జైశ్రీరామ్.
41 వ శ్లోకము.
తవాధారే మూలే సహ సమయయా లాస్యపరయా
నవాత్మానం మన్యే నవరస మహాతాండవ నటమ్ |
ఉభాభ్యా మేతాభ్యాముదయ విధి ముద్దిశ్య దయయా
సనాథాభ్యాం జజ్ఞే జనక జననీమత్ జగదిదమ్ ||
పదచ్ఛేదము.
తవ - ఆధారే - మూలే - సహ - సమయయా - లాస్య పరయా -
నవ - ఆత్మానమ్ - మన్యే - నవ - రస - మహా - తాండవ - నటమ్ -
ఉభాభ్యామ్ - ఏతాభ్యామ్ - ఉదయ - విధిమ్ - ఉద్దిశ్య - దయయా -
స నాథాభ్యామ్ - జజ్ఞే - జనక - జననీ - మత్ - జగత్ - ఇదమ్.
అన్వయక్రమము.
తవ, మూలే ఆధారే, లాస్యపరయా, సమయయా సహ, నవ, రస, మహత్, తాండవ, నటమ్, నవ + ఆత్మానమ్, ఉదయవిధిమ్, ఉద్దిశ్య, ఏతాభ్యామ్, ఉభాభ్యామ్, దయయా, సనాథాభ్యామ్, ఇదమ్ జగత్, జనక జననీమత్, జజ్ఞే.
{మహాతాండవం... మహత్+తాండవం, మహత్ శబ్దం లో త కారానికి కర్మ ధారయ సమాసం లో ఆన్మహతః సమానాఽధి కరణ జాతీయాయోః సూత్రం వల్ల ఆ కారం ఆదేశముగును.}
పద్యము.
సీ. నీదు మూలాధార నిర్మల చక్రాన సమయ యనెడి గొప్ప శక్తిఁ గూడి
ప్రవర శృంగారాది నవరసమ్ములనొప్పు నానంద తాండవమమరఁ జేయు
నిన్ను నేను నవాత్ముని సతతానందభై రవుని దలంచెద, ప్రళయ దగ్ధ
లోకాల సృజనకై శ్రీకరముగఁ గూడి యిటులొప్పు మీచేత నీ జగమ్ము
తే.గీ. తల్లిదండ్రులు కలదిగాఁ దలతు నేను,
లోకములనేలు తలిదండ్రులేకమగుచు
దివ్యదర్శనభాగ్యమీ దీనునకిడ
వేడుకొందును, నిలుడిల నీడవోలె. ॥ 41 ॥
ప్రతిపదార్థము.
(హే భగవతి! = ఓ తల్లీ!)
తవ = నీ యొక్క,
మూలే ఆధారే = మూలాధార చక్రమునందు,
లాస్యపరయా = నృత్యాసక్తిగల,
సమయయా సహ = “సమయకళ” తో గూడ,
నవ = తొమ్మిది,
రస = శృంగారాది రసముల చేత,
మహత్ = అద్భుతమైన,
తాండవ = నాట్యమునందు,
నటమ్ = అభినయించువాడైనవానిని,
నవ + ఆత్మానమ్ = తొమ్మిది రూపులు గల ఆనందభైరవునిగా,
మన్యే = తలచెదను,
ఉదయవిధిమ్ = జగదుత్పత్తి కార్యమును,
ఉద్దిశ్య = ఉద్దేశించి,
ఏతాభ్యామ్ = ఈ,
ఉభాభ్యామ్ = ఇరువురి చేత (అనగా - ఆనందభైరవ మహాభైరవుల చేత),
దయయా = (ప్రళయాగ్నికి దగ్ధమైన లోకములను మరల నుత్పత్తి చేయుట యందు) కరుణతో,
సనాథాభ్యామ్ = ఇరువురి కలయిక చేత,
ఇదంజగత్ = ఈ జగత్తు,
జనక జననీమత్ = తండ్రియు తల్లియు గలదిగా,
జజ్ఞే = అయినది.
భావము.
ఓ తల్లీ! నీ యొక్క మూలాధార చక్రమునందు లాస్యాసక్తిగల, “సమయకళ” అను పేరుగల శక్తి గూడ, తొమ్మిది శృంగారాదిరసముల చేత అద్భుతమైన తాండవమునందు అభినయించువాడైనవానిని తొమ్మిది రూపులుగల ఆనందభైరవునిగా తలచెదను. జగదుత్పత్తి కార్యమును ఉద్దేశించి, ఈ ఇరువురి చేత (అనగా - ఆనందభైరవ మహాభైరవుల చేత) (ప్రళయాగ్నికి దగ్ధమైన లోకములను మరల నుత్పత్తి చేయుట యందు) కరుణతో, ఇరువురి కలయిక చేత ఈ జగత్తు తండ్రియు తల్లియు గలదిగా అయినది.
42 వ శ్లోకము.
గతైర్మాణిక్యత్వం గగనమణిభిస్సాంద్రఘటితం
కిరీటం తే హైమం హిమగిరిసుతే కీర్తయతి యః ||
స నీడేయచ్ఛాయా చ్ఛురణ శబలం చంద్ర శకలం
ధనుశ్శౌనాసీరం కిమితి న నిబధ్నాతి ధిషణామ్ ||
పదచ్ఛేదము.
గతైః - మాణిక్యత్వమ్ - గగన - మణిభిః - సాంద్ర - ఘటితమ్ -
కిరీటమ్ - తే - హైమమ్ - హిమగిరి సుతే - కీర్తయతి - యః -
సః - నీడేయ - ఛాయా - ఛురణ - శబలమ్ - చంద్ర శకలమ్ -
ధనుః - శౌనాసీరమ్ - కిమ్ - ఇతి - న - నిబధ్నాతి - ధిషణామ్.
(నీడేయ+ఛాయ=నీడేయ+{ఛేచ.సూత్రమువలన త్ ఆగమము}త్+ఛాయ=నీడేయ+{స్తోశ్చునాశ్చుః వల్ల శ్చుత్వము}చ్+ఛాయ=నీడేయచ్ఛాయ./అటులనే చ్ఛురణ కూడా.)
అన్వయక్రమము.
హీమగిరిసుతే, మాణిక్యత్వమ్, గతైః, గగనమణిభిః, సాంద్రఘటితమ్, హైమమ్, తే, కిరీటమ్, యః, కీర్తయతి, సః, నీడేయ, ఛాయా, ఛురణ, శబలమ్, చంద్ర శకలమ్, శౌనాసీరమ్, ధనుః ఇతి, ధిషణామ్, కిమ్ న నిబధ్నాతి.
పద్యము.
సీ. హిమగిరి నందినీ! సముచితముగ సూర్యులందరిన్ మణులుగ పొందఁబడిన
నీ స్వర్ణమకుటమున్ నియతితోఁ గీర్తించునెవ్వండతండిల నెంచకున్నె
ద్వాదశాదిత్యుల వరలెడు మణికాంతి సోకుచు నొప్పెడి సోముని గని
యింద్ర ధనుస్సుగా, సాంద్రకృపాంబ! తత్ కల్యాణతేజంబు ఘనతరంబు.
తే.గీ. నీ కిరీటంబు తేజంబు నే దలంచి
యాత్మలోఁ దృప్తినందెదనమ్మ కృపను
నీవు నామదిలోననే నిలిచి యుండి
మకుట తేజంబు కననిమ్ము సుకరముగను. ॥ 42 ॥
ప్రతిపదార్థము.
హీమగిరిసుతే ! = ఓ పార్వతీ,
మాణిక్యత్వమ్ = మానికములగుటను,
గతైః = పొందిన,
గగనమణిభిః = ఆదిత్యుల చేత,
సాంద్రఘటితమ్ = దగ్గర దగ్గరగా కూర్చడిన,
హైమమ్ = బంగారముతో నిర్మింపబడిన,
తే = నీ యొక్క,
కిరీటమ్ = కిరీటమును,
యః = ఎవఁడు,
కీర్తయతి = కీర్తించునో,
సః = అతఁడు,
నీడేయ = కుదుళ్ల యందు బిగింపఁబడిన నానా రత్నములయొక్క,
ఛాయా = కాంతి,
ఛురణ = ప్రసారము చేత,
శబలమ్ = చిత్ర వర్ణము గల,
చంద్ర శకలమ్ = చంద్రరేఖను,
శౌనాసీరమ్ = ఇంద్ర సంబంధమైన,
ధనుః ఇతి = ధనుస్సు అని,
ధిషణామ్ = (అతని) ఊహను,
కిం న నిబధ్నాతి = ఎందుకు చేయఁడు? చేయునని భావము.
భావము.
అమ్మా! హిమగిరితనయా! పన్నెండుగురు సూర్యులు మణులుగా ఏర్పడి పొదగబడిన నీ బంగారు కిరీటమును వర్ణించు కవి ఆ కాంతులు నానా విధములుగా వ్యాపించి యున్న నీ శిరము మీది చంద్రకళను చూచి “ఇది ఏమి ఇంద్రధనుస్సా” అని సందేహపడగలఁడు.
43 వ శ్లోకము.
ధునోతు ధ్వాంతం నస్తులిత దలితేందీవర వనం
ఘన స్నిగ్ధ శ్లక్ష్ణం చికుర నికురుంబం తవ శివే |
యదీయం సౌరభ్యం సహజముపలబ్ధుం సుమనసో
వసంత్యస్మిన్ మన్యే బలమథన వాటీ విటపినామ్ ||
పదచ్ఛేదము.
ధునోతు - ధ్వాంతమ్ - నః - తులిత - దలిత - ఇందీవర - వనమ్ -
ఘన - స్నిగ్ధ - శ్లక్ష్ణమ్ - చికుర - నికురుంబమ్ - తవ - శివే -
యదీయమ్ - సౌరభ్యమ్ - సహజమ్ - ఉపలబ్ధుమ్ - సుమనసః -
వసంతి - అస్మిన్ - మన్యే - బల - మథన - వాటీ - విటపినామ్.
అన్వయక్రమము.
శివే, తులిత, దలిత, ఇందీవర వనమ్, ఘన, స్నిగ్ధ, శ్లక్ష్ణమ్, తవ, చికుర నికురుంబమ్, నః, ధ్వాంతమ్, ధునోతు, యదీయమ్, సహజమ్, సౌరభ్యమ్, ఉపలబ్ధుమ్, అస్మిన్, బల మథన, వాటీ, విటపినామ్, సుమనసః, వసంతి, మన్యే.
పద్యము.
తే.గీ. నల్లకలువలన్, మేఘమునల్లఁ బోలు
శ్లక్ష్ణమగు స్నిగ్ధమగు కురుల్ చక్కగాను
మాదు మదులలోఁ జీకటిన్ మాపు, కల్ప
కుసుమములు వాసనలు పొందఁ గోరి నీదు
కురుల వసియించె నని దల్తు గుణనిధాన! ॥ 43 ॥
ప్రతిపదార్థము.
శివే = ఓ పార్వతీ,
తులిత = పోల్చఁబడిన,
దలిత = వికసించిన,
ఇందీవర వనమ్ = నల్లకలువల తోట,
ఘన = (నల్లని) మేఘము వంటి,
స్నిగ్ధ = మెఱుగైన, చిక్కనైన,
శ్లక్ష్ణమ్ = మృదులమైన,
తవ = నీ యొక్క,
చికుర నికురుంబమ్ = కేశకలాపము,
నః = మా యొక్క,
ధ్వాంతమ్ = అజ్ఞానాంధకారమును,
ధునోతు = తొలగించుగాక,
యదీయమ్ = ఏ కేశపాశ సంబంధమైనది కలదో దాని,
సహజమ్ = స్వభావసిద్దమైన,
సౌరభ్యమ్ = పరిమళమును,
ఉపలబ్ధుమ్ = పొందుటకు,
అస్మిన్ = ఈ కేశపాశమందు,
బలమథన = ఇంద్రుని,
వాటీ = నందనోద్యానమందలి,
విటపినామ్ = కల్పవృక్షముల యొక్క,
సుమనసః = పుష్పములు,
వసంతి = నివసించుచున్నవని,
మన్యే = తలంచెదను.
భావము.
ఓ హిమగిరి తనయా! తల్లీ! పార్వతీ దేవీ! అప్పుడే వికసిస్తున్న నల్ల కలువల సమూహంతో సాటియైనది, మేఘమువలె దట్టమై, నునుపై, మెత్తనిది అయిన నీ శిరోజముల సమూహము- మాలోని అజ్ఞానము అనే చీకటిని పోగొట్టుగాక ! నీ కేశములకు సహజంగా ఉన్న సుగంధాన్ని తాము పొందడానికేమో, బలుఁడనే రాక్షసుని చంపిన ఇంద్రుని యొక్క నందనోద్యానములో ఉన్న కల్పవృక్షపు పుష్పములు, నీకేశ సమూహాన్నిచేరి, అక్కడ ఉంటున్నాయని నేను భావిస్తున్నాను.
44 వ శ్లోకము.
తనోతు క్షేమం నస్తవ వదనసౌందర్యలహరీ
పరీవాహస్రోత స్సరణిరివ సీమంత సరణిః|
వహంతీ సిందూరం ప్రబలకబరీభార తిమిర
ద్విషాం బృందైర్బందీకృతమివ నవీనార్క కిరణమ్ ||
పదచ్ఛేదము.
తనోతు - క్షేమమ్ - నః - తవ - వదన - సౌందర్య - లహరీ -
పరీవాహ - స్రోతః - సరణిః - ఇవ - సీమంత - సరణిః -
వహంతీ - సిందూరమ్ - ప్రబల - కబరీ - భార - తిమిర -
ద్విషామ్- బృందైః - బందీ - కృతమ్ - ఇవ - నవీన - అర్క - కిరణమ్.
అన్వయక్రమము.
తవ, వదన, సౌందర్య, లహరీ, పరీవాహ, స్రోతః, సరణిః ఇవ, సీమంత సరణిః, ప్రబల, కబరీభార, తిమిర, ద్విషామ్, బృందైః, బందీకృతమ్, నవీన + అర్క, కిరణమ్, సిందూరమ్, వహంతీ, నః, క్షేమమ్, తనోతు.
పద్యము.
సీ. శర్వాణి! నీముఖ సౌందర్య లహరీపరీవాహ దివ్యగిరిస్రవంబుఁ
బోలుచు గొప్పగా పొంగుచు సాగెడి మార్గమా యననొప్పె మహిత గతిని,
యందలి సిందూరమందగించుచు బాల సూర్య కిరణకాంతి సొబగులీని,
కటికచీకటిపోలు కచపాళి రిపులచేఁ జెరబట్టఁ బడినట్లు చిక్కి యచట
తే.గీ. మెఱయుచుండె నీ సీమంత మరసి చూడ
నట్టి సిందూర సీమంత మమ్మ! మాకు
క్షేమమును గల్గఁ జేయుత, చిత్తమలర
నీదు సాన్నిధ్యమున నన్ను నిలువనిమ్మ. ॥ 44 ॥
ప్రతిపదార్థము.
(హే భగవతి! = ఓ తల్లీ!)
తవ = నీ యొక్క,
వదన = ముఖము యొక్క,
సౌందర్య = సౌందర్యపు,
లహరీ = అలల వెల్లువల యొక్క,
పరీవాహ = కాలువయందు,
స్రోతః = నీటి ప్రవాహము వలె పారుచున్న,
సరణిః ఇవ = దారివలె కనబడు,
సీమంత సరణిః = నీ పాపట దారి,
ప్రబల = బలమయిన,
కబరీభార = (నీ) కురుల మొత్తమనెడి,
తిమిర = కటిక చీకటి రూపముగా గలిగి యున్న,
ద్విషామ్ = శత్రువుల,
బృందైః = సమూహముచేత,
బందీకృతమ్ = బందీగా చేయబడిన,
నవీన + అర్క = ప్రాతః కాలపు సూర్యుని,
కిరణమ్ = కిరణమువలెనున్న,
సిందూరమ్ = సిందూరపురేఖను,
వహంతీ = వహించుచున్నదై,
నః = మాకు,
క్షేమమ్ = క్షేమమును,
తనోతు = విస్తరింప చేయుగాక !
భావము.
తల్లీ! జగజ్జననీ! నీ ముఖ సౌందర్య ప్రకాశ ప్రవాహము ప్రవహించుటకు వీలుగా నుండు కాలువవలె – నీ పాపట దారి కనబడుచున్నది. ఆ పాపటకు ఇరువైపులా దట్టముగానున్న నీ కురుల సమూహములు – కటికచీకటి రూపముతో ఇరువైపులా బృందములుగా తీరి యున్న శత్రువులవలె కనబడుచుండగా – వాటి మధ్య బందీగా చిక్కబడిన ప్రాతః కాలసూర్య కిరణము వలె – నీ పాపట యందలి సిందూరపు రేఖ భాసించుచున్నది. అట్టి సిందూర రేఖతో నుండు నీ పాపట మాకు నిత్యము శుభ సౌభాగ్య యోగ క్షేమములను విస్తరింపచేయుగాక.
45 వ శ్లోకము.
అరాలైః స్వాభావ్యాదలికలభ సశ్రీభి రలకైః
పరీతం తే వక్త్రం పరిహసతి పంకేరుహ రుచిమ్ |
దరస్మేరే యస్మిన్ దశన రుచి కింజల్క రుచిరే
సుగంధౌ మాద్యంతిస్మరదహన చక్షుర్మధులిహః ||
పదచ్ఛేదము.
అరాలైః - స్వాభావ్యాత్ - అలి - కలభ - సశ్రీభిః - అలకైః -
పరీతమ్ - తే - వక్త్రమ్ - పరిహసతి - పంకేరుహ - రుచిమ్ -
దర - స్మేరే - యస్మిన్ - దశన - రుచి - కింజల్క - రుచిరే -
సుగంధౌ - మాద్యంతి - స్మర - దహన - చక్షుః - మధులిహః.
అన్వయక్రమము.
స్వాభావ్యాత్, అరాలైః, అలి కలభ, స శ్రీభిః, అలకైః, పరీతమ్, తే, వక్త్రమ్, పంకేరుహ రుచిమ్, పరిహసతి, దరస్మేరే, దశన, రుచి, కింజల్క, రుచిరే, సుగంధౌ, యస్మిన్, స్మరదహన, చక్షుః, మధులిహః, మాద్యంతి.
పద్యము.
సీ. స్వాభావికంబుగా వంకరలౌ తుమ్మెదలవంటి ముంగురుల్ దర్పమెలర
నందగించెడి నీదు సుందరమగు మోము పంకేరుహంబులన్ బరిహసించుఁ,
జిఱునవ్వుతోఁ గూడు శ్రీకరమగు దంతకాంతి, కేసరకాంతి, ఘనతరమగు
సౌగంధ్య పూర్ణమై చక్కనౌ ముఖమొప్పు నా ముఖపద్మమ్ము నలరియున్న
తే.గీ. సుందరత్వమున్ గనుచుండి సోమశేఖ
రుని కనులను ద్విరేఫముల్ కనును మత్తు
నట్టి నీ పాదములను నే పట్టి విడువ,
నీదు కృపఁ జూపు మమ్మ! నన్నాదుకొనుమ. ॥ 45 ॥
ప్రతిపదార్థము.
(హే భగవతి! = ఓ తల్లీ!)
స్వాభావ్యాత్ = సహజముగనే,
అరాలైః = వంకరగానుండు,
అలి కలభ = గండు తుమ్మెదల,
స శ్రీభిః = కాంతి వంటి కాంతులు గల,
అలకైః = ముంగురుల చేత,
పరీతమ్ = అందముగా తీర్చి దిద్దబడిన,
తే = నీ యొక్క,
వక్త్రమ్ = వదనము,
పంకేరుహ రుచిమ్ = కమలముల యొక్కసొబగును,
పరిహసతి = తనతో సాటి రాదని ఎగతాళి చేయుచున్నది.
(కారణమేమనగా),
దరస్మేరే = వికాస స్వభావముగల లేనగవు గలదై,
దశన = దంతముల యొక్క,
రుచి = కాంతులనెడి,
కింజల్క = కేసరములచే,
రుచిరే = సుందరమైన,
సుగంధౌ = సహజ సుగంధముతో ఒప్పారుచునుండు,
యస్మిన్ = ఏ ముఖ పద్మము నందు,
స్మరదహన = మన్మథుని (తన మూడవ కంటితో) దహించిన శివుని యొక్క,
చక్షుః మధులిహః = కన్నులు అను తుమ్మెదలు,
మాద్యంతి = మత్తు గొని ఆనందించుచున్నవో అందువలననే సుమా.
భావము.
ఓ జగన్మాతా! సహజంగానే వంకరలు తిరిగినవై, కొదమ తుమ్మెదల కాంతివంటి నల్లని కాంతిని కల్గియున్న ముంగురులతో కూడిన నీముఖము, పద్మ కాంతిని, అందాన్ని పరిహసిస్తూన్నది. చిరునవ్వుతో వికసించుచున్నది, దంతముల కాంతులు అనే కేసరములచే సుందరమైనది, సువాసన కలది అయిన నీ ముఖపద్మమునందు, మన్మథుని దహించిన శివుని చూపులు అనే తుమ్మెదలు కూడా మోహపడుతున్నాయి.
జైహింద్.
No comments:
Post a Comment