Thursday, November 22, 2012

సాహిత్యాభివృద్ధికి పద్యం ఉపయోగపడిందా?లేదా? పద్య కవిత పోటీలో మన సోమార్క గారికి ప్రథమ బహుమతి

జైశ్రీరామ్.
సాహితీ పిపాసులారా! సుమనర్నమస్సులు.
ఇప్పుడు  రాష్ట్ర స్థాయి పద్య రచన పోటీలో ప్రథమ బహుమతిని కైవసం చేసుకొనిన శ్రీ అర్క సోమయాజిగారిని గూర్చి తియజేయడానికి ఎంతో సంతోషంగా ఉంది. వారిని మనము హృదయ పూర్వకంగ అభినందిద్దాము. వారికి ఈ బహుమతి కైవసమైన వార్తను వారి మాటలలోనే చూద్దాము.
అయ్యా! నమస్కారాలు!
ఇటీవల సాహిత్యాభివృద్ధికి పద్యం ఉపయోగపడిందా?లేదా?అని ప్రశ్నిస్తూ,ఒక సంస్ఠ పద్య పోటీ నిర్వహిస్తున్న సందర్భాన్ని పురస్కరించుకొని నా సమాధానాన్ని "పద్య శైలూషి "అనే పద్య ఖండికను పద్య కవిత రూపంలో పంపించాను.దానికి రాష్ట్ర స్తాయి పద్య కవితలపోటిలో ప్రధమ బహుమతి లభించినట్లు తెలిపారు.ఆ కార్యక్రమం "ఒంగోలు"లో ఏర్పాటు చేశారు.24/11/2012న ఆ బహుమతి అందుకోవడానికి మరియు అదే రోజు కవి సమ్మేళన కార్యక్రమంలో పాల్గొనడానికి రేపు రాత్రి బయలుదేరుతున్నాను.మీ ఆశీర్వాదములు కోరుతున్నాను.
ఆ పద్యాలను ఇక్కడ మన అంతర్జాల వీక్షలకు కూడా అందజేస్తున్నాను. ఇట్లు మీ సోమార్క
తేనియలూటలూరు,తియ తియ్యని దేశిపదాల సౌరు,స
ద్గాన గుణమ్ము,తెల్గు నుడికారగణమ్ములనొప్పు,వాక్యవి
న్నాణములున్,మనోజ్ఞ కవనమ్ముకు పెట్టని సొమ్ములౌనుగా,
జానుతెనుంగుపద్యముల జాతికి సాటికవిత్వమున్నదే?
పదముల్ పేర్చి,బిగించికూర్చి,రసవద్భావమ్ములన్ పేర్చి,సొం
పొదవన్, శైలియు,వృత్తి,రీతి,రసవత్పాకాది,మేలౌ గుణా
భ్యుదయోల్లాస, కవిత్వ రూప నిగమ ప్రోక్తార్ష విజ్ఞాన సం
పదయై భాసిలు,తెల్గు భాషకు,మహద్భాగ్యంబు!పద్యంబెగా! 
నన్నయనాటి నుండి,యధునాతన రీతులు నేర్చుకొంచు,నె
న్నెన్నొ కవిత్వ ప్రక్రియలనింపగు,రూపుల దిద్దుకొంచు,న
భ్యున్నతిగొంచు,కావ్యవిభవోజ్వలమౌచును,తెల్గుసాహితిన్
యెన్నగ!హృద్య పద్యమది!యింపగు!తెల్గు సమృద్ధినందగన్.
పద్యము ప్రాతవడ్డదని,భావన సేయుటయేమొ గాని?!త
ద్విద్య సహస్ర రూపిణిగ,విస్తృత రూపము దాల్చియొప్పె,న
య్యద్యతనాంధ్రసత్కవులు,యాధునికత్వ,కవిత్వరూపమౌ,
హృద్య కవిత్వ రీతులకు,నింపగు మూలము!గాదనందురే?
సరస పద ప్రహేళికల జల్లిన భావరజమ్ముతో,నలం
కరణలనొప్పు వర్ణనల గప్పిన,యక్షర రధ్యపైని,మా
సరస కవీశు లందముగ,చక్కని పద్య రధమ్ము గూర్చిరా
దరమున,త్రిప్పినారలు!వధాన విధాన పధాన నెల్లెడన్.
నన్నయ సంస్కృతాంధ్ర సుగుణమ్ములనొద్దికదిద్దితీర్చి,వి
ద్వన్నుతుడయ్యె;నూతన విధానము నేర్పెను సోమయాజి,రూ
పోన్నతిజేసె,దేశికవితోద్యమసారధి;సోముడున్ పదా
ర్వన్నెల శొభగూర్పగను!పద్యము జానగు శోభ నొప్పెడిన్.
చింతింపంబనిలేదు!పద్యకవు లక్షీణ ప్రభావోన్నతిన్,
గొంతుల్విప్పుడు!పూర్వ వైభవము సంకోచమ్ముగా బొంద,మీ
వంతున్ సత్కృషిసల్ప,మేటి రసవత్పద్యమ్మనావద్యమై,
భ్రాంతుల్ దీర,రసజ్ఞశ్రోతృ జలధిన్ పర్వించు పద్యాపగల్.
డా.చంద్రశేఖరావధాని చేస్తున్న అష్టావధానంలో నిషిద్ధాక్షరి పృచ్ఛకులుగా శ్రీ సోమార్క..
చూచాము కదండి! ఈ సాహితీ ప్రయాణంలో శ్రీ సోమార్కగారు మరిన్ని విజయ బావుటాలెగరవేయాలని కోరుతూ వారిని ఆంధ్రామృతం ద్వారా మరొక్క పర్యాయము అభినందిస్తున్నాను. ఇక 
ఈ అంశముపై మీరూ మీ భావలకు పద్య రూపాన్ని కల్పించి ఆంధ్రామృత్ం ద్వారాపాఠకులకు అందజేయ గలరని ఆశిస్తున్నాను.
శుభమస్తు.
జైహింద్.

5 comments:

www.apuroopam.blogspot.com said...

పద్యాలన్నీ హృద్యంగా ఉన్నాయి.సోమార్క గారికి అభినందనలు.

acharya narasiha said...

పద్యాలన్నీ హృద్యంగా ఉన్నాయి.సోమార్క గారికి అభినందనలు.

acharya narasiha said...

పద్యాలన్నీ హృద్యంగా ఉన్నాయి.సోమార్క గారికి అభినందనలు.

acharya narasiha said...

పద్యాలన్నీ హృద్యంగా ఉన్నాయి.సోమార్క గారికి అభినందనలు.

acharya narasiha said...

పద్యాలన్నీ హృద్యంగా ఉన్నాయి.సోమార్క గారికి అభినందనలు.