Thursday, July 14, 2011

వందే గురు పరంపరాం.


శ్లో:- 
వ్యాసం వసిష్ఠ నప్తారమ్ -శక్తే: పౌత్రమ కల్మషమ్.
పరాశరాత్మజం వందే శుక తాతం తపో నిధిం!
క:- 
దివ్య వసిష్ఠ ప్రపౌత్రుఁడు,
భవ్యుండగు శక్తి పౌత్ర వరుఁడు నకలుషుం 
డవ్యయ పరాశరాత్మజుఁ
భవ్యుండగు సుకుని తండ్రి వ్యాసుం గొలుతున్.
శ్లో:- 
''గు'' కారస్త్వంధకారత్వాత్‌,
''రు'' కారస్త న్నిరోధక:, 
అంధకార నిరోధత్వాత్‌ 
గురురిత్యభిధీయతే.
భావము:- 
శిష్యుని అజ్ఞానమను అంధకారమును తొలగించి జ్ఞానమనెడి జ్యోతిని ప్రకాశింప జేసేవాడు అని అర్థం.
అట్టి గురువుకు నమస్కరించేటప్పుడు చెప్పుకొన వలసిన శ్లోకము.
శ్లో:-
అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయా
చక్షురున్మీలితం యేన తస్మై శ్రీ గురవే నమ:!
క:-
అజ్ఞానాంధముఁ బాపగ
సుజ్ఞానవరాంజనంబు చొప్పి శలాకన్
ప్రజ్ఞన్ కంటికి పులిమెడి
విజ్ఞులు గురువులకు నుతులు విరివిగ చేతున్.
భావము:- 
ఆశ్రయించిన శిష్యులకావహించిన అజ్ఞాన మనెడి గ్రుడ్డితనమును బాపుట కొఱకు తమకు గల సుజ్ఞానమనెడి కాటుకనలమిన పుల్లను అంతః చక్షువులకు పులిమి తద్వారా విజ్ఞానమనే దృష్టిని కలిగించే ప్రజ్ఞాన్వితులు గురువులు. అట్టి గురువులకు నమస్కరించెదను.
శ్లో:-
లక్ష్మీనాథ సమారం భాం-నాథయామున మధ్యమాం
అస్మదాచార్య పర్యంతాం- వందేగురు పరంపరాం.
క:-
లక్ష్మీ నాధుఁడు మొదలుగ
నూ, క్ష్మాజ సునాధయామునుఁడు మధ్యముగా,
సూక్ష్మజ్ఞుల మద్గురువుల
నీక్ష్మాస్థలి  నేడు కొలిచె దే కడు భక్తిన్.
భావము:-
లక్ష్మీ నాధుఁడు మొదలుగా మధ్యమ సునాధ యామునుఁడుతో పాటు నేటి సదసద్జ్ఞులగు గురు పరంపరకు భక్తితో నమస్కరించు చున్నాను.
పరమ పవిత్రమైన గురు పూర్ణిమ సందర్భంగా ఆంధ్రామృత పాఠకులకు, సద్గురువులకు శుభాభినందనలు తెలియ జేస్తున్నాను.
జైశ్రీరామ్.
జైహింద్.

Thursday, July 7, 2011

రామ కృష్ణ విలోమ కావ్యంలో గల పాద భ్రమక శ్లోకము.

ఆంధ్రామృతం ఎంత గ్రోలినా ఇంకా గ్రోలాలనే ఉత్కంఠతో ఉన్న సాహితీ బంధువులారా! ఆంధ్రామృత మహా సాగరంలో వెతికిన కొద్దీ అద్భుతమైన ఆణి ముత్యాలు దొరుకుతూనే ఉంటాయి. 
ఇప్పుడు రామ కృష్ణ విలోమ కావ్యం లోని ఒక అద్భుతమైన పాద భ్రమక శ్లోకం చూద్దాం.
క్రీ.శ.14. వాడైన దైవజ్ఞ సూర్య తన రామ కృష్ణ విలోమ కావ్యంలో వ్రాయఁబడిన పాద భ్రమక శ్లోకం ఈ క్రింది విధంగా ఉంది.
తాం భూసుతా ముక్తిముదార హాసం.
వందే యతో లవ్య భవం దయా శ్రీ.
భావము:-
చిఱు నవ్వులు చిందించే లవుని ప్రేమించే దయ గల లక్ష్మి ఐన ఆ సీతా మాతకు నమస్కరించు చున్నాను.
అదే శ్లోకం చివరి నుండి మొదటి వరకు చదివితే అది గీతా ప్రాశస్త్యాన్ని తెలియ జేసే శ్లోకమైంది. ఇది ఎంత అద్భుత సాహితీ ప్రక్రియో చూడండి. ఇతర భాషలలో ఊహకు కూడా అందని సాహితీ సంపద అచ్చంగా  మన సొంతం. ఇక చదవండి ఆ శ్లోకాన్ని కూడా.
శ్రీ యాదవం భవ్య లతోయదేవం 
సంహార దా ముక్తి ముతా సుభూతాం.
భావము:-
మంగళప్రదమైన ఆకర్షణ గలవాడైన  శ్రీ కృష్ణుని గీతా బోధ చెడుని సంహరిస్తూ ప్రాణప్రదమైనది.
చూచారా! దైవజ్ఞ సూర్య కవి తన రామ కృష్ణ విలోమ కావ్యంలో తన మేథాశక్తి నెంతగా ఉపయోగించి, అనంత భావనా సాహితీ విను వీధుల్లో మనలను విహరింప జేసాడో! ఆలోచించే మనసు, తెలుసుకోవాలనే జిజ్ఞాస ఉండాలే కాని, ఎన్ని లేవండి మనం తెలుసుకోవడానికి! అవకాశం దొరికినప్పుడు మరొక పర్యాయం కలుకుందాం. అంతవరకూ సెలవా?
అన్నట్టు ఈ శ్లోకాన్ని ముందునుండి వెనుకకు, వెనుక నుండి ముందుకి చదవడమే కాదండోయ్! కంఠస్థము చేసెయ్యాలన్న మాట మరువకండీ? నమస్తే.
జీశ్రీరాం.
జైహింద్.

Monday, July 4, 2011

చెప్పుకోండి చూద్దాం. ( గూఢోత్తరము అనే పద్య రచనా ప్రక్రియ )


సాహితీ ప్రియులారా!
ఈ క్రింది శ్లోకములో గల ప్రశ్నకు సమాధానం చెప్ప గలరా?
స సర్వ బుధ గీర్మాన్యః  పరారిర్భృత్య రాజ్యదః.
మాయీమేశం కం సు శబ్దం రక్షణం సువ్రతో జగౌ?
సమాధానం మీరు చెప్ప గలరని నాకు తెలుసు.

ఒక వేళ చెప్పలేమని అనిపిస్తే  శ్లోకారంభం నుండి బేసి అక్షరాలన్నిటినీ కలిపి చూడండి. మీరు చెప్ప వలసిన సమాధానం లభిస్తుంది.
బాగుందా? మీ అభిప్రాయం వ్యక్తం చేసే హక్కుతో పాటు, చక్కని సూచనలనివ్వ వలసిన బాధ్యత కూడా మీపై ఉందని మరువకండి. మీ దృష్టిలో గల ఇటువంటి చమత్కార భరిత పద్యాలను ఆంధ్రామృతం ద్వారా పాఠకులకందించడం కోసం వ్యాఖ్య ద్వారా పంపంపండి. ధన్యవాదములు.
జై శ్రీరాం.
జైహింద్.

Sunday, July 3, 2011

వల్లభ వఝల వారి అవ్యాజానురాగం.

ఆంధ్రామృతాన్ని అవలొకిస్తున్న శ్రీమాన్ వల్లభవఝల నరసింహ మూర్తి గారు.
ఈ రోజెంతో సుదినం.
సహృదయులు శ్రీమాన్ వల్లభ వఝల నరసింహ మూర్తి కవిగారు మియాపూర్ లో మాయింతికి వచ్చి మమ్ములనాశీర్వదించారు.( ఫొటోలో  వెనుకనున్నది వారి జ్యేష్ట పుత్రుఁడు శేషగిరి )
వారెంతో శ్రమ దమాదులకోర్చి మాయింటికి రావడం నిజంగా మా అదృష్టం గా భావిస్తున్నాను.
వీరు ప్రఖ్యాత జ్యోతిశ్శాస్త్రవేత్తే కాదు. కవి కూడాను.
వీరు అనేకమైన బంధకవిత్వాలను ఆంధ్రామృతం ద్వారా అవగాహన చేసుకొని, అద్భుతంగా వ్రాసి మన ఆంధ్రామృతంలోనే ప్రకటించిన విషయం పాఠకులకు విదితమే.
వారి అవ్యాజ కరుణానురాగాలకు నా హృదయ పూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
జైశ్రీరాం.
జైహింద్.