Thursday, July 14, 2011

వందే గురు పరంపరాం.


శ్లో:- 
వ్యాసం వసిష్ఠ నప్తారమ్ -శక్తే: పౌత్రమ కల్మషమ్.
పరాశరాత్మజం వందే శుక తాతం తపో నిధిం!
క:- 
దివ్య వసిష్ఠ ప్రపౌత్రుఁడు,
భవ్యుండగు శక్తి పౌత్ర వరుఁడు నకలుషుం 
డవ్యయ పరాశరాత్మజుఁ
భవ్యుండగు సుకుని తండ్రి వ్యాసుం గొలుతున్.
శ్లో:- 
''గు'' కారస్త్వంధకారత్వాత్‌,
''రు'' కారస్త న్నిరోధక:, 
అంధకార నిరోధత్వాత్‌ 
గురురిత్యభిధీయతే.
భావము:- 
శిష్యుని అజ్ఞానమను అంధకారమును తొలగించి జ్ఞానమనెడి జ్యోతిని ప్రకాశింప జేసేవాడు అని అర్థం.
అట్టి గురువుకు నమస్కరించేటప్పుడు చెప్పుకొన వలసిన శ్లోకము.
శ్లో:-
అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయా
చక్షురున్మీలితం యేన తస్మై శ్రీ గురవే నమ:!
క:-
అజ్ఞానాంధముఁ బాపగ
సుజ్ఞానవరాంజనంబు చొప్పి శలాకన్
ప్రజ్ఞన్ కంటికి పులిమెడి
విజ్ఞులు గురువులకు నుతులు విరివిగ చేతున్.
భావము:- 
ఆశ్రయించిన శిష్యులకావహించిన అజ్ఞాన మనెడి గ్రుడ్డితనమును బాపుట కొఱకు తమకు గల సుజ్ఞానమనెడి కాటుకనలమిన పుల్లను అంతః చక్షువులకు పులిమి తద్వారా విజ్ఞానమనే దృష్టిని కలిగించే ప్రజ్ఞాన్వితులు గురువులు. అట్టి గురువులకు నమస్కరించెదను.
శ్లో:-
లక్ష్మీనాథ సమారం భాం-నాథయామున మధ్యమాం
అస్మదాచార్య పర్యంతాం- వందేగురు పరంపరాం.
క:-
లక్ష్మీ నాధుఁడు మొదలుగ
నూ, క్ష్మాజ సునాధయామునుఁడు మధ్యముగా,
సూక్ష్మజ్ఞుల మద్గురువుల
నీక్ష్మాస్థలి  నేడు కొలిచె దే కడు భక్తిన్.
భావము:-
లక్ష్మీ నాధుఁడు మొదలుగా మధ్యమ సునాధ యామునుఁడుతో పాటు నేటి సదసద్జ్ఞులగు గురు పరంపరకు భక్తితో నమస్కరించు చున్నాను.
పరమ పవిత్రమైన గురు పూర్ణిమ సందర్భంగా ఆంధ్రామృత పాఠకులకు, సద్గురువులకు శుభాభినందనలు తెలియ జేస్తున్నాను.
జైశ్రీరామ్.
జైహింద్.

No comments: