Thursday, April 17, 2025

సౌందర్యలహరి 6-10పద్యాలు, రచన శ్రీ చింతా రామకృష్ణారావుగారు,సంగీతం,గానం శ్రీమతి వల్లూరి సరస్వతి.

జైశ్రీరామ్.
6 వ శ్లోకము.  
ధనుః పౌష్పం మౌర్వీ మధుకరమయీ పంచ విశిఖాః
వసంతః సామంతో మలయమరు దాయోధనరథః |
తథాఽప్యేకః సర్వం హిమగిరిసుతే కామపి కృపాం
అపాంగాత్తే లబ్ధ్వా జగదిదమనంగో విజయతే || 
పదచ్ఛేదము.
ధనుః - పౌష్పమ్‌ - మౌర్వీ -  మధుకరమయీ -  పంచ విశిఖాః - 
వసంతః - సామంతః -  మలయమరుత్ -  ఆయోధనరథః  - 
తథాఽపి -  ఏకః - సర్వమ్ -  హిమగిరిసుతే -  కామ్ - అపి - కృపామ్ - 
అపాంగాత్ - తే -  లబ్ధ్వా - జగత్ - ఇదమ్ - అనంగః -  విజయతే || 
అన్వయక్రమము.
హిమగిరిసుతే! ధనుః, పౌష్పమ్, మౌర్వీ, మధుకరమయీ,  పంచ, సామంతః, వసంతః, ఆయోధన రథః, మలయమరుత్‌, తథాపి, అనంగః, ఏకః, తే, అపాంగాత్‌, కామ్ + అపి, కృపామ్, లబ్ధ్వా, ఇదమ్, సర్వం జగత్‌, విజయతే. 
పద్యము.
సీ.  హేమాద్రి పుత్రి! నిన్నేమని పొగడుదు, నీ చూపు పడెనేని నిత్య శుభము
లందగవచ్చును, మందస్మితా! నీదు కడగంటి చూపునన్ గంతుడిలను
పూలవిల్లే కల్గి, పూర్తిగా తుమ్మెదల్ నారిగా కల్గి, యనారతంబు
నైదు బాణములనే యాయుధాలుగఁ గల్గి, జడుఁడుగా నుండియు వడివడిగను
తే.గీ.  మలయ మారుత రథముపై మసలుచుండి
సృష్టినే గెల్చుచుండె, నీ దృష్టి కొఱకు
భక్తులల్లాడుచుంద్రు నీ ప్రాపుఁ గోరి,
చూచి రక్షింపు, నేనునున్ వేచియుంటి. ॥ 6 ॥
ప్రతిపదార్థము.  
హిమగిరిసుతే = హిమవత్సర్వత రాజపుత్రికా! 
ధనుః = విల్లు, 
పౌష్పమ్ = పుష్పమయమైనది, 
మౌర్వీ = అల్లెత్రాడు, 
మధుకరమయీ = తుమ్మెదలతో కూర్పఁబడినది, 
విశిఖాః = బాణములు, 
పంచ = ఐదుమాత్రమే, 
సామంతః = చెలికాడు, 
వసంతః = రెండు నెలలే ఉండు వసంత ఋతువు, 
ఆయోధన రథః = యుద్ధ రథము, 
మలయమరుత్‌ = మలయ మారుతము, 
తథాఽపి = ఐనప్పటికీ, 
అనంగః = శరీరమే లేని మన్మథుడు, 
ఏకః = ఒక్కడే, 
తే = నీ యొక్క, 
అపాంగాత్‌ = కడగంటి చూపు వలన, 
కామ్ + అపి = అనిర్వచనీయమైన, 
కృపామ్ = దయను, 
లబ్ధ్వా = పొంది, 
ఇదమ్ = ఈ, 
సర్వం జగత్‌ = సమస్త జగత్తును, 
విజయతే = జయించుచున్నాడు. 
భావము. 
ఓ హిమవత్పర్వత రాజపుత్రీ! పుష్పమయమైన విల్లు, తుమ్మెదల వరుసతో కూర్చిన అల్లెత్రాడు, లెక్కకు ఐదు మాత్రమే బాణములు, అల్పాయుష్కుడు-జడుడు అయిన వసంతుడు చెలికాడు, మలయ మారుతమే రథము. ఇలా ఏ మాత్రము సమర్ధములు కానివగు ఇట్టి సాధన సామగ్రితో కనీసము శరీరము గూడా లేనివాడైన మన్మథుడు నిన్ను ఆరాధించి, అనిర్వచనీయమైన నీ కరుణా కటాక్షమును పొంది ఈ సమస్త జగత్తును జయించుచున్నాడు కదా!

7 వ శ్లోకము.  
క్వణత్కాంచీ దామా కరి కలభ కుంభ స్తననతా
పరిక్షీణా మధ్యే పరిణత శరచ్చంద్ర వదనా |
ధనుర్బాణాన్ పాశం సృణిమపి దధానా కరతలైః
పురస్తా దాస్తాం నః పురమథితు రాహో పురుషికా || 
పదచ్ఛేదము.
క్వణత్ - కాంచీ దామా - కరి కలభ - కుంభ స్తన - నతా
పరిక్షీణా - మధ్యే - పరిణత - శరచ్చంద్ర - వదనా -
ధనుర్బాణాన్ - పాశమ్ -  సృణిమ్ - అపి - దధానా - కరతలైః - 
పురస్తాత్ - ఆస్తాం - నః - పురమ్ - అథితుః - ఆహో - పురుషికా . 
అన్వయక్రమము.
క్వణత్‌, కాంచీదామా, కరి కలభ, కుంభ, స్తన, నతా, పరిక్షీణా, మధ్యే, పరిణత, శరత్‌ చంద్ర వదనా, కరతలైః, ధనుః, బాణాన్‌, పాశమ్, అపి, సృణి, దధానా, పురమథితుః, ఆహో పురుషికా, నః, పురస్తాత్‌, ఆస్తామ్.
పద్యము.
సీ.  మణుల గజ్జియలతో మహనీయ మేఖలన్ మిలమిల కనిపించు మెఱుపుతోడ,
గున్నయేనుగు యొక్క కుంభంబులన్ బోలు పాలిండ్ల బరువుచే వంగి యున్న
సన్నని నడుముతో, శరదిందుముఖముతోఁ, జెఱకు విల్లును, పూలచెండుటమ్ము
నంకుశమ్మును గల్గి, యరచేతఁ బాశమ్ము కల్గి శూలికినహంకారమైన
తే.గీ.  లోకములనేలు మాతల్లి శ్రీకరముగ 
మాకునెదురుగ నిలుచుత మమ్ము గావ,
జన్మసాఫల్యమొసఁగంగ, సన్నుతముగ
ముక్తి సామ్రాజ్యమీయంగఁ బొలుపు మీఱ. ॥ 7 ॥
ప్రతిపదార్థము.  
(హే భగవతి! = ఓ జననీ!)
క్వణత్‌ = చిఱుసవ్వడి చేయు, 
కాంచీదామా = గజ్జెల మొలనూలు గలదియు, 
కరి కలభ = గున్నఏనుగుల, 
కుంభ = కుంభస్తలములతో పోల్చదగిన, 
స్తన = స్తనములచేత, 
నతా = ఇంచుక వంగినట్లుగా కనబడునదియు, 
పరిక్షీణా = కృశించిన, 
మధ్యే = నడుము గలదియు, 
పరిణత = పరిపూర్ణమైన, 
శరత్‌ చంద్ర వదనా = శరదృతువు నందలి పూర్ణిమా చంద్రుని వంటి వదనము గలదియు, 
కరతలైః = నాలుగు చేతులయందు, 
ధనుః = విల్లును, 
బాణాన్‌ =  బాణములను, 
పాశమ్ = పాశమును, 
అపి = మరియు, 
సృణి = అంకుశమును, 
దధానా = ధరించునదియు, 
పురమథితుః = త్రిపురహరుడైన శివుని యొక్క, 
ఆహో పురుషికా = అహంకార స్వరూపిణి యగు జగన్మాత, 
నః = మా యొక్క, 
పురస్తాత్‌ = ఎదుట, 
ఆస్తామ్ = సాక్షాత్కరించు గాక ! 
భావము. 
చిరుసవ్వడి చేయు గజ్జెల వడ్డాణము గలది, గున్న ఏనుగు కుంభములను పోలు స్తనములు కలిగి కొద్దిగా వంగినట్లు కనబడునది, సన్నని నడుము గలది, శరదృతువు నందలి పరిపూర్ణమైన పూర్ణిమ చంద్రుని పోలే ముఖము గలది, నాలుగు చేతులయందు వరుసగా ధనుస్సు, బాణములు,  పాశము, అంకుశములను ధరించి యుండునది, శివుని యొక్క శక్తి స్వరూపిణియునగు జగన్మాత మాకు ఎదురుగా సుఖాసీనురాలై సాక్షాత్కరించుగాక!

8 వ శ్లోకము.  
సుధాసింధోర్మధ్యే సురవిటపి వాటీ పరివృతే
మణిద్వీపే నీపోపవనవతి చింతామణి గృహే |
శివాకారే మంచే పరమశివ పర్యంక నిలయాం
భజంతి త్వాం ధన్యాః కతిచన చిదానంద లహరీమ్ || 
పదచ్ఛేదము.
సుధాసింధోః - మధ్యే - సురవిటపి - వాటీ - పరివృతే -
మణిద్వీపే - నీప - ఉపవనవతి - చింతామణి గృహే -
శివాకారే - మంచే - పరమశివ - పర్యంక - నిలయామ్ -
భజంతి - త్వామ్ -  ధన్యాః - కతిచన - చిదానంద లహరీమ్.
అన్వయక్రమము.
సుధాసింధోః, మధ్యే, సురవిటపి, వాటీ, పరివృతే, మణిద్వీపే, నీప, ఉపవన వతి, చింతామణి, గృహే, శివాకారేన,  మంచే, పరమశివ, పర్యంక, నిలయామ్, చిత్‌ + ఆనంద + లహరీమ్, త్వామ్, కతిచన, ధన్యాః, భజంతి.
పద్యము.
సీ.  అమృత సింధువు మధ్య నమరిన రతనాల దీవియందున్నట్టి దివ్యమైన
కల్పవృక్షంబుల ఘన కదంబముల పూదోట లోపలనున్న మేటియైన
చింతామణులనొప్పు శ్రీకరంబైనట్టి గృహములో శివుని యాకృతిగనున్న
మంచంబున శివుని మంగళోరువు గొప్ప స్థానంబుగాఁ గల జ్ఞానపూర్ణ
తే.గీ.  వర దయానందఝరివైన భవ్యరూప!
ధన్య జీవులు కొందరే ధరను నీకు
సేవ చేయగాఁ దగుదురు, చిత్తమలర
నిన్ను సేవింపనీ, సతీ! నిరుపమాన! ॥ 8 ॥
ప్రతిపదార్థము.  
(హే భగవతి! = ఓ జననీ!)
సుధాసింధోః = అమృత సముద్రము యొక్క, 
మధ్యే = నడుమ, 
సురవిటపి = కల్పవృక్షముల యొక్క, 
వాటీ = తోటలచే 
పరివృతే = చుట్టబడిన, 
మణిద్వీపే = మణిమయమైన దీవియందు, 
నీప = కడిమి చెట్ల 
ఉపవన వతి = ఉద్యానము కలిగిన, 
చింతామణి = చింతామణులచే నిర్మింపబడిన 
గృహే = గృహము నందు, 
శివాకారే = శివశక్తి రూపమైన,  
మంచే = మంచము నందు, 
పరమశివ = సదాశివుడను 
పర్యంక = తొడనే, 
నిలయామ్ = నెలవుగా గలిగిన, 
చిత్‌ + ఆనంద + లహరీమ్ = జ్ఞానానందతరంగ రూపమగు, 
త్వామ్ = నిన్ను, 
కతిచన = కొందరు, 
ధన్యాః = ధన్యులు (మాత్రమే), 
భజంతి = సేవించుదురు.
భావము. 
అమ్మా…అమృతసముద్రము మధ్యలో కల్పవృక్షాలతో నిండియున్న మణిద్వీపములో, కదంబవనములో, చింతామణులతో నిర్మించిన గృహమునందు, త్రికోణాకారపు మంచము మీద, పరమశివుని పర్యంకస్థితవై ప్రకాశించుచు, జ్ఞాన స్వరూపమై నిరతిశయ సుఖప్రవాహ రూపముగా ఉన్న నిన్ను- స్వల్ప సంఖ్యాకులైన ధన్యులు మాత్రమే సేవించుకో గలుగుతున్నారు.

9 వ శ్లోకము.  
మహీం మూలాధారే కమపి మణిపూరే హుతవహం
స్థితం స్వాధిష్ఠానే హృది మరుతమాకాశముపరి |
మనోఽపి భ్రూమధ్యే సకలమపి భిత్వా కులపథం
సహస్రారే పద్మే సహ రహసి పత్యా విహరసి || 
పదచ్ఛేదము.
మహీమ్ -  మూలాధారే - కమ్ - అపి - మణిపూరే - హుతవహమ్ -
స్థిత -  స్వాధిష్ఠానే - హృది - మరుతమ్ - ఆకాశమ్ - ఉపరి - 
మనః - అపి - భ్రూమధ్యే - సకలమ్ - అపి - భిత్వా - కులపథమ్ -
సహస్రారే  పద్మే - సహ - రహసి - పత్యా - విహరసి. 
అన్వయక్రమము.
మూలాధారే, మహీమ్, మణిపూరే, కమ్, అపి, స్వాధిష్టానే, హుతవహమ్, హృది, మరుతమ్‌, ఉపరి, ఆకాశమ్, భ్రూమధ్యే, మనోఽపి, కులపథమ్, సకలమ్ + అపి - సకలమపి, భిత్వా, సహస్రారే - పద్మే, రహసి, పత్యాసహ, విహరసి.
పద్యము.
సీ.  పూజ్య పృథ్వీ తత్వముగను మూలాధారముననుండు తల్లివి ఘనతరముగ,
జలతత్త్వముగ నీవు కలుగుచు మణిపూర చక్రమందున నొప్పు చక్కనమ్మ!
యగ్ని తత్త్వమ్ముగానమరి యుంటివిగ స్వాధిష్ఠాన చక్రాన దివ్యముగను,
వాయు తత్త్వమ్ముగా వరలి యుంటివి యనాహత చక్రమందున నుతిగ జనని!
తే.గీ.  యల విశుద్ధచక్రాన నీ వాకసముగ,
మనసువగుచు నాజ్ఞాచక్రమునను నిలిచి,
మరి సహస్రారము సుషుమ్న మార్గమునను
చేరి, పతితోడ విహరించు ధీరవమ్మ! ॥ 9 ॥
ప్రతిపదార్థము.  
(హే భగవతి! = ఓ జననీ!)
మూలాధారే = మూలాధార చక్రమునందు, 
మహీమ్ = పృథివీ తత్త్వమును, 
మణిపూరే = మణిపూర చక్రము నందు, 
కమ్ అపి = ఆపస్తత్త్వముము, అనగా- జలతత్త్వమును, 
స్వాధిష్టానే = స్వాధిష్థాన చక్రము నందు, 
హుతవహమ్ = అగ్నితత్త్వమును, 
హృది = హృదయమందలి అనాహత చక్రము వద్ద, 
మరుతమ్‌ = వాయు తత్త్వమును, 
ఉపరి = పైన ఉన్న విశుద్ధ చక్రము నందు, 
ఆకాశమ్ = అకాశతత్త్వమును, 
భ్రూమధ్యే = కనుబొమల నడుమ గల ఆజ్ఞా చక్రము నందు, 
మనోఽపి = మనస్తత్త్వమును గూడా (కలుపుకొని), 
కులపథమ్ = కులమార్గము, అనగా - సుషుమ్నామార్గమును, 
సకలమ్ + అపి - సకలమపి = అంతను కూడ, 
భిత్వా = ఛేదించుకొని చివరకు, 
సహస్రారే - పద్మే = సహస్రార కమలమందు, 
రహసి = ఏకాంతముగా నున్న, 
పత్యాసహ = భర్తయగు సదాశివునితో గూడి, 
విహరసి = క్రీడింతువు.
భావము. 
అమ్మా! నీవు సుషుమ్నా మార్గములో మూలాధార చక్రమునందు భూతత్త్వమును, మణిపూరకమందు జలతత్త్వమును, స్వాధిష్థాన చక్రము నందు అగ్నితత్వమును, అనాహత మందు వాయుతత్త్వమును, విశుద్ద చక్రమందు ఆకాశతత్త్వమును, ఆజ్ఞా చక్రమునందు మనోతత్త్వమును చేధించుకొని సహస్రార చక్రమందు నీ భర్తతో ఏకాంతముగా విహరిస్తున్నావు.

10 వ శ్లోకము.  
సుధాధారాసారైశ్చరణయుగళాంతర్విగళితైః
ప్రపంచం సించంతీ పునరపి రసామ్నాయ మహసః|
అవాప్య స్వాం భూమిం భుజగ నిభమధ్యుష్ఠవలయం
స్వమాత్మానం కృత్వా స్వపిషి కులకుండే కుహరిణి || 
పదచ్ఛేదము.
సుధాధారా - సారైః -  చరణ యుగళ - అంతః - విగళితైః
ప్రపంచమ్ -  సించంతీ - పునః - అపి - రస - ఆమ్నాయ - మహసః -
అవాప్య - స్వామ్ -  భూమిమ్ -  భుజగ - నిభమ్ -  అధ్యుష్ఠ - వలయమ్ - 
స్వమ్ - ఆత్మానమ్ -  కృత్వా - స్వపిషి - కుల - కుండే -  కుహరిణి.
అన్వయక్రమము.
చరణ, యుగళ, అంతర్విగళితైః, సుధా, ధార, ఆసారైః, ప్రపంచమ్, సించంతీ, రస, ఆమ్నాయ, మహసః, స్వామ్, భూమిం, పునః, ఆవాప్య, భుజగ నిభమ్, అధ్యుష్ఠ, వలయమ్, స్వమ్, ఆత్మానమ్, కృత్వా, కుహరిణి, కుల, కుండే, స్వపిషి.
పద్యము.
సీ.  శ్రీపాదముల నుండి చిందుచుఁ బ్రవహించు నమృతవర్షంబుతోనలరు నీవు
నిండుగ డెబ్బది రెండు వేలున్నట్టి నాడీప్రపంచమున్ దడుపుచుండి,
యమృతాతిశయముననలరెడి చంద్రుని కాంతినిఁ గలుగుచుఁ, గదలుచుండి
మరల మూలాధార మహిత చక్రము చేరి, స్వస్వరూపము పొంది సన్నుతముగ
తే.గీ.  కుహరిణిని బోలు కులకుండమహిత చక్ర
మునను చుట్టగాచుట్టుకొనిన జననివి,
నీవె కుండలినీశక్తి,, నిదురపోవు
చుందువమ్మరో! మాలోన నుందు వీవె. ॥ 10 ॥ 
ప్రతిపదార్థము.  
(హే భగవతి! = ఓ జననీ!)
చరణ = పాదముల 
యుగళ = జంట యొక్క, 
అంతర్విగళితైః = మధ్య నుండి స్రవించుచున్న, 
సుధా = అమృతము యొక్క 
ధార = ధారయొక్క 
ఆసారైః = వర్షముచేత, 
ప్రపంచమ్ = పంచతత్త్వదేహమును ప్రేరేపించు నాడీ మండలమును, 
సించంతీ = తడుపుచున్నదానవై, 
రస = అమృతము యొక్క 
ఆమ్నాయ = గుణాతిశయ రూపమయిన
మహసః = కాంతులు గల చంద్రుని నుండి, 
స్వామ్ = స్వకీయమైన 
భూమిమ్ = భూతత్త్వమునకు సంబంధించిన ఆధార చక్రమును, 
పునః = మరల, 
ఆవాప్య = పొంది, 
భుజగ నిభమ్ = సర్పమువలె, 
అధ్యుష్ఠ = అధిష్ఠింపబడిన 
వలయమ్ = కుండలాకారమైన దానినిగా, 
స్వమ్ = తనదగు 
ఆత్మానమ్ = నిజ స్వరూపమును, 
కృత్వా = చేసి (అనగా - ధరించి, లేదా - పొంది), 
కుహరిణి = తామర పూవు బొడ్డు వద్దనుండు సన్నని రంధ్రము వంటిదైన, 
కుల (కు = పృథివీ తత్త్వము, ల = లయము నొందు) సుషుమ్నా మూల మందలి, 
కుండే = కమల కందరూపమైన చక్రము నందు, 
స్వపిషి = నిద్రింతువు.
భావము. 
తల్లీ! నీ పాదముల జంట యొక్క మధ్య నుండి స్రవించుచున్న అమృతము చేత పంచతత్త్వ దేహమును ప్రేరేపించు నాడీ మండలమును తడుపుచున్న దానవై, చంద్రుని నుండి స్వకీయమైన భూతత్త్వమునకు సంబంధించిన ఆధార చక్రమును మరల పొంది, సర్పమువలె అధిష్ఠింపబడిన కుండలాకారమైన దానినిగా తనదగు నిజ స్వరూపమును పొంది, తామర పూవు బొడ్డు వద్దనుండు సన్నని రంధ్రము వంటిదైన సుషుమ్నా మూల మందలి కమల కందరూపమైన చక్రము నందు నిద్రింతువు.
జైహింద్.

No comments: