జైశ్రీరామ్.
51 వ శ్లోకము.
శివే శృంగారార్ద్రా తదితరజనే కుత్సనపరా
సరోషా గంగాయాం గిరిశచరితే విస్మయవతీ |
హరాహిభ్యో భీతా సరసిరుహ సౌభాగ్యజయినీ
సఖీషు స్మేరా తే మయి జనని దృష్టిస్సకరుణా ||
పదచ్ఛేదము.
శివే - శృంగార - ఆర్ద్రా - తత్ - ఇతర - జనే - కుత్సనపరా -
స రోషా - గంగాయామ్ - గిరిశ - చరితే - విస్మయవతీ -
హర - అహిభ్యః - భీతా - సరసిరుహ - సౌభాగ్య - జయినీ -
సఖీషు - స్మేరా - తే - మయి - జనని - దృష్టిః - సకరుణా.
అన్వయక్రమము.
జనని, తే, దృష్టిః, శివే, శృంగార, ఆర్ద్రా, తత్ + ఇతరజనే, కుత్సనపరా, గంగాయామ్, సరోషా, గిరిశ, చరితే, విస్మయవతీ, హర, అహిభ్యః, భీతా, సరసిరుహ, సౌభాగ్య, జయినీ, సఖీషు, స్మేరా, మయి, కరుణా.
పద్యము.
ఉ. సారస నేత్ర! నీ కనులు శర్వునెడన్ గురిపించు దివ్య శృం
గారము, నారడిన్ గొలుపుఁగల్మషులందు, భయానకంబు సం
చార భుజంగ భూషలన, స్వర్ఝరిపైన ననన్యరోషమున్,
గోరుచు నా పయిన్ గరుణ, గోపతి గాథలకద్భుతంబు నా
వీరము పద్మరోచులను, విస్తృత హాసము మిత్రపాళికిన్,
జేరఁగ వచ్చు భక్తులకు శ్రీలను గొల్పుచు నొప్పుచుండెనే. ॥ 51 ॥
ప్రతిపదార్థము.
జనని = ఓ జగజ్జననీ,
తే = నీ యొక్క,
దృష్టిః = చూపు,
శివే = సదాశివుని యందు,
శృంగార = శృంగార రసముచేత,
ఆర్ద్రా = తడుపబడినదియు,
తత్ + ఇతర జనే = ఆ సదాశివుని కంటె ఇతరులైన జనుల విషయమై,
కుత్సనపరా = ఏవగింపు కలదియు,
గంగాయామ్ = సపత్నిగా నెంచఁబడు గంగవిషయమున,
సరోషా = రౌద్రరసముతో గూడినదియు,
గిరిశ = శివుని యొక్క,
చరితే = నడవడి విషయమున,
విస్మయవతీ = అద్భుత రసము గలదియు,
హర = శివుడు ధరించిన,
అహిభ్యః = సర్పముల వలన,
భీతా = భయానక రసావేశము గలదియు,
సరసిరుహ = కమలము యొక్క,
సౌభాగ్య = సౌందర్యమును,
జయినీ = జయించిన విషయమున వీరరసముతో గూడినదియు,
సఖీషు = చెలుల యందు,
స్మేరా = చిఱునగవుతోఁ గూడిన హాస్య రసము గలదియు,
మయి = నా యందు;
కరుణా = అనుగ్రహము వలన కరుణ రసము గలిగినదయునయి ఒప్పుచుండెను.
భావము.
తల్లీ! జగజ్జననీ! నీ యొక్క చూపు –నీ పతి అయిన శివునియందు శృంగార రసమును,శివేతర జనులయందు అయిష్ట, పరాణ్ముఖత్వములతో బీభత్సరసమును, గంగ యెడల రోషముతో రౌద్రరసమును,శివుని చరిత్రను వినుచున్నపుడు అద్భుతరసమును,శివుడు ధరించెడి సర్పముల యెడ భయానకరసమును,
ఎఱ్ఱతామర వర్ణ ప్రకాశముల యెడ జయించిన భావము పొడ సూపు వీరరసమును,నీ సఖురాండ్ర యెడల హాస్యరసమును,
నా యెడల కరుణ రసమును,మామూలుగానున్నప్పుడు శాంతరసమును పొందుచు నవరసాత్మకముగా నుండును.
52 వ శ్లోకము.
గతే కర్ణాభ్యర్ణం గరుత ఇవ పక్ష్మాణి దధతీ
పురాం భేత్తుశ్చిత్తప్రశమరసవిద్రావణ ఫలే |
ఇమే నేత్రే గోత్రాధరపతి కులోత్తంస కలికే
తవాకర్ణాకృష్ట స్మరశర విలాసం కలయతః ||
పదచ్ఛేదము.
గతే - కర్ణ - అభ్యర్ణమ్ - గరుత - ఇవ - పక్ష్మాణి - దధతీ -
పురామ్ - భేత్తుః - చిత్త - ప్రశమ - రస - విద్రావణ - ఫలే -
ఇమే - నేత్రే - గోత్రా ధర పతి - కులోత్తంస - కలికే -
తవ - ఆకర్ణ - ఆకృష్ట - స్మర - శర - విలాసమ్ - కలయతః..
అన్వయక్రమము.
గోత్రాధరపతికుల + ఉత్తంస, కలికే, ఇమే, తవ, నేత్రే, కర్ణ + అభ్యర్ణమ్, గతే, పక్ష్మాణి, గరుత ఇవ,దధతీ, పురామ్, భేత్తుః, చిత్తే, ప్రశమ రస, విద్రావేణ, ఫలే, ఆ కర్ణ, ఆకృష్ట, స్మర శర, విలాసమ్, కలయతః.
పద్యము.
సీ. గిరిరాజకన్యకా! పరికింపగా నీదు కర్ణాంతమున్నట్టి కంటి చూపు
మదను నారవబాణ మహిమతోనొప్పుచుఁ ద్రిపురాసురాంతకు దివ్యమతిని
శృంగార భావనల్ చెలగునట్లుగఁ జేయు చున్నదో జగదంబ! మన్ననముగ,
బలశాలియౌ శివున్ బలహీనునిగఁ జేసె మానసమందున మరులు కొలిపి,
తే.గీ. కరుణకాకరంబైనట్టి కనులు నీవి
భక్తపాళినిఁ గాపాడు శక్తి కలవి,
నేను నీ భక్తుఁడను, గృపన్ నీవు నన్నుఁ
గరుణఁ జూచుచున్ గాపాడు కమల నయన! ॥ 52 ॥
ప్రతిపదార్థము.
గోత్రాధరపతికుల + ఉత్తంస = భూమిని ధరించు పర్వతరాజ వంశమునకు సిగను ధరించు పువ్వు మొగ్గ అయిన,
కలికే ! = ఓ పార్వతీ,
ఇమే = ఈ నా హృదయకమలమందు,
తవ = నీ యొక్క,
నేత్రే= కన్నులు,
కర్ణ + అభ్యర్ణమ్ = చెవుల సమీపమును,
గతే = పొందినవై,
పక్ష్మాణి = కనుఱెప్ప వెంట్రుకలను,
గరుత ఇవ = ఈఁకలవలె,
దధతీ = ధరించుచున్నవై,
పురామ్ = త్రిపురములను,
భేత్తుః = భేదించిన వాడైన శివుని యొక్క,
చిత్తే = మనస్సునందు,
ప్రశమ రస = (మనోవికారము పుట్టించుటద్వారా) శాంతమును,
విద్రావేణ = పారద్రోలుటయే,
ఫలే = ప్రయోజనముగా గలవియై,
ఆ కర్ణ = చెవుల వరకు,
ఆకృష్ట = ఆకర్షింపబడిన,
స్మర శర = మన్మథుని బాణముల యొక్క,
విలాసమ్ = సొగసును,
కలయతః = చేయుచున్నట్లు భాసించుచున్నది.
భావము.
భూమిని ధరించు పర్వత రాజైన హిమవంతుని వంశమునకు సిగను ధరించు పూమొగ్గ అయిన ఓ పార్వతీ ! చెవుల వరకూ సాగు నీ కనుఱెప్పల తీరు చూచుచున్నపుడు, నా మనస్సునకు ఈ విధముగా అనిపిస్తున్నది. బాణములకిరు ప్రక్కల కట్టు గ్రద్ద ఈకలవలె నుండు ఱెప్ప వెంట్రుకలతో- చెవుల వరకు సాగు నీ నేత్రములలో – త్రిపుర హరుని మనస్సునకు ప్రాప్తించిన శాంతమైన నిస్పృహను పోగొట్టి, మోహమును కలిగించుటయే ప్రయోజనముగా గలవియై, ఆకర్ణాంతము లాగబడిన – మన్మథుని బాణముల సౌందర్యము గోచరించుచున్నది.
53 వ శ్లోకము.
విభక్త త్రైవర్ణ్యం వ్యతికరిత లీలాంజనతయా
విభాతి త్వన్నేత్ర త్రితయ మిదమీశానదయితే |
పునః స్రష్టుం దేవాన్ ద్రుహిణ హరి రుద్రానుపరతాన్
రజః సత్వం బిభ్రత్ తమ ఇతి గుణానాం త్రయమివ ||
పదచ్ఛేదము.
విభక్త - త్రైవర్ణ్యమ్ - వ్యతికరిత - లీలా - అంజనతయా -
విభాతి - త్వత్ - నేత్ర - త్రితయమ్ - ఇదమ్ - ఈశాన - దయితే -
పునః - స్రష్టుమ్ - దేవాన్ - ద్రుహిణ - హరి - రుద్రాన్ - ఉపరతాన్ -
రజః - సత్వమ్ - బిభ్రత్ - తమ - ఇతి - గుణానామ్ - త్రయమ్ - ఇవ.
అన్వయక్రమము.
ఈశాన దయితే, ఇదమ్, త్వత్, నేత్ర త్రితయమ్, వ్యతికరిత, లీలా, అంజనతయా, విభక్త, త్రైవర్ణ్యమ్, ఉపరతాన్, ద్రుహిణ హరి రుద్రాన్, దేవాన్, పునః, స్రష్టుమ్, రజః, సత్త్వమ్, తమః, ఇతి, గుణానామ్, త్రయం ఇవ, బిభ్రదివ, విభాతి.
పద్యము.
తే.గీ. అర్ధవలయ నేత్రత్రయ మమరె నీకు
మూడు వర్ణంబుల లయము పొందినట్టి
బ్రహ్మవిష్ణుమహేశులన్ వరలఁజేయ
త్రిగుణ తేజంబునొప్పెను త్రినయనములు. ॥ 53 ॥
ప్రతిపదార్థము.
ఈశానదయితే = మహాదేవుని ప్రియురాలివయిన ఓ జననీ,
ఇదమ్ = ఈ కనబడు,
త్వత్ = నీ యొక్క,
నేత్ర త్రితయమ్ = కన్నుల మూడింటి సమూహము,
వ్యతికరిత = పరస్పర మేళనముగా,
లీలా = లీలార్థమై పెట్టఁబడిన,
అంజనతయా = కాటుక గలిగినదగుట చేత,
విభక్త = వేఱుపరచఁబడిన,
త్రైవర్ణ్యమ్ = తెలుపు, నలుపు, ఎఱుపు అను మూడు వన్నెలు గలదై,
ఉపరతాన్ = ఆత్మ యందు లీనమైనవారగు,
ద్రుహిణ హరి రుద్రాన్ = బ్రహ్మ, విష్ణు, రుద్రుల ముగ్గుఱగు,
దేవాన్ = దేవులను,
పునః = మరల,
స్రష్టుమ్ = సృజించుట కొఱకు,
రజః = రజోగుణమును,
సత్త్వమ్ = సత్త్వ గుణమును,
తమః = తమోగుణమును,
ఇతి = అను,
గుణానామ్ = గుణముల యొక్క,
త్రయం ఇవ = మూడింటి వలె,
బిభ్రదివ = ధరించుచున్నట్లు,
విభాతి = ప్రకాశించుచున్నది.
భావము.
ఓ సదాశివుని ప్రియురాలా! నీ మూడు కన్నులు అర్ధవలయాకారముగా తీర్చినవై; లీలా విలాసార్థము ధరించిన కాటుక కలిగినదగుట చేత, ఒక దానితో ఒకటి కలసికొనని తెలుపు, నలుపు, ఎరుపు అను మూడు రంగులు కలదై; గత ప్రళయమునందు తన యందు లీనమైన బ్రహ్మ, విష్ణు, రుద్రులు అను త్రిమూర్తులను మరల మరల విశ్వ సృష్టికొరకు –రజస్సు, సత్త్వము, తమస్సు అను మూడు గుణములను ధరించు దాని వలె ప్రకాశించుచున్నవి.
54 వ శ్లోకము.
పవిత్రీకర్తుం నః పశుపతి పరాధీన హృదయే
దయామిత్రైర్నేత్రైరరుణ ధవళ శ్యామ రుచిభిః |
నదశ్శోణో గంగా తపనతనయేతి ధ్రువమయమ్
త్రయాణాం తీర్థానాముపనయసి సంభేదమనఘమ్ ||
పదచ్ఛేదము.
పవిత్రీ - కర్తుమ్ - నః - పశుపతి - పరాధీన - హృదయే -
దయా - మిత్రైః - నేత్రైః - అరుణ - ధవళ - శ్యామ - రుచిభిః -
నదః - శోణః - గంగా - తపన - తనయా - ఇతి - ధ్రువమ్, అయమ్ -
త్రయాణామ్ - తీర్థానామ్ - ఉపనయసి - సంభేదమ్ - అనఘమ్.
అన్వయక్రమము.
పశుపతి పరాధీన హృదయే, దయామిత్రైః, అరుణ ధవళ శ్యామ, రుచిభిః, నేత్రైః, శోణః నదః, గంగా, తపన తనయా, ఇతి, త్రయాణామ్, తీర్థానామ్, అనఘమ్, అయమ్, సంభేదమ్, నః, పవిత్రీ కర్తుమ్, ఉపనయసి, ధ్రువమ్ .
పద్యము.
శా. మమ్ముం జేయగ సత్ పవిత్రులుగ నమ్మా! సద్దయార్ద్రంపు శో
ణమ్మున్ శ్వేతము, కృష్ణమున్, గలుగు జ్ఞానంబిచ్చు నీ మూడు నే
త్రమ్ముల్ శోణను, గంగ నా యముననిద్ధాత్రిన్ గృపన్నొక్కెడన్
నెమ్మిన్ మూడగు తీర్థముల్ నిలిపితే, నిన్ గొల్వ నే నేర్తునే? ॥ 54 ॥
ప్రతిపదార్థము.
పశుపతి పరాధీన హృదయే ! = శివునికి అధీనమైన చిత్తము గల ఓ దేవీ!
దయామిత్రైః = దయతో గూడిన,
అరుణ ధవళ శ్యామ = ఎఱుపు, తెలుపు, నలుపు అను,
రుచిభిః = కాంతి గలవియైన,
నేత్రైః= నేత్రముల చేత,
శోణః నదః = శోణయను పేరు గల నదము,
గంగా = గంగానది,
తపన తనయా = సూర్యుని కూతురైన యమున,
ఇతి= అను,
త్రయాణామ్ = మూడుగా నున్న,
తీర్థానామ్ = పుణ్యతీర్థముల యొక్క,
అనఘమ్ = పాపములను పోగొట్టు జలము కలదైన,
అయమ్ = ఈ,
సంభేదమ్ = నదీ సంగమ స్థానమును,
నః = మమ్ములను,
పవిత్రీకర్తుమ్ = పవిత్రవంతముగా చేయుటకు,
ఉపనయసి = దగ్గఱకు చేర్చుచున్నావు,
ధ్రువమ్ = ఇది నిశ్చయము.
భావము.
శివాధీనమైన చిత్తము గల ఓ పార్వతీ! కరుణరసార్ద్రత వలన మృదుత్వమును, ఎరుపు, తెలువు, నలుపు అను మూడు వన్నెల వికాసమునుగల నీ నేత్రత్రయము చేత ఎరుపురంగు నీటితో ప్రవహించు ‘శోణ’యను నదము, తెల్లని నీటితో ప్రవహించు గంగానది, నల్లని నీటితో ప్రవహించు సూర్యపుత్రిక అయిన యమునానది – ఈ మూడు పుణ్య తీర్థములతో పాపములను పోగొట్టి అపవిత్రులను పావనులుగా చేయుటకు – వాటిని త్రివేణీ సంగమ స్థానముగా ఒక చోటకు చేర్చుచున్నావు.
55 వ శ్లోకము.
నిమేషోన్మేషాభ్యాం ప్రలయముదయం యాతి జగతీ
తవేత్యాహుస్సంతో ధరణిధరరాజన్యతనయే
త్వదున్మేషాజ్జాతం జగదిదమశేషం ప్రలయతః
పరిత్రాతుం శంకే పరిహృతనిమేషాస్తవ దృశః ||
పదచ్ఛేదము.
నిమేష - ఉన్మేషాభ్యామ్ - ప్రలయమ్ - ఉదయమ్ - యాతి - జగతీ -
తవ - ఇతి - ఆహుః - సంతః - ధరణి - ధర - రాజన్య - తనయే -
త్వత్ - ఉన్మేషా - జ్జాతమ్ - జగత్ - ఇదమ్ - అశేషమ్ - ప్రలయతః -
పరిత్రాతుమ్ - శంకే - పరిహృత - నిమేషాః - తవ - దృశః.
అన్వయక్రమము.
ధరణి ధర రాజన్య తనయే, తవ, నిమేష + ఉన్మేషాభ్యామ్, జగతీ, ప్రళయమ్, ఉదయమ్, యాతి, ఇతి, సంతః, ఆహుః, త్వత్, ఉన్మేషాత్, జాతమ్, అశేషమ్, ఇదం జగత్, ప్రళయతః, పరిత్రాతుమ్, తవ, దృశః, పరిహృత నిమేషాః, ఇతి, శంకే.
పద్యము.
కం. నీ కనులు మూసి తెరచిన
లోకమె ప్రళయంబునకును లోనగునమ్మా!
లోకప్రళయము నిలుపన్
నీ కనులను మూయవీవు నిత్యముగ సతీ! ॥ 55 ॥
ప్రతిపదార్థము.
ధరణి ధర రాజన్య తనయే = ఓ పర్వతరాజపుత్రివైన ఓ పార్వతీ,
తవ = నీ యొక్క,
నిమేష + ఉన్మేషాభ్యామ్ = కంటి ఱెప్పలు మూయుట చేతను, తెఱచుట చేతను,
జగతీ = జగత్తు,
ప్రళయమ్ = ప్రళయము యొక్క,
ఉదయమ్ = ఉద్భవమును,
యాతి = పొందును,
ఇతి = అని,
సంతః = సత్పురుషులు,
ఆహుః = చెప్పుదురు,
త్వత్ = ఆ,
ఉన్మేషాత్ = నీ కంటీ టెప్పలు తెరుచుట వలన,
జాతమ్ = ఉద్భవించిన,
అశేషమ్ = సమస్తమైన,
ఇదం జగత్ = ఈ జగత్తును,
ప్రళయతః = ప్రళయము నుండి,
పరిత్రాతుమ్ = రక్షించుట కొఱకు,
తవ = నీ యొక్క,
దృశః = కన్నులు,
పరిహృత నిమేషాః = తిరస్కరించిన రెప్పపాటులు గలవి,
ఇతి = అని,
శంకే = తలంచుదును.
భావము.
పర్వతరాజపుత్రికా, ఓ పార్వతీ ! నీ కనురెప్పలు మూసికొనుట చేత జగత్తుకు ప్రళయమును, రెప్పలు తెఱచుకొనుట చేత జగత్తుకు సృష్టియు ఉద్భవించునని సత్పురుషులు చెప్పుదురు. అందువలన నీ కనురెప్పలు తెఱచుట వలన ఉద్భవించిన యావజ్జగత్తును ప్రళయము నుండి రక్షించుట కొఱకు, నీ కన్నులు రెప్పపాటు లేక ఎప్పుడూ తెఱచుకొని ఉన్న స్థితిలోనే యున్నవని తలంచుచున్నాను.
జైహింద్.
No comments:
Post a Comment