జైశ్రీరామ్.
61 వ శ్లోకము.
అసౌ నాసావంశస్తుహినగిరివంశ ధ్వజపటి
త్వదీయో నేదీయః ఫలతు ఫలమస్మాకముచితమ్ |
వహత్యంతర్ముక్తాశ్శిశిరకర నిశ్వాస గళితం
సమృద్ధ్యా యత్తాసాం బహిరపి చ ముక్తామణి ధరః ||
పదచ్ఛేదము.
అసౌ - నాసా - వంశః - తుహిన - గిరి - వంశ - ధ్వజ - పటి -
త్వదీయః - నేదీయః - ఫలతు - ఫలమ్ - అస్మాకమ్ - ఉచితమ్ -
వహతి - అంతః - ముక్తాః - శిశిర - కర - నిశ్వాస - గళితమ్ -
సమృద్ధ్యా - యత్ - తాసామ్ - బహిః - అపి - చ - ముక్తా - మణి - ధరః.
అన్వయక్రమము.
తుహిన గిరి వంశ, ధ్వజ పటి, త్వదీయః, అసౌ, నాసా వంశః, శిశిరకర, నిశ్వాస, గళితాః, అంతః, ముక్తాః, వహంతి, యత్, తాసామ్, సమృద్ధ్యా, బహిః అపి, ముక్తామణి ధరః, సః, అస్మాకమ్, ఉచితమ్, నేదీయః, ఫలమ్, ఫలతు.
పద్యము.
చం. హిమగిరి వంశ కేతన! మహేశ్వరి! నీ దగు ఘ్రాణ వంశ మ
ద్ది మహిత సత్ఫలంబులిడు, దేవి! త్వదీయ కృపన్ గనంగ న
క్రము తన లోన నిందు వర రత్నముదాల్చుచు నిందునాడి మా
ర్గమున గమించుదానినె దగన్ బయటన్ ధరియించె గొప్పగన్. ॥ 61॥
(నక్రము=ముక్కు, ఇందు(వర)రత్నము=ముత్యము,ఇందు నాడి=ఇడానాడి)
ప్రతిపదార్థము.
తుహిన గిరి వంశ = మంచు కొండ వంశము అను,
ధ్వజ పటి = ధ్వజమునకు పతాకమైన ఓ హైమవతీ,
త్వదీయః = నీ సంబంధమైన,
అసౌ = ఈ,
నాసా వంశః = నాసిక అను వెదురు దండము,
శిశిరకర = చంద్ర సంబంధమైన,
నిశ్వాస = వామనాడి యగు ఇడానాడీ మార్గ నిశ్వాస వాయువుచే,
గళితాః = జాఱిన,
అంతః = లోపల,
ముక్తాః= ముత్యములను,
వహంతి = ధరించుచున్నది,
యత్ = ఏ కారణము వలన,
తాసామ్ = ఆ ముత్యముల యొక్క,
సమృద్ధ్యా = నిండుతనము చేత,
బహిః అపి = వెలుపల కూడా,
ముక్తామణి ధరః = ముత్యములను ధరించునదో,
సః = ఆ నాసావంశ దండము,
అస్మాకమ్ = మాకు,
ఉచితమ్ = తగిన విధముగా,
నేదీయః = సమీపించినదై,
ఫలమ్ = కోరిన ఫలమును,
ఫలతు = ఫలింప చేయు గాక.
భావము.
హిమగిరి వంశధ్వజమునకు పతాకము వంటి ఓ హైమవతీ ! నీ నాసిక అను వెదురు దండము లోపల ముత్యములను ధరించుచున్నదని చెప్పవచ్చును. కారణమేమనగా – నీ నాసాదండము ముత్యములతో సమృద్ధిగా నిండి యుండగా చంద్ర సంబంధమైన వామనిశ్వాస మార్గము ద్వారా (ముక్కుకు ఎడమవైపు) ముత్యము బయటకు వచ్చి నాసికకు కింద కొన యందు ముత్యముతో కూడిన ఆభరణమగుచున్నది గదా! ఆ నీ నాసావంశదండముమాకు తగిన విధముగా కోరిన వాటిని ప్రాప్తింపచేయుగాక!
62 వ శ్లోకము.
ప్రకృత్యాఽఽరక్తాయాస్తవ సుదతి దంతచ్ఛదరుచేః
ప్రవక్ష్యే సాదృశ్యం జనయతు ఫలం విద్రుమలతా |
న బింబం తద్బింబ ప్రతిఫలన రాగాదరుణితం
తులామధ్యారోఢుం కథమివ నలజ్జేత కలయా ||
పదచ్ఛేదము.
ప్రకృత్యా - ఆరక్తా- యాః - తవ - సుదతి - దంత - ఛద - రుచేః -
ప్రవక్ష్యే - సాదృశ్యమ్ - జనయతు - ఫలమ్ - విద్రుమలతా -
న బింబమ్ - తత్ - బింబ - ప్రతి ఫలన - రాగాత్ - అరుణితమ్ -
తులా - మధ్య - ఆరోఢుమ్ - కథమ్ - ఇవ - న లజ్జేత - కలయా.
అన్వయక్రమము.
సుదతి, ప్రకృత్యా, ఆరక్తాయాః, తవ, దంతచ్ఛద రుచేః, సాదృశ్యమ్, ప్రవక్షే, విద్రుమలతా, ఫలమ్, జనయతు, బింబమ్, తత్, బింబ, రాగాత్, అరుణితమ్, (అన్యథా) న, కలయా - అపీ, తులామ్, అధ్యారోఢుమ్, కథమ్ ఇవ, న లజ్జేత.
పద్యము.
మ. జననీ! నీ యధరారుణప్రభలు సాజంబమ్మ! నే దెల్పెద
న్వినుతింపందగు పోలికన్, బగడమే బింబంబు పుట్టించినన్
ఘనమౌ నీ యధరారుణప్రభలనే కల్గించు నవ్వాటికిన్,
విన సొంపౌ తగు సామ్యమున్ దలపగా వ్రీడన్ మదిన్ బొందదే? ॥ 62 ॥
ప్రతిపదార్థము.
సుదతి = మంచి పలువరస గల ఓ జననీ,
ప్రకృత్యా = స్వభావ సిద్ధముగనే,
ఆరక్తాయాః = అంతట కెంపువన్నెగలదైన,
తవ = నీ యొక్క,
దంతచ్ఛద రుచేః = రెండు పెదవుల యొక్క సౌందర్య సౌభాగ్యమునకు,
సాదృశ్యమ్ = సరియైన పోలికను,
ప్రవక్షే = చక్కగా చెప్పుచున్నాను,
విద్రుమలతా = పగడపు తీగ ,
ఫలమ్ = పండిన పండును,
జనయతు = పుట్టించినదైనచో అది పోలికకు సరిపోవును,
బింబమ్ = దొండ పండుతో పోల్చవలసి వచ్చినచో,
తత్ = ఆ నీ రెండు పెదవుల యొక్క,
బింబ = బింబములను తనపై ప్రతి ఫలించుట చేత అయిన,
రాగాత్ = ఎరుపురంగువలన,
అరుణితమ్ = ఎరుపు వన్నె పొందినదైనది,
(అన్యథా) న = అటుల కానిచో బింబము కానేరదు,
కలయా - అపీ = లేశ మాత్రము (పదునారవ పాలు)చేతను గూడా,
తులామ్ = సామ్యమును,
అధ్యారోఢుమ్ = అధిష్ఠించుటకు,
కథం ఇవ = ఏవిధముగా,
న లజ్జేత = సిగ్గుపడకుండును.
భావము.
ఓ జగన్మాతా! తల్లీ! చక్కని పలువరుసగల ఓ దేవీ! సహజముగా కెంపులు దేలుచున్న నీపెదవుల సౌందర్యానికి పగడపు తీగెకు పండు పండితే, ఆ విద్రుమఫలము యొక్క ఎరుపుదనము, నీ పెదవులకాంతికి సరితూగుతుంది. కేవలం పగడపు తీగెమాత్రం నీ అధరాల ఎఱుపునకు సాటికాజాలదు.
ఇక బింబఫలమన్నచో - దొండపండు. నీ పెదవుల అరుణ వర్ణము అరువు తెచ్చుకున్నట్లున్నదే గానీ- సహజముగా దొండపండు నీ అధరముల ఎఱుపుదనానికి సాటిరాదు. అది తెలిసికొని - బింబఫలము (దొండపండు) సిగ్గుపడుచున్నది.
63 వ శ్లోకము.
స్మితజ్యోత్స్నాజాలం తవ వదనచంద్రస్య పిబతాం
చకోరాణామాసీదతిరసతయా చంచుజడిమా |
అతస్తే శీతాంశోరమృతలహరీరామ్లరుచయః
పిబంతీ స్వచ్ఛందం నిశి నిశి భృశం కాంచిక ధియా ||
పదచ్ఛేదము.
స్మిత - జ్యోత్స్నా - జాలమ్ - తవ - వదన - చంద్రస్య - పిబతామ్ -
చకోరాణామ్ - ఆసీత్ - అతిరసతయా - చంచు - జడిమా -
అతః - త్ ర్ - శీతాంశోః - అమృత - లహరీః - ఆమ్ల - రుచయః -
పిబంతీ - స్వచ్ఛందం - నిశి - నిశి - భృశమ్ - కాంచిక - ధియా.
అన్వయక్రమము.
తవ, వదనచంద్రస్య, స్మిత, జ్యోత్నాజాలమ్, పిబతామ్, చకోరాణామ్, అతిరసతయా, చంచుజడిమా, ఆసీత్, అతః, తే, ఆమ్ల రుచయః, శీతాంశోః, అమృత లహరీః, కాంచిక ధియా, స్వచ్ఛందమ్, నిశినిశి, భృశమ్, పిబంతీ.
పద్యము.
శా. అమలా! నీ నగుమోము చంద్రికలదివ్యాస్వాదనన్ జీవజీ
వములా తీపిదనమ్ముచే రసనలున్ వాయన్ రుచిన్ దివ్యమౌ
రమణీ! చంద్రునినుండియామ్లరుచులన్ బ్రార్థించి యాచంద్రికల్
ప్రముదంబున్ గొనుఁ గాంచికన్ నిశలలో భావింప చిత్రంబిదే. ॥ 63 ॥
ప్రతిపదార్థము.
(హే పార్వతీ = ఓ జననీ!)
తవ = నీ యొక్క,
వదన చంద్రస్య = ముఖము అను చంద్రుని యొక్క,
స్మిత = చిరునవ్వు అను,
జ్యోత్నా జాలమ్ = వెన్నెల సమూహము నంతను,
పిబతామ్ = త్రాగుచున్న,
చకోరాణామ్ = చకోరపక్షులకు,
అతిరసతయా = మిక్కిలి తీపి దనము చేత,
చంచు జడిమా = నాలుకలకు రుచి తప్పి మొద్దుబాఱుట యనునది,
ఆసీత్ = కలిగెను,
అతః = ఇందువలన,
తే = ఆ చకోర పక్షులు,
ఆమ్ల రుచయః = పుల్లగా నుండు వాటి యందు ఆసక్తి కలిగినవై,
శీతాంశోః = చంద్రుని యొక్క,
అమృత లహరీః = సుధాప్రవాహములను,
కాంచి కధియా = అన్నపు గంజి యనెడి భ్రాంతితో,
స్వచ్ఛందమ్ = ఇష్టము వచ్చినట్లుగా,
నిశి నిశి = ప్రతి రాత్రి యందు,
భృశమ్ = మిక్కిలి,
పిబంతీ = త్రాగుచున్నవి.
భావము.
తల్లీ జగజ్జననీ! నీ ముఖము అనే చంద్రుని యొక్క, చిరునవ్వు అను వెన్నెలనంతా అమితముగా గ్రోలిన చకోర పక్షులకు – ఆ వెన్నెల వెర్రి తీపిగా ఉండుటచేత, వాని నాలుకలు ఆ తీపితో చచ్చుబారి రుచి గూడా పట్టనివయ్యెను. అందువలన ఆ చకోర పక్షులు ఏదైనా పుల్లగా ఉండు వాటిని త్రాగి, తీపితో నాలుక మొద్దుబారినతనమును పోగొట్టుకొనదలచి, చంద్రుని వెన్నెల అను అమృతమును బియ్యపు కడుగునీరు లేదా అన్నపు గంజి అను భ్రాంతితో ప్రతి రాత్రి మిక్కిలిగా తాగుచున్నవి. (అంటే అమ్మ చిరునవ్వు అమృతము కంటే మిన్నగా ఉన్నదని భావం).
64 వ శ్లోకము.
అవిశ్రాంతం పత్యుర్గుణగణ కథామ్రేడనజపా
జపాపుష్పచ్ఛాయా తవ జనని జిహ్వా జయతి సా |
యదగ్రాసీనాయాః స్ఫటికదృష దచ్ఛచ్ఛవిమయీ
సరస్వత్యా మూర్తిః పరిణమతి మాణిక్యవపుషా ||
పదచ్ఛేదము.
అవిశ్రాంతమ్ - పత్యుః - గుణ గణ - కథా - ఆమ్రేడన - జపా -
జపా - పుష్ప - ఛాయా - తవ - జనని - జిహ్వా - జయతి - సా -
యత్ - అగ్రాసీనాయాః - స్ఫటిక - దృషత్ - అచ్ఛ - ఛవి మయీ -
సరస్వత్యా - మూర్తిః - పరిణమతి - మాణిక్య - వపుషా.
అన్వయక్రమము.
జనని, జపాపుష్ప, ఛాయా, తవ, సా, జిహ్వా, అవిశ్రాంతమ్, పత్యుః, గుణ, గణ, కథా, ఆమ్రేడన, జపా, జయతి, యత్, అగ్ర, ఆసీనాయాః, సరస్వత్యాః, స్ఫటిక దృషత్, అచ్ఛ, ఛవిమయీ, మూర్తిః, మాణిక్య, వపుషా, పరిణమతి.
పద్యము.
చం. సతతము నీ సదాశివుని సన్నుతిఁ జేయుచునుండుటన్ సతీ!
యతులిత జిహ్వ యెఱ్ఱఁబడెనమ్మరొ నీకు, గణింపగా, సర
స్వతి సతతంబు నాల్కపయి సన్నుతినొప్పుచునుండుటన్ లస
న్నుతమగు పద్మరాగ రుచితోఁ బరిణామము పొందియుండెడిన్. ॥ 64 ॥
ప్రతిపదార్థము.
జనని = ఓ జగన్మాతా,
జపాపుష్ప= మందార పువ్వు యొక్క,
ఛాయా = రంగు వంటి ఎఱ్ఱని కాంతి గలదై,
తవ = నీ యొక్క,
సా = ఆ,
జిహ్వా = నాలుక,
అవిశ్రాంతమ్ = నిరంతరము,
పత్యుః = సదాశివుని యొక్క,
గుణ = గుణముల,
గణ = సమూహ సంపద యొక్క,
కథా = వృత్తాంతముల యొక్క,
ఆమ్రేడన = మరల మరల వచించుటయే,
జపా = జపముగా కలదై,
జయతి = ప్రకాశించుచున్నది,
యత్ = ఏ,
అగ్ర = జిహ్వాగ్రము నందు,
ఆసీనాయాః = ఆసీనురాలైన,
సరస్వత్యాః = సరస్వతీ దేవి యొక్క,
స్ఫటిక దృషత్ = స్ఫటిక మణి వలె,
అచ్ఛ = తెల్లన,
ఛవిమయీ = అధికమైన,
మూర్తిః = స్వరూపము,
మాణిక్య = పద్మరాగము యొక్క,
వపుషా = రూపముతో,
పరిణమతి = మార్పు చెందుచున్నది.
భావము.
తల్లీ! జగజ్జననీ! నీ నాలుక, నిరంతరము నీ పతియైన సదాశివుని విజయ గుణగణముల చరిత్రలను, ఎడతెరిపి లేకుండా చెప్పుచుండుట వలన, మందార పుష్పము యొక్క ఎఱ్ఱని కాంతులు గలదై ప్రకాశించుచుండుటయేగాక, తన నాలుక యందే ఎప్పుడూ ఆసీనురాలై, పూర్తిగా స్ఫటికము వలె తెల్లగా ఉండే సరస్వతీ దేవిని సైతము పద్మరాగమణి కాంతులతో ఎఱ్ఱని రూపముగల దానిగా మార్చుచున్నది.
65 వ శ్లోకము.
రణే జిత్వా దైత్యానపహృత శిరస్త్రైః కవచిభిః
నివృత్తైశ్చండాంశత్రిపురహర నిర్మాల్య విముఖైః |
విశాఖేంద్రోపేంద్రైశ్శశి విశద కర్పూర శకలాః
విలీయన్తే మాతస్తవ వదన తాంబూల కబళాః ||
పదచ్ఛేదము.
రణే - జిత్వా - దైత్యాన్ - అపహృత - శిరస్త్రైః - కవచిభిః -
నివృత్తైః - చండాంశ - త్రిపుర హర - నిర్మాల్య - విముఖైః -
విశాఖ - ఇంద్ర - ఉపేంద్రైః - శశి - విశద - కర్పూర - శకలాః -
విలీయన్తే - మాతః - తవ - వదన - తాంబూల - కబళాః -
అన్వయక్రమము.
మాతః, రణే, దైత్యాన్, జిత్వా, అపహృత, శిరస్త్రైః, కవచిభిః, నివృత్తెః, చండాంశ, త్రిపురహర, నిర్మాల్య, విముఖైః, విశాఖ, ఇంద్ర, ఉపేంద్ర, శశి విశద, కర్పూర శకలాః, తవ, వదన, తాంబూల, కబళాః, విలీయంతే.
పద్యము.
తే.గీ. పావకియు నింద్రవిష్ణువుల్ బవరవిజయు
లయి నినున్ గాంచఁ దలపాగ లచట వదలి
కవచములు దాల్చి శివమాల్యము విడి నీదు
వదన తాంబూల మందగ వచ్చిరమ్మ. ॥ 65 ॥
ప్రతిపదార్థము.
మాతః = ఓ జగజ్జననీ !
రణే = యుద్ధమునందు,
దైత్యాన్ = రాక్షసులను,
జిత్వా = జయించి,
అపహృత = తీసివేయబడిన,
శిరస్త్రైః = శిరస్త్రాణములు గల వారును,
కవచిభిః = కవచములు గల వారును,
నివృత్తెః = యుద్ధరంగము నుండి మరలి వచ్చిన వారును,
చండాంశ = చండేశ్వరుని భాగము అగు,
త్రిపురహర = త్రిపురాసురులను సంహరించిన శివుని యొక్క,
నిర్మాల్య = నిర్మాల్యమును,
విముఖైః = గ్రహింపని వారును ఐన,
విశాఖ = కుమారస్వామి,
ఇంద్ర = ఇంద్రుడు,
ఉపేంద్ర = విష్ణువు, అను ముగ్గురి చేత,
శశి విశద = చంద్రుని వలె స్వచ్ఛముగా నున్న,
కర్పూర శకలాః = పచ్చ కర్ఫూరపు తునకలుకలిగిన,
తవ = నీ యొక్క,
వదన = ముఖము (నోరు) నుండి వెలువడి వచ్చిన,
తాంబూల = తాంబూలపు,
కబళాః = ముద్దలు,
విలీయంతే = లీనమై పోవుచున్నవి.
భావము.
తల్లీ! జగజ్జననీ! యుధ్ధమునందు రాక్షసులను జయించి, తమ తలపాగలను తీసివేసి, కవచములు మాత్రము ధరించిన వారై, యుద్ధరంగము నుండి మరలి వచ్చుచు, ప్రమథగణములలో ఒకడైన చండునికి చెందు శివుడు స్వీకరించి విడిచిన నిర్మాల్యమును వదలి, జగదంబ నివాసమునకు వచ్చిన కుమారస్వామి, ఇంద్రుడు, విష్ణువులు నీ నోటినుండి వెలువడి వచ్చిన తాంబూలపు ముద్దలను గ్రహించగా ఆ తాంబూలపు ముద్దలలో చంద్రుని వలె స్వచ్ఛముగాను, నిర్మలముగాను ఉండు పచ్చకర్పూరపు తునకలు గూడా పూర్తిగా నమలబడి, మ్రింగబడి ఆ తాంబూలములు పూర్తిగా జీర్ణమై లీనమైపోవుచున్నవి.
జైహింద్.
No comments:
Post a Comment