Wednesday, October 22, 2008

యతులను గూర్చి మతులెందుకు పోకొట్టుకోవడం? నేర్చుకుందాం రండి.

ఆంధ్ర భాషకు అమర భాషకన్నా అమృత భాషగా కీర్తి కారకమైనది అనితర దుర్లభమైన ఛందో బద్ధ సాహితీ సంపత్తియే. మనం సాధించ దల్చుకొంటే ఆఛందస్సు, మనకు దుర్లభమైనదేమీ కాదు. సులభ సాధ్యమే.ఐతే మనకది కరతలామలకం కావాలంటేమాత్రం కొంచెం దృష్టి పెట్టి నేర్చుకొంటే క్షణాలమీద నేర్చుకో వచ్చు. మీరు చాలా వుత్సాహంగా నేర్చుకోవాలనుకొంటున్నారు కాబట్టి మీకు గుర్తుండే విధంగా యతులను తెలుసుకొనే ప్రయత్నం చేద్దాం.
మనం హుషారుగా ఒక పద్యం వ్రాసి ఏపండితునికో చూపిస్తే......... యిక్కడ ప్రాస తప్పింది.... అక్కడ యతి తప్పింది... అనేసరికి మన వుత్సాహం కాస్తా నీరు కారిపోయి యిహ జీవితంలో పద్యాల జోలికి పోకూడదనే స్థాయికి మనకు కలిగిన నిస్పృహ మనల్ని చేరుస్తుంది. అంతే. పుస్తకం మూసెస్తాం. అంత నిస్పృహ చెందనవసరం లేదు.ముందుగా యతులను చూడండి.
యతి అంటే విచ్ఛేదము అని అర్థం. " యతిర్విచ్చేద సంజ్ఞకః " .
మొదటి అక్షరానికి యతి అని పేరు.
మొదటి అక్షరం యే అక్షరం వుంచామో అదే అక్షరం కాని, లేదా దాని మిత్రాక్షరం కాని యతిస్థానంలో వాడాలి.
ఇప్పుడు అక్షరం అనే పదంలో చిన్న విషయం తేలుసుకోవాలి.
అచ్చులతో కలిస్తేనే హల్లైనా సమ్యుక్త హల్లైనా పలుక బడుతుంది.
అంటే యతి స్థానంలో 1.అచ్చూ 2. హల్లూ ఉన్న మాట మనం మరువ కూడదు.
యతి నియమం అంటే మోదటి అక్షరంలో యే హల్లు., ఏ అచ్చు వాడామో ఆ అచ్చుతో గాని లేదా ఆచ్చుకు మిత్రాక్షరమైన అచ్చుతో గాని కూడిన హల్లుకుగాని లేదా దాని మిత్ర హల్లుకు గాని యతి వేయాలని గుర్తుంచుకోవాలి.
మనకొక సందేహం వస్తుంది. ఏ అచ్చుకి ఏఅచ్చు మైత్రి కలిగివుంది. ఏ హల్లుకి యా హల్లు మైత్రి కలిగి వుంది అని.
అందుకే ముందుగా అచ్చులకు గల మైత్రిని తెలుసుకుందాం.వీటినే స్వర యతులు అంటారు.
స్వర యతులు:-
1) స్వరమైత్రి వళి;- అ ఆ ఐ ఔ . {ఫ్రెండ్స్}
ఇ ఈ ఋ ౠ ఎ ఏ {ఫ్రెండ్స్}
ఉ ఊ ఒ ఓ {ఫ్రెండ్స్}
పైన తెలిపిన క్రమంలోనే అచ్చులకు యతి మైత్రి చెల్లుతుంది. హల్లులలో వుండే అచ్చులు పై క్రమంలోనే ప్రయోగించాలి
2) స్వర ప్రధాన వళి:- అచ్చులకు సంధి అయిన చోట పర పదంలోని మొదటి అచ్{వంశ్+అ = వంశ + అబ్ధి} దీనిలో అబ్ధి అనే పదంలోని " అ " అనే అచ్చుకే యతి వేయాలి.
3) లుప్త విసర్గక స్వర వళి;- తమః + అర్క > తమోర్క. ఇలాగ విసర్గ మీద అకారము ఓ కారంగా మారిపోతున్నప్పుడు అందులోగల " అ " కారానికే యతి వేయాలి.
4) ఋ వళి:- "ఋ" తో గాని, ఋ నే వట్రసుడిగా కలిగి యున్న హల్లులోగల వట్రసుడితో గాని రి రీ రె రే లకు యతి కుదురుతుంది.
5) ఋత్వ సంబంధ వళి:- వట్రసుడి తో ఇ ఈ ఋ ౠ ఎ ఏ లకు యతి చెల్లు తుంది
6) ఋత్వ సామ్య వళి:-వట్రసుడి గలిగిన హల్లులు అవి యేవైనాసరే హల్ల్ సామ్యంతో నిమిత్తం లేకుండా వట్రసుడులు కలిగివుంటే చా;లు యతి చెల్లును.
7) వృద్ధి వళి:- అ కరమునకు ఎ ఏ ఐ లు పరమైన ఐ కారమూ, ఒ ఓ ఔ లు పరమైన ఔ కారమూ సంధిలో వచ్చిన వృద్ధి సంధి అంటారుకదా! అలాంటి చోట సంధి కాక ముందున్న అచ్చుతోనైనా, సంధి అయిన తరువాత వచ్చిన అచ్చుతోనైనా యతి వేయ వచ్చును.
ఇవే స్వర యతులు. వ్యంజనాక్షర యతుల్ని గూర్చి మరొకమారు కలుసుకొన్నప్పుడు తెలుసుకొనే ప్రయత్నం చేద్దాం. జైహింద్.

No comments: