జైశ్రీరామ్.
ఆర్యులారా!
తెలంగాణ ఆవిర్భావ వార్షికోత్సవం సందర్భముగా రవీంద్రభారతిలో116. మంది కవులలో ఒకరిగా కవితా గానం చేసిన మన కంది శంకరయ్య గారి కవితా విపంచి వినిపించిన పద్యాలు.
నవ తెలంగాణ!
సీ. ఎనలేని పాలనం బనయమ్ము వర్ధిల్లె
ననఁ గాకతీయుల ఘనత సాక్షి!
అసమాన సాహిత్య రసమాధురి కురిసె
ననఁగఁ బోతన్న పద్యములు సాక్షి!
ప్రతిలేని శిల్పసంపదలు శోభిలె నని
పలుక రామప్ప దేవళము సాక్షి
సరిలేని పోరాటశక్తికి నెల విది
యన రాష్ట్రసాధనోద్యమము సాక్షి
తే. యిట్టి బహుళప్రశస్తమై యెసఁగినట్టి
నా తెలంగాణ రాష్ట్రమ్ము నవ్యజాగృ
తీ సమారంభకృషిని సంధించి మించి
సర్వతోముఖప్రగతికై సాగు నింక. (1)
కం. శ్రీలకు తావలమై వి
ద్యా లలితకళలు, పరస్పరాత్మీయతలున్
మేలుగ వర్ధిల్లఁగ, మురి
పాల తెలంగాణ ప్రగతి పథమున సాగున్. (2)
కం. కోకిలవలె, మేఘమువలె,
కేకివలెన్, చిల్కవలెను, శ్రీకృష్ణుని వం
శీకృతనినాదగతి, మో
దాకర తెలఁగాణ కవిత యలరించు నిఁకన్. (3)
సీ. బతుకమ్మ బోనాల పాటలు ద్రాక్షాస
వంబయి తన్మయత్వంబు నిడఁగ
ఎముడాల యాదాద్రి కొమురెల్లి దేవుళ్ళ
కరుణామృతమ్ము మేల్గలుగఁ జేయ
రామప్ప లక్నవరమ్ము పాకాల త
టాకముల్ మేటిపంటల నొసంగ
నానాట వర్ధిల్లు నవ్యపరిశ్రమల్
జీవనోపాధికిఁ ద్రోవఁ జూప
తే. సర్వరంగమ్ములందు ప్రశస్త వృద్ధి
నంది, కలలెల్ల సాకారమై చెలంగ,
ప్రజలు పాలకుల్ సత్సమన్వయము గలిగి
సాగ బంగారు తెలఁగాణ సాధ్య మగును. (4)
తే. పెక్కు పోరాటములఁ జేసి విక్రమించి
స్వంతరాష్ట్రమ్ము సాధింపఁ జాలినార
మన్ని రంగాలలో వృద్ధి నందగలము;
నా తెలంగాణ తల్లి వందనము నీకు! (5)
--oOo—
శ్రీ కంది వారికి అభినందనలు.
జైహింద్.
No comments:
Post a Comment