Saturday, October 21, 2017

బాల భావన శతకము. 15 వ పద్యము. రచన. చింతా రామకృష్ణారావు.

జైశ్రీరామ్.
15) శ్రద్ధఁ గొలిపి భవిత నర్థవంతము చేయు  భవ్యమూర్తి తండ్రి బ్రహ్మ మాకు.
    నవత మరిగి మమ్ము నడిపించ మరచిరేపెద్దలార! జ్ఞాన వృద్ధులార!


భావము. జ్ఞాన సంపన్నులైన ఓ పెద్దలారా! మాలో శ్రద్ధ కలిగించి, మా జీవితాలను అర్థవంతంగా తీర్చిదిద్దే తండ్రి మాకు బ్రహ్మయే. అట్టి తండ్రి ఈ నాడు ఆధునిక జీవన సరళిలో మమ్ములను పట్టించుకోవడం లేదుకదా! ఇది ధర్మమేనా?
జైహింద్.

Friday, October 20, 2017

శ్రీ హరి వీయస్సెన్ మూర్తి కవికృత గవాక్ష బంధ కందము.

 జైశ్రీరామ్.
ఆర్యులారా! శ్రీ హరి వీయస్సెన్ మూర్తి గారు
వ్రాసిన గవాక్షబంధ కందము తిలకించండి.
శ్రీ హరి వీయస్సెన్ మూర్తి

మాన్యులు కవివర్యులు శ్రీ చింతా రామకృష్ణారావుగారు 
ఈరోజు పరిచయము చేసిన రచనను 
చూచూటవలన కలిగిన స్ఫూర్తితో చేసిన ప్రయత్నము.
వారికి నమశ్శతములు.

సత్యత్యక్తుం డగునా
నిత్యము కరిరాట్ప్రసాదు నిర్మల దయతో
భృత్యుడు నౌనా ప్రణతిన్
సత్యైశ్వర్యాహరుండు శౌరీ జేజే. 
 హరి వీయస్సెన్ మూర్తీ!
పరమాద్భుత రీతి మీరు పరుగు పరుగునన్
మురియుచు గవాక్ష బంధము
 నరయుచు కందమును వ్రాసిరాహా యనగా!
కవిగారికి అభినందనలు.
జైహింద్.

బాల భావన శతకము. 14 వ పద్యము. రచన. చింతా రామకృష్ణారావు.

జైశ్రీరామ్.
14) తిట్టుచుంద్రు మమ్ము కొట్టుచు నుందురు    పెంచి పెద్ద చేయు పెద్ద మీరు
     మమ్ము మీరు తిట్ట మాటాడ లేముగా  -  పెద్దలార! జ్ఞాన వృద్ధులార!


భావము. జ్ఞాన సంపన్నులైన ఓ పెద్దలారా! మీరు మమ్మల్ని అవసరంగాను, ఒక్కొక్కప్పుడు అనవసరంగాను కొట్టుతూ తిట్టుతూ ఉంటారు. మమ్మల్ని పోషించి, పెంచే పెద్దవారు మీరు తిట్టితే మిమ్మల్ని మేము ఏమి అనఁగలము చెప్పండి?
జైహింద్.

Thursday, October 19, 2017

బాల భావన శతకము. 13 వ పద్యము. రచన. చింతా రామకృష్ణారావు.

జైశ్రీరామ్.
13) శ్రవణ పుటములందు చప్పుళ్ళు పడుచుండ  చదువుచున్నఁగాని మదికి పోదు.
    చదువుచున్న మాకు సహకరింపరదేలపెద్దలార! జ్ఞాన వృద్ధులార!


భావము. జ్ఞాన సంపన్నులైన ఓ పెద్దలారా! మేము చదువుకొనే సమయంలో మీరు అవసరమున్నవాటిని గూర్చి, అవసరము లేనివాటిని గూర్చి మాటాడుకొంటూ ఏవేవో చప్పుళ్ళు చేస్తుంటారు. మా ఏకాగ్రతకు భంగం వాటిల్లుతోంది కదా? మాకు మీరు చదువుకొనేటందుకు ఎందుకు సహకరించడం లేదు?
జైహింద్.

Wednesday, October 18, 2017

బాల భావన శతకము. 12 వ పద్యము. రచన. చింతా రామకృష్ణారావు.

జైశ్రీరామ్.
12) దూర దర్శనమున దుర్భర ఘన శబ్ద  కలుషమునకు మనసు కలత చెందు.
    శబ్దమెక్కువున్న చదువుట సాధ్యమాపెద్దలార! జ్ఞాన వృద్ధులార!


భావము. జ్ఞాన సంపన్నులైన ఓ పెద్దలారా! మీరు దూరదర్శనములో చూచే కార్యక్రమాలు స్వరమునధికము చేసి వినుచున్న కారణముగా దుర్భరమైన ఆధ్వని కాలుష్యమునకు మా మనసు కలత చెందుతుంది కదా? అంత శబ్దములో చదువుట మాకు సాధ్యమగునా?
జైహింద్.

Tuesday, October 17, 2017

బాల భావన శతకము. 11 వ పద్యము. రచన. చింతా రామకృష్ణారావు.

జైశ్రీరామ్.
11) దూర దర్శనమును మీరు చూచుచు మమ్ము - మెదలకుండ చదువు చదువుమనిన
   మనసు నిలుచునెటుల? మాకది సాధ్యమాపెద్దలార! జ్ఞాన వృద్ధులార!


భావము. జ్ఞాన సంపన్నులైన ఓ పెద్దలారా! మీరు దూరదర్శన యంత్రము ద్వారా కార్యక్రమములను చూస్తూ, మమ్మల్ని కదలకుండా మెదలకుండా చదవమంటారు. మీరు చూస్తున్న కార్యక్రమాలు అక్కడే ఉంటున్న మేము చూడకుండా, ఆశబ్దము వినకుండా మమ్ములను మేము ఎలా నిరోధించుకొనగలము? ఈ విషయమును మీరెందుకు ఆలోచించరు?
జైహింద్.

Monday, October 16, 2017

బాల భావన శతకము. 10 వ పద్యము. రచన. చింతా రామకృష్ణారావు.

జైశ్రీరామ్.
10) చదువుకొనెడి వేళ చదువుకోనీయక  పనులు చెప్పి మమ్ము పంపు మీరు
    చదువు వెనుకఁబడిన, చవటగా చూతురాపెద్దలార! జ్ఞాన వృద్ధులార!

భావము. జ్ఞాన సంపన్నులైన ఓ పెద్దలారా! మేము చదువుకొనవలసిన సమయంలో చదువుకోనీకుండా ఏవో పనులు మాకు చెప్పి మా చదువుకు ఆటంకము కలిగిస్తారు. ఆ కారణముగా మేము చదువులో వెనుకబడుసరికి మేము పనికిరాని చవటలమన్నట్లుగా మీరు చూస్తారు. ఇదేమైనా బాగుందా?
జైహింద్.