శ్రీరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు
రానున్న ఉపాధ్యాయ దినోత్సవము సందర్భముగా " శంకరాభరణము" బ్లాగ్ నిర్వాహకులు
శ్రీ కంది శంకరయ్యకు
అభినందన మందార మాల.
శ్రీ కంది శంకరయ్య. విశ్రాంత ఆంధ్రోపాధ్యాయులు.
కం:- శ్రీ కంది వంశ చంద్రమ!
మీ కవితా మార్గమున సుమేరు సుకవులన్
లోకంబున కందించిన
శ్రీ కందిగ పేరు గనిరి చిన్మయ రూపా!
సీ:- ఉత్తమోపాధ్యాయ వృత్తిని చేపట్టి - స్ఫూర్తిని కొలిపి సద్వర్తనముల,.
నిర్మల భావనా ధర్మము నెఱనమ్మి - ధర్మవర్తనులను ధరను నిలిపి,
సత్య బోధన చేసి, స్తుత్యసన్మార్గమ్ము - నత్యంత స్తుత్యమై యలర వేసి,
జీవన సద్గతి భావనాపటిమతో - విద్యార్థులకు మప్పి వెలయఁ జేసి,
గీ:- చెదరి పోనట్టిన నగవులు జిందు మోము
సరస సద్భావనా సుధల్ దొరలు పలుకు,
కరుణ గాంభీర్యతలు చూపు కన్ను దోయి
పొంకమున నొప్పుదే! కంది శంకరార్య!
శా:- మీ సద్వర్తన సత్య సంధత, సదా మేల్గోరు మీ బుద్ధియున్,
ధ్యాసన్ జూపుచు చేయు బోధనలు, మీ ధన్యాత్మయున్, ప్రేమయున్,
భాషాటోపముఁ జూపనట్టి కవితా పాండిత్యమున్ జూచినన్
మీసాదృశ్యుల నెన్న లేరుగద!స్వామీ! శంకరార్యా! ధరన్.
గీ:-శంకరాభరణము మీరె.శంకరయ్య!
జంకు గొంకులు లేనట్టి సహృదయ మణి!
యింక పై మిము శుభములే యేలు నిజము.
శంకరుండిల మిము బ్రోచు శాంతి గొలిపి.
గీ:- మంగళంబులు మీకిల మంగళములు.
మంగళంబులు కవులకు మంగళములు.
మంగళంబులు బుధులకు మంగళములు.
మంగళంబులు హరికి సన్ మంగళములు.
మంగళం మహత్ శ్రీశ్రీశ్రీశ్రీశ్రీ
No comments:
Post a Comment