Saturday, June 21, 2025

భీమవరం బ్రహ్మమమ్మ గురుపూజ.

 ఓం శ్రీమాత్రే నమః.🙏🏻

శా. శ్రీమన్మంగళ మానవుండుగ నిలన్ శ్రీకార రూపంబునన్

బ్రేమన్ దల్లి కనంగఁ బుట్టి, గతమున్ జిత్రంబుగా మాయచే

నేమాత్రంబును గానలేక మదిలో నెన్నెన్నియో యోచనల్

భూమిన్ బుట్టిన హేతువున్ గనుటకై పుట్టున్, విచిత్రంబిదే.

భావము 

ప్రాణి శుభప్రదమయిన మానవునిగా శ్రీకారరూపములో  తల్లి ప్రేమతో ప్రసవించగా 

పుట్టి, భూమిపై తనను క్రమ్ముకొనిన మాయ కారణముగా తన గతము ఏమాత్రము

 చూడలేకపోవుటచే, భూమిపై తన జన్మకు కారణము తెలుసుకొనుప్రయత్నములో 

ఎన్నెన్నో ఆలోచనలుచేయును. ఇదే విచిత్రము.


ఉ. బంధు జనంబుతో పెరుగు బంధములన్ విడిపోవ నేరమిన్

సంధివశంబునన్ మనసు సత్యము గానగలేక, మాయలో

బంధనమొంది, లంపటులు వాయక హెచ్చగుచుండ, దుఃఖముల్

పొందుచు తల్లడిల్ల, గురు పూజ్యపదంబులనాశ్రయించునే. 

భావము. 

పుట్టుకతో సంభవించిన బంధువులతో పెరుగుచున్న బంధనములను వీడిపోవుట 

తెలియఁజాలక, ఈ పూర్వాపరముల సంధి కారణముగా సత్యమును కనఁజాలక 

మాయకారణముగా ఐహిక బంధమునమునకు లోనగుచు దుఃఖించుచు 

పరిష్కారమునకై పూజ్యమయిన గురుపాదాశ్రయము పొంద యత్నించును.


ఉ. బ్రహ్మమె యమ్మ రూపమున బాధితులన్ పరిరక్షసేయగా,

బ్రహ్మవివేక సంపదను భక్తలకందఁగఁ జేయుచుండి, స

ద్బ్రహ్మ నిజస్వరూపముగ తానె కనంబడు లోకమాతయౌ

బ్రహ్మమె యమ్మ, భీమవర పట్టణమందున కల్గెనిద్ధరన్.

భావము.

బాధితులను రక్షించుట కొఱకు ఆ బ్రహ్మస్వరూపమే బ్రహ్మమమ్మ 

రూపముతోబ్రహ్మజ్ఞానముయొక్క వివేకము అనెడి సంపను భక్తితో తనకడకు 

వచ్చినవారికి అందించుచుండి, సత్యమైన బ్రహ్మస్వరూపమగు లోకమాత అయిన 

బ్రహ్మమే మన అమ్మ, ఆమె ఈ భూమిపై భీమవరపట్టణములో ఉన్నది.


ఉ.  బాధలఁబాపు బ్రహ్మమని వచ్చెడి పీడిత మానవాళికిన్

సాధన చేయు మార్గమును చక్కని కమ్మని పల్కు లొల్కుచున్

మోదముతోడ మాయతెర పూర్తగ వీడగఁ జేసి శాంతితో

నీదఁగఁ జేయు జీవితము నిమ్ముగనల్లురి బ్రహ్మమమ్మయే.

భావము.

అల్లూరి వంశస్తురాలగు తల్లి, ఐహికమైన ఈతిబాధలను పోఁగొట్టు బ్రహ్మమే అని 

భావించుచు వచ్చెడి మానవులకుచక్కని కమ్మని మాటలతోనే మాయను వీడు 

సాధన మార్గమును చూపించుచు, మాయ అనెడి తెరను పూర్తిగా పోవునట్లుగా చేసి,

జీవితమును శాంతముగా సాగునట్లుగ చేయును. ఈ అల్లూరి వంశ 

బ్రహ్మ మమ్మయేకదా.


ఉ.  నీటనె యుండు తామరకు నీర మొకింతయు నంటనట్లుగా

సాటియెలేని యమ్మకు నసత్యపు బంధములంటఁ బోవు, తా

చేటును గొల్పు లంపటులు శీఘ్రమె బాయువిధంబు దెల్పుచున్

నోటను బల్కు మాటలనె నొవ్వును బాపును భక్తపాళికిన్.

భావము.

నీటిలో ఉండే తామరాకునకు నీరు అంటని విధముగా సాటిలేని అమ్మకు  

అస్త్యమైన ఐహికబంధములేవియు అంటఁబోవు.ఈ తల్లి చెడునే కలిగించెడి

ఈ ఐహిక లంపటములను వెన్వెంటనే వీడఁ జేసుకొను పద్ధతిని కేవలము 

మాటలతోనే తెలుపుచు, బాధితుల బాధలన్నిటిని భక్తులకు పోగొట్టు బ్రహ్మము.


ఉ.  ఐహికమందె బ్రహ్మమును హాయిగ చేర్చెడి మార్గదర్శియై,

మోహవిదూరతన్ గొలిపి, పూర్తిగ ముక్తికిని గొల్పు శక్తియై,

స్నేహముతోడ భక్తులను నిత్యము గాచెడి బ్రహ్మమమ్మకున్,

మోహవిదూరయైన గురుమూర్తికి భక్తిగనంజలించెదన్.

భావము.

ఈ శరీరముతో ఈలోకములో ఉండగనే బ్రహ్మస్వరూపమును చేర్చెడిమార్గదర్శిగ

నయి, మోహమునకు దూరమగునట్లుగా ఆశ్రయించినవారిని చేసి,ముక్తిని పూర్తిగా 

కలిగించు గొప్ప శక్తిఅయియుండి, భక్తులను నిత్యము స్నేహభావముతో చూచుచు 

కాపాడెడి, మోహమంటని గురుమూర్తి అయిన బ్రహ్మమమ్మకు భక్తితో నమస్కరిస్తాను.

No comments: