జైశ్రీరామ్.
66 వ శ్లోకము.
విపఞ్చ్యా గాయన్తీ వివిధ మపదానం పశుపతే
స్త్వయారబ్ధే వక్తుం చలిత శిరసా సాధు వచనే |
తదీయైర్మాధుర్యైరపలపిత తన్త్రీ కలరవాం
నిజాం వీణాం వాణీ నిచులయతి చోలేన నిభృతమ్ ||
పదచ్ఛేదము.
విపఞ్చ్యా - గాయన్తీ - వివిధమ్ - అపదానమ్ - పశుపతేః -
త్వయా - ఆరబ్ధే - వక్తుమ్ - చలిత - శిరసా - సాధు - వచనే -
తదీయైః - మాధుర్యైః - అప లపిత - తన్త్రీ - కలరవామ్ -
నిజామ్ - వీణామ్ - వాణీ - నిచులయతి - చోలేన - నిభృతమ్.
అన్వయక్రమము.
వాణీ, పశుపతేః, వివిధమ్, అపదానమ్, విపఞ్చ్యా, గాయంత్యా, చలిత శిరసా, త్వయా, సాధువచనే, వక్తుమ్, ఆరబ్ధే సతి, తదీయై, మాధుర్యైః, అపలపిత, తంత్రీ, కలరవామ్, నిజామ్, వీణామ్, చోలేన, నిభృతమ్, నిచులయతి.
పద్యము.
ఉ. వాణి విపంచిపై శివుని పావనసచ్చరితంబు మీటుచున్
నీ నయవాక్సుధార్ణవము నెమ్మిని భావనఁ జేసి దానితో
వీణియ పోలదంచు కని వేగమె కొంగునఁ గప్పె వీణనే,
ప్రాణము నీవెయై మదిని వర్ధిలు తల్లి! నమస్కరించెదన్. ॥ 66 ॥
ప్రతిపదార్థము.
(హే జగజ్జనని !)
వాణీ = సరస్వతి,
పశుపతేః = ఈశ్వరుని యొక్క,
వివిధమ్ = అనేక విధములైన,
అపదానమ్ = సాహస కృత్యములు మొదలగు వాటిని,
విపఞ్చ్యా = వీణచేత,
గాయంత్యా = గానము చేయుచున్నదై,
చలిత శిరసా = మనస్సు నందు కలిగిన సంతోష వశమున స్వయముగా గలిగిన శిరః కంపమున,
త్వయా = నీ చేత,
సాధు వచనే = ప్రశంసావచనము,
వక్తుమ్ = వచించుటకు,
ఆరబ్ధేసతి = ప్రారంభించినదగుచుండగా,
తదీయై = ఆవచన సంబంధులైన,
మాధుర్యైః = మాధుర్య గుణముల చేత,
అపలపిత = అపహసింపబడిన,
తంత్రీ = తంత్రుల యొక్క
కలరవామ్ = అవ్యక్త మధురములైన ధ్వనులు గలదైన,
నిజామ్ = తన యొక్క,
వీణామ్ = వీణను,
చోలేన = వీణను ఉంచు పైముసుగు చేత,
నిభృతమ్ = కనబడకుండా నుండునట్లు,
నిచులయతి = బాగుగా కప్పుచున్నది.
భావము.
తల్లీ! సరస్వతీదేవి వీణను శ్రుతిచేసి నీ ఎదుట పశుపతి వీరగాథలను గానం చేస్తూంటె నువ్వు ఆనందం పొంది , ఆమెపాటను మెచ్చుకుంటూ ప్రశంసా వాక్యాలు చెబుతుంటె , నీ వాఙ్మాధుర్యం తన వీణానాదంకంటె మాధుర్యం కలదని తెలిసి ఆమె తనవీణను కనపడకుండా వస్త్రంతో కప్పి దాస్తుంది.
67 వ శ్లోకము.
కరాగ్రేణ స్పృష్టం తుహినగిరిణా వత్సలతయా
గిరీశేనోదస్తం ముహురధరపానాకులతయా |
కరగ్రాహ్యం శంభోర్ముఖ ముకుర వృంతం గిరిసుతే!
కథంకారం బ్రూమస్తవ చుబుకమౌపమ్యరహితమ్. ||
పదచ్ఛేదము.
కర - అగ్రేణ - స్పృష్టమ్ - తుహిన గిరిణా - వత్సలతయా -
గిరీశేన - ఉదస్తమ్ - ముహుః - అధర - పాన - ఆకులతయా -
కర - గ్రాహ్యమ్ - శంభోః - ముఖ - ముకుర - వృంతమ్ - గిరిసుతే -
కథమ్ - కారమ్ - బ్రూమః - తవ - చుబుకమ్ - ఔపమ్య రహితమ్.
అన్వయక్రమము.
గిరిసుతే, తుహినగిరిణా, వత్సలతయా, కరాగ్రేణ, స్పృష్టమ్, గిరీశేన, అధర పాన, ఆకులతయా, ముహుః, ఉదస్తమ్, శంభోః, కర గ్రాహ్యమ్, ముఖ, ముకురవృంతమ్, ఔపమ్య రహితమ్, తవ, చుబుకమ్, కథంకారమ్, బ్రూమః.
పద్యము.
చం. జనకుఁడు ప్రేమగా నిమురు చక్కని నీ చుబుకంబు, నీ ధవుం
డనవరతంబు నీ యధరమానెడి వేడ్కను దొట్రుపాటుతోఁ
జనువున పట్టి తేల్చుఁ గద చక్కని మోవి, సఖుండు చేత లే
పిన ముఖమన్ లసన్ముకురవృంతము, నాకది పోల్ప సాధ్యమా. ॥ 67 ॥
ప్రతిపదార్థము.
గిరిసుతే = ఓ గిరిరాజపుత్రీ,
తుహినగిరిణా = మంచుకొండ చేత, (తండ్రిచేత),
వత్సలతయా = వాత్సల్యముతో,
కరాగ్రేణ = మునివ్రేళ్ళతో,
స్పృష్టమ్ = పుడుక బడునదియు,
గిరీశేన = శివుని చేత,
అధర పాన = అధర పానము నందలి,
ఆకులతయా = తొట్రుపాటు చేత,
ముహుః = మాటిమాటికి,
ఉదస్తమ్ = పైకెత్తబడినదియు,
శంభోః= శివుని యొక్క,
కర గ్రాహ్యమ్ = చేతిని గైకొన దగినదియు,
ముఖ = ముఖము అను,
ముకురవృంతమ్ = అద్దమునకు పిడి అయినదియు,
ఔపమ్యరహితమ్ = సరిపోల్చఁ దగిన వస్తువు లేనిదియునగు,
తవ = నీ యొక్క,
చుబుకమ్ = గడ్డమును,
కథంకారమ్ = ఏ విధముగా,
బ్రూమః = వర్ణించగలము ?
భావము.
ఓ గిరి రాజకుమారీ! తండ్రి అయిన హిమవంతుని చేత, అమితమైన వాత్సల్యముతో మునివేళ్ళతో తాకబడినది, అధరామృతపానమునందలి ఆత్రుత, తొట్రుపాటులతో శివునిచే మాటి మాటికీ పైకెత్తబడినది, శంభుని హస్తమును చేకొనతగినది, సరిపోల్చతగినది ఏమీ లేనిది అయిన- నీ ముఖము అను అద్దమును పుచ్చుకొనుటకు, అందమైన పిడివలె నున్న నీ ముద్దులొలుకు చుబుకమును(గడ్డము)ను ఏ విధముగా వర్ణించగలను?
68 వ శ్లోకము.
భుజాశ్లేషాన్నిత్యం పురదమయితుః కంటకవతీ
తవ గ్రీవా ధత్తే ముఖకమలనాళ శ్రియమియమ్ |
స్వతశ్శ్వేతా కాలాగరు బహుళ జంబాల మలినా
మృణాలీ లాలిత్యం వహతి యదధో హారలతికా. ||
పదచ్ఛేదము.
భుజ - ఆశ్లేషాత్ - నిత్యమ్ - పుర - దమయితుః - కంటకవతీ -
తవ - గ్రీవా - ధత్తే - ముఖ - కమల - నాళ - శ్రియమ్ - ఇయమ్ -
స్వతః - శ్వేతా - కాల - అగరు - బహుళ - జంబాల - మలినా -
మృణాలీ - లాలిత్యమ్ - వహతి - యత్ - అధః - హార - లతికా.
అన్వయక్రమము.
పురదమయితుః, భుజ, ఆశ్లేషాత్, నిత్యమ్, తవ, ఇయం గ్రీవా, కంటకవతీ, ముఖ, కమల, నాళ శ్రియమ్, ధత్తే, యత్, అధః, స్వతః, శ్వేతా, కాల + అగరు, బహుళ, జంబాల, మలినా, హారలతికా, మృణాలీ, లాలిత్యమ్, వహతి.
పద్యము.
చం. పురహరు బాహు బంధమునఁ బొల్పగు నీదగు కంఠనాళమే
సురనుత! కంటకాంకుర సుశోభిత వారిజనాళమట్లు కాన్
వరలుచు గంధ పంకమున భాసిలె హారము నాళమట్లుగన్.
నిరుపమ! నిన్ మదిన్ నిలిపి నేను భజించెదఁ గాంచుమా కృపన్. ॥ 68 ॥
ప్రతిపదార్థము.
(హే జగజ్జననీ = ఓ లోకమాతా!)
పురదమయితుః = పురహరుడైన శివుని యొక్క,
భుజ = బాహువుల,
ఆశ్లేషాత్ = కౌగిలింతల వలన,
నిత్యమ్ = ఎల్లప్పుడు,
తవ = నీ యొక్క,
ఇయం గ్రీవా = ఈ కంఠనాళము,
కంటకవతీ = గగుర్పాటు వలను రోమాంచము గలదైన,
ముఖ = ముఖమనెడి,
కమల = తామరపూవు యొక్క,
నాళ శ్రియమ్ = కాడ అందమును,
ధత్తే = ధరించుచున్నది,
యత్ = ఏ కారణము వలన,
అధః = (ఆ కంఠమునకు) క్రిందుగా నున్న ప్రదేశము నందు,
స్వతః = స్వయముగనే,
శ్వేతా = స్వచ్ఛమైనదై,
కాల + అగరు = నల్లనైన అగరు గంధపు చెక్క యొక్క,
బహుళ = విస్తారముగా నున్న,
జంబాల= పంకము యొక్క,
మలినా = నలుపు వన్నె చేత మాసిన,
హారలతికా = ముత్యాల హారము,
మృణాలీ = తామరతూడు యొక్క,
లాలిత్యమ్ = సౌందర్యమును,
వహతి = ధరించుచున్నది.
భావము.
తల్లీ! జగజ్జననీ! పురహరుని బాహువులతో, కౌగిలింతలతో నిత్యము గగుర్పాటుతో రోమాంచితమై, క్రింది భాగము సహజముగానే స్వచ్ఛముగా ఉండి- నల్లగా, విస్తారముగా ఉన్న అగరుగంధపు సువాసనతో, తామరుతూడు అందమును మించిన ముత్యాల హారముతో ఉండుటవలన – నీ మెడ నీ ముఖమనే పద్మమునకు ఒక కాడవలె ఉన్నది.
69 వ శ్లోకము.
గళే రేఖాస్తిస్రో గతి గమక గీతైక నిపుణే!
వివాహ వ్యానద్ధ ప్రగుణ గుణసంఖ్యా ప్రతిభువః |
విరాజంతే నానావిధ మధుర రాగాకర భువాం
త్రయాణాం గ్రామాణాం స్థితి నియమ సీమాన ఇవ తే ||
పదచ్ఛేదము.
గళే - రేఖాః - తిస్రః - గతి - గమక - గీత - ఏక - నిపుణే -
వివాహ - వ్యానద్ధ - ప్రగుణ - గుణ - సంఖ్యా - ప్రతిభువః -
విరాజంతే - నానా విధ - మధుర - రాగ - ఆకర - భువామ్ -
త్రయాణామ్ - గ్రామాణామ్ - స్థితి - నియమ - సీమానః - ఇవ - తే.
అన్వయక్రమము.
గతి, గమక, గీత, ఏక, నివుణే! తే, గళే, తిస్రః రేఖాః, వివాహ, వ్యానద్ధ, ప్రగుణ, గుణ, సంఖ్యా, ప్రతిభువః, నానావిధ, మధుర, రాగ, ఆకర భువామ్, త్రయాణామ్, గ్రామాణామ్, స్థితి, నియమ, సీమానః ఇవ, విరాజంతే.
పద్యము.
తే.గీ. గమక గీతైక నిపుణ! నీ కంఠ రేఖ
లు తగె మూడు సూత్రపు ముడులువలెనమ్మ!
షడ్జ, మధ్యమ, గాంధార, సంస్తుతగతి
కమరు హద్దన నొప్పె, మహత్వముగను. ॥ 69 ॥
ప్రతిపదార్థము.
(హే జగజ్జననీ!)
గతి = సంగీత మార్గముల యందును,
గమక = స్వరకంపన విశేషములందును,
గీత = గానము నందును,
ఏక = ముఖ్యమైన,
నివుణే = నేర్పరితనము గలదానా!
తే = నీ యొక్క,
గళే = కంఠ ప్రదేశమునందు,
తిస్రః రేఖాః = మూడు భాగ్య రేఖలు,
వివాహ = పెళ్ళి సమయమందు,
వ్యానద్ధ = (కంఠము చుట్టును వచ్చునట్లు)చక్కగా కట్టబడిన,
ప్రగుణ = పెక్కునూలు పోగులచే కూర్చబడిన,
గుణ = దారముల యొక్క,
సంఖ్యా = మూడు సంఖ్యకు,
ప్రతిభువః = ప్రతినిధులైనవియు,
నానావిధ = అనేక విధములైన,
మధుర = మధురమయిన,
రాగ = కళ్యాణి మొదలగు రాగములకు,
ఆకర భువామ్ = (స్వరస్థానములను)ఆశ్రమ స్థానములైనవియు,
త్రయాణామ్ = మూడైన,
గ్రామాణామ్ = షడ్జమ, మధ్యమ, గాంధార గ్రామములకు,
స్థితి = ఉనికి యొక్క,
నియమ = నియమము కొఱకు ఏర్పరచిన,
సీమానః ఇవ = సరిహద్దులవలె,
విరాజంతే = మిక్కిలి శోభాయమానముగా ప్రకాశించుచున్నవి.
భావము.
సంగీత స్వరగాననిపుణీ, జగజ్జననీ! నీ కంఠము నందు కనబడు మూడు భాగ్యరేఖలు – వివాహ సమయమునందు పెక్కు నూలు పోగులతో ముప్పేటలుగా కూర్చబడి కట్టిన సూత్రమును గుర్తుతెచ్చుచు, నానా విధములైన మధుర రాగములకు ఆశ్రయ స్థానములైన షడ్జమ, మధ్యమ, గాంధార గ్రామముల ఉనికి యొక్క నియమము కొరకు ఏర్పరచిన సరిహద్దుల వలె ఉన్నట్లు శోభాయామానముగా ప్రకాశించుచున్నవి.
70 వ శ్లోకము.
మృణాలీ మృద్వీనాం తవ భుజలతానాం చతసృణాం
చతుర్భిస్సౌందర్యం సరసిజభవస్స్తౌతి వదనైః |
నఖేభ్యస్సన్త్రస్యన్ ప్రథమ మథనా దంధకరిపోః
చతుర్ణాం శీర్షాణాం సమమభయహస్తార్పణ ధియా ||
పదచ్ఛేదము.
మృణాలీ - మృద్వీనామ్ - తవ - భుజ - లతానామ్ - చతసృణామ్ -
చతుర్భిః - సౌందర్యమ్ - సరసిజ భవః - స్స్తౌతి వదనైః |
నఖేభ్యః - సన్త్రస్యన్ - ప్రథమ - మథనాత్ - అంధకరిపోః -
చతుర్ణామ్ - శీర్షాణామ్ - సమమ్ - అభయ - హస్త - అర్పణ - ధియా.
అన్వయక్రమము.
సరసిజ భవః, ప్రథమ మథనాత్, అంధక రిపోః, నఖేభ్యః, సంత్రస్యన్, చతుర్ణామ్, శీర్షాణామ్, సమమ్, అభయహస్త, అర్పణ ధియా, చతుర్భిః, వదనైః, మృణాలీమృద్వీనామ్, చతసృణామ్, తవ, భుజలతానామ్, సౌందర్యమ్, స్తౌతి.
పద్యము.
శా. అమ్మా! గోర్లను శూలి బ్రహ్మ తలఁ బాయన్ ద్రుంప, భీతిల్లుచున్,
బమ్మే నాలుగు మోములన్ గిలిని బాపం గోరుచున్ రక్షణం
బిమ్మంచున్ నుతియించుచుండె సుకుమారీ! భీతిఁ బోఁగొట్టు నీ
యిమ్మౌ కోరకమార్దవంపు భుజముల్ హృద్యంబులౌ నాల్గిటిన్. ॥ 70 ॥
ప్రతిపదార్థము.
(హే జగజ్జననీ = ఓ లోకమాతా!)
సరసిజ భవః = బ్రహ్మదేవుడు,
ప్రథమ మథనాత్ = మొట్టమొదటి తన శిరస్సును ఖండించుట వలన,
అంధక రిపోః = అంధకుడను అసురుని సంహరించిన సదాశివుని యొక్క,
నఖేభ్యః = గోళ్ళవలన,
సంత్రస్యన్ = మిగులభయపడుచున్నవాడై,
చతుర్ణామ్ = నాలుగుగా నున్న,
శీర్షాణామ్ = తన శిరస్సులకు,
సమమ్ = సమానముగా,
అభయహస్త = అభయదానము చేయఁ గలిగిన నీ హస్తములను ,
అర్పణ ధియా = అభయమును ఇచ్చునను భావనచే,
చతుర్భిః = నాలుగుగా నున్న,
వదనైః = తన ముఖములచేత,
మృణాలీ మృద్వీనామ్ = తామరతూడువలె మెత్తదనము గలవియు,
చతసృణామ్ = నాలుగుగా వున్నవియు,
తవ = నీ యొక్క,
భుజలతానామ్= తీగల వంటి భుజముల యొక్క,
సౌందర్యమ్ = అందమును,
స్తౌతి = స్తుతించుచున్నాడు.
భావము.
తల్లీ జగజ్జననీ! తామర తూడువలె మృదువుగా తీగలవలె ఉండు నీ బాహువుల చక్కదనమును చూసి, బ్రహ్మ తన నాలుగు ముఖములతో – పూర్వము తన ఐదవ శిరస్సును గోటితో గిల్లి వేసిన శివుని గోళ్ళకు భయపడుచూ, ఒక్కసారిగా తన మిగిలిన నాలుగు శిరస్సులకు నీ నాలుగు హస్తముల నుండి అభయ దానము కోరుచూ, నిన్ను స్తుతించుచున్నాడు.
జైహింద్.
No comments:
Post a Comment