అభినందన మందారం
ఓం శ్రీమాత్రే నమః.
'శ్రీ అనంత భాస్కర శతక' కర్త శ్రీ నారుమంచి వేంకట అనంత కృష్ణ గారు
వ్బాగ్విదాంవర బిరుదాంచితులు. ఇంతకు ముందు వీరు
గురుసహస్ర నామావళిని168 శ్లోకములతోరచించారు.
"లలిత పదముల మది లలిత గొలుతు" అనే మకుటముతో లలితా శతకము,
"వరసిద్ధి వినాయక భక్త పాలకా" అనే మకుటముతో వినాయకునిపై శతకము రచించారు.
ఆంధ్రామృతము అనే నా బ్లాగులో ప్రచురింపఁబడి వీరి శతకాలు ఎందరెందరో
పాఠకుల మన్ననలందుకొన్నాయి.
వీరు పద్య రచనలో చేయితిరిగిన కవి. ఐహికమగు రచనా వ్యాసంగముతో
ఆముష్మికమును సాధించుటకు వీరు చేయుచున్న ప్రయత్నము వీరి రచనలో
గోచరింస్తుంది.
ఐహిక వాంఛలకు దూరులై, పరమాత్మతో తాదాత్మ్యము పొందుతూ పరమాత్మకు వీరు
చేసుకొనుచున్న విన్నపము ప్రత్యక్షర సత్యమై శతక బద్ధమైయున్నది.
శ్లో: ఆరోగ్యం భాస్కరాదిచ్ఛేత్
అని ఆర్యోక్తి. ఇందలి మర్మము గ్రహించిన మన అనంత కృష్ణ గారు కూడా తనకు గల
అపార కవితా ప్రాభవముతో అనంతభాస్కరశతకరచన చేసిరి. ఇది సామాన్యమయిన
రచనగా భావిస్తే మనం పొరబడినట్టే.
చిత్ర, బంధ, నామ గోపనాది చిత్ర కవితా వైచిత్రీ ప్రాభవముతో శతకము మొత్తము
వ్రాయుటకు సమర్ధులైయుండి కూడా, భక్తి భావనాభరితమగు సీసములను వ్రాస్తూ
అటనట కొన్ని పద్యములలో తనకు గల చిత్ర కవితా వైచిత్రిని ప్రదర్శించి,
భక్తుల మనములతోఁ బాటు చిత్ర కవితానురక్తులగు మహా కవులు హృదయములను
సహితము చూఱగొన్నారు.
శ్రీ కారముతో నారంభించిన యీ సీసములకు సీసాంతమునుండు తేట గీతిలో
చివరి రెండు పాదములందు
భాస్కరాదిత్య ! ఘృణి సంజ్ఞ! భక్త వరద! దివసకర! వరేణ్య ! సవితా! తిగ్మ కిరణ!
అనే మకుటమునుంచిరి.
ఈ మకుటమునందు ఆ సూర్య భగవానుని నామములు తప్ప మరొకటి లేకుండుట
గమనించినచో ఈ కవికి గల భక్తి తత్పరత వ్యక్తము కాక మానదు.
ఈ లోకము యొక్క సృష్టి, స్థితి, లయలకు మూలము బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు కాగా
ఆ మూడు మూర్తులూ ప్రత్యక్ష సాక్షి సూర్యభగవానుఁడే .
ఉదయం బ్రహ్మ స్వరూపం, మధ్యాహ్నంచ మహేశ్వరమ్
సాయంకాలే సదావిష్ణుం, త్రిమూర్తించ దివాకరః.
ఈ ఆర్యోక్తిని మనకవి 2వ పద్యములో సోదాహరణముగా వివరించి,
2వ పస్యంలో "మూడు మూర్తులు నీవైన మూల పురుష
నిజమునెఱుగంగ మనసార నిన్ను కొలుతు"
అని తెలిపి యున్నారు.
103 వ పద్యమున సూర్యోపాసన ఎంతసుకరమో వివరించారు.
కవిగా తాను తరించుటయే కాక,
8వ, 13వ, 49 వ పద్యములలో
తన పుత్ర పౌత్రాది భక్త బాంధవాది జనుల
నామములను పద్యములలో ఉంచి పరమాత్మతో సీసములలో ముచ్చటించుట చూచినచో
ఎట్టివారికైనా ఆశ్చర్యం కలుగక మానదు.
“సరోజ శర్మ - అనంత - వనజ - కౌశిక్ - శృతి కీర్తి - అపర్ణ
- రఘురామ మూర్తి - కుమారి పాండు గీత భరద్వాజ కశ్యప - హాసిని - సహస్ర కౌముది '
మున్నుగా కల వారి బంధువుల నామములు మనము గమనించ వచ్చును.
వీరు రచించిన సాధారణమగు సీసములలో అసాధారణ మగు
ఘృణి, సూర్య, ఆదిత్య, ఓం, అనే పదముల సమాహారము "మూల శక్తి" గా కనపడును.
6 వ పద్యము దీనికి నిదర్శనము.
ఈ కవి గర్భ కవిత వ్రాయుటలో నిపుణుఁడు దానికి ఈ క్రింది 14వ పద్యమే తార్కాణము.
గమనింపుడు.
14 సీ: మాయను జిక్కుట మది నూహ జేయగా రా//నిది తగులగ రాదనంచు
వారింప శక్యమే, వాక్కున పల్కుటె టులనిశ్చల గతులన్ గలుగుటెటుల,
దాయక తెల్పుము తదుపాసనా సుసా ధ్య//మ్మది చెందగ నెమ్మది గొన
నీయనుకంపయౌ నిర్గుణ సత్యము తృటినందెడి విధమున్ తెలియనెంతు
గీ: ఆటుపోటులఁ జిక్కక నటునిటులన్ బారక గమనమాగని బాట జూపు,
భాస్కరాదిత్య ఘృణి సంజ్ఞ భక్త వరద - దివసకర వరేణ్య సవితా తిగ్మ కిరణ.
ఈ 14వ పద్యమును పఠించునెడ మనకు సీసముగనే తోచును కాని ఇందు ఒక
కంద పద్యము గర్భితమై యున్నదను విషయము చెప్పిన గాని తెలియదు.
ఇందలి కంద పద్యమును గమనింపుడు.
క. మది నూహ జేయగారా
నిది వాక్కున పల్కుటెటుల, నిశ్చల గతులన్
తదుపాసనా సుసాధ్య
మ్మది నిర్గుణ సత్యము తృటినందెడి విధమున్.
పద్య రచనమున పారమంటిన కవులు చేయు ప్రక్రియ చిత్ర కవిత యని
సాహితీ వేత్తల భావన.
ఈ చిత్రకవితలలో అక్షర నియమమును బట్టి
(1)ఏకాక్షర చిత్రము - (2) ద్వ్యక్షర చిత్రము -
(3)త్యక్షర చిత్రము - (4) చతురక్షర చిత్రము అను
నాల్గు ప్రక్రియలను మన కవి 85 వ పద్యంలో నాలుగు పాదములలో
చూపియున్నారు.
85. సీ: నేను నే నను నేను నేనని నే ననన్ - నేనన్న నేనన్న నిన్ను నిన్నె(1)
నా మనమన్న నీ నామ మ్మని నమ్ము - నీ నామ మన నమ్ము నెమ్మి నిమ్ము (2)
సుమ సమానము మానసమనుమానము మాని - నా మనో సుమమాసన మనుమన్న(3)
నీ యెద దాగని నీ దయ నేగొందు నాయందు నాదగు నయ్యది నాదె యందు (4)
గీ: వేనవేల మాటలవేల వేడికొందు - నెల్ల వేళల నుండు నా యుల్లమందు
భాస్కరాదిత్య! ఘృణి సంజ్ఞ భక్త వరద! - దివసకర వరేణ్య సవితా తిగ్మ కిరణ.
చిత్ర బంధ రచనా దక్షులయిన మన కవి
100 వ పద్యముగా రథ బంధ సీసమును రచించెను. అందు కవి నామము గ్రంథ నామము
నిక్షేపించుటను వీరికి గల చిత్ర కవితా పాటవమునకు ఉదాహరణగా చెప్ప వచ్చును.
ఆ రథ బంధం గమనింపుడు.
సీ: అవునంతియే అనే 100 వపద్యంలో మధ్య నిలువు
" అనంత కృష్ణ భాస్కర శతకము"
అని భావగోపనచిత్ర రథబంధనిర్మాణము మిక్కిలి క్లిష్టతరమైనదయ్యు
అనంతుని చేతిలో అలవోకగా ఒదిగిపోయెను.
అనంతుఁడగు ఆ దినకరుఁడే అనంతుఁడయ్యెనో యేమో గాని, అనంత కృష్ణ కవి మాటల
మేళనమునందు కూడా దినకర మంత్రమునే ప్రభవింప జేసినారు.
ఈ కవి కవితా భేషజము ఈ క్రింది పద్యము వలన తెల్లమగుచున్నది.
దారిద్య్ర దుఃఖాలు దరిదాపులకు రావు అని భరోసా యిచ్చుచూ,
అందులకు ఏమి చేయ వలెనో
ఈ క్రింది 79వ పద్యమున వివరించిరి.
శ్రీమదనంత కృష్ణ కవి ఈ అనంత భాస్కర శతకమును ఆ సూర్య భగవానునకే
త్రికరణ శుద్ధిగా అంకితము చేయుచూ 102 వ పద్యమున ఆ పరమాత్మను గైకొమ్మని
అంకితమిచ్చి కృతకృత్యులైరని చెప్ప వచ్చును.
ఇంత చక్కని శతకమును లోకమునకందించిన శ్రీఅనంత కృష్ణ కవివరుని
మనసారా అభినందించుచున్నాను.
సప్త వింశత్యధిక ద్వివిధ కంద - గీత గర్భ చంపకమాల:-
ఘృణి ధరుఁడై సదా! కవికి శ్రీకరముల్ రవి కాంచ చేయగా
మునివరుఁడై మదిన్ నిరతమున్ వరభాస్కరునే గణించె. భా
వన వరుఁడే కదా! అమృత భాస్కర తేజుఁడనంత కృష్ణ సా
ధన గురుఁడై భువిన్ హరి సుధార్త రమాన్వితుడై సుఖించుతన్.
మంగళప్రదుఁడగు ఆ సూర్య భగవానుఁడే ఈ కవికి నిత్యము
సర్వమంగళ కారకుఁడగును గాక.
స్వస్తి.
No comments:
Post a Comment