Thursday, May 1, 2025

సౌందర్య లహరి 86 - 90 పద్యాలు. రచన శ్రీ చింతా రామకృష్ణారావు గారు, సంగీతం గానం శ్రీమతి వల్లూరి సరస్వతి

జైశ్రీరామ్.
86 వ శ్లోకము.  
మృషా కృత్వా గోత్రస్ఖలనమథ వైలక్ష్యనమితం
లలాటే భర్తారం చరణకమలే తాడయతి తే |
చిరాదంతశ్శల్యం దహనకృత మున్మూలితవతా
తులాకోటిక్వాణైః కిలికిలిత మీశాన రిపుణా || 
పదచ్ఛేదము.
మృషా - కృత్వా  - గోత్ర - స్ఖలనమ్ - అథ - వైలక్ష్యనమితమ్ -
లలాటే - భర్తారమ్ -  చరణ - కమలే - తాడయతి - తే -
చిరాత్ -  అంతః -  శల్యమ్ -  దహన - కృతమ్ -  ఉన్మూలితవతా - 
తులాకోటి - క్వాణైః - కిలికిలితమ్ -  ఈశాన - రిపుణా.
అన్వయక్రమము.
మృషా, గోత్ర స్ఖలనమ్, కృత్వా, అథ, వైలక్ష్య, నమితమ్, భర్తారమ్, తే, చరణ కమలే, లలాటే, తాడయతి, ఈశాన రిపుణా, చిరాత్‌, దహనకృతమ్, అంతశ్శల్యమ్, ఉన్మూలితవతా, తులాకోటి, క్వాణైః, కిలికిలితమ్.
పద్యము. 
చం.  పొరపడి నీ సపత్నినధిపుం డల పిల్చియు తెల్లఁబోయి, నీ
చరణము మ్రొక్కఁ, దన్నితివి శంభుని ఫాలముపై, మనంబులో
స్మరుఁడు దహింపఁబడ్డ యవమానపుఁ గంటకుఁడై హసించిన
ట్లరయగ నూపురధ్వని మహాద్భుత కిల్కిలశబ్దమొప్పెనే,॥ 86 ॥
ప్రతిపదార్థము.
(జగజ్జననీ! = లోకమాతా!)
మృషా = వృథాగా,
గోత్ర స్ఖలనమ్ = భార్యను సవతి పేరుతో పిలుచుట, 
కృత్వా = చేసి, 
అథ = ఆ తర్వాత, 
వైలక్ష్య = వెల్లపాటుచే, 
నమితమ్ = పాద ప్రణామము చేసిన, 
భర్తారమ్ = పతి అగుశివుని, 
తే = నీ యొక్క, 
చరణ కమలే = పాదపద్మముతో, 
లలాటే = లలాట ప్రదేశమునందు, అనగా - ఫాల భాగము నందు, 
తాడయతి = తన్నినదానివి కాగా, 
ఈశాన రిపుణా = శివుని శత్రువగు మన్మథుని చేత, 
చిరాత్‌ = చాలా కాలము నుండి (బాధించు చున్న) 
దహనకృతమ్ = (శివుని మూడవకంటి) చిచ్చుచేత, కాల్చబడినదై చేయబడిన, 
అంతశ్శల్యమ్ = హృదయమునందున్న వైరమును, (బాధ)
ఉన్మూలితవతా =మాపుకొనిన వానికి, (తీరినవాడయిన మదనునికి),
తులాకోటి = నీ కాలి అందెల యొక్క, 
క్వాణైః = మ్రోతల చేత, 
కిలికిలితమ్ = కిలకిలా రావానుకరణముతో విజయ సూచక మగుచున్నది.  
భావము. 
తల్లీ! పొరపాటుగా నీదగ్గర సవతి పేరు జెప్పి తరువాత ఏమీ చేయటానికి తోచక వెలవెలబాటుచే లొంగిన భర్తను, నీ చరణ కమలంతో నుదుట తాడనం జరుపగా గాంచి శివుడికి శత్రువైన మన్మథుఁడు (ఇలాగైనా తనపగ తీరేట్లు శాస్తి జరిగిందని) నీ కాలి అందెల మ్రోతలచేత కిలకిలారావాన్ని గావించారు.

87 వ శ్లోకము.  
హిమానీ హంతవ్యం హిమగిరినివాసైక చతురౌ
నిశాయాం నిద్రాణం నిశి చరమభాగే చ విశదౌ |
వరం లక్ష్మీపాత్రం శ్రియ మతిసృజంతౌ సమయినాం
సరోజం త్వత్పాదౌ జనని జయతశ్చిత్రమిహ కిమ్  ||
పదచ్ఛేదము.
హిమానీ - హంతవ్యమ్ -  హిమ - గిరి - నివాస -  ఏక చతురౌ -
నిశాయామ్ -  నిద్రాణమ్ -  నిశి - చరమ - భాగే -  చ -  విశదౌ -
వరమ్ -  లక్ష్మీ - పాత్రమ్ -  శ్రియమ్ -  అతి - సృజంతౌ - సమయినామ్ -
సరోజమ్ -  త్వత్ - పాదౌ - జనని - జయతః -  చిత్రమ్ -  ఇహ - కిమ్ .
అన్వయక్రమము.
జనని,  హిమగిరి, నివాస, ఏకచతురౌ, నిశి, చరమ భాగేచ, విశదౌ, సమయినామ్, శ్రియమ్, అతి సృజంతౌ, త్వత్‌ పాదౌ,  హిమానీ, హంతవ్యమ్, నిశాయామ్, నిద్రాణమ్, వరమ్, లక్ష్మీపాత్రమ్, సరోజమ్, జయతః. ఇహ, కిం చిత్రమ్.
పద్యము.
ఉ.  నీ పదముల్ హిమాద్రిపయి నేర్పున నిల్చును, శుద్ధమై, పవల్ 
మాపటి యంతమందునను, మాయవు, భక్తులభాగ్యమౌచు నా
మాపటి వేళఁ గ్రుంకుచును, మంచున మాసెడి శ్రీకిఁ పీఠమై,
ప్రాపుగనున్న పద్మమును వాసిగ గెల్చుట చిత్రమా? సతీ! ॥ 87 ॥
ప్రతిపదార్థము.
జనని = తల్లీ,  
హిమగిరి =మంచుకొండ యందు, 
నివాస = నివసించుటలో, 
ఏకచతురౌ = నైపుణ్యము గలవియు, 
నిశి = రాత్రియందును, 
చరమ భాగేచ = రాత్రి చివరి సమయములందు గూడ, 
విశదౌ = ప్రకాశ వికాసము గలవియు, 
సమయినామ్ = సమయాచారపరులైన భక్తులకు, 
శ్రియమ్ = సంపదను, 
అతిసృజంతౌ = మిక్కుటముగా కలుఁగఁ జేయునవియును అయిన, 
త్వత్‌ పాదౌ = నీ పాదములు,  
హిమానీ = మంచుచే, 
హంతవ్యమ్ = నశింపచేయ తగినవియు, 
నిశాయామ్ = రాత్రియందు, 
నిద్రాణమ్ = నిద్రించునదియు, 
వరమ్ = ఇష్టమైన, 
లక్ష్మీపాత్రమ్ = లక్ష్మీదేవి అధిష్ఠించుటకు పీఠమైన, 
సరోజమ్ = పద్మమును, 
జయతః = జయించుచున్నవి. 
ఇహ = ఈ విషయమునందు, 
కిం చిత్రమ్ = ఏమి ఆశ్చర్యమున్నది? 
భావము. 
ఓ జననీ! మంచుకొండలలో సైతం కుంచించుకు పోకుండా ఉండగలిగేవీ రాత్రీ పగలు వికసిస్తూ నీ భక్తులకు అనూన సంపదలను కలిగించేవీ ఐన నీ పాద కమలాలతో , మంచుచేత నశింపజేయదగినదీ లక్ష్మీదేవికి ఆలవాలమై రాత్రివేళలో ముడుచుకొని పోయేదీ ఐన సామాన్య కమలం ఏవిధంగానూ సరితూగదని చెప్పడంలో ఆశ్చర్యం ఏమున్నది ? 

88 వ శ్లోకము.  
పదం తే కీర్తీనాం ప్రపదమపదం దేవి విపదాం
కథం నీతం సద్భిః కఠిన కమఠీ కర్పర తులామ్ |
కథం వా పాణిభ్యాముపయమనకాలే పురభిదా
యదాదాయ న్యస్తం దృషది దయమానేన మనసా  || 
పదచ్ఛేదము.
పదమ్ -  తే - కీర్తీనామ్ -  ప్రపదమ్ -  అపదమ్ -  దేవి - విపదామ్ -
కథమ్ -  నీతమ్ -  సద్భిః - కఠిన - కమఠీ - కర్పర - తులామ్ -
కథమ్ -  వా - పాణిభ్యామ్ -  ఉపయమన - కాలే - పురభిదా - 
యత్ -  ఆదాయ - న్యస్తమ్ -  దృషది -  దయమానేన - మనసా .
అన్వయక్రమము.
దేవి, కీర్తీనామ్, పదమ్, విపదామ్, అపదమ్, తే, ప్రపదమ్, సద్భిః, కఠిన, కమఠీ, కర్పర, తులామ్, కథమ్, నీతమ్, ఉపయమనకాలే, పురభిదా, పాణిభ్యామ్, యత్‌, దయామానేన, మనసా, ఆదాయ, కథం వా, దృషది, న్యస్తమ్.
పద్యము.
శా.  ఆమ్మా! కీర్తికి దావలంబగుచు, ఘోరాఘంబులన్, వ్యాధులన్,
నెమ్మిన్ బాపు సుకోమలంబయినవౌ నీ పాద పైభాగమున్,
సమ్మాన్యుల్,కమఠీకరోటి యనగన్ సామ్యంబె? శ్రీకంఠుఁ డో
యమ్మా! పెండ్లికి సన్నికల్లుపయినె ట్లానించె నీ పాదముల్. ॥ 88 ॥
ప్రతిపదార్థము.
దేవి = ఓ పార్వతీదేవీ,  

కీర్తీనామ్ = యశస్సులకు, 
పదమ్ = ఉనికిపట్టును, 
విపదామ్ = ఆపదలకు, 
అపదమ్ = కానిచోటును, (అయిన) ,
తే = నీ యొక్క, 
ప్రపదమ్ = పాదము చివరి భాగము, 
సద్భిః = సత్కవులచేత ,
కఠిన = బిరుసయిన, 
కమఠీ = ఆడుతాబేలు యొక్క, 
కర్పర = వీపుపై డిప్పతో, 
తులామ్ = పోలికను, 
కథమ్ = ఏ విధముగా, 
నీతమ్ = పొందఁబడినది, 
ఉపయమనకాలే = వివాహ సమయమందు, 
పురభిదా = త్రిపురహరుడైన శివుని, 
పాణిభ్యామ్ = హస్తముల చేత, 
యత్‌ = ఏ నీ పాదము, 
దయామానేన = దయగల, 
మనసా = మనస్సు చేత, 
ఆదాయ = పట్టుకోబడి, 
కథం వా = ఏ విధముగా, 
దృషది = సన్నికల్లుపైన, 
న్యస్తమ్ = ఉంచ బడినవి. 
భావము. 
ఓ దేవీ! కీర్తికినెలవై సంకటములను పారదోలు కుసుమసుకుమారమగు నీపాదమును మహాకవులు క్రూరముగా తాబేటిబొచ్చెతో నెట్లుపోల్చిరో తెలియదు. వివాహకాలమందు శంకరుడు తాను దయగలవాడయ్యుండి రెండుచేతులతోబట్టి యెట్లుసన్నెకంటి (నూఱుడుఱాయి) ని నొక్కించెనో తెలియదు.

89 వ శ్లోకము.  
నఖైర్నాకస్త్రీణాం కరకమలసంకోచశశిభి
స్తరూణాం దివ్యానాం హసత ఇవ తే చండి చరణౌ |
ఫలాని స్వస్థేభ్యః కిసలయ కరాగ్రేణ దదతాం
దరిద్రేభ్యో భద్రాం శ్రియమనిశమహ్నాయ దదతౌ  ||
పదచ్ఛేదము.
నఖైః -  నాక - స్త్రీణామ్ -  కర - కమల - సంకోచ - శశిభిః -
తరూణామ్ -  దివ్యానామ్ -  హసత - ఇవ - తే - చండి - చరణౌ -
ఫలాని - స్వస్థేభ్యః  -  కిసలయ - కర -  అగ్రేణ - దదతామ్ -
దరిద్రేభ్యః -   భద్రామ్ -  శ్రియమ్ -  అనిశమ్ -  అహ్నాయ - దదతౌ .
అన్వయక్రమము.
చండి, దరిద్రేభ్యః, భద్రామ్, శ్రియమ్, అనిశమ్, అహ్నాయ, దదతౌ, తే, చరణౌ, నాక స్త్రీణామ్, కర, కమల, సజ్కోచ, శశిభిః, నఖైః, స్వఃస్థేభ్యః, ఫలాని, కిసలయ, కర, అగ్రేణ, దదతామ్, దివ్యానామ్, తరూణామ్, హసత ఇవ.
పద్యము.
ఉ.  పేదకు పుష్కలంబుగ భువిన్ సిరులిచ్చెడి నీదుపాదముల్
బాధను దేవమానినుల పాణ్యుదజంబుల మోడ్పుఁ గొల్పుటన్
గ్లేదువులౌ నఖాళిఁ బరికింపగ దైవతపాళి కోరికల్
లేదనకిచ్చు కల్పకపు లే జివురాకుల గేలి చేసెడిన్. ॥ 89 ॥
ప్రతిపదార్థము.
చండి = ఓ పార్వతీ, 
దరిద్రేభ్యః = బీదల కొఱకు, 
భద్రామ్ = పుష్కలమైన, 
శ్రియమ్ = లక్ష్మిని, 
అనిశమ్ = ఎల్లపుడు, 
అహ్నాయ = శీఘ్రముగా, 
దదతౌ = ఇచ్చుచున్న, 
తే = నీ యొక్క, 
చరణౌ =  పాదములు, 
నాక స్త్రీణామ్ = దేవ వనితల యొక్క, 
కర = హస్తములనెడి, 
కమల = తామర పూవులను, 
సంకోచ = ముకుళింపఁ జేయుట యందు, 
శశిభిః = చంద్రులైన (దేవి పాదదర్శన మైనతోడనే దేవాంగనలు అంజలి ఘటియింతురు), 
నఖైః = గోళ్ల చేత, 
స్వఃస్థేభ్యః = స్వర్గ మందున్న (సర్వసంపత్సమృద్ధిగల) దేవతల కొఱకు, 
ఫలాని = కోరిన వస్తువులను, 
కిసలయ = చిగురుటాకులవంటి, 
కర = హస్తముల యొక్క, 
అగ్రేణ = కొనలచేత, 
దదతామ్ = ఇచ్చుచున్న, 
దివ్యానామ్ = స్వర్గమందున్న, 
తరూణామ్ = కల్పవృక్షములకు, 
హసత ఇవ = నవ్వుచున్నవో అనువిధముగ ఉన్నవి.
భావము. 
చండీ నామంతో శోభిల్లే తల్లీ ! నీ పాదాలు, సకలసంపదలతో తులతూగుతున్న దేవతలకు మాత్రమే కోరికలు తీర్చే కల్పవృక్షాన్ని తలదన్నుతూ , దీనజనులకు మంగళకరమైన అధిక సంపదలను ఒసగుతున్నాయి. నీ గోళ్ళు దేవతాస్త్రీల కరపద్మాలను ముకుళింపజేసే చంద్రుడిలా శోభిల్లుతున్నాయి.

90 వ శ్లోకము.  
దానే దీనేభ్యశ్శ్రియమనిశమాశాసుసదృశీ
మమందం సౌందర్య ప్రకర మకరందం వికిరతి |
తవాస్మిన్ మందారస్తబకసుభగే యాతు చరణే
నిమజ్జన్ మజ్జీవః కరణ చరణైష్షట్ చరణతామ్  ||
పదచ్ఛేదము.
దదానే - దీనేభ్యః -  శ్రియమ్ -  అనిశమ్ -  ఆశాసు - సదృశీమ్ -
అమందమ్ -  సౌందర్య - ప్రకర - మకరందమ్ -  వికిరతి -
తవ -  అస్మిన్ - మందార - స్తబక - సుభగే - యాతు - చరణే -
నిమజ్జన్ - మత్ -  జీవః-  కరణ - చరణైః -  షట్ - చరణతామ్.
అన్వయక్రమము.
దీనేభ్యః, శ్రియమ్, అనిశమ్, ఆశాను సదృశీమ్, దదానే, అమందమ్, సౌందర్య, ప్రకర , మకరందమ్, వికిరతి, మందార, స్తబకసుభగే, అస్మిన్‌, తవ, చరణే, కరణ చరణైః, మత్‌ జీవః, నిమజ్జన్‌, షట్చరణతామ్, యాతు.
పద్యము.
మ.  వన మందార సుపుష్పగుచ్ఛములు నీ పాదద్వయంబెన్న, భా
వనఁ జేయంగ మరందముల్ చిలుకుచున్ భాగ్యాళినిచ్చున్గదా,
నిను భావించెడి నాదు జీవన సుకాండి క్షోభలే పాయుతన్
వినుతిన్ నీపదపద్మసన్మధువులే ప్రీతిన్ సదా క్రోలుటన్. ॥ 90 ॥ (సుకాండి=తుమ్మెద)
ప్రతిపదార్థము.
(జగజ్జననీ! = ఓ లోకమాతా! )
దీనేభ్యః = దరిద్రుల కొఱకు, 
శ్రియమ్ = సిరిసంపదలను, 
అనిశమ్ = ఎల్లప్పుడు, 
ఆశాను సదృశీమ్ = కోర్కెలకు తగినట్లుగా, 
దదానే = ఇచ్చుచున్నదియు, 
అమందమ్ = అధికమైన, 
సౌందర్య = అందము యొక్క, 
ప్రకర = సమూహము అను, 
మకరందమ్ = తేనెను, 
వికిరతి = వెదజల్లునదియు, 
మందార = మందారము అను, 
స్తబకసుభగే = కల్పవృక్షము యొక్క పూలగుత్తు వలె,  శోభాయమాన మైనదియు అగు, 
అస్మిన్‌ = ఈ (కనబడు,) 
తవ = నీ యొక్క, 
చరణే = పాదమునందు, 
కరణ చరణైః = అరు ఇంద్రియములచే, 
మత్‌ జీవః = నేను అను జీవుడు, 
నిమజ్జన్‌ = మునుగుచున్నవాడై, 
షట్చరణతామ్ = భ్రమర భావమును, 
యాతు = పొందుగాక ! 
భావము.
తల్లీ! భగవతీ! జగన్మాతా! దీనుల కెల్లరకును, వాంఛానురూపమైన (వారి వారి కోర్కెలననుసరించి) సంపదను నిరంతరం ప్రసాదించేదియును, మిక్కిలి సౌందర్యము, లావణ్య సమూహము అనుపూ దేనియను (మకరందమును) వెదజల్లుచున్నదియు, కల్పవృక్ష రూపమైన నీ పాద పద్మముల యందు.మనస్సు + పంచేంద్రియములు అనెడి ఆరు పాదముల భ్రమరమునై నీ పాదకమలములందలి మకరందమును గ్రోలుదును గాక. 
జైహింద్.

No comments: