Thursday, April 17, 2025

సౌందర్యలహరి 11-15పద్యాలు. రచన శ్రీ చింతా రామకృష్ణారావుగారు, సంగీతం, గానం...

జైశ్రీరామ్.
11 వ శ్లోకము.  
చతుర్భిశ్శ్రీకంఠైశ్శివయువతిభిః పంచభిరపి
ప్రభిన్నాభిశ్శంభోర్నవభిరపి మూలప్రకృతిభిః |
చతుశ్చత్వారింశద్వసుదల కలాశ్ర త్రివలయ-
త్రిరేఖాభిస్సార్ధం తవ శరణకోణాః పరిణతాః || 
పదచ్ఛేదము.
చతుర్భిః - శ్రీకంఠైః - శివయువతిభిః - పంచభిః - అపి -
ప్రభిన్నాభిః - శంభోః - నవభిః - అపి - మూలప్రకృతిభిః -
చతుశ్చత్వారింశత్ -  వసుదల - కలాశ్ర  త్రివలయ-
త్రిరేఖాభిః - సార్ధమ్ - తవ - శరణ - కోణాః - పరిణతాః.
అన్వయక్రమము.
చతుర్భిః, శ్రీ కంఠైః, శంభోః, ప్రభిన్నాభిః, పంచభిః అపి, శివయువతిభిః, నవభిః, మూల ప్రకృతిభిః అపి, తవ, శరణ, కోణాః, వసుదళ, కలాశ్ర, త్రివలయ, త్రిరేఖాభిః సార్ధమ్, పరిణతాః, చతుశ్చత్వారింశత్‌. 
పద్యము.
సీ.  శ్రీచక్రమది నాల్గు శివచక్రములు, వాటి నుండియే విడివడి యున్న శక్తి
చక్రమ్ము లైదుతోఁ జక్కఁగ నున్నట్టి, సృష్టికి మూలమై చెలగుచున్న
తత్త్వమ్ముతోఁ గూడి తనరు నీ వాసమౌ శ్రీచక్రమందలి చెలగు కోణ
ములనష్టదళముల నలపద్మషోడశమును మేఖలాతంత్రముగను, మూడు
తే.గీ.  భూపురములును కలిసిన మొత్తమటుల
నలుబదియు నాలుగంచులు కలిగి యుండె
నమ్మ నీవాసమపురూపమైనదమ్మ!
నెమ్మి నిన్ను నేఁ బూజింతునమ్మ నమ్మి. ॥ 11 ॥
ప్రతిపదార్థము.  
(హే భగవతి = ఓ జననీ!)
చతుర్భిః = నలుగురైన, 
శ్రీ కంఠైః = శివులచేతను, 
శంభోః = శివుని కంటె 
ప్రభిన్నాభిః = వేరైన, 
పంచభిః అపి = ఐదుగురైన, 
శివయువతిభిః= శివశక్తుల చేతను, 
నవభిః = తొమ్మిదిఐన, 
మూల ప్రకృతిభిః అపి = మూల కారణముల చేతను, 
తవ = నీ యొక్క, 
శరణ = నిలయమగు శ్రీ చక్రము యొక్క, 
కోణాః = కోణములు, 
వసుదల = ఎనిమిది దళముల చేతను, 
కలాశ్ర = పదునాఱు దళముల చేతను, 
త్రివలయ = మూడు మేఖలల (వర్తుల రేఖల) చేతను, 
త్రిరేఖాభిఃసార్ధమ్ = మూడు భూపుర రేఖల చేతను, 
పరిణతాః = పరిణామమును పొందినవై, 
చతుశ్చత్వారింశత్‌ = నలుబది నాలుగు అగుచున్నవి. 
భావము. 
తల్లీ! నాలుగు శివకోణములు, తద్భిన్నములైన అయిదు శక్తికోణములు, తొమ్మిది మూల ప్రకృతులతోనూ, అష్టదళ పద్మము, షోడశదళ పద్మము, మేఖలాత్రయము, భూపురత్రయములతో నీవుండే శ్రీచక్రము 44 త్రికోణములతో అలరారుచున్నది.

12 వ శ్లోకము.  
త్వదీయం సౌందర్యం తుహినగిరికన్యే తులయితుం
కవీంద్రాః కల్పంతే కథమపి విరించి ప్రభృతయః |
యదాలోకౌత్సుక్యాదమరలలనా యాంతి మనసా
తపోభిర్దుష్ప్రాపామపి గిరిశ సాయుజ్య పదవీమ్ || 
పదచ్ఛేదము.
త్వదీయమ్ -  సౌందర్యమ్ -  తుహినగిరికన్యే -  తులయితుమ్ -
కవీంద్రాః - కల్పంతే - కథమ్ అపి -  విరించి ప్రభృతయః -
యత్ - ఆలోక - ఉత్సుక్యాత్ -  అమరలలనా - యాంతి - మనసా
తపోభిః - దుష్ప్రాపామ్ - అపి - గిరిశ - సాయుజ్య - పదవీమ్.
అన్వయక్రమము.
తుహిన గిరికన్యే! త్వదీయమ్, సౌందర్యమ్, తులయితుమ్, విరించి ప్రభృతయః, కవీంద్రాః, కథమపి, కల్పంతే, యత్‌, ఆలోక, ఔత్సుక్యాత్‌, అమర లలనాః, తపోభిః, దుష్ప్రాపామ్ అపి, గిరిశ, సాయుజ్య,  పదవీమ్, మనసా, యాంతి. 
పద్యము.
శా. నీ సౌందర్యము పోల్పఁ జాలరు భవానీ! బ్రహ్మసుత్రాములున్,
నీ సౌందర్యము గాంచి యప్సరసలున్ నిన్బోలలేనందునన్
ధ్యాసన్నిల్పి మహేశ్వరున్ మనములన్ ధ్యానించి తాదాత్మ్యతన్
భాసింపంగను జూతురైక్యమగుచున్, భక్తిప్రదా! శాంభవీ! ॥ 12 ॥
ప్రతిపదార్థము.  
తుహిన గిరికన్యే = ఓ పార్వతీ! 
త్వదీయమ్ = నీ యొక్క 
సౌందర్యమ్ = అందచందములను, 
తులయితుమ్ = ఉపమానములతో సరిపోల్చి చెప్పుటకు, 
విరించి ప్రభృతయః = బ్రహ్మమున్నగు, 
కవీంద్రాః = కవిశ్రేష్ఠులు సైతము, 
కథమపి = ఏ విధముగను 
కల్పంతే = సమర్థులు కాకున్నారు 
యత్‌ = ఏ కారణము వలన అనగా 
ఆలోక = నీ సౌందర్యమును చూచుట యందలి 
ఔత్సుక్యాత్‌ = కుతూహలము వలన 
అమర లలనాః = దేవతా స్త్రీలు,
తపోభిః = నియమనిష్టలతో తపస్సు చేసి గూడ, 
దుష్ప్రాపాం అపి = పొంద శక్యము కానిదైనను, 
గిరిశ = శివునితో
సాయుజ్య = సాయుజ్యము, 
పదవీమ్ = పదవిని,
మనసా = మనస్సుచేత, 
యాంతి = పొందుచున్నారు. 
భావము. 
అమ్మా! బ్రహ్మ విష్ణు ఇంద్రాది కవీంద్రులు కూడా ఎంత ప్రయత్నించినా నీ దేహ సౌందర్యముకు సాటి చెప్పలేకపోతున్నారు. దేవతా స్త్రీలు, అప్సరసలు నీ సౌందర్యము చూచుటకు కుతూహలము కలవారై, నీ అందముతో సాటిరాని వారై, కఠిన తపస్సులచే కూడా పొందలేని శివసాయుజ్యమును మనస్సుచే పొందుతున్నారు.

13 వ శ్లోకము.  
నరం వర్షీయాంసం నయన విరసం నర్మసుజడం
తవాపాంగాలోకే పతిత మనుధావంతి శతశః |
గలద్వేణీబంధాః కుచకలశ విస్రస్త సిచయాః
హటాత్ త్రుట్యత్కాఞ్చ్యో విగళిత దుకూలా యువతయః || 
పదచ్ఛేదము.
నరం - వర్షీయాంసం - నయన విరసం  - నర్మసు - జడం -
తవ - అపాంగ - ఆలోకే  - పతితమ్ - అనుధావంతి - శతశః |
గలత్ -  వేణీ బంధాః  - కుచ కలశ - విస్రస్త - సిచయాః - 
హటాత్ -  త్రుట్యత్ - కాఞ్చ్యః -  విగళిత - దుకూలా - యువతయః.
అన్వయక్రమము.
వర్షీయాంసమ్, నయన విరసమ్, నర్మసు, జడమ్, తవ, అపాంగ ఆలోకే, నరమ్, యువతయః, గళత్,  వేణీ, బంధాః, కుచకలశ, విస్రస్త, సిచయాః, హఠాత్‌, త్రుట్యత్, కాఞ్చ్యః, విగళిత, దుకూలాః, శతశః, అనుధావంతి. 
పద్యము.
శా.  కన్నుల్ కాంతి విహీనమై , జడుఁడునై, కాలంబె తాఁ జెల్లెనం
చెన్నంజాలిన వానిపైన బడినన్ హృద్యంపు నీ చూపహో!
కన్నెల్ చూడగ నెంచి వానిని మదిన్ గాంక్షించుచున్ బయ్యెదల్
క్రన్నన్ జారఁగ, నీవి, మేఖలలు జారన్, వెన్దవుల్చుందురే ॥ 13 ॥
ప్రతిపదార్థము.  
(హే భగవతి! = ఓ అమ్మా!)
వర్షీయాంసమ్ = మిక్కిలి ముసలివాడైనను,
నయన విరసమ్ = వికారమును గొలుపు కన్నులు గలవాడైనను, 
నర్మసు = ప్రణయకామకేళీ విలాసాదుల యందు 
జడమ్ = మందుడైనను, 
తవ = నీ యొక్క, 
అపాంగాలోకే = క్రీగంటి అనుగ్రహ వీక్షణమునకు పాత్రమైన, 
నరమ్ = మనుష్యుని (అతడు మన్మథుని వలె కనబడి) చూచి, 
యువతయః = యువతులు, 
గళత్ = జాఱుచున్న, (విడివడుచున్న) 
వేణీ = జడల యొక్క 
బంధాః = ముడులు కలవారై; 
కుచకలశ = కడవల వంటి స్తనములపై నుండి, 
విస్రస్త = జాఱిపోయిన, 
సిచయాః = పైట కొంగులు గల వారై, 
హఠాత్‌ = ఆకస్మికముగా, 
త్రుట్యత్ = తెగివిడిపోయిన 
కాఞ్చ్యః = మొలనూళ్ళు గలవారై, 
విగళిత = వీడిపోయిన 
దుకూలాః = పోకముడులు కలవారై; 
శతశః = వందలకొలది, 
అనుధావంతి = అనుసరించి వెంట పరుగెత్తుచుండిరి.   
భావము. 
తల్లీ! నీ క్రీగంటి చూపుపడిన మానవుడు, అతడు కురూపియైనా, ముదుసలి అయినా, సరసమెరుగని వాడయినా, అలాంటి వాడిని చూసి- మహా మోహముతో కొప్పులు వీడిపోవగా, పైట చెంగులు జారిపోవగా, గజ్జెలమొలనూళ్ళు తెగిపోవగా, ప్రాయములో ఉన్న వందల కొద్దీ స్త్రీలు అతని వెంటపడతారు. అంటే అమ్మవారి అనుగ్రహము అట్టి కురూపిని కూడా మన్మథుని వంటి అందగాడిని చేయునని భావం.

14 వ శ్లోకము.  
క్షితౌ షట్పఞ్చాశద్ ద్విసమధిక పఞ్చాశదుదకే
హుతాశే ద్వాషష్టి శ్చతురధిక పఞ్చాశ దనిలే |
దివి ద్విష్షట్ త్రింశన్మనసి చ చతుష్షష్టిరితి యే
మయూఖాస్తేషామప్యుపరి తవ పాదాంబుజయుగమ్ || 
పదచ్ఛేదము.
క్షితౌ - షట్పఞ్చాశత్ - ద్విసమధిక - పఞ్చాశత్ - ఉదకే
హుతాశే - ద్వాషష్టిః - చతుః - అధిక - పఞ్చాశత్ - అనిలే -
దివి - ద్విః షట్ త్రింశత్ -  మనసి చ - చతుః షష్టిః - ఇతి - యే
మయూఖాః - తేషామ్ -  అపి -  ఉపరి - తవ - పాద - అంబుజ యుగమ్.
అన్వయక్రమము.
క్షితౌ, షట్‌పఞ్చాశత్‌, ఉదకే, ద్వి సమధిక పఞ్చాశత్‌, హుతాశే, ద్వాషష్టిః, అనిలే, చతురధిక పఞ్చాశత్‌, దివి, ద్విః షట్‌ త్రింశత్‌, మనసిచ, చతుష్షష్టిః, ఇతి, యే మయూఖాః, తేషాం అపి, ఉపరి, తవ, పాదాంబుజయుగమ్‌.
పద్యము.
సీ.  భూతత్త్వముననొప్పి, పూజ్య మూలాధార మున నేబదారు కిరణములుండ,
జలతత్త్వముననున్న చక్కని మణిపూరమున నేబదియు రెండు ఘనతనుండ,
నగ్నితత్త్వంబుననలరి స్వాధిష్ఠానమున నరువదిరెండు ప్రణుతినుండ,
వాయుతత్త్వముతోడ వరలు ననాహత మందేబదియునాల్గు,  ననితరమగు
నాకాశ తత్త్వాన నల విశుద్ధమునందు డెబ్బదిరెండు ఘటిల్లి యుండ,
మానస తత్త్వాన మసలు నాజ్ఞాచక్రమున నరువదినాల్గు వినుతినొప్ప
తే.గీ.  నట్టి వాని సహస్రారమందునున్న
బైందవ స్థానమున నీదు పాదపంక
జయుగ మొప్పి యుండును దేజసంబు తోడ,
నట్టి నిన్ గొల్తునమ్మరో! యనుపమముగ. ॥ 14 ॥
ప్రతిపదార్థము.  
(హే భగవతి! = ఓ జననీ!)
క్షితౌ = పృథివీ తత్త్వమునకు చెందిన మూలాధార చక్రమునందు, 
షట్‌పఞ్చాశత్‌ = ఏబది యారు, 
ఉదకే = జలతత్త్వమునకు చెందిన మణిపూర చక్రమునందు, 
ద్వి సమధిక పఞ్చాశత్‌ = ఏబది రెండును, 
హుతాశే = అగ్నితత్త్వమునకు చెందిన స్వాధిష్ఠాన చక్రమునందు, 
ద్వాషష్టిః = అరువది రెండును, 
అనిలే = వాయు తత్త్యమునకు చెందిన అనాహత చక్రమునందు, 
చతురధిక పఞ్చాశత్‌ = ఏబది నాలుగును, 
దివి = అకాశతత్త్వమునకు చెందిన విశుద్ధి చక్రమునందు, 
ద్విః షట్‌ త్రింశత్‌ = డెబ్బది రెండును, 
మనసిచ = మనస్తత్వమునకు చెందిన ఆజ్ఞా చక్రము నందు, 
చతుష్షష్టిః = అరువదినాలుగును, 
ఇతి = ఈ విధముగా, 
యే మయూఖాః = ఏ కిరణములున్నవో, 
తేషాం అపి = వాటి అన్నిటికిని గూడ, 
ఉపరి = పై భాగమున, 
తవ = నీ యొక్క, 
పాదాంబుజయుగమ్‌ = చరణ కమలముల జంటవర్తించును. 
భావము. 
ఓ దేవీ! మూలాధారము పృథ్వీతత్త్వముతో కూడినది. అందు కాంతి కిరణములు 56. మణిపూరకము జలతత్త్వముతో కూడినది. అందు కాంతి కిరణములు 52. స్వాధిష్ఠానము అగ్నితత్త్వాత్మకము. అందు కిరణములు 62. అనాహతము వాయుతత్త్వాత్మకము, అందు కిరణములు 54. విశుద్ధిచక్రము ఆకాశతత్త్వాత్మకము. అందలి మయూఖములు 72. మనస్తత్త్వాత్మకమగు ఆజ్ఞాచక్రమునందు కిరణములు 64. ఈ వెలుగు కిరణములన్నింటినీ అధిగమించి, వాటి పైన నీ చరణ కమలములు ప్రకాశించుచున్నవి.

15 వ శ్లోకము.  
శరజ్జ్యోత్స్నా శుద్ధాం శశియుత జటాజూట మకుటాం
వర త్రాస త్రాణ స్ఫటికఘుటికా పుస్తక కరామ్ |
సకృన్నత్వా న త్వా కథమివ సతాం సన్నిదధతే
మధు క్షీర ద్రాక్షా మధురిమ ధురీణాః ఫణితయః || 
పదచ్ఛేదము.
శరత్ జ్యోత్స్నా - శుద్ధామ్ - శశి యుత - జటాజూట - మకుటామ్ -
వర - త్రాస - త్రాణ - స్ఫటిక - ఘుటికా - పుస్తక - కరామ్ -
సకృత్ - నత్వా - న - త్వా - కథమ్ - ఇవ - సతామ్ - సన్నిదధతే -
మధు - క్షీర - ద్రాక్షా - మధురిమ - ధురీణాః - ఫణితయః.
అన్వయక్రమము.
శరత్‌, జ్యోత్స్నా, శుద్ధామ్,  శశియుత, జటాజూట, మకుటామ్, వర, త్రాసత్రాణ, స్ఫటిక ఘుటికా, పుస్తక, కరామ్, త్వా, సకృత్‌, నత్వా,  సతామ్, మధు, క్షీర, ద్రాక్షా, మధురిమ, ధురీణాః, ఫణితయః, కథమివ,  న - సన్నిదధతే.
పద్యము.
సీ.  శరదిందు చంద్రికల్ సరితూగునంతటి నిర్మలదేహంపు నెలతవీవు,
పిల్ల జాబిలి తోడనల్ల జడలతోడ, నుతకిరీటమునొప్పు నతివవీవు,
కోరికల్ తీర్చెడి తీరైన వరముద్ర, భయమును బాపు నభయపు ముద్ర,
స్ఫటిక మాలను దాల్చి, సన్నుతంబుగ దివ్య పుస్తకంబును దాల్చి నిస్తులవయి
తే.గీ.  యొప్పు నీకు వందనములు గొప్పగాను
జేయు సజ్జనులకునబ్బు శ్రీకరముగ
మధువు, గోక్షీర, ఫలరస మాధురులను
మించు వాగ్ధాటి భువిపైన మేల్తరముగ. ॥ 15 ॥ 
ప్రతిపదార్థము.  
(హే భగవతి! = ఓ జననీ!)
శరత్‌ = శరత్కాలపు 
జ్యోత్స్నా = వెన్నెలవలె, 
శుద్ధామ్ = నిర్మలమైనదియు,  
శశియుత = నెలవంకరేఖను కూడినదియు నయిన, 
జటాజూట = జుట్టు ముడి అనెడి, 
మకుటామ్ = కిరీటము గలదియు, 
వర = వరద ముద్రను, 
త్రాసత్రాణ = అభయముద్రయు, 
స్ఫటిక ఘుటికా = స్ఫటికములతో కూర్చడిన అక్షమాలయు, 
పుస్తక = పుస్తకమును, 
కరామ్ = హస్తములందు గలిగినదానిగా, 
త్వా = నిన్ను, 
సకృత్‌ = ఒక్కమాఱు అయినను, 
నత్వా = నమస్కరించిన, 
సతామ్ = బుద్ధిమంతులకు, 
మధు = తేనె, 
క్షీర = పాలు, 
ద్రాక్షా = ద్రాక్షా ఫలముల, 
మధురిమ = తీయదనమును, 
ధురీణాః = వహించి యున్న మధురాతిమధురమైన,
ఫణితయః = వాగ్విలాస వైఖరులు, 
కథమివ = ఎట్లు, 
న - సన్నిదధతే = ప్రాప్తించకుండా ఉండును? 
భావము. 
తల్లీ! శరత్కాలపు వెన్నెలవలె శుద్ధమైన తెల్లని కాంతి కలిగినట్టి, చంద్రునితో కూడిన జటాజూటమే కిరీటముగా కలిగినట్టి, వరదాభయ ముద్రలను, స్ఫటిక మాలా పుస్తకములను నాలుగు చేతులలో ధరించి ఉన్న నీకు, ఒకసారైనా నమస్కరించక సజ్జనులు, కవులు తేనె, పాలు, ద్రాక్ష పండ్లయొక్క మాధుర్యము నిండి యున్న వాక్కులను ఎలా పొందగలరు?
జైహింద్.

No comments: