Friday, June 14, 2013

శివాలాపము. 01 To 10 రచన:- శ్రీ బులుసు వేంకటేశ్వర్లు.

శివాలాపము 1 to 10.
రచన:- శ్రీ బులుసు వేంకటేశ్వర్లు.
శా:- శ్రీ కైలాస నగాగ్రభాగ ఘటితశ్రీ మాధు కోశంబవి
ద్యైక ధ్వాంత విదారణార్హసుషమాంతర్జ్యోతి, కారుణ్య హే
లా కూలంకష వీచికానిచయ డోలాలోల హంసంబు, గౌ
రీ కేకీ ప్రియ నీల మేఘ మెదలోఁ గ్రీడింప నెంతున్ శివా! 1.

శా:- ఆనందావధి, మోక్ష మార్గము. చిదానందైక సామ్రాజ్య యో 
గానూనంబగు కాణయాచి, సకలామ్నాయార్ధ రూపంబు దుః
ఖానేకాతప ఘోర బాధకు లసత్ కల్యాణ ఛత్రంబు, మత్
ప్రాణ ప్రాణమునైన పెన్నిధివి సంభావింప నీవే! శివా! 2.

మ:- అఘ సంతాన మహాంధకార విధుర వ్యాపార దీపంబు కా
మ ఘనోద్యద్విష వల్లికా ప్రచుర శుంభత్ ఖడ్గ రాజంబు, దు:
ఖ ఘనాక్రామిత మానసాంబర చలద్గాఢానిలంబున్, మదా
ది ఘటాటోప నివార కేసరి భవద్దీవ్యత్ కృపాశ్రీ. శివా! 3.

శా:- శ్రీమత్ కార్తిక చంద్రమః పృథు కళా శ్రీ స్ఫార సంభారశో
భామంద ప్రకటాయమాన పరితో ప్రవ్యాపితాచ్ఛాచ్ఛరుక్
సామీచీన్య సుధామలాక్ష తర హాస వ్యక్త నవ్యాంకుర
స్వామీ! నా యెడదన్ వసింపుము! కృపా సారళ్య సింధూ! శివా! 4.

మ:- తలపై సన్నని చంద్ర వంక వెలుగుల్, సంధింపగా - సర్వదా
కల గుంజన్మృదు రావముల్ సలుపగా, గంగా ప్రవాహంబు, మం
జుల సంధానిత ధ్యాస మూర్తి వయి-అచ్చో మంచుకొండన్ వెలుం
గులుచల్లున్నిను నాశ్రయించెదను భర్గో! మంగళాంగా! శివా! 5.

శా:- ఈ సంసారము దుఃఖ భాజనము తండ్రీ! నేవె యానందమౌ
ఈ సర్వాశలు మోహ కందములు స్వామీ! నీవే నిర్మోహమౌ
ఈ సందీపిత గర్వ కారణతమో  హేలా పరిష్వంగ దు
ర్భాసావాసవిచేష్ట చేష్టముల మాన్పం జూడ రావో! శివా! 6.

మ:- స్వ శరీరాంచల నిర్గత ప్రకట భాస్వత్తంతు సంతాన ల
గ్న శరీరంబయి నిల్చు సాలె విధముం గామ ప్రభా మోహ దు
ర్దశ ఉద్భూతము స్వాత్మ జన్య గత మిధ్యా సౌఖ్య సంతోష
ద్ధశవంబున్ నను తేల్చరావొ! నగ జాత ప్రాణ మూలా! శివా! 7.

శా:- జ్ఞానుల్ త్వద్గత దివ్య భావ సుషమా సంప్రాప్త కల్యాణ  సం
ధా నిత్యోత్సవమబ్బి యుండెదరు! నేనా! గాఢ జీమూత వే
ళానిశ్మేష తిరస్కృతామల కళాగ్లౌ మూర్తినయ్యా! ప్రభా
పౌనః పున్యునిగా నొనర్చి తలపైఁ బండించుకోవా! శివా! 8.

శా:- నీవే తల్చితివేని పూటకు ఠికానీ లేని నిఱ్పేద  ల
క్ష్మీ వైభోగ సదానురంజిత కళా శ్రీ మంజు మంజీర  నా
దావిర్భూత తరంగితాత్మ నిలయుండై సౌఖ్య సంధాన లీ
లా వైదగ్ధ్యముఁ జూపఁడో మహిత కైలాసాద్రివాసా! శివా! 9.

శా:- నీవే తల్చితివేని ఘోర దురితాంధీ భూత సంసార బం
ధావిర్భూత విమూఢ భావన వృధాహంకార జీమూత  కే
ళీ వైగుణ్య మహాంధకార నటనల్ నిర్ధూతమై, ముక్తి వాం
ఛా విస్ఫారిత చిత్ప్రకాశ మెదలన్ సంధిల్లునయ్యా! శివా! 10.

(సశేషం)

No comments: