జైశ్రీరామ్.
81 వ శ్లోకము.
గురుత్వం విస్తారం క్షితిధరపతిః పార్వతి నిజా
న్నితంబాదాచ్ఛిద్య త్వయి హరణ రూపేణ నిదధే |
అతస్తే విస్తీర్ణో గురురయమశేషాం వసుమతీం
నితంబ ప్రాగ్భారస్స్థగయతి లఘుత్వం నయతి చ ||
పదచ్ఛేదము.
గురుత్వం - విస్తారమ్ - క్షితి - ధర - పతిః - పార్వతి - నిజాత్ -
నితంబాత్ - ఆచ్ఛిద్య - త్వయి - హరణ - రూపేణ - నిదధే -
అతః - తే - విస్తీర్ణః - గురుః అయమ్ - శేషామ్ - వసుమతీమ్ -
నితంబ - ప్రాక్ - భారః - స్థగయతి - లఘుత్వమ్ - నయతి - చ.
అన్వయక్రమము.
పార్వతీ, క్షితిధరపతిః, గురుత్వమ్, విస్తారమ్, నిజాత్, నితంబాత్, ఆచ్ఛిద్య, త్వయి, హరణ రూపేణ, నిదధే, అతః, తే, అయమ్, నితంబ, ప్రాగ్భారః, గురుః, విస్తీర్ణః, అశేషామ్, వసుమతీమ్, స్థగయతి, లఘుత్వమ్, నయతి చ.
పద్యము.
చం. తనదు గురుత్వమున్, విరివి, తండ్రి నితంబము నుండి తీసి నీ
కని యరణం బొసంగుటను గల్గిన నీదు నితంబ భారమీ
ఘన ధరాభారమున్ గెలిచెఁ గప్పి విశాలతనొప్పి హైమ! నీ
జనకుని కీర్తి పెంపుఁ గొనెఁ జక్కగ నీవు వెలుంగుచుండుటన్. ॥ 81 ॥
ప్రతిపదార్థము.
పార్వతీ = ఓ గిరిజా ,
క్షితిధరపతిః = పర్వతరాజగు నీ తండ్రి హిమవంతుడు,
గురుత్వమ్ = బరువును,
విస్తారమ్ = విశాలత్వమును,
నిజాత్ = తనకు చెందిన,
నితంబాత్ = కొండనడుమ నుండి,
ఆచ్ఛిద్య = వేరుచేసి తీసి,
త్వయి = నీయందు,
హరణ రూపేణ = కూతురునకు తండ్రీ యిచ్చు స్త్రీ ధనము రూపముగా,
నిదధే = సమర్పించెను,
అతః = ఇందువలననే,
తే = నీ యొక్క,
అయమ్ = కనబడుచున్న,
నితంబ = మొలవెనుకపట్టి యొక్క,
ప్రాగ్భారః = అతిశయము,
గురుః = గొప్పగా బరువు గలదియు,
విస్తీర్ణః = విశాలమైనదియునగుచు,
అశేషామ్ = సమస్తమైన,
వసుమతీమ్ = భూమిని,
స్థగయతి = కప్పుచున్నది,
లఘుత్వమ్ = చులకనను,
నయతి చ = పొందించుచున్నది కూడా.
భావము.
ఓ గిరిజా ! పర్వతరాజగు నీ తండ్రి హిమవంతుడు బరువును, విశాలత్వమును, తనకు చెందిన కొండనడుమ యందు గల చదునైన ప్రదేశము నుండి వేరుచేసి తీసి కూతురునకు తండ్రి యిచ్చు స్త్రీ ధనము రూపముగా సమర్పించెను, ఇందువలననే, నీ యొక్కకనబడుచున్న పిఱుదుల యొక్క అతిశయము, గొప్పగా బరువు గలదియు, విశాలమైనదగుచు, సమస్తమైన భూమిని, ఆచ్ఛాదించుచున్నది. అనగా, కప్పుచున్నది. చులకన చేయుచున్నది, అనగా - తన కంటె తక్కువ చేయుచున్నదికూడా.
82 వ శ్లోకము.
కరీంద్రాణాం శుండాన్ కనకకదళీ కాండపటలీ
ముభాభ్యామూరుభ్యాముభయమపి నిర్జిత్య భవతి |
సువృత్తాభ్యాం పత్యుః ప్రణతి కఠినాభ్యాం గిరిసుతే
విధిజ్ఞే జానుభ్యాం విబుధ కరికుంభద్వయమసి ||
పదచ్ఛేదము.
కరీంద్రాణామ్ - శుండాన్ - కనక - కదళీ - కాండ - పటలీమ్ -
ఉభాభ్యామ్ - ఊరుభ్యామ్ - ఉభయమ్ - అపి - నిర్జిత్య - భవతి -
సువృత్తాభ్యామ్ - పత్యుః - ప్రణతి - కఠినాభ్యామ్ - గిరి సుతే -
విధిజ్ఞే - జానుభ్యామ్ - విబుధ - కరి - కుంభ ద్వయమ్ - అసి.
అన్వయక్రమము.
విధిజ్ఞే, గిరిసుతే! భవతి, కరీంద్రాణామ్, శుండాన్, కనక, కదళీ,కాండ, పటలీమ్, ఉభాభ్యాం ఊరుభ్యామ్, ఉభయం అపి, నిర్జిత్య, సువృత్తాభ్యామ్, పత్యుః, ప్రణతి కఠినాభ్యామ్, జానుభ్యామ్, విబుధ కరి, కుంభద్వయమ్, నిర్జిత్య, అసి.
పద్యము.
మ. గిరిజా! సన్నుత! యో విధిజ్ఞ! జయసంకేతమ్మ! నీ యూరువుల్
కరి తొండమ్ముల, నవ్యదివ్య కదళీకాండమ్ములన్ గెల్చునే,
పరమేశానుని సత్ప్రదక్షిణవిధిన్ బ్రార్థించుటన్ జానువుల్
కరి కుంభమ్ముల మించియుండెఁ, గన సంకాశమ్మె లేదీశ్వరీ! ॥ 82 ॥
ప్రతిపదార్థము.
విధిజ్ఞే = శాస్త్రార్థమునెఱింగిన,
గిరిసుతే = ఓ పార్వతీ,
భవతి = నీవు,
కరీంద్రాణామ్ = ఏనుగుల యొక్క,
శుండాన్ = తొండములను,
కనక = బంగారు,
కదళీ = అరటి చెట్లయొక్క,
కాండ = స్తంభాల యొక్క,
పటలీమ్ = సమూహమును,
ఉభాభ్యాం ఊరుభ్యామ్ = నీ రెండు తొడలచే,
ఉభయం అపి = ఏనుగు తొండములు, అరటి స్తంభములు అను రెంటిని గూడ,
నిర్జిత్య = జయించి,
సువృత్తాభ్యామ్ = అందముగాను, వర్తులాకారములోను వుండి,
పత్యుః = భర్తయగు పరమేశ్వరునికి,
ప్రణతి కఠినాభ్యామ్ = చేయు నమస్కారముల చేత కఠినములైన,
జానుభ్యామ్ = మోకాళ్ళ చేత,
విబుధ కరి = ఐరావతము యొక్క,
కుంభద్వయమ్ = కుంభస్థలముల రెంటిని,
నిర్జిత్య = జయించినదానివిగా,
అసి = ఉంటివి.
భావము.
ఓ హిమగిరిపుత్రీ! వేదార్థవిధి నెఱిగి అనుష్ఠించే రాణీ, నీ ఊరువులు అందంలో గజరాజాల తొండములను ,బంగారు అరటిస్తంభాల సముదాయములను ధిక్కరిస్తున్నవి. నీ రెండు ఊరువులు ( తొడల) చేత జయించి , శోభనములై వర్తులములు కలిగినవీ భర్త ఐన పరమేశ్వరుడికి మ్రొక్కుటచేత గట్టిపడినవైన నీ జానువులు , ఐరావతం కుంభస్థలముల జంటలను కూడ జయించి ప్రకాశిస్తున్నాయి.( ఈ బ్రహ్మాండమే అమ్మ స్వరూపమైనప్పుడు సృష్టిలోని ఏ శరీరం ఆమె సౌందర్యంతో తులతూగ గలదు ? తులతూగలేదు అని భావము.)
83 వ శ్లోకము.
పరాజేతుం రుద్రం ద్విగుణశరగర్భౌ గిరిసుతే
నిషంగౌ జంఘే తే విషమవిశిఖో బాఢమకృత |
యదగ్రే దృశ్యంతే దశశరఫలాః పాదయుగలీ
నఖాగ్రచ్ఛద్మానస్సుర మకుట శాణైక నిశితాః ||
పదచ్ఛేదము.
పరాజేతుమ్ - రుద్రమ్ - ద్విగుణ - శర - గర్భౌ - గిరి - సుతే -
నిషంగౌ - జంఘే - తే- విషమ - విశిఖః - బాఢమ్ - అకృత -
యత్ - అగ్రే - దృశ్యంతే - దశ - శర - ఫలాః - పాద - యుగలీ -
నఖ - అగ్ర - ఛద్మానః - సుర - మకుట - శాణ - ఏక - నిశితాః.
అన్వయక్రమము.
గిరిసుతే, విషమ విశిఖః, రుద్రమ్, పరాజేతుమ్, తే, జంఘే, ద్విగుణ, శర, గర్భౌ, నిషంగౌ, అకృత, బాఢమ్,యత్ + అగ్రే, పాద యుగలీ, నఖ + అగ్ర, ఛద్మానః, సుర, మకుట, శాణ, ఏక నికషాః, దశ, శర, ఫలాః, దృశ్యంతే.
పద్యము.
చం. మదనుఁడు శంభునిన్ గెలువ మాతరొ! తా శరపంచకంబునే
పదిగనొనర్పనెంచి, తమ పాదపు వ్రేళ్ళను, బిక్కలన్ దగన్
మది శరపాళిగా, దొనగ, మన్ననఁ జేసె, నఖాళిముల్కులా
పదనుగఁజేయఁబడ్డ సురపాళి కిరీటపుఁ గెంపులే కనన్. ॥ 83 ॥
ప్రతిపదార్థము.
గిరిసుతే = ఓ గిరిపుత్రీ,
విషమ విశిఖః = విషమశరుఁడగు మన్మథుఁడు,
రుద్రమ్ = శివుని,
పరాజేతుమ్ = పరాజయము పాలు చేయుటకు,
తే = నీ యొక్క,
జంఘే = పిక్కలను,
ద్విగుణ = రెట్టింపుగా చేయబడిన,
శర = బాణములనే,
(సహజముగా తనకు వున్న ఐదు బాణములు రెండు రెట్లు అయినపుడు పదిబాణములు అగును) ,
గర్భౌ = లోపల నిక్షిప్తమైయుంచఁబడిన,
నిషంగౌ = అమ్ములపొదులుగా,
అకృత = చేసినాడు,
బాఢమ్ = (ఇది) నిజము,
యత్ + అగ్రే = ఏ పిక్కల తుదను,
పాదయుగలీ = పాదముల జంటయొక్క,
నఖ + అగ్ర = గోళ్ళ చివరల యొక్క,
ఛద్మానః = నెపము గలవైన,
సుర = దేవతల యొక్క,
మకుట = కిరీటములనెడు,
శాణ = సాన పెట్టెడు రాళ్ళ చేత,
ఏక నికషాః = పదును పెట్టబడినవై,
దశ = రెండింతలు,
శర = బాణముల యొక్క,
ఫలాః = ములుకులు,
దృశ్యంతే = కనబడుచున్నవి.
భావము.
ఓ హిమగిరిసుతా! మన్మథుఁడు రుద్రుణ్ణి ఓడించటానికి తన ఐదుబాణాలు చాలవని వాటిని పదిబాణాలు చేసుకోనెంచి , నీ పిక్కలను అమ్ముల పొదులుగాను, కాలివ్రేళ్ళను బాణాలుగాను , నఖాగ్రాలను బాణాల కొనలందు పదనుబెట్టి ఉంచిన ఉక్కుముక్కలుగాను గావించుకొన్నాడు .( నమస్కరిస్తూన్న దేవతల కిరీటాలలోని మణులనే ఒరపిడి రాళ్ళచే నఖాగ్రాలనే ములుకులు పదను పెట్టబడినవి).
84 వ శ్లోకము.
శ్రుతీనాం మూర్ధానో దధతి తవ యౌ శేఖరతయా
మమాప్యేతౌ మాతశ్శిరసి దయయా ధేహి చరణౌ |
యయోః పాద్యం పాథః పశుపతి జటాజూట తటినీ
యయోర్లాక్షాలక్ష్మీరరుణ హరిచూడామణి రుచిః ||
పదచ్ఛేదము.
శ్రుతీనామ్ - మూర్ధానః - దధతి - తవ - యౌ - శేఖరతయా -
మమ - అపి - ఏతౌ - మాతః - శిరసి - దయయా - ధేహి - చరణౌ -
యయోః - పాద్యమ్ - పాథః - పశుపతి - జటా - జూట - తటినీ -
యయోః - లాక్షా - లక్ష్మీః - అరుణ - హరి - చూడామణి - రుచిః.
అన్వయక్రమము.
మాతః, తవ, యౌ, చరణౌ, శ్రుతీనామ్, మూర్ధానః, శేఖరతయా, దధతి, యయోః, పాద్యమ్, పాథః, పశుపతి, జటాజూట, తటినీ, యయోః, లాక్షా లక్ష్మీః,అరుణ, హరి, చూడామణి, రుచిః. ఏతౌ, మమాఽపి , శిరసి, దయయా, ధేహి.
పద్యము.
శా. ఏ నీ పాదములన్ ధరించు శ్రుతులే ధ్యేయంబుతో నౌదల
న్నే నీ పాదజలంబు నెత్తిని హరుండే కల్గు నా గంగయో,
యే నీ పాదపు లత్తుకారుణము లక్ష్మీశాను రత్నాంశువో,
యా నీ పాదములుంచు నా శిరముపై నమ్మా! కృపన్, నిత్యమున్. ॥ 84 ॥
ప్రతిపదార్థము.
మాతః = ఓ తల్లీ ,
తవ = నీ యొక్క,
యౌ = ఏ,
చరణౌ = పాదములను,
శ్రుతీనామ్ = వేదముల యొక్క,
మూర్ధానః = శిరములైన వేదాంతములు, లేదా ఉపనిషత్తులు,
శేఖరతయా = శిరోభూషణములుగా,
దధతి = ధరించుచున్నవో,
యయోః = ఏ నీ చరణములకు,
పాద్యమ్ = పాదములను కడుగు,
పాథః = జలము,
పశుపతి = శివుని యొక్క,
జటాజూట = జడముడి యందలి,
తటినీ = గంగయో,
యయోః = ఏ చరణముల యొక్క,
లాక్షా లక్ష్మీః = లత్తుక శోభ కలదో అది,
అరుణ = ఎఱ్ఱని,
హరి = విష్ణువు యొక్క,
చూడామణి = శిరోభూషణము యొక్క,
రుచిః = కాంతియో.
ఏతౌ = అట్టి వీటిని,
మమాఽపి = నా యొక్కయు,
శిరసి = శిరస్పునందు,
దయయా = దయతో,
ధేహి = ఉంచుము,
భావము.
ఓ లోకమాతా ! ఏ నీ చరణాలకు శివుడి జటాజూటంలో వర్తించే గంగ పాదప్రక్షాళన జలం అవుతుందో , ఏ నీ చరణలత్తుక రసంపు కాంతికెంజాయలు శ్రీ మహావిష్ణువు మణిమయ కిరీటానికి వెలుగును ఆపాదిస్తున్నాయో , శ్రుతులశిరస్సులైన ఉపనిషత్తులు ఏ నీ పదాలను సిగపువ్వుగా ధరిస్తున్నవో, ఓ మాతా! కృపతో కూడిన చిత్తంగల దానవైన నీవు , ఆ నీ చరణాలను నాశిరస్సుమీద కూడా ఉంచు.
85 వ శ్లోకము.
నమో వాకం బ్రూమో నయన రమణీయాయ పదయో
స్తవాస్మై ద్వంద్వాయ స్ఫుట రుచి రసాలక్తకవతే |
అసూయత్యత్యంతం యదభిహననాయ స్పృహయతే
పశూనామీశానః ప్రమదవన కంకేళి తరవే ||
పదచ్ఛేదము.
నమః - వాకమ్ - బ్రూమః - నయన - రమణీయాయ - పదయోః -
తవ - అస్మై - ద్వంద్వాయ - స్ఫుట - రుచి - రస - అలక్తకవతే -
అసూయతి - అత్యంతమ్ - యత్ - అభిహననాయ - స్పృహయతే -
పశూనామ్ - ఈశానః - ప్రమద - వన - కంకేళి - తరవే.
అన్వయక్రమము.
పశూనాం ఈశానః, యత్ అభిహననాయ, స్పృహయతే, ప్రమద వన, కంకేళి తరవే, అత్యంతం అసూయతి, నయన, రమణీయాయ, స్ఫుట, రుచి, రస + అలక్తకవతే, పదయోః, అస్మై, ద్వంద్వాయ, నమోవాకమ్, బ్రూమః.
పద్యము.
మ. నయనానందకరంబుగా వెలుఁగు గణ్యంబైన పారాణితో.
జయ కంకేళికిఁ దాకుటెంచి హరుఁ డీర్ష్యన్ బొంది యా పాదముల్
ప్రియమొప్పన్ దగులంగఁ గోరుఁ దనకున్, శ్రీదేవి! నీ పాదముల్
జయదంబై కృపఁ జూడ నన్నుఁ గొలుతున్ జక్కంగ నే భక్తితోన్. ॥ 85 ॥
ప్రతిపదార్థము.
పశూనాం ఈశానః = పశుపతి అయిన శివుడు,
యత్ అభిహననాయ = ఏ నీ పాద యుగ్మ తాడనమును,
స్పృహయతే = కోరుచున్నాడో,
ప్రమదవన = ఉద్యానము నందలి,
కంకేళి తరవే = అశోక వృక్షము కొఱకు,
అత్యంతం అసూయతి = నీ సంచారముచే నీ పాదములు వాటికి తాకెనని వాటిపై మిక్కిలి అసూయపడుచున్నాడో,
నయన = కన్నులకు,
రమణీయాయ = ఇంపు గొలుపునదై,
స్ఫుట = స్పష్టముగా ప్రకాశించు,
రుచి = కాంతి గలదై,
రస + అలక్తకవతే = తడి లత్తుక కలిగిన,
పదయోః = అట్టి నీ పాదముల యొక్క,
అస్మై = ఈ కనబడు,
ద్వంద్వాయ = జంటకు,
నమోవాకమ్ = నమస్కార వచనమును,
బ్రూమః = వచించెదము,
భావము.
ఓ భగవతీ! లత్తుక రసంచే తడిసి కెంపుగొన్నదై , చూచువారి కనుదమ్ములకు మిగుల సొంపు నింపు గొలిపేదై చక్కగా వెలుగొందుతున్న నీ పాదద్వయానికి నమస్కరిస్తున్నాం. పశుపతి ఐన శివుడు ఏనీ పాదపద్మ తాడనాన్ని కోరుతూ , ఆతాడన భాగ్యానికి నోచుకునే అలరుల తోటలోని అశోకవృక్షాన్ని గాంచి దానిపై అసూయపడుతున్నాడో అట్టి నీ చరణారవిందాలకు నమస్కరిస్తున్నాను.
జైహింద్.
No comments:
Post a Comment