Saturday, January 4, 2025

చిత్ర కవిత.....కోవెల సంతోష్ కుమార్.

జైశ్రీరామ్.

 చిత్ర కవిత.

భాష మీద అధికారం, పద్యవిద్యా ప్రాగల్భ్యం ఉండటం సాధారణంగా కావ్యరచనకు తగిన అవసరం. దీంతో పాటు పదప్రయోగంలో ఏయే అక్షరాలు ఎక్కడెక్కడ ఒదిగి ఉంటవో సద్య స్ఫురణలో ఉండటం చిత్రకవితకు ప్రధాన లక్షణం. చిత్ర కవితలో గర్భ కవిత్వం, బంధ కవిత్వం, ఏకాక్షర, ద్యక్షర పద్యాలు, పద్య భ్రమక, పాద భ్రమకాలు.. అనులోమ విలోమ రీతులు, అంతర్భవిస్తవి. చిత్ర కవిత నిర్వహణకు ఛందస్సు మీద ఉన్న అధికారం గర్భ కవిత్వానికి ప్రధానమైన అర్హత. సీస పద్యంలో మత్తేభం నాలుగు పాదాల్లో ఇమిడిపోతుంది. అట్లాగే గీత పద్యంలో కందము ఇమిడిపోతుంది. పై పాదాలలో మొదట చివర చేర్చవలసిన అక్షరాలు యతులకు అనుగుణంగా తెలిస్తే ఇది సాధ్యమవుతుంది.అట్లాగే ఇతర గర్భ పద్యాలకు కూడా. ప్రబంధ రాజ వెంకటేశ్వర విలాసంలో గణపవరపు వెంకట కవి ఒక సీస పద్యంలో సుమారు 190 పద్యాలను ఇమిడించాడు. ఇది ప్రపంచంలోనే ఛందో విద్యలో అసామాన్యమైన పోటీలేని ఒక గొప్ప ఉపలబ్ధి. కంద పద్యంలో ఆయా భాగాల్లో విరుపులతో నాలుగు కంద పద్యాలు ఇమిడిపోతవి. ఇది యతి ప్రాసలను ఇమిడించుకునే ఎరుకతో సాధించవచ్చు. ఆధునిక కాలంలో ఒక కవి భారత గర్భ రామాయణం అని ఒక అపూర్వ ప్రబంధాన్ని నిర్మించాడు. గర్భ పద్యాలలో రామాయణ గాధ, మొత్తం పద్యంలో భారత గాధ ఇమిడి ఉంటాయి. ఇది ఒక విధంగా ద్వ్యర్థి కావ్యాలకు విలక్షణమైన చేర్పు. సంస్కృతంలో అనులోమ విలోమ కావ్యంగా రామాయణ భారతాలను ఇమిడించిన ఒక అద్భుత కావ్యం ఉన్నది.

ఇంకా చిత్రకవిత్వంలో ఒక అక్షరంతోని, రెండు అక్షరాలతోని పద్యాలు నిర్మించే ప్రక్రియ ఉన్నది. ఈ రీతి కవికి ఉన్న నిరంతర భాషాధ్యయనము, నిఘంటు పరిజ్ఞానము వల్ల సాధ్యపడుతుంది. పద్య భ్రమక, పాద భ్రమకాలు భాషమీద ఛందస్సు మీద ఉన్న పట్టు వల్ల సాధింపబడేవి. శ్రీరామా, రామాశ్రీ అన్న కంద పద్య తొలిపాదం పాద భ్రమక రీతికి ఒక ఉదాహరణ. నాలుగు పాదాలు ఇలాగే రచన సాగుతుంది. శబ్దాల బహు అర్థ సంఘటన అక్షరాలను పోహళించే రీతి గురు లఘవుల పొదిగింపు ఈ ప్రజ్ఞలన్నీ చిత్ర కవితకు అత్యవసర సాధనాలు.

బంధ కవిత్వం విషయం వస్తే, విచిత్రమైన ఆకారాలు, ఛత్రము, ఖడ్గము, నాగము, గజము మొదలైనవి కల్పించి వాటిలో తాను ఇమిడించదలచుకున్న పద్యానికి తగిన గడులను ఏర్పరిచి ఆ అక్షరాలు రెండు మూడు సందర్భాలలో, భిన్న భిన్న అర్థాలలో కుదిరేట్లు నిర్మించుకోవటం తో పాటు గణ యతి ప్రాసలకు భంగం కలగకుండా పద్య రచన సాగించవలసి ఉంటుంది. ఈ బంధ కవిత్వాన్ని నూరు పైగా బంధాలలో చిత్రించిన వారు కరీంనగర్‌ జిల్లా కోరుట్లకు చెందిన శతావధానం కృష్ణమాచార్యులు. అట్లాగే వరంగల్‌కు చెందిన ఠంయాల లక్ష్మీనరసింహాచార్యులు తమ అనేక ప్రబంధాలలో (వాటిలో అచ్చ తెనుగు కావ్యాలు, నిరోష్ట్య, నిర్వచన కావ్యాలు ఉన్నవి) 60 విలక్షణమైన బంధ భేదాలు నిర్మించారు. ఈ పద్యాలు నూరుకు మించే ఉన్నాయి.

చిత్ర కవిత్వ అభ్యాసం ప్రధానంగా తెలంగాణాలోని కవుల రచనల్లో కన్పిస్తుంది. ఈ రకమైన విలక్షణ స్థితికి ఈ ప్రాంతంలో కవులలో ఉండే సృజన శీలంలోని ప్రయోగ దృష్టి కారణం అని చెప్పాలి. ఈ విషయం ప్రత్యేకంగా పరిశోధించితే ఈ కవులు చేసిన ప్రయోగాలలోని వైశిష్ట్యము, నైపుణ్యం తెలియవస్తాయి. చిత్రకవిత్వ పద్యాలు సాధారణంగా కావ్య మధ్యంలో దేవతా స్థుతులలో కన్పిస్తుంది. ఈ కావ్యాలలోని చక్రబంధం విలక్షణమైంది. దీన్లో ఒక వలయంలో కావ్య నామం, ఇంకొక వలయంలో కవి నామం, నిక్షేపింపబడి ఉంటాయి. మరింగంటి సింగరాచార్యులు రచించిన బిల్హణీయ కావ్యం ఇంకొకరి రచనగా ప్రచారం అయినా, చక్రబంధంలో నిక్షేపింపబడిన నామం వల్ల అది ఆయన రచనగా సురవరం ప్రతాపరెడ్డి గారు నిర్ణయించారు. చిత్ర కవిత్వం కవి వు్యత్పన్నతకి, అసాధారణ ప్రజ్ఞకు ఉదాహరణ. ఇది ఒక ప్రత్యేకమైన విద్యావిశేషం. ప్రహేళికల వంటి నిర్మాణం. ఆధునిక సాహిత్య విమర్శకులు దీన్నేదో గారడీ విద్య అని నిరసించే ప్రయత్నం చేశారు. ఈ కాలంలో అసాధారణ ప్రతిభాభ్యాసాలకు గిన్నిస్‌ బుక్‌ వంటి వాటిలో స్థానం లభిస్తున్నది. అయితే తెలుగు కవిత్వం సాధించిన ఈ అసాధారణ ప్రజ్ఞా విశేషాలను గూర్చి మనం ఎందుకు గర్వించకూడదో అర్థం కాదు. కవిత్వం అంతా భావ కవిత్వంలా ఉండదు. జీవితమంతా హంసతూలికా తల్పంలా ఉండదు. జీవితంలో వైవిధ్యం ఎలాంటిదో కవిత్వంలోని వైచిత్రి కూడా అలాంటిది. జీవితంలో అద్భుతం, మనస్సుకు ఎంత ఉదాత్తతను కల్పిస్తుందో, చిత్ర కవిత్వం కల్పించే అలాగే చిత్తానికి ఉన్నతిని కల్పిస్తుంది. మనం సమాహిత చిత్తంతో చిత్ర కవిత్వాన్ని అది కలిగించే అచ్చెరువుని అనుభవిద్దాం.


జైహింద్.