జైశ్రీరామ్.
46 వ శ్లోకము.
లలాటం లావణ్య ద్యుతి విమలమాభాతి తవ యత్
ద్వితీయం తన్మన్యే మకుటఘటితం చంద్రశకలమ్ |
విపర్యాసన్యాసాదుభయమపి సంభూయ చ మిథః
సుధాలేపస్యూతిః పరిణమతి రాకాహిమకరః ||
పదచ్ఛేదము.
లలాటమ్ - లావణ్య - ద్యుతి - విమలమ్ - ఆభాతి - తవ - యత్ -
ద్వితీయమ్ - తత్ - మన్యే - మకుట - ఘటితమ్ - చంద్ర - శకలమ్ -
విపర్యాస - న్యాసాత్ - ఉభయమ్ - అపి - సంభూయ చ - మిథః -
సుధ - ఆలేప - స్యూతిః - పరిణమతి - రాకా - హిమకరః.
అన్వయక్రమము.
తవ, లలాటమ్, లావణ్యద్యుతి, విమలమ్, ఆభాతి, యత్, తత్, మకుట ఘటితమ్, ద్వితీయమ్, చంద్రశకలమ్, మన్యే, ఉభయమ్ అపి, విపర్యాసన్యాసాత్, మిథః, సంభూయచ, సుధాలేపస్యూతిః, రాకాహిమకరః, పరిణమతి.
పద్యము.
శా. లావణ్యాంచిత సల్లలాట కలనా! శ్లాఘింతునద్దానినే
భావంబందున నర్ధచంద్రుఁడనుచున్ భాసించుటన్ గాంచి, పై
నావంకన్ గల నీ కిరీట శశి వ్యత్యస్తంబుగాఁ గూడుటన్
భావింపన్ సుధ పూతఁబూర్ణ శశిగా భాసించుఁగా శాంభవీ!॥46॥
ప్రతిపదార్థము.
(హే భగవతి! = ఓ తల్లీ!)
తవ = నీ యొక్క,
లలాటమ్ = నుదురు భాగము,
లావణ్యద్యుతి = సౌందర్యాతిశయకాంతితో,
విమలమ్ = స్వచ్చమై,
ఆభాతి = అంతటా ప్రకాశించుచున్నదై,
యత్ = ఏది కలదో,
తత్ = దానిని,
మకుట ఘటితమ్ = కిరీటము నందు కూర్చబడినదైన,
ద్వితీయమ్ = రెండవ దైన,
చంద్రశకలమ్ = చంద్రుని అర్ధఖండముగా,
మన్యే = ఊహించుచున్నాను,
ఉభయం అపి = నీ లలాటభాగము, ఆ చంద్ర ఖండము - ఈ రెండును,
విపర్యాసన్యాసాత్ = వ్యత్యస్తముగా కలుపుట వలన,
మిథః = పరస్పరము,
సంభూయచ = కలసికొని,
సుధాలేపస్యూతిః = అమృతపు పూత కలిగిన,
రాకాహిమకరః = పూర్ణిమచంద్రునిగా,
పరిణమతి = అగుచున్నది.
భావము.
తల్లీ! జగజ్జననీ! నీ నుదురు భాగము పవిత్రమైన సౌందర్యాతిశయముతో ప్రకాశించుచున్నది. అట్టి ఈ లలాటభాగము నీ కిరీటమునందు కనబడకుండానున్న చంద్రుని రెండవ అర్ధభాగముగా ఉన్నట్లు ఊహించుచున్నాను. నా ఈ ఊహ నిజమే అయి వుండవచ్చును. కారణమేమనగా నీ లలాట భాగమును ఆ అర్ధచంద్ర భాగమును కలిపినచో అమృతమును స్రవించు పూర్ణచంద్రుని ఆకారమును పొందుచున్నది. ఆ స్రవింపబడు అమృతముతోనే ఆ రెండూ అతకబడినట్లు గూడా కనబడని విధముగా కలసిపోయి, పూర్ణచంద్రుని వలె భాసించుచున్నవి గదా!
47 వ శ్లోకము.
భ్రువౌ భుగ్నే కించిద్భువన భయ భంగ వ్యసనిని
త్వదీయే నేత్రాభ్యాం మధుకర రుచిభ్యాం ధృతగుణమ్ |
ధనుర్మన్యే సవ్యేతరకర గృహీతం రతిపతేః
ప్రకోష్ఠే ముష్టౌ చ స్థగయతి నిగూఢాంతరముమే ||
పదచ్ఛేదము.
భ్రువౌ - భుగ్నే - కించిత్ - భువన - భయ - భంగ - వ్యసనిని -
త్వదీయే - నేత్రాభ్యామ్ - మధుకర - రుచిభ్యామ్ - ధృత - గుణమ్ -
ధనుః - మన్యే - సవ్య - ఇతర - కర - గృహీతమ్ - రతి - పతేః -
ప్రకోష్ఠే - ముష్టౌ - చ - స్థగయతి - నిగూఢ - అంతరమ్ - ఉమే.
అన్వయక్రమము.
ఉమే! భువన, భయ, భంగ, వ్యసనిని, త్వదీయే, కించిత్, భుగ్నే, భ్రువే, మధుకర, రుచిభ్యామ్, నేత్రాభ్యామ్, ధృత, గుణమ్, రతి పతేః, సవ్యేతర, కర, గృహీతమ్, ప్రకోష్ఠే, ముష్టౌచ, స్థగయతి, నిగూఢ, అంతరమ్, ధనుః, మన్యే.
పద్యము.
తే.గీ. భువన భయ హర వ్యసన! కన్ బొమలు నీవి
మరుని విల్లు, కనుల్ త్రాడు కరణినొప్పఁ,
బిడికిటనుపట్టి యుండుటన్ వింటిత్రాడు
మధ్య కనరాని మరువిల్లు మదినిఁ దోచు. ॥ 47 ॥
ప్రతిపదార్థము.
ఉమే = ఓ పార్వతీ,
భువన = లోకముల యొక్క,
భయ = ఉపద్రవములను,
భంగ = నాశము చేయుట యందే,
వ్యసనిని = ఆసక్తిగలదేవీ,
త్వదీయే = నీ యొక్క,
కించిత్ = కొద్దిగా,
భుగ్నే = వంగినవి అయిన,
భ్రువే = కనుబొమలను,
మధుకర = తుమ్మెదలవంటి,
రుచిభ్యామ్ = శోభ కలిగినటువంటి,
నేత్రాభ్యామ్ = కనుదోయిచేతను,
ధృత = పొందిన,
గుణమ్ = అల్లెత్రాడు గలదై,
రతిపతేః = మన్మథుని యొక్క,
సవ్యేతర = ఎడమది అయిన,
కర = హస్తముచేత,
గృహీతమ్ = పట్టుకొనబడినదియు,
ప్రకోష్ఠే = మణికట్టును,
ముష్టౌచ = పిడికిలియు,
స్థగయతి = కప్పుచున్నది కాగా,
నిగూఢ = కప్పబడి చూడబడని వింటినారి,
అంతరమ్ = వింటి నడిమి భాగము గలదైన,
ధనుః = విల్లునుగా,
మన్యే = తలంచుచున్నాను.
భావము.
ఓ మాతా! సమస్త లోకాలకు కలుగు ఆపదలనుండి వాటిని రక్షించుటయందే పట్టుదలతో గూడిన ఆసక్తి గల ఓ తల్లీ, ఉమా! కొద్దిగా వంపుగా వంగినట్లున్న నీకనుబొమల తీరు – తుమ్మెదల వంటి శోభను గలిగి, అడ్డముగా వరుసలోనున్న నల్లని కనుదోయిని వింటినారిగా గలిగి – మన్మథుని వామహస్తము యొక్క పిడికిలిచేత నడిమి భాగములో పట్టుబడుటచే కనబడకుండానున్న కొంత నారి భాగమును, దండభాగమును కలిగిన – విల్లుగా అనిపించుచున్నది.
48 వ శ్లోకము.
అహస్సూతే సవ్యం తవ నయనమర్కాత్మకతయా
త్రియామాం వామం తే సృజతి రజనీనాయకతయా |
తృతీయా తే దృష్టిర్దరదలిత హేమాంబుజ రుచిః
సమాధత్తే సంధ్యాం దివసనిశయోరంతరచరీమ్ ||
పదచ్ఛేదము.
అహః - సూతే - సవ్యమ్ - తవ - నయనమ్ - అర్క - ఆత్మకతయా -
త్రియామామ్ - వామమ్ - తే - సృజతి - రజనీ - నాయక - తయా -
తృతీయా - తే - దృష్టిః - దర - దళిత - హేమ - అంబుజ - రుచిః -
సమాధత్తే - సంధ్యామ్ - దివస - నిశయోః - అంతర - చరీమ్.
అన్వయక్రమము.
తవ, సవ్యమ్, నయనమ్, అర్కాత్మకతయా, అహః, సూతే, వామమ్, తే, నయనమ్, రజనీ నాయకతయా, త్రియామామ్, సృజతి, దర, దళిత, హేమాంబుజ, రుచిమ్, తే, తృతీయా దృష్టిః, దివస నిశయోః, అంతర చరీ, సంధ్యామ్, సమాధత్తే.
పద్యము.
తే.గీ. పగలు కొలుపు నీ కుడికన్ను పరగు రవిని,
రాత్రి నెడమకన్నది కొల్పు రాజుఁ గలిగి,
నడిమి నేత్రమగ్నియగుటన్ నడుపు సంధ్య,
కాలరూపమే నీవమ్మ కమలనయన! ॥ 48 ॥
ప్రతిపదార్థము.
(హే భగవతీ! = ఓ జననీ!)
తవ = నీ యొక్క,
సవ్యమ్ = కుడివైపున దైన,
నయనమ్ = కన్ను,
అర్కాత్మకతయా = సూర్యసంబంధమైన దగుటచేత,
అహః = పగటిని,
సూతే = పుట్టించుచున్నది,
వామమ్ = ఎడమవైపునదైన,
తే = నీ యొక్క,
నయనమ్ = కన్ను,
రజనీ నాయకతయా = చంద్రుఁడగుటచేత,
త్రియామామ్ = రాత్రిని,
సృజతి = కలిగించుచున్నది,
దర = కొంచెముగా,
దలిత = వికసించినదైన,
హేమాంబుజ = స్వర్ణకమలము యొక్క,
రుచిమ్ = ప్రకాశము వంటి రంగుగల,
తే = నీ యొక్క,
తృతీయా దృష్టిః = లలాటమున నున్న మూడవ కన్ను,
దివస నిశయోః = పగలు రాత్రి అను వాని యొక్క,
అంతరచరీ = నడుమ వర్తించు చున్నదైన,
సంధ్యామ్ = సాయం ప్రాతః సంబంధమైన సంధ్యల జంటను,
సమాధత్తే = చక్కగా ధరించుచున్నది.
భావము.
అమ్మా! జగజ్జననీ! నీ కుడికన్ను సూర్య సంబంధమైనదగుటచే పగటిని జనింపజేయుతున్నది. నీ యొక్క ఎడమకన్ను చంద్ర సంబంధమైనదగుటచే రాత్రిని పుట్టించుచున్నది. ఎర్రతామరపూవురంగు గల నీ లలాటనేత్రము అహోరాత్రముల నడుమ వర్తించుచూ సాయం పాత్రః కాల సంబంధమైన ఉభయ సంధ్యలను అగ్నిని సూచించు ఎరుపుదనము తన వర్ణ లక్షణముగా గలదని సూచించుట వలన ఈ తృతీయ నేత్రము అగ్ని సంబంధమైనదని గ్రహించబడుతున్నది.
49 వ శ్లోకము.
విశాలా కల్యాణీ స్ఫుటరుచిరయోధ్యా కువలయైః
కృపాధారాధారా కిమపి మధురాఽఽభోగవతికా |
అవంతీ దృష్టిస్తే బహునగర విస్తార విజయా
ధ్రువం తత్తన్నామ వ్యవహరణ యోగ్యావిజయతే ||
పదచ్ఛేదము.
విశాలా - కల్యాణీ - స్ఫుట - రుచిః - అయోధ్యా - కువలయైః -
కృపా - ధారాధారా - కిమ్ - అపి - మధురా - ఆభోగవతికా -
అవంతీ - దృష్టిః - తే - బహు - నగర - విస్తార - విజయా -
ధ్రువమ్ - తత్ - తత్ - నామ - వ్యవహరణ - యోగ్యా - విజయతే.
అన్వయక్రమము.
తే, దృష్టిః, విశాలా, కళ్యాణీ, స్ఫుట రుచిః, కువలయైః, అయోధ్యా, కృపాధారా, ఆధారా, కిమపి, మధురా, ఆభోగవతికా, అవంతీ, బహునగర, విస్తార,విజయా, తత్ తత్, వ్యవహరణ, యోగ్యా, విజయతే, ధ్రువమ్.
పద్యము.
మ. కరుణాపాంగ! విశాలమై, కనుబొమల్ కల్యాణ కాంతిన్, సతీ!
పరగున్ జూడ నయోధ్యయై కలువకున్, భవ్యకృపాధార సుం
దరధారా మధురాత్మ, భోగవతియై, నా యందవంతీ ధృతిన్,
బరమంబై విజయాష్టపట్టణములన్ భావింపనౌ నీ యెడన్. ॥ 49 ॥
ప్రతిపదార్థము.
(హే భగవతీ! = ఓ అమ్మా!)
తే = నీ యొక్క,
దృష్టిః = చూపు,
విశాలా = విపులమై,
కళ్యాణీ = మంగళ స్వరూపమై,
స్ఫుట రుచిః = స్పష్ట కాంతివంతమై,
కువలయైః = నల్లకలువల చేత,
అయోధ్యా = జయించుటకు వీలుకానిదై,
కృపాధారా = కరుణా ప్రవాహమునకు,
ఆధారా = ఆధారమగుచున్నదై,
కిమపి = ఇట్టిదని చెప్పుటకు వీలుకానిదై,
మధురా = మధురమై,
ఆభోగవతికా = విశాల దృక్పథము గలదై,
అవంతీ = రక్షణ లక్షణము గలదై,
బహునగర = పెక్కుపట్టణముల యొక్క,
విస్తార = సమూహముయొక్క,
విజయా = విజయము గలదియై,
తత్ తత్ = ఆయా నామ నగరముల పేర్ల చేత, అనగా విశాలా, కళ్యాణీ ' అయోధ్యా, ధారా, మధురా, భోగవతీ, అవంతీ, విజయా - అను ఎనిమిది నగర నామముల చేత,
వ్యవహరణ = వ్యవహరించుటయందు,
యోగ్యా = తగినదై,
విజయతే = విజయవంతమై వర్ధిల్లుచున్నది,
ధ్రువమ్ = ఇది నిశ్చయము.
భావము.
తల్లీ ! జగజ్జననీ ! నీ చూపు
విశాలమై – విశాలయను నగర నామము వ్యవహరించుటకు తగినదియై;
కళ్యాణవంతమై – కళ్యాణీ అనునగర నామ వ్యవహారమునకు యోగ్యమై;
స్పష్టమైన కాంతి గలిగి – నల్ల కలువలు జయించలేని సౌందర్యము కలది అగుచు;
అయోధ్య అను నగరము పేర పిలుచుటకు తగినదై,
కృపారస ప్రవాహమునకు ఆధారవుగుచూ ధారానగర నామముతో వ్యవహరించుటకు తగినదై;
వ్యక్తము చేయ వీలులేని మధుర మనోజ్ఞమగుచు – మధురానగర నామముతో పిలుచుటకు అర్హమై;
విశాలము, పరిపూర్ణ దృక్పథమును గలుగుచు – భోగవతీ నగర నామముతో వ్యవహరించటకు తగినదై;
రక్షణ లక్షణము కలిగి – అవంతీ నగర నామముతో పిలుచుటకు తగినదై;
విజయ లక్షణముతో- విజయనగర నామముతో వ్యవహరింప తగినదై –
ఈ విధమైన ఎనిమిది లక్షణములతో ఎనిమిది నగరముల పేర వ్యవహరించుటకు తగినదై – సర్వోత్కర్షత చేత స్వాతిశయముతో వర్తించుచున్నది.
50 వ శ్లోకము.
కవీనాం సందర్భ స్తబక మకరందైక రసికం
కటాక్ష వ్యాక్షేప భ్రమర కలభౌ కర్ణయుగలమ్ |
అముంచంతౌ దృష్ట్వా తవ నవరసాస్వాద తరలౌ
అసూయా సంసర్గా దలికనయనం కించిదరుణమ్ ||
పదచ్ఛేదము.
కవీనామ్ - సందర్భ - స్తబక - మకరంద - ఏక - రసికమ్ -
కటాక్ష - వ్యాక్షేప - భ్రమర - కలభౌ - కర్ణ - యుగలమ్ -
అముంచంతౌ - దృష్ట్వా - తవ - నవ - రస - ఆస్వాద - తరలౌ -
అసూయా - సంసర్గాత్ - అలిక - నయనమ్ - కించిత్ - అరుణమ్.
అన్వయక్రమము.
కవీనామ్, సందర్భ, స్తబక, మకరంద, ఏకరసికమ్, తవ, కర్ణయుగలమ్, కటాక్ష, వ్యాక్షేప, భ్రమర కలభౌ, నవరస, ఆస్వాద, తరలౌ, అముంచంతౌ, దృష్ట్వా, అలిక నయనమ్, అసూయా సంసర్గాత్, కించిత్, అరుణమ్.
పద్యము.
చం. కవుల కవిత్వసన్మధువు కమ్మగ ప్రీతిని గ్రోలనెంచియున్,
జెవులను వీడనట్టివియు, శ్రీకరమైన సునేత్ర సన్మిషన్,
బ్రవిమల తేజ సద్భ్రమర భాతిని చూచి యసూయఁ జెంది, మూ
డవదగు నేత్ర మెఱ్ఱఁబడె నమ్మరొ నీకు, మనోహరాకృతీ! ॥ 50 ॥
ప్రతిపదార్థము.
(హే భగవతీ! = ఓ జననీ!)
కవీనామ్ = కవుల యొక్క,
సందర్భ = రసవత్తర రచనలు అనెడి,
స్తబక = పుష్ప గుచ్ఛము నందలి,
మకరంద = తేనె యందు (మాత్రమే),
ఏకరసికమ్ = ముఖ్యముగా ఇష్టపడు,
తవ = నీ యొక్క,
కర్ణయుగలమ్ = రెండు చెవులను,
కటాక్ష= కడగంటి చూపులను,
వ్యాక్షేప = నెపముగా పెట్టుకొని,
భ్రమర కలభౌ = గండు తుమ్మెదలు రెండు,
నవరస = శృంగారాది నవ రసముల యొక్క,
ఆస్వాద = ఆస్వాదమునందు,
తరలౌ = అత్యంతాసక్తి కలిగినవై,
అముంచంతౌ = ఆ రసాస్వాదన లాంపట్యము చేత (రసాస్వాదన చేయు) నీ వీనుల జంటను విడువలేక యుండుటను,
దృష్ట్వా = చూచి,
అలిక నయనమ్ = మూడవదైన నీ లలాట నేత్రము,
అసూయా సంసర్గాత్ = ఈర్ష్య చెందుట వలన,
కించిత్ = కొంచెము
అరుణమ్ = ఎఱుపు వన్నెగలదైనది, (ఎఱ్ఱబడినది.)
భావము.
అమ్మా, ఓ భగవతీ! సుకవీశ్వరుల రసవత్తర రచనలనే పుష్ప గుచ్ఛముల నుండి జాలువారు తేనెయందు మాత్రమే అత్యంతాసక్తిని చూపు నీ యొక్క చెవుల జతను – కడగంటి చూపులు అను నెపముతో నీ రెండు కన్నులు అను గండు తుమ్మెదలు – శృంగారాది నవరసాస్వాదనానుభూతిని పొందుట యందు అత్యంతాసక్తిని కలిగినవై – ఆ రసాస్వాదన లాంపట్యము చేత నీ వీనుల జంటను విడువలేక యుండగా – పైన ఉన్న లలాట నేత్రము చూసి – మిక్కిలిగా అసూయ చెంది, ఎఱుపు వన్నెకలదైనది అనగా “కోపముతో ఎఱ్ఱఁబడినది” అని భావము.
జైహింద్.
No comments:
Post a Comment