Saturday, June 15, 2013

శివాలాపము. 21 నుండి 30 రచన:- శ్రీ బులుసు వేంకటేశ్వర్లు.

జైశ్రీరామ్.
శివాలాపము.  21 నుండి 30 
రచన:- శ్రీ బులుసు వేంకటేశ్వర్లు.
మ:- అభిమానైక ధనమ్ము ముఖ్యమని గ్రంథానేకముల్ పల్కు. తం
డ్రి! భయోద్విగ్నము గాగ వర్తిలేడు దారిద్ర్య ప్రభా భూతమున్
అభవా! త్వత్ కర పద్మ సంగతి చలద్వ్యాపార నాట్యాంత సం
ప్రభవద్భీప్రద ఢక్కికా ధ్వనుల పాఱం ద్రోలవయ్యా! శివా! 21.

శా:- సద్భావంబున పాదు కట్టిన మహేశా! స్వచ్ఛ చాంద్రీక భా
స్వద్భూమీ ధర కన్యకా లలిత హాస వ్యక్త రాగార్ద్ర దీ
వ్యద్భావాంతర మూర్తియౌ నిను మదీయ ప్రాణ మూలమ్ముఁగా
మద్భాగ్యోప చయమ్మునందలచితిన్ మన్నింప రావే శివా! 22.

శా:- వేళాకోళము కాదు నిక్కమిది. నీవే వచ్చి మద్దుఃఖముల్
లీలం ద్రోపవయేని, దుష్ట విష వల్లీ బద్ధ సమ్మోహ దు
శ్శీలాభ్యస్త విముగ్ధ భావనలు వాసించున్ మదిన్, నాడు ని
న్నేలెక్కింపని యట్టి మొండిని, శిఖండిన్, నేను కానో? శివా! 23.

శా:- నీవుం దాండవమాడునప్పుడు భవానీ మాత తత్తాండవ
శ్రీ వైదగ్ధ్యముఁ జూపునంట రజతాద్రిన్ గాఢ రాగ ప్రసూ
భావైక్యంబది యెట్టిదో ప్రమథ రూపంబందివీక్షింతు త్వ
త్సేవా భాగ్య ఫలమ్ము నాకదియె, అందింపగ రావే శివా!24.

మ:- గిరులున్ నిర్ఝరులున్,  వియత్తలము సంగీతాది విద్యల్ సురా
సురులున్, కీటక ముఖ్య జీవ గణముల్, సూర్యేందు తారల్, జగ
త్పరమంబైన భవ చ్ఛతాంశమునుఁ దాల్పన్ వెల్గు లోకమ్మునన్
వర సంభావిత పార్వతీ హృదయ భావ వ్యక్త రూపా! శివా! 25.

శా:- వాదాతీతము త్వన్మహాత్మ్యమని సంభావించియున్ నైకవి
వ్యాదంభంబున నిన్నుఁ గూర్చి యురు గ్రంథానేకముల్ పల్కనే
వా?దంతావళ లూతముల్ నిలిచె మోక్షానంద సామ్రాజ్యమం
దేదీ వాటికి విద్య? భక్తి గతి కాదే! తెల్పుమయ్యా! శివా! 26.

మ:- వనముల్ గ్రుమ్మరి బిల్వ పత్రములు సంపాదింపగా లేను. మం
త్ర నిబద్ధార్చన సేయ లేను. మృదు నానా పుష్పముల్ కాన్కగా
గొని తేలేను. విశుద్ధ గాంగ జలముల్ కూర్పఁగ లేనింత నీ
వినుతాంఘ్రిద్వయముం దలంతుఁ బరమీవే! భక్త కల్పా! శివా! 27.

మ:- కపటోపాయ విధాన వంచన కళా కర్మిష్ఠులున్, మేకవ
న్నె పులుల్ నిండిన ధూర్త లోకమున తండ్రీ! స్వచ్ఛ సౌహార్దముల్
కపురంబుంబలె కాలిపోయినవి త్వత్ కంజాత పాదాగ్ర ల
గ్న పునీతంబగు బుద్ధి యొక్కటియె నన్ రక్షించునయ్యా! శివా! 28.

శా:- హుంకారంబులు క్షుద్ర మన్మధ ప్రభా భావోదగ్ర రేఖా ధను
ష్ఠంకారంబులకున్ నిరంతర మనస్సంఛన్న బోధేతర
క్రేంకారంబులకున్ బురాకృత తరంగీ భూత పాపౌఘ దు
ర్ఘాంకారంబులకున్ త్వదీయ పద కంజాతాగ్ర కాంతుల్,  శివా! 29.

శా:- కంఠే కాలుఁడ! త్వన్మహామహిమ వక్కాణింపఁగా శాస్త్రముల్
కంఠాగ్రంబున దాల్చు పండితునకున్ గాదయ్య. సర్వార్థముల్
కంఠీ భూతములౌ పదంబున వెలుంగున్నిన్ను వర్ణింప, త్వం
శుంఠ ప్రాభవ పాండితీ కళ లెటుల్ చూడంగ చాలున్? శివా! 30.

(సశేషం)
జైహింద్.

No comments: