జైశ్రీరామ్.
36 వ శ్లోకము.
తవాజ్ఞా చక్రస్థం తపన శశికోటి ద్యుతిధరం
పరం శంభుం వందే పరిమిలిత పార్శ్వం పరచితా |
యమారాధ్యన్ భక్త్యా రవి శశి శుచీనా మవిషయే
నిరాలోకే ఽలోకే నివసతి హి భాలోక భువనే ||
పదచ్ఛేదము.
తవ - ఆజ్ఞాచక్రస్థమ్ - తపన - శశికోటి - ద్యుతి ధరమ్ -
పరమ్ - శంభుమ్ - వందే - పరిమిలిత - పార్శ్వమ్ - పరచితా -
యమ - ఆరాధ్యన్ - భక్త్యా - రవి - శశి - శుచీనామ్ - అవిషయే -
నిరాలోకే - అలోకే - నివసతి హి - భా - లోక - భువనే.
అన్వయక్రమము.
తవ, ఆజ్ఞా చక్రస్థమ్, తపన శశి, కోటి,ద్యుతిధరమ్, పరచితా, పరిమిళిత పార్శ్వమ్, పరమ్, శంభుమ్, వందే,యమ్, భక్త్యా, ఆరాధ్యన్, రవిశశి శుచీనామ్, అవిషయే, నిరాలోకే, అలోకే, భాలోక భువనే,నివసతివా.
పద్యము.
సీ. నీకు చెందినదైన నిరుప మాజ్ఞాచక్ర మది రవి శశికాంతు లలరునట్టి
పరమచిచ్ఛక్తిచే నిరువైపులందునన్ గలిగిన పరుఁడైన కాలగళునిఁ
జేరి చేసెద నతుల్, గౌరీపతిని భక్తి నారాధనము చేయు ననుపముఁడగు
సాధకుండిద్ధరఁ జక్కగా రవిచంద్ర కాంతికిన్ గనరాక, కానఁబడక
తే.గీ. బాహ్యదృష్టికి, నేకాంత భాసమాన
గణ్యమౌ సహస్రారమన్ కమలమునను
నిరుపమానందుఁడై యొప్పి మురియుచుండు
నమ్మ! నీ దయ నాపైనఁ గ్రమ్మనిమ్ము. ॥ 36 ॥
ప్రతిపదార్థము.
(హే భగవతి! = ఓ తల్లీ!)
తవ = నీ సంబంధమైన,
ఆజ్ఞా చక్రస్థమ్ = ఆజ్ఞాచక్రము నందున్న వాడును,
తపన శశి = కోటి సూర్య చంద్రుల
కోటి = కాంతి వంటి
ద్యుతిధరమ్ = కాంతి ధరించినవాడును,
పరచితా = పరి మగు చిచ్చక్తి చేత;
పరిమిళిత పార్శ్వమ్ = ఆవరింపఁబడిన ఇరు పార్శ్వములు కలవాడును,
పరమ్ = పరమును అయిన,
శంభుమ్ = శంభుని గూర్చి,
వందే = నమస్కరించుచున్నాను.
యమ్ = అట్టి ఏ పరమశివుని,
భక్త్యా = భక్తితో,
ఆరాధ్యన్ = పూజించుచు ప్రసన్నునిగా చేసుకొను సాధకుడు,
రవిశశి శుచీనామ్ = రవిచంద్రాగ్నులకు,
అవిషయే = అగోచరమైనదియు,
నిరాలోకే = బాహ్యదృష్టికి అందరానిదియు,
అలోకే = జనము లేని ఏకాంత మైనుటవంటిదియునైన,
భాలోక భువనే = వెలుగుల లోకమునందు (సంపూర్ణముగా వెన్నెల వెలుగులతో నిండిన లోకవుందు, అనగా - సహస్రారకవములము నందు)
నివసతివా = వసించును. అనగా - నీ సాయుజ్యమును పొందును అని అర్థము.
భావము.
ఓ జగజ్జననీ! నీకు సంబంధించినదైన ఆజ్ఞాచక్రము నందు- కొన్ని కోట్ల సూర్య, చంద్రుల కాంతిని ధరించిన వాడును, “పర”యను పేరు పొందిన చిచ్చక్తిచేత కలిసిన, ఇరు పార్శ్యములు కలవాడును అగు పరమశివునికి నమస్కరించుచున్నాను. ఏ సాధకుడు భజనతత్పరుడై ఇట్టి పరమ శివుని ప్రసన్నునిగా చేసుకొనునో- అతడు రవిచంద్రాగ్నులకు సైతం వెలిగించడానికి వీలుకానటువంటిది, బాహ్యదృష్టికి గోచరింపనిది అయిన నీ సాయుజ్యమును పొందును.
37 వ శ్లోకము.
విశుద్ధౌ తే శుద్ధస్ఫటిక విశదం వ్యోమ జనకం
శివం సేవే దేవీమపి శివసమాన వ్యవసితామ్ |
యయోః కాంత్యా యాంత్యాశ్శశికిరణ సారూప్యసరణేః
విధూతాంతర్ధ్వాంతా విలసతి చకోరీవ జగతీ ||
పదచ్ఛేదము.
విశుద్ధౌ - తే - శుద్ధ - స్ఫటిక - విశదమ్ - వ్యోమ - జనకమ్ -
శివమ్ - సేవే - దేవీమ్ - అపి - శివ - సమాన - వ్యవసితామ్ -
యయోః - కాంత్యా - యాంత్యాః - శశి - కిరణ - సారూప్య - సరణేః -
విధూత - అంతః - ధ్వాంతా - విలసతి - చకోరీ - ఇవ - జగతీ.
అన్వయక్రమము.
తే, విశుద్ధౌ, శుద్ధ, స్ఫటిక, విశదమ్, వ్యోమ, జనకమ్, శివమ్, శివ, సమాన, వ్యవసితామ్, దేవీం అపి, సేవే, యయోః, యాంత్యాః, శశికిరణ, సారూప్య, సరణేః, కాంత్యా, జగతీ, విధూత, అంతః + ధ్వాంతా, చకోరీ + ఇవ.
పద్యము.
ఉ. నీదు విశుద్ధి చక్రమున నిర్మలమౌ దివితత్త్వ హేతువౌ
జోదుగ వెల్గు నాశివుని, శోభిలుచుండెడి నిన్నుఁ గొల్చెదన్,
మోదమునొప్పు మీ కళలు పూర్ణముగా లభియింపఁ వీడెడున్
నాదు తమిస్రమున్, మదిననంత మహాద్భుత కాంతినొప్పెదన్. ॥ 37 ॥
ప్రతిపదార్థము.
(హే భగవతి! = ఓ తల్లీ!)
తే = నీ యొక్క,
విశుద్ధౌ = విశుద్ధ చక్రము నందు,
శుద్ధ = దోషము లేని,
స్ఫటిక = స్ఫటిక స్వచ్ఛతతో,
విశదమ్ = మిక్కిలి నిర్మలమైన వాడును,
వ్యోమ = ఆకాశతత్త్వమును,
జనకమ్ = ఉత్పాదించు వాడును అగు,
శివమ్ = శివునిని,
శివ = శివునితో,
సమాన = సమానమైన,
వ్యవసితామ్ = సామర్థ్యము గల,
దేవీం అపి = భగవతి ఐన నిన్నుగూడ,
సేవే = ఉపాసించెదను,
యయోః = ఏ శివాశివుల నుండి,
యాంత్యాః = వచ్చుచున్నదైన,
శశికిరణ = చంద్రకిరణముల
సారూప్య = పోలికయొక్క,
సరణేః = పరిపాటి కల,
కాంత్యా = కాంతివలన,
జగతీ = లోకము,
విధూత = వదలగొట్ట బడిన,
అంతః + ధ్వాంతా = ఆత్మలోనుండు అజ్ఞానమను చీకటి గలదై,
చకోరీ + ఇవ = ఆడ చకోర పక్షివలె,
విలసతి = ప్రకాశించుచున్నది. (అనగా - అట్టి శివాశివులను సేవించెదను అని భావము.)
భావము.
ఓ జగజ్జననీ! నీ విశుద్ధి చక్రము నందు దోషరహితమైన స్ఫటిక స్వచ్ఛతతో మిక్కిలి నిర్మలమై వుండు వాడు, ఆకాశోత్పత్తికి హేతువైన వాడు అగు శివునిని, అట్టి శివునితో సమానమైన దేవివైన నిన్ను గూడా ఉపాసించుచున్నాను. చంద్రకాంతులతో సాటి వచ్చు మీ ఇరువురి కాంతులు క్రమ్ముకొనుటచే, ఈ సాధక లోకము- అజ్ఞానము నుండి తొలగి, ఆడు చకోర పక్షివలె ఆనందించును.
38 వ శ్లోకము.
సమున్మీలత్ సంవిత్కమల మకరందైక రసికం
భజే హంసద్వంద్వం కిమపి మహతాం మానస చరం |
యదాలాపాదష్టాదశ గుణిత విద్యాపరిణతిః
యదాదత్తే దోషాద్ గుణమఖిలమద్భ్యః పయ ఇవ ||
పదచ్ఛేదము.
సమున్మీలత్ - సంవిత్ - కమల - మకరంద - ఏక రసికమ్ -
భజే - హంస ద్వంద్వమ్ - కిమ్ అపి - మహతామ్ - మానస - చరమ్ -
యత్ - ఆలాపాత్ - అష్టాదశ - గుణిత - విద్యా - పరిణతిః -
యత్ - ఆదత్తే - దోషాత్ - గుణమ్ - అఖిలమ్ - అద్భ్యః - పయ - ఇవ.
అన్వయక్రమము.
యత్, ఆలాపాత్, అష్టాదశ గుణిత, విద్యా పరిణతిః, యత్, దోషాత్,గుణం అఖిలమ్, అద్భ్యః, పయః ఇవ, ఆదత్తే, సమున్మీలత్, సంవిత్, కమల, మకరంద, ఏకరసికమ్, మహతామ్, మానస, చరమ్, కిమపి, హంస ద్వంద్వమ్, భజే.
పద్యము.
తే.గీ. జ్ఞాన సుమ మధువును గోరు, కరుణనొప్పు
యోగులగువారి మదులలోనుండు, మంచి
నే గ్రహించు హంసలజంటనే సతంబు
మదిని నినిపి కొల్చెదనమ్మ! మన్ననమున. ॥ 38 ॥
ప్రతిపదార్థము.
(హే భగవతి! = ఓ తల్లీ!)
యత్ = ఏ హంసమిథునము యొక్క,
ఆలాపాత్ = సంభాషణ వలన,
అష్టాదశ గుణిత = పదునెనిమిది సంఖ్యగా చెప్పబడిన,
విద్యా పరిణతిః = విద్యల యొక్క పరిణతి కలుగునో,
యత్ = ఏ హంసల జంట,
దోషాత్ = అవలక్షణముల నుండి,
గుణం అఖిలమ్ = సమస్తమైన సద్గుణ సముదాయమును,
అద్భ్యః = నీళ్ళనుండి,
పయః ఇవ = పాలను వలె,
ఆదత్తే = గ్రహించుచున్నదో,
సమున్మీలత్ = వికసించుచున్న,
సంవిత్ = జ్ఞానము అను,
కమల = పద్మము నందలి,
మకరంద = తేనెయందు మాత్రమే,
ఏకరసికమ్ = ముఖ్యముగా ఇష్టపడునదియో,
మహతామ్ = యోగీశ్వరుల యొక్క,
మానస = మనస్సులలో (మానస సరోవరము నందు),
చరమ్ = చరించునదియో,
కిమపి = ఇట్టిదని చెప్పుటకు వీలులేని,
హంస ద్వంద్వమ్ = ఆ రాజహంసల జంటను,
భజే = సేవించెదను,
భావము.
ఓ జగజ్జననీ! అనాహత జ్ఞాన కమలము నందలి తేనెను మాత్రమే గ్రోలుట యందు ఆసక్తి కలిగినది, యోగీశ్వరుల మానస సరోవరములందు విహరించునది, నీరమును విడిచి పాలను మాత్రమే గ్రహించు సామర్థ్యము గలది, దేనిని భజించినచో అష్టాదశ విద్యలు చేకూరునో- అట్టి అనిర్వచనీయమైన శివశక్తులనే రాజహంసల జంటను ధ్యానించి భజించుచున్నాను.
39 వ శ్లోకము.
తవ స్వాధిష్ఠానే హుతవహ మధిష్ఠాయ నిరతం
తమీడే సంవర్తం జనని మహతీం తాం చ సమయామ్ |
యదాలోకే లోకాన్ దహతి మహతి క్రోధ కలితే
దయార్ద్రా యా దృష్టిః శిశిర ముపచారం రచయతి ||
పదచ్ఛేదము.
తవ - స్వాధిష్ఠానే - హుతవహమ్ - అధిష్ఠాయ - నిరతమ్ -
తమ్ - ఈడే - సంవర్తమ్ - జనని - మహతీమ్ - తామ్ - చ - సమయామ్ -
యత్ - ఆలోకే - లోకాన్ - దహతి - మహతి - క్రోధ - కలితే -
దయ - ఆర్ద్రా - యా - దృష్టిః - శిశిరమ్ - ముపచారమ్ - రచయతి.
అన్వయక్రమము.
జనని, తవ, స్వాధిష్ఠానే, హుతవహమ్, అధిష్ఠాయ, నిరతమ్, సంవర్తమ్, తమ్, ఈడే, సమయామ్, మహతీమ్, తామ్ చ, ఈడే, మహతి, క్రోధ, కలితే, యత్, ఆలోకే, లోకాన్, దహతి, యా, దయార్ద్రా, దృష్టిః, శిశిరమ్, ఉపచారమ్, రచయితి.
పద్యము.
సీ. నీదు స్వాధిష్ఠాన నిరుపమ చక్రాన నగ్ని తత్త్వంబున నమరియుండు
నగ్నిరూపుండైన యాశివున్ స్తుతియింతు, సమయ పేరునఁ గల సన్నుత మగు
మహిమాన్వితంబైన మాతృస్వరూపిణీ! నిన్నునున్ దలచుచు సన్నుతింతు
నేకాగ్రతను జేయు నీశుని ధ్యానాగ్నినల లోకములు కాలుననెడియపుడు
తే.గీ. నీదు కృపనొప్పు చూడ్కులు నిరుపమాన
పూర్ణ శశిచంద్రికలె యార్పు పూర్తిగాను,
లోకములనేలు జనని! సులోచనాంబ!
నన్ను వీక్షింపు కృపతోడ మిన్నగాను. ॥ 39 ॥
ప్రతిపదార్థము.
జనని = ఓ తల్లీ,
తవ = నీ యొక్క,
స్వాధిష్ఠానే = స్వాధిష్ఠాన చక్రమందలి,
హుతవహమ్ = అగ్నితత్త్వమును,
అధిష్ఠాయ = అధిష్ఠించి,
నిరతమ్ = ఎల్లపుడు (వెలుగొందు),
సంవర్తమ్ = “సంవర్తము” అను అగ్ని రూపములో ప్రకాశించు,
తమ్ = ఆ పరశివుని,
ఈడే = స్తుతించెదను,
సమయామ్ = సమయము అను పేరుగలదైన,
మహతీమ్ = మహిమాన్వితమైన,
తామ్ చ = సంవర్తాగ్ని రూపమైన నిన్ను గూడ,
ఈడే = స్తుతించెదను,
మహతి = మిక్కిలి గొప్పదై,
క్రోధ = క్రోధముతో,
కలితే = కూడినదైన,
యత్ = సంవర్తాగ్నిరూపుడైన ఏ పరమేశ్వరుని యొక్క,
ఆలోకే = వీక్షణము,
లోకాన్ = లోకములను,
దహతి = దహించునది అగుచుండగా,
యా = ఏదైతే,
దయార్ద్రా = కృపకలిగిన,
దృష్టిః = చూపు ఉన్నదో ఆ నీ చూపు,
శిశిరమ్ = శీతలమున,
ఉపచారమ్ = ఉపశమనమును,
రచయితి = కావించుచున్నది.
భావము.
తల్లీ! నీ స్వాధిష్ఠాన చక్రంలో అగ్ని తత్త్వాన్ని అధిష్టించి, నిరంతరం వెలిగే సదాశివుడిని నిత్యం స్మరిస్తాను. అలాగే ‘సమయ‘ అనే పేరు కలిగిన, చల్లని దయార్ద్రపూరిత దృష్టి గల నిన్ను స్తుతిస్తాను. ఎందుకంటే మహత్తరము, అద్భుతము అయిన పమశివుని క్రోధాగ్ని దృష్టి భూలోకాదులను దహించగా, నీవు నీ దయతో కూడిన చల్లని చూపులతో- లోకాలన్నింటికీ ఉపశమనము కలుగజేసి సంరక్షిస్తున్నావు.
40 వ శ్లోకము.
తటిత్వంతం శక్త్యా తిమిర పరిపంథిస్ఫురణయా
స్ఫురన్నానారత్నాభరణ పరిణద్ధేంద్రధనుషమ్ |
తవ శ్యామం మేఘం కమపి మణిపూరైక శరణం
నిషేవే వర్షంతం హరమిహిర తప్తం త్రిభువనమ్ ||
పదచ్ఛేదము.
తటిత్వంతమ్ - శక్త్యా - తిమిర - పరిపంథి - స్ఫురణయా -
స్ఫురత్ - నానా - రత్న - ఆభరణ - పరిణద్ధ - ఇంద్ర - ధనుషమ్ -
తవ - శ్యామమ్ - మేఘమ్ - కమ్ - అపి - మణిపూర - ఏక - శరణమ్ -
నిషేవే - వర్షంతమ్ - హర - మిహిర - తప్తమ్ - త్రిభువనమ్.
అన్వయక్రమము.
తవ, మణిపూర, ఏక శరణమ్, తిమిర, పరిపంథి, స్ఫురణయా, శక్త్యా, తటిత్వంతమ్, స్ఫురత్, నానారత్న, ఆభరణ, పరిణద్ధ, ఇంద్రధనుషమ్, శ్యామమ్, హర మిహిర తప్తమ్, త్రిభువనమ్, వర్షంతమ్, కం అపి, మేఘమ్, నిషేవే.
పద్యము.
సీ. మణిపూర చక్రమే మహిత వాసమ్ముగాఁ గలిగి చీకటినట వెలుఁగునదియు,
కలిగిన శక్తిచే వెలుఁగు లీనునదియు, వెలుఁగులీనెడి రత్న ములను గలిగి
యున్న యింద్రధనువు నొప్పుచు, జగతిని శివరవి తప్తమౌ చిక్కుచున్న
ముల్లోకములకును బూర్ణ వృష్టి నొసఁగు మేఘరూప శివుని మేలు గొలుతు.
తే.గీ. అమ్మ! నీ దివ్య రూపంబు కమ్మగాను
వర్ణనము చేయు శక్తితోఁ బరగనిమ్మ!
నమ్మి నినుఁ గొల్చుచుంటినోయమ్మ నేను,
ముక్తి మార్గంబుఁ జూపుమా, భక్తిఁ గొలుతు. ॥ 40 ॥
ప్రతిపదార్థము.
(హే భగవతి! = ఓ తల్లీ!)
తవ = నీ యొక్క,
మణిపూర = మణిపూరక చక్రమే,
ఏక శరణమ్ = ముఖ్య నివాసముగా గలదియు,
తిమిర = ఆ మణిపూర చక్రమున పొందిన చీకటికి,
పరిపంథి = శత్రువై,
స్ఫురణయా = ప్రకాశించునట్టి,
శక్త్యా = శక్తి చేత,
తటిత్వంతమ్ = మెఱుపు గలదియు,
స్ఫురత్ = ప్రకాశించుచున్న,
నానారత్న = వివిధములైన రత్నముల చేత నిర్మింపబడిన,
ఆభరణ = నగలచేత,
పరిణద్ధ = కూర్చబడిన,
ఇంద్రధనుషమ్ = ఇంద్రధనుస్సు గలదియు,
శ్యామమ్ = నీలి వన్నెలు గలదియు,
హర మిహిర తప్తమ్ = శివుఁడను సూర్యునిచే దగ్ధమైన,
త్రిభువనమ్ = మూడు లోకములను గూర్చి,
వర్షంతమ్ = వర్షించునదియు,
కమ్ అపి = ఇట్టిది అని చెప్పడానికి వీలుకాని,
మేఘమ్ = మేఘస్వరూపముననున్న శివుని,
నిషేవే = చక్కగా సేవించెదను.
భావము.
అమ్మా ఓ భగవతీ! నీ మణిపూర చక్రమే నివాసముగా గలిగి, ఆ మణిపూర చక్రమును ఆక్రమించి యుండు చీకటికి శత్రువై ప్రకాశించునట్టి మెరుపుశక్తిని గలిగి, వివిధ రత్నముల చేత తయారు చేయబడిన నగల చేత కూర్చబడిన ఇంద్రధనుస్సును గలిగి, నీలి వన్నెలు గలిగిన హరుడను సూర్యునిచే దగ్ధమైన మూడు లోకములకు- తాపము నుండి ఉపశమనముగా వర్షించునది, ఇంతటిది అని చెప్పనలవి కానిదీ అయిన – మేఘమును, మేఘ స్వరూపములోనున్న శివుని సేవించుచున్నాను.
జైహింద్.
No comments:
Post a Comment