Tuesday, April 22, 2025

సౌందర్యలహరి 31-35పద్యాలు. రచన శ్రీ చింతా రామకృష్ణారావుగారు,సంగీతం, గానం ...శ్రీమతి వల్లూరి సరస్వతి l

జైశ్రీరామ్.
31 వ శ్లోకము.  
చతుష్షష్ట్యా తంత్రై స్సకలమతిసంధాయ భువనం
స్థితస్తత్తత్సిద్ధి ప్రసవ పరతంత్రైః పశుపతిః
పునస్త్వన్నిర్బంధాదఖిల పురుషార్థైక ఘటనా
స్వతంత్రం తే తంత్రం క్షితితల మవాతీతరదిదమ్  || 
పదచ్ఛేదము.
చతుష్షష్ట్యా - తంత్రైః -  సకలమ్ - అతి సంధాయ - భువనమ్ -
స్థితః - తత్ - తత్ -  సిద్ధి - ప్రసవ - పర తంత్రైః - పశుపతిః -
పునః - త్వత్ -  నిర్బంధాత్ -  అఖిల - పురుష - అర్థ - ఏక - ఘటనా - 
స్వతంత్రమ్ - తే -  తంత్రమ్ -  క్షితితలమ్ - అవాతీతరత్ -  ఇదమ్. 
అన్వయక్రమము.
పశుపతిః, సకలం భువనమ్, తత్‌తత్‌, సిద్ధి, ప్రసవ, పరతంత్రైః, చతుష్షష్ట్యా, తంత్రైః, అతిసంధాయ, స్థితః, పునః, త్వత్‌నీ నిర్భంధాత్‌, అఖిల, పురుషార్థ, ఏక ఘటనా, స్వతంత్రమ్,  తే, తంత్రమ్, ఇదమ్, క్షితి తలమ్, అవాతీతరత్‌.
పద్యము.
సీ.   శివుఁడు విశ్వమునెన్ని సిద్ధులకనువగు శాంబరాదుల చతుష్షష్టి తంత్ర
ములచేత కప్పి, తా నిలిచె, నీ నిర్బంధమునఁ జేసి, పురుషార్థములను గూర్చు
టందు స్వతంత్రమై యనుపమమైన నీ శ్రీవిద్య తంత్రమ్ము శ్రితజనులగు
భూతలవాసులఁ బ్రోవఁ దాఁ బుట్టించె, విశ్వమందున బ్రహ్మ విద్య కలుగ,
తే.గీ.  నాత్మనే దెల్పెడి దరయ నాత్మ విద్య,
రెంటికి సమన్వయము గూర్చి శ్రేయమునిడు
నట్టిదగు విద్య శ్రీవిద్య, పట్టినేర్పె.
ముక్తి నిడునట్టి దీ విద్య,  పూజ్య జనని! ॥  31 ॥
ప్రతిపదార్థము. 
(హే భగవతి! = ఓ తల్లీ!)
పశుపతిః = శివుడు, 
సకలం భువనమ్ = సమస్త ప్రపంచమును, 
తత్‌ తత్‌ = ఆయా, 
సిద్ధి = సిద్ధులయొక్క,
ప్రసవ = ఉత్పత్తి యందు,
పరతంత్రైః = ఇష్టపడునవైన, 
చతుష్షష్ట్యా = మహామాయాశాంబరాదులగు అరువదినాలుగు సంఖ్యగల, 
తంత్రైః = తంత్రముల చేత, 
అతిసంధాయ = మోసపుచ్చ దాచిపెట్టి, 
స్థితః = స్థిమితముగా నుండెను. 
పునః = మఱల, 
త్వత్‌ = నీ 
నిర్భంధాత్‌ = నిర్భంధము వలన, 
అఖిల = సమస్తమైన
పురుషార్థ = చతుర్విధ పురుషార్థములను, 
ఏక ఘటనా = ముఖ్యముగా సమకూర్చుట యందు, 
స్వతంత్రమ్ = స్వతంత్రమైన,  
తే = నీ యొక్క, 
తంత్రమ్ = శ్రీ విద్యా తంత్రమును, 
ఇదమ్ = ఈ చెప్పబడుచున్న దానిని, 
క్షితి తలమ్ = భూతల వాసులనుద్దేశించి, 
అవాతీతరత్‌ = అవతరింప జేసెను. 
భావము. 
తల్లీ! జగజ్జననీ! పశుపతి అయిన శివుడు, జీవులను తృప్తి పరచడానికి వివిధ ప్రక్రియలతో వివిధ ఫలితాలనిచ్చు 64 రకముల తంత్రములను ఈ లోకమునకు ఇచ్చి, జీవులను మోహవ్యామోహములలో చిక్కుకొనునట్లు చేయగా – ఆ విధముగా మోహమునందు పడకుండుటకు బిడ్డలైన జీవులయందు వాత్సల్యముతో – నీవు నీ భర్త అయిన శివుని ప్రేమతో నిర్బంధ పెట్టగా – పరమ పురుషార్థ ప్రదమైన- నీదైన శ్రీవిద్యాతంత్రమును, ఈ భూలోక వాసులకు ప్రసాదించెను.

32 వ శ్లోకము.  
శివః శక్తిః కామః క్షితిరథ రవి శ్శీతకిరణః
స్మరో హంస శ్శక్రః తదను చ పరా మార హరయః |
అమీ హృల్లేఖాభిస్తిసృభిరవసానేషు ఘటితాః
భజంతే వర్ణాస్తే తవ జనని నామావయవతామ్ || 
పదచ్ఛేదము.
శివః - శక్తిః - కామః - క్షితిః - అథః -  రవిః -  శీత కిరణః -
స్మరః - హంసః - శక్రః - తత్ - అనుచ - పరా - మార - హరయః -
అమీ -హృల్లేఖాభిః -  తిసృభిః - అవసానేషు - ఘటితాః -
భజంతే - వర్ణాః - తే - తవ - జనని - నామ - అవయవతామ్.
అన్వయక్రమము.
జనని, శివః, శక్తిః, కామః, క్షితిః, అథః, రవిః, శీత కిరణః, స్మరః, హంసః, శక్రః, తత్‌ + అనుచ, పరా, మారః, హరిః, అమీ, త్రిసృభిః, హృల్లేఖాభిః, అవసానేషు, ఘటితాః, తే, వర్ణాః, తవ, నామ + అవయవతామ్, భజంతే.
పద్యము.
మ.  శివుఁడున్ శక్తియుఁ గాముఁడున్ క్షితియు నా శీరుండు, చంద్రుండు, చి
ద్భవుఁడున్, హంసయు, శక్రుఁడున్, గన ఘనంబౌ తత్ పరాశక్తి, హృ
ద్భవుఁడౌ మన్మథుఁడున్, దగన్ హరియు, నీ భవ్యంపు సంకేత స
ద్భవ హృల్లేఖలు చేరగాఁ దుదల, నీ భాస్వంత మంత్రంబగున్. ॥ 32 ॥
ప్రతిపదార్థము. 
జనని! = ఓ మాతా!, 
శివః = శివుడు (కకారము) 
శక్తిః = శక్తి (ఏ కారము)
కామః = మన్మథుడు (ఈ కారము) 
క్షితిః = భూమి (లకారము) 
అథః = తర్వాత, 
రవిః = సూర్యుడు (హకారము) 
శీతకిరణః = చంద్రుడు (సకారము) 
స్మరః = మన్మథుడు (కకారము) 
హంసః = సూర్యుడు (హః కారము) 
శక్రః = ఇంద్రుడు (ల కారము); 
తత్‌ + అనుచ = వానికి తర్వాత, 
పరా = పరాశక్తి (సి కారము) 
మారః = మన్మథుడు (కి కారము) 
హరిః = విష్ణువు (లకారము) 
అమీ = (ఈ మూడు వర్గములుగానున్న) ఈ వర్ణములు, 
త్రిసృభిః = మూడైన, 
హృల్లేఖాభిః = హ్రీం కారముల చేత, 
అవసానేషు = వర్గాంతములందు, 
ఘటితాః = కూడినదై, 
తే = ఆ, 
వర్ణాః = అక్షరములు, 
తవ = నీ యొక్క, 
నామ + అవయవతామ్ = అవయవములగుటను, అనగా - మంత్ర స్వరూపవుగుటను, 
భజంతే = పొందుచున్నవి. 
భావము. 
ఓ జననీ! శివుడు, శక్తి మన్మథుడు, భూమి – ఈ నలుగురూ వరుసగా సూచించు క, ఏ, ఈ, ల – అను అక్షర కూటము;
సూర్యుడు, చంద్రుడు, మన్మథుడు, సూర్యుడు, ఇంద్రుడు – ఈ ఐదుగురు వరుసగా సూచించు హ, స, క, హ, ల- అను అక్షర కూటము,   పరాశక్తి, మన్మథుడు, హరి – ఈ ముగ్గురు వరుసగా ‘సూచించు స, క, ల – అను అక్షర కూటములు –
వాటి అంతము నందలి విరామ స్థానములందు – “హ్రీం” కారముల చేత సమకూర్చబడినపుడు ఏర్పడు ఆ మూడు కూటములలోని మొత్తము 15 అక్షరములు ‘ఓ జగజ్జననీ! నీ పంచదశాక్షరీ మంత్ర స్వరూపమునకు అవయవములుగా భాసించుచున్నవి.

33 వ శ్లోకము.  
స్మరం యోనిం లక్ష్మీం త్రితయమిదమాదౌ తవ మనో
ర్నిధాయైకే నిత్యే నిరవధి మహాభోగ రసికాః |
భజంతి త్వాం చింతామణి గుణనిబద్ధాక్ష వలయాః
శివాగ్నౌ జుహ్వంతః సురభిఘృత ధారాహుతి శతైః  || 
పదచ్ఛేదము.
స్మరమ్ - యోనిమ్ - లక్ష్మీమ్ - త్రితయమ్ - ఇదమ్ - ఆదౌ - తవ - మనోః -
నిధాయ - ఏకే - నిత్యే - నిరవధి - మహాభోగ - రసికాః  -
భజంతి - త్వామ్ - చింతామణి  - గుణ - నిబద్ధ - అక్ష - వలయాః -
శివ - అగ్నౌ - జుహ్వంతః - సురభి - ఘృత - ధారా - ఆహుతి - శతైః.
అన్వయక్రమము.
నిత్యే, తవ, మనోః, ఆదౌ, స్మరమ్, యోనిమ్, లక్ష్మీమ్, ఇదమ్, త్రితయమ్, నిధాయ, ఏకే, నిరవధి, మహాభోగ, రసికాః, చింతామణి, గుణ, నిబద్ధ, అక్ష వలయాః, శివా + అగ్నౌ, త్వామ్ = నిన్ను, సురభి, ఘృత, ధారా, ఆహుతి, శతైః, జుహ్వంతః, భజంతి.
పద్యము.
మ.  స్మర బీజంబును, యోని బీజమును, శ్రీ మాతృప్రభా బీజమున్,
వరలన్ నీదగు నామమంత్రములకున్ బ్రారంభమున్ నిల్పుచున్
వరచింతామణి  తావళాంచితులు సద్భావుల్ శివాగ్నిన్, నినున్, 
బరమానందము తోడఁ జేయుదురు సద్భావంబుతో హోమమున్, ॥ 33 ॥
ప్రతిపదార్థము.
నిత్యే = శాశ్వతమైన ఓ తల్లీ , 
తవ = నీ యొక్క, 
మనోః = మంత్రమునకు, 
ఆదౌ = మొదటను, 
స్మరమ్ = కామరాజ బీజమును (క్లీం), 
యోనిమ్= భువనేశ్వరీ బీజమును (హ్రీం), 
లక్ష్మీమ్ = శ్రీ బీజమును (శ్రీం), 
ఇదమ్ = ఈ , 
త్రితయమ్ = మూడింటిని,
నిధాయ = చేర్చి, 
ఏకే = కొందఱు మాత్రము, 
నిరవధి = హద్దులులేని, 
మహాభోగ = దొడ్డదైన ఆనందానుభవము యొక్క, 
రసికాః = రసజ్ఞులు, 
చింతామణి = చింతామణుల యొక్క, 
గుణ = సరముల చేత, 
నిబద్ధ = కూర్చబడిన, 
అక్ష వలయాః = అక్షమాలలు గలవారై, 
శివా + అగ్నౌ = శివాగ్ని యందు, (అనగా స్వాధిష్ఠా గ్నియందుంచి) 
త్వామ్ = నిన్ను, సహస్రారము నుండి హృదయ కమల మందు నిల్పి, 
సురభి = కామధేనువు యొక్క, 
ఘృత = నేయి యొక్క, 
ధారా = ధారల చేత, 
ఆహుతి = ఆహుతల యొక్క, 
శతైః = పలు మారులు, 
జుహ్వంతః = హోమము చేయుచు, 
భజంతి = సేవించుచున్నారు. 
భావము. 
ఓ నిత్యస్వరూపిణీ! రసజ్ఞులు, సమయాచారపరులు అయిన కొంతమంది యోగీంద్రులు- నీ మంత్రమునకు ముందు కామరాజ బీజమును, భువనేశ్వరీ బీజమును, శ్రీ బీజమును చేర్చి చింతామణులతో కూర్చిన జపమాలికను బూని, కామధేనువు యొక్క ఆజ్యధారలతో నిత్యస్వరూపురాలవైన నిన్ను- తమ హృదయ కమలములందు నిలిపి హోమము చేస్తూ, నిన్ను సంతృప్తి పరుస్తూ తాము నిరుపమాన, శాశ్వత సుఖానుభవమును పొందుతున్నారు.

34 వ శ్లోకము.  
శరీరం త్వం శంభోశ్శశిమిహిరవక్షోరుహయుగం
తవాత్మానం మన్యే భగవతి నవాత్మానమనఘమ్ |
అతశ్శేషశ్శేషీత్యయముభయసాధారణతయా
స్థితస్సంబంధో వాం సమరసపరానందపరయోః ॥
పదచ్ఛేదము.
శరీరమ్ - త్వమ్ - శంభోః - శశి - మిహిర - వక్షోరుహయుగమ్ -
తవ - ఆత్మానమ్ -  మన్యే - భగవతి - నవ - ఆత్మానమ్ -  అనఘమ్ |
అతః - శేషః - శేషీ - ఇతి -  అయమ్ -  ఉభయ - సాధారణతయా -
స్థితః - సంబంధః -  వామ్ - సమ రస - పర - ఆనంద - పరయోః.
అన్వయక్రమము.
భగవతి, శంభోః, త్వమ్, శశి మిహిర, వక్షోరుహయుగమ్, శరీరమ్, తవ, ఆత్మానమ్, అనఘమ్‌, నవ ఆత్మానమ్, మన్యే, అతః, శేషః, శేషీ, ఇతి, అయమ్, సంబంధః, సమరస, పరానంద, పరయోః, వామ్, ఉభయ, సాధారణ తయా, స్థితః.
పద్యము.
చం.  శివునకు దేహమీవెగ, ప్రసిద్ధిగ నీవల సూర్య చంద్రులన్
గవలిగ వక్షమై కలుగు కాంతవు, నిన్ శివుఁడంచు నెంచినన్
బ్రవిమల శేషి యా శివుఁడు, వర్ధిలు శేషము నీవె చూడగా,
భవుఁడు పరుండు, నీవు పరభవ్యుని సంతసమమ్మరో! సతీ! ॥ 34 ॥
ప్రతిపదార్థము.
భగవతి = ఓ భగవతీ, 
శంభోః = శంభునకు, 
త్వమ్ = నీవు, 
శశి మిహిర = చంద్రుడు, సూర్యుడు, 
వక్షోరుహయుగమ్ = స్తనముల జంటగా గలిగిన, 
శరీరమ్ = దేహముగల దానివి, 
తవ = నీ యొక్క, 
ఆత్మానమ్ = దేహమును, 
అనఘమ్‌ = దోషము లేని, 
నవ ఆత్మానమ్ = నవవ్యూహాత్మకుఁడగు శివానంద భైరవునిగా, 
మన్యే = తలంచుచున్నాను. 
అతః = ఈ కారణమువలన, 
శేషః = గుణముగా నుండునది, అనగా - ఆధేయమై వుండు అప్రధానము, 
శేషీ = ఆధారమై వుండు ప్రధానము, 
ఇతి = అను 
అయమ్ = ఈ, 
సంబంధః = సంబంధము, 
సమరస = సామ్య సామరస్యములతో గూడిన, 
పరానంద = ఆనందరూపుడైన ఆనంద భైరవుడు, 
పరయోః = ఆనంద రూపమైన భైరవీరూపులుగా, 
వామ్ = మీ, 
ఉభయ = ఇరువురకు, 
సాధారణ తయా = సామ్యము సామాన్యమై, 
స్థితః = ఉండుట అన్నది ధ్రువమై చెల్లుతున్నది. 
భావము. 
ఓ భగవతీ! నవాత్మకుఁడయిన శంభునకు సూర్యచంద్రులు వక్షోరుహములుగా గల నీవు శరీరమగుచున్నావు. కాబట్టి అతడు శేషి (ప్రధానము) నీవు శేషము (అప్రధానము) అగుచున్నారు. ఆయన పరుడు. నీవు పరానందము. మీ ఇద్దరికిని ఉభయ సాధారణమైన సంబంధము కలద
ని తోచుచున్నది.

35 వ శ్లోకము.  
మనస్త్వం వ్యోమ త్వం మరుదసి మరుత్సారథిరసి
త్వమాపస్త్వం భూమిస్త్వయి పరిణతాయాం న హి పరమ్ |
త్వమేవ స్వాత్మానం పరిణమయితుం విశ్వ వపుషా
చిదానందాకారం శివయువతి భావేన బిభృషే || 
పదచ్ఛేదము.
మనః - త్వమ్ -  వ్యోమః - త్వమ్ -   మరుత్ -  అసి - మరుత్ - సారథిః - అసి -
త్వమ్ -  ఆపః - త్వమ్ -  భూమిః - త్వయి - పరిణతాయామ్ -  న హి పరమ్ -
త్వమ్ - ఏవ - స్వ - ఆత్మానమ్  - పరిణమయితుమ్ - విశ్వ వపుషా -
చిత్ - ఆనంద - ఆకారమ్ - శివ యువతి - భావేన - బిభృషే.
అన్వయక్రమము.
శివయువతి, మనః, త్వమ్, అసి, వ్యోమ, మరుత్‌, మరుత్సారధిః, ఆపః, భూమిః, త్వం ఏవ, అసి, త్వమ్, పరిణతాయామ్, నహిపరమ్, త్వం ఏవ, స్వ + ఆత్మానమ్, విశ్వవపుషా, పరిణమయితుమ్, చిత్‌ + ఆనంద + ఆకారమ్, శివయువతి భావేన, బిభృషే.
పద్యము.
సీ.  ఆజ్ఞా సుచక్రాన నల మనస్తత్త్వమై, యలవిశుద్ధినిఁ జూడ నాకసముగ,
వరలనాహతమున వాయుతత్త్వంబుగా, జలముగా మణిపూర చక్రమందు,
నరయ స్వాధిష్ఠాన నగ్నిగా నీవెయై, యరయ మూలాధారమందుఁ బృథ్వి
గను నీవె యుంటివి, ఘనముగా సృష్టితోఁ బరిణమింపఁగఁ జేయ వరలు నీవె
తే.గీ.  స్వస్వరూపమున్ శివునిగా సరగునఁ గని
యనుపమానంద భైరవునాకృతి గను
ధారణను జేయుచున్ సతీ! స్మేర ముఖిగ
నుండి భక్తులన్ గాచుచు నుందువమ్మ. ॥ 35 ॥
ప్రతిపదార్థము.
శివయువతి  = శివుని ప్రియురాలవైన జననీ,
మనః = ఆజ్ఞాచక్రము నందలి మనస్తత్వము, 
త్వమ్ + ఏవ = నీవే, 
అసి = అగుచున్నావు, 
వ్యోమ = విశుద్ధి చక్రమునందలి ఆకాశ తత్త్వము, 
మరుత్‌ = అనాహత చక్రమందలి వాయుతత్త్వము, 
మరుత్సారధిః = స్వాధిష్టాన చక్రము నందలి వాయు సఖుడైన అగ్ని తత్త్వము, 
ఆపః = మణిపూర చక్రమందలి జలతత్త్వము, 
భూమిః = మూలధార చక్రము నందలి భూతత్త్వము కూడా, 
త్వం ఏవ = నీవే, 
అసి = అగుచున్నావు, 
త్వమ్ = నీవు, 
పరిణతాయామ్ = తాదాత్మ్యతను పొందించుటకు, 
నహి పరమ్ = నీ కంటె ఇతరమగు నది కొంచెము కూడా లేదు. 
త్వం ఏవ = నీవే, 
స్వ + ఆత్మానమ్ = స్వస్వరూపమును, 
విశ్వ వపుషా = ప్రపంచ రూపముతో, 
పరిణమయితుమ్ = పరిణమింప చేయుటకు, 
చిత్‌ + ఆనంద + ఆకారమ్ = చిచ్ఛక్తి యుతుడైన ఆ ఆనంద భైరవుని, లేదా - శివతత్త్వమును, 
శివయువతి భావేన = శివయువతి భావముచేత, 
బిభృషే = భరించుచున్నావు.  
భావము. 
ఓ శివుని ప్రియురాలైన జగజ్జననీ! ఆజ్ఞా చక్రమందలి మనస్తత్వము, విశుద్ధియందలి ఆకాశతత్త్వము, అనాహత మందలి వాయుతత్త్వము, స్వాధిష్ఠాన మందలి అగ్నితత్త్వము, మణిపూరమందలి జలతత్త్వము, మూలాధార మందలి భూతత్త్వము గూడా నీవే అయి వున్నావు. ఈ విధముగా పంచభూతములు నీవే అయినపుడు ఇంక ఈ విశ్వమందు నీ కంటె ఇతరమైన పదార్ధము ఏదియు కొంచెము కూడా వుండదు, ఉండలేదు. నీవే నీ స్వరూపమును జగదాకారముగ పరిణమింప చేయుటకు చిచ్ఛక్తియుతుడైన ఆనందభైరవుని స్వరూపమును లేదా శివతత్త్వమును నీ చిత్తముతో ధరించుచున్నావు.

జైహింద్.

No comments: