జైశ్రీరామ్.
21 వ శ్లోకము.
తటిల్లేఖా తన్వీం తపన శశి వైశ్వానర మయీం
నిషణ్ణాం షణ్ణామప్యుపరి కమలానాం తవ కలాం |
మహాపద్మాటవ్యాం మృదితమలమాయేన మనసా
మహాంతః పశ్యంతో దధతి పరమానంద లహరీమ్ ||
పదచ్ఛేదము.
తటిత్ - లేఖా - తన్వీమ్ - తపన - శశి - వైశ్వానర - మయీమ్ -
నిషణ్ణామ్ - షణ్ణాన్ - అపి - ఉపరి - కమలానామ్ - తవ - కలామ్ - |
మహా పద్మాటవ్యామ్ - మృదిత - మల మాయేన - మనసా -
మహాంతః - పశ్యంతః - దధతి - పరమ - ఆనంద - లహరీమ్.
అన్వయక్రమము.
తటిత్ + లేఖా, తన్వీమ్, తపన శశి వైశ్వానర మయీమ్, షణ్ణామ్, కమలానామ్, అపి, ఉపరి, మహా పద్మాటవ్యామ్, నిషణ్ణామ్, తవ, కలామ్, మృదిత, మలమాయేన, మనసా, పశ్యన్తః, మహాంతః, పర మానందలహరీమ్, దధతి.
పద్యము.
సీ. మెరుపు తీగను బోలు మేలైన కాంతితోఁ జంద్రసూర్యాగ్నుల సహజమైన
రూపంబుతోనొప్పి, రూఢిగ షట్ చక్ర ములపైన నొప్పెడి మూలమైన
వర సహస్రారాన వరలు నీ సత్ కళన్ గామాది మలములు క్షాళితమయి,
మనసులన్ గనునట్టి మహితాత్ము లానంద లహరులందేలుదు రిహము మరచి,
తే.గీ. ఎంత వర్ణించినన్ నిన్నుఁ గొంతె యగును,
శంకరాచార్యులే కాదు శంకరుఁడును
నిన్ను వర్ణింపలేడమ్మ! నిరుపమాన
సగుణ నిర్గుణ సాక్షి వో చక్కనమ్మ! ॥ 21 ॥
ప్రతిపదార్థము.
(హే భగవతి! = ఓ జననీ!)
తటిత్ + లేఖా = మెఱువు తీగవంటి,
తన్వీమ్ = శరీరము కలదియు,
తపన శశి వైశ్వానర మయీమ్ = సూర్యచంద్రాగ్ని రూపము కలదియు,
షణ్ణామ్ = ఆరు సంఖ్యగలదియు,
కమలానామ్ = పద్మముల యొక్క ( షట్చక్రముల యొక్క,)
అపి = మరియు,
ఉపరి = పై భాగమందు,
మహా పద్మాటవ్యామ్ = గొప్పతామర తోటయందు (సహస్రార కమలమందు,)
నిషణ్ణామ్ = కూర్చున్న,
తవ = నీ యొక్క,
కలామ్ = సాదాఖ్య బైందవీ కళచే,
మృదిత = క్షాళనము కావింపబడిన,
మలమాయేన = కామాది మలినములు,
అనగా - మాయ, అవిద్య, అహంకారాదులు గల,
మనసా = మనస్సు చేత,
పశ్యన్తః = చూచుచున్న,
మహాంతః = సజ్జనులు,
పర మానందలహరీమ్ = ఉత్తమ సుఖానుభవ రసానంద ప్రవాహమును,
దధతి = పొందుచున్నారు.
భావము.
తల్లీ! భగవతీ! మెరుపు తీగవలె సొగసైన, సూక్ష్మమైన, పొడవైన, ప్రకాశించు లక్షణము కలిగిన, సూర్య చంద్రాగ్ని స్వరూపమైనది, షట్చక్రాలకు పైన సహస్రారంలో మహాపద్మాటవిలో కూర్చున్న నీ యొక్క సాదాఖ్య అనే బైందవీ కళను- కామాది మలినములను పోగొట్టుకున్న మహాపురుషులైన యోగీశ్వరులు ధ్యానించి, మహానంద ప్రవాహములో ఓలలాడుచున్నారు.
22 వ శ్లోకము.
భవాని త్వం దాసే మయి వితర దృష్టిం సకరుణాం
ఇతి స్తోతుం వాంఛన్ కథయతి భవాని త్వమితి యః |
తదైవ త్వం తస్మై దిశసి నిజసాయుజ్య పదవీం
ముకుంద బ్రహ్మేంద్ర స్ఫుట మకుట నీరాజితపదామ్ ||
పదచ్ఛేదము.
భవాని - త్వమ్ - దాసే - మయి - వితర - దృష్టిం - సకరుణామ్ -
ఇతి - స్తోతుమ్ - వాంఛన్ - కథయతి - భవాని - త్వమ్ - ఇతి - యః -
తత్ - ఏవ - త్వమ్ - తస్మై - దిశసి - నిజ - సాయుజ్య - పదవీమ్ -
ముకుంద - బ్రహ్మ - ఇంద్ర స్ఫుట - మకుట - నీరాజిత - పదామ్.
అన్వయక్రమము.
భవాని!త్వమ్, దాసే, మయి, సకరుణామ్, దృష్టిమ్, వితర, ఇతి, స్తోతుమ్, వాంఛన్, “భవానిత్వం' ఇతి, కథయతి, తస్మై, త్వమ్, తదైవ, ముకుంద, బ్రహ్మ, ఇంద్ర, స్ఫుట మకుట, నీరాజిత, పదామ్, నిజ సాయుజ్య పదవీమ్, దిశసి.
పద్యము.
ఉ. అమ్మ! భవాని! దాసుఁడ, మహాకరుణన్ గనుమంచునెంచి నే
నమ్మ! భవాని నీవనుచు నార్తిగ పల్కుచునుండునంత నా
బమ్మయు, నింద్రుఁడున్, హరి, సభక్తిని గొల్చెడి నీదు పాద పీ
ఠమ్మునఁ జేరఁ జేయుచు నెడందను గాంచుచు ముక్తి నిత్తువే. ॥ 22 ॥
ప్రతిపదార్థము.
భవాని! = ఓ భవానీ జననీ!
త్వమ్ = నీవు,
దాసే = దాసుడనైన,
మయి = నాయందు,
సకరుణామ్ = దయతో కూడిన,
దృష్టిమ్ = చూపును,
వితర = ప్రసరింప చేయుము,
ఇతి = ఈ ప్రకారముగా,
స్తోతుమ్ = స్తుతించుటకు,
వాంఛన్ = ఇచ్చగించువాడై,
“భవానిత్వం' ఇతి = “భవానిత్వం అని,
కథయతి = పలుకునో,
తస్మై = ఆ విధముగా ఉచ్చరించు వానికి,
త్వమ్ = నీవు,
తదైవ = ఆ విధముగా ఉచ్చరించుట పూర్తి కాకమునుపే,
ముకుంద = విష్ణువు,
బ్రహ్మ = బ్రహ్మదేవుడు,
ఇంద్ర = దేవేంద్రుడు అనువారి యొక్క,
స్ఫుట మకుట = స్పష్టముగా కనబడు కాంతివంతమగు కిరీటముల చేత,
నీరాజిత = హారతి ఇవ్వబడిన,
పదామ్ = అడుగులు కల,
నిజ సాయుజ్య పదవీమ్ = నీ తోడి తాదాత్మ్యము అను పదవిని,
దిశసి = ఇచ్చెదవు.
భావము.
“తల్లీ! భవానీ! నేను దాసుడను. నీవు నా యందు దయతో కూడిన నీ చల్లని చూపును ప్రసరింపచేయుము” అని స్తుతిస్తూ, “భవానీత్వం” అని మొదలుపెట్టి ఇంకా చెప్పబోయేలోపే వారికి హరి బ్రహ్మేంద్రులు రత్న కిరీటములచే హారతి పట్టబడు నీ పద సాయుజ్యమును ఇచ్చెదవు.
23 వ శ్లోకము.
త్వయా హృత్వా వామం వపురపరితృప్తేన మనసా
శరీరార్ధం శంభోరపరమపి శంకే హృతమభూత్ |
యదేతత్ త్వద్రూపం సకలమరుణాభం త్రినయనం
కుచాభ్యామానమ్రం కుటిల శశిచూడాల మకుటమ్ ||
పదచ్ఛేదము.
త్వయా - హృత్వా - వామమ్ - వపుః - అపరితృప్తేన - మనసా -
శరీర - అర్ధమ్ - శంభోః - అపరమ్ - అపి - శంకే - హృతమ్ - అభూత్ -
యత్ - ఏతత్ - త్వత్ - రూపమ్ - సకలమ్ - అరుణ - అభమ్ - త్రినయనమ్ -
కుచాభ్యామ్ - ఆనమ్రమ్ - కుటిల - శశి చూడాల - మకుటమ్.
అన్వయక్రమము.
త్వయా, శంభోః, వామమ్, వపుః, హృత్వా, అపరితృప్తేన, మనసా, అపరమ్, శరీరార్ధం అపి, హృతమ్, అభూత్, శంకే, యత్, ఏతత్, త్వత్ రూపమ్, సకలమ్, అరుణాభమ్, త్రినయనమ్, కుచాభ్యామ్, ఆనమ్రమ్, కుటిల, శశిచూడాల మకుటమ్.
పద్యము.
సీ. వామ భాగము నీవు భవునిలో గ్రహియించి, సంతృప్తి కనకేమొ శంభురాజ్ఞి!
కుడిసగముం గూడఁ గోరి కొంటివనుచు శంక కలుగుచుండె జయనిధాన!
భవ్యారుణప్రభల్ వామ దక్షిణభాగముల నీదు దేహంబు పొంది యుండె,
నేత్రత్రయంబొప్పె, నీ కుచభారాన వంగినమేనాయె, వంకరైన
తే.గీ. చంద్ర రేఖ నీ శిరమునఁ జక్కఁగాను
వినుత చూడామణి మకుట మన రహించె,
నిట్టి హేతువులుండుటన్ గట్టిగాను
శంక కలిగెను నాకు నో జయనిధాన! ॥ 23 ॥
ప్రతిపదార్థము.
(హే భగవతి! = ఓ జననీ!)
త్వయా = నీ చేత,
శంభోః = శివుని యొక్క,
వామమ్ = ఎడమ భాగమైన,
వపుః = దేహము,
హృత్వా = అపహరించి,
అపరితృప్తేన = సంతుష్టినొందని,
మనసా = మనస్సు చేత,
అపరమ్ = రెండవ (కుడి) భాగమైన,
శరీరార్ధం అపి = శివుని శరీరము యొక్క రెండవ దైనకుడి భాగమును సైతము,
హృతమ్ = గ్రహింపబడినదిగా,
అభూత్ = ఆయెనని,
శంకే = సందేహపడెదను,
యత్ = ఏ కారణము వలన,
ఏతత్ = (నా హృదయములో భాసించు) ఈ,
త్వత్ రూపమ్ = నీ దేహము,
సకలమ్ = వామ దక్షిణ భాగములు రెండును,
అరుణాభమ్ = ఎఱ్ఱని కాంతి గలదియు,
త్రినయనమ్ = మూడు కన్నులతో గూడినదియు,
కుచాభ్యామ్ = స్తన యుగ్మముచే,
ఆనమ్రమ్ = కొద్దిగా ముందుకు వంగినదియు,
కుటిల = వంకరగా నుండు
శశిచూడాల మకుటమ్ = చంద్రకళచే శిరోమణి గల కిరీటము గలదై ఒప్పుచున్నదియును అగుటవలననే సుమా.
భావము.
తల్లీ! జగజ్జననీ! నీ దేహమంతా అరుణకాంతులు వెదజల్లుతూ, మూడు కన్నులు గలిగి, స్తనభారముచే కొద్దిగా వంగినట్లు కనబడుతూ, నెలవంకను శిరోమణిగా కలిగియుండుటను చూడగా – మొదట నీవు శివుని శరీర వామభాగమును హరించి, అంతటితో సంతృప్తి చెందక, కుడిభాగమైన శరీరార్ధమును కూడా హరించితివి కాబోలునని సందేహము కలుగుచున్నది.
24 వ శ్లోకము.
జగత్సూతే ధాతా హరిరవతి రుద్రః క్షపయతే
తిరస్కుర్వన్నేతత్ స్వమపి వపురీశస్తిరయతి |
సదా పూర్వస్సర్వం తదిద మనుగృహ్ణాతి చ శివ
స్తవాజ్ఞా మాలంబ్య క్షణచలితయోర్భ్రూలతికయోః ||
పదచ్ఛేదము.
జగత్ - సూతే - ధాతా - హరిః - అవతి - రుద్రః - క్షపయతే -
తిరస్కుర్వన్ - ఏతత్ - స్వమ్ - అపి - వపుః -ఈశః - స్తిరయతి -
సదా - పూర్వః - సర్వమ్ - తత్ - ఇదమ్ - అనుగృహ్ణాతి - చ శివః -
తవ - ఆజ్ఞామ్ - ఆలంబ్య - క్షణ - చలితయోః - భూ లతికయోః.
అన్వయక్రమము.
ధాతా, జగత్, సూతే, హరిః, అవతి, రుద్రః, క్షపయతే, ఈశః, ఏతత్, తిరస్కుర్వన్, స్వమపి, వపుః, తిరయతి, సదాపూర్వః, శివః, తదిదమ్, క్షణ చలితయోః, తవ, భ్రూలతికయోః, ఆజ్ఞామ్, ఆలంబ్య, అనుగృహ్ణాతి.
పద్యము.
ఉ. హే కరుణామయీ! విధి గణించుచుఁ జేయును సృష్టి, విష్ణు వా
శ్రీకర సృష్టిఁ బెంచు, హృతిఁ జేయును రుద్రుఁడు, నీ త్రిమూర్తులన్
బ్రాకటమొప్ప నెట్టి, తన రమ్యసుదేహము దాచు నీశుఁడున్,
నీ కను సన్నచే మరల నేర్పునఁ గొల్పు సదాశివుండు తాన్. ॥ 24 ॥
ప్రతిపదార్థము.
(హే భగవతి! = ఓ జననీ!)
ధాతా = బ్రహ్మ,
జగత్ = ప్రపంచమును,
సూతే = సృజించుచున్నాడు,
హరిః = విష్ణువు,
అవతి = పాలించి రక్షించుచున్నాడు,
రుద్రః= రుద్రుడు,
క్షపయతే = లీనము చేయుచున్నాడు,
ఈశః = ఈశ్వరుడు,
ఏతత్ = ఈ ముగ్గుఱిని,
తిరస్కుర్వన్ = తిరస్కరించు వాడై,
స్వమపి = తనదగు,
వపుః = శరీరమును,
తిరయతి = అంతర్ధానమును పొందించుచున్నాడు,
సదాపూర్వః = సదా అను శబ్దము ముందు గల,
శివః = (సదా) శివుడు,
తదిదమ్ = (ఈ చెప్పబడిన) తత్త్వ చతుష్టయమును,
క్షణ చలితయోః = క్షణ కాలమాత్ర వికాసము గల,
తవ = నీ యొక్క,
భ్రూ లతికయోః = కనుబొమల యొక్క,
ఆజ్ఞామ్ = ఆజ్ఞను,
ఆలంబ్య = పొంది,
అనుగృహ్ణాతి = అనుగ్రహంచుచున్నాడు. అనగా మఱల సృజించు చున్నాడు.
భావము.
అమ్మా! నీ లతలవంటి కనుబొమల కదలికనుండి ఆజ్ఞను స్వీకరించి, బ్రహ్మ ప్రపంచమును సృష్టించును. విష్ణువు పాలించును. రుద్రుడు లయింపజేయును. ఈశ్వరుడు ఈ త్రయమును తన శరీరమునందు అంతర్ధానము నొందించును. సదాశివుడు నీ కటాక్షమును అనుసరించి ఈ నాలుగు పనులను మరలా ఉద్ధరించుచున్నాడు.
25 వ శ్లోకము.
త్రయాణాం దేవానాం త్రిగుణ జనితానాం తవ శివే
భవేత్ పూజా పూజా తవ చరణయోర్యా విరచితా |
తథా హి త్వత్పాదోద్వహన మణిపీఠస్య నికటే
స్థితా హ్యేతే శశ్వన్ముకుళిత కరోత్తంస మకుటాః ||
పదచ్ఛేదము.
త్రయాణామ్ - దేవానామ్ - త్రిగుణ - జనితానామ్ - తవ - శివే -
భవేత్ - పూజా - పూజా - తవ - చరణయోః - యా - విరచితా -
తథా హి - త్వత్ - పాద - ఉద్వహన - మణి పీఠస్య - నికటే -
స్థితాః - ఏతే - శశ్వత్ - ముకుళిత - కర - ఉత్తంస - మకుటాః .
అన్వయక్రమము.
శివే! తవ, త్రిగుణ జనితానామ్, త్రయాణామ్, దేవానామ్, తవ, చరణయోః, యా పూజా, విరచితా, పూజా, భవేత్, తథాహి, త్వత్పాద, ఉద్వహన, మణిపీఠస్య, నికటే, శశ్వత్, ముకుళిత, కర, ఉత్తంస, మకుటాః, ఏతే, స్తితాః.
పద్యము.
ఉ. నీదు గుణత్రయంబున గణింప త్రిమూర్తులు పుట్టిరోసతీ!
నీ దరి నిల్చి మ్రొక్కిన, గణింతురు వారలు వారికన్నటుల్,
మోదముతోడ నిన్నుఁ గని పూజ్యముగా మది నిల్పి కొల్తురే,
నీ దయ కల్గినన్ గలుగు నీ పద పంకజ సేవ మాకిలన్.॥ 25 ॥
ప్రతిపదార్థము.
శివే! = ఓ భవానీ!
తవ = నీ యొక్క,
త్రిగుణ జనితానామ్ = సత్త్వ రజస్తమో గుణముల వలన ఉద్భవించిన,
త్రయాణామ్ = ముగ్గుఱైన,
దేవానామ్ = బ్రహ్మ, విష్ణు, రుద్రులకు,
తవ = నీ యొక్క,
చరణయోః = పాదములందు,
యా పూజా = ఏ పూజ,
విరచితా = చేయఁబడినదో,
పూజా = అదియే పూజగా,
భవేత్ = అగును. (వేరొకటి పూజ కాదు - అని భావము)
తథాహి = ఇది యుక్తము, (ఏలననగా)
త్వత్పాద = నీ పాదములను,
ఉద్వహన = వహించుచున్న,
మణిపీఠస్య = రత్న పీఠము యొక్క,
నికటే = సమీపము నందు,
శశ్వత్ = ఎల్లపుడూ,
ముకుళిత = మోడ్చబడిన
కర = హస్తములే,
ఉత్తంస = శిరోభూషణముగాగల,
మకుటాః = కిరీటములు గలవారై,
ఏతే = ఈ త్రిమూర్తులు,
స్తితాః = వర్తించుచున్నారు కాబట్టి.
భావము.
తల్లీ! నీ సత్త్వరజస్తమోగుణములచేత జనించిన బ్రహ్మ విష్ణు రుద్రులు ముగ్గురూ, నీవు పాదములుంచెడి మణిపీఠమునకు దగ్గరగా చేతులు జోడించి, శిరస్సున దాల్చి ఎల్లప్పుడు నిలిచి ఉండెదరు. అందువలన నీ పదములకు చేసే పూజ త్రిమూర్తులకు కూడా పూజ అగుచున్నది.
జైహింద్.
No comments:
Post a Comment