Thursday, May 1, 2025

సౌందర్య లహరి 76 - 80 పద్యాలు. రచన శ్రీ చింతా రామకృష్ణారావుగారు,సంగీతం, గానం శ్రీమతి వల్లూరి సరస్వతి

జైశ్రీరామ్.
76 వ శ్లోకము.  
హరక్రోధజ్వాలావలిభిరవలీఢేన వపుషా
గభీరే తే నాభీసరసి కృతసఙ్గో మనసిజః |
సముత్తస్థౌ తస్మాదచలతనయే ధూమలతికా
జనస్తాం జానీతే తవ జనని రోమావలిరితి  ||
పదచ్ఛేదము.
హర - క్రోధ - జ్వాలా - వలిభిః - అవలీఢేన - వపుషా -
గభీరే - తే - నాభీ - సరసి -  కృత - సఙ్గః - మనసిజః -
సముత్తస్థౌ -  తస్మాత్ -  అచల తనయే - ధూమ -  లతికా -
జనస్తామ్ -  జానీతే - తవ - జనని -  రోమావలిః -  ఇతి.
అన్వయక్రమము.
అచలతనయే, మనసిజ, హర, క్రోధ, జ్వాలా, ఆవలిభిః, అవలీఢేన, వపుషా, గభీరే, తే, నాభీ, సరసి, కృతసంగః,  తస్మాత్‌, ధూమలతికా, సముత్తస్థౌ, జనని, తామ్, జనః, తవ, రోమావలిః ఇతి, జానీతే.
పద్యము.
శా.  శ్రీమాతా! మదనుండు దగ్ధమగుచున్ శ్రీశంభు కోపాగ్నిలో
నీమంబొప్పగ రక్షకై దుమికెఁ దా నీ నాభి సత్రమ్ములో,
ధీమంతుండు ప్రశాంతిఁబొందె శిఖి శాంతింపన్ బొగల్ వెల్వడెన్
ధూమంబున్ గనుగొంచు నెంచితది నీ నూగారుగా శాంభవీ! ॥ 76 ॥
ప్రతిపదార్థము.
జనని = అమ్మా,
అచలతనయే = ఓ పార్వతీ, 
మనసిజ = మన్మథుడు, 
హర = శివుని యొక్క, 
క్రోధ = క్రోధము అను, 
జ్వాలా = అగ్ని వలన జనించిన జ్వాలల యొక్క, 
ఆవలిభిః = సమూహము చేత, 
అవలీఢేన = క్రమ్మబడిన, 
వపుషా = శరీరముతో, 
గభీరే = లోతైన, 
తే= నీ యొక్క, 
నాభీ = బొడ్డు అను ,
సరసి = సరస్సునందు, 
కృతసంగః = కూడిన వాడయ్యెను, అనగా  మునిగిన వాడయ్యెను,  
తస్మాత్‌ = అందువలన ఆ బొడ్డు అను కొలను నుండి, 
ధూమలతికా = పొగతీగ, 
సముత్తస్థౌ = పైకి ప్రాకెను, 
తామ్ = ఆ పొగతీగను, 
జనః = జనము, 
తవ = నీ యొక్క, 
రోమావలిః ఇతి = నూగారు అని, 
జానీతే = తెలుసుకొనుచున్నారు. 
భావము. 
అమ్మా! పర్వతరాజ కుమారీ ! మన్మధుడు పరమ శివుని కోపాగ్ని కీలలతో దహింప బడిన శరీరముతో నీ యొక్క లోతయిన నాభి మడువున దూకి తనను తాను కాపాడుకొనెను. కాలుచున్న వాని శరీరము చల్లారుట చేత వెడలిన పొగ తీగ బయల్పడగా , దానిని నీ యొక్క నూగారు ప్రాంతముగా కనబడుచున్నది కదా!
77 వ శ్లోకము.  
యదే తత్కాళిందీ తనుతర తరంగాకృతి శివే
కృశే మధ్యే కించిజ్జనని తవ యద్భాతి సుధియామ్
విమర్దాదన్యోన్యం కుచకలశయోరంతరగతం
తనూభూతం వ్యోమ ప్రవిశదివ నాభిం కుహరిణీమ్  ||
పదచ్ఛేదము.
యత్ -  ఏతత్ -  కాళిందీ - తనుతర - తరంగ - ఆకృతి - శివే -
కృశే - మధ్యే - కించిత్ -  జనని - తవ - యత్ -  భాతి - సుధియామ్ -
విమర్దాత్ -  అన్యోన్యమ్ -  కుచ - కలశయోః -  అంతరగతమ్ -
తనూ భూతమ్ -  వ్యోమ - ప్రవిశత్ -  ఇవ - నాభిమ్ -  కుహరిణీమ్.
అన్వయక్రమము.
జనని, శివే, కృశే, తవ, మధ్యే, యత్‌ యేతత్, కాళిందీ, తనుతర, తరంగ, ఆకృతి, యత్, కించిత్‌, తవ, కుచకలశయోః, అన్యోన్యమ్, విమర్దాత్‌, అంతరగతమ్, వ్యోమ, తనూభూతమ్, కుహరిణీమ్, నాభిమ్, ప్రవిశత్‌ + ఇవ, సుధియామ్, భాతి, 
పద్యము.
మ.  ఉమ! నీదౌ కృశమధ్య నే యమున శుష్కోర్మ్యాకృతిన్గల్గి కొం
చెము ధీయుక్తుల కేది దివ్యముగ భాసించున్ మహోద్ఘట్ట వి
భ్రమవక్షోజ గతాభ్రమెన్నఁ గృశమై స్వాంతోపమంబౌ యుదా
నమునే చేరు విధంబునొప్పెనది, యో జ్ఞానప్రదా! కాంచినన్.  ॥ 77 ॥
ప్రతిపదార్థము.
జనని = జగజ్జననీ! 
శివే = ఓ భగవతీ !
కృశే = సన్ననైన, 
తవ = నీ యొక్క, 
మధ్యే = నడుము భాగము నందు, 
యత్‌ యేతత్ = ఏ యీ, 
కాళిందీ = యమునా నదియొక్క, 
తనుతర = మిక్కిలి చిన్నదియైన, 
తరంగ = అలవంటి, 
ఆకృతి = రూపు గలదై, 
యత్ = ఏ,
కించిత్‌ = కొంచెముగా కనబడు నూగారు, 
తవ = నీ యొక్క, 
కుచకలశయోః = కుచ కుంభములు, 
అన్యోన్యమ్ = పరస్పరము, 
విమర్దాత్‌ = ఒరసి కొనునట్లు స్పృశించుకొనుట వలన, 
అంతరగతమ్ = మధ్య భాగమున వర్తించునదైన, 
వ్యోమ = ఆకాశము, 
తనూభూతమ్ = సన్ననిదై, 
కుహరిణీమ్ = గుహవంటిదైన, 
నాభిమ్ = బొడ్డును, 
ప్రవిశత్‌ + ఇవ = ప్రవేశించుచున్నది వలె ,
సుధియామ్ = విద్వాంసులకు, 
భాతి = ప్రకాశించుచు కనబడుచున్నది, 
భావము. 
ఓ భగవతీ! యమునానదీ తరంగంవలె సన్ననిదై, నీ కృశమధ్యంలో అగపడే నూగారనే చిన్నవస్తువు విద్వాంసులకు - నీ కుచముల మధ్యనున్న ఆకాశం ఆకుచములురెండు పరస్పరం ఒరయటం వల్ల ఆఒరపిడికి తాళలేక నలిగినల్లనై సన్నగా క్రిందికి నాభివరకు జారినదిగా ప్రకాశించుచు కనబడుచున్నది.
78 వ శ్లోకము.  
స్థిరో గంగా వర్తస్స్తనముకుళ రోమావళి లతా
కలావాలం కుండం కుసుమశర తేజో హుతభుజః |
రతేర్లీలాగారం కిమపి తవ నాభిర్గిరిసుతే
బిలద్వారం సిద్ధేర్గిరిశనయనానాం విజయతే  ||
పదచ్ఛేదము.
స్థిరః -  గంగా - ఆవర్తః - స్తన - ముకుళ  - రోమ - ఆవళి - లతా -
కల - ఆవాలమ్ -  కుండమ్ -  కుసుమ శర - తేజః -  హుతభుజః -
రతేః - లీలాగారమ్ -  కిమపి - తవ - నాభిః - గిరి - సుతే -
బిల - ద్వారమ్ -  సిద్ధేః - గిరిశ - నయనానామ్ -  విజయతే.
అన్వయక్రమము.
గిరిసుతే, తవ, నాభిః, స్థిరః, గంగా, ఆవర్తః, స్తన, ముకుళ, రోమావళి, లతా, కలా, ఆవాలమ్,  కుసుమశర, తేజః, హుతభుజః, కుండమ్, రతేః, లీలాగారమ్, గిరిశ, నయనానామ్, సిద్ధేః, బిలద్వారమ్, కిమపి, విజయతే.
పద్యము.
ఉ.  నీదగు నాభి, గాంగ నుతనిర్ఝరలో సుడి, గుబ్బమొగ్గలన్
మోదము నిల్పు రోమలత మూలము, మన్మథ కాంతివహ్నికిన్
బాదగునగ్నికుండ, మనవద్యరతీగృహ మాత్రిశూలికిన్
శ్రీద సునేత్రపర్వ గుహసీమపు ద్వారమవర్ణ్యమమ్మరో! ॥ 78 ॥
ప్రతిపదార్థము.
గిరిసుతే = ఓ పార్వతీమాతా, 
తవ = నీ యొక్క, 
నాభిః = బొడ్డు, 
స్థిరః = స్థిరముగా నున్న, 
గంగా= గంగానది యొక్క ,
ఆవర్తః = సుడి, 
స్తన = స్తనములు అను, 
ముకుళ = పూల మొగ్గలకు ఆధారమైన, 
రోమావళి = నూగారు అను, 
లతా = తీగయొక్క, 
కలా = రేఖకు,
ఆవాలమ్ = పాదు,  
కుసుమశర = మన్మథుని యొక్క, 
తేజః = ప్రకాశమనెడి,
హుతభుజః = అగ్నికి, 
కుండమ్ = హోమగుండము, 
రతేః = రతీదేవికి, 
లీలాగారమ్ = విలాసగృహము, 
గిరిశ  = సదాశివుని,  
నయనానామ్ = కన్నుల యొక్క,
సిద్ధేః = తపస్సు సిద్ధించుటకు, 
బిలద్వారమ్ = గుహద్వారము, 
కిమపి = ఏమని వర్ణించుటకును వీలు కానిదై, 
విజయతే = సర్వోత్కృష్టముగా భాసిల్లుచున్నది. 
భావము. 
ఓ హిమగిరికన్యకా ! నీ నాభి చలనంలేని గంగానది నీటి సుడిగాను , పాలిండ్లనే పూమొగ్గలకు ఆధారమైన రోమరాజి అనే తీగయొక్క పాదుగాను , మన్మథుడి తేజస్సనే అగ్నికి హోమకుండంగాను , మరుని చెలువ ఐన రతీదేవికి శృంగారభవనంగాను , నీ పతి ఐన సదాశివుడి నయనాల తపస్సిధ్ధికి గుహాద్వారమై , అనిర్వాచ్యమై , అతిసుందరమై సర్వోత్కర్షతో ప్రకాశించుచున్నది.
79 వ శ్లోకము.  
నిసర్గ క్షీణస్య స్తనతట భరేణ క్లమజుషో
నమన్మూర్తే ర్నారీతిలక శనకైస్త్రుట్యత ఇవ |
చిరం తే మధ్యస్య త్రుటిత తటినీ తీర తరుణా
సమావస్థా స్థేమ్నో భవతు కుశలం శైలతనయే  ||
పదచ్ఛేదము.
నిసర్గ - క్షీణస్య -  స్తన - తట - భరేణ - క్లమజుషః -
నమత్ -  మూర్తేః -  నారీ - తిలక - శనకైః -  త్రుట్యత - ఇవ |
చిరమ్ -  తే - మధ్యస్య -  త్రుటిత - తటినీ - తీర - తరుణా -
సమ - అవస్థా - స్థేమ్నః -  భవతు - కుశలమ్ -  శైల - తనయే.
అన్వయక్రమము.
నారీ తిలక, హే శైల తనయే,   నిసర్గ, క్షీణస్య, స్తనతట, భరేణ,  క్లమజుషః, నమత్‌, మూర్తేః, శనకైః, త్రుట్యత ఇవ, త్రుటిత, తటినీ, తీర, తరుణా, సమ, అవస్థా, స్థేమ్నః, తే, మధ్యస్య, చిరమ్, కుశలమ్, భవతు.
పద్యము.
ఉ.  శైలతనూజ! నీ నడుము చక్కని నీ స్తనభారమోపమిన్
బేలవమై కృశించి జడిపించును దా విఱుగంగనున్నటుల్
వాలిన యేటిగట్టుపయి వాలిన చెట్టును బోలి, నీకికన్
మేలగుగాత, నీ నడుము మేలుగ వర్ధిలుగాక నిచ్చలున్. ॥ 79 ॥
ప్రతిపదార్థము.
నారీ తిలక = స్త్రీ రత్నమైన, 
హే శైల తనయే = ఓ గిరిపుత్రీ,   
నిసర్గ = స్వభావసిద్ధముగనే, 
క్షీణస్య = కృశించినదియు, 
స్తనతట = కుచప్రదేశముయొక్క, 
భరేణ = బరువుచే,  
క్లమజుషః = బడలినదియు, 
నమత్‌ = వంగిన ,
మూర్తేః = రూపము గలదియు, 
శనకైః = కొంచెముగా, 
త్రుట్యత ఇవ = తెగిపోవుచున్నదో అనునట్లున్నదియు,
త్రుటిత = ఒడ్డు విఱిగిన, 
తటినీ = నది యొక్క, 
తీర = గట్టునందలి, 
తరుణా = వృక్షముతో, 
సమ = సమానమగు, 
అవస్థా = అవస్థలో, 
స్థేమ్నః = నిలకడగా నున్న, 
తే = నీ యొక్క, 
మధ్యస్య = నడుమునకు, 
చిరమ్ = కలకాలము, 
కుశలమ్ = క్షేమము, 
భవతు = అగుగాక.
భావము. 
ఓ శైలతనయా ! ఓ నారీ తిలకమా ! సన్ననిదీ , పాలిండ్ల భారంచేత బడలినదీ క్రిందకువంగి తెగుతున్నదో అన్నట్లున్నదీ , కట్టతెగిన ఏటిగట్టునందలి చెట్టుతో సమానమైన స్థితిని పొందినదీ , ఐన నీ నడుము చిరకాలం సురక్షితంగా ఉండుగాక.
80 వ శ్లోకము.  
కుచౌ సద్యస్స్విద్యత్తట ఘటిత కూర్పాస భిదురౌ
కషంతౌ దోర్మూలే కనకకలశాభౌ కలయతా |
తవ త్రాతుం భంగాదలమితి వలగ్నం తనుభువా
త్రిధా నద్ధం దేవీ త్రివళి లవలీవల్లిభిరివ  || 
పదచ్ఛేదము.
కుచౌ - సద్యః -  స్స్విద్యత్ -  తట - ఘటిత - కూర్పాస - భిదురౌ -
కషంతౌ - దోః - మూలే - కనక - కలశ - అభౌ కలయతా -
తవ - త్రాతుమ్ -  భంగాత్ - అలం - ఇతి -  వలగ్నమ్ -  తను - భువా - 
త్రిధా - నద్ధమ్ -  దేవీ - త్రివళి - లవలీ - వల్లిభిః - ఇవ.
అన్వయక్రమము.
దేవి, సద్యః, స్విద్యత్‌, తట, ఘటిత, కూర్పాస, భిదురౌ, దోర్మూలే, కషంతౌ, కనక + కలశ + ఆభౌ, కుచౌ, కలయతా, తనుభువా, భంగాత్‌, త్రాతుమ్, అలమితి, తవ, వలగ్నమ్, త్రివళి, లవలీ వల్లిభిః, త్రిధా, నద్ధం ఇవ.
పద్యము.
చం.  చెమరుచు నీదు పార్శ్వములఁ జీలునొ చోలమనంగ నొత్తు నీ
విమల పయోధరంబులను విస్తృతిఁ గొల్పెడి మన్మథుండు భం
గము కలిగింపరాదను గౌనునకున్ లవలీ త్రివల్లులన్
సముచితరీతిఁ గట్టినటు చక్కగ నొప్పుచు నున్నదమ్మరో! ॥ 80 ॥
ప్రతిపదార్థము.
దేవి = ఓ దివ్యమంగళ స్వరూపిణీ, 
సద్యః = ఎప్పటికప్పుడే, 
స్విద్యత్‌ = (ఈశ్వరిని తలంపుచే)చెమర్చుచున్న, 
తట = పార్శ్వములందు, 
ఘటిత = తొడగఁబడిన, 
కూర్పాస = రవికను, 
భిదురౌ = పిగిల్చుచున్నవియు, 
దోర్మూలే = బాహువుల మూలములను, 
కషంతౌ = ఒఱియుచున్న, 
కనక + కలశ + ఆభౌ = బంగారు కడవల ప్రభతో ఒప్పు, 
కుచౌ = స్తనములను, 
కలయతా = నిర్మించుచున్న, 
తనుభువా = మన్మథుని చేత, 
భంగాత్‌ = అపాయము నుండి, 
త్రాతుమ్ = కాపాడుటకు, 
అలమితి = చాలునని,
తవ = నీ యొక్క, 
వలగ్నమ్ = నడుము, 
త్రివళి = మూడు ముడుతలు అనెడి, 
లవలీ వల్లిభిః = ఏలకి తీగల చేత, 
త్రిధా = ముప్పేటలుగా, 
నద్ధం ఇవ = కట్టబడినదియా అన్నట్లున్నది.  
భావము. 
ఓ ప్రకాశించే రూపుగల దేవీ! ఎప్పటికప్పుడే చెమట పోస్తున్న పార్శ్వములలో అంటుకొనియున్న రవికెను పిగుల్చుచున్నవీ , బాహుమూలల సమీప ప్రదేశాలను ఒరయుచున్నవీ, బంగారుకలశంవలె ఒప్పారుచున్నవీ ఐన కుచములను నిర్మిస్తూన్న మన్మథుఁడు, యీ (స్తన భారంవల్ల) భంగం కలుగరాదని నడుమును కాపాడటానికి లవలీ లతలతోముప్పేటగా కట్టబడెనా అన్నట్లు నీ పొట్టమీద మూడుముడతలు తోచుచున్నవి.
జైహింద్.

No comments: