Wednesday, April 30, 2025

సౌందర్య లహరి 71-75పద్యాలు. రచన శ్రీ చింతా రామకృష్ణారావుగారు,సంగీతం, గానం శ్రీమతి వల్లూరి సరస్వతి

జైశ్రీరామ్.
71 వ శ్లోకము.  
నఖానాముద్యోతైర్నవనళిన రాగం విహసతాం
కరాణాం తే కాంతిం కథయ కథయామః కథముమే |
కయాచిద్వా సామ్యం భజతు కలయా హంత కమలం
యది క్రీడల్లక్ష్మీచరణతల లాక్షారస చణమ్ ||
పదచ్ఛేదము.
నఖానామ్ -  ఉద్యోతైః  -  నవ - నళిన - రాగమ్ -  విహసతామ్ -
కరాణామ్ -  తే -  కాంతిమ్ -  కథయ - కథయామః  - కథమ్ -  ఉమే -
కయాచిత్ -  వా -  సామ్యమ్ -  భజతు - కలయా - హంత - కమలమ్ -
యది - క్రీడత్ -  లక్ష్మీ - చరణ - తల -  లాక్షా - రస - చణమ్.
అన్వయక్రమము.
ఉమే, నఖానామ్, ఉద్యోతైః, నవ నళిన రాగమ్, విహసతామ్, తే, కరాణామ్, కాంతిమ్, కథమ్, కథయామః, కథయ, కమలమ్, కయాచిత్‌వా, కలయా, సామ్యమ్, భజతు, హంత, క్రీడత్‌, లక్షీ, చరణతల, లాక్షారస, చణమ్.
పద్యము.
చం.  విరియుచునున్న తామరల విస్తృతశోభనె వెక్కిరించు నీ
మురిపెము గొల్పు చేతులను బోల్పఁగ నాకది సాధ్యమౌనొకో?
సరసునఁ గ్రీడసల్పురమ చక్కగనున్నెడ, కాలిలత్తుక
స్ఫురణను బొందినన్ దగును బోల్పఁగఁ గొంత, నిజంబు పార్వతీ! ॥ 71 ॥
ప్రతిపదార్థము. 
ఉమే = ఓ పార్వతీ,
నఖానామ్ = గోళ్ళయొక్క, 
ఉద్యోతైః = ఉత్పన్నమగు కాంతుల చేత, 
నవ నళిన రాగమ్ = అప్పుడే వికసించెడు తామరపూవు యొక్క ఎఱ్ఱని కాంతిని, 
విహసతామ్ = అపహసించుచున్న, 
తే = నీ యొక్క, 
కరాణామ్ = హస్తముల యొక్క, 
కాంతిమ్ = శోభను, 
కథమ్ = ఏ విధముగా, 
కథయామః = వర్ణించగలమో, 
కథయ = చెప్పుము, 
కమలమ్ = పద్మము, 
కయాచిత్‌వా = ఏ విధము చేతనైనను, 
కలయా = పదునారవ పాలయినను, 
సామ్యమ్ = పోలికను,
భజతు = పొందునా, 
హంత = అయ్యో, 
క్రీడత్‌ = క్రీడించుచున్న, 
లక్షీ = లక్ష్మీ దేవి యొక్క, 
చరణతల = పాదము యొక్క, 
లాక్షారస = లత్తుకరసముతో గూడి సమర్ధమైనదయినచో ,
చణమ్ = పోల్చనైపుణ్యముతోనొప్పునేమో!  
భావము. 
సూర్యోదయ కాలమున వికసించుచున్న క్రొత్తతామరపూవు కాంతిని పరిహసించు చున్న గోళ్ల యొక్క ప్రకాశముచేత విలసిల్లుచున్న నీ హస్తముల యొక్క సౌందర్యమును ఏప్రకారముగా, అలంకార శోభితముగా వర్ణింపగలను ? ఒకవేళ - కమలములను తనపాదపీఠముగా చేసుకున్న లక్ష్మి దేవి చరణముల లత్తు కరసము (పారాణి) అంటుట వలన లేత ఎరుపురంగుకు వచ్చిన కమలములు - కొంతవరకూ, నీ కరముల కాంతి లేశమునకు సాదృశము కాగలదేమో.

72 వ శ్లోకము.  
సమం దేవి స్కంద ద్విపవదన పీతం స్తనయుగం
త వేదం నః ఖేదం హరతు సతతం ప్రస్నుత ముఖమ్ |
యదాలోక్యాశంకాకులిత హృదయో హాస జనకః
స్వకుంభౌ హేరంబః పరిమృశతి హస్తేన ఝటితి || 
పదచ్ఛేదము.
సమమ్ -  దేవి - స్కంద - ద్విప - వదన -  పీతమ్ -  స్తన - యుగమ్ -
తవ -  ఇదమ్ -  నః - ఖేదమ్ -  హరతు - సతతమ్ -  ప్రస్నుత - ముఖమ్ -
యత్ -  ఆలోక్య -  ఆశంకా - ఆకులిత - హృదయః -  హాస - జనకః -
స్వ - కుంభౌ - హేరంబః  - పరిమృశతి - హస్తేన - ఝటితి.
అన్వయక్రమము.
దేవి,  యత్‌, ఆలోక్య, ఆశంకా,  ఆకులిత, హృదయః, హేరంభః, హాసజనకః, స్వకుంభౌ, హస్తేన, ఝటితి, పరిమృశతి, సమమ్, స్కంద, ద్విప వదన, పీతమ్,  ప్రస్నుత ముఖమ్, తవ, ఇదమ్, స్తనయుగమ్, నః, ఖేదమ్, హరతు.
పద్యము.
చం.  కని యవి నాదు కుంభములె కానగునంచు గణేశుఁడప్పుడా
క్షణమున శీర్షమున్ దడుమసాగెను తొండముతోడ శాంభవీ! 
గణపతిచేత పూజ్యుఁడగు స్కందునిచేతను త్రాగఁబడ్డ, పా
ల నిడెడి నీ స్తనంబు లవి, లక్ష్యముతో మముఁ గాచుఁ గావుతన్.   72 ॥
ప్రతిపదార్థము. 
దేవి = ఓ భగవతీ,
యత్‌ = ఏ స్తనయుగమును, 
ఆలోక్య = చూచి, 
ఆశంకా = నా యొక్క తలపై నుండు కుంభములు దొంగిలింపబడినవను సంశయము చేత, 
ఆకులిత = కలత పడిన, 
హృదయః = మనస్సుగలవాడై, 
హేరంభః = వినాయకుడు, 
హాసజనకః = నవ్వు పుట్టించు చున్నవాడై, 
స్వకుంభౌ = తన కుంభములను,
హస్తేన = తొండము చేత, 
ఝటితి = ఆ క్షణములోనే, 
పరిమృశతి = తడవుకొనుచున్నాడో,
సమమ్ = ఒకే సమయములో, 
స్కంద = కుమారస్వామి చేతను, 
ద్విప వదన = ఏనుగు ముఖము కల వినాయకుని చేతను, 
పీతమ్ = పాలు త్రాగఁబడినదియు,  
ప్రస్నుత ముఖమ్ = పాలను స్రవింప జేయు కుచాగ్రముల గలదియునగు, 
తవ = నీ యొక్క, 
ఇదమ్ = ఈ,
స్తనయుగమ్ = వక్షోజముల జంట, 
నః = మా యొక్క, 
ఖేదమ్ = దుఃఖమును, 
హరతు = తొలగించు గాక.
భావము. 
ఓ భగవతీ! ఏ స్తనయుగమును చూచి నా యొక్క తలపై నుండు కుంభములు దొంగిలింప బడినవను సంశయము చేత కలత పడిన మనస్సుగలవాడై వినాయకుడు నవ్వు పుట్టించు చున్నవాడై తన కుంభములను తొండము చేత ఆ క్షణములోనే తడవు కొనుచున్నాడో ఒకే సమయములో కుమారస్వామి చేతను ఏనుగు ముఖము కల వినాయకుని చేతను పాలు త్రాగఁబడినదియు, పాలను స్రవింప జేయు కుచాగ్రముల గలదియునగు నీ యొక్క ఈ వక్షోజముల జంట మా యొక్క దుఃఖమును తొలగించు గాక.

73 వ శ్లోకము.  
అమూ తే వక్షోజావమృతరస మాణిక్య కుతుపౌ
న సందేహస్పందో నగపతి పతాకే మనసి నః |
పిబంతౌ తౌ యస్మాదవిదిత వధూసంగ రసికౌ
కుమారావద్యాపి ద్విరద వదన క్రౌంచ దళనౌ || 
పదచ్ఛేదము.
అమూ - తే - వక్షోజౌ -  అమృత రస - మాణిక్య  - కుతుపౌ -
న - సందేహ - స్పందః -  నగ - పతి - పతాకే - మనసి - నః -
పిబంతౌ - తౌ - యస్మాత్ -  అవిదిత - వధూ - సంగ -  రసికౌ -
కుమారౌ -  అద్య - అపి - ద్విరద - వదన - క్రౌంచ - దళనౌ.
అన్వయక్రమము.
నగపతి పతాకే! అమూ, తే, వక్షోజౌ, అమృత రస, మాణిక్య, కుతుపౌ, నః, మనసి, సందేహ స్పందః, న, యస్మాత్‌, తౌ, పిబంతౌ, అవిదిత, వధూ, సంగ, రసికౌ, ద్విరదవదన క్రౌంచదళనౌ, అద్య + అపి, కుమారౌ.
పద్యము.
చం.  అమిత సుధారసాంచితము లద్దిన కెంపులకుప్పెలెన్న నీ
విమల పయోధరంబులు, స్రవించెడి పాలను గ్రోలుటన్ సదా
హిమగిరి వంశ కేతన మహేశ్వరి! నీ వరపుత్రులిద్దరున్
బ్రముదముతోడ బాలురుగ వర్ధిలు చుండిరి బ్రహ్మచారులై. ॥ 73 ॥
ప్రతిపదార్థము.
నగపతి పతాకే = హిమవంతుని కీర్తిపతాకవైన ఓ గిరిజాదేవీ! 
అమూ = ఈ కన్పట్టుచున్న, 
తే = నీ యొక్క, 
వక్షోజౌ = స్తనములు, 
అమృత రస = అమృతముతో నిండిన, 
మాణిక్య=మాణిక్యములతో నిర్మింపబడిన, 
కుతుపౌ = కుప్పెలు, 
నః = మా యొక్క, 
మనసి = మనస్సునందు, 
సందేహ స్పందః = లేశమాత్రమైన సందేహమును, 
న = లేదు, 
యస్మాత్‌ = ఏ కారణము చేతననగా, 
తౌ = ఆ కెంపు కుప్పెలైన నీ స్తనములను, 
పిబంతౌ = పాలుత్రాగుచున్నవారై, 
అవిదిత = తెలియని, 
వధూ = స్త్రీల యొక్క, 
సంగ = కూటిమి యందు, 
రసికౌ = రాసిక్యము కలవారైన,
ద్విరద వదన క్రౌంచదళనౌ = గణపతి, కుమారస్వామి,
అద్య + అపి = ఇప్పటికి గూడ, 
కుమారౌ = బాలురుగానే వున్నారు. 
భావము. 
అమ్మా! హిమవంతుని వంశమనే ధ్వజమునకుపతాక అయిన ఓ పార్వతీమాతా! నీ కుచములు అమృత రసముతో నిండి, మాణిక్యములతో నిర్మింపబడిన కుప్పెలు అనుటకు మాకు ఎటువంటి సందేహమునూ లేదు. ఎందుకు అనగా ఆ కుచముల పాలు త్రాగిన గణపతి, కుమారస్వామి ఇప్పటికినీ బాలురు గానే ఉన్నారు కదా!

74 వ శ్లోకము.  
వహత్యంబ స్తంబేరమదనుజ కుంభ ప్రకృతిభిః
సమారబ్ధాం ముక్తామణిభిరమలాం హారలతికామ్ |
కుచాభోగో బింబాధర రుచిభిరంతశ్శబలతాం 
ప్రతాప వ్యామిశ్రాం పురదమయితుః కీర్తిమివ తే ||
పదచ్ఛేదము.
వహతి -  అంబ - స్తంబేరమ - దనుజ - కుంభ - ప్రకృతిభిః -
సమ -  ఆరబ్ధామ్ -  ముక్తా మణిభిః -  అమలామ్ -  హార - లతికామ్ -
కుచ -  ఆభోగః -  బింబ - అధర  -  రుచిభిః -  అంతః -  శబలతామ్ - 
ప్రతాప - వ్యామిశ్రామ్ -  పుర - దమయితుః - కీర్తిమ్ - ఇవ - తే.
అన్వయక్రమము.
అంబ, తే, కుచ, ఆభోగః, స్తంబేరమ దనుజ, కుంభ, ప్రకృతిభిః, ముక్తామణిభిః, సమారబ్ధామ్, అమలామ్, బింబ, అధర రుచిభిః, అంతః, శబలతామ్, హార లతికామ్, ప్రతాపవ్యామిశ్రామ్, పురదమయితుః, కీర్తిమ్ ఇవ, వహతి.
పద్యము.
ఉ.  అమ్మరొ! నీదు హారము గజాసుర కుంభజ మౌక్తికాభమై
యెమ్మెయిఁ జూడ నిర్మలమహీనశుభాస్పద దోషదూరమో
యమ్మ! నిజారుణద్యుతి శుభాధర బింబము నుండి సోకి సాం
తమ్మును చిత్రవర్ణమయి త్ర్యక్షుని కీర్తి వహించెఁ జూడగన్. ॥ 74 ॥
ప్రతిపదార్థము.
అంబ = ఓ జగన్మాతా , 
తే = నీ యొక్క, 
కుచ = స్తనముల యొక్క, 
ఆభోగః = విస్తారము, 
స్తంబేరమ దనుజ = గజాసురుని యొక్క, 
కుంభ = కుంభస్థలము నుండి, 
ప్రకృతిభిః = పుట్టుకగాగల, 
ముక్తామణిభిః =ముత్యముల చేత, 
సమారబ్ధామ్ = కూర్పఁబడినదియు, 
అమలామ్ = దోషరహితమైనదియు, 
బింబ = దొండపండు వంటి కెంపు రూపుగలదైన,
అధర రుచిభిః = క్రింది పెదవి కాంతుల చేత, 
అంతః = లోన , 
శబలతామ్ = చిత్రవర్ణములతో కూడినదియు అయి, 
హార లతికామ్ = తీగవంటి ముత్యాల హారమును, 
ప్రతాపవ్యామిశ్రామ్ = ప్రతాపముతో కూడిన, 
పురదమయితుః = త్రిపురహరుని యొక్క, 
కీర్తిం ఇవ = కీర్తిని వలె, 
వహతి = తాల్చుచున్నది. 
భావము. 
అమ్మా! నీ మెడలో ధరించిన హారము గజాసురుని కుంభస్థలమునుండి పుట్టిన ముత్యములచే కూర్చబడినదియూ, దోష రహితమై నిర్మలమైనదియూ, దొండపండు వంటి పెదవి యొక్క కాంతులచే చిత్ర వర్ణముగా చేయబడి ఈశ్వరుని పరాక్రమము తో కూడిన కీర్తి ని వహించుచున్నట్లుగా కనబడుచున్నది.
75 వ శ్లోకము.  
తవ స్తన్యం మన్యే ధరణిధరకన్యే హృదయతః
పయః పారావారః పరివహతి సారస్వతమివ |
దయావత్యా దత్తం ద్రవిడశిశురాస్వాద్య తవ యత్ 
కవీనాం ప్రౌఢానా మజని కమనీయః కవయితా ||
పదచ్ఛేదము.
తవ - స్తన్యమ్ -  మన్యే - ధరణి - ధర - కన్యే  - హృదయతః -
పయః - పారావారః - పరివహతి - సారస్వతమ్ -  ఇవ -
దయావత్యా - దత్తమ్ -  ద్రవిడ - శిశుః -  ఆస్వాద్య - తవ - యత్ -
కవీనామ్ -  ప్రౌఢానామ్ -  అజని - కమనీయః  - కవయితా.
అన్వయక్రమము.
ధరణి ధరకన్యే, తవ, స్తన్యమ్, హృదయతః, పయః పారావారః, సారస్వతం ఇవ, పరివహతి, మన్యే, యత్‌, దయావత్యా, దత్తమ్, ద్రవిడ శిశుః, ఆస్వాద్య, ప్రౌఢానామ్, కవీనామ్, కమనీయః, కవయితా, అజని.
పద్యము.
మ.  హృదయోద్భూత మహత్వ వాఙ్మయ సుధా ధృత్వంబుగానెంచెదన్
క్షుధపోకార్పెడి నీదు స్తన్యమును, నాకున్ నీవు వాత్సల్య మొ
ప్ప దయన్ బట్టిన కారణంబుననె యీ బాలుండు ప్రౌఢంపు సత్
సుధలన్ జిందెడి ప్రౌఢ సత్కవులలోశోభిల్లెనొక్కండుగా. ॥ 75 ॥
ప్రతిపదార్థము.
ధరణి ధరకన్యే = పర్వతరాజపుత్రికా ఓ పార్వతీ,
తవ = నీ యొక్క, 
స్తన్యమ్ = చనుబాలు అను, 
హృదయతః = హృదయము నుండి పుట్టినదైన, 
పయః పారావారః = పాల సముద్రము, 
సారస్వతం ఇవ = వాఙ్మయము వలె, 
పరివహతి = ప్రవహంచుచున్నదిగా, 
మన్యే = తలచెదను, 
యత్‌ = ఏ కారణము వలన, 
దయావత్యా = దయతో కూడిన నీ చేత, 
దత్తమ్ = ఈయబడిన చనుబాలను, 
ద్రవిడ శిశుః= ద్రవిడ దేశమునందు పుట్టిన బాలుడు(అయిన నేను), 
ఆస్వాద్య = త్రాగి ,
ప్రౌఢానామ్ = ప్రౌఢులు నిపుణులు అయిన, 
కవీనామ్ = కవీశ్వరులలో, 
కమనీయః = సర్వ జగన్మోహనమైన,
కవయితా = కవిత్వము చెప్పేవానిగా, 
అజని = మార్గముపొందెను (కాగలిగితిని).
భావము. 
అమ్మా! పర్వత నందినీ! నీ చనుబాలను హృదయము నుండి ప్రవహించుచున్న వాఙ్మయముతో నిండిన పాలసముద్రము వలె నేను తలచు చున్నాను. ఎందువలన అనగా వాత్సల్యముతో నీవు ఇచ్చిన స్తన్యము త్రాగి ఈ ద్రవిడ బాలుడు ( శ్రీ శంకర భగవత్పాదులు) కవులలో మనోహరుడు అయిన కవి కాజాలెను కదా !
జైహింద్.

Tuesday, April 29, 2025

సౌందర్య లహరి 66-70పద్యాలు. రచన శ్రీ చింతా రామకృష్ణారావు గారు,సంగీతం, గానం శ్రీమతి వల్లూరి సరస్వతి

జైశ్రీరామ్.

66 వ శ్లోకము. 
విపఞ్చ్యా గాయన్తీ వివిధ మపదానం పశుపతే
స్త్వయారబ్ధే వక్తుం చలిత శిరసా సాధు వచనే |
తదీయైర్మాధుర్యైరపలపిత తన్త్రీ కలరవాం
నిజాం వీణాం వాణీ నిచులయతి చోలేన నిభృతమ్ ||
పదచ్ఛేదము.
విపఞ్చ్యా - గాయన్తీ - వివిధమ్ -  అపదానమ్ -  పశుపతేః -
త్వయా - ఆరబ్ధే - వక్తుమ్ -  చలిత - శిరసా - సాధు - వచనే -
తదీయైః - మాధుర్యైః - అప లపిత - తన్త్రీ - కలరవామ్ -
నిజామ్ - వీణామ్ - వాణీ - నిచులయతి - చోలేన - నిభృతమ్.
అన్వయక్రమము.
వాణీ, పశుపతేః, వివిధమ్, అపదానమ్, విపఞ్చ్యా, గాయంత్యా, చలిత శిరసా, త్వయా, సాధువచనే, వక్తుమ్, ఆరబ్ధే సతి, తదీయై, మాధుర్యైః, అపలపిత, తంత్రీ, కలరవామ్, నిజామ్, వీణామ్, చోలేన, నిభృతమ్, నిచులయతి.
పద్యము.
ఉ.  వాణి విపంచిపై శివుని పావనసచ్చరితంబు మీటుచున్
నీ నయవాక్సుధార్ణవము నెమ్మిని భావనఁ జేసి దానితో
వీణియ పోలదంచు కని వేగమె కొంగునఁ గప్పె వీణనే,
ప్రాణము నీవెయై మదిని వర్ధిలు తల్లి! నమస్కరించెదన్. ॥ 66 ॥
ప్రతిపదార్థము.
(హే జగజ్జనని !)
వాణీ = సరస్వతి,
పశుపతేః = ఈశ్వరుని యొక్క,
వివిధమ్ = అనేక విధములైన,
అపదానమ్ = సాహస కృత్యములు మొదలగు వాటిని,
విపఞ్చ్యా = వీణచేత,
గాయంత్యా = గానము చేయుచున్నదై,
చలిత శిరసా = మనస్సు నందు కలిగిన సంతోష వశమున స్వయముగా గలిగిన శిరః కంపమున,
త్వయా = నీ చేత,
సాధు వచనే = ప్రశంసావచనము,
వక్తుమ్ = వచించుటకు,
ఆరబ్ధేసతి = ప్రారంభించినదగుచుండగా,
తదీయై = ఆవచన సంబంధులైన,
మాధుర్యైః = మాధుర్య గుణముల చేత,
అపలపిత = అపహసింపబడిన,
తంత్రీ = తంత్రుల యొక్క
కలరవామ్ = అవ్యక్త మధురములైన ధ్వనులు గలదైన,
నిజామ్ = తన యొక్క,
వీణామ్ = వీణను,
చోలేన = వీణను ఉంచు పైముసుగు చేత,
నిభృతమ్ = కనబడకుండా నుండునట్లు,
నిచులయతి = బాగుగా కప్పుచున్నది.
భావము.
తల్లీ! సరస్వతీదేవి వీణను శ్రుతిచేసి నీ ఎదుట పశుపతి వీరగాథలను గానం చేస్తూంటె నువ్వు ఆనందం పొంది , ఆమెపాటను మెచ్చుకుంటూ ప్రశంసా వాక్యాలు చెబుతుంటె , నీ వాఙ్మాధుర్యం తన వీణానాదంకంటె మాధుర్యం కలదని తెలిసి ఆమె తనవీణను కనపడకుండా వస్త్రంతో కప్పి దాస్తుంది.

67 వ శ్లోకము. 
కరాగ్రేణ స్పృష్టం తుహినగిరిణా వత్సలతయా
గిరీశేనోదస్తం ముహురధరపానాకులతయా |
కరగ్రాహ్యం శంభోర్ముఖ ముకుర వృంతం గిరిసుతే!
కథంకారం బ్రూమస్తవ చుబుకమౌపమ్యరహితమ్. ||
పదచ్ఛేదము.
కర - అగ్రేణ - స్పృష్టమ్ -  తుహిన గిరిణా - వత్సలతయా -
గిరీశేన - ఉదస్తమ్ - ముహుః  - అధర - పాన - ఆకులతయా -
కర - గ్రాహ్యమ్ - శంభోః - ముఖ - ముకుర - వృంతమ్ - గిరిసుతే -
కథమ్ - కారమ్ -  బ్రూమః - తవ - చుబుకమ్ -  ఔపమ్య రహితమ్.
అన్వయక్రమము.
గిరిసుతే, తుహినగిరిణా, వత్సలతయా, కరాగ్రేణ, స్పృష్టమ్, గిరీశేన, అధర పాన, ఆకులతయా, ముహుః, ఉదస్తమ్, శంభోః, కర గ్రాహ్యమ్, ముఖ, ముకురవృంతమ్, ఔపమ్య రహితమ్, తవ, చుబుకమ్, కథంకారమ్, బ్రూమః.
పద్యము.
చం.  జనకుఁడు ప్రేమగా నిమురు చక్కని నీ చుబుకంబు, నీ ధవుం
డనవరతంబు నీ యధరమానెడి వేడ్కను దొట్రుపాటుతోఁ
జనువున పట్టి తేల్చుఁ గద చక్కని మోవి, సఖుండు చేత లే
పిన ముఖమన్ లసన్ముకురవృంతము, నాకది పోల్ప సాధ్యమా. ॥ 67 ॥
ప్రతిపదార్థము.
గిరిసుతే = ఓ గిరిరాజపుత్రీ,
తుహినగిరిణా = మంచుకొండ చేత, (తండ్రిచేత),
వత్సలతయా = వాత్సల్యముతో,
కరాగ్రేణ = మునివ్రేళ్ళతో,
స్పృష్టమ్ = పుడుక బడునదియు,
గిరీశేన = శివుని చేత,
అధర పాన = అధర పానము నందలి,
ఆకులతయా = తొట్రుపాటు చేత,
ముహుః = మాటిమాటికి,
ఉదస్తమ్ = పైకెత్తబడినదియు,
శంభోః= శివుని యొక్క,
కర గ్రాహ్యమ్ = చేతిని గైకొన దగినదియు,
ముఖ = ముఖము అను,
ముకురవృంతమ్ = అద్దమునకు పిడి అయినదియు,
ఔపమ్యరహితమ్ = సరిపోల్చఁ దగిన వస్తువు లేనిదియునగు,
తవ = నీ యొక్క,
చుబుకమ్ = గడ్డమును,
కథంకారమ్ = ఏ విధముగా,
బ్రూమః = వర్ణించగలము ?
భావము. 
ఓ గిరి రాజకుమారీ! తండ్రి అయిన హిమవంతుని చేత, అమితమైన వాత్సల్యముతో మునివేళ్ళతో తాకబడినది, అధరామృతపానమునందలి ఆత్రుత, తొట్రుపాటులతో శివునిచే మాటి మాటికీ పైకెత్తబడినది, శంభుని హస్తమును చేకొనతగినది, సరిపోల్చతగినది ఏమీ లేనిది అయిన- నీ ముఖము అను అద్దమును పుచ్చుకొనుటకు, అందమైన పిడివలె నున్న నీ ముద్దులొలుకు చుబుకమును(గడ్డము)ను ఏ విధముగా వర్ణించగలను?

68 వ శ్లోకము. 
భుజాశ్లేషాన్నిత్యం పురదమయితుః కంటకవతీ
తవ గ్రీవా ధత్తే ముఖకమలనాళ శ్రియమియమ్ |
స్వతశ్శ్వేతా కాలాగరు బహుళ జంబాల మలినా
మృణాలీ లాలిత్యం వహతి యదధో హారలతికా. ||
పదచ్ఛేదము.
భుజ -  ఆశ్లేషాత్ -  నిత్యమ్ - పుర - దమయితుః  - కంటకవతీ -
తవ - గ్రీవా - ధత్తే - ముఖ - కమల - నాళ -  శ్రియమ్ -  ఇయమ్ -
స్వతః -  శ్వేతా - కాల - అగరు - బహుళ - జంబాల - మలినా -
మృణాలీ - లాలిత్యమ్ -  వహతి - యత్ -  అధః - హార - లతికా.
అన్వయక్రమము.
పురదమయితుః, భుజ, ఆశ్లేషాత్‌, నిత్యమ్, తవ, ఇయం గ్రీవా, కంటకవతీ, ముఖ, కమల, నాళ శ్రియమ్, ధత్తే, యత్‌, అధః, స్వతః, శ్వేతా, కాల + అగరు, బహుళ, జంబాల, మలినా, హారలతికా, మృణాలీ, లాలిత్యమ్, వహతి.
పద్యము.
చం.  పురహరు బాహు బంధమునఁ బొల్పగు నీదగు కంఠనాళమే
సురనుత! కంటకాంకుర సుశోభిత వారిజనాళమట్లు కాన్
వరలుచు గంధ పంకమున భాసిలె హారము నాళమట్లుగన్.
నిరుపమ! నిన్ మదిన్ నిలిపి నేను భజించెదఁ గాంచుమా కృపన్. ॥ 68 ॥
ప్రతిపదార్థము.
(హే జగజ్జననీ = ఓ లోకమాతా!)
పురదమయితుః = పురహరుడైన శివుని యొక్క,
భుజ = బాహువుల,
ఆశ్లేషాత్‌ = కౌగిలింతల వలన,
నిత్యమ్ = ఎల్లప్పుడు,
తవ = నీ యొక్క,
ఇయం గ్రీవా = ఈ కంఠనాళము,
కంటకవతీ = గగుర్పాటు వలను రోమాంచము గలదైన,
ముఖ = ముఖమనెడి,
కమల = తామరపూవు యొక్క,
నాళ శ్రియమ్ = కాడ అందమును,
ధత్తే = ధరించుచున్నది,
యత్‌ = ఏ కారణము వలన,
అధః = (ఆ కంఠమునకు) క్రిందుగా నున్న ప్రదేశము నందు,
స్వతః = స్వయముగనే,
శ్వేతా = స్వచ్ఛమైనదై,
కాల + అగరు = నల్లనైన అగరు గంధపు చెక్క యొక్క,
బహుళ = విస్తారముగా నున్న,
జంబాల= పంకము యొక్క,
మలినా = నలుపు వన్నె చేత మాసిన,
హారలతికా = ముత్యాల హారము,
మృణాలీ = తామరతూడు యొక్క,
లాలిత్యమ్ = సౌందర్యమును,
వహతి = ధరించుచున్నది.
భావము. 
తల్లీ! జగజ్జననీ! పురహరుని బాహువులతో, కౌగిలింతలతో నిత్యము గగుర్పాటుతో రోమాంచితమై, క్రింది భాగము సహజముగానే స్వచ్ఛముగా ఉండి- నల్లగా, విస్తారముగా ఉన్న అగరుగంధపు సువాసనతో, తామరుతూడు అందమును మించిన ముత్యాల హారముతో ఉండుటవలన – నీ మెడ నీ ముఖమనే పద్మమునకు ఒక కాడవలె ఉన్నది.

69 వ శ్లోకము.  
గళే రేఖాస్తిస్రో గతి గమక గీతైక నిపుణే! 
వివాహ వ్యానద్ధ ప్రగుణ గుణసంఖ్యా ప్రతిభువః |
విరాజంతే నానావిధ మధుర రాగాకర భువాం
త్రయాణాం గ్రామాణాం స్థితి నియమ సీమాన ఇవ తే ||
పదచ్ఛేదము.
గళే - రేఖాః -  తిస్రః - గతి - గమక - గీత - ఏక - నిపుణే - 
వివాహ - వ్యానద్ధ - ప్రగుణ - గుణ - సంఖ్యా  - ప్రతిభువః -
విరాజంతే - నానా విధ - మధుర - రాగ - ఆకర - భువామ్ -
త్రయాణామ్ -  గ్రామాణామ్ -  స్థితి - నియమ - సీమానః - ఇవ - తే.
అన్వయక్రమము.
గతి, గమక, గీత, ఏక, నివుణే! తే, గళే, తిస్రః రేఖాః, వివాహ, వ్యానద్ధ, ప్రగుణ, గుణ, సంఖ్యా, ప్రతిభువః, నానావిధ, మధుర, రాగ, ఆకర భువామ్, త్రయాణామ్, గ్రామాణామ్, స్థితి, నియమ, సీమానః ఇవ, విరాజంతే.
పద్యము.
తే.గీ.  గమక గీతైక నిపుణ! నీ కంఠ రేఖ
లు తగె మూడు సూత్రపు ముడులువలెనమ్మ!
షడ్జ, మధ్యమ, గాంధార, సంస్తుతగతి
కమరు హద్దన నొప్పె, మహత్వముగను. ॥ 69 ॥
ప్రతిపదార్థము. 
(హే జగజ్జననీ!)
గతి = సంగీత మార్గముల యందును, 
గమక = స్వరకంపన విశేషములందును, 
గీత = గానము నందును, 
ఏక = ముఖ్యమైన, 
నివుణే = నేర్పరితనము గలదానా! 
తే = నీ యొక్క, 
గళే = కంఠ ప్రదేశమునందు, 
తిస్రః రేఖాః = మూడు భాగ్య రేఖలు, 
వివాహ = పెళ్ళి సమయమందు, 
వ్యానద్ధ = (కంఠము చుట్టును వచ్చునట్లు)చక్కగా కట్టబడిన, 
ప్రగుణ = పెక్కునూలు పోగులచే కూర్చబడిన, 
గుణ = దారముల యొక్క, 
సంఖ్యా = మూడు సంఖ్యకు, 
ప్రతిభువః = ప్రతినిధులైనవియు, 
నానావిధ = అనేక విధములైన, 
మధుర = మధురమయిన,
రాగ = కళ్యాణి మొదలగు రాగములకు, 
ఆకర భువామ్ = (స్వరస్థానములను)ఆశ్రమ స్థానములైనవియు, 
త్రయాణామ్ = మూడైన, 
గ్రామాణామ్ = షడ్జమ, మధ్యమ, గాంధార గ్రామములకు, 
స్థితి = ఉనికి యొక్క, 
నియమ = నియమము కొఱకు ఏర్పరచిన, 
సీమానః ఇవ = సరిహద్దులవలె, 
విరాజంతే = మిక్కిలి శోభాయమానముగా ప్రకాశించుచున్నవి. 
భావము.  
సంగీత స్వరగాననిపుణీ, జగజ్జననీ! నీ కంఠము నందు కనబడు మూడు భాగ్యరేఖలు – వివాహ సమయమునందు పెక్కు నూలు పోగులతో ముప్పేటలుగా కూర్చబడి కట్టిన సూత్రమును గుర్తుతెచ్చుచు, నానా విధములైన మధుర రాగములకు ఆశ్రయ స్థానములైన షడ్జమ, మధ్యమ, గాంధార గ్రామముల ఉనికి యొక్క నియమము కొరకు ఏర్పరచిన సరిహద్దుల వలె ఉన్నట్లు శోభాయామానముగా ప్రకాశించుచున్నవి.

70 వ శ్లోకము.  
మృణాలీ మృద్వీనాం తవ భుజలతానాం చతసృణాం
చతుర్భిస్సౌందర్యం సరసిజభవస్స్తౌతి వదనైః |
నఖేభ్యస్సన్త్రస్యన్ ప్రథమ మథనా దంధకరిపోః
చతుర్ణాం శీర్షాణాం సమమభయహస్తార్పణ ధియా || 
పదచ్ఛేదము.
మృణాలీ - మృద్వీనామ్ -  తవ - భుజ - లతానామ్ -  చతసృణామ్ -
చతుర్భిః -  సౌందర్యమ్ -  సరసిజ భవః -  స్స్తౌతి వదనైః |
నఖేభ్యః -  సన్త్రస్యన్ - ప్రథమ - మథనాత్ -  అంధకరిపోః -
చతుర్ణామ్ -  శీర్షాణామ్ - సమమ్ - అభయ - హస్త -  అర్పణ - ధియా.
అన్వయక్రమము.
సరసిజ భవః, ప్రథమ మథనాత్‌, అంధక రిపోః, నఖేభ్యః, సంత్రస్యన్‌, చతుర్ణామ్, శీర్షాణామ్, సమమ్, అభయహస్త, అర్పణ ధియా, చతుర్భిః, వదనైః, మృణాలీమృద్వీనామ్, చతసృణామ్, తవ, భుజలతానామ్, సౌందర్యమ్, స్తౌతి.
పద్యము.
శా.  అమ్మా! గోర్లను శూలి బ్రహ్మ తలఁ బాయన్ ద్రుంప, భీతిల్లుచున్,
బమ్మే నాలుగు మోములన్ గిలిని బాపం గోరుచున్ రక్షణం
బిమ్మంచున్ నుతియించుచుండె సుకుమారీ! భీతిఁ బోఁగొట్టు నీ
యిమ్మౌ కోరకమార్దవంపు భుజముల్ హృద్యంబులౌ నాల్గిటిన్. ॥ 70 ॥
ప్రతిపదార్థము.
(హే జగజ్జననీ = ఓ లోకమాతా!) 
సరసిజ భవః = బ్రహ్మదేవుడు, 
ప్రథమ మథనాత్‌ = మొట్టమొదటి తన శిరస్సును ఖండించుట వలన, 
అంధక రిపోః = అంధకుడను అసురుని సంహరించిన సదాశివుని యొక్క, 
నఖేభ్యః = గోళ్ళవలన, 
సంత్రస్యన్‌ = మిగులభయపడుచున్నవాడై, 
చతుర్ణామ్ = నాలుగుగా నున్న, 
శీర్షాణామ్ = తన శిరస్సులకు, 
సమమ్ = సమానముగా, 
అభయహస్త = అభయదానము చేయఁ గలిగిన నీ హస్తములను ,
అర్పణ ధియా = అభయమును ఇచ్చునను భావనచే, 
చతుర్భిః = నాలుగుగా నున్న, 
వదనైః = తన ముఖములచేత, 
మృణాలీ మృద్వీనామ్ = తామరతూడువలె మెత్తదనము గలవియు, 
చతసృణామ్ = నాలుగుగా వున్నవియు, 
తవ = నీ యొక్క, 
భుజలతానామ్= తీగల వంటి భుజముల యొక్క, 
సౌందర్యమ్ = అందమును, 
స్తౌతి = స్తుతించుచున్నాడు. 
భావము. 
తల్లీ జగజ్జననీ! తామర తూడువలె మృదువుగా తీగలవలె ఉండు నీ బాహువుల చక్కదనమును చూసి, బ్రహ్మ తన నాలుగు ముఖములతో – పూర్వము తన ఐదవ శిరస్సును గోటితో గిల్లి వేసిన శివుని గోళ్ళకు భయపడుచూ, ఒక్కసారిగా తన మిగిలిన నాలుగు శిరస్సులకు నీ నాలుగు హస్తముల నుండి అభయ దానము కోరుచూ, నిన్ను స్తుతించుచున్నాడు.
జైహింద్.

Monday, April 28, 2025

సౌందర్య లహరి 61-65పద్యాలు. రచన శ్రీ చింతా రామకృష్ణారావుగారు, గానం శ్రీమతి వల్లూరి సరస్వతి.

జైశ్రీరామ్.
61 వ శ్లోకము.  
అసౌ నాసావంశస్తుహినగిరివంశ ధ్వజపటి
త్వదీయో నేదీయః ఫలతు ఫలమస్మాకముచితమ్ |
వహత్యంతర్ముక్తాశ్శిశిరకర నిశ్వాస గళితం
సమృద్ధ్యా యత్తాసాం బహిరపి చ ముక్తామణి ధరః || 
పదచ్ఛేదము.
అసౌ - నాసా - వంశః -  తుహిన - గిరి - వంశ - ధ్వజ - పటి -
త్వదీయః -  నేదీయః - ఫలతు - ఫలమ్ -  అస్మాకమ్ -  ఉచితమ్ -
వహతి -  అంతః -  ముక్తాః -  శిశిర - కర - నిశ్వాస - గళితమ్ -
సమృద్ధ్యా - యత్ -  తాసామ్ - బహిః -  అపి - చ - ముక్తా - మణి - ధరః.
అన్వయక్రమము.
తుహిన గిరి వంశ, ధ్వజ పటి, త్వదీయః, అసౌ, నాసా వంశః, శిశిరకర, నిశ్వాస, గళితాః,  అంతః, ముక్తాః, వహంతి, యత్‌, తాసామ్, సమృద్ధ్యా, బహిః అపి, ముక్తామణి ధరః, సః, అస్మాకమ్, ఉచితమ్, నేదీయః, ఫలమ్, ఫలతు.
పద్యము.
చం.  హిమగిరి వంశ కేతన! మహేశ్వరి! నీ దగు ఘ్రాణ వంశ మ
ద్ది మహిత సత్ఫలంబులిడు, దేవి! త్వదీయ కృపన్ గనంగ న
క్రము తన లోన నిందు వర రత్నముదాల్చుచు నిందునాడి మా
ర్గమున గమించుదానినె దగన్ బయటన్ ధరియించె గొప్పగన్. ॥ 61॥
(నక్రము=ముక్కు, ఇందు(వర)రత్నము=ముత్యము,ఇందు నాడి=ఇడానాడి)
ప్రతిపదార్థము. 
తుహిన గిరి వంశ = మంచు కొండ వంశము అను,
ధ్వజ పటి = ధ్వజమునకు పతాకమైన ఓ హైమవతీ, 
త్వదీయః = నీ సంబంధమైన, 
అసౌ = ఈ, 
నాసా వంశః = నాసిక అను వెదురు దండము, 
శిశిరకర = చంద్ర సంబంధమైన, 
నిశ్వాస = వామనాడి యగు ఇడానాడీ మార్గ నిశ్వాస వాయువుచే, 
గళితాః = జాఱిన,
అంతః = లోపల, 
ముక్తాః= ముత్యములను, 
వహంతి = ధరించుచున్నది, 
యత్‌ = ఏ కారణము వలన, 
తాసామ్ = ఆ ముత్యముల యొక్క, 
సమృద్ధ్యా = నిండుతనము చేత, 
బహిః అపి = వెలుపల కూడా,
ముక్తామణి ధరః = ముత్యములను ధరించునదో,
సః = ఆ నాసావంశ దండము, 
అస్మాకమ్ = మాకు, 
ఉచితమ్ = తగిన విధముగా, 
నేదీయః = సమీపించినదై, 
ఫలమ్ = కోరిన ఫలమును, 
ఫలతు = ఫలింప చేయు గాక. 
భావము. 
హిమగిరి వంశధ్వజమునకు పతాకము వంటి ఓ హైమవతీ ! నీ నాసిక అను వెదురు దండము  లోపల ముత్యములను ధరించుచున్నదని చెప్పవచ్చును. కారణమేమనగా – నీ నాసాదండము ముత్యములతో సమృద్ధిగా నిండి యుండగా చంద్ర సంబంధమైన వామనిశ్వాస మార్గము ద్వారా (ముక్కుకు ఎడమవైపు) ముత్యము బయటకు వచ్చి నాసికకు కింద కొన యందు ముత్యముతో కూడిన ఆభరణమగుచున్నది గదా! ఆ నీ నాసావంశదండముమాకు తగిన విధముగా కోరిన వాటిని ప్రాప్తింపచేయుగాక! 

62 వ శ్లోకము.  
ప్రకృత్యాఽఽరక్తాయాస్తవ సుదతి దంతచ్ఛదరుచేః
ప్రవక్ష్యే సాదృశ్యం జనయతు ఫలం విద్రుమలతా |
న బింబం తద్బింబ ప్రతిఫలన రాగాదరుణితం
తులామధ్యారోఢుం కథమివ నలజ్జేత కలయా || 
పదచ్ఛేదము.
ప్రకృత్యా -  ఆరక్తా- యాః -  తవ - సుదతి - దంత - ఛద - రుచేః -
ప్రవక్ష్యే - సాదృశ్యమ్ -  జనయతు - ఫలమ్ -  విద్రుమలతా -
న బింబమ్ - తత్ -  బింబ -  ప్రతి ఫలన - రాగాత్ -  అరుణితమ్ -
తులా - మధ్య -  ఆరోఢుమ్ - కథమ్ -  ఇవ - న లజ్జేత - కలయా.
అన్వయక్రమము.
సుదతి, ప్రకృత్యా, ఆరక్తాయాః, తవ, దంతచ్ఛద రుచేః, సాదృశ్యమ్, ప్రవక్షే, విద్రుమలతా, ఫలమ్, జనయతు, బింబమ్, తత్‌, బింబ, రాగాత్‌, అరుణితమ్, (అన్యథా) న, కలయా - అపీ, తులామ్, అధ్యారోఢుమ్, కథమ్ ఇవ, న లజ్జేత.
పద్యము.
మ.  జననీ! నీ యధరారుణప్రభలు సాజంబమ్మ! నే దెల్పెద
న్వినుతింపందగు పోలికన్, బగడమే బింబంబు పుట్టించినన్
ఘనమౌ నీ యధరారుణప్రభలనే కల్గించు నవ్వాటికిన్,
విన సొంపౌ తగు సామ్యమున్ దలపగా వ్రీడన్ మదిన్ బొందదే? ॥ 62 ॥
ప్రతిపదార్థము.
సుదతి = మంచి పలువరస గల ఓ జననీ,
ప్రకృత్యా = స్వభావ సిద్ధముగనే, 
ఆరక్తాయాః = అంతట కెంపువన్నెగలదైన, 
తవ = నీ యొక్క, 
దంతచ్ఛద రుచేః = రెండు పెదవుల యొక్క సౌందర్య సౌభాగ్యమునకు, 
సాదృశ్యమ్ = సరియైన పోలికను, 
ప్రవక్షే = చక్కగా చెప్పుచున్నాను, 
విద్రుమలతా = పగడపు తీగ ,
ఫలమ్ = పండిన పండును, 
జనయతు = పుట్టించినదైనచో అది పోలికకు సరిపోవును,
బింబమ్ = దొండ పండుతో పోల్చవలసి వచ్చినచో, 
తత్‌ = ఆ నీ రెండు పెదవుల యొక్క, 
బింబ = బింబములను తనపై ప్రతి ఫలించుట చేత అయిన, 
రాగాత్‌ = ఎరుపురంగువలన, 
అరుణితమ్ = ఎరుపు వన్నె పొందినదైనది, 
(అన్యథా) న = అటుల కానిచో బింబము కానేరదు,
కలయా - అపీ = లేశ మాత్రము (పదునారవ పాలు)చేతను గూడా, 
తులామ్ = సామ్యమును, 
అధ్యారోఢుమ్ = అధిష్ఠించుటకు, 
కథం ఇవ = ఏవిధముగా, 
న లజ్జేత = సిగ్గుపడకుండును. 
భావము. 
ఓ జగన్మాతా! తల్లీ! చక్కని పలువరుసగల ఓ దేవీ! సహజముగా కెంపులు దేలుచున్న నీపెదవుల సౌందర్యానికి పగడపు తీగెకు పండు పండితే, ఆ విద్రుమఫలము యొక్క ఎరుపుదనము, నీ పెదవులకాంతికి సరితూగుతుంది. కేవలం పగడపు తీగెమాత్రం నీ అధరాల ఎఱుపునకు సాటికాజాలదు.
ఇక బింబఫలమన్నచో - దొండపండు. నీ పెదవుల అరుణ వర్ణము అరువు తెచ్చుకున్నట్లున్నదే గానీ- సహజముగా దొండపండు నీ అధరముల ఎఱుపుదనానికి సాటిరాదు. అది తెలిసికొని - బింబఫలము (దొండపండు) సిగ్గుపడుచున్నది.

63 వ శ్లోకము.  
స్మితజ్యోత్స్నాజాలం తవ వదనచంద్రస్య పిబతాం
చకోరాణామాసీదతిరసతయా చంచుజడిమా |
అతస్తే శీతాంశోరమృతలహరీరామ్లరుచయః
పిబంతీ స్వచ్ఛందం నిశి నిశి భృశం కాంచిక ధియా || 
పదచ్ఛేదము.
స్మిత - జ్యోత్స్నా - జాలమ్ -  తవ - వదన - చంద్రస్య - పిబతామ్ -
చకోరాణామ్ -  ఆసీత్ -  అతిరసతయా - చంచు - జడిమా -
అతః - త్ ర్ -  శీతాంశోః -  అమృత - లహరీః - ఆమ్ల - రుచయః -
పిబంతీ - స్వచ్ఛందం - నిశి - నిశి - భృశమ్ -  కాంచిక - ధియా.
అన్వయక్రమము.
తవ, వదనచంద్రస్య, స్మిత, జ్యోత్నాజాలమ్, పిబతామ్, చకోరాణామ్, అతిరసతయా, చంచుజడిమా, ఆసీత్‌, అతః, తే, ఆమ్ల రుచయః, శీతాంశోః, అమృత లహరీః, కాంచిక ధియా, స్వచ్ఛందమ్, నిశినిశి, భృశమ్, పిబంతీ.
పద్యము.
శా.  అమలా! నీ నగుమోము చంద్రికలదివ్యాస్వాదనన్ జీవజీ
వములా తీపిదనమ్ముచే రసనలున్ వాయన్ రుచిన్ దివ్యమౌ
రమణీ! చంద్రునినుండియామ్లరుచులన్ బ్రార్థించి యాచంద్రికల్
ప్రముదంబున్ గొనుఁ గాంచికన్ నిశలలో భావింప చిత్రంబిదే. ॥ 63 ॥
ప్రతిపదార్థము. 
(హే పార్వతీ = ఓ జననీ!)
తవ = నీ యొక్క, 
వదన చంద్రస్య = ముఖము అను చంద్రుని యొక్క, 
స్మిత = చిరునవ్వు అను, 
జ్యోత్నా జాలమ్ = వెన్నెల సమూహము నంతను, 
పిబతామ్ = త్రాగుచున్న, 
చకోరాణామ్ = చకోరపక్షులకు, 
అతిరసతయా = మిక్కిలి తీపి దనము చేత, 
చంచు జడిమా = నాలుకలకు రుచి తప్పి మొద్దుబాఱుట యనునది, 
ఆసీత్‌ = కలిగెను, 
అతః = ఇందువలన, 
తే = ఆ చకోర పక్షులు, 
ఆమ్ల రుచయః = పుల్లగా నుండు వాటి యందు ఆసక్తి కలిగినవై, 
శీతాంశోః = చంద్రుని యొక్క, 
అమృత లహరీః = సుధాప్రవాహములను, 
కాంచి కధియా = అన్నపు గంజి యనెడి భ్రాంతితో, 
స్వచ్ఛందమ్ = ఇష్టము వచ్చినట్లుగా, 
నిశి నిశి = ప్రతి రాత్రి యందు, 
భృశమ్ = మిక్కిలి, 
పిబంతీ = త్రాగుచున్నవి.
భావము.
తల్లీ జగజ్జననీ! నీ ముఖము అనే చంద్రుని యొక్క, చిరునవ్వు అను వెన్నెలనంతా అమితముగా గ్రోలిన చకోర పక్షులకు – ఆ వెన్నెల వెర్రి తీపిగా ఉండుటచేత, వాని నాలుకలు ఆ తీపితో చచ్చుబారి రుచి గూడా పట్టనివయ్యెను. అందువలన ఆ చకోర పక్షులు ఏదైనా పుల్లగా ఉండు వాటిని త్రాగి, తీపితో నాలుక మొద్దుబారినతనమును పోగొట్టుకొనదలచి, చంద్రుని వెన్నెల అను అమృతమును బియ్యపు కడుగునీరు లేదా అన్నపు గంజి అను భ్రాంతితో ప్రతి రాత్రి మిక్కిలిగా తాగుచున్నవి. (అంటే అమ్మ చిరునవ్వు అమృతము కంటే మిన్నగా ఉన్నదని భావం).

64 వ శ్లోకము.  
అవిశ్రాంతం పత్యుర్గుణగణ కథామ్రేడనజపా
జపాపుష్పచ్ఛాయా తవ జనని జిహ్వా జయతి సా |
యదగ్రాసీనాయాః స్ఫటికదృష దచ్ఛచ్ఛవిమయీ
సరస్వత్యా మూర్తిః పరిణమతి మాణిక్యవపుషా || 
పదచ్ఛేదము.
అవిశ్రాంతమ్ -  పత్యుః -  గుణ గణ - కథా - ఆమ్రేడన - జపా -
జపా - పుష్ప - ఛాయా - తవ - జనని - జిహ్వా - జయతి - సా -
యత్ -  అగ్రాసీనాయాః - స్ఫటిక - దృషత్ -  అచ్ఛ  - ఛవి మయీ -
సరస్వత్యా - మూర్తిః - పరిణమతి - మాణిక్య - వపుషా.
అన్వయక్రమము.
జనని, జపాపుష్ప, ఛాయా, తవ, సా, జిహ్వా, అవిశ్రాంతమ్, పత్యుః, గుణ, గణ, కథా, ఆమ్రేడన, జపా, జయతి, యత్‌, అగ్ర, ఆసీనాయాః, సరస్వత్యాః, స్ఫటిక దృషత్‌, అచ్ఛ, ఛవిమయీ, మూర్తిః, మాణిక్య, వపుషా, పరిణమతి.
పద్యము.
చం.  సతతము నీ సదాశివుని సన్నుతిఁ జేయుచునుండుటన్ సతీ!
యతులిత జిహ్వ యెఱ్ఱఁబడెనమ్మరొ నీకు, గణింపగా, సర
స్వతి సతతంబు నాల్కపయి సన్నుతినొప్పుచునుండుటన్ లస
న్నుతమగు పద్మరాగ రుచితోఁ బరిణామము పొందియుండెడిన్. ॥ 64 ॥
ప్రతిపదార్థము. 
జనని = ఓ జగన్మాతా, 
జపాపుష్ప= మందార పువ్వు యొక్క, 
ఛాయా = రంగు వంటి ఎఱ్ఱని కాంతి గలదై, 
తవ = నీ యొక్క, 
సా = ఆ, 
జిహ్వా = నాలుక, 
అవిశ్రాంతమ్ = నిరంతరము, 
పత్యుః = సదాశివుని యొక్క, 
గుణ = గుణముల,
గణ = సమూహ సంపద యొక్క, 
కథా = వృత్తాంతముల యొక్క, 
ఆమ్రేడన = మరల మరల వచించుటయే, 
జపా = జపముగా కలదై, 
జయతి = ప్రకాశించుచున్నది, 
యత్‌ = ఏ, 
అగ్ర = జిహ్వాగ్రము నందు, 
ఆసీనాయాః = ఆసీనురాలైన, 
సరస్వత్యాః = సరస్వతీ దేవి యొక్క, 
స్ఫటిక దృషత్‌ = స్ఫటిక మణి వలె, 
అచ్ఛ = తెల్లన, 
ఛవిమయీ = అధికమైన, 
మూర్తిః = స్వరూపము, 
మాణిక్య = పద్మరాగము యొక్క, 
వపుషా = రూపముతో, 
పరిణమతి = మార్పు చెందుచున్నది.  
భావము. 
తల్లీ! జగజ్జననీ! నీ నాలుక, నిరంతరము నీ పతియైన సదాశివుని విజయ గుణగణముల చరిత్రలను, ఎడతెరిపి లేకుండా చెప్పుచుండుట వలన, మందార పుష్పము యొక్క ఎఱ్ఱని కాంతులు గలదై ప్రకాశించుచుండుటయేగాక, తన నాలుక యందే ఎప్పుడూ ఆసీనురాలై, పూర్తిగా స్ఫటికము వలె తెల్లగా ఉండే సరస్వతీ దేవిని సైతము పద్మరాగమణి కాంతులతో ఎఱ్ఱని రూపముగల దానిగా మార్చుచున్నది.

65 వ శ్లోకము.  
రణే జిత్వా దైత్యానపహృత శిరస్త్రైః కవచిభిః
నివృత్తైశ్చండాంశత్రిపురహర నిర్మాల్య విముఖైః |
విశాఖేంద్రోపేంద్రైశ్శశి విశద కర్పూర శకలాః
విలీయన్తే మాతస్తవ వదన తాంబూల కబళాః || 
పదచ్ఛేదము.
రణే - జిత్వా - దైత్యాన్ -  అపహృత - శిరస్త్రైః - కవచిభిః -
నివృత్తైః -  చండాంశ - త్రిపుర హర - నిర్మాల్య - విముఖైః -
విశాఖ - ఇంద్ర - ఉపేంద్రైః  - శశి - విశద - కర్పూర - శకలాః -
విలీయన్తే - మాతః -  తవ - వదన - తాంబూల - కబళాః -
అన్వయక్రమము.
మాతః, రణే, దైత్యాన్‌, జిత్వా, అపహృత, శిరస్త్రైః, కవచిభిః, నివృత్తెః, చండాంశ, త్రిపురహర, నిర్మాల్య, విముఖైః, విశాఖ, ఇంద్ర, ఉపేంద్ర, శశి విశద, కర్పూర శకలాః, తవ, వదన, తాంబూల, కబళాః, విలీయంతే.
పద్యము.
తే.గీ.  పావకియు నింద్రవిష్ణువుల్ బవరవిజయు
లయి నినున్ గాంచఁ దలపాగ లచట వదలి
కవచములు దాల్చి శివమాల్యము విడి నీదు
వదన తాంబూల మందగ  వచ్చిరమ్మ. ॥ 65 ॥
ప్రతిపదార్థము.
మాతః = ఓ జగజ్జననీ ! 
రణే = యుద్ధమునందు, 
దైత్యాన్‌ = రాక్షసులను, 
జిత్వా = జయించి, 
అపహృత = తీసివేయబడిన, 
శిరస్త్రైః = శిరస్త్రాణములు గల వారును, 
కవచిభిః = కవచములు గల వారును, 
నివృత్తెః = యుద్ధరంగము నుండి మరలి వచ్చిన వారును, 
చండాంశ = చండేశ్వరుని భాగము అగు, 
త్రిపురహర = త్రిపురాసురులను సంహరించిన శివుని యొక్క, 
నిర్మాల్య = నిర్మాల్యమును, 
విముఖైః = గ్రహింపని వారును ఐన, 
విశాఖ = కుమారస్వామి, 
ఇంద్ర = ఇంద్రుడు, 
ఉపేంద్ర = విష్ణువు, అను ముగ్గురి చేత, 
శశి విశద = చంద్రుని వలె స్వచ్ఛముగా నున్న, 
కర్పూర శకలాః = పచ్చ కర్ఫూరపు తునకలుకలిగిన, 
తవ = నీ యొక్క, 
వదన = ముఖము (నోరు) నుండి వెలువడి వచ్చిన, 
తాంబూల = తాంబూలపు, 
కబళాః = ముద్దలు, 
విలీయంతే = లీనమై పోవుచున్నవి.  
భావము. 
తల్లీ! జగజ్జననీ! యుధ్ధమునందు రాక్షసులను జయించి, తమ తలపాగలను తీసివేసి, కవచములు మాత్రము ధరించిన వారై, యుద్ధరంగము నుండి మరలి వచ్చుచు, ప్రమథగణములలో ఒకడైన చండునికి చెందు శివుడు స్వీకరించి విడిచిన నిర్మాల్యమును వదలి, జగదంబ నివాసమునకు  వచ్చిన కుమారస్వామి, ఇంద్రుడు, విష్ణువులు నీ నోటినుండి వెలువడి వచ్చిన తాంబూలపు ముద్దలను గ్రహించగా ఆ తాంబూలపు ముద్దలలో చంద్రుని వలె స్వచ్ఛముగాను, నిర్మలముగాను ఉండు పచ్చకర్పూరపు తునకలు గూడా పూర్తిగా నమలబడి, మ్రింగబడి ఆ తాంబూలములు పూర్తిగా జీర్ణమై లీనమైపోవుచున్నవి.
జైహింద్.

Sunday, April 27, 2025

సౌందర్యలహరి 56 - 60 పద్యాలు. రచన శ్రీ చింతా రామకృష్ణారావుగారు,సంగీతం, గానం శ్రీమతి వల్లూరి సరస్వతి.

జైశ్రీరామ్.
56 వ శ్లోకము.  
తవాపర్ణే కర్ణే జపనయన పైశున్య చకితాః
నిలీయంతే తోయే నియత మనిమేషాశ్శఫరికాః |
ఇయం చ శ్రీబద్ధచ్ఛద పుటకవాటం కువలయం
జహాతి ప్రత్యూషే నిశి చ విఘటయ్య ప్రవిశతి || 
పదచ్ఛేదము.
తవ -  అపర్ణే - కర్ణే  -  జప - నయన - పైశున్య - చకితాః -
నిలీయంతే - తోయే - నియతమ్ -  అనిమేషాః -  శఫరికాః -
ఇయమ్ - చ  - శ్రీ - బద్ధ - ఛద పుట - కవాటమ్ -  కువలయమ్ -
జహాతి - ప్రత్యూషే - నిశి చ - విఘటయ్య - ప్రవిశతి.
అన్వయక్రమము.
అపర్ణే, తవ, కర్ణేజప, నయన, పైశున్య, చకితాః, శఫరికాః, అనిమేషా, తోయే, నిలీయంతే. నియతమ్, ఇయమ్, శ్రీః చ, బద్ధ, ఛద, పుట, కవాటమ్, కువలయమ్, ప్రత్యూష, జహాతి, నిశిచ, తత్‌, విఘటయ్య, ప్రవిశతి.
పద్యము.
సీ.  అమ్మ నీకండ్లతో నెమ్మిఁ బోల్చుకొనెడి మత్స్యముల్ బెదరుచు మడుగులోన
దాగు, నీ చెవులలోఁ దమ గుట్టు చెప్పు నీ కన్నులనుచు, మచ్చెకంటి! వినితె?
నీ నేత్రలక్ష్మియు నిరుపమ! ముకుళిత దళముల డొప్పలఁ దలుపులుగను
గలిగిన కలువలన్ గనుచుఁ బ్రాతఃకాల మునవిడ్చి, రాత్రులన్ బూజ్య! తెరచి, 
తే.గీ. లోపలను జేరునోయమ్మ! ప్రాపువైన 
కలువ కంటివి, నీరూపుఁ గనెడి కనులు
కనులు నిజముగ, కాకున్నఁ గనులు కావు, 
నిన్నుఁ గాంచగాఁ జేయుమా నేర్పునొసఁగి. ॥ 56 ॥
ప్రతిపదార్థము.
అపర్ణే = ఓ పార్వతీ, 
తవ = నీ యొక్క, 
కర్ణేజప = చెవుల - సామీప్యమును (కొండెములు చెప్పు నైజముతో) నిరంతరము పొందుచున్న, 
నయన = కన్నులచేత అయిన, 
పైశున్య = రహస్యమును వెల్లడి చేయుట వలన, 
చకితాః = భయపడినవై, 
శఫరికాః = ఆడుచేపలు, 
అనిమేషా = ఱెప్పపాటు లేనివియై, 
తోయే = నీటియందు, 
నిలీయంతే = దాగుకొనుచున్నవి. 
నియతమ్ = ఇది నిశ్చయము, 
ఇయమ్ = ఈ, 
శ్రీః చ= నీ నేత్రలక్ష్మియు, 
బద్ధ = మూయబడిన,
ఛద = దళముల యొక్క, 
పుట = దొప్పలనే, 
కవాటమ్ = తలుపుగా గలదైన, 
కువలయమ్ = కలువను, 
ప్రత్యూష = ఉషః కాలమందు, 
జహాతి = త్యజించుచున్నది, 
నిశిచ = రాత్రియందు,
తత్‌ = ఆ కలువను, 
విఘటయ్య = తెఱచుచుకొని, 
ప్రవిశతి = లోపల ప్రవేశించుచున్నది. 
భావము. 
ఓ తల్లీ అపర్ణాదేవీ! తాము చూసిన ఏదో రహస్యమును చెప్పుటకై, ఎప్పుడూ నీ చెవుల వద్దనే నివసించు అందమైన నీ రెండు కన్నుల తీరును చూచి, భయపడిన ఆడ చేపలు కంటికి రెప్పపాటు లేక నీటిలో దాగుకొనుచున్నవి. నీ నేత్ర సౌందర్యలక్ష్మిని చూచిన నల్ల కలువలు, పగలు బిడియముతో తమ అందమును రేకులలో ముకుళింపచేసుకుని దాచుచూ, నీవు నిద్రపోవు రాత్రివరకు అట్లే వేచియుండి, అటుపై తమ రేకుల తలుపులను తెరచి, తమ అందమును బయటపెట్టుటకు సాహసించుచున్నవి.

57 వ శ్లోకము.  
దృశా ద్రాఘీయస్యా దరదళిత నీలోత్పల రుచా
దవీయాంసం దీనం స్నపయ కృపయా మామపి శివే |
అనేనాయం ధన్యో భవతి న చ తే హానిరియతా
వనేవా హర్మ్యేవా సమకర నిపాతో హిమకరః || 
పదచ్ఛేదము.
దృశా - ద్రాఘీయస్యా - దర దళిత - నీల -  ఉత్పల - రుచా -
దవీయాంసమ్ -  దీనమ్ -  స్నపయ - కృపయా - మామ్ -  అపిఅ శివే -
అనేన -  అయమ్ -  ధన్యః -  భవతి - న చ - తే - హానిః -  ఇయతా -
వనే - వా - హర్మ్యే - వా - సమకర - నిపాతః -  హిమకరః.
అన్వయక్రమము.
శివే, ద్రాఘీయస్యా, దరదళిత, నీలోత్పల రుచా, దృశా, దవీయాంసమ్, దీనమ్, మామ్, అపి, కృపయా, స్నపయ, అనేన, అయమ్, ధన్యః, భవతి, ఇయతా, తే, హానిః, నచ, హిమకరః, వనేవా, హర్మ్యేవా, సమకర నిపాతః.
పద్యము.
ఉ.  దీనుఁడనమ్మ! దూరముగ తేజము కోల్పడి యున్న నాపయిన్
నీ నయన ప్రదీప్తి నిక నిత్యముగా ప్రసరింపనీయుమా,
హాని యొకింతయున్ గలుగదమ్మరొ! నీకు, నమస్కరింతు, నే
నేణధృతుండు వెన్నెలనదెక్కడనైననుఁ బంచు తీరునన్. ॥ 57 ॥
ప్రతిపదార్థము.
శివే! = ఓ పార్వతీ, 
ద్రాఘీయస్యా = మిక్కిలి పొడవుగాను, విశాలముగాను ఉన్నదియు, 
దరదళిత = కొంచెముగా వికసించిన, 
నీలోత్పల రుచా = నల్లకలువల వంటి కాంతి కలదియునగు, 
దృశా = కడకంటి చూపుచే, 
దవీయాంసమ్ = చాలా దూరముననున్న, 
దీనమ్ = దీనావస్థలో నున్న, 
మామ్ = నన్ను, 
అపి = సైతము, 
కృపయా = దయతో, 
స్నపయ = తడుపుము, 
అనేన = ఈ మాత్రము సహాయము చేత, 
అయమ్ = ఈ జడుడు (అనగా – నేను) ,
ధన్యః = కృతార్థుఁడు, 
భవతి = అగుచున్నాడు, 
ఇయతా = ఇంత మాత్రము చేత, 
తే = నీకు, 
హానిః = వచ్చిన నష్టము, 
నచ = లేనే లేదు, 
హిమకరః = చంద్రుడు, 
వనేవా = అరణ్యము నందైనను, 
హర్మ్యేవా = సౌధములందైనను, 
సమకర నిపాతః = సమానమగునట్టి కిరణములను ప్రసరించుచున్నాడు గదా.
భావము. 
తల్లీ! పార్వతీ! బాగా పొడవుగా సాగినట్లుగా, విశాలముగా, కొంచెము వికసించిన నల్లకలువ కాంతివంటి కాంతికలది అయిన నీ కడకంటి చూపుచే – చాలా దూరములో, దీనావస్థలోనున్న నన్ను సైతము తడుపుము. ఈ మాత్రము సహాయముచేత ఈ దీనుడు ధన్యుడగును. నీకు వచ్చిన నష్టము గాని, ద్రవ్యనాశము గాని లేదు. ఇది విపరీతమేమీ కాదు. ఎందువలన అనగా నీ ఎడమ కన్నైన చంద్రుడు అరణ్యములలోను, సౌధములపైనను గూడా సమానముగానే తన కిరణములను ప్రసరింపచేయుచున్నాడు గదా!

58 వ శ్లోకము.  
అరాళం తే పాళీయుగళమగరాజన్యతనయే
న కేషామాధత్తే కుసుమశర కోదండ కుతుకమ్ |
తిరశ్చీనో యత్ర శ్రవణపథ ముల్లంఘ్య విలసన్
అపాంగ వ్యాసంగో దిశతి శరసంధాన ధిషణామ్ || 
పదచ్ఛేదము.
అరాళమ్ -  తే - పాళీ - యుగళమ్ -  అగ - రాజన్య - తనయే -
న - కేషామ్ -  ఆధత్తే - కుసుమ - శర - కోదండ - కుతుకమ్ -
తిరః -  చీనః -  యత్ర - శ్రవణ - పథమ్ -  ఉల్లంఘ్య - విలసన్ -
అపాంగ - వ్యాసంగః -  దిశతి - శర - సంధాన - ధిషణామ్.
అన్వయక్రమము.
అగరాజన్యతనయే, అరాళ, తే, పాళీ, యుగళమ్, కుసుమ శర, కోదండ, కుతుకమ్‌, కేషామ్, న ఆధత్తే, యత్ర, తిరశ్చీనః, విలసన్‌, అపాంగ వ్యాసంగః, శ్రవణపథం, ఉల్లంఘ్య, శరసంథాన థిషణామ్, దిశతి.
పద్యము.
ఉ.  వంకరనుండు నీ దయిన పాళి విభాగము లెన్ని పార్వతీ!
జంకరదెవ్వరున్ దలపఁ జక్కని కాముని విల్లటంచు, న
ల్వంకను కన్నులడ్డముగ భాసిలుచున్ మది నమ్ము విల్లుపై
నంకితమైనటుల్ తలచునట్టులనొప్పుచునుండెనొప్పుగన్. ॥ 58 ॥
ప్రతిపదార్థము.
అగరాజన్య తనయే = ఓ పర్వతరాజపుత్రివైన పార్వతీ,
అరాళ = వంకరగానున్న, 
తే = నీ యొక్క, 
పాళీ = చెవితమ్మె యొక్క,
యుగళమ్ = జంట,
కుసుమ శర = మన్మథుని, 
కోదండ = వింటి యొక్క, 
కుతుకమ్‌ = సౌభాగ్యముగా, 
కేషామ్ = ఎవరికి, 
న ఆధత్తే = సందేహము కలిగించదు, 
యత్ర = ఏ చెవితమ్మె జంట యందు, 
తిరశ్చీనః = అడ్డముగా తిరిగి, 
విలసన్‌ = ప్రకాశించుచున్నదై, 
అపాంగ వ్యాసంగః = కడగంటి యొక్క వ్యాపన విలాసము, 
శ్రవణపథం = చెవి సామీప్యమును, 
ఉల్లంఘ్య = దాటుచు, 
శరసంథాన థిషణామ్ = అమ్మును గూర్చు బుద్దిని, 
దిశతి = ఇచ్చుచున్నది.
భావము. 
ఓ పర్వతరాజుపుత్రీ ! పార్వతీ ! అందమైన వంపులతో సొంపుగానున్న నీ చెవితమ్మె జంట ప్రదేశమును చూచుట తోడనే అది – “పుష్పబాణమును ఎక్కుపెట్టిన మన్మథుని వింటి సొగసు అయి ఉండునేమో” అని అనిపించకుండా నుండునా? కారణమేమనగా – వంగిన విల్లువలె ఉండి, వంపుసొంపుల చెవితమ్మెల గుండా నీ కృపావీక్షణ ప్రకాశము, బాణము వలె నీ చెవులను చేరుటయే గాక, వాటిని దాటుచూ ఉన్నది గదా!

59 వ శ్లోకము.  
స్ఫురద్గండాభోగ ప్రతిఫలిత తాటంక యుగళం
చతుశ్చక్రం మన్యే తవ ముఖమిదం మన్మథరథమ్ |
యమారుహ్య ద్రుహ్య త్యవనిరథ మర్కేందుచరణం
మహావీరో మారః ప్రమథపతయే సజ్జితవతే || 
పదచ్ఛేదము.
స్ఫురత్ -  గండ -  ఆభోగ - ప్రతి ఫలిత - తాటంక - యుగళమ్ -
చతుః -  చక్రమ్ -  మన్యే - తవ - ముఖమ్ -  ఇదమ్ -  మన్మథ - రథమ్  -
యమ్ -  ఆరుహ్య - ద్రుహ్యతి -  అవనిరథమ్ -  అర్క - ఇందు - చరణమ్ - 
మహా వీరః -  మారః - ప్రమథ - పతయే - సజ్జితవతే.
అన్వయక్రమము.
తవ, ఇదమ్, ముఖమ్, స్ఫురత్‌, గండ, ఆ భోగ, ప్రతిఫలిత, తాటంక యుగళమ్, చతుశ్చక్రమ్, మన్మథ రథమ్, మన్యే, యమ్, ఆరుహ్య, మహావీరమ్, మారః, అర్కేందు చరణమ్, అవని రథమ్, సజ్జితవతే, ప్రమథపతయే, ద్రుహ్యతి.
పద్యము.
చం.  సురుచిరమైన నీ ముఖము, సుందర గండ యుగంబు గొప్పగా
మెరయుచు నీదు కమ్మల భ్రమింపగఁ జేసెడుఁ నాల్గు చక్రముల్
ధర మరు తేరిఁ బోల, శశి  ధత్ర సుచక్ర ధరా రథాన సుం
దరహరుఁడెక్కియుండ హరినందనుఁడేచుచుఁ బ్రేమఁ గొల్పెనే. ॥ 59 ॥
ప్రతిపదార్థము.
 (హే భగవతీ = ఓ జననీ!) 
తవ = నీ యొక్క, 
ఇదమ్ = ఈ  , 
ముఖమ్ = ముఖము, 
స్ఫురత్‌ = మెఱయుచున్న, 
గండ = చెక్కిళ్ళ యొక్క, 
ఆ భోగ = విశదమైన తలము నందు, 
ప్రతిఫలిత = ప్రతిబింబించిన, 
తాటంక యుగళమ్ = చెవి కమ్మల జత గలదై, 
చతుశ్చక్రమ్ = నాలుగు చక్రములు గల, 
మన్మథ రథమ్ = మన్మథుని రథముగా, 
మన్యే = ఊహించుచున్నాను, 
యమ్ = ఏ నీ ముఖము అను అట్టి రథమును, 
ఆరుహ్య = ఎక్కి, 
మహావీరమ్ = గొప్పవీరుడైన, 
మారః = మన్మథుడు, 
అర్కేందు చరణమ్ = సూర్యచంద్రులను చక్రములుగా గలిగిన, 
అవని రథమ్ = భూమి అను రథమును, 
సజ్జితవతే = యుద్ధమునకై సిద్ధపడి రథమును ఎక్కియున్నవాడైన, 
ప్రమథపతయే = ప్రమథ గణములకు ప్రభువైన  శివుని కొఱకు, 
ద్రుహ్యతి = ద్రోహము చేయుచున్నాడు.
భావము. 
తల్లీ! జగజ్జననీ! స్వచ్ఛమైన ప్రకాశ లక్షణముతో అద్దమువలె మెరయుచున్న నీ చెక్కిళ్ళు, నీ చెవుల తాటంకముల జత యొక్క ప్రతిఫలించిన చక్రబింబములు కలిగిన నీ ముఖము – నాలుగు చక్రముల రథము వలె తోచుచున్నది. ఇట్టి నీ ముఖరథమును ఎక్కి మన్మథుడు మహావీరుని వలె భూమిని రథముగాను, సూర్యచంద్రులను దాని చక్రములు గాను ఏర్పాటు చేసుకొని, యుద్ధ సన్నద్ధుఁడై దాని నెక్కి వచ్చిన ప్రమథగణ ప్రభువు, త్రిపురహరుడు అయిన శివుని ఎదుర్కొనగలుగుచున్నాడు.

60 వ శ్లోకము.  
సరస్వత్యాస్సూక్తీరమృతలహరీ కౌశలహరీః
పిబంత్యాశ్శర్వాణి శ్రవణ చులుకాభ్యామవిరళమ్
చమత్కారశ్శ్లాఘాచలిత శిరసః కుండలగణో
ఝణత్కారైస్తారైః ప్రతివచనమాచష్ట ఇవ తే  || 
పదచ్ఛేదము.
సరస్వత్యాః - సు - ఉక్తీః -  అమృత - లహరీ - కౌశల - హరీః -
పిబంత్యాః -  శర్వాణి - శ్రవణ - చులుకాభ్యామ్ -  అవిరళమ్ -
చమత్కారః -  శ్లాఘా - చలిత -  శిరసః - కుండల గణః - 
ఝణత్కారైః -  తారైః - ప్రతివచనమ్ -  ఆచష్ట - ఇవ - తే.
అన్వయక్రమము.
శర్వాణీ, సరస్వత్యాః, సూక్తీ రమృతలహరీ, కౌశల, హరీః, అవిరళమ్‌, శ్రవణచులుకాభ్యామ్, పిబంత్యాః, చమత్కార, శ్లాఘా, చలిత శిరసః, తే, కుండల గణః, తారైః, ఝణత్కారైః, ప్రతివచనమ్, ఆచష్ట ఇవ.
పద్యము.
శా.  వాణీ గానసుధాస్రవంతి కుశలత్వప్రాభవంబీవు సు
జ్ఞానీ! దోసిటఁ గ్రోలుచున్ వర శిరఃకంపంబుతో నెన్నుటన్
మాణిక్యాంచిత కర్ణభూషలటులే మార్మ్రోగుఁ గంపించుచున్
దానిన్ సత్ప్రణవంబుఁ బోలెడి ఝణత్కారంబహో! శ్లాఘ్యమే. ॥ 60 ॥
ప్రతిపదార్థము.
శర్వాణీ! = ఈశ్వరపత్నివైన ఓ పార్వతీ, 
సరస్వత్యాః = సరస్వతీ దేవి యొక్క, 
సూక్తీ రమృతలహరీ = మధుర గానామృత ప్రవాహపు పొంగు యొక్క, 
కౌశల = సౌభాగ్యమును, 
హరీః = హరించుచున్న,
అవిరళమ్‌ = ఎడతెగని విధముగా, 
శ్రవణ చులుకాభ్యామ్ = చెవులు అను దోసిళ్ళ చేత, 
పిబంత్యాః = గ్రోలుచుండుట యొక్క, 
చమత్కార = ఆనందమును, 
శ్లాఘా = శ్లాఘించుటచే, 
చలిత శిరసః = కంపించు (ఆడించు) శిరస్సుగల, 
తే = ని యొక్క, 
కుండల గణః = కర్ణాభరణములు అన్నియు, 
తారైః = ఎక్కువైన, 
ఝణత్కారైః = ఝణఝణ ధ్వనులచేత, 
ప్రతివచనమ్ = ఆమోదపు బదులు మాటలను, 
ఆచష్ట ఇవ = వచించున్నట్టులున్నది. 
భావము. 
తల్లీ శర్వాణీ! సరస్వతీ దేవి చేయు మధురగానామృత ప్రవాహపు పొంగును, ఎడతెగని విధముగా, చెవులు అను పుడిసిళ్ళ చేత గ్రోలుటలో పొందు, ఆశ్చర్య ఆనందములను శ్లాఘించుటకు, శిరస్సును చలింపచేయగా, నీ కర్ణాభరణములన్నియు ఒక్కసారిగా ఎక్కువ స్థాయిలో ఝణఝణత్కార ధ్వనుల చేత ఆమోదపు మాటలను, అనగా – “బాగున్నది – బాగున్నది” అని చెప్పే బదులు మాటలను వచించుచున్నట్లున్నది.
జైహింద్.

Saturday, April 26, 2025

బసవోదాహరణం లో సార్వవిభక్తిక పద్యము. || పాల్కురికి సోమనాథుడు

జైశ్రీరామ్.
జైహింద్.

సౌందర్యలహరి పద్యాలు 51-55. రచన శ్రీ చింతా రామకృష్ణారావుగారు,సంగీతం, గానం శ్రీమతి వల్లూరి సరస్వతి.

జైశ్రీరామ్.
51 వ శ్లోకము.  
శివే శృంగారార్ద్రా తదితరజనే కుత్సనపరా
సరోషా గంగాయాం గిరిశచరితే విస్మయవతీ |
హరాహిభ్యో భీతా సరసిరుహ సౌభాగ్యజయినీ
సఖీషు స్మేరా తే మయి జనని దృష్టిస్సకరుణా || 
పదచ్ఛేదము.
శివే - శృంగార -  ఆర్ద్రా - తత్ - ఇతర - జనే - కుత్సనపరా -
స రోషా - గంగాయామ్ -  గిరిశ - చరితే - విస్మయవతీ -
హర -  అహిభ్యః -  భీతా - సరసిరుహ - సౌభాగ్య - జయినీ -
సఖీషు - స్మేరా - తే - మయి - జనని - దృష్టిః - సకరుణా.
అన్వయక్రమము.
జనని, తే, దృష్టిః, శివే, శృంగార, ఆర్ద్రా, తత్‌ + ఇతరజనే, కుత్సనపరా, గంగాయామ్, సరోషా, గిరిశ, చరితే, విస్మయవతీ, హర, అహిభ్యః, భీతా, సరసిరుహ, సౌభాగ్య, జయినీ, సఖీషు, స్మేరా, మయి, కరుణా.
పద్యము.
ఉ.  సారస నేత్ర! నీ కనులు శర్వునెడన్ గురిపించు దివ్య శృం
గారము, నారడిన్ గొలుపుఁగల్మషులందు, భయానకంబు సం
చార భుజంగ భూషలన, స్వర్ఝరిపైన ననన్యరోషమున్,
గోరుచు నా పయిన్ గరుణ, గోపతి గాథలకద్భుతంబు నా
వీరము పద్మరోచులను, విస్తృత హాసము మిత్రపాళికిన్,
జేరఁగ వచ్చు భక్తులకు శ్రీలను గొల్పుచు నొప్పుచుండెనే. ॥ 51 ॥
ప్రతిపదార్థము.
జనని = ఓ జగజ్జననీ, 
తే = నీ యొక్క, 
దృష్టిః = చూపు, 
శివే = సదాశివుని యందు, 
శృంగార = శృంగార రసముచేత, 
ఆర్ద్రా = తడుపబడినదియు, 
తత్‌ + ఇతర జనే = ఆ సదాశివుని కంటె ఇతరులైన జనుల విషయమై, 
కుత్సనపరా = ఏవగింపు కలదియు, 
గంగాయామ్ = సపత్నిగా నెంచఁబడు గంగవిషయమున, 
సరోషా = రౌద్రరసముతో గూడినదియు, 
గిరిశ = శివుని యొక్క, 
చరితే = నడవడి విషయమున, 
విస్మయవతీ = అద్భుత రసము గలదియు, 
హర = శివుడు ధరించిన, 
అహిభ్యః = సర్పముల వలన,
భీతా = భయానక రసావేశము గలదియు, 
సరసిరుహ = కమలము యొక్క, 
సౌభాగ్య = సౌందర్యమును, 
జయినీ = జయించిన విషయమున వీరరసముతో గూడినదియు, 
సఖీషు = చెలుల యందు, 
స్మేరా = చిఱునగవుతోఁ గూడిన హాస్య రసము గలదియు, 
మయి = నా యందు; 
కరుణా = అనుగ్రహము వలన కరుణ రసము గలిగినదయునయి ఒప్పుచుండెను. 
భావము. 
తల్లీ! జగజ్జననీ! నీ యొక్క చూపు –నీ పతి అయిన శివునియందు శృంగార రసమును,శివేతర జనులయందు అయిష్ట, పరాణ్ముఖత్వములతో బీభత్సరసమును,  గంగ యెడల రోషముతో రౌద్రరసమును,శివుని చరిత్రను వినుచున్నపుడు అద్భుతరసమును,శివుడు ధరించెడి సర్పముల యెడ భయానకరసమును,
ఎఱ్ఱతామర వర్ణ ప్రకాశముల యెడ జయించిన భావము పొడ సూపు వీరరసమును,నీ సఖురాండ్ర యెడల హాస్యరసమును,
నా యెడల కరుణ రసమును,మామూలుగానున్నప్పుడు శాంతరసమును పొందుచు నవరసాత్మకముగా నుండును.

52 వ శ్లోకము.  
గతే కర్ణాభ్యర్ణం గరుత ఇవ పక్ష్మాణి దధతీ
పురాం భేత్తుశ్చిత్తప్రశమరసవిద్రావణ ఫలే |
ఇమే నేత్రే గోత్రాధరపతి కులోత్తంస కలికే
తవాకర్ణాకృష్ట స్మరశర విలాసం కలయతః || 
పదచ్ఛేదము.
గతే - కర్ణ - అభ్యర్ణమ్ -  గరుత - ఇవ - పక్ష్మాణి - దధతీ -
పురామ్ -  భేత్తుః - చిత్త - ప్రశమ - రస - విద్రావణ - ఫలే -
ఇమే - నేత్రే - గోత్రా ధర పతి - కులోత్తంస - కలికే -
తవ - ఆకర్ణ - ఆకృష్ట - స్మర - శర  - విలాసమ్  - కలయతః..
అన్వయక్రమము.
గోత్రాధరపతికుల + ఉత్తంస, కలికే, ఇమే,  తవ, నేత్రే, కర్ణ + అభ్యర్ణమ్, గతే, పక్ష్మాణి, గరుత ఇవ,దధతీ, పురామ్, భేత్తుః, చిత్తే, ప్రశమ రస, విద్రావేణ, ఫలే, ఆ కర్ణ, ఆకృష్ట, స్మర శర, విలాసమ్, కలయతః.
పద్యము.
సీ.  గిరిరాజకన్యకా! పరికింపగా నీదు కర్ణాంతమున్నట్టి కంటి చూపు
మదను నారవబాణ మహిమతోనొప్పుచుఁ ద్రిపురాసురాంతకు దివ్యమతిని
శృంగార భావనల్ చెలగునట్లుగఁ జేయు చున్నదో జగదంబ! మన్ననముగ, 
బలశాలియౌ శివున్ బలహీనునిగఁ జేసె మానసమందున మరులు కొలిపి,
తే.గీ. కరుణకాకరంబైనట్టి కనులు నీవి
భక్తపాళినిఁ గాపాడు శక్తి కలవి,
నేను నీ భక్తుఁడను, గృపన్ నీవు నన్నుఁ
గరుణఁ జూచుచున్ గాపాడు కమల నయన! ॥ 52 ॥
ప్రతిపదార్థము.
గోత్రాధరపతికుల + ఉత్తంస = భూమిని ధరించు పర్వతరాజ వంశమునకు సిగను ధరించు పువ్వు మొగ్గ అయిన, 
కలికే ! = ఓ పార్వతీ, 
ఇమే = ఈ నా హృదయకమలమందు,  
తవ = నీ యొక్క, 
నేత్రే= కన్నులు, 
కర్ణ + అభ్యర్ణమ్ = చెవుల సమీపమును, 
గతే = పొందినవై, 
పక్ష్మాణి = కనుఱెప్ప వెంట్రుకలను, 
గరుత ఇవ = ఈఁకలవలె, 
దధతీ = ధరించుచున్నవై, 
పురామ్ = త్రిపురములను, 
భేత్తుః = భేదించిన వాడైన శివుని యొక్క, 
చిత్తే = మనస్సునందు, 
ప్రశమ రస = (మనోవికారము పుట్టించుటద్వారా) శాంతమును, 
విద్రావేణ = పారద్రోలుటయే, 
ఫలే = ప్రయోజనముగా గలవియై, 
ఆ కర్ణ = చెవుల వరకు, 
ఆకృష్ట = ఆకర్షింపబడిన, 
స్మర శర = మన్మథుని బాణముల యొక్క, 
విలాసమ్ = సొగసును, 
కలయతః = చేయుచున్నట్లు భాసించుచున్నది. 
భావము. 
భూమిని ధరించు పర్వత రాజైన హిమవంతుని వంశమునకు సిగను ధరించు పూమొగ్గ అయిన ఓ పార్వతీ ! చెవుల వరకూ సాగు నీ కనుఱెప్పల తీరు చూచుచున్నపుడు, నా మనస్సునకు ఈ విధముగా అనిపిస్తున్నది. బాణములకిరు ప్రక్కల కట్టు గ్రద్ద ఈకలవలె నుండు ఱెప్ప వెంట్రుకలతో- చెవుల వరకు సాగు నీ నేత్రములలో – త్రిపుర హరుని మనస్సునకు ప్రాప్తించిన శాంతమైన నిస్పృహను పోగొట్టి, మోహమును కలిగించుటయే ప్రయోజనముగా గలవియై, ఆకర్ణాంతము లాగబడిన – మన్మథుని బాణముల సౌందర్యము గోచరించుచున్నది.

53 వ శ్లోకము.  
విభక్త త్రైవర్ణ్యం వ్యతికరిత లీలాంజనతయా
విభాతి త్వన్నేత్ర త్రితయ మిదమీశానదయితే |
పునః స్రష్టుం దేవాన్ ద్రుహిణ హరి రుద్రానుపరతాన్
రజః సత్వం బిభ్రత్ తమ ఇతి గుణానాం త్రయమివ || 
పదచ్ఛేదము.
విభక్త  - త్రైవర్ణ్యమ్ -  వ్యతికరిత - లీలా - అంజనతయా - 
విభాతి  - త్వత్ -  నేత్ర - త్రితయమ్ -  ఇదమ్ -  ఈశాన - దయితే -
పునః  - స్రష్టుమ్ -  దేవాన్ - ద్రుహిణ - హరి - రుద్రాన్ -  ఉపరతాన్ -
రజః - సత్వమ్ -  బిభ్రత్  - తమ - ఇతి - గుణానామ్ -  త్రయమ్ -  ఇవ.
అన్వయక్రమము.
ఈశాన దయితే, ఇదమ్, త్వత్‌, నేత్ర త్రితయమ్,  వ్యతికరిత,  లీలా, అంజనతయా, విభక్త, త్రైవర్ణ్యమ్, ఉపరతాన్‌, ద్రుహిణ హరి రుద్రాన్‌, దేవాన్‌, పునః, స్రష్టుమ్, రజః, సత్త్వమ్, తమః, ఇతి, గుణానామ్, త్రయం ఇవ, బిభ్రదివ, విభాతి.
పద్యము.
తే.గీ.  అర్ధవలయ నేత్రత్రయ మమరె నీకు
మూడు వర్ణంబుల లయము పొందినట్టి
బ్రహ్మవిష్ణుమహేశులన్ వరలఁజేయ
త్రిగుణ తేజంబునొప్పెను త్రినయనములు. ॥ 53 ॥
ప్రతిపదార్థము.
ఈశానదయితే = మహాదేవుని ప్రియురాలివయిన ఓ జననీ,
ఇదమ్ = ఈ కనబడు, 
త్వత్‌ = నీ యొక్క, 
నేత్ర త్రితయమ్ = కన్నుల మూడింటి సమూహము,  
వ్యతికరిత = పరస్పర మేళనముగా,  
లీలా = లీలార్థమై పెట్టఁబడిన, 
అంజనతయా = కాటుక గలిగినదగుట చేత, 
విభక్త = వేఱుపరచఁబడిన, 
త్రైవర్ణ్యమ్ = తెలుపు, నలుపు, ఎఱుపు అను మూడు వన్నెలు గలదై, 
ఉపరతాన్‌ = ఆత్మ యందు లీనమైనవారగు, 
ద్రుహిణ హరి రుద్రాన్‌ = బ్రహ్మ, విష్ణు, రుద్రుల ముగ్గుఱగు, 
దేవాన్‌ = దేవులను, 
పునః = మరల, 
స్రష్టుమ్ = సృజించుట కొఱకు, 
రజః = రజోగుణమును, 
సత్త్వమ్ = సత్త్వ గుణమును, 
తమః = తమోగుణమును, 
ఇతి = అను, 
గుణానామ్ = గుణముల యొక్క, 
త్రయం ఇవ = మూడింటి వలె, 
బిభ్రదివ = ధరించుచున్నట్లు, 
విభాతి = ప్రకాశించుచున్నది. 
భావము. 
ఓ సదాశివుని ప్రియురాలా!  నీ మూడు కన్నులు అర్ధవలయాకారముగా తీర్చినవై; లీలా విలాసార్థము ధరించిన కాటుక కలిగినదగుట చేత, ఒక దానితో ఒకటి కలసికొనని తెలుపు, నలుపు, ఎరుపు అను మూడు రంగులు కలదై; గత ప్రళయమునందు తన యందు లీనమైన బ్రహ్మ, విష్ణు, రుద్రులు అను త్రిమూర్తులను మరల మరల విశ్వ సృష్టికొరకు –రజస్సు, సత్త్వము, తమస్సు  అను మూడు గుణములను ధరించు దాని వలె ప్రకాశించుచున్నవి.

54 వ శ్లోకము.  
పవిత్రీకర్తుం నః పశుపతి పరాధీన హృదయే
దయామిత్రైర్నేత్రైరరుణ ధవళ శ్యామ రుచిభిః |
నదశ్శోణో గంగా తపనతనయేతి ధ్రువమయమ్
త్రయాణాం తీర్థానాముపనయసి సంభేదమనఘమ్ || 
పదచ్ఛేదము.
పవిత్రీ - కర్తుమ్ -  నః - పశుపతి - పరాధీన - హృదయే -
దయా - మిత్రైః -  నేత్రైః - అరుణ -  ధవళ  - శ్యామ - రుచిభిః -
నదః -  శోణః -  గంగా - తపన - తనయా - ఇతి - ధ్రువమ్, అయమ్ -
త్రయాణామ్ -  తీర్థానామ్ -  ఉపనయసి - సంభేదమ్ -  అనఘమ్.
అన్వయక్రమము.
పశుపతి పరాధీన హృదయే, దయామిత్రైః, అరుణ ధవళ శ్యామ, రుచిభిః, నేత్రైః, శోణః నదః, గంగా, తపన తనయా, ఇతి, త్రయాణామ్, తీర్థానామ్, అనఘమ్, అయమ్, సంభేదమ్, నః, పవిత్రీ కర్తుమ్, ఉపనయసి, ధ్రువమ్ .
పద్యము.
శా.  మమ్ముం జేయగ సత్ పవిత్రులుగ నమ్మా! సద్దయార్ద్రంపు శో
ణమ్మున్ శ్వేతము, కృష్ణమున్, గలుగు జ్ఞానంబిచ్చు నీ మూడు నే
త్రమ్ముల్ శోణను, గంగ నా యముననిద్ధాత్రిన్ గృపన్నొక్కెడన్
నెమ్మిన్ మూడగు తీర్థముల్ నిలిపితే, నిన్ గొల్వ నే నేర్తునే? ॥ 54 ॥
ప్రతిపదార్థము.
పశుపతి పరాధీన హృదయే ! = శివునికి అధీనమైన చిత్తము గల ఓ దేవీ! 
దయామిత్రైః = దయతో గూడిన,
అరుణ ధవళ శ్యామ = ఎఱుపు, తెలుపు, నలుపు అను, 
రుచిభిః = కాంతి గలవియైన, 
నేత్రైః= నేత్రముల చేత, 
శోణః నదః = శోణయను పేరు గల నదము, 
గంగా = గంగానది, 
తపన తనయా = సూర్యుని కూతురైన యమున, 
ఇతి= అను, 
త్రయాణామ్ = మూడుగా నున్న, 
తీర్థానామ్ = పుణ్యతీర్థముల యొక్క, 
అనఘమ్ = పాపములను పోగొట్టు జలము కలదైన, 
అయమ్ = ఈ, 
సంభేదమ్ = నదీ సంగమ స్థానమును, 
నః = మమ్ములను, 
పవిత్రీకర్తుమ్ = పవిత్రవంతముగా చేయుటకు, 
ఉపనయసి = దగ్గఱకు చేర్చుచున్నావు,
ధ్రువమ్ = ఇది నిశ్చయము.
భావము. 
శివాధీనమైన చిత్తము గల ఓ పార్వతీ! కరుణరసార్ద్రత వలన మృదుత్వమును, ఎరుపు, తెలువు, నలుపు అను మూడు వన్నెల వికాసమునుగల నీ నేత్రత్రయము చేత ఎరుపురంగు నీటితో ప్రవహించు ‘శోణ’యను నదము, తెల్లని నీటితో ప్రవహించు గంగానది, నల్లని నీటితో ప్రవహించు సూర్యపుత్రిక అయిన యమునానది – ఈ మూడు పుణ్య తీర్థములతో పాపములను పోగొట్టి అపవిత్రులను పావనులుగా చేయుటకు – వాటిని త్రివేణీ సంగమ స్థానముగా ఒక చోటకు చేర్చుచున్నావు.

55 వ శ్లోకము.  
నిమేషోన్మేషాభ్యాం ప్రలయముదయం యాతి జగతీ
తవేత్యాహుస్సంతో ధరణిధరరాజన్యతనయే
త్వదున్మేషాజ్జాతం జగదిదమశేషం ప్రలయతః
పరిత్రాతుం శంకే పరిహృతనిమేషాస్తవ దృశః  || 
పదచ్ఛేదము.
నిమేష -  ఉన్మేషాభ్యామ్ -  ప్రలయమ్ - ఉదయమ్ -  యాతి - జగతీ -
తవ - ఇతి -  ఆహుః -  సంతః -  ధరణి  -  ధర - రాజన్య - తనయే -
త్వత్ -  ఉన్మేషా - జ్జాతమ్ - జగత్ -  ఇదమ్ -  అశేషమ్ -  ప్రలయతః -
పరిత్రాతుమ్ -  శంకే - పరిహృత - నిమేషాః - తవ - దృశః.
అన్వయక్రమము.
ధరణి ధర రాజన్య తనయే, తవ, నిమేష + ఉన్మేషాభ్యామ్, జగతీ, ప్రళయమ్, ఉదయమ్, యాతి, ఇతి, సంతః, ఆహుః,  త్వత్‌, ఉన్మేషాత్‌, జాతమ్, అశేషమ్, ఇదం జగత్, ప్రళయతః, పరిత్రాతుమ్, తవ, దృశః, పరిహృత నిమేషాః, ఇతి, శంకే.
పద్యము.
కం.  నీ కనులు మూసి తెరచిన 
లోకమె ప్రళయంబునకును లోనగునమ్మా!
లోకప్రళయము నిలుపన్
నీ కనులను మూయవీవు నిత్యముగ సతీ! ॥ 55 ॥
ప్రతిపదార్థము. 
ధరణి ధర రాజన్య తనయే  = ఓ పర్వతరాజపుత్రివైన ఓ పార్వతీ,
తవ = నీ యొక్క, 
నిమేష + ఉన్మేషాభ్యామ్ = కంటి ఱెప్పలు మూయుట చేతను, తెఱచుట చేతను, 
జగతీ = జగత్తు, 
ప్రళయమ్ = ప్రళయము యొక్క, 
ఉదయమ్ = ఉద్భవమును, 
యాతి = పొందును, 
ఇతి = అని, 
సంతః = సత్పురుషులు, 
ఆహుః = చెప్పుదురు,  
త్వత్‌ = ఆ, 
ఉన్మేషాత్‌ = నీ కంటీ టెప్పలు తెరుచుట వలన, 
జాతమ్ = ఉద్భవించిన, 
అశేషమ్ = సమస్తమైన, 
ఇదం జగత్ = ఈ జగత్తును, 
ప్రళయతః = ప్రళయము నుండి, 
పరిత్రాతుమ్ = రక్షించుట కొఱకు, 
తవ = నీ యొక్క, 
దృశః = కన్నులు, 
పరిహృత నిమేషాః = తిరస్కరించిన రెప్పపాటులు గలవి, 
ఇతి = అని, 
శంకే = తలంచుదును.
భావము. 
పర్వతరాజపుత్రికా, ఓ పార్వతీ ! నీ కనురెప్పలు మూసికొనుట చేత జగత్తుకు ప్రళయమును, రెప్పలు తెఱచుకొనుట చేత జగత్తుకు సృష్టియు ఉద్భవించునని సత్పురుషులు చెప్పుదురు. అందువలన నీ కనురెప్పలు తెఱచుట వలన ఉద్భవించిన యావజ్జగత్తును ప్రళయము నుండి రక్షించుట కొఱకు, నీ కన్నులు రెప్పపాటు లేక ఎప్పుడూ తెఱచుకొని ఉన్న స్థితిలోనే యున్నవని తలంచుచున్నాను.
జైహింద్.

సౌందర్యలహరి 46-50పద్యాలు. రచన శ్రీ చింతా రామకృష్ణారావుగారు,సంగీతం, గానం శ్రీమతి వల్లూరి సరస్వతి.

జైశ్రీరామ్.
46 వ శ్లోకము.  
లలాటం లావణ్య ద్యుతి విమలమాభాతి తవ యత్
ద్వితీయం తన్మన్యే మకుటఘటితం చంద్రశకలమ్ |
విపర్యాసన్యాసాదుభయమపి సంభూయ చ మిథః
సుధాలేపస్యూతిః పరిణమతి రాకాహిమకరః || 
పదచ్ఛేదము.
లలాటమ్ -  లావణ్య - ద్యుతి - విమలమ్ -  ఆభాతి - తవ - యత్ -
ద్వితీయమ్ - తత్ -  మన్యే - మకుట - ఘటితమ్ -  చంద్ర - శకలమ్ -
విపర్యాస - న్యాసాత్ -  ఉభయమ్ -  అపి - సంభూయ చ - మిథః -
సుధ -  ఆలేప - స్యూతిః - పరిణమతి - రాకా - హిమకరః.
అన్వయక్రమము.
తవ, లలాటమ్, లావణ్యద్యుతి, విమలమ్, ఆభాతి, యత్‌, తత్‌, మకుట ఘటితమ్, ద్వితీయమ్, చంద్రశకలమ్, మన్యే,  ఉభయమ్ అపి, విపర్యాసన్యాసాత్‌, మిథః, సంభూయచ, సుధాలేపస్యూతిః, రాకాహిమకరః, పరిణమతి.
పద్యము.
శా.  లావణ్యాంచిత సల్లలాట కలనా! శ్లాఘింతునద్దానినే
భావంబందున నర్ధచంద్రుఁడనుచున్ భాసించుటన్ గాంచి, పై
నావంకన్ గల నీ కిరీట శశి వ్యత్యస్తంబుగాఁ గూడుటన్
భావింపన్ సుధ పూతఁబూర్ణ శశిగా భాసించుఁగా శాంభవీ!॥46॥
ప్రతిపదార్థము.
(హే భగవతి! = ఓ తల్లీ!)
తవ = నీ యొక్క, 
లలాటమ్ = నుదురు భాగము, 
లావణ్యద్యుతి = సౌందర్యాతిశయకాంతితో, 
విమలమ్ = స్వచ్చమై, 
ఆభాతి = అంతటా ప్రకాశించుచున్నదై, 
యత్‌ = ఏది కలదో, 
తత్‌ = దానిని, 
మకుట ఘటితమ్ = కిరీటము నందు కూర్చబడినదైన, 
ద్వితీయమ్ = రెండవ దైన, 
చంద్రశకలమ్ = చంద్రుని అర్ధఖండముగా, 
మన్యే = ఊహించుచున్నాను, 
ఉభయం అపి = నీ లలాటభాగము, ఆ చంద్ర ఖండము - ఈ రెండును, 
విపర్యాసన్యాసాత్‌ = వ్యత్యస్తముగా కలుపుట వలన, 
మిథః = పరస్పరము, 
సంభూయచ = కలసికొని, 
సుధాలేపస్యూతిః = అమృతపు పూత కలిగిన, 
రాకాహిమకరః = పూర్ణిమచంద్రునిగా, 
పరిణమతి = అగుచున్నది. 
భావము.  
తల్లీ! జగజ్జననీ! నీ నుదురు భాగము పవిత్రమైన సౌందర్యాతిశయముతో ప్రకాశించుచున్నది. అట్టి ఈ లలాటభాగము నీ కిరీటమునందు కనబడకుండానున్న చంద్రుని రెండవ అర్ధభాగముగా ఉన్నట్లు ఊహించుచున్నాను. నా ఈ ఊహ నిజమే అయి వుండవచ్చును. కారణమేమనగా నీ లలాట భాగమును ఆ అర్ధచంద్ర భాగమును కలిపినచో అమృతమును స్రవించు పూర్ణచంద్రుని ఆకారమును పొందుచున్నది. ఆ స్రవింపబడు అమృతముతోనే ఆ రెండూ అతకబడినట్లు గూడా కనబడని విధముగా కలసిపోయి, పూర్ణచంద్రుని వలె భాసించుచున్నవి గదా!

47 వ శ్లోకము.  
భ్రువౌ భుగ్నే కించిద్భువన భయ భంగ వ్యసనిని
త్వదీయే నేత్రాభ్యాం మధుకర రుచిభ్యాం ధృతగుణమ్ |
ధనుర్మన్యే సవ్యేతరకర గృహీతం రతిపతేః
ప్రకోష్ఠే ముష్టౌ చ స్థగయతి నిగూఢాంతరముమే || 
పదచ్ఛేదము.
భ్రువౌ - భుగ్నే - కించిత్ -  భువన - భయ - భంగ - వ్యసనిని -
త్వదీయే - నేత్రాభ్యామ్ - మధుకర - రుచిభ్యామ్ -  ధృత - గుణమ్ -
ధనుః - మన్యే -  సవ్య - ఇతర - కర - గృహీతమ్ -  రతి - పతేః -
ప్రకోష్ఠే - ముష్టౌ - చ - స్థగయతి - నిగూఢ - అంతరమ్ -  ఉమే.
అన్వయక్రమము.
ఉమే! భువన, భయ, భంగ, వ్యసనిని, త్వదీయే, కించిత్‌, భుగ్నే, భ్రువే, మధుకర, రుచిభ్యామ్, నేత్రాభ్యామ్, ధృత, గుణమ్, రతి పతేః,  సవ్యేతర, కర, గృహీతమ్, ప్రకోష్ఠే, ముష్టౌచ, స్థగయతి, నిగూఢ, అంతరమ్, ధనుః, మన్యే.
పద్యము.
తే.గీ.  భువన భయ హర వ్యసన! కన్ బొమలు నీవి
మరుని విల్లు, కనుల్ త్రాడు కరణినొప్పఁ,
బిడికిటనుపట్టి యుండుటన్ వింటిత్రాడు 
మధ్య కనరాని మరువిల్లు మదినిఁ దోచు. ॥ 47 ॥
ప్రతిపదార్థము. 
ఉమే = ఓ పార్వతీ, 
భువన = లోకముల యొక్క, 
భయ = ఉపద్రవములను, 
భంగ = నాశము చేయుట యందే, 
వ్యసనిని = ఆసక్తిగలదేవీ,
త్వదీయే = నీ యొక్క, 
కించిత్‌ = కొద్దిగా, 
భుగ్నే = వంగినవి అయిన, 
భ్రువే = కనుబొమలను, 
మధుకర = తుమ్మెదలవంటి, 
రుచిభ్యామ్ = శోభ కలిగినటువంటి,
నేత్రాభ్యామ్ = కనుదోయిచేతను, 
ధృత = పొందిన, 
గుణమ్ = అల్లెత్రాడు గలదై, 
రతిపతేః = మన్మథుని యొక్క,  
సవ్యేతర = ఎడమది అయిన, 
కర = హస్తముచేత, 
గృహీతమ్ = పట్టుకొనబడినదియు, 
ప్రకోష్ఠే = మణికట్టును, 
ముష్టౌచ = పిడికిలియు, 
స్థగయతి = కప్పుచున్నది కాగా, 
నిగూఢ = కప్పబడి చూడబడని వింటినారి, 
అంతరమ్ = వింటి నడిమి భాగము గలదైన, 
ధనుః = విల్లునుగా, 
మన్యే = తలంచుచున్నాను.  
భావము. 
ఓ మాతా! సమస్త లోకాలకు కలుగు ఆపదలనుండి వాటిని రక్షించుటయందే పట్టుదలతో గూడిన ఆసక్తి గల ఓ తల్లీ, ఉమా! కొద్దిగా వంపుగా వంగినట్లున్న నీకనుబొమల తీరు – తుమ్మెదల వంటి శోభను గలిగి, అడ్డముగా వరుసలోనున్న నల్లని కనుదోయిని వింటినారిగా గలిగి – మన్మథుని వామహస్తము యొక్క పిడికిలిచేత నడిమి భాగములో పట్టుబడుటచే కనబడకుండానున్న కొంత నారి భాగమును, దండభాగమును కలిగిన – విల్లుగా అనిపించుచున్నది.

48 వ శ్లోకము.  
అహస్సూతే సవ్యం తవ నయనమర్కాత్మకతయా
త్రియామాం వామం తే సృజతి రజనీనాయకతయా |
తృతీయా తే దృష్టిర్దరదలిత హేమాంబుజ రుచిః
సమాధత్తే సంధ్యాం దివసనిశయోరంతరచరీమ్  || 
పదచ్ఛేదము.
అహః -  సూతే - సవ్యమ్ -  తవ - నయనమ్ -  అర్క - ఆత్మకతయా -
త్రియామామ్ -  వామమ్ -  తే - సృజతి - రజనీ - నాయక - తయా -
తృతీయా - తే - దృష్టిః -  దర - దళిత - హేమ - అంబుజ - రుచిః -
సమాధత్తే - సంధ్యామ్ -  దివస - నిశయోః -  అంతర - చరీమ్.
అన్వయక్రమము.
తవ, సవ్యమ్, నయనమ్, అర్కాత్మకతయా, అహః, సూతే, వామమ్, తే, నయనమ్, రజనీ నాయకతయా, త్రియామామ్, సృజతి, దర, దళిత, హేమాంబుజ, రుచిమ్, తే, తృతీయా దృష్టిః, దివస నిశయోః, అంతర చరీ, సంధ్యామ్, సమాధత్తే.
పద్యము.
తే.గీ.  పగలు కొలుపు నీ కుడికన్ను పరగు రవిని,
రాత్రి నెడమకన్నది కొల్పు రాజుఁ గలిగి,
నడిమి నేత్రమగ్నియగుటన్ నడుపు సంధ్య,
కాలరూపమే నీవమ్మ కమలనయన! ॥ 48 ॥
ప్రతిపదార్థము.  
(హే భగవతీ! = ఓ జననీ!) 
తవ = నీ యొక్క, 
సవ్యమ్ = కుడివైపున దైన, 
నయనమ్ = కన్ను, 
అర్కాత్మకతయా = సూర్యసంబంధమైన దగుటచేత, 
అహః = పగటిని, 
సూతే = పుట్టించుచున్నది, 
వామమ్ = ఎడమవైపునదైన, 
తే = నీ యొక్క, 
నయనమ్ = కన్ను, 
రజనీ నాయకతయా = చంద్రుఁడగుటచేత, 
త్రియామామ్ = రాత్రిని, 
సృజతి = కలిగించుచున్నది,
దర = కొంచెముగా, 
దలిత = వికసించినదైన, 
హేమాంబుజ = స్వర్ణకమలము యొక్క, 
రుచిమ్ = ప్రకాశము వంటి రంగుగల, 
తే = నీ యొక్క, 
తృతీయా దృష్టిః = లలాటమున నున్న మూడవ కన్ను, 
దివస నిశయోః = పగలు రాత్రి అను వాని యొక్క, 
అంతరచరీ = నడుమ వర్తించు చున్నదైన, 
సంధ్యామ్ = సాయం ప్రాతః సంబంధమైన సంధ్యల జంటను, 
సమాధత్తే = చక్కగా ధరించుచున్నది.  
భావము. 
అమ్మా! జగజ్జననీ! నీ కుడికన్ను సూర్య సంబంధమైనదగుటచే పగటిని జనింపజేయుతున్నది. నీ యొక్క ఎడమకన్ను చంద్ర సంబంధమైనదగుటచే రాత్రిని పుట్టించుచున్నది. ఎర్రతామరపూవురంగు గల నీ లలాటనేత్రము అహోరాత్రముల నడుమ వర్తించుచూ సాయం పాత్రః కాల సంబంధమైన ఉభయ సంధ్యలను అగ్నిని సూచించు ఎరుపుదనము తన వర్ణ లక్షణముగా గలదని సూచించుట వలన ఈ తృతీయ నేత్రము అగ్ని సంబంధమైనదని గ్రహించబడుతున్నది.

49 వ శ్లోకము.  
విశాలా కల్యాణీ స్ఫుటరుచిరయోధ్యా కువలయైః
కృపాధారాధారా కిమపి మధురాఽఽభోగవతికా |
అవంతీ దృష్టిస్తే బహునగర విస్తార విజయా
ధ్రువం తత్తన్నామ వ్యవహరణ యోగ్యావిజయతే || 
పదచ్ఛేదము.
విశాలా - కల్యాణీ - స్ఫుట - రుచిః - అయోధ్యా -  కువలయైః -
కృపా - ధారాధారా - కిమ్ -  అపి - మధురా - ఆభోగవతికా - 
అవంతీ - దృష్టిః -  తే - బహు - నగర - విస్తార - విజయా -
ధ్రువమ్ - తత్ -  తత్ - నామ - వ్యవహరణ - యోగ్యా - విజయతే.
అన్వయక్రమము.
తే, దృష్టిః, విశాలా, కళ్యాణీ, స్ఫుట రుచిః, కువలయైః, అయోధ్యా, కృపాధారా, ఆధారా, కిమపి, మధురా, ఆభోగవతికా, అవంతీ, బహునగర, విస్తార,విజయా, తత్‌ తత్‌, వ్యవహరణ, యోగ్యా, విజయతే, ధ్రువమ్.
పద్యము.
మ.  కరుణాపాంగ! విశాలమై, కనుబొమల్ కల్యాణ కాంతిన్, సతీ!
పరగున్ జూడ నయోధ్యయై కలువకున్, భవ్యకృపాధార సుం
దరధారా మధురాత్మ, భోగవతియై, నా యందవంతీ ధృతిన్,
బరమంబై విజయాష్టపట్టణములన్ భావింపనౌ నీ యెడన్. ॥ 49 ॥
ప్రతిపదార్థము.
(హే భగవతీ! = ఓ అమ్మా!)
తే = నీ యొక్క, 
దృష్టిః = చూపు, 
విశాలా = విపులమై, 
కళ్యాణీ = మంగళ స్వరూపమై, 
స్ఫుట రుచిః = స్పష్ట కాంతివంతమై, 
కువలయైః = నల్లకలువల చేత, 
అయోధ్యా = జయించుటకు వీలుకానిదై, 
కృపాధారా = కరుణా ప్రవాహమునకు, 
ఆధారా = ఆధారమగుచున్నదై,
కిమపి = ఇట్టిదని చెప్పుటకు వీలుకానిదై, 
మధురా = మధురమై, 
ఆభోగవతికా = విశాల దృక్పథము గలదై, 
అవంతీ = రక్షణ లక్షణము గలదై, 
బహునగర = పెక్కుపట్టణముల యొక్క, 
విస్తార = సమూహముయొక్క,
విజయా = విజయము గలదియై,
తత్‌ తత్‌ = ఆయా నామ నగరముల పేర్ల చేత, అనగా విశాలా, కళ్యాణీ ' అయోధ్యా, ధారా, మధురా, భోగవతీ, అవంతీ, విజయా - అను ఎనిమిది నగర నామముల చేత, 
వ్యవహరణ = వ్యవహరించుటయందు, 
యోగ్యా = తగినదై, 
విజయతే = విజయవంతమై వర్ధిల్లుచున్నది, 
ధ్రువమ్ = ఇది నిశ్చయము. 
భావము. 
తల్లీ ! జగజ్జననీ ! నీ చూపు
విశాలమై – విశాలయను నగర నామము వ్యవహరించుటకు తగినదియై;
కళ్యాణవంతమై – కళ్యాణీ అనునగర నామ వ్యవహారమునకు యోగ్యమై;
స్పష్టమైన కాంతి గలిగి – నల్ల కలువలు జయించలేని సౌందర్యము కలది అగుచు;
అయోధ్య అను నగరము పేర పిలుచుటకు తగినదై,
కృపారస ప్రవాహమునకు ఆధారవుగుచూ ధారానగర నామముతో వ్యవహరించుటకు తగినదై;
వ్యక్తము చేయ వీలులేని మధుర మనోజ్ఞమగుచు – మధురానగర నామముతో పిలుచుటకు అర్హమై;
విశాలము, పరిపూర్ణ దృక్పథమును గలుగుచు – భోగవతీ నగర నామముతో వ్యవహరించటకు తగినదై;
రక్షణ లక్షణము కలిగి – అవంతీ నగర నామముతో పిలుచుటకు తగినదై;
విజయ లక్షణముతో- విజయనగర నామముతో వ్యవహరింప తగినదై –
ఈ విధమైన ఎనిమిది లక్షణములతో ఎనిమిది నగరముల పేర వ్యవహరించుటకు తగినదై – సర్వోత్కర్షత చేత స్వాతిశయముతో వర్తించుచున్నది.

50 వ శ్లోకము.  
కవీనాం సందర్భ స్తబక మకరందైక రసికం
కటాక్ష వ్యాక్షేప భ్రమర కలభౌ కర్ణయుగలమ్ |
అముంచంతౌ దృష్ట్వా తవ నవరసాస్వాద తరలౌ
అసూయా సంసర్గా దలికనయనం కించిదరుణమ్ || 
పదచ్ఛేదము.
కవీనామ్ -  సందర్భ -  స్తబక - మకరంద -  ఏక - రసికమ్ -
కటాక్ష - వ్యాక్షేప - భ్రమర - కలభౌ - కర్ణ - యుగలమ్ -
అముంచంతౌ - దృష్ట్వా - తవ - నవ - రస -  ఆస్వాద - తరలౌ -
అసూయా - సంసర్గాత్ -  అలిక - నయనమ్ -  కించిత్ -  అరుణమ్.
అన్వయక్రమము.
కవీనామ్, సందర్భ, స్తబక, మకరంద, ఏకరసికమ్, తవ, కర్ణయుగలమ్, కటాక్ష, వ్యాక్షేప, భ్రమర కలభౌ, నవరస, ఆస్వాద, తరలౌ, అముంచంతౌ, దృష్ట్వా, అలిక నయనమ్, అసూయా సంసర్గాత్‌, కించిత్‌, అరుణమ్.
పద్యము.
చం.  కవుల కవిత్వసన్మధువు కమ్మగ ప్రీతిని గ్రోలనెంచియున్, 
జెవులను వీడనట్టివియు, శ్రీకరమైన సునేత్ర సన్మిషన్,
బ్రవిమల తేజ సద్భ్రమర భాతిని చూచి యసూయఁ జెంది, మూ
డవదగు నేత్ర మెఱ్ఱఁబడె నమ్మరొ నీకు, మనోహరాకృతీ! ॥ 50 ॥
ప్రతిపదార్థము.
(హే భగవతీ! = ఓ జననీ!)
కవీనామ్ = కవుల యొక్క, 
సందర్భ = రసవత్తర రచనలు అనెడి, 
స్తబక = పుష్ప గుచ్ఛము నందలి, 
మకరంద =  తేనె యందు (మాత్రమే), 
ఏకరసికమ్ = ముఖ్యముగా ఇష్టపడు, 
తవ = నీ యొక్క, 
కర్ణయుగలమ్ = రెండు చెవులను, 
కటాక్ష= కడగంటి చూపులను, 
వ్యాక్షేప = నెపముగా పెట్టుకొని, 
భ్రమర కలభౌ =  గండు తుమ్మెదలు రెండు,
నవరస = శృంగారాది నవ రసముల యొక్క, 
ఆస్వాద = ఆస్వాదమునందు, 
తరలౌ = అత్యంతాసక్తి కలిగినవై, 
అముంచంతౌ = ఆ రసాస్వాదన లాంపట్యము చేత (రసాస్వాదన చేయు) నీ వీనుల జంటను విడువలేక యుండుటను, 
దృష్ట్వా = చూచి, 
అలిక నయనమ్ = మూడవదైన నీ లలాట నేత్రము, 
అసూయా సంసర్గాత్‌ = ఈర్ష్య చెందుట వలన, 
కించిత్‌  =  కొంచెము 
అరుణమ్ = ఎఱుపు వన్నెగలదైనది, (ఎఱ్ఱబడినది.)  
భావము. 
అమ్మా, ఓ భగవతీ! సుకవీశ్వరుల రసవత్తర రచనలనే పుష్ప గుచ్ఛముల నుండి జాలువారు తేనెయందు మాత్రమే అత్యంతాసక్తిని చూపు నీ యొక్క చెవుల జతను – కడగంటి చూపులు అను నెపముతో నీ రెండు కన్నులు అను గండు తుమ్మెదలు – శృంగారాది నవరసాస్వాదనానుభూతిని పొందుట యందు అత్యంతాసక్తిని కలిగినవై – ఆ రసాస్వాదన లాంపట్యము చేత నీ వీనుల జంటను విడువలేక యుండగా – పైన ఉన్న లలాట నేత్రము చూసి – మిక్కిలిగా అసూయ చెంది, ఎఱుపు వన్నెకలదైనది అనగా “కోపముతో ఎఱ్ఱఁబడినది” అని భావము.
జైహింద్.

Thursday, April 24, 2025

సౌందర్య లహరి 41-45 పద్యాలు. రచన శ్రీ చింతా రామకృష్ణారావుగారు,సంగీతం,గానం శ్రీమతి వల్లూరి సరస్వతి

జైశ్రీరామ్.
41 వ శ్లోకము.  
తవాధారే మూలే సహ సమయయా లాస్యపరయా
నవాత్మానం మన్యే నవరస మహాతాండవ నటమ్ |
ఉభాభ్యా మేతాభ్యాముదయ విధి ముద్దిశ్య దయయా
సనాథాభ్యాం జజ్ఞే జనక జననీమత్ జగదిదమ్ || 
పదచ్ఛేదము.
తవ - ఆధారే - మూలే - సహ - సమయయా - లాస్య పరయా -
నవ -  ఆత్మానమ్ -  మన్యే - నవ - రస - మహా - తాండవ - నటమ్ -
ఉభాభ్యామ్ -  ఏతాభ్యామ్ - ఉదయ - విధిమ్ -  ఉద్దిశ్య - దయయా -
స నాథాభ్యామ్ -  జజ్ఞే  - జనక - జననీ - మత్ - జగత్ - ఇదమ్.
అన్వయక్రమము.
తవ, మూలే ఆధారే, లాస్యపరయా, సమయయా సహ, నవ, రస, మహత్‌, తాండవ, నటమ్, నవ + ఆత్మానమ్, ఉదయవిధిమ్, ఉద్దిశ్య, ఏతాభ్యామ్, ఉభాభ్యామ్, దయయా, సనాథాభ్యామ్, ఇదమ్ జగత్‌, జనక జననీమత్‌, జజ్ఞే.
{మహాతాండవం... మహత్+తాండవం, మహత్ శబ్దం లో త కారానికి కర్మ ధారయ సమాసం లో ఆన్మహతః సమానాఽధి కరణ జాతీయాయోః సూత్రం వల్ల ఆ కారం ఆదేశముగును.}

పద్యము.
సీ.  నీదు మూలాధార నిర్మల చక్రాన సమయ యనెడి గొప్ప శక్తిఁ గూడి
ప్రవర శృంగారాది నవరసమ్ములనొప్పు నానంద తాండవమమరఁ జేయు
నిన్ను నేను నవాత్ముని సతతానందభై రవుని దలంచెద, ప్రళయ దగ్ధ
లోకాల సృజనకై శ్రీకరముగఁ గూడి యిటులొప్పు మీచేత నీ జగమ్ము
తే.గీ.  తల్లిదండ్రులు కలదిగాఁ దలతు నేను,
లోకములనేలు తలిదండ్రులేకమగుచు
దివ్యదర్శనభాగ్యమీ దీనునకిడ
వేడుకొందును, నిలుడిల నీడవోలె. ॥ 41 ॥
ప్రతిపదార్థము.
(హే భగవతి! = ఓ తల్లీ!)
తవ = నీ యొక్క, 
మూలే ఆధారే = మూలాధార చక్రమునందు, 
లాస్యపరయా = నృత్యాసక్తిగల, 
సమయయా సహ = “సమయకళ” తో  గూడ, 
నవ = తొమ్మిది, 
రస = శృంగారాది రసముల చేత, 
మహత్‌ = అద్భుతమైన, 
తాండవ = నాట్యమునందు, 
నటమ్ = అభినయించువాడైనవానిని, 
నవ + ఆత్మానమ్ = తొమ్మిది రూపులు గల ఆనందభైరవునిగా, 
మన్యే = తలచెదను, 
ఉదయవిధిమ్ = జగదుత్పత్తి కార్యమును, 
ఉద్దిశ్య = ఉద్దేశించి, 
ఏతాభ్యామ్ = ఈ, 
ఉభాభ్యామ్ = ఇరువురి చేత (అనగా - ఆనందభైరవ మహాభైరవుల చేత), 
దయయా = (ప్రళయాగ్నికి దగ్ధమైన లోకములను మరల నుత్పత్తి చేయుట యందు) కరుణతో, 
సనాథాభ్యామ్ = ఇరువురి కలయిక చేత, 
ఇదంజగత్‌ = ఈ జగత్తు, 
జనక జననీమత్‌ = తండ్రియు తల్లియు గలదిగా, 
జజ్ఞే = అయినది.  
భావము. 
ఓ తల్లీ! నీ యొక్క మూలాధార చక్రమునందు లాస్యాసక్తిగల, “సమయకళ” అను పేరుగల శక్తి గూడ, తొమ్మిది శృంగారాదిరసముల చేత అద్భుతమైన తాండవమునందు అభినయించువాడైనవానిని తొమ్మిది రూపులుగల ఆనందభైరవునిగా తలచెదను. జగదుత్పత్తి కార్యమును ఉద్దేశించి, ఈ ఇరువురి చేత (అనగా - ఆనందభైరవ మహాభైరవుల చేత) (ప్రళయాగ్నికి దగ్ధమైన లోకములను మరల నుత్పత్తి చేయుట యందు) కరుణతో, ఇరువురి కలయిక చేత ఈ జగత్తు తండ్రియు తల్లియు గలదిగా అయినది. 

42 వ శ్లోకము.  
గతైర్మాణిక్యత్వం గగనమణిభిస్సాంద్రఘటితం
కిరీటం తే హైమం హిమగిరిసుతే కీర్తయతి యః ||
స నీడేయచ్ఛాయా చ్ఛురణ శబలం చంద్ర శకలం
ధనుశ్శౌనాసీరం కిమితి న నిబధ్నాతి ధిషణామ్ || 
పదచ్ఛేదము.
గతైః -  మాణిక్యత్వమ్ - గగన - మణిభిః - సాంద్ర - ఘటితమ్ -
కిరీటమ్ - తే - హైమమ్ -  హిమగిరి సుతే - కీర్తయతి -  యః -
సః - నీడేయ - ఛాయా -  ఛురణ - శబలమ్ -  చంద్ర శకలమ్ - 
ధనుః - శౌనాసీరమ్ - కిమ్ - ఇతి - న - నిబధ్నాతి - ధిషణామ్.
(నీడేయ+ఛాయ=నీడేయ+{ఛేచ.సూత్రమువలన త్ ఆగమము}త్+ఛాయ=నీడేయ+{స్తోశ్చునాశ్చుః వల్ల శ్చుత్వము}చ్+ఛాయ=నీడేయచ్ఛాయ./అటులనే చ్ఛురణ కూడా.)
అన్వయక్రమము.
హీమగిరిసుతే, మాణిక్యత్వమ్, గతైః, గగనమణిభిః, సాంద్రఘటితమ్, హైమమ్, తే, కిరీటమ్, యః, కీర్తయతి, సః, నీడేయ, ఛాయా, ఛురణ, శబలమ్, చంద్ర శకలమ్, శౌనాసీరమ్, ధనుః ఇతి, ధిషణామ్, కిమ్ న నిబధ్నాతి.
పద్యము.
సీ.  హిమగిరి నందినీ! సముచితముగ సూర్యులందరిన్ మణులుగ పొందఁబడిన
నీ స్వర్ణమకుటమున్ నియతితోఁ గీర్తించునెవ్వండతండిల నెంచకున్నె
ద్వాదశాదిత్యుల వరలెడు మణికాంతి సోకుచు నొప్పెడి సోముని గని
యింద్ర ధనుస్సుగా, సాంద్రకృపాంబ! తత్ కల్యాణతేజంబు ఘనతరంబు.
తే.గీ. నీ కిరీటంబు తేజంబు నే దలంచి
యాత్మలోఁ దృప్తినందెదనమ్మ కృపను
నీవు నామదిలోననే నిలిచి యుండి
మకుట తేజంబు కననిమ్ము సుకరముగను. ॥ 42 ॥
ప్రతిపదార్థము.
హీమగిరిసుతే ! = ఓ పార్వతీ, 
మాణిక్యత్వమ్ = మానికములగుటను, 
గతైః = పొందిన, 
గగనమణిభిః = ఆదిత్యుల చేత, 
సాంద్రఘటితమ్ = దగ్గర దగ్గరగా కూర్చడిన, 
హైమమ్ = బంగారముతో నిర్మింపబడిన, 
తే = నీ యొక్క, 
కిరీటమ్ = కిరీటమును, 
యః = ఎవఁడు,
కీర్తయతి = కీర్తించునో, 
సః = అతఁడు, 
నీడేయ = కుదుళ్ల యందు బిగింపఁబడిన నానా రత్నములయొక్క, 
ఛాయా = కాంతి, 
ఛురణ = ప్రసారము చేత, 
శబలమ్ = చిత్ర వర్ణము గల, 
చంద్ర శకలమ్ = చంద్రరేఖను, 
శౌనాసీరమ్ = ఇంద్ర సంబంధమైన, 
ధనుః ఇతి = ధనుస్సు అని, 
ధిషణామ్ = (అతని) ఊహను, 
కిం న నిబధ్నాతి = ఎందుకు చేయఁడు? చేయునని భావము.  
భావము. 
అమ్మా! హిమగిరితనయా! పన్నెండుగురు సూర్యులు మణులుగా ఏర్పడి పొదగబడిన నీ బంగారు కిరీటమును వర్ణించు కవి ఆ కాంతులు నానా విధములుగా వ్యాపించి యున్న నీ శిరము మీది చంద్రకళను చూచి “ఇది ఏమి ఇంద్రధనుస్సా” అని సందేహపడగలఁడు.

43 వ శ్లోకము.  
ధునోతు ధ్వాంతం నస్తులిత దలితేందీవర వనం
ఘన స్నిగ్ధ శ్లక్ష్ణం చికుర నికురుంబం తవ శివే |
యదీయం సౌరభ్యం సహజముపలబ్ధుం సుమనసో
వసంత్యస్మిన్ మన్యే బలమథన వాటీ విటపినామ్ || 
పదచ్ఛేదము.
ధునోతు - ధ్వాంతమ్ - నః -  తులిత - దలిత - ఇందీవర - వనమ్ -
ఘన - స్నిగ్ధ  -  శ్లక్ష్ణమ్ -  చికుర - నికురుంబమ్ -  తవ - శివే -
యదీయమ్ - సౌరభ్యమ్ -  సహజమ్ - ఉపలబ్ధుమ్ -  సుమనసః -
వసంతి -  అస్మిన్ -  మన్యే -  బల -  మథన - వాటీ - విటపినామ్.
అన్వయక్రమము.
శివే, తులిత, దలిత, ఇందీవర వనమ్, ఘన, స్నిగ్ధ, శ్లక్ష్ణమ్, తవ, చికుర నికురుంబమ్, నః, ధ్వాంతమ్, ధునోతు, యదీయమ్, సహజమ్, సౌరభ్యమ్, ఉపలబ్ధుమ్, అస్మిన్‌, బల మథన, వాటీ, విటపినామ్, సుమనసః, వసంతి, మన్యే.
పద్యము.
తే.గీ.  నల్లకలువలన్, మేఘమునల్లఁ బోలు
శ్లక్ష్ణమగు స్నిగ్ధమగు కురుల్ చక్కగాను
మాదు మదులలోఁ జీకటిన్ మాపు, కల్ప
కుసుమములు వాసనలు పొందఁ గోరి నీదు
కురుల వసియించె నని దల్తు గుణనిధాన! ॥ 43 ॥
ప్రతిపదార్థము.
శివే = ఓ పార్వతీ,
తులిత = పోల్చఁబడిన,
దలిత = వికసించిన, 
ఇందీవర వనమ్ = నల్లకలువల తోట,
ఘన = (నల్లని) మేఘము వంటి,
స్నిగ్ధ = మెఱుగైన, చిక్కనైన,
శ్లక్ష్ణమ్ = మృదులమైన,
తవ = నీ యొక్క, 
చికుర నికురుంబమ్ = కేశకలాపము,
నః = మా యొక్క, 
ధ్వాంతమ్ = అజ్ఞానాంధకారమును, 
ధునోతు = తొలగించుగాక, 
యదీయమ్ = ఏ కేశపాశ సంబంధమైనది కలదో దాని, 
సహజమ్ = స్వభావసిద్దమైన, 
సౌరభ్యమ్ = పరిమళమును, 
ఉపలబ్ధుమ్ = పొందుటకు, 
అస్మిన్‌ = ఈ కేశపాశమందు, 
బలమథన = ఇంద్రుని, 
వాటీ = నందనోద్యానమందలి, 
విటపినామ్ = కల్పవృక్షముల యొక్క, 
సుమనసః = పుష్పములు, 
వసంతి = నివసించుచున్నవని, 
మన్యే = తలంచెదను.   
భావము. 
ఓ హిమగిరి తనయా! తల్లీ! పార్వతీ దేవీ! అప్పుడే వికసిస్తున్న నల్ల కలువల సమూహంతో సాటియైనది, మేఘమువలె దట్టమై, నునుపై, మెత్తనిది అయిన నీ శిరోజముల సమూహము- మాలోని అజ్ఞానము అనే చీకటిని పోగొట్టుగాక ! నీ కేశములకు సహజంగా ఉన్న సుగంధాన్ని తాము పొందడానికేమో, బలుఁడనే రాక్షసుని చంపిన ఇంద్రుని యొక్క నందనోద్యానములో ఉన్న కల్పవృక్షపు  పుష్పములు, నీకేశ సమూహాన్నిచేరి, అక్కడ ఉంటున్నాయని నేను భావిస్తున్నాను.

44 వ శ్లోకము.  
తనోతు క్షేమం నస్తవ వదనసౌందర్యలహరీ
పరీవాహస్రోత స్సరణిరివ సీమంత సరణిః|
వహంతీ సిందూరం ప్రబలకబరీభార తిమిర
ద్విషాం బృందైర్బందీకృతమివ నవీనార్క కిరణమ్ || 
పదచ్ఛేదము.
తనోతు - క్షేమమ్ - నః - తవ - వదన - సౌందర్య - లహరీ -
పరీవాహ - స్రోతః - సరణిః -  ఇవ - సీమంత - సరణిః -
వహంతీ - సిందూరమ్ -  ప్రబల - కబరీ - భార - తిమిర -
ద్విషామ్-  బృందైః -  బందీ - కృతమ్ -  ఇవ - నవీన -  అర్క  - కిరణమ్.
అన్వయక్రమము.
తవ, వదన, సౌందర్య, లహరీ, పరీవాహ, స్రోతః, సరణిః ఇవ, సీమంత సరణిః, ప్రబల, కబరీభార, తిమిర, ద్విషామ్, బృందైః, బందీకృతమ్, నవీన + అర్క, కిరణమ్, సిందూరమ్, వహంతీ, నః, క్షేమమ్, తనోతు.
పద్యము.
సీ.  శర్వాణి! నీముఖ సౌందర్య లహరీపరీవాహ దివ్యగిరిస్రవంబుఁ
బోలుచు గొప్పగా పొంగుచు సాగెడి మార్గమా యననొప్పె మహిత గతిని,
యందలి సిందూరమందగించుచు బాల సూర్య కిరణకాంతి సొబగులీని,
కటికచీకటిపోలు కచపాళి రిపులచేఁ జెరబట్టఁ బడినట్లు చిక్కి యచట
తే.గీ.  మెఱయుచుండె నీ సీమంత మరసి చూడ
నట్టి సిందూర సీమంత మమ్మ! మాకు
క్షేమమును గల్గఁ జేయుత, చిత్తమలర
నీదు సాన్నిధ్యమున నన్ను నిలువనిమ్మ. ॥ 44 ॥
ప్రతిపదార్థము.
(హే భగవతి! = ఓ తల్లీ!)
తవ = నీ యొక్క, 
వదన = ముఖము యొక్క,
సౌందర్య = సౌందర్యపు, 
లహరీ = అలల వెల్లువల యొక్క, 
పరీవాహ = కాలువయందు, 
స్రోతః = నీటి ప్రవాహము వలె పారుచున్న, 
సరణిః ఇవ = దారివలె కనబడు, 
సీమంత సరణిః = నీ పాపట దారి, 
ప్రబల = బలమయిన, 
కబరీభార = (నీ) కురుల మొత్తమనెడి, 
తిమిర = కటిక చీకటి రూపముగా గలిగి యున్న, 
ద్విషామ్ = శత్రువుల, 
బృందైః = సమూహముచేత, 
బందీకృతమ్ = బందీగా చేయబడిన, 
నవీన + అర్క = ప్రాతః కాలపు సూర్యుని, 
కిరణమ్ = కిరణమువలెనున్న, 
సిందూరమ్ = సిందూరపురేఖను, 
వహంతీ = వహించుచున్నదై, 
నః = మాకు, 
క్షేమమ్ = క్షేమమును, 
తనోతు = విస్తరింప చేయుగాక !   
భావము. 
తల్లీ! జగజ్జననీ! నీ ముఖ సౌందర్య ప్రకాశ ప్రవాహము ప్రవహించుటకు వీలుగా నుండు కాలువవలె – నీ పాపట దారి కనబడుచున్నది. ఆ పాపటకు ఇరువైపులా దట్టముగానున్న నీ కురుల సమూహములు – కటికచీకటి రూపముతో ఇరువైపులా బృందములుగా తీరి యున్న శత్రువులవలె కనబడుచుండగా – వాటి మధ్య బందీగా చిక్కబడిన ప్రాతః కాలసూర్య కిరణము వలె – నీ పాపట యందలి సిందూరపు రేఖ భాసించుచున్నది. అట్టి సిందూర రేఖతో నుండు నీ పాపట మాకు నిత్యము శుభ సౌభాగ్య యోగ క్షేమములను విస్తరింపచేయుగాక.

45 వ శ్లోకము.  
అరాలైః స్వాభావ్యాదలికలభ సశ్రీభి రలకైః
పరీతం తే వక్త్రం పరిహసతి పంకేరుహ రుచిమ్ |
దరస్మేరే యస్మిన్ దశన రుచి కింజల్క రుచిరే
సుగంధౌ మాద్యంతిస్మరదహన చక్షుర్మధులిహః || 
పదచ్ఛేదము.
అరాలైః -  స్వాభావ్యాత్ -  అలి - కలభ - సశ్రీభిః - అలకైః -
పరీతమ్ -  తే - వక్త్రమ్ - పరిహసతి - పంకేరుహ - రుచిమ్ -
దర - స్మేరే - యస్మిన్ - దశన - రుచి - కింజల్క  - రుచిరే -
సుగంధౌ - మాద్యంతి - స్మర - దహన - చక్షుః -  మధులిహః.
అన్వయక్రమము.
స్వాభావ్యాత్‌, అరాలైః, అలి కలభ, స శ్రీభిః, అలకైః, పరీతమ్, తే, వక్త్రమ్, పంకేరుహ రుచిమ్, పరిహసతి, దరస్మేరే, దశన, రుచి, కింజల్క, రుచిరే, సుగంధౌ, యస్మిన్‌, స్మరదహన, చక్షుః, మధులిహః, మాద్యంతి.
పద్యము.
సీ.  స్వాభావికంబుగా వంకరలౌ తుమ్మెదలవంటి ముంగురుల్ దర్పమెలర
నందగించెడి నీదు సుందరమగు మోము పంకేరుహంబులన్ బరిహసించుఁ,
జిఱునవ్వుతోఁ గూడు శ్రీకరమగు దంతకాంతి, కేసరకాంతి, ఘనతరమగు
సౌగంధ్య పూర్ణమై చక్కనౌ ముఖమొప్పు నా ముఖపద్మమ్ము నలరియున్న
తే.గీ. సుందరత్వమున్ గనుచుండి సోమశేఖ
రుని కనులను ద్విరేఫముల్ కనును మత్తు
నట్టి నీ పాదములను నే పట్టి విడువ,
నీదు కృపఁ జూపు మమ్మ! నన్నాదుకొనుమ. ॥  45 ॥
ప్రతిపదార్థము. 
(హే భగవతి! = ఓ తల్లీ!)
స్వాభావ్యాత్‌ = సహజముగనే, 
అరాలైః = వంకరగానుండు, 
అలి కలభ = గండు తుమ్మెదల,
స శ్రీభిః = కాంతి వంటి కాంతులు గల, 
అలకైః = ముంగురుల చేత, 
పరీతమ్ = అందముగా తీర్చి దిద్దబడిన, 
తే = నీ యొక్క, 
వక్త్రమ్ = వదనము, 
పంకేరుహ రుచిమ్ = కమలముల యొక్కసొబగును, 
పరిహసతి = తనతో సాటి రాదని ఎగతాళి చేయుచున్నది. 
(కారణమేమనగా), 
దరస్మేరే = వికాస స్వభావముగల లేనగవు గలదై, 
దశన = దంతముల యొక్క, 
రుచి = కాంతులనెడి, 
కింజల్క = కేసరములచే, 
రుచిరే = సుందరమైన, 
సుగంధౌ = సహజ సుగంధముతో ఒప్పారుచునుండు, 
యస్మిన్‌ = ఏ ముఖ పద్మము నందు, 
స్మరదహన = మన్మథుని (తన మూడవ కంటితో) దహించిన శివుని యొక్క, 
చక్షుః మధులిహః = కన్నులు అను తుమ్మెదలు, 
మాద్యంతి = మత్తు గొని ఆనందించుచున్నవో అందువలననే సుమా. 
భావము. 
ఓ జగన్మాతా! సహజంగానే వంకరలు తిరిగినవై, కొదమ తుమ్మెదల కాంతివంటి నల్లని కాంతిని కల్గియున్న ముంగురులతో కూడిన నీముఖము, పద్మ కాంతిని, అందాన్ని పరిహసిస్తూన్నది.  చిరునవ్వుతో వికసించుచున్నది, దంతముల కాంతులు అనే కేసరములచే సుందరమైనది, సువాసన కలది అయిన నీ ముఖపద్మమునందు, మన్మథుని దహించిన శివుని చూపులు అనే తుమ్మెదలు కూడా మోహపడుతున్నాయి.
జైహింద్.