Saturday, May 4, 2024

గణపవరపు వేంకట కవి. "ప్రబంధరాజ వేంకటేశ్వర విజయ విలాసము"

జైశ్రీరామ్. 

గణపవరపు వేంకట కవి.

వివిధ చిత్రకవిత్వములతో గ్రంథమును నింపిన ఘనత 17వ శతాబ్దికి చెందిన
గణపువరపు వేంకట కవీంద్రునిది. ఈ కవిశ్రేష్టుడు తన "ప్రబంధరాజ వేంకటేశ్వర
విజయ విలాసము"నందు పెక్కు పద్యములు గర్భ కవిత్వ విలసితము లగునట్లు
రచించెను. ఈతని శబ్దాక్షర లాఘవప్రదర్శనాత్మకమును,
'నభూతో నభవిష్యతి'గా
చెప్పుకొన దగిన ఒక సీసపద్యమునందు నలుబదికి పైబడి వివిధఛందములకు
చెందిన గర్భిత పద్యములున్నవి. ఆ పద్య మిచట ఉదహరించుటకు స్థలా
భావమున వీలుకలుగదు కాని, ఆ గ్రంథమునుండి రెండుగర్భకందములు గల ఒక
వృత్తము నిచట ఇచ్చెదను.
కందద్వయగర్భిత భాస్కరవిలసితవృత్తం - ముద్రాలంకారసమన్వితం:
"పంకజదళనిభ లోచన శంకాభావ మునిహృదయ సతతవిహారా!
కుంకుమ మృగమద సాంకవ పంకోరస్థలకృతపద వననిధి కన్యా
లంకృత మణిగణభూషణ యంకీకృత మృదుగతి మరుదసితశరీరా!
వేంకటగిరివర రుచ్యకలంకా భాస్కరవిలసిత లగదరిహస్తా!"
(పద్యంలో కవి తనదైన ముద్రను చొప్పిస్తే, (సామాన్యంగా తన పేరో, ఆ పద్య
ఛందస్సుపేరో ముద్రలుగా వుంటాయి), అది ముద్రాలంకారం)
దీనిలోని గర్భిత కందములు తీయుట అతిసులభము. చూడండి.
గర్భిత ప్రథమ కందం:
"పంకజదళనిభ లోచన
శంకాభావ మునిహృదయ సతతవిహారా!
కుంకుమ మృగమద సాంకవ
పంకోరస్థలకృతపద వననిధి కన్యా!"
గర్భిత ద్వితీయ కందం:
"లంకృత మణిగణభూషణ
యంకీకృత మృదుగతి మరుదసితశరీరా!
వేంకటగిరివర రుచ్యక
లంకా భాస్కరవిలసిత లగదరిహస్తా!"
గణపువరపు వేంకట కవీంద్రునిదే బహు పద్యగర్భిత పద్యం.
సీ. సారసోద్భవ శర్వ సన్నుత సారవారణ రక్షణావసు రమ్యనేత్ర
ధారుణీ తనయాది ధర్మవిధారి దారుణ శిక్షణాతత రూపసార
హారమానసయుక్త హారివిహార నీరజ వీక్షణా నిధిరాజదాన
పారికాంక్షిక సత్కృపారస భారపార సులక్షణా పటు రమ్యకృతిస
తే.గీ. సవితృబింబ వసతి సౌర సమాదర విజయ భూతరాజ వినుతధీర
వేదవేద్య యభవ వేదాంత తత్వజ్ఞ యసురనాశ వేంకటాచలేశా!
1. గర్భిత ద్విపద:
సారసోద్భవ శర్వ సన్నుతసార
వారణ రక్షణావసు రమ్యనేత్ర
ధారుణీ తనయాది ధర్మవిధారి
దారుణ శిక్షణాతత రూపసార
హారమానసయుక్త హారివిహార
నీరజ వీక్షణా నిధిరాజదాన
పారికాంక్షిక సత్కృపారస భార
పార సులక్షణా పటు రమ్యకృతిస.
2.గర్భిత మత్తకోకిల:
సారసోద్భవ శర్వ సన్నుత సారవారణ రక్షణా
ధారుణీ తనయాది ధర్మవిధారి దారుణ శిక్షణా
హారమానసయుక్త హారివిహార నీరజ వీక్షణా
పారికాంక్షిక సత్కృపారస భారపార సులక్షణా!
3.గర్భిత కందం:
వసు రమ్యనేత్ర తత రూ
పసార నిధిరాజదాన పటు రమ్యకృతీ!
సవితృబింబ వసతి సౌ
రసమాదర విజయభూత రాజ వినుత ధీ!
అనేక మహాకవులు వివిధములైన గర్భ్హ పద్యములను వ్రాసిరి. గర్భ, బంధ కవిత్వము
లతిక్లిష్టములై, రచయితకు ఛందస్సుపైననూ, శబ్దాక్షర భావముల పైననూ గల
ప్రజ్ఞాపాటవములకు నిదర్శనమై విరాజిల్లును.
జైహింద్.