జైశ్రీరామ్.
91 వ శ్లోకము.
పదన్యాసక్రీడా పరిచయమివారబ్ధుమనసః
స్ఖలంతస్తే ఖేలం భవన కలహంసా న జహతి |
అతస్తేషాం శిక్షాం సుభగమణిమంజీరరణిత
చ్ఛలాదాచక్షాణం చరణకమలం చారుచరితే ||
పదచ్ఛేదము.
పదన్యాసక్రీడా - పరిచయమ్ - ఇవ - ఆరబ్ధు - మనసః -
స్ఖలంతః - తే - ఖేలమ్ - భవన - కలహంసాః - న జహతి -
అతః - తేషామ్ - శిక్షామ్ - సుభగ - మణి - మంజీర - రణిత
ఛలాత్ - ఆచక్షాణమ్ - చరణ - కమలమ్ - చారు - చరితే.
అన్వయక్రమము.
చారుచరితే, తే, భవన, కలహంసాః, పద, న్యాస, క్రీడా, పరిచయమ్, ఆరబ్ధుమనసః ఇవ, స్ఖలంతః , ఖేలమ్, న జహతి, అతః, చరణ కమలమ్, సుభగ, మణిమంజీర, రణిత,ఛలాత్, తేషామ్, శిక్షామ్, ఆచక్షాణమ్.
పద్యము.
శా. నిత్యంబున్ గలహంసలెన్నొ కనుచున్ నీదౌ పదన్యాసమున్
బ్రత్యేకంబుగ నేర్చుచుండె జననీ! వర్ధిల్లగా నెంచి, యౌ
న్నత్యంబుం గొలుపంగ శిక్షణము గ్రన్నన్ నేర్పునట్లొప్పుచున్
నిత్యంబీవు ధరించునందెల రవల్ స్నిగ్ధంబుగా నొప్పెడిన్.॥ 91 ॥
ప్రతిపదార్థము.
చారుచరితే = సుందరమైన నడతగల ఓ దేవీ,
తే = నీ యొక్క,
భవన = ఇంటియందలి,
కలహంసాః = పెంపుడు హంసల యొక్క,
పద = పాదములను,
న్యాస = ఉంచుట యందలి,
క్రీడా = ఆటయందు,
పరిచయమ్ = శిక్షణవలె,
ఆరబ్ధుమనస ఇవ = పొందగోరు మనస్సు గలవైనవాటివలె,
స్ఖలంతః = జాఱుచున్న నడక గలవై,
ఖేలమ్ = విలాస గమనమును,
న జహతి = వదలుట లేదు,
అతః = ఇందువలన,
చరణ కమలమ్ = నీ పాదపద్మము,
సుభగ = సుందరమైన,
మణిమంజీర = మణులతో గూడిన అందియ యొక్క,
రణిత = సవ్వడుల యొక్క ,
ఛలాత్ = నెపము వలన,
తేషామ్ = ఆ కలహంసలకు,
శిక్షామ్ = నడకకు సంబంధించిన శిక్షణగ అగుటకు,
ఆచక్షాణమ్ = నేర్పుచున్నది వలె వున్నది.
భావము.
ఓ చారుచరితా ! నీ అద్భుత గమన విన్యాసాన్ని గాంచి నడక నేర్చుకోదలచినవై, నీ పెంపుడు హంసలు తొట్రుపాటు చెందుతూ నీ గమన విలాసాన్ని వీడకున్నవి. అందువల్ల నీ పాద కమలం కెంపులు మొదలగు రత్నాలు తాపిన అందియ మ్రోతలనే నెపంతో, ఆరాజహంసకు ఖేలన శిక్షను గరుపుతున్నట్లుగా ఉన్నది.
92 వ శ్లోకము.
గతాస్తే మంచత్వం ద్రుహిణ హరి రుద్రేశ్వర భృతః
శివస్స్వచ్ఛచ్ఛాయా ఘటిత కపటప్రచ్ఛదపటః |
త్వదీయానాం భాసాం ప్రతిఫలన రాగారుణతయా
శరీరీ శృంగారో రస ఇవ దృశాం దోగ్ధి కుతుకమ్ ||
పదచ్ఛేదము.
గతాః - తే - మంచత్వమ్ - ద్రుహిణ - హరి - రుద్ర - ఈశ్వర - భృతః -
శివః - స్వచ్ఛ - ఛాయా - ఘటిత - కపట - ప్రచ్ఛద - పటః -
త్వదీయానామ్ - భాసామ్ - ప్రతి ఫలన - రాగ - అరుణతయా -
శరీరీ - శృంగారః - రసః - ఇవ - దృశామ్ - దోగ్ధి - కుతుకమ్ .
అన్వయక్రమము.
ద్రుహిణ, హరి, రుద్ర, ఈశ్వర, భృతః, తే, మంచత్వమ్, గతాః, శివః, స్వచ్ఛ ఛాయా, కపట, ఘటిత, ప్రచ్చద పటః, త్వదీయానామ్, భాసామ్ , ప్రతిఫలన, రాగ , అరుణతయా, శరీరీ, శృంగారః రస ఇవ, దృశామ్, కుతుకమ్, దోగ్ధి.
పద్యము.
చం. శివుఁడును, బ్రహ్మ విష్ణువులు, శ్రీకరి! రుద్రుఁడు మంచమై భరిం
ప, వర సదా శివత్వమది వర్ధిలు కాంతినెపంబు నొప్పి నీ
బ్రవర నిచోళమై తనరి, భాసిలు నీదగు రాగ శోణమౌ
చు, వలపు బోళ మమ్మ! తమ శోభిలు కన్నులవిందుఁ జేసెనే. ॥ 92 ॥
(బోళము=రసము)
ప్రతిపదార్థము.
(హే జగజ్జననీ = ఓ లోకమాతా,)
ద్రుహిణ = బ్రహ్మ,
హరి = విష్ణువు,
రుద్ర = రుద్రుడు,
ఈశ్వర = ఈశ్వరుడు,
భృతః = భరించువారుగా ఈ నలుగురు,
తే = నీ యొక్క,
మంచత్వమ్ = మంచము యొక్క రూపముగా అగుటను,
గతాః = పొందినవారైరి,
శివః = సదాశివ తత్త్వము,
స్వచ్ఛచ్ఛాయా = నిర్మలమైన కాంతి అను,
కపట = నెపము గల,
ఘటిత = కూడబడిన,
ప్రచ్చద పటః= కప్పుకొను దుప్పటియై,
త్వదీయానామ్ = నీకు సంబంధించిన వారైన,
భాసామ్ = కాంతుల యొక్క,
ప్రతిఫలన = ప్రతిఫలించుటచేతనైన,
రాగ= ఏ ఎఱ్ఱదనము సంక్రమించినదో దానినే,
అరుణతయా = రక్తవర్ణమగుటచే,
శరీరీ = భౌతికమైన రూపు పొందిన,
శృంగారః రస ఇవ = శృంగార రసము వలె,
దృశామ్ = నీ యొక్క వీక్షణములకు,
కుతుకమ్ = ఆనందమును,
దోగ్ధి = పిదుకుచున్నాడు, అనగా - కలిగించుచున్నాడు.
భావము.
హే భగవతీ ! బ్రహ్మ, విష్ణువు, రుద్రుడు, ఈశ్వరుడు అనే అధికార పురుషులు నలుగురు మహేశ్వరతత్త్వంలో అంతర్గతులైనవారు కాబట్టి నువ్వు అధిష్ఠించే మంచముయొక్క నాలుగు కోడులై వున్నారు. సదాశివుడు విమలకాంతి ఘటనారూపం వ్యాజాన దుప్పటమగుతూ , నీ మేనికాంతులు ప్రతిఫలించటంచేత ఎర్రబారిమూర్తిమంతమైన శృంగారరసంవలె నయనాలకు ఆనందాన్ని ఇస్తున్నాడు. ( తెల్లని కాంతిగల శివుడు దేవి మేని ఎర్రని కాంతులు ప్రతిఫలించగా ఎర్రనివాడై ఆమెను సేవిస్తున్నాడని భావము.)
93 వ శ్లోకము.
అరాళా కేశేషు ప్రకృత సరళా మందహసితే
శిరీషాభా చిత్తే దృషదుపలశోభా కుచతటే |
భృశం తన్వీ మధ్యే పృథురురసిజారోహ విషయే
జగత్త్రాతుం శంభోర్జయతి కరుణా కాచిదరుణా ||
పదచ్ఛేదము.
అరాళా - కేశేషు - ప్రకృత - సరళా- మంద - హసితే -
శిరీష - ఆభా - చిత్తే - దృషత్ - ఉపల - శోభా - కుచ - తటే -
భృశమ్ - తన్వీ - మధ్యే - పృథుః - ఉరసి - జ - ఆరోహ - విషయే -
జగత్ - త్రాతుమ్ - శంభోః - జయతి - కరుణా - కాచిత్ - అరుణా.
అన్వయక్రమము.
కేశేషు, అరాళా, మంద హసితే, ప్రకృతి, సరళా, చిత్తే, శిరీష + ఆభా, కుచ తటే, దృషత్ + ఉపల శోభా, మధ్యే, భృశమ్, తన్వీ, ఉరసి జ, ఆరోహ, పృథుః, శంభోః , కాచిత్, అరుణా, కరుణా, జగత్, త్రాతుమ్, జయతి.
పద్యము.
చం. జనని యరాళ కేశములు, చక్కని నవ్వు, శిరీషపేశలం
బన మది, రొమ్ముభాగము మహాఘనమౌ యుపల ప్రశోభయున్,
స్తన జఘనంబులన్ ఘనము, సన్నగఁ జిక్కిన కౌను, కాచెడున్
ఘనమగు శ్రీసదాశివుని కమ్మని యా యరుణప్రభల్ క్షితిన్. ॥ 93 ॥
ప్రతిపదార్థము.
(హే జగజ్జననీ )
కేశేషు = కురులందు,
అరాళా = వంకరయైనదియు,
మంద హసితే = చిఱునవ్వునందు,
ప్రకృతి = స్వభావము చేతనే,
సరళా = సుకుమారమైనదియు,
చిత్తే = మనస్సునందు,
శిరీష + ఆభా = దిరిసెన పూవు వంటి మెత్తని స్వభావము గలదియు,
కుచ తటే = వక్షః స్థలము,
దృషత్ + ఉపలశోభా = సన్నికల్లు పొత్రమువంటి బలుపుగలదియు,
మధ్యే = నడుమునందు,
భృశమ్ = మిక్కిలి,
తన్వీ = కృశించినదియు,
ఉరసి జ = స్తనముల విషయమునందును,
ఆరోహ = పిరుదుల విషయమునందును,
పృథుః = మిగుల గొప్పదియు,
శంభోః = సదాశివునికి సంబంధమైనదగు,
కాచిత్ = వర్ణనాతీతమైన,
అరుణా = “అరుణ” అనుశక్తి,
కరుణా = దయాస్వరూపము గలది,
జగత్ = ప్రపంచమును,
త్రాతుమ్ = రక్షించుటకు,
జయతి = సర్వోత్కర్షతో వర్తించుచున్నది.
భావము.
తల్లీ ! శంభుడి అనిర్వాచ్యమైన అరాళా అనేశక్తి నీ కురులలో ప్రకాశిస్తోంది. చిరునవ్వులో నీదు సహజమైన సరళా అనేశక్తి ప్రకాశిస్తూంది. చిత్తంలో దిరిసెన పువ్వులాగా మిక్కిలి మెత్తనైన శక్తి ప్రకాశిస్తోంది. స్తనప్రదేశంలో సన్నికల్లు శోభగల శక్తి ప్రకాశిస్తోంది. పిరుదులలో స్థూలశక్తి ప్రకాశిస్తూంది. దేవి జగత్తును రక్షించటానికి అరుణ అనే శక్తీ, కరుణ అనే శక్తీ భాసిల్లుతున్నాయి.
94 వ శ్లోకము.
కళంకః కస్తూరీ రజనికర బింబం జలమయం
కళాభిః కర్పూరైర్మరకతకరండం నిబిడితమ్ |
అతస్త్వద్భోగేన ప్రతిదినమిదం రిక్తకుహరం
విధిర్భూయో భూయో నిబిడయతి నూనం తవ కృతే ॥
పదచ్ఛేదము.
కళంకః - కస్తూరీ - రజ నికర బింబమ్ - జల - మయమ్ -
కళాభిః - కర్పూరైః - మరకత - కరండమ్ - నిబిడితమ్ -
అతః - త్వత్ - భోగేన - ప్రతిదినమ్ - ఇదమ్ - రిక్త - కుహరమ్ -
విధిః - భూయః - భూయః - నిబిడయతి - నూనమ్ - తవ - కృతే.
అన్వయక్రమము.
ఇదమ్, కలంకః, కస్తూరీ, రజని కర బింబమ్, జలమయమ్, కళాభిః, కర్పూరైః, నిబిడితమ్, మరకత కరండమ్, అతః, ప్రతిదినమ్ , త్వత్ భోగేన, రిక్త కుహరమ్, విధిః, భూయః భూయః, తవకృతే, నిబిడయతి, నూనమ్.
పద్యము.
చం. చందురుఁడంచునెంచునది చంద్రుఁడు కాదు, మరక్త పేటియే,
యందలి మచ్చ నీదగు ప్రియంబగు కస్తురి, యెవ్వరెన్నుచున్
జందురుడందురందరది చక్కని నీ జలకంపుఁ దావగున్,
జందురునొప్పునాకళలు చల్లని కప్రపు మొట్టికల్ సతీ!
యందవి నీవు వాడ విధి యాత్రముతోడను నింపువెండియున్. ॥ 94 ॥
ప్రతిపదార్థము.
(హే జగజ్జననీ! = ఓ లోకమాతా!)
ఇదమ్ = ఈ కనబడు చంద్రమండలమునందు,
కలంకః = ఆకలిగిన చిహ్నము,
కస్తూరీ = అది కస్తూరి అగును,
రజని కర బింబమ్ = చంద్రబింబమనినచో,
జలమయమ్ = అది జలస్వరూపమైనది,
కళాభిః = కిరణములనే,
కర్పూరైః = పచ్చకర్పూరముతో,
నిబిడితమ్ = నిండింపఁ బడినది అగు,
మరకత కరండమ్ = గరుడ పచ్చలచే నిర్మింపబడిన భరణియగును,
అతః = ఈ కారణమున,
ప్రతిదినమ్ = దినదినమునందు,
త్వత్ భోగేన = నీవు వాటిని ఉపయోగించుట చేత,
రిక్త కుహరమ్ = ఖాళీ అయిన లోపలిభాగము కలది,
విధిః = బ్రహ్మ,
భూయః భూయః = మరల మరల,
తవకృతే = నీ కొఱకు,
నిబిడయతి = ఆయా వస్తువుల చేత నిండించుచున్నాడు.
నూనమ్ = ఇది నిశ్చయము,
భావము.
తల్లీ! జగజ్జననీ! ఆకాశములో కనబడు చంద్రమండలము – మరకత మణులచే చేయబడి, నువ్వు – కస్తూరి, కాటుక, పన్నీరు మొదలైన వస్తువులను ఉంచుకొను భరణియే! చంద్రునిలో మచ్చవలె నల్లగా కనబడునది కస్తూరి. ఆ చంద్రునిలోని జలతత్త్వము – నువ్వు జలకమాడుటకు ఉపయోగించు పన్నీరు. చంద్రుని కళలుగా భావించబడునవి – పచ్చకర్పూరపు ఖండములు. ఈ వస్తువులు ఆ భరణి నుండి నువ్వు ప్రతిదినము వాడుకొనుచుండుట వలన తరిగి పోవుటచే -నీ ఆజ్ఞను అనుసరించి నీ పాలనలో సృష్టిపనిచేయు బ్రహ్మ మరల ఆ వస్తువులను పూరించుచున్నాడు.
95 వ శ్లోకము.
పురారాతేరంతః పురమసి తతస్త్వచ్చరణయో
స్సపర్యామర్యాదా తరలకరణానామసులభా |
తథా హ్యేతే నీతాశ్శతమఖముఖాస్సిద్ధిమతులాం
తవ ద్వారోపాంతస్స్థితిభిరణిమాద్యాభిరమరాః ||
పదచ్ఛేదము.
పుర - ఆరాతేః - అంతః - పురమ్ - అసి - తతః - త్వత్ - చరణయోః -
సపర్యా - మర్యాదా - తరల - కరణా - నామ - సులభా -
తథాహి - ఏతే - నీతాః - శతమఖ - ముఖాః - సిద్ధిమ్ - అతులామ్ -
తవ - ద్వార - ఉపాంతః - స్థితిభిః - అణిమ - ఆద్యాభిః - అమరాః.
అన్వయక్రమము.
పుర + అరాతేః, అంతఃపురః, అసి, తతః, త్వత్ చరణయోః, సపర్యా మర్యాదా, తరళ కరణానామ్, అసులభా, తథాహి, అణిమాదిభిః, ఏతే, శత మఖముఖాః, అమరాః, తవ, ద్వార + ఉపాంతస్థితిభిః, అతులామ్, సిద్ధిమ్, నీతాః.
పద్యము.
ఉ. పట్టపురాణివాశివుని పార్వతి! నీ పద పూజనంబహో
యెట్టులఁ గల్గు నల్పులకు? నింద్రుఁడు మున్నగువారలున్ నిను
న్నట్టులె చూడ ద్వారముల కావలె యుండియు సిద్ధులొందిరో
గట్టుతనూజ! నే నెటుల గాంచగఁ జాలుదు నిన్ భజింపగన్? ॥ 95 ॥
ప్రతిపదార్థము.
(హే జగజ్జననీ)
పుర + అరాతేః = త్రిపుర హరుడైన శివుని యొక్క,
అంతఃపురః = అంతఃపురవాసినియగు పట్టమహిషివి,
అసి = అయియున్నావు,
తతః = ఆ కారణము వలన,
త్వత్ చరణయోః = నీ పాదముల యొక్క,
సపర్యా మర్యాదా = పూజచేయు భాగ్యము,
తరళ కరణానామ్ = చపల చిత్తులకు,
అసులభా = సులభమైనది కాదు,
తథాహి = అది యుక్తమే అగును (ఎందువలన అనగా),
అణిమాదిభిః = అణిమ మొదలగు అష్టసిద్ధుల చేతనొప్పు,
ఏతే = ఈ,
శత మఖముఖాః = ఇంద్రాదులైన,
అమరాః = దేవతలు,
తవ = నీ యొక్క,
ద్వార + ఉపాంతస్థితిభిః = అంతఃపుర ద్వార సమీపము నందుండినవారై,
అతులామ్ = సాటిలేని,
సిద్ధిమ్ = ఇష్టార్థ ఫలసిద్ధిని,
నీతాః = పొందిరి.
భావము.
అమ్మా! జగజ్జననీ! నీవు త్రిపురహరుడైన శివుని పట్టమహిషివి. అందువలన నీ పాద పద్మపూజ చేయగల భాగ్యము చపల చిత్తులైన వారికి లభించునది గాదు. అందువలననే ఈ ఇంద్రాది దేవతలందరూ, తాము కోరుకున్న అల్పమైన అణిమాది అష్టసిద్ధుల గూడి, వారితో పాటు నీ ద్వార సమీపమునందే కావలివారి వలె పడిగాపులు గాచుచున్నారు.
జైహింద్.
No comments:
Post a Comment