Tuesday, April 29, 2014

ఇంగితం ఉపయోగించి ఆత్మసాక్షిగా ఉత్తమ అభ్యర్థికే మీ వోటు వెయ్యండి.

జైశ్రీరామ్.
నా ప్రియమైన భారతీయ సహోదరీ సహోదర ఓటర మహాశయులకు హృదయ పూర్వకముగా నమస్కరించుతూ చేయుచున్న విన్నపము.
సోదరీ సోదరులారా! మన భారత దేశము అతి పెద్ద ప్రజాస్వామ్య దేశముగా ప్రపంచ ప్రఖ్యాతి పొందిన దేశము.
మన రాజ్యాంగ నిర్మాతలు అత్యంత శ్రద్ధాసక్తులతో భావి భారతప్రజానీకము యొక్క మహోజ్వల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఎంతో జాగ్రత్తగా చేసిన రాజ్యాంగ నిర్మాణము ప్రపంచ విఖ్యాతినొందినది. ఐతే జరిగినదింత వరకూ ఎలాగున్నదీ అంటే శస్త్ర చికిత్స చక్కగా జరిగినది కాని రోగి మాత్రము ప్రాణములు కొల్పోయెను అన్నట్లుగా ఉంది.
మనము మనకు ప్రతినిధులుగా యోగ్యుడైన ఎమ్మెల్యే. ఎంపీ లను ఎన్నుకొనే స్వేచ్ఛ రాజ్యాంగం ప్రకారం మనకు దక్కింది.
అనేకమంది ఎవేవో వాగ్దానాలతో మన ఓటును అర్థిస్తున్నారు. చాలా మంది అమాయకులు అనేక విధాలుగా ప్రలోభ పెట్టబడుచున్నారు.
తెలివైనవారు తెలివిగా ప్రవర్తిస్తున్నారు. కాని చాలా మంది అమాయకులు వారు పెట్టే ప్రలోభాలకు లోనైపోతున్నారు.
కొందరభ్యర్థులైతే ప్రలోభాలకు గురిచేయడమే కాక దేవునిపై ప్రమాణం కూడా చేయిస్తున్నారు. హారతి కర్పూరం ఆర్పిస్తున్నారు.
ఆర్యులారా! నా మాట కొంచెం వినండి. దేవుడు మిమ్మల్ని లంచం పుచ్చుకోమంటాడా, అలా ఏదైనా ప్రళొభానికి మీరు గురైతే ఆ తప్పు మిమ్ములను ప్రలోభ[పెట్టినవారెకే కాని, మీది కాదు.
మీ హృదయంలో ఆ భగవంటుడుండి తీరుతాడు. ఆత్మ సాక్షిని కాదని మీరు ఓటు వేసినట్లైతే అది ఆ పరమాత్మ సహిస్తాడా?
మీకు ఎవ్వరెవ్వరెంతెంత ఏమేమి ఇచ్చినా  అదంతా మీ మనసులో పెట్టుకోకండి. ఏ ప్రమాణాలూ మీకు ఎటువంటి హానీ కలిగించవు.
ఈ మంచి సమయంలో మీవోటును దుర్వినియోగ పరిచారంటే ఆ పొరపాటు ఐదు సంవత్సరాలు అనుభవించ వలసి రావచ్చు.
మీ నిర్ణయం నిర్మొహమాటంగా ఈ రహస్య వోటింగ్ విధానంలోనైనా మీరు ప్రకటించుకోలేకపోతే మీరు జీవించి ఉన్నవారిగా మిమ్మల్ని మీరైనా భావించగలుగుతారా? ఆత్మ వంచన వద్దు. మీకెవరు బాగా పరిపాలన అందిస్తారని నమ్మకముంటే వారి గుర్తుపైనే ఓటు వెయ్యండి. ఎవ్వరూ నచ్చకపోయినట్లైతే నిర్మొహమాటంగా తిరస్కార వోటు వెయ్యండి.
మీ ఓటు మహనీయ మైన మన భరత మాత భవితను వ్రాస్తుంది. భావి భారత పౌరులజీవనాధారమై ఉందిఒ దయచేసి గుర్తించండి.
ఆత్మ సాక్షిగా ఓటు వెయ్యండి.ప్రలోభాల సాక్షిగా వెయ్యకండి.
శుభమస్తు.
మన భరత మాతకు మంచి భవిత కలుగు గాక. భారతీయులందరూ సుఖ సంతోషాలతో జీవింతురు గాక.
జైహింద్
జైహింద్
జైహింద్