Tuesday, June 19, 2012

చంచల నేత్రా! సాంబ శివా! నన్నుంచుము నీదరి సదా శివా!

శ్రీపార్వతీశా! మహా పాప నాశా!  ప్రభాపూర్ణ  విశ్వేశ! దివ్య ప్రకాశా!  నినుంగూర్చి యాలించి, మమ్ముం గృపం బ్రోచు నీ రూపమే చూచి, నీ పూజలన్ జూచి, నీ కోసమే వేచి,  నీ దివ్య రూపంబు చిత్తంబునం జేర్చి, నీ పాద పద్మాల సంసేవలం జేయు భక్తుండు యోగ్యుండు.నీ దివ్య ధామంబునందుండి, నిన్నుం సదా చూచు భాగ్యుండు.సుజ్ఞాన తేజుండు, దివ్య ప్రభావుండు, శశ్వన్ మహా జ్ఞాన దేదీప్యమానుండు, దివ్య ప్రకాశుండు, భక్తాగ్రగణ్యుండు కాడే!
మహా భక్తుడౌ వాని శ్రీ పాద పద్మాల ధూళిన్ శిరంబందు దాల్చేటి భాగ్యంబు పుణ్యంబుచేఁ గల్గు, నీ వెల్గులం గాంచు గల్గున్ మనో నేత్ర భాగ్యుల్, ప్రభా పూర్ణ  యోగ్యుల్, నినుం గాంచు యోగుల్, లసత్ పుణ్య భాగుల్, సు నిష్కామ భోగుల్, భవానిన్ సదా గొల్చు భక్తాళి భక్తిన్ త్వదీయాంఘ్రి సంసేవనా చిత్తులై, భక్తినున్మత్తులై, ప్రభా పూర్ణ చిత్తంబుతో నీ మహత్వంబునే యెంచుచున్ భక్తితోగొల్చుచున్, లోక సంచారులై  భక్తి మైకంబు నిండార శంభో మహాదేవ! భక్తాళినే కావ నీకన్న దిక్కెవ్వరంచున్ నివేదించు చుండున్గదా! దేవ! రక్షింప రావా! మముంగావ లేవా! మంబుం బ్రోవ గారాదొకో? దేవ దేవా! నమో చంచలాక్షా! నమో ఫాల నేత్రా! నమో చంద్ర మౌళీ! నమో భస్మ తేజా!  నమో చంద్ర మౌళీ! నమో పాప నాశా! నినున్ భక్తితోఁ గొల్చు నాంధ్రామృతానంత పాన ప్రబుద్ధ ప్రభా దివ్య తేజుల్ మదిన్ నిల్పి నిన్నున్. త్వదీయాంఘ్రి సంసేవనాసక్త భక్తాళినే బ్రోచి, కాపాడుమా దేవ! అనంత ప్రభావా! 
నమస్తే.నమస్తే. నమస్తే నమః .
జైహింద్.

No comments: