Friday, February 10, 2012

అవధాన సామ్రాజ్యం ఆంధ్రుల సొంతం.

జైశ్రీరామ్.
అవధానం :-అవధానము అనే సాహిత్య ప్రక్రియ తెలుగు వారి సొత్త.  ప్రంచంలో ఏ భాష లోను లేని ఈ అవధానంలో ముఖ్యమైన వ్యక్తి అవధాని. అంటే ఎంతో ఏకాగ్రత వున్న పండితుడు. విశేషమైన భాషా పాండిత్యం, సమయస్పూర్తి , కల్పనా చాతుర్యము , చమత్కారం సరి అయిన వాళ్ళలో ఉండాలి. అవధాని కలం కాగితం పట్టకూడదు. కేవలం తన ధారణ లేక జ్ఞాపక శక్తితో, మధ్య మధ్య ఏకాగ్రతను భంగపరస్తూ అప్రస్తుత ప్రసంగి వేసే వింత ప్రశ్నలకు సముచితంగా సమాధానం చెబుతూ, కవితా వ్యాసంగం కావించాలి. అలా చెప్పిన కవిత్వాన్ని , ధారణ చేసి అఖరి అంశంగా అన్ని ప్రశ్నల సమాధానాల్ని అప్పచెప్పవలెను.ఎనిమిది అంశాలపై జరిగే అవధానం అష్టావధానము అవధానములందు ఆశుకవితా ధార రసగంగా ప్రవాహమై పొంగుతుంది. అవధాని వూహలో  జార్జిబుష్, లాడెన్ చెట్టపట్టాలు వేసుకుని రామాయణ ఇతివృత్తంలోనో ఇంకేదో ఇతిహాసంలోనో ఇట్టే ఒదిగిపోతారు.
ఆంగ్ల పదాలు అచ్చ తెలుగు పవిట వేసుకుని కొత్త అర్థాలూ అందాలూ సంతరించుకుంటాయి.
నిషిద్ధాక్షరి పేరుతో పృచ్ఛకుల ఎత్తులూ,  నానార్థాల సాయంతో అవధాని పై ఎత్తులూ.
అది అత్యద్భుత సాహితీ సమరం . కమ్మటి కందపద్యాలూ,  సింగారాల సీసపద్యాలూ, చవులూరించే చంపకమాలలూ, ఉత్తేజమును కలిగించే ఉత్పలమాలలూ, అసందర్భ  ప్రసంగంలో నవ్వుల జల్లులూ,
ఇవీ ఆ యుద్ధ ఫలితాలు.
అవధాన ప్రక్రియకు ఆయువు పట్టు "ధారణ."
'సారా గొనె శివుఁడు లోక సంరక్షణకై'. లోక సంరక్షణ కోసం శివుడు సారా తాగాడట!
అవధాని చాతుర్యానికి పరీక్షపెట్టే ఈ సమస్యని క్షీరసాగర మథనానికి లంకె పెట్టి హాలాహలాన్ని శివుడు మనసారా తాగాడంటూ కడిమిళ్ల వరప్రసాద్  పూరణ ఇలా సాగింది.
పారావారమునందున
నారని పెనుజిచ్చువోలె హాలాహలమే
పారగ, నద్దానిని మన
సారా గొనె శివుడు లోక సంరక్షణకై.
అలాగే మరోసారి ఆయననే
జనవరి, మార్చి, మే, జూలై ఈ నాలుగు ఇంగ్లిషు పదాలతో రాముడి గురించి చెప్పమనగా
జనవరిష్ఠు'డు శ్రీరామచంద్రమూర్తి
'మే'లు గూర్చుట వ్రతముగా మెలగినాడు
మహిని రాక్షసులం బరి'మార్చి'నాడు
సూర్యవంశపు 'జూలయి' శోభలీనె. అని చెప్పారు.
ఇలా ఒకటి కాదు రెండు కాదు! ఎన్ని వేల పద్యాలైనా చెప్పగల చాతుర్యం, ధార, అవధానులకు ఉంటుంది.
తెలుగువారికి మాత్రమే సొంతమైన అపురూప వినోద, విజ్ఞానాల సమ్మేళనం అవధానం.  అవధానం అంటే  ఏకాగ్రత అనే చెప్పాలి.  అవధానం అంటే అప్రమత్త అని అమరకోశము, 'మనో యోగం'   అని శబ్దార్ధ కల్పతరువు వివరించాయి. అసలీ అవధానాలకు మూలం వేదాధ్యయనంలో ఉంది!
వేదాలను  గురు ముఖతా విని, ఎప్పటి పాఠం అప్పుడు వల్లెవేయడం ద్వారా నేర్చుకొంటారు. పన్నెండేళ్లపాటు చదివిన వేదసారాన్నీ మెదడులో నిక్షిప్తం చేసుకోవాల్సిందే. ఈ క్రమంలో అంతటి గొప్ప వాఙ్మయంలో ఒక్క అక్షరం కూడా జారిపోకుండా ఉండటానికి రకరకాల పద్ధతులను ప్రవేశపెట్టారు. ఐదు వేళ్లనూ నియమబద్ధంగా కదుపుతూ అనేక స్వరాలను సూచించడం అందులో ఒకటి. రానురానూ ఒకరు వేళ్లు కదుపుతుంటే మరొకరు స్వరం చెప్పడం, ఒకరి స్వరానికి అనుగుణంగా వేరొకరు వేళ్లు కదపడం చేసేవారు. అదే స్వరావధానం. అలాగే వేదంలోని కాండ సంఖ్య, పాఠసంఖ్య చెప్పి అందులో ఒక అక్షరం ఉన్న స్థానాన్ని చెప్తే ఆ అక్షరం ఏంటో చెప్పాలి. అలా కాకుండా అక్షరం చెప్తే దాని స్థానాన్ని గుర్తించడం మరో పద్ధతి. అది అక్షరావధానం. దీనికి అద్భుతమైన జ్ఞాపకశక్తి అవసరం.
రోజూ వల్లె వేయడం వల్ల ధారణ సహజంగానే అలవడే వేదపండితులకు రాజాస్థానాల్లో కవులకు మించి అమిత గౌరవం లభించేది. ఇది చూచి  కవులు  అవధాన విద్యనలవరచుకొన్నారని భావింప బడుతోంది.
సాహితీ అవధానం వేదావధానం అంత సులభం కాదు. ఎందుకంటే వేదాలు స్థిరమైనవి. వాటిని ఒకసారి ధారణ చేయగలిగితే చాలు.
కానీ కవిత్వావధానంలో అలాకాదు. అవధానికి ధారణతో పాటు సృజన, సమయస్ఫూర్తీ సమపాళ్లలో లేకపోతే సభ రక్తి కట్టదు. పృచ్ఛకుడు సమస్య ఇస్తుండగానే అవధాని మెదడు ఊహాతీత వేగంతో పనిచేయాలి. దత్తపదో, నిషిద్ధాక్షరో, ఆశువో  అడిగిందే తడవు దాన్ని ఏ ఛందస్సులో చెప్పాలి, ఏ అక్షరాలు రాకుండా చెప్పాలి అన్నీ అంచనా వేసుకొని పద్యం చెప్పడానికి సిద్ధమవాలి. ఇదంతా కళ్లు మూసి తెరిచేలోపు జరగాలి.
సాహిత్యావధానం స్ఫూర్తితో ఆ తర్వాత నాట్యావధానం, గేయావధానం... ఇలా దాదాపు 50 రకాల ప్రక్రియలు రూపుదిద్దుకున్నాయి. అలాంటివి ఎన్నున్నా అవధానం అనగానే అందరికీ గుర్తొచ్చే ప్రక్రియ అష్టావధానమే. అతి కష్టమైనదీ తక్కువ సమయంలో ఎక్కువ ఆనందాన్ని ఇచ్చేదీ కాబట్టే దానికి అంతప్రాముఖ్యం, ప్రాచుర్యం కలిగింది.
అష్టావధానం అంటే?
ఎనిమిది మందితో నిర్వహించే సాహితీ ప్రక్రియ.  ఏకకాలంలో ఎనిమిది మందికి సమాధానాలిస్తూ కార్యక్రమం చివర్లో వాటిలోని సాహిత్య అంశాలను ధారణ చేయడం చూసేవారికి ఇష్టావధానం, చేసేవారికి కష్టావధానం. అదే అష్టావధానం. సమస్యా పూరణం, దత్తపది, వర్ణన, ఆశువు, నిషిద్ధాక్షరి, అప్రస్తుత ప్రసంగం, ఇలా అవధాని ఎనిమిది అంశాలను ఎంచుకొంటాడు. వాటిలో ఒక్కో అంశాన్నీ ఒక్కో పృచ్ఛకుడు నిర్వహిస్తాడు.
ఒక్కొక్కటీ ఇలా అవధాన ప్రక్రియకు దాదాపు 50 దాకా అనుకూల అంశాలున్నాయి. సాధారణంగా అందరి అవధానాల్లోనూ ఉండే అంశాలు పరిశీలిద్దాం.
సమస్యా పూరణం:
పృచ్ఛకుడు ఏదో ఒక అంశంపై ఒక పాదాన్ని ఇస్తాడు. దాని ఆధారంగా చేసుకొని మిగిలిన మూడు పాదాల్నీ అవధాని పూరించాలి. సాధారణంగా సమస్య ఇచ్చేవారు చిత్రాతిచిత్రంగా అసలది సాధ్యమేనా? అనిపించేలా ఇస్తారు.
ఉదాహరణకు
'రావణుని పత్ని సీతమ్మ రాము చెల్లి'
ఈ సమస్యను రాళ్లబండి కవితాప్రసాద్ గారిని ఒక అవధానంలో అడిగారు.
సీతమ్మ రావణుడికి భార్య, రాముడికి చెల్లెలూ అవుతుందా? అదెలా సాధ్యం? ఆ సమస్యను అవధాని చమత్కారంతో ఇలా మార్చేశారు.
సీత రాకడ నెదిరించెనే తరుణియ?
రామ కథలోని శక్తి యే లేమ చెపుమ?
భరతు డమ్మాయి యైనచో వరుస వరుస -
రావణుని పత్ని, సీతమ్మ, రాము చెల్లి
సీతను తీసుకురావడం తగదని చెప్పినదెవరు? రామకథలోని కథానాయిక ఎవరు? భరతుడు అమ్మాయిగా పుడితే రాముడికి ఏమవుతుంది? అని మొదటి మూడు పాదాల్లో ప్రశ్నించి వాటికి సమాధానాలు వరుసగా రావణునిపత్ని, సీతమ్మ, రాము చెల్లి అని నాలుగో పాదంలో తెలివిగా సమస్యను ప్రశ్నోత్తర రూపంలో క్రమాలంకారంలో పూరించారు.ఎంత చక్కని పూరణ!
నిషేధాక్షరి:
తాను కోరిన పద్యాన్ని అవధాని చెప్పడం ప్రారంభించగానే పృచ్ఛకుడు అడ్డుతగిలి కొన్ని అక్షరాల్ని నిషేధిస్తాడు. నిషేధాక్షరి నిర్వహణలో అవధానికి నిఘంటు పరిజ్ఞానంతోపాటు అప్పటికప్పుడు పదాన్ని మార్చేసే శక్తి ఉండాలి.
ఉదాహరణకు భద్రాచల రాముని వర్ణించమని మేడసాని వోహను అవధానిని ఒక పృచ్ఛకుడు అడిగాడు.
తొలి రెండు అక్షరాలూ అవధాని స్వేచ్ఛకే వదిలేయగా ఈయన 'భద్రా' అన్నారు.
తర్వాత 'చలం' అంటారనుకొని పృచ్ఛకుడు 'చ' అక్షరాన్ని నిషేధించాడు.
వెంటనే అవధాని 'ద్రి' అన్నారు. భద్రాద్రి అయింది.
తర్వాతి పదం (భద్రాద్రి)'వాసా' అయి ఉంటుందని ఊహించి
'వా' నిషేధం అన్నాడు. 'స్థి' అన్నారు అవధాని.
'స్థి'ర వాసా అనే అవకాశం ఉందనుకుని 'ర' నిషేధించాడు పృచ్ఛకుడు.
ఈయనేమో 'త' అన్నాడు.
వెంటనే పృచ్ఛకుఁడు 'వా' రాకూడదన్నాడు.
అవధాని 'రా' అన్నాడు.
ఇంకేముందీ! రామా అంటాడు కాబోలని 'మా' అక్షరాన్ని తొక్కిపట్టాడాయన.
'జా' అంటూ మొదటి పాదాన్ని పూర్తిచేశారు మేడసాని.
మొత్తం కలిపితే 'భద్రాద్రి స్థిత రాజా' అయింది.
అవతలి వ్యక్తి ఊహించని కోణంలో ఆలోచించడమే అవధాని ప్రతిభ.
ఇలా ఎత్తులూ పై ఎత్తులుగా సాగుతుందా చెలగాటం.
నిషిద్ధాక్షరి:
పృచ్ఛకుడు ముందుగానే ఏయే అక్షరాలు నిషిద్ధమో ముందే నిర్దేశిస్తాడు. ఉదాహరణకు మేడసాని మోహన్ గారిని ఒకసారి క, చ, ట, త, ప అనే అక్షరాలు రాకుండా సీతాకల్యాణం గురించి చెప్పమన్నారు. వెంటనే ఆయన
సరసనిధిరామభద్రుడు
ధరణిజ ఎదలోన మధుర ధారణుడయ్యన్
సురలెల్ల హర్షమందిరి
విరాజమాన సువిలాస విభవ మ్మెసగిన్.    అని చెప్పారు.
వివర్గాక్షరి:
పద్యంలోని ఏయే పాదాల్లో ఏ అక్షరాలు నిషిద్ధమో పృచ్ఛకుడు ముందే చెప్తాడు. అవధాని వాటిని మరోసారి అడగకుండా పద్యం చెప్పాలి. ఉదాహరణకు... 1944లో పిసుపాటి చిదంబరశాస్త్రి అవధానం చేస్తుండగా ఒక పృచ్ఛకుడు మొదటి పాదంలో య, ర, ల, వ, శ, ష, స, హ, రెండో పాదంలో ప, ఫ, బ, భ, మ, మూడో పాదంలో త, థ, ద, ధ, న, నాలుగో పాదంలో క, ఖ, గ, ఘ, ఙ... ఇన్ని అక్షరాలు రాకుండా మత్తేభ ఛందస్సులో సరస్వతీ దేవిని వర్ణించమన్నాడు. పిసుపాటి వారు దాన్ని అవలీలగా పూరించారిలా...
గణుతింతున్ మనమంది నుక్తిజననిన్ కాంతా మణిన్ జండధా
రణ హృత్సారస చంచరీక నవతారస్వైరసంచార, చ
ర్వణ బీయూష కరాభ్యుపేయ రుచపారం పర్య సంశోభ, గా
రణ భూతన్ వివిధ శ్రుతి స్మృతి విహార ద్యోతమాన స్థితిన్.
అవధాన చరిత్రలోనే ఇన్ని నిషేధాలతో ఇంత అందమైన పద్యం రాలేదంటే అది సత్యదూరము కాదు.
దత్తపది:
ఇచ్చిన పదాలతో పృచ్ఛకులు కోరిన భావాన్ని చెప్పాల్సి ఉంటుంది. ఉదాహరణకు పంచరు, టించరు, వెంచరు, లాంచరు పదాలతో భారతీయ సంస్కృతి గురించి వర్ణించమన్నారో అవధానిని. దాన్ని ఆయన పరిష్కరించిన తీరు ఇది...
పంచరు ద్వేషభావనలు భారత వీరులు, కల్మి లేమి పా
టించరు, అందరున్ కలిసి ఢీకొని శత్రు సమూహ శక్తి లా
వెంచరు, పోరులోన అరిభీకరమూర్తులు భారతంబ చే
లాంచ రుచి ప్రతీకలు భళా! మన సంస్కృతి సంస్తుతంబగున్
వర్ణన:
పృచ్ఛకుడు తన ఇష్టం వచ్చిన అంశాన్ని ఇచ్చి దాన్ని తాను కోరిన ఛందంలో వర్ణించమంటాడు. ఉదాహరణకు...
ఒక సభలో విజయవాడ అద్దెకొంపల అగచాట్లను వర్ణించమంటే అవధాని ఆ కష్టాలను కళ్లకు కట్టిన తీరిది...
దొరికియు చావదాయె యొక త్రోవను, గొంప లభించెనేని సం
బరపడ రాదు చుట్టములు పక్కములద్దరి చేరరాదు.బా
పురెతన జీతమందు దృణవో పణవో మిగులంగనింటియో
నరునకునద్దె గట్టవలె నారకమౌపడునద్దె కొంపలన్
ఆశుకవిత్వం:
ఇది ప్రజలను విశేషంగా ఆకర్షించే ప్రక్రియ. అగ్గిపుల్ల నుంచి అంతరిక్షం వరకూ దేనిమీదైనా ఆశువుగా పద్యమో దండకమో చెప్పమంటారు పృచ్ఛకులు. అవధాని చతురత, ధార ఇక్కడ ప్రదర్శించాల్సి ఉంటుంది.
న్యస్తాక్షరి:
దీనిలో పృచ్ఛకుడు తన ఇష్టానుసారం అక్షరాలను ఇచ్చి అవి పద్యంలో ఏ లైనులో ఎన్నో అక్షరంగా రావాలో చెప్తాడు. అవధాని వాటన్నిటిని గుర్తుంచుకుని పృచ్ఛకుడు కోరిన ఇతివృత్తంలో ఇచ్చిన అక్షరాలను కోరిన చోట ఉంచుతూ పద్యం చెప్పాల్సి ఉంటుంది.
ఉదాహరణకు
ఒకటో పాదంలో 11వ అక్షరంగా 'ట్మ' రావాలని కోరితే అవధాని అలా చెప్పి తీరాల్సిందే.
నిర్దిష్టాక్షరి:
అనగా నిర్దేశించబడిన అక్షరాలు గలదని అర్థం. దీనిలో 32 గళ్లుంటాయి. పృచ్ఛకుడు బేసిస్థానాల్లోగాని, సరిస్థానాల్లోగాని ఇష్టానుసారం అక్షరాలను రాసిస్తాడు. అవధాని మిగిలిన ఖాళీలను పూరించి కోరిన దేవతా స్తుతిని పూర్తి చేస్తాడు.
పుష్పగణనం:
అవధానం జరుగుతుండగా అవధాని వీపునకు తగిలేలా అప్పుడప్పుడూ పూలు విసురుతుంటారు. ఆయన ఆ పూల సంఖ్యను లెక్కించి మొత్తం ఎన్నిపూలు విసిరారో చివర్లో చెప్పాల్సి ఉంటుంది. ఘంటా గణనం కూడా ఇలాంటిదే. అవధానం జరుగుతుండగా వెనకాల ఒకరు గంట కొడుతుంటారు. మొత్తం ఎన్ని గంటలు కొట్టారో అవధాని చెప్పాలి.
అప్రస్తుత ప్రసంగం:
అవధాని ఏకాగ్రతను చెడగొట్టేందుకు అప్రస్తుత ప్రసంగి చేయని ప్రయత్నం ఉండదు. 
తే.27 - 5 - 2006 న విశాఖ పట్టణం జిల్లా పెందుర్తి గ్రామంలో పంచవటి ఆధ్యాత్మిక సేవా సంస్థ వారు  కడిమిళ్ళ కోట  జంటకవులఏ అష్టావధానం ఏర్పాటు చేసారు.
అందు అప్రస్తుత ప్రసంగం పృచ్ఛకుఁడుగా నేను వ్యవహరించాను. అప్రస్తుత ప్రసంగానికి చ్ఛందోభాషణం జోడించి ఆ కవులను ప్రస్నించే సందర్భంలో ఒక ప్రశ్న ఇలా డిగాను.
గీః- పతికి వామ భాగమునందు సతి వసించు. 
పటములందునఁ గనిచూడ నటులె యుండు.
ప్రభువు వేంకట నాయకు పటమునందు 
ఏల కుడివైపు నుండే నలమేలు మంగ?
దానికి వారు
తమిళుల పద్ధతి యౌనది.
తమిళాంధ్రులదైవమతడు తప్పదు చూపన్
సమయాను కూల పద్ధతి.
ప్రముదంబున సతిని కుడిని వర్ధిల చేర్చెన్.
అని చెప్పారు. 
అలాగే 
శ్రీ భద్రం వేణుగోపాలాచార్యులవారి చేత విశాఖపట్టణం జిల్లా చోడవరం గ్రామంలో ప్రసన్నభారతి అనే సుప్రసిద్ధ సాహితీ సంస్థ వారు అష్టావధానం ఏర్పాటు చేసారు. సభలో ఒక సుప్రసిద్ధ వ్యక్తి కూర్చున్నారు. వారు గెడ్డం పెంచుకున్నారు అప్రస్తుత ప్రసంగం చేస్తున్న నేను  చ్ఛందోభాషణం చేస్తూ ఇలా ప్రశ్నించాను.
గెడ్డము పెంచెదరెందుకు?
అడ్డంబది కాదె వారికన్ని పనులకున్?
విడ్డూరంబుగనున్నది.
దొడ్డ మనసు తోడ చెప్పుదురగా? సుకవీ! అని అడిగే సరికి
అవధానిగారి దృష్టి ఆ గెడ్డాల స్వామిమీదకి మళ్ళింది.
ఒక్కసారి చిన్నగా నవ్వుకున్నారు. తరువత ఇలా చెప్పారు.
అడ్డంబులఁదొలగించుచు
దొడ్డమనము తోడఁ గాచుదురనుచు సుజనుల్ 
వడ్డీ కాసుల వానికి 
గెడ్డము మీసము శిఖ గొరికించి యొసంగున్. అని చెప్పారు.
చూచారా ఎంతటి అసమాన ప్రతిభా పాటవాలను  ఈ అవధాని కనఁబరిచారో!
ఒక సభలో ఒకాయన ''అవధానిగారూ భర్త భోజనం చేస్తున్నాడు, భార్య వడ్డిస్తోంది. భర్త 'పశువ' అన్నాడు. భార్య నవ్వుతూ 'కోతి' అంది. వారి మాటల్లో ఆంతర్యమేమిటి'' అని అడిగారు. దానికి అవధాని.. 'ళ్లెం నిండా శుభ్రంగా డ్డించవే' అని భర్త అంటే 'కోరినంత తినండి' అని భార్య జవాబిచ్చింది అని చెప్పారు.
మరోసారి  ద్విసహస్రావధాని మాడుగుల నాగఫణిశర్మను ఒక అప్రస్తుత ప్రసంగి.. 'అయ్యా వ్యవసాయ శాఖలో పనిచేసే భర్త, కుటుంబ నియంత్రణ శాఖలో పనిచేసే భార్య. వారి సంభాషణ ఎలా ఉంటుందో చెప్పమన్నాఁడు. దానికి మాడుగుల.. ''భర్త 'గ్రోమోర్.. గ్రోమోర్..' అంటుంటే, 'భార్య నోమోర్.. నోమోర్..' అంటుంది'' అని చెప్పి సభలో నవ్వులు పూయించారు.
ఇలా క్షణాల్లో అవతలి వారి ఛలోక్తులకూ చెణుకులకు తడుము కోకుండా సమాధానం చెప్పగలిగితేనే సభ శోభిస్తుంది. ఎందుకంటే  పద్యాలూ ఛందస్సుల గురించి అస్సలు తెలియని సామాన్యులను ఆకట్టుకునేది ఈ అప్రస్తుత ప్రసంగమే.
ఇవి కొన్ని ప్రక్రియలు మాత్రమే.
శాస్త్రార్థం, ఇచ్ఛాంక శ్లోకం... ఇలా అవధాని ప్రతిభను అన్ని విధాలా కఠిన పరీక్షకు గురిచేసే అంశాలు అష్టావధానంలోనే ఉన్నాయి. ఇందులో మళ్లీ ఇటీవల వచ్చిన వినూత్న ప్రక్రియ
గుణితాష్టావధానం. అంటే... అంశాల సంఖ్య ఎనిమిదే కానీ పృచ్చకుల సంఖ్య మాత్రం పదహారు, ఇరవైనాలుగు ఇలా రెట్టింపవుతూ ఉంటుంది. ఎంతమంది ఉద్దండ పండితులు ఎదురుగా ఉన్నా ఇసుమంతైనా తొణక్కుండా రసగంగా ప్రవాహాలు పొంగిస్తారు అవధానులు అడిగిన పద్యాలు చెప్పడంతోనే అవధానం పూర్తయిపోదు. చివర్లో 'ధారణ' లేని అవధానం రక్తి కట్టదంటారు పండితులు. అన్ని రోజులూ చెప్పిన పద్యాలను అవధాని కార్యక్రమం చివర్లో మరోసారి చెప్పాల్సి ఉంటుంది. అదే సిసలు పరీక్ష. మేడసాని మోహన్, గరికపాటి నరసింహారావు, రాళ్లబండి కవితా ప్రసాద్, కడిమిళ్ల, వద్దిపర్తి వంటి కొద్ది మంది అవధానులు మాత్రమే ధారణను చూపగలుగుతున్నారు.
సాధారణ మనిషి కన్నా అద్భుతమైన ధారణ శక్తి అవధానులకు ఉంటుంది. ఎందుకంటే..అవధానికి 18 పురాణాలూ సంస్కృత, తెలుగు కావ్యాలూ నోటికి రావాలి. అంటే కొన్ని లక్షల పద్యాలు కంఠస్థం అయి ఉండాలి. అక్కడితో అయిపోదు! వాటిని సందర్భానుసారం ఉపయోగించగలిగే సమయస్ఫూర్తి ఉండాలి. సామెతలూ జాతీయాలూ అలవోకగా తాను చెప్పాల్సిన ఇతివృత్తంలోకి జొప్పించగలిగే చాతుర్యం ఉండాలి. ఇవన్నీ అవలీలగా చేసే అవధానుల మస్తిష్కశక్తి మహాద్భుతం కాక మరేమిటి!
నిషేధాక్షరి కష్టం!
అవధానుల్ని బాగా ఇబ్బంది పెట్టేదీ వారిని ముప్పతిప్పలు పెట్టడానికి పృచ్ఛకులకు అవకాశం ఇచ్చేదీ నిషేధాక్షరి అంశమే. ఈ ప్రక్రియలో పద్యం చెప్పేటప్పుడు అవతలివారికి మనం అనుసరిస్తున్న టెక్నిక్ చివరిదాకా తెలియనివ్వకూడదు. అప్పుడే నిషేధాక్షరి రక్తికడుతుంది. ఏదేమైనా అవధాన ప్రక్రియ మొత్తం ఏకాగ్రత పైనే ఆధారపడి ఉంది. ధ్యానంతోనే ఏకాగ్రత సాధ్యం.
ధ్యానం మన సంస్కృతి మనకిచ్చిన జ్ఞానసాధనం. దానివల్ల ఎంతటి ఒత్తిడినైనా తట్టుకుని విజయం సాధించే ఆత్మవిశ్వాసం, ఏకాగ్రత సొంతమవుతాయి. ఏకకాలంలో అనేక విషయాలమీద దృష్టిని కేంద్రీకరించగలిగిన ఏకాగ్రత కూడా మనిషికి సాధ్యమేనని అవధానం నిరూపిస్తోంది కదా. అవధానికి సాధ్యమైనది మీకు మాత్రం ఎందుకు సాధ్యం కాదు.. ప్రయత్నించండి!
శత, సహస్రావధానాలు పేరును బట్టి అష్టావధానమే ముందు పుట్టింది అనుకుంటారు గానీ.. అన్నిటికీ పెద్దన్న శతావధానమే. ధార, ధారణ ఉండే అవధానికి శతావధానం నల్లేరు మీద బండి నడకే. ఇందులో నూరుగురు పృచ్ఛకులు ఒకేసారి అవధానికి వారికి నచ్చిన అంశాలు ఇస్తారు. వారందరికీ అడగగానే తొలిపాదం చెప్పాలి. ఇలా వందమందికి తొలిపాదం చెప్పిన తర్వాత రెండో ఆవృతంలో అవధాని పృచ్ఛకుని చూడగానే గుర్తించి రెండో పాదం చెప్పాల్సి ఉంటుంది. ఇలా నాలుగు పాదాలకు నాలుగు ఆవృతాలు ఉంటాయి. ఇదే ప్రక్రియను రెండువందల మందితో చేస్తే ద్విశతావధానమనీ ఐదువందల మందితో చేస్తే పంచశతావధానమనీ అంటారు. వెయ్యిమందితో చేస్తే సహస్రావధానం అంటారు. వెయ్యి మంది పృచ్ఛకులు అడిగిన సమస్యలను పూరించడం ఒక ఎత్తయితే, ఆశువుగా చెప్పిన అన్ని పద్యాలనూ అవధానం చివర్లో అక్షరం పొల్లుపోకుండా వరుస క్రమంలో అప్పచెప్పడం ఎంతకష్టమో.. అసలది ఎలా సాధ్యమో అవధానులకే తెలియాలి.
జంటకవుల అవధానము
అవధానాల్లో జంటకవులది ప్రత్యేక శైలి. ఒక్కరే చేయాల్సిన అవధానాన్ని ఇద్దరు కవులు చేయడం మరింత సులభం అని అనుకుంటాం. కానీ దీనిలో కూడా క్లిష్టత లేకపోలేదు. పద్యంలోని మొదటిపాదం ఒకాయన చెప్తే రెండో పాదం మరొకాయన అందుకుంటాడు. మూడోపాదం మళ్లీ మొదటాయన వంతు అయితే నాలుగోపాదంతో రెండో అవధాని ముగిస్తాడు. అలా చేయాలంటే ఇద్దరి ధార, ధారణ, ధోరణి ఒకేలా ఉండాలి. ఇద్దరూ సమాన పాండిత్యం కలిగి ఉండాలి. అలాంటివారిలో ప్రముఖులు తిరుపతి వేంకట కవులు. అవధాన వైతాళికులుగా పేరొందిన దివాకర్ల తిరుపతి శాస్త్రి, చెళ్లపిళ్ల వేంకట శాస్త్రి జంట అవధానాలకు ఆద్యులు. తెలుగు సాహితీ సుమగంధాలను సామాన్య జనవాహినికి చేరేలా చేసిన ఘనత వీరికే దక్కుతుంది. పామరులు కూడా అవధానాల్ని ఆస్వాదించేలా సాధారణ విషయాలను కూడా మిళితం చేసేవారు. చీపురుపుల్ల నుంచి చిన్నయసూరి వరకూ అన్నీ వీరి అవధానంలో చోటుచేసుకునేవి. వారితో పాటు ప్రత్యేకించి చెప్పుకోవాల్సింది (కొప్పరపు వేంకట సుబ్బరాయ కవి, వేంకట రమణ కవి)కొప్పరపు సోదరుల  గురించి. చాలా సందర్భాల్లో తిరుపతి వేంకట కవులను సవాల్ చేసి ఎదురు నిల్చిన ప్రతిభావంతులు వీరు. అడిగిందే తడవుగా అత్యంత వేగంగా అంతే రమ్యంగా పద్యాలు చెప్పడం వీరి ప్రత్యేకత. ఇంకా వేంకట రామకృష్ణ కవులు, రాజశేఖర వేంకట కవులు, పల్నాటి సోదరులు, దేవుల పల్లి సోదర కవులు(వీరు ముగ్గురు), పింగళి లక్ష్మీకాంతం, కాటూరి వెంకటేశ్వరరావు ఇలా చాలా మందే ఉన్నారు. ఇటీవలి కాలంలో.. జంటగా సహస్రావధానం చేసి పేరొందిన వారు కడిమిళ్ల వరప్రసాద్, కోట లక్ష్మీనరసింహం.
క్లుప్తంగా అవధానాల గురించి మనం ఇక్కడ ఇప్పుడు తెలుసుకున్నది చాలు.
ఇక రేపు హైదరాబాదులో మియాపూర్లో జయప్రకాష నారాయణ్ నగర్లో శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయ ప్రాంగణంలో మధ్యాహ్నం మూడు గంటలకు  డా. కట్టమూరి చంద్రశేఖరం గారు చేయుచున్న అష్టావధానానికి మీరంతా తప్పక వస్తున్నారు కదూ? చాలా సంతోషం మీ అందరికీ సాదరాహ్వానం పలుకుతున్నాము.
శుభమస్తు.
జైహింద్.

Friday, February 3, 2012

మియాపూర్ జయప్రకాశ్ నారాయణ్ నగర్ లో అష్టావధానం.

జైశ్రీరామ్.
సాహితీ బంధువులారా!
శ్రీ కట్టమూరి చంద్రశేఖరం అవధానిచే తే.12 - 02 - 2012 న  జయప్రకాశ్ నారాయణ్‌నగర్‌
( హైదరాబాద్. మియాపూర్ ) లో  అష్టావధానం ఏర్పాటు చేయడం కోసం ప్రయత్నాలు సాగుతున్నాయి.
మీరు తప్పక రాగలరని ఆశిస్తున్నాను. వచ్చే అవకాశం ఉన్న వారు మీ వివరాలను నాకు తెలియ జేయ గలరని ఆశిస్తున్నాను. సందర్భానుసారం మనలో ఎవరినయినా పృచ్ఛకులుగా అక్కడ గ్రహించే అవకాశం కూడా ఉండ వచ్చునని భావిస్తున్నాను. పాల్గొనే ఉత్సాహవంతులు తాము నిర్వహించగల అనుభవమున్న అంశాన్ని కూడా నాకు తెలియ జేయ మనవి.ఇది కేవలం మన ప్రాతినిధ్యాన్ని అక్కడ బలపరచడానికి నేను ప్రయత్నించడానికి మాత్రమే. అవకాశం కలగడమన్నది అక్కడ నిర్వాహకుల నిర్ణయాన్ని బట్టి ఉంటుంది.
కార్యక్రమం ఖరారు కాగానే మళ్ళీ మీ అందరికీ తెలియ జేయ గలను.     
జైహింద్.