరుడు అయిన కవి కాజాలెను కదా !
జైహింద్.
No comments:
Post a Comment