౧. అగ్నిమీళే పురోహితం యజ్ఞస్య దేవమృత్విజమ్ | హోతారం రత్నధాతమమ్ ||
ప్రతిపదార్థము. అగ్నిం = అగ్నిని; పురోహితం = పురోహితుడిని; యజ్ఞస్యదేవం = (జీవన) యజ్ఞాన్ని ప్రకాశింపచేసేవానిని; ఋత్విజమ్ = ఋత్విక్కును; హోతారమ్ = హోతను ( దేవతాశక్తులను ఆహ్వానించే ఋత్విక్కును); రత్నధాతమమ్ = (జీవన యజ్ఞక్రియారూపం ద్వారా వచ్చే) ధర్మ, జ్ఞానరత్నాలతో పోషించేవాణ్ణి; ఈళే = నేను ప్రస్తుతిస్తాను, మనసా ప్రార్థిస్తాను.
భావము. అగ్నిని; పురోహితుడిని; (జీవన) యజ్ఞాన్ని ప్రకాశింపచేసేవానిని; ఋత్విక్కును;హోతను ( దేవతాశక్తులను ఆహ్వానించే ఋత్విక్కును); (జీవన యజ్ఞక్రియారూపం ద్వారా వచ్చే) ధర్మ, జ్ఞానరత్నాలతో పోషించేవానిని; నేను ప్రస్తుతిస్తాను, మనసా ప్రార్థిస్తాను.
ఆ. అగ్నిని, పురహితుని, యజ్ఞప్రకాశకు,
నసమ ఋత్విజుని విలసిత హోత
నఖిల ధర్మ జ్ఞాన మమరించి పోషించు
యనిలసఖుని గొలుతు ననుపమగతి.
౨. అగ్ని: పూర్వేభిర్ ఋషి భిరీడ్యో నూతనై రుత !
సదేవాన్ ఏమ వక్షతి !!
ప్రతిపదార్థము. అగ్ని: = అగ్ని; పూర్వేభి: ఋషిభీ: = పూర్వీకులైన ఋషులచేత; ఉత = అంతేగాక;నూతనై: = ఈ కాలపు ఋషులచేత కూడా; ఈడ్య: = పొగడ్తనంద దగినవాడు; స: = ఆ అగ్నిదేవుడు;దేవాన్ = (సృష్టిలోని) దేవతాశక్తులను; ఇహ = ఇక్కడకు (ఈ జీవన యజ్ఞానికి); ఆవక్షతి = తీసుకొని రావాలి (అని ఆకాంక్ష).
భావము. అగ్ని; పూర్వీకులైన ఋషులచేత; అంతేగాక; ఈ కాలపు ఋషులచేత కూడా;పొగడ్తనంద దగినవాడు; ఆ అగ్నిదేవుడ; (సృష్టిలోని) దేవతాశక్తులను; ఇక్కడకు (ఈ జీవన యజ్ఞానికి); తీసుకొని రావాలి (అని ఆకాంక్ష).
ఆ. అగ్నిపూర్వ ఋషులు నంతియె కాక యా
ధునిక ఋషుల చేత వినుతయోగ్యు
డట్టి యగ్ని యిచట నమర శక్తులనెల్ల
నమరఁజేయ వలతు యజ్ఞమునకు.
౩. అగ్ని నా రయిమశ్నవత్ పోషమేవ దివే దివే !
యశసం వీర వత్తమమ్ !!
ప్రతిపదార్థము. అగ్నినా = అగ్ని ద్వారా; దివే దివే = ప్రతిరోజూ; పోషం ఏవ = పుష్టినిస్తూ వికాసాన్ని అందించే, వీరవత్ తమం యశసం = విక్రాంతివంతమైన, లేక అతిశయ శక్తి వంతులకు తగిన కీర్తిని కలుఁగజేసే; రయిం = (పుష్టిరూప) యశోరూప ధనాన్ని, అశ్నవత్ = (సాధకుడు) పొందుతాడు.
భావము. అగ్ని ద్వారా; ప్రతిరోజూ; పుష్టినిస్తూ వికాసాన్ని అందించే, విక్రాంతివంతమైన, అతిశయ శక్తి వంతులకు తగిన కీర్తిని కలుఁగజేసే; (పుష్టిరూప) యశోరూప; ధనాన్ని, (సాధకుడు) పొందుతాడు;
గీ. దినదినంబున పుష్టినందించి వృద్ధి
నందఁజేయు విక్రాంతుల కధిక కీర్తి
కలుఁగ చేయు యశోధనములను బడయు
నగ్ని మూలాన సాధకుఁ డసదృశముగ .
౪. అగ్నేయం యజ్ఞ మధ్వరం విశ్వత: పరిభూరసి !
స ఇద్దేవేషు గచ్ఛతి !!
ప్రతిపదార్థము. అగ్నీ = హే అగ్నీ, యం యజ్ఞం, అధ్వరం విశ్వత: పరిభూ: అసి = జయాపజయ భావోద్యేగ హింసకు అతీతమైన ఏ సాధనా (క్రియా) యజ్ఞమార్గాన్ని నువ్వు అన్ని వైపులా, చుట్టూ ఉండి (అప్రమత్తంగా పర్యవేక్షిస్తూ) ఉంటావో; స: ఇత్ = ఆ క్రియా యజ్ఞమే; దేవేషు గచ్ఛతి = దేవతల పరిగణనలోనికి చేర గలదు. దానినే మహాత్ములు మెచ్చకుంటారు.
భావము. హే అగ్నీ, జయాపజయ భావోద్యేగ హింసకు అతీతమైన ఏ సాధనా (క్రియా) యజ్ఞమార్గాన్ని నువ్వు అన్ని వైపులా, చుట్టూ ఉండి (అప్రమత్తంగా పర్యవేక్షిస్తూ) ఉంటావో; ఆ క్రియా యజ్ఞమే; దేవతల పరిగణనలోనికి చేర గలదు, దానినే మహాత్ములు మెచ్చకుంటారు.
గీ. జయమునపజయంబను భావచయము మీరి,
సాధనా యజ్ఞ మార్గ సద్బోధ కలిగి
అన్నివైపులనుందువీ వప్రమత్త
తను నదియె యజ్ఞమనిమెత్తు రనిమిషులును.
౫. అగ్నిర్ హోతా కవిక్రతు: సత్యశ్చిత్ర శ్రవస్తమ: !
దేవో దేవేభి రాగమత్ !!
ప్రతిపదార్థము. హోతా = జ్ఞాన విజ్ఞాన దాతలైన దేవతాశక్తులను పిలిచేవాడు; కవిక్రతు: = కవిలాగా సృజనాత్మక శక్తితోనూ, ఉపజ్ఞతోనూ, సాధన క్రియలను నిర్వహించేవాడు; సత్య: = ఎల్లప్పుడూ మార్పుకు అతీతంగా వుండేవాడు; చిత్రశ్రవ: తమ: = కంటికి చిత్రమైన కాంతిశక్తినీ, చెవికి చిత్రమైన నాద శక్తినీ అతిశయంగా అందించేవాడు. వైవిధ్యమైన చిత్ర ధ్వని చిత్రాలకు గొప్ప నెలవు అని పేరెన్నిక గన్నవాడు; అగ్ని: దేవ: = అటువంటి అగ్నిదేవుడు; దేవేభి: ఆగమత్ = తనసాటి దైవీశక్తులతో సహా రావాలి.
భావము. జ్ఞానవిజ్ఞాన దాతలైన దేవతాశక్తులను పిలిచేవాడు; కవిలాగా సృజనాత్మక శక్తితోనూ,ఉపజ్ఞతోనూ, సాధన క్రియలను నిర్వహించేవాడు; ఎల్లప్పుడూ మార్పుకు అతీతంగా వుండేవాడు;కంటికి చిత్రమైన కాంతిశక్తినీ, చెవికి చిత్రమైన నాద శక్తినీ అతిశయంగా అందించేవాడు. వైవిధ్యమైన చిత్ర ధ్వని చిత్రాలకు గొప్ప నెలవు అని పేరెన్నిక గన్నవాడు; అటువంటి అగ్నిదేవుడు; తనసాటి దైవీశక్తులతో సహా రావాలి..
గీ. తలచి జ్ఞానద దేవాళిఁ బిలుచువాఁడు
విసృజనోపజ్ఞసాధనన్వెలుగు క్రియలు
చేయువాఁడును, మార్పులే చేరనతఁడు.
కనులకు విచిత్ర కాంతిని కలుగఁజేసి,
చెవులకు విచిత్ర నాద సచ్ఛ్రీ స్వశక్తి
కలుగఁ జేసెడి వాడును, ఘనతరమగు
వివిధ సచ్చిత్ర, ధ్వని చిత్ర నివహమనగ
పేరుఁ గన్నట్టి వాఁడగ్నిదేవుఁడిపుడు
తనకు సాటైన దేవతాతతులతోడ
వచ్చుగాత నా కడకు తా మెచ్చుగాను.
౬. యదఙ్గ దాశుషే త్వ మగ్నే భద్రం కరిష్యసి !
తవేత్తత్ సత్యమఙ్గిర: !!
ప్రతిపదార్థము. అంగ అగ్నే! అంగిర: = చూడు అగ్ని! (దావాగ్ని అంగారాల్లాగా కోరికలను కాల్చిశమింపజేసే) అంగిరుడా!; త్వం = నువ్వు; దాశుషే = తాను చేసే కర్మలనన్నింటినీ భగవత్సమర్పణం చేసేవాడికి; యత్ భద్రం కరిష్యసి = ఏ సుఖ కల్యాణాలను కలిగిస్తావో; తవ ఇత్ = అది నీదే, నీకు తగినదే; తత్ సత్యం = ఇది ముమ్మాటికీ నిజము.
భావము. చూడు అగ్నీ! ( దావాగ్ని అంగారాల్లాగా కోరికలను కాల్చిశమింపజేసే ) అంగిరుడా! నువ్వు‘తాను చేసే కర్మలనన్నింటినీ భగవత్సమర్పణం చేసేవాడికి’ ఏ సుఖ కల్యాణాలను కలిగిస్తావో; అది నీదే, నీకు తగినదే; ఇది ముమ్మాటికీ నిజము.
గీ. చూడుమగ్ని! యంగిరుఁడా! వసుంధరపయి
తాను చేసెడి కర్మలఁ దక్కు ఫలము
భగవదర్పణ చేసెడిభక్తులకిల
నెట్టి కల్యాణములుగూర్తు వట్టివెల్ల
నీవి. నీకిది తగునయ్య. నిజము నిజము.
౭. ఉపత్వాగ్నే దివే దివే దోషావస్తర్ ధియా వయం !
నమో భరన్త ఏమసి !!
ప్రతిపదార్థము. అగ్నే = హే అగ్నీ; వయం = సాధకులమైన మేము; దివే దివే దోషావస్త: = ప్రతీరోజూ రాత్రీ పగలూ; ధియా = బుద్ధిపూర్వకంగా చేసే కర్మలను; నమో భరన్త: = నమస్సులతో నింపుతూ (కర్మలను అణుకువతో చేస్తూ); ఉప, త్వా, ఆ ఇమసి = నీ దగ్గరకు చేరుతున్నాము.
భావము. హే అగ్నీ! సాధకులమైన మేము; ప్రతీరోజూ రాత్రీ పగలూ; బుద్ధిపూర్వకంగా చేసే కర్మలను;నమస్సులతో నింపుతూ (కర్మలను అణుకువతో చేస్తూ); నీ దగ్గరకు చేరుతున్నాము.
గీ. అగ్నిహోత్రుఁడ! రేబవలనితరమగు
సాధకులమైన మేము సద్బోధఁ జేసి
యోచనను చేయు కర్మలనొప్ప, వంద
నముల నింపుచు, నిన్ జేరుదుమయ! కనుమ!
౮. రాజన్త మధ్వరాణాం గోపామృతస్యదీదివిమ్ !
వర్ధమానంస్వే దమే !!
ప్రతిపదార్థము. (ఓ అగ్ని) రాజన్తం = దేదీప్యమానంగా వెలుగుతున్న; అధ్వరాణాం = ఫలాసక్తి అన్న హింసను బహిష్కరించిన యజ్ఞ మార్గాలను; గోపాం = సంరక్షిచేవాడివీ; ఋతస్య = విశ్వనియమాన్ని; దీదివిమ్ = బాగా ప్రకాశింపజేసేవాడివీ; స్వే, దమే, వర్ధమానం = నిగృహీతమైన,క్రమశిక్షణాయుక్తమైన, సాక్షాత్తూ తనదే అయిన సాధన శరీర గృహంలో వర్ధిల్లుతున్నవాడివీ; ( నువ్వు )
భావము. ఓ అగ్నీ! దేదీప్యమానంగా వెలుగుతున్న; ఫలాసక్తి అన్న హింసను బహిష్కరించిన యజ్ఞ మార్గాలను సంరక్షిచేవాడివీ; విశ్వనియమాన్ని బాగా ప్రకాశింపజేసేవాడివీ; నిగృహీతమైన,క్రమశిక్షణాయుక్తమైన, సాక్షాత్తూ తనదే అయిన సాధన శరీర గృహంలో వర్ధిల్లుతున్నవాడవీ నువ్వు.
గీ. పృథు! ఫలాసక్తియన్ హింస విడుచునట్టి
యజ్ఞ దేదీప్యమార్గాలు ప్రజ్ఞఁ గాచు
వాఁడవును, విశ్వనియమమ్మువరలఁ జేయు
వాడవు, నిగృహీతమయిన, వరలునట్టి
క్రమ సుశిక్షణాయుతమైన తమదెయైన
సాధనశరీర గృహమున మోదమొప్ప
వరలు చున్నట్టివాఁడవు నిరుపమముగ,
వందనము సేతు కృపతోడనందుకొనుము.
౯. స న: పితేవ సూనవేఁ గ్నే సూపాయనోభవ
సచస్వా న: స్వస్తయే !!
ప్రతిపదార్థము. పితా ఇవ = తండ్రి వలె (సులువుగా చేరదగిన వాడయినట్టు); సు ఉపాయనోభవ = సులువుగా దరిచేరనిచ్చే వాడివి అగుము; న: = మేము, మమ్మల్ని; స్వస్తయే సచస్వా = భద్రంగా వుండేలాగా మాతో కలిసి వుండుము.
భావము. తండ్రివలె సులువుగా దరిచేరనిచ్చే వాడివి అగుము. మేము భద్రంగా వుండేలాగా మాతో కలిసి వుండుము.
గీ. తండ్రివలె మమ్ము సులువుగా దరికిఁ జేర
నిమ్ము. మేము భద్రమ్ముగా యిమ్ముతోడ
నుండ మాతోడ నీవిల నుండుమయ్య.
రామకృష్ణను మన్నించి ప్రేమఁ గనుము.