జైశ్రీరామ్.
నా సౌందర్యలహరిపై
అవధాన భారతి. సాహితీ చతురానన. ఛందో వైవిధ్యనిష్ణాత. ఛందస్సవ్యసాచి. స్వర్ణ కంకణ-కవిగండ పెండేరపు సత్కార గ్రహీత. విద్వాన్ చక్రాల లక్ష్మీ కాంత రాజారావు. ఎం.ఏ., విశ్రాంత సంస్కృతాంధ్రోపన్యాసకులు. హైదరాబాద్. 92913 33880.
వారు అనుగ్రహించిన
సంశబ్దనం.
పద్యరచనలోనెన్నెన్ని మార్గములున్నవో- అన్నింట తన ప్రతిభాపాండితీవైభవముతో నడిచి- తనతో బాటు మరికొందరిని నడిపించి- శ్రీ భారతీ పద పద్మారాధకులుగా నిలిచిన వారు శ్రీ చింతా రామకృష్ణారావుగారు.
వీరి చిత్తవీథి యందు నొక భావన మెరుపుతీగవలె మెరసిన వెంటనే దానినొక రసవత్తర కావ్యముగా రచించి- తెలుఁగువారికి నందించుట యనునది యొక దీక్షగా తలంచినటుల - వీరు వ్రాసిన కావ్య పరంపరల ద్వారా మనము తెలిసికొన వచ్చును. వీరి ప్రోత్సాహముతో మరికొందరు పద్య ప్రేమికులు పద్య రచయితలై వీరివలె గ్రంథములు రచించి భాషాసేవ చేయుచున్నారు.
శ్రీ చింతావారి కలమునుండి జాలువారిన మరొక అద్భుత కావ్యము 'ఆంధ్రసౌందర్యలహరి." ఇది యనువాద కావ్యము. సాక్షాత్ శంకర స్వరూపమైన ఆదిశంకరాచార్య విరచితమగు' సౌందర్యలహరి" ని వీరు తెలుగున పద్యకావ్యముగా రచించుటయే కాక మూలశ్లోకములకు తెలుఁగు ప్రతిపదార్థమును భావమును వ్రాసి మనకునందించినారు.
ఒకరి కావ్యమను మరోకవి మరియొకభాషలో ననువదించుటకు - తదనువాద కవికి రెండు భాషలందు తగినంత పట్టుండవలయును, మూలకవి భావమును చక్కగా గ్రహించవలెను. ఉన్నదున్నట్టుగా భావ వ్యక్తీకరణ చేయవలయును. "కాళిదాసు కవిత్వము కొంత- నాకైత కొంత అన్నట్లుగా వ్రాయ కూడదు. సహజ భావన పాఠకులుమెచ్చు కొనునట్లుండవలెను.
ఏతద్విషయమున శ్రీ చింతావారు శ్రీశంకరుని భావముననుసరించియే- శ్లోకములకు పద్యములందించినారు. ఆయా ప్రతి పద్యమూ శంకరుని ప్రతిపాదిత భావమునే ప్రకటీకృతము చేయుచున్నది.
మొదట శ్రీగౌరీ ప్రార్థనాపద్యమునందే
శా. శ్రీమన్మంగళ! శాంభవీ జనని! హృచ్ఛ్రీ చక్ర సంవాసినీ!
సామాన్యుండను, నీ కృపామృత రుచిన్ సౌందర్య సద్వీచికన్
నీమంబొప్పఁ దెనుంగు చేసెద, నతుల్, నీవే లసద్వాణిగాఁ
బ్రేమన్ వెల్గుము శంకరాత్మ గతితోఁ బ్రీతిన్ గనన్ శంకరుల్.
అంటూ తాను సామాన్యుఁడనని, శ్రీ శంకరుని సౌందర్యలహరి అసామాన్యమని, ఆంధ్రానువాదము చేయుచుంటినని, నీవే లసద్వాణిగాఁ బ్రేమన్ వెల్గుమంటూ అనువాదమును ప్రారంభించి- అమ్మదయతో - అసామన్యమగు రీతిగా పద్యములను వ్రాసి తన ప్రతిభను వినయ మతితో తెలియఁజేసారు.
శంకరభగవత్పాదుల తొలి శ్లోకమగు “శివశ్శక్త్యా యుక్తో యది భవతి” ని మనోజ్ఞముగ అమ్మా! అంటూ త్రిమూర్తుల కర్తవ్యములను వారలకబ్బిన శక్తులకు నీవే మూలమనుచు చక్కని పదములతో రచించినారు.
42వ శ్లోకమగు “గతైర్మాణిక్యత్వం…..ధిషణామ్.” ను అనువదించునపుడు పద్యమునందు చూపిన పద శైలి మూలశ్లోక భావమున కంటె మరింత గొప్పగానున్నది.
60వ శ్లోకమగు “సరస్వత్యాస్సూక్తీ”….కినొనరించిన పద్యానువాదము ప్రశంసనీయము. పద్యమెత్తుగడలోనే “వాణీ గానసుధాస్రవంతి కుశలత్వప్రాభవంబీవు” అంటూ శ్రీ చింతావారు తనకున్న సంస్కృతభాషాపాండితీశోభను అసామాన్యమగు రీతిగా మనముందు కనబరిచినారు.
90వశ్లోకమున “దదానే…..చరణతామ్.” అను శ్లోక అనువాదమునందు తుమ్మెదను సుకాండి యను పదప్రయోగమును జూపి తమకున్న పర్యాయపద ప్రయోగ చాతురిని ప్రదర్శించినారు.
నివేదనలో సౌందర్యలహరి మరియు తానొనర్చిన పద్యానువాదమునందలి పద్యములను పాఠకులు చదివినచో కవియైన నన్ను, చదివిన చదువరులనెల్లరను దయతో చూడుమని, ఫలశ్రుతిని వెల్లడి చేసినారు.
ఇలా వంద శ్లోకములకు వంద పద్యములు, వంద ప్రతిపదార్థములు, వందభావములను వ్రాసి శ్రీ రామకృష్ణారావు శ్రీ శంకరుల కృపకు, ఆదిదంపతులైన పార్వతీపరమేశ్వరుల దయకు పాత్రులైనారు.
కం. చింతా యను పద భావమె
చింతించుట యగును, మీరు చిత్తమునందున్
సంతతము చింత చేయుచు,
సంతసమున కావ్యమల్లు శక్తుండయితే.
కం. ఎన్నని వ్రాయుదురయ్యా!
ఎన్నగ మీ ప్రాయ మెంత? యెసగెడు చిత్తం
బున్నట్టి శక్తి సంపద
లున్నట్టి శరీర బలము లునికిన్ గనుమా!
కం. పద్దెములెన్నివిధంబులొ
యద్దెస మీ గమనముండు, నాలోచనముల్
తద్దిశ మెరయున్ గావ్యం
బొద్దికతో వ్రాయబోదురొక్క క్షణానన్.
కం. పుంభావ భారతీ యని
సొంపుగ పిలువంగ తోచు, సుందరమతితో
న్నింపుగనను మన్నించుచు
కెంపుల మీ బిరుదపంక్తికిన్ జతనిడుడీ!
చక్రాల లక్ష్మీ రాజారావు
19.10.24
జైహింద్.