Friday, June 14, 2013

శివాలాపము. 11 To 20 రచన:- శ్రీ బులుసు వేంకటేశ్వర్లు.

శివాలాపము.  11 To 20
రచన:- శ్రీ బులుసు వేంకటేశ్వర్లు.
శా:- నీవే తల్చితివేని మూకునకు తండ్రీ! దివ్య చైత్రాగమ 
శ్రీ వేళా మధు కోశ పాతిత రసశ్రీ స్నిగ్ధ మాధుర్య ధా
రా వర్షోదయ కల్ప మంజుల రసార్ద్ర ప్రౌఢ సాహిత్య శ
య్యా వైభోగము కంఠ భూషణము కాదా! గాంగ జూటా! శివా! 11.

శా:- నీవే తల్చితివేని నజ్ఞునకు నిర్ణిద్ర ప్రభా దుఃఖ  భీ
దావాగ్న్యాంతర సంప్రభూత విచలత్ గాఢప్రవాహైక ని
ష్ఠా విస్ఫోటిత ముగ్రదారుణ శిఖా సర్వస్వమాశాంతమై
జీవన్ముక్తి పదంబు లభ్యమగు రాశీభూత తేజా! శివా! 12.

శా:- నీవే తల్చితి వేని విఘ్హ్నములు తండ్రీ గాఢ ఝంఝాహత 
శ్రీ విస్తీర్ణ గుణైక నైక శకల క్షీణ ప్రభా శారదాం
భో వాహంబులు నర్క తూలౌలు గాఁ బోవున్మహా కార్య దీ
క్షా విద్యోతిత చింతితార్ధ ఫలముల్ సంధిల్లునయ్యా! శివా! 13.

శా:- శ్రీ గౌరీ వదనాంబుజాత మధులిట్ శృంగార లీలా కళా
యోగానూన దరస్మితాంకుర విశేషోద్దీప్త భాస్వన్మనో
రాగ ప్రాభవమౌ భవన్మృదు దయార్ద్ర స్వచ్ఛదృఙ్మల్లికల్
వాగాతీత సుఖమ్ములం బరిమళింపం జూడు నాపై శివా! 14.

మ:- కనిపించన్ వలె కామినీ మధుర రాగ వ్యక్త హాస ద్యుతుల్
తనివోవన్ వలె భవ్య దివ్య మృదు పాద స్నిగ్ధ నవ్యార్చనన్
కనగా నేమి విరుద్ధ భావతతి?సంఘర్షింతు నిత్యంబు  కాం
తను దేహార్ధమునందు దాల్చితివి కాదా! చెప్పుమయ్యా! శివా! 15.

శా:- ఏ నేయోగ్య సుగంధ బంధుర మిళద్దేవాక పుష్పవ్రజం
బేనే నవ్య సుధా స్రవత్ఫలము నేనే స్వర్గ గంగా నదిన్
నేనే స్వచ్ఛత రార్ద్ర మారుతము నేనే స్వామి! కైలాసమున్
నేనే నీకుపహారమై నిలుతునోయీ మధృదంతా! శివా! 16.

శా:- ఆ గర్జద్గగనావిలంబిత తమ శ్యామాయమాణ ప్రభా
శ్రీ గండూషిత గాఢ నీల రుచిమత్ శృంగార లీలా తటి
ద్యోగాశ్లిష్టనవాంబువాహ విగళ ద్యోమార్గ ధారౌఘ వ
ర్షా! గాంభీర్యములయ్య! త్వత్కృపలు! భాస్వచ్చంద్ర చూడా! శివా! 17.

శా:- నిష్ఠా బంధుర మైన జీవితము కానీ, త్వత్ పదాంభోజ నే
దిష్ఠ ప్రాంత విలగ్న చింతన కళా దృక్ కాని లేనట్టి, య
ల్పిష్ఠ స్వాంతుఁడనయ్య నీ కరుణకుం బేరాసతోఁ దండ్రి సా
ధిష్ఠ! స్తోత్రముఁ జూరలిచ్చితిని. నీదే భారమాపై. శివా! 18.

శా:- యోగాభ్యాసము, నిత్య కర్మ, జప సంయోగమ్ము, శాస్త్రార్థ చ
ర్చా గాంభీర్యము, నీ పద ద్వితయకంజాత ప్రసూ మాధురీ
శ్రీ గాఢార్ద్ర మరంద పాన మకటా! చీకాకు సంసార దు
ర్యోగంబందున మందుకేనియును, బాబూ! కానవయ్యా! శివా! 19.

మ:- పరులన్ వేడుట యన్న నాకు మిగులన్ బ్రాణాంతకంబౌను, నె
వ్వరినేనిన్ మరి యింద్రుఁడంచు పొగడం భాసించుకాలమ్మునన్
కరుణా నిర్ఝర! నిన్నుఁ దక్క పొగడంగా బోనునెవ్వారలన్.
వరమో నాకిది శాపమో తెలియదప్పా! తేల్చవయ్యా! శివా! 20.

(సశేషం) 

No comments: