జైశ్రీరామ్.
26 వ శ్లోకము.
విరించిః పంచత్వం ప్రజతి హరిరాప్నోతి విరతిం
వినాశం కీనాశో భజతి ధనదో యాతి నిధనమ్ |
వితంద్రీ మాహేంద్రీ వితతిరపి సమ్మీలిత దృశా
మహాసంహారేఽస్మిన్ విహరతి సతి త్వత్పతి రసౌ ||
పదచ్ఛేదము.
విరించిః - పంచత్వమ్ - ప్రజతి - హరిః - ఆప్నోతి - విరతిమ్ -
వినాశమ్ - కీనాశః - భజతి - ధనదః - యాతి - నిధనమ్ -
వితంద్రీ - మాహేంద్రీ - వితతిః - అపి - సత్ - మీలిత - దృశా -
మహాసంహారే - అస్మిన్ - విహరతి - సతి - త్వత్ - పతిః - రసౌ.
అన్వయక్రమము.
విరించిః, పంచత్వమ్, ప్రజతి, హరిః, విరతిమ్, ఆప్నోతి, కీనాశః, వినాశమ్, భజతి. ధనః, నిధనమ్, యాతి,మాహేంద్రీ, వితతిః అపి, సమ్మీలితదృశా, వితంద్రీ. హే సతి! అస్మిన్, మహా సంహారే, త్వత్, పతి, అసౌ, విహరతి.
పద్యము.
చం. కలిగెడి యా మహా ప్రళయ కాలమునందున బ్రహ్మ, విష్ణు రు
ద్రులు, యముఁడున్, గుబేరుఁడు, నరుల్దివిజాధిపుడింద్రుడున్, మునుల్,
కలియుటనిక్కమెన్నగను కాలగతిన్, గమనించి చూడగన్
గలియుచు నిన్ను గూడి కఱకంఠుఁడు తాను సుఖించు నమ్మరో! ॥ 26 ॥
ప్రతిపదార్థము.
(హే భగవతి! = ఓ జననీ!)
విరించిః = బ్రహ్మ
పంచత్వమ్ = మరణమును,
ప్రజతి = పొందుచున్నాడు,
హరిః = విష్ణువు,
విరతిమ్ = విశ్రాంతిని,
ఆప్నోతి = పొందుచున్నాడు,
కీనాశః = యముడు,
వినాశమ్ = వినాశమును
భజతి = పొందుచున్నాడు.
ధనః = కుబేరుడు,
నిధనమ్ = మరణమును,
యాతి = పొందుచున్నాడు.
మాహేంద్రీ = ఇంద్రునికి సంబంధించిన,
వితతిః అపి = పరివారము గూడ,
సమ్మీలితదృశా = కనులు మూతపడి,
వితంద్రీ = నిద్రాణమగుచున్నది.
హే సతి! = ఓ సతీ!
అస్మిన్ = ఈ కనబడు ప్రపంచము,
మహా సంహారే = మహా ప్రళయము పొందునపుడు,
త్వత్ = నీ యొక్క,
పతి = భర్త అయిన,
అసౌ = ఈ సదాశివుడు మాత్రము
విహరతి = ఏ మార్పునకు గుఱికాక క్రీడించుచున్నాడు.
భావము.
తల్లీ! జగజ్జననీ! ఈ ప్రపంచమునకు మహా ప్రళయము సంభవించినపుడు బ్రహ్మదేవుడు, విష్ణువు, యముడు, కుబేరుడు, చివరకు ఇంద్రుడు – వీరందరూ కాలధర్మము చెందుచున్నారు. కాని, ఓ పతివ్రతామతల్లీ ! నీ భర్త అయిన సదాశివుడు మాత్రము, ఎట్టి మార్పులకు గురికాకుండా విహరించుచున్నాడు గదా!
27 వ శ్లోకము.
జపో జల్ప శ్శిల్పం సకలమపి ముద్రా విరచనా
గతిః ప్రాదక్షిణ్య క్రమణ మశనాద్యాహుతి విధిః |
ప్రణామ స్సంవేశః సుఖమఖిలమాత్మార్పణ దృశా
సపర్యా పర్యాయస్తవ భవతు యన్మే విలసితమ్ ||
పదచ్ఛేదము.
జపః - జల్పః - శిల్పమ్ - సకలమ్ - అపి - ముద్రా - విరచనా -
గతిః - ప్రాదక్షిణ్య - క్రమణమ్ - అశన - ఆది - ఆహుతి - విధిః -
ప్రణామః - సంవేశః - సుఖమ్ - అఖిలమ్ - ఆత్మ - అర్పణ - దృశా -
సపర్యా - పర్యాయ - తవ - భవతు - యత్ - మే - విలసితమ్.
అన్వయక్రమము.
ఆత్మ + అర్పణ + దృశా, జుల్పః, జపః, శిల్పమ్, సకలమ్, ముద్రా విరచనా, గతిః, ప్రాదక్షిణ్య క్రమణమ్, అశనా + అది, ఆహుతి విధిః, సంవేశః, ప్రణామః, అఖిలమ్, సుఖమ్, విలసితమ్, తవ, సపర్యా పర్యాయః.
పద్యము.
శా. నా సల్లాపములీకు మంత్రజపముల్, నా హస్త విన్యాసముల్
భాసించన్ దగ నీకు ముద్రలగు, నా పాదప్రవృత్తుల్ సతీ!
ధ్యాసన్ జేయు ప్రదక్షిణల్, కొనెడు నాహారంబులే యాహుతుల్,
నా సౌఖ్యాదులు పవ్వళింత సుఖముల్ నా నీకు సాష్టాంగముల్. || 27 ||
ప్రతిపదార్థము.
(హే భగవతి! = ఓ తల్లీ!)
ఆత్మ + అర్పణ + దృశా = ఆత్మ సమర్పణ బుద్ధితో, అనగా - సర్వమును పరమాత్మకు సమర్శించుచున్నానను బుద్దితో,
జుల్పః = నేను చేయు సల్లాపమే,
జపః = నీకు చేయు జపము;
శిల్పమ్ = నేను చేయు క్రియా కలాపములు,
సకలమ్ = సమస్తమును,
ముద్రా విరచనా = నీకు చేయు ముద్రలు,
గతిః = నా గమనములు,
ప్రాదక్షిణ్య క్రమణమ్ = నీకు చేయు ప్రదక్షిణలు;
అశనా + అది = చేయుచున్న భోజనాదులు,
ఆహుతి విధిః = నీకు సమర్పించు హవిస్సులు;
సంవేశః = నేను నిద్రించునపుడు దొర్లుటయే,
ప్రణామః = నీకు చేయు సాష్టాంగ ప్రణామములు;
అఖిలమ్ = సమస్తమైన,
సుఖమ్ = సుఖకరమైన,
విలసితమ్ = నా విలాసములు,
తవ = నీకు,
సపర్యా పర్యాయః = పరిచర్యలు గా అయి నీ పూజయేఅగుగాక!
భావము.
తల్లీ! నా మాటలన్నీ నీ జపముగా, నా కార్యకలాపమంతయూ నీకు అర్పించే ముద్రలుగా, నా గమనము అంతా నీ ప్రదక్షిణగా, నేను భుజించేదంతా నీకు ఆహుతిగా, నిద్రించేటప్పుడు, పరుండినప్పుడు జరుగు దేహములోని మార్పులు- నీకు సాష్టాంగ ప్రణామములుగా, శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాది సుఖములు నేను ఆత్మార్పణ బుద్దితో చేసే నీ పూజలుగా అగుగాక.
28 వ శ్లోకము.
సుధామప్యాస్వాద్య ప్రతి భయ జరా మృత్యు హరిణీం
విపద్యంతే విశ్వే విధి శతమఖాద్యా దివిషదః |
కరాళం యత్ క్ష్వేలం కబలితవతః కాలకలనా
న శంభోస్తన్మూలం తవ జనని తాటంక మహిమా ||
పదచ్ఛేదము.
సుధామ్ - అపి- ఆస్వాద్య - ప్రతి - భయ - జరా - మృత్యు - హరిణీమ్ -
విపద్యంతే - విశ్వే - విధి - శతమఖ - ఆది - దివిషదః -
కరాళమ్ - యత్ - క్ష్వేలమ్ - కబలితవతః - కాల - కలనా -
న - శంభోః - తత్ - మూలమ్ - తవ - జనని - తాటంక - మహిమా.
అన్వయక్రమము.
విధి, శతమఖాద్యాః, విశ్వే, దివిషదః, ప్రతిభయ, జరామృత్యు, హర, ఆస్వాద్య అపి, విపద్యంతే. కరాళమ్, యత్ క్ష్వేలమ్, కబళితవతః, శంభోః, కాలకలనా, న, తత్ మూలమ్, తవ, తాటంక మహిమా.
పద్యము.
మ. సుధ సేవించియు మృత్యువొందుదురుగా సోలంగ నా కల్పమా
విధి యింద్రాదులు, కాలకూట విషమున్ విశ్వేశుఁడే త్రాగియున్
నిధనంబొందఁడు నిన్నుఁ జేరి మనుటన్ నిక్కంబు, తాటంకముల్
సుధలన్ జిందుచు రక్షణన్ గొలుపనో, శుభ్రాంతరంగప్రభా! ॥ 28 ॥
ప్రతిపదార్థము.
(హే భగవతి! = ఓ తల్లీ!)
విధి = బ్రహ్మ
శతమఖాద్యాః = ఇంద్రుడు మొదలగు ముఖ్యమైన,
విశ్వే = సృష్టిలో ఉన్న
దివిషదః = దేవతలు,
ప్రతిభయ = మిక్కిలి భయంకరములయిన
జరామృత్యు = జరామరణములను
హరిణీమ్ = పోగొట్టునది అయిన,
సుధా = అమృతమును,
ఆస్వాద్య అపి = త్రాగినవారై కూడా,
విపద్యంతే = కాలధర్మము చెందుచున్నారు.
కరాళమ్ = భయంకరమైన,
యత్ క్ష్వేలమ్ = ఏ కాలకూటవిషమున్నదో,
కబళితవతః = అది భక్షించినను,
శంభోః = (నీపతియైన) శివునకు,
కాలకలనా = కాలధర్మము,
న = సంభవించ లేదు,
తత్ మూలమ్ = దానికి కారణము,
తవ = నీ యొక్క
తాటంక మహిమా = చెవికమ్మల ( కర్ణాభరణముల) ప్రభావమే,
భావము.
తల్లీ ! భయంకరమైన జరామృత్యువులను పరిహరించు అమృతమును త్రాగి కూడా బ్రహ్మేంద్రాది దేవతలందరూ మృతి చెందుతున్నారు. కానీ నీ భర్త అయిన శివునకు- కాలకూటము భుజించినప్పటికీ కల్పాంతములందు కూడా చావు లేడు. దానికి కారణము నీ కర్ణాభరణములయిన తాటంకముల మహిమయే.
29 వ శ్లోకము.
కిరీటం వైరించం పరిహర పురః కైటభభిదః
కఠోరే కోటీరే స్ఖలసి జహి జంభారి మకుటమ్ |
ప్రణమ్రేష్వేతేషు ప్రసభముపయాతస్య భవనం
భవస్యాభ్యుత్థానే తవ పరిజనోక్తి ర్విజయతే ||
పదచ్ఛేదము.
కిరీటమ్ - వైరించమ్ - పరిహర - పురః - కైటభ - భిదః -
కఠోరే - కోటీరే - స్ఖలసి - జహి - జంభారి - మకుటమ్ -
ప్రణమ్రేషు - ఏతేషు - ప్రసభమ్ - ఉపయాతస్య - భవనమ్ -
భవస్య - అభ్యుత్థానే - తవ - పరిజన - ఉక్తిః - విజయతే.
అన్వయక్రమము.
పురః, వైరించమ్, కిరీటమ్, పరిహర, కైటభ భిదః, కఠోరే, కోటీరే, స్థలసి, జంభారి, మకుటమ్, జహి, ఏతేషు, ప్రణమ్రేషు, భవనమ్, ఉపయాతస్య, భవస్య, ప్రసభ, తవ అభ్యుత్థానే, తవ, పరిజన + ఉక్తి, విజయతే.
పద్యము.
సీ. విధికిరీటంబిది పదిలంబుగా నీవు తప్పించుకొని నడు, తగులకుండ,
హరి కిరీటంబది, యటు కాలు మోపకు, కాలుకు తగిలినఁ గందిపోవు,
నింద్రమకుటమది, యిటుప్రక్క పోఁబోకు, తగిలినచో బాధ తప్పదమ్మ,
ప్రణమిల్లుచుండిన బ్రహ్మాదులనునెన్ని, పరిజనంబులు నీవు వచ్చుచున్న
తే.గీ. పతికెదురుగనేగఁ గనుచుఁ బలికినట్టి
పలుకు లరయ సర్వోత్కృష్ట భాసితములు,
పరమసుకుమార వరపాద పద్మములకు
వందనంబులు చేసెద నందుమమ్మ! || 29 ||
ప్రతిపదార్థము.
(హే భగవతి! = ఓ తల్లీ!)
పురః = ఎదుట,
వైరించమ్ = బ్రహ్మకు సంబంధించిన,
కిరీటమ్ = కిరీటమును,
పరిహర = తొలఁగ జేయుము,
కైటభ భిదః = కైటభుడను రాక్షసుని వధించిన విష్ణుమూర్తి యొక్క,
కఠోరే = కఠినమయిన,
కోటీరే = కిరీటము అంచులందు తాకి,
స్థలసి = జాఱెదవేమో,
జంభారి = దేవేంద్రుని
మకుటమ్ = కిరీటమును,
జహి = వదలి దూరముగా నడువుము - అని ఈ విధముగా
ఏతేషు = బ్రహ్మేంద్రాదులు
ప్రణమ్రేషు = మోకరిల్లుచుండగా,
భవనమ్ = నీ మందిరమునకు,
ఉపయాతస్య = వచ్చిన,
భవస్య = నీ పతియగు పరమేశ్వరునికి,
ప్రసభ = వెంటనే,
తవ అభ్యుత్థానే = నీవు ఎదురు వెళ్ళు సమయమందు,
తవ = నీ యొక్క,
పరిజన + ఉక్తి = సేవికల వచనము,
విజయతే = సర్వోత్కర్షతో విరాజిల్లుచున్నది.
భావము.
మాతా! నీ మందిరమునకు నీ పతియగు పరమేశ్వరుడు వచ్చిన తరుణములో, నీవు వెనువెంటనే స్వాగత వచనములతో ఎదురేగి, ఆయనను పలుకరించుటకు లేచి ముందుకు సాగు ప్రయత్నములోనుండగా – దారిలో నీకు సాష్టాంగ దండప్రణామము లాచరించు స్థితిలోనున్న బ్రహ్మ, విష్ణు, ఇంద్రాదుల యొక్క కిరీటములు- నీ పాదములకు అడ్డు తగులుతాయి అన్న ఉద్దేశ్యముతో- వీటిని జాగ్రత్తగా దాటుతూ నడువుమని చెప్పే నీ పరిచారికల మాటలు ఎంతో గొప్పవిగా ఉన్నవి.
30 వ శ్లోకము.
స్వదేహోద్భూతాభిర్ఘృణిభిరణిమాద్యాభిరభితో
నిషేవ్యే నిత్యే త్వా మహమితి సదా భావయతి యః |
కిమాశ్చర్యం తస్య త్రినయన సమృద్ధిం తృణయతో
మహాసంవర్తాగ్నిర్విరచయతి నీరాజనవిధిమ్ ||
పదచ్ఛేదము.
స్వదేహ - ఉద్భతాభిః - ఘృణిభిః - అణిమాద్యాభిః - అభితః -
నిషేవ్యే - నిత్యే - త్వామ్ - అహమ్ - ఇతి - సదా - భావయతి - యః -
కిమ్ - ఆశ్చర్యమ్ - తస్య - త్రి నయన - సమృద్ధిమ్ - తృణయతః -
మహా - సంవర్త - అగ్నిః - విరచయతి - నీరాజన - విధిమ్.
అన్వయక్రమము.
నిత్యే, నిషేవ్యే, స్వదేహ + ఉద్భూతాభిః, ఘృణిభిః, అణిమా + ఆద్యాభిః, అభితః, త్వామ్, అహం ఇతి, సదా, యః, భావయతి, త్రినయన సమృద్ధిమ్, తృణయతః, తస్య, మహా సంవర్త + అగ్ని, నీరాజన విధిమ్, కరోతి, కిం ఆశ్చర్యమ్.
పద్యము.
శా. అమ్మా! నిత్యవు, నీ పదాబ్జ జనితంబౌ కాంతులే సిద్ధులో
యమ్మా! వాటికి మధ్యనున్న నినుఁ దానంచెంచు భక్తుం డహో
నెమ్మిన్ సాంబు సమృద్ధినైనఁ గొనఁ డా నిత్యాత్మునే యెన్నుచున్
సమ్మాన్యంపు నివాళియౌ నతనికిన్ సంవర్త కాలాగ్నియున్. 30.
ప్రతిపదార్థము.
నిత్యే = ఆద్యంతములు లేని తల్లీ !,
నిషేవ్యే = చక్కగా సేవింపదగిన మాతా!
స్వదేహ + ఉద్భూతాభిః = (తన)నీకు సంబంధించిన దేహము నుండి, (అనగా - ప్రస్తుతము పాదముల నుండి)ఉద్భవించినట్టి,
ఘృణిభిః = కిరణములతోడను,
అణిమా + ఆద్యాభిః = అణిమాగరిమాది అష్టసిద్ధులతోడను,
అభితః = చుట్టును ఉండు వానితోడను, (కూడి),
త్వామ్ = (ఉన్న) నిన్ను,
అహం ఇతి = నేను అను అహంభావన చేత,
సదా = ఎల్లవేళల,
యః = ఏ సాధకుడు,
భావయతి = ధ్యానము చేయునో,
త్రినయన సమృద్ధిమ్ = సదాశివుని యొక్క ఐశ్వర్యమును,
తృణయతః = తృణీకరించుచున్న గడ్డి పోచవలె నెంచుచున్న,
తస్య = ఆ సాధకునికి,
మహా సంవర్త + అగ్ని = మహా ప్రళయాగ్ని,
నీరాజన విధిమ్ = నీరాజనమును,
కరోతి = ఇచ్చుచున్నది (అని అనుటలో),
కిం ఆశ్చర్యమ్ = ఏమి ఆశ్చర్యము ఇది ?
భావము.
అమ్మా! నిత్యురాలవగు నీ చరణములనుండి ఉద్భవించిన కాంతులతో, అణిమ, మహిమా మొదలైన అష్ట సిద్ధులతో కూడిన నిన్ను “నీవే నేను” అనే భావముతో, నిత్యమూ ధ్యానము చేయు భక్తుడు ముక్కంటి అయిన శివుని ఐశ్వర్యమును కూడ తృణీకరించగలడు. ఇక వానికి ప్రళయకాలాగ్ని నీరాజనమువలె అగుచున్నదనుటలో ఆశ్చర్యమేమున్నది?
జైహింద్.
No comments:
Post a Comment