Tuesday, April 5, 2016

తేది : 03/04/2016: సాయంత్రం 6.00 గంటలకు జరిగిన అష్టావధానము.

జైశ్రీరామ్.
అష్టావధానము
అవధాని : అవధానిరత్న డాక్టర్ మాడుగుల అనిల్ కుమార్
స్థలం : జోళదరాశి, బళ్లారి. సంచాలకులు : త్రిభాషావధాని డా.జోస్యుల సదానందశాస్త్రి గారు
తేది : 03/04/2016
సమయం : సాయంత్రం 6.00 గంటలకు
1.నిషిద్ధాక్షరి :
గిరిజా కళ్యాణం :
శ్రీ వాక్కైయుండుదువో
నీవే నిన్ భద్రుతోనె నేనెంతున్ భో !
కావించెద కళ్యాణము
భావింపుము నాదు శుభము భవ్యా గౌరీ!

2.దత్తపది : కల్లు,  బీరు,  సార, రమ్ము  అనే పదాలతో చంపకమాలలో శ్రీ కృష్ణునికి ఇప్పుడు సభలో ముఖ్య అతిథిగా ఉన్న శ్రీ కృష్ణదేవరాయలుకు ఉన్న భేదమును వర్ణించాలి.
తరుణికి రాధకల్లుడయి తాఁ మురిపించుచు నాడు కృష్ణుడే
వెరవక బీరులెల్లరల పీచమడంచుచు రుక్మిణిన్ గొనెన్
మరుసటిజన్మ వీరలిట మాన్యులునై మనసార మెచ్చగా
పరిణయమాడిరేకయగు పత్నిని రమ్మని కృష్ణరాయలే ||
3. సమస్య :
దీర్ఘ సుమంగళీయనుచు దీవెనలిచ్చిరి భర్తృహీనకున్ II
దీర్ఘముగాకపోవునొకొ ? ధీరులు మెచ్చుచు దీవెనివ్వరే
దీర్ఘ సుమంగళీయనుచు దీవెనలిచ్చిరి భర్తృహీనకున్
ఘుర్ఘురులెన్ననేల? తరిగొండను వంశజ వేంగమాంబకున్
వార్ఘనులైనవారెగద ! పాయదదెప్పుడు పండితోత్తమా !

4.వర్ణన : మేమిచ్చిన అంశాలకు మీరు చెప్పిన పద్యాలను మెచ్చుకొని మేఘుడు వర్షించినట్లు వర్ణించాలి.
పృచ్ఛకోత్తములెల్లరు వేడ్కమీర
ప్రశ్న వేయంగ నాదైన పాండితిగని
పుష్ప వర్షంబుగురిపించెపో ఘనుండు
వసుధ పండితులెల్ల శెభాషనంగ.
5.ఆశువులు :
1.గుత్తి నారాయణ రెడ్డి ఏర్పాటు చేసిన సాహితీ పీఠాన్ని చంద్రశేఖరరెడ్ఢి గారు వృద్ధిలోకి తెస్తున్నారని వర్ణించాలి.
గుత్తి నారాయణుడు తానుగోరుకొనుచు
సాహితీపీఠముంగూర్చె మోహనముగ
చంద్రశేఖరరెడ్డియు సాదరముగ
పెంచిపోషించె పండితుల్ భేషనంగ.

2. శ్రీ రామేశాంజనేయ స్వామిని స్తుతిస్తూ పద్యం చెప్పాలి.
శ్రీరామున్ జనకాత్మజాహృదయనీరేజాతమార్తాండు, దు
ర్వారప్రోత్థిత రావణాద్యసుర క్రూరవ్రాత సంహారు, శ్రీ
మారుత్యాది సమస్తభక్త వరదున్ మందస్మితాస్యున్ సదా
శ్రీ రామేశహనూమతాలయ నివాసింగొల్తునిష్టాప్తికై ||

6.వ్యస్తాక్షరి :
పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే ||

7. పుష్ప గణనం: 12

8.అప్రస్తుత ప్రసంగము.
జైహింద్.

No comments: